ఆంగ్ల మూలం: సమ్రీన్ సాజెదా
తెలుగు సేత: మందరపుహైమవతి
ఉన్మాదపు పరుగులు తీస్తూ
సుడులు తిరుగుతున్న దుమ్ము
కర్కశపాదాలు రేపుతున్న ధూళి
నడుస్తున్న వాస్తవాలకు దూరంగా
ఒక ప్రాచీన మహా సంస్కృతి
జ్ఞాపకాలను ధ్వంసం చేస్తూ
ఆ కాళరాత్రిలో సమస్తాన్నీ కాలరాస్తూ
సుడులు తిరుగుతున్న ధూళి
చెదరినగూడుకు చేరిన పిచ్చుకలా
అస్థిరంగా
కనుచూపు మేరలో ఆహారం దొరకని
అసహనపు కుక్కలా
కమ్ముకున్న ధూళిలో
ఉక్కిరిబిక్కిరౌతున్న దేశం
అమాయకత్వపు
మెరుపుల ముసుగు తొడుక్కుని
నెమ్మదిగా
మరింత నెమ్మదిగా
మళ్ళీ లేస్తుంది దుమ్ము
అశాంతిపరుడైన కవిలా
ఆగకుండా
శత్రువులను ఆగనివ్వకుండా
![]()

స్త్రీవాద కవయిత్రి. మూడు దశాబ్దాలుగా రాస్తున్నారు. బాల్యం నుంచి కవిత్వం రాస్తున్నారు. సూర్యుడు తప్పిపోయాడు, నిషిధ్ధాక్షరి, నీలి గోరింట, రాతి చెయ్యి కవితా సంపుటాలు.. వానచినుకులు వ్యాస సంకలనం ప్రచురించారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతి, నారాయణ రెడ్డి, శ్రీకాంత్ శర్మ అవార్డులు, తెలుగు యూనివర్సిటీ అవార్డు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం సహా పదివరకు పురస్కారాలు లభించాయి. ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ, మళయాళ, బెంగాలీ లలోకి ఆమె కవితలు అనువదించబడ్డాయి.



