మూలం: అంతోన్ చెహోవ్
అనువాదం: కేశవ్ గోపాల్
‘‘మహాశయులారా! ఇప్పుడు మనం కొంచెం భోజనం చేస్తే బాగుంటుందనుకుంటాను.’’ ఆగస్టు నెలలో ఒకానొక చీకటి రాత్రి తన మిత్రబృందంతో బయటికొస్తూ టెలిగ్రాఫ్ స్తంభం లాంటి పొడవాటి పీలమనిషి లెఫ్టినెంట్ కర్నల్, మిలిటరీ కమాండెంట్ రెబ్రెతెసోవ్ అన్నాడు. ‘‘సరాతొవ్ లాంటి మంచి నగరాల్లో క్లబ్బుల్లో ఏవేళప్పుడైనా భోజనం దొరుకుతుంది. కానీ, ఇక్కడ మన దరిద్ర గొట్టు చెర్వ్యాన్స్కీలో వోద్కా, ఈగలు పడిన టీ నీళ్ళు తప్ప ఏమీ దొరకవు. బాగా మద్యం సేవించిన తర్వాత తినడానికి ఏమి లేకపోవడం కన్నా అధ్యాన్నం ఏమీలేదు.’’
‘‘అవును.ఏదో ఒకటి తింటే బాగుంటుంది’’ చలిగాలి తగలకుండా ఇటుక రంగు కోటు కప్పుకుంటూ డివినిటీ కాలేజి ఇన్స్పెక్టర్ ఇవాన్ ఇవానొవిచ్ ద్వయెతోచియెవ్ వంత పలకాడు. ‘‘ఇప్పుడు సమయం తెల్లవారుఝాము రెండుగంటలు. బార్లు మూసేశారు. కొంచెం హెర్రింగ్ ఉప్పుచేపగానీ, పుట్టగొడుగులు గానీ… తినడానికి వుంటే బాగుంటుంది…’’
ఇన్స్పెక్టర్ గాలిలో చేతులు ఆడించి చాలారుచిగా వుండే ఏదో వంటకాన్ని వర్ణించాడు. అది చూసి అందరూ లొట్టలు వేశారు. మిత్రులందరూ ఆగి గాఢంగా ఆలోచించడం మొదలెట్టారు. కానీ వాళ్ళు ఎంత ఆలోచించినా తినదగినది ఏదీ కనిపించలేదు. దాంతో వాళ్ళు వూహలతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
‘‘నిన్న గొలపేసవ్ల ఇంట్లో నేను అద్భుతమైన టర్కీకోడి కూర తిన్నాను.’’ అంటూ పోలీస్ అసిస్టెంట్ చీఫ్ ప్రూజినా – ప్రూజెన్స్కీ నిట్టూర్చాడు. ‘‘అన్నట్టు… మహాశయులారా! మీరెప్పుడైనా వార్సాకు వెళ్ళారా? అక్కడ వాళ్ళు ప్రాణాలలో గిజగిజ కొట్టుకుంటున్న కార్ప్ చేపలను పాలల్లో వేస్తారు. అవి ఒక రోజంతా పాలల్లో ఈదుతాయి. తర్వాత వాటికి పుల్లటి క్రీమ్ పట్టించి పెనంలోవేసి వేయిస్తారు. అద్భుతం… దేవుడి మీద ఒట్టు… ముఖ్యంగా ఒకట్రెండు గుక్కలు వోద్కా వుంటే… కమ్మటి ఆ వాసనకే స్వర్గం కనిపిస్తుంది!’’
‘‘ఇంకా చెప్పాలంటే ఊరబెట్టిన…’’ శ్రుతికలిపాడు రెబ్రెతెసోవ్ నిజాయితీ ధ్వనించే స్వరంలో సంభాషణలో పాల్గొంటున్నట్లు, ‘‘మేము పోలెండ్‌లో మకాం చేసినప్పుడు సునాయాసంగా రెండొందల కీమావుండలు తినగలిగేవాళ్ళం… వాటిని ఒక పళ్ళెంలో రాశిపోసి మిరియాల పొడి వేసి మెంతులు, పార్సిలీ ఆకు చల్లితే… ఆ రుచి వర్ణించడానికి మాటలు చాలవు!’’
రెబ్రెతెసోవ్ హఠాత్తుగా ఆగి ఆలోచనలో పడ్డాడు. 1856లో ట్రినిటీ లారాలో తిన్న స్టెర్లెట్ సూప్‌ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సూప్ రుచి వున్నట్టుండి చేపవాసన వేసినట్లు అనిపించి తనకు తెలీకుండానే నమలడం మొదలెట్టాడు. తన రబ్బరు బూట్లు బురదమయం అయిపోయిన విషయం కూడా గమనించలేదు.
‘‘లేదు. ఇకనేను తట్టుకోలేను.. ఇక ఏమాత్రం తట్టుకోలేను. మా ఇంటికి వెళ్ళి, సంతృప్తిగా తింటాను. దేవుడి మీద ఒట్టు… మనం ఒక గ్లాసు మద్యం తాగుదాం, ఏదైనా తిందాం. ఊరబెట్టిన దోసకాయలు, సాసేజ్లు… సమోవార్ సిద్ధం చేద్దాం.. ఓహ్ ఇంకా కలరా గురించి మాట్లాడుకుందాం. పాతరోజులు గుర్తుతెచ్చుకుందాం.. నా భార్య నిద్రపోతూ వుంటుంది. మనం ఆవిణ్ణి లేపొద్దు. నిశ్శబ్దంగా వెళ్దాం పదండి!’’ అన్నాడు రెబ్రొతెసోవ్.
ఈ ఆహ్వానాన్ని ఎంత ఆనందంగా అంగీకరించారో వర్ణించడం కష్టం. అంతకు ముందెన్నడూ లేనంత మంది శ్రేయోభిలాషులు ఆ రాత్రి రెబ్రెతెసోవ్కు తోడుగా వున్నారు…
చీకటిగా వున్న హాల్లోకి రెబ్రెతెసోవ్ తన అతిథులను నడిపిస్తూ, ఆర్డర్లీని ఉద్దేశించి ‘‘నీ చెవులు కోసేస్తాను, దరిద్రుడా! నీకు వెయ్యిసార్లు చెప్పాను… నువ్వు పడుకునేటప్పుడు హాల్లో సువాసన గల కాగితాన్ని కాల్చి ధూపం పెట్టమని… దద్దమ్మా… కదులు… సమొవార్ వెలిగించు. నేలమాళిగలోంచి వూరబెట్టిన దోసకాయలు, ముల్లంగి తీసుకురమ్మని ఇరీనాతో చెప్పు. హెర్రింగ్ చేపలను శుభ్రం చెయ్. వాటి మీద తరిగిన ఉల్లి పరకలు, మెంతులు చల్లు. బంగాళాదుంపలు ముక్కలు కొయ్… అలాగే బీట్రూట్ కూడా… వెనిగర్, నూనె, ఆవపిండి చల్లు. కొంచెం మిరియాల పొడి కూడా… పైన గార్నిష్ చెయ్… అర్థమైందా?’’ పురమాయించాడు.
రెబ్రెతెసోవ్ తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి చేతివేళ్ళను కదిలిస్తూ తినుబండారాల అలంకరణ విషయంలో మాటలతో చెప్పలేని భావాలను ముఖ కవళికలు జోడిస్తూ మూకాభినయం ద్వారా వెల్లడించాడు. అతిథులు తమ రబ్బరు బూట్లను తీసేసి చీకటిగా వున్న హాల్లో ప్రవేశించారు. ఆతిధేయుడు అగ్గిపుల్ల వెలిగించాడు. గంధకం వాసన వ్యాపించింది. గోడలమీద అలంకరించి వున్న నివా బహుమతులు, వెనీస్ దృశ్యాలు, రచయిత లలాజెచ్నికొవ్, మహా ఆశ్చర్యం గొలిపే కళ్నున్న రెబ్రొతెసోవ్ చిత్రపటాలు ఆవిష్కృతమయ్యాయి.
‘‘ఒక్క నిముషం’’ అని అతిధేయుడు గుసగుసగా అన్నాడు. బల్ల సిధ్ధంచేస్తాను. మనం కూచుందాం. నా భార్య మాషాకు ఈరోజు ఆరోగ్యం అంత బాగాలేదు. ఆమెను క్షమించండి… ఏదో ఆడవాళ్ళ సమస్య. లెంట్ పండుగ సందర్భంగా తిన్న ఆహారం కారణమని డాక్టర్ గూసిన్ చెప్పారు. అదే నిజం కావచ్చు. నేను నా భార్యతో అన్నాను! ‘‘దీనికి ఆహారంతో సంబంధంలేదు డియర్! కారణం పెదవుల గుండా లోపలికి వెళ్ళేది కాదు. పెదాల గుండా బయటికి వచ్చేది.’’ అని. ఎప్పటిలాగే చిరాకుతో లెంట్ పండుగ భోజనం తింటావు. నువ్వు శరీరాన్ని కష్టపెట్టే బదులు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది, చివాట్లు పెట్టడం మానేయ్’’ అని నేను అంటాను. కానీ ఆమె నా మాట వినదు.. ‘‘మనం చిన్నపిల్లల్లాగా వుండే విధంగా శిక్షణ పొందాం’’ అంటుంది.
ఆర్డర్లీ వచ్చాడు. మెడ సాచి గుసగుసగా ఏదో చెప్పాడు. రెబ్రెతెసోవ్ కనుబొమలు ముడిపడ్డాయి.
‘‘ఆ… సరే’’ అంటూ గొణుగుతూ, ‘‘అలాగా, ఫరవాలేదు. చిన్న విషయమే. ఇప్పుడే వస్తాను. పనివాళ్ళ కారణంగా మాషా నేలమాళిగకు, అలమరలకు తాళంవేసి తాళంచెవి తన దగ్గరే పెట్టుకుంది. నేను వెళ్ళి వాటిని తీసుకురావాలి.’’ అన్నాడు.
రెబ్రెతెసోవ్ మునివేళ్ళ మీద నిలబడి, మెల్లగా తలుపు తెరచి భార్య దగ్గరకి వెళ్ళాడు. ఆమె నిద్రపోతూవుంది.
‘‘మాషా డియర్’’ మెల్లగా పడకను సమీపిస్తూ ‘‘మాషా, లే… ఒక్క క్షణం!’’
‘‘ఎవరది? నువ్వేనా? ఏం కావాలి నీకు?’’
‘‘విషయమేమంటే మాషా… తాళంచెవులు ఇవ్వు ఏంజెల్.. చింతించొద్దు… నువ్వు పడుకో… నా పని నేను చూసుకుంటాను. ఒకవేళ నేను ఏదన్నా తప్పు చేస్తే, దేవుడు నన్ను శిక్షిస్తాడు. ద్వయతోచియెవ్, ప్రూజినా–ప్రూజిన్స్కీలు, ఇంకా మరికొంత మంది నీకు తెలిసిన వాళ్ళే. అందరూ అద్భుతమైన మనుషులు.. సమాజంలో గౌరవమర్యాదలున్న వారు… పృూజిన్ స్కీకి నాలుగో గ్రేడ్ వ్లదీమిర్ అవార్డు గ్రహీత. అతనికి నువ్వంటే చాలా గౌరవం.’’
‘‘ఎక్కడ తాగొచ్చావు?’’
‘‘అదుగో చూడు… మళ్ళీ కోపం తెచ్చుకుంటున్నావు. నువ్వు నిజంగా ఒక… నేను వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక దోసకాయ ఇస్తాను. అంతే… అందరూ వెళ్ళిపోతారు… నేను బాధ్యత తీసుకుంటాను… నిన్ను బొత్తిగా ఇబ్బంది పెట్టను. నువ్వు వున్న చోటే పడుకో, బుజ్జీ! ఇప్పుడెలా వుంది నీకు? నేను లేనప్పుడు డాక్టర్ గూసిన్ వచ్చారా? నేను నీ చేతికి ముద్దుకూడా పెడతాను. అంతేనా… నా అతిధులకు నువ్వంటే ఎంతో గౌరవం ద్వయతోచియెవ్ మత పరమైన వ్యక్తి… ప్రూజినా కూడా. అందరూ నిన్ను గొప్పగా భావిస్తారు. మరియా పెత్రోవ్నా ఒక మామూలు స్త్రీ కాదు, అపూర్వమైన వ్యక్తి… మన జిల్లాకు మణిదీపం లాంటిది’’ అంటారు.
‘‘పో… పోయిపడుకో! వాగింది చాలు ఆపు! క్లబ్బుల్లో చెడతాగడం, ఆపైన రాత్రంతా ఒకటే రచ్చ చేయడం! కొంచెమైనా సిగ్గులేదా? నీకు పిల్లలున్నారు!’’
‘‘నాకు… నాకు పిల్లలున్నారు. కానీ, కోపగించుకోవద్దు మాషా… చిరాకు పడొద్దు… నువ్వు నా బంగారానివి… నేను నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను. దేవుడు మేలు చేస్తే మన పిల్లలకు అన్ని ఏర్పాట్లూ చేస్తాను. మీత్యాను హైస్కూల్లో చేర్పిస్తాను. మన ఇంటికొచ్చిన అతిథులను బయటికి గెంటేయలేను. చాలా ఇబ్బందికరంగా వుంటుంది. వాళ్ళు నాకోసం వచ్చి ‘‘తినడానికేమైనా ఇవ్వండి,’’ అని అడిగారు. ద్వయెతోచియెవ్, ప్రూజినా–ప్రూజిన్లు ఎంతో మంచివాళ్ళు. వాళ్ళకు నీ పట్ల సానుభూతి వుంది. నిన్ను మెచ్చుకుంటారు. నేను వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక దోసకాయ, కొంచెం వోద్కా ఇస్తాను. వాళ్ళు వెళ్ళిపోతారు. నేను బాధ్యత తీసుకుంటాను…’’
‘‘నిజంగానా! నీకేమైనా పిచ్చిపట్టిందా? ఈ వేళప్పుడు ఎలాంటి అతిథులు? రాత్రి పూట మనుషుల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకు సిగ్గుండాలి. తిరుగుబోతులు! తెల్లవారుఝామున ఇల్లిల్లూ తిరిగే వాళ్ళను గురించి ఎప్పుడైనా విన్నావా? ఇది ఇల్లా కల్లు దుకాణమా? నీకు తాళం చెవులిచ్చి అవివేకిని కాలేను. కైపు తగ్గిన తర్వాత వాళ్ళను రేపు రమ్మనండి!’’
‘‘హు… భలే చెప్పావు. అలాగని నీ ముందు నన్ను అవమానించుకోలేను. అంటే, పవిత్రగ్రంథాల్లో చెప్పినట్లు నువ్వు నా జీవిత సహచరివి కాదన్నమాట. నీ భర్తకు ఓదార్పునిచ్చే భార్యవు కాదన్నమాట, ఆ విషయం నాతో బలవంతంగా చెప్పించాలనుకుంటున్నావు… నువ్వు ఎప్పుడూ పామువే… మునుపటిలాగా ఇప్పుడూ పామువే.’’
‘‘ఓహో! ఇప్పుడు నువ్వు తిడుతున్నావా? బెదిరింపా?’’
అతని భార్య కొంచెం పైకి లేచింది… రెబ్రొతొసేవ్ గడ్డం గీరుకుంటూ అన్నాడు: ‘‘క్షమించు. నేను ఒక పత్రికలో చదివిన మాట ముమ్మాటికీ నిజమే ‘బయట అందరి ముందూ దేవత– ఇంట్లో మాత్రం దయ్యం ప్రతిరూపం’… అక్షరాలా నిజం… నువ్వు ఎప్పుడూ దయ్యానివే, ఇప్పుడూ దయ్యానివే…’’
‘‘ఇదుగో, మర్యాద!’’
‘‘నన్ను కొట్టు… కొట్టు! నీ ఏకైక భర్తను కొట్టు! మోకరించి నిన్ను వేడుకుంటున్నాను… మాషా! నన్ను క్షమించు! తాళం చెవులు ఇవ్వు! మాషా! ఏంజెల్! నువ్వు రాక్షసివి, నలుగురిలో నన్ను నగుబాటు పాలు చెయ్యకు! నువ్వు కిరాతకురాలివి. ఎంతసేపు నన్ను హింసిస్తావు? నన్ను కొట్టు… కొట్టు… క్షమించు, నిన్ను వేడుకుంటున్నాను కదా!’’
ఆ దంపతులు చాలాసేపు ఇలా మాట్లాడుకున్నారు… రెబ్రెతెసోవ్ భార్యముందు మోకరిల్లాడు. రెండుసార్లు ఏడ్చాడు. లేచి నిలబడ్డాడు. మధ్య మధ్య గడ్డం గీరుకున్నాడు. చివరకు భార్యలేచి ఉమ్మేస్తూ అంది:
‘‘ఈ హింసకు అంతు లేదనిపిస్తోంది. కుర్చీ మీదున్న నా బట్టలు ఇవ్వు, మతభ్రష్టుడా!’’
రెబ్రొతొసోవ్ జాగ్రత్తగా ఆమె బట్టలు అందించాడు. జుత్తు సవరించుకుంటూ తన అతిథుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు అతని చిత్రపటం ముందు నిల్చుని, ఆశ్చర్యం నిండిన అతని కళ్ళలోకి చూస్తున్నారు.
రెబ్రెతెసోవ్ అంతరాయం కలిగిస్తూ, ‘‘ఇప్పుడు మాషా వస్తోంది… ఏ క్షణంలోనైనా…’’ అన్నాడు.
‘‘రెబ్రెతెసోవ్! నిజంగా మేము మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామా? మీ చెంపకు ఏమైంది? అయ్యో… మీ కన్నుకూడా నల్లగా కమిలిపోయిందే! ఎవరు చేశారీపని?’’
‘‘చెంపా? చెంపా? , అవునవును! నేను దొంగచాటుగా మాషా గదిలోకి చొరబడ్డాను ఆవిడను భయపెట్టడానికి. కానీ చీకట్లో మంచానికి గుద్దుకున్నాను… ఇదిగో ఆవిడ వచ్చేసింది. మాషా! నీ జుత్తు ఎంతగా చిందర వందర అయిపోయిందో!’’
మరియా పెత్రోవ్నా హాల్లోకి వచ్చింది. చెదిరిన జుత్తుతో, నిద్రమత్తు కళ్ళతో కానీ, ముఖం ఉల్లాసంగా ప్రకాశిస్తోంది.
‘‘మా ఇంటికి ఇలా వచ్చినందుకు చాలా సంతోషం!’’ అంటూ మొదలెట్టింది. ‘‘మీరు మధ్యాహ్నం రాలేదు. మా ఆయన కనీసం రాత్రివేళకైనా మిమ్మల్ని తీసుకొచ్చారు. నేను నిద్రపోతూ వున్నాను. మీ మాటలు విన్నాను… ఎవరై వుంటారా అని ఆశ్చర్యపోయాను. లేవొద్దని మా వారు చెప్పారు కానీ, నేను పడుకుని వుండలేకపోయాను.’’
మరియా పెత్రోవ్నా హడావుడిగా వంటగదిలోకి వెళ్ళింది. భోజనానికి వంట మొదలైంది.
ఆ తర్వాత పృూజినా– ప్రూజెన్స్కీ ఆ యింటి నుంచీ తక్కిన వాళ్ళతో కలిసి బయలుదేరుతూ ‘‘పెళ్ళి చేసుకోవడం మంచిపనే!’’ అని నిట్టూర్చాడు.
‘‘ఎప్పుడు కావాలనుకొంటే అప్పుడు భోజనం చెయ్యొచ్చు… ఎప్పుడు కావలంటే అప్పుడు తాగొచ్చు. మిమ్మల్ని ప్రేమించే మనిషి ఒకరుంటారు. ఆమె మీకోసం పియానో లేదా ఇంకేదైనా వాద్యం వాయిస్తుంది… రెబ్రెతెసోవ్ సంతోషంగా వున్నాడు!’’ అన్నాడు.
ద్వయెతోచియెవ్ మౌనంగా వున్నాడు. అతడు నిట్టూరుస్తూ ఆలోచిస్తున్నాడు. ఇల్లు చేరుకోగానే బట్టలు మార్చుకుంటూ గట్టిగా నిట్టూర్చాడు. దాంతో అతని భార్యకు మెలకువ వచ్చింది.
‘‘బూట్లు టకటకలాడంచడం ఆపు!’’ అందామె. ‘‘నన్ను నిద్రపోనీయవా? క్లబ్బుల్లో పీకల్దాకా తాగొచ్చి ఒకటే చప్పుడు, మూర్ఖుడు!’’
‘‘నువ్వు చేయగలిగింది తిట్టడమేకదా. తిట్టు… తిట్టు!’’ ద్వయెతోచియెవ్ నిట్టూర్చాడు. రెబ్రెతెసోవ్, అతని భార్య ఎంత హాయిగా సంసారం చేస్తున్నారో నువ్వు చూడాల్సింది! వాళ్ళ సఖ్యతను చూస్తే నీకు ఏడవాలనిపిస్తుంది, మనసుకు ఎంతో వూరటనిస్తుంది. నేను దురదృష్టవంతుణ్ణి… మంత్రగత్తెలాగా నాకు నువ్వు దాపురించావు!’’
ద్వయెతోచియెవ్ దుప్పటి కప్పుకుని తన విధిని మనసులో తిట్టుకుంటూ నిద్రపోయాడు.
(1881లో ప్రచురితం)
![]()
కొన్ని వివరణలు:
- ట్రెనిటీలారా: 14వ శతాబ్దంలో స్థాపించిన క్రైస్తవ మఠం. రష్యన్ ఆర్థడాక్స్ క్రైస్తవుల యాత్రాస్థలం. మాస్కోకు ఉత్తరాల 71 కిలోమీటర్ల దూరంలో వుంది.
- నివా బహుమతులు: నివా అనే పత్రిక చందాదారులకు ఉచితంగా ప్రముఖుల చిత్రాలు పంపించేది.
- సెయింట్ వల్దీమిర్ ఆర్డర్: సివిల్ సర్వీసులో వున్న అధికారులకు ప్రదానంచేసే ఒక పురస్కారం. నాలుగో గ్రేడ్ అన్నిటికన్నా తక్కువ హోదా గలది.
- బాబా యాగా: రష్యన్ జానపద గాధలోని ఒక పాత్ర. మంత్రగత్తె.

ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో సీనియర్ రష్యన్ డిప్లొమా చేశారు. 6 ఏళ్లు మాస్కోలో అనువాదంలో శిక్షణ పొంది, ఉద్యోగం చేశారు. జర్మన్ భాషతో కూడా పరిచయం ఉంది.
అభిరుచులు: చిత్రలేఖనం,ఫోటోగ్రఫీ, భాషల అధ్యయనం




Discussion about this post