• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

చారలపెట్టె రహస్యం 

శొంఠి జయప్రకాష్ by శొంఠి జయప్రకాష్
July 1, 2025
in అనువాద కథలు
0
చారలపెట్టె రహస్యం 

ఇంగ్లీషు కథ: సర్ ఆర్థర్ కానన్ డోయల్

అనువాదం: శొంఠి జయప్రకాష్

“దాన్నిచూస్తుంటే  నీకేమనిపిస్తుంది, అలార్డైస్?” ఓడ డెక్ మీద నా పక్కనే నిలుచున్న నా సహాయకుడు అలార్డైస్ ను అడిగాను. కనుచూపు మేరలో సముద్ర జలాలపై, అలల తాకిడికి అటు ఇటూ ఊగుతున్న ఓడ కనిపిస్తూ ఉంది.   

రివ్వున వీస్తున్నగాలికి అలలు ఉధృతంగా పైకి లేచి, వేగంగా మేమున్న పడవలు పైకీ కిందకూ నాట్యం చేస్తున్నట్టు ఎగురుతున్నాయి. పాదాల కింద పట్టుకోసం నా సహాయకుడు  తన పొట్టి, బలమైనకాళ్ళు డెక్ మీద ఎడంగా పెట్టుకొని,నిల్చుని బేలెన్స్ చేసుకొని  జాగ్రత్తపడుతున్నాడు. మా రెండు పడవల వెనుక భాగాలు  పూర్తిగా నీటిలో మునిగి ఉన్నాయి. నా సహాయకుడు  బైనాక్యులర్ ని సర్దుకొని పొజిషన్ లో కొచ్చాడు. దిక్కూ మొక్కూ లేనట్లుగా, దూరంగా , మూడొంతుల భాగం నీటిలో మునిగి ఉన్నదూరంగా ఊగిసలాడుతున్న ఓడ కేసే తదేకంగా చూడసాగాడు. సముద్ర తరంగాల తాకిడికి అది ఎగిరెగిరి పడుతూ ఉంది. ఉన్నట్టుండి అది గుండ్రముగా తిరిగి ఒక వైపున   వాలి,నీళ్ళలోకి కుంగిపోయింది. ఇప్పుడు నేను దాని  రక్షణగోడ (బుల్ వాక్) అంచులను మాత్రం చూడగలుగుతున్నాను.

అదొక రెండు స్తంభములు కలిగిన చిన్నసైజు ఓడ. దాని ప్రధాన స్తంభం విరిగి పోయి, డెక్ నేల నుండి  కేవలం పది అడుగుల మేర మాత్రమే మిగిలి ఉంది. విరిగి పడిన శిథిలాలు నీటిపై తేలియాడుతున్నాయి. వాటిని అక్కడినుంచి తొలగించడానికి ప్రయత్నాలు ఎవ్వరూ చేసినట్లు లేదు. ముందరి స్తంభం మాత్రం ఇంకా  నిటారుగా నిలబడి ఉంది.కానీ దాని తెరచాప వదులుగా వేలాడుతూ ఉంది.ప్రధాన తెరచాప– జెండాలా పిచ్చిపట్టినట్లుగా రెపరెప లాడుతూ ఉంది. ఆలనా పాలనా లేక అసలు ఎవరూ పట్టించుకోక, వదలివేయబడిన అటువంటి ఓడను నేనెప్పుడూ చూసి ఉండలేదు.

అలార్డైస్ –స్కాట్లాండ్ కు చెందిన వాడు. నెమ్మదస్తుడు. అయినా ఏ పనైనా ఒక పధ్ధతిననుసరించి చేసేవ్యక్తి. సముద్రపు నీటి అలలలో కొట్టుమిట్టాడుతున్న ఓడ వంకే కన్నార్పకుండా, నిశితంగా పరిశీలించే పనిలో నిమగ్నమై ఉన్నాడు.

అట్లాంటిక్ మహాసముద్రంలో, ఉత్తరం వైపుగా గత పదిరోజులు గా మేము ప్రయాణం సాగిస్తున్నాము.

“ఎవ్వరో ఆ ఓడను సముద్రం పైననే  వదిలేసి వెళ్లిపోయారనుకుంటున్నాను .” తన అభిప్రాయం వెలిబుచ్చాడు నా సహాయకుడు.

నేను కూడా అదే అనుకుంటున్నాను.ఎందుకంటే ఆ డెక్ మీద ఏ ప్రాణీ జీవించి ఉన్న ఆనవాళ్లేమీ కనబడ లేదు.  మిగతా నావికులు–ఆ ఓడ వైపు  చేతులు ఊపుతూ చేసిన సైగలకు, ఆ వైపు నుంచి  ఏ మాత్రం ప్రతిస్పందన రాలేదు. బహుశా సదరు  ఓడ మునిగిపోబోతున్నట్టు సిబ్బంది అభిప్రాయపడి దాన్నక్కడే వదిలేసి పోయుంటారు.      

“ఇక ఎంతోసేపు అది మనుగడలో ఉండదు.పూర్తిగా మునిగి పోవచ్చు. ఇక కొన్ని నిముషాలలోనే దాని ముందు తల  భాగం నీళ్ళలోతుల్లోకి వెళ్లి, వెనుక తోకభాగం పైకి లేచి నీళ్ళ అడుగుకు చేరుకోవచ్చు. అప్పటికే ఓడ అంచుల  వరకూ నీళ్లొచ్చేసినాయి.” అంటూ కొలుస్తున్నట్టు మాటల ముత్యాలు రాల్చాడు.

“దాని కున్న జెండా ఏ దేశానికి చెందినదో పరిశీలించు.” చెప్పాన్నేను.

“అదే గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను. అది మడతలు పడి మెలికలు తిరిగి ఉంది…. ఆ..ఆ..ఇప్పుడు స్పష్టంగా కనబడుతూ ఉంది. అది బ్రెజిల్ దేశపు జెండా.తలకిందులై ఉంది.”

దాన్నెవరో ఇక్కడ వదిలేసి ఎంతోసేపు కానట్లు ఊహించాను. నా సహచరుని బైనాకులర్స్ తీసుకొని చుట్టు పక్కలా పరికించాను. ఎడాపెడా లేచిపడుతున్న కెరటాలతో, కల్లోలిత నీలి అట్లాంటిక్ సముద్రం మాత్రం కనిపిస్తూ ఉంది.కానీ నేను చూసినంత మేరా ఎక్కడా జీవులున్న జాడే కనబడటం లేదు.

“అహోయ్! ఓడలో ఎవరైనా ఉన్నారా?” గట్టిగా అరిచాను. అటునుంచి స్పందనే రాలేదు. దాంతో, ఒక నిర్ణయానికొచ్చినట్లు, “  కనీసం మిగిలిఉన్న ఓడనైనా రక్షించాలి మనం.” గొణిగాడు అలార్డైస్.

“ అందుకే మనం బాగున్న ఓడభాగం లోనికి చేరుకుందాం. అక్కడ్నుంచి రక్షణ కార్యకలాపాలు మొదలుపెడదాం.”  

  మేము ఆ ఓడకు వంద గజాల దూరానికి చేరుకున్నాం. అక్కడ మూడు స్తంభాల ఓడ ఒకటి, రెండు స్తంభాల ఓడ మరొకటి–కలిపి రెండున్నాయ్. రెండూ నీటిలో  తేలాడుతూ పైకీకిందకూ ఊగుతున్నాయి–నాట్యం చేస్తున్నట్టు.  

“  మిస్టర్ అలార్డైస్! నలుగురు మనుషులను ,మన రెండు క్వార్టర్ బోట్స్ తో తీసుకెళ్ళి, ఆ ఓడలో ఏం జరిగిందో కనుక్కోని రా.” అని పురమాయించాను. అయితే అదే సమయంలో మా పై అధికారి ఆర్మ్ స్ట్రాంగ్ అక్కడికొచ్చాడు. త్యజించబడిన ఆ ఓడలో కెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి నాలోనూ కలిగింది. ఆర్మ్ స్ట్రాంగ్ కు ఒక మాట చెప్పి ఆ ఓడలోకి ఇద్దరం  చేరుకున్నాను. 

       దూరం చాలా తక్కువ ఉన్నా, అల్లకల్లోలిత సాగరజలాల తరంగాల మీద  ప్రయాణం చాలా క్లిష్టంగా,కష్టంగా,మందంగా, దీర్ఘంగా సాగింది. తీరా అక్కడకు చేరిన తరువాత చూస్తే, మేము వదలిపెట్టి వచ్చిన బార్క్ (రెండు స్తంభాలతో కూడిన ఓడ ) కనబడలేదు. ఎవరి చేతో విడిచిపెట్టబడిన, మేము చేరాలని సంకల్పించిన బ్రిగ్(మూడు స్తంభాలతో కూడిన ఓడ ) కూడా కనబడ లేదు. అస్తమిస్తున్న సూర్యుడు ఇంకా పూర్తిగా  దిగువకు కుంగిపోలేదు. అక్కడ చల్లగా, చీకటిగా ఉంది. అయినా ఉధృతంగా వచ్చి పైకి లేచి పడుతున్న కెరటాలు మమ్మల్ని పైకెత్తడం వల్ల అప్పుడప్పుడు  సూర్యరశ్మి తగిలి  మా శరీరాలకు కొంచెం వెచ్చదనం కలుగుతూ ఉంది. కొన్నినిముషాల అనంతరం, రెండు  చీకటి లోయల మధ్య ఉన్న ఒక తెల్లని చిన్న భూభాగం కనబడింది. అక్కడినుంచి దూరంగా దృష్టి సారించాను. బ్రిగ్ ఓడ తాలూకు స్తంభం ముందరి భాగం కనబడింది.

అటువైపు మా పడవను నడిపించి, ఆ ఓడ లోపలికెలా వెళ్లాలా అని ఆలోచించి, ఎలాగో ఆ బ్రిగ్ తాలూకు వెనుక భాగం చేరుకున్నాము. దాని మీద లిఖించబడి ఉన్న అక్షరాల్ని చదివాను. “ సేనోరా డ విట్టోరియా” అని ఓడ అంచుల దిగువున   పెయింట్ చేయబడి ఉన్నాయి..       

 బ్రిగ్ యొక్క రక్షణగోడ తాలూకు ప్లాట్ ఫార్మ్  మా పడవ కు దాదాపు సమాన ఎత్తులో ఉంది.  

“ గాలివాటం అనుకూలంగా ఉంది.” చెప్పాడు అలార్డైస్.

“ అయితే బోట్ హుక్ ని సిధ్ధంగా ఉంచు.” అని సూచించాను. (పొడవాటి స్తంభానికి ఒక చివర అమర్చబడిన ఒక బలమైన  ఇనుప కొక్కీని బోట్ హుక్ అనంటారు. అది పడవను గానీ, ఓడను గానీ లాక్కుని పోవడానికి ఉపయోగ పడుతుంది)ఇద్దరం కలసి ఎగిరి దూకి, పరిత్యజించబడిన ఓడ మీదకు చేరుకున్నాము. ఓడ అల్లకల్లోలిత నీటిపై అటు ఇటు ఊగుతున్నందువల్ల, మా కాళ్ళకింద గట్టిపట్టు చిక్కించుకోవడానికి ప్రయత్నిస్తూ అప్రమత్తంగా ఉన్నాము. 

   ఒకవేళ మేమున్న ఓడ మునిగిపోతే మమ్మల్ని మేము రక్షించుకోవడమే ప్రథమ కర్తవ్యమని అప్పటి మా ఆలోచన.

ఆ ఉద్దేశ్యముతో, మా మనుషులిద్దరిని డింగీకి అనుసంధించబడిన తాడు వద్ద సిధ్ధంగా ఉండమని నిర్దేశించాము. ఆపద ముంచుకొస్తుందని అనుమానం కలిగితే, మరుక్షణం ప్రాణాల్ని రక్షించుకోవడం కోసం సదరు డింగీని ఓడ పక్కనే ఉంచమని చెప్పాము.     

   ఓడ లోపల ఎంత నీరు చేరి ఉందో కనుక్కుని రమ్మని కార్పెంటర్ ను పంపించాము.నేనూ, అలార్డైస్, మిగతా నావికులందరం కలసి ఓడను, ఓడలోని సరుకుని క్షుణ్ణంగా పరిశీలించ సాగాము.

  ఆ ఓడ పరిసరాల చుట్టూ  శిథిలాలు, చెత్తాచెదారం మొదలగునవి అక్కడక్కడ చెల్లాచెదురుగా విసరివేయ బడిఉన్నాయి. కోళ్ళగూళ్లల్లోని  కోళ్ళు చచ్చి పోయి నీటి ప్రవాహ ప్రభావానికి శుభ్రంగా కడగబడి ఉన్నాయి.ఓడలోని ఆత్మ రక్షక పడవలన్నీకొట్టుకుపోయి ఉన్నాయి–ఒక్కటి మినహా. ఆ పడవ లోపల ఒక స్టవ్ ఉంది.వీటిని బట్టి ఎవరో ఓడను, అప్పుడప్పుడే, అక్కడే  వదిలేసి వెళ్లిపోయారనే విషయం నిర్ధారణయింది. కేబిన్– డెక్ హౌస్ లో ఉంది. కేబిన్ కు  ఒక వైపు సముద్రపు నీటి ఉధృతికి బాగా దెబ్బతిని ఉంది. నేనూ,అలార్డైస్ ఇద్దరం కేబిన్ లోనికి ప్రవేశించాము. లోపల ఆ ఓడ కెప్టెన్ టేబుల్ కనిపించింది. అతడు నిష్క్రమించినప్పుడు ఏలాగుందో,  అది ఇప్పుడూ అలాగే ఉంది. దాని పైన అతనికి సంబంధించిన పుస్తకాలూ,కాగితాలూ– చిందరవందరగా పడి ఉన్నాయి. అవి పోర్చుగీసుకిగానీ, స్పెయిన్ దేశాల తాలూకు కాగితాలై ఉండొచ్చనిపించింది. ఎక్కడ చూసినా కాల్చి పడేసిన సిగరెట్ పీకలూ, ఆష్ ట్రేలు దర్శన మిస్తున్నాయి. లాగ్ బుక్ కోసం వెదికాను.(ఓడ ప్రయాణించిన దూరమును లెక్కించే రికార్డ్  ) కానీ ఎక్కడా దొరకలేదు.

“ దక్షిణ అమెరికా చెందిన ఓడప్రయాణీకులు అంత జాగ్రత్తగా ఉండరు. స్వలాభమున్నంత వరకే తప్పవాళ్ళు వేరే పని ఏదీ చేయరు. ఒక వేళ లాగ్ బుక్ వంటిది ఓడలో ఉందనుకొన్నా, దాన్ని వాళ్ళ వెంట పట్టుకుపోయుంటారు. “ అన్నాడు అలార్డైస్ తార్కికంగా.

“నేను వీటిని మన వెంట తీసుకు రావాలనుకుంటున్నాను.” నేనన్నాను.  పుస్తకాలు, కాగితాల వైపు చూపిస్తూ. తరువాత సంభాషణ కొనసాగిస్తూ, “ ఇంకా ఎంతసమయముంటుందో కార్పెంటర్ ను అడుగు” అన్నాను.               

      అతడు  సేకరించి తెచ్చిన సమాచారం ఆశాజనకంగా ఉంది.

      ఆ ఓడనిండా నీళ్ళు వచ్చి చేరాయి. ఓడలోని కొన్ని సరుకులు నీటిలో తేలాడుతూ ఉన్నాయి.అప్పటికప్పుడే ఓడ మునిగి పోయే ప్రమాదం మాత్రం లేదు.  బహుశా అది నీటిపై తేలియాడుతూనే ఉంటుంది.కానీ అది పూర్తిగా మునిగిపోయే పరిస్థితి మాత్రం  ఖచ్చితంగా రాదు గాక రాదు. 

“ అలాంటప్పుడు నీవు ఓడ అడుగుకు వెళ్ళి, ఓడను గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.అందులో ఉన్న సరుకును ఎంతవరకూ కాపాడగలమోనన్న నిర్ణయానికి రాగలము. నువ్వాపనిలో ఉండు. నేను ఈ కాగితాల్లో ఏముందో కనుక్కుంటాను..” అన్నాన్నేను.          

     టేబుల్ మీద పడిఉన్న కాగితాల్ని పరిశీలించగా తెలిసిందేమంటే–‘ నోస్సా శేనోరా డ విట్టోరియా ’ అనబడే ఆ బ్రెజిలియన్ ఓడ– బాహియారేవు నుండి ఒక నెల కిందటే క్లియరెన్స్ అయిందని. దాని కెప్టెన్ పేరు టెక్సీరియా  అని తెలుసుకున్నాను. ఎంతమంది ఓడ సిబ్బంది ఉన్నారనే విషయంలో వివరాలు లభ్యం కాలేదు. అది లండన్ కు చేరుకోవాల్సి ఉంది.బిల్ ఆఫ్ లేడింగ్ (సరుకుల జాబితా తెలిపే డాక్యుమెంట్ ) ప్రకారం, తెలిసిందేమంటే– మేము ఓడను కాపాడినందువల్ల మాకు  పెద్దగా లాభించేదేమీ ఉండదు. అందులో కాయధాన్యపు గింజలు, అల్లము,కలప దుంగలు ఇత్యాదులున్నాయి. దుంగలు చాలా పొడవుగా, అసాధారణ మైన పరిమాణంలో ఉన్నాయి. అందువల్ల–ఓడ సముద్రపు అడుగుకు వెళ్ళి,పూర్తిగా మునిగి పోకుండా అవి  నిరోధకాలుగా ఉపయోగపడుతున్నాయి. అంత భారీ సైజు కారణంగా వాటిని వెలికి తీయడం అసాధ్యంగా తోచింది. ఇవి గాక ఇంకా ఆడవాళ్ల అలంకరణాసామగ్రి, వందలకొద్దీ పళ్ళునిలువ ఉంచిన చెక్క పెట్టెలున్నాయి. నేను తిరిగి కాగితాల మీదకు  దృష్టి సారించాను. అందులో–ఇంగ్లీషులో వ్రాయబడిన ఒక చిన్నకాగితం ముక్క నాలో ఉత్కంఠ రేపింది. అందులో ఇలా ఉంది.                     

విన్నపము

“ఎంతో కష్టం ధారపోసి  సేకరించబడిన , శాంతరేం నుంచి వచ్చిన కొన్నివిలువైన, అపూర్వమైన స్పానిష్,   ఇండియన్  వస్తువులు–ప్రాన్ ఫూట్,న్యూమ్యాన్, ఆక్స్ ఫర్డ్ , లండన్ కు, కన్ సైన్ మెంట్ ద్వారా పంపించబడుతున్న  విలువైన ,ప్రత్యేకత కలిగిన ఈ వస్తువులకు, ఏ మాత్రం ప్రమాదం, హాని, చోరీ  జరగని  ప్రదేశంలో ఉంచవలసిందిగా కోరడమైనది. ప్రత్యేకించి, డాన్ రమిరెజ్ డి లేరా ఖజానా అధికారులకు  విన్నవించేదేమంటే –ఈ వస్తువులను ఏ విధంగా నైనా , ఎవ్వరూ తాకని రహస్యమైన ప్రదేశంలో ఉంచవలసినదిగా మనవి. ” 

 

‘ఓహ్! డాన్ రమిరేజ్ ఖజానా ఇనప్పెట్టె ! ప్రత్యేకమైన అపురూప అత్యంత విలువ చేసే వస్తువులు! మునిగిపోయే ఓడను రక్షిస్తే మనకేం లాభమని మొదట నిరాశ చెందాను. కానీ అనూహ్యంగా గొప్ప నిధే లభించబోతోంది!అబ్బా!ఇది కదా అదృష్టమంటే! ’ అని సంబర పడుతూ , ఆ పేపర్లు చేతబట్టుకొని పైకి లేచాను.నా స్కాటిష్ మిత్రుడు గుమ్మంలోనే ఎదురు పడ్డాడు.

“అన్నీ అనుకున్నట్లు జరిగేటట్టు లేవు సార్! మనం ఓడలోనికి ప్రవేశించాల్సిందే .” అన్నాడు అలార్డైస్.

 కరుకుగా ఉన్న అతని ముఖంపై,  మనసులోని ఆందోళన ప్రస్ఫుటమౌతూనే ఉంది. 

“ఏం జరిగింది?” అడిగాను

“హత్య జరిగింది సార్. హత్య. ఘోరమైన హత్య! ఒక మనిషి  చనిపోయాడు.”

“తుఫాను వల్ల చనిపోయాడా ?” అడిగాన్నేను.

“లోతుగా పరిశోధిస్తే గానీ ఏమీ బోధపడదు.”

“అయితే పద అక్కడికి. దారి చూపించు.”

“ఇటు వైపు సార్! ప్రధాన డెక్ హౌస్ లో.” అంటూ దారి చూపిస్తూ ముందు నడిచాడు.నేను అనుసరించాను.

 బ్రిగ్ (ఓడ) కింద భాగంలో చాలినంత జాగా లేదు. ఎందుకంటే–ఓడ కెప్టెన్ కోసం ఒక గది, డెక్ నుంచి పక్కనున్న దారికి అనుసంధానించబడిన, తెడ్డుతో నడిచే వంట మనిషి తాలూకు చిన్న పడవకు ఒక గది, ఓడ ముందు భాగాన ప్రధాన డెక్ హౌస్–ఉన్నాయి. మధ్య గదిలోకి  ప్రవేశించాము.అలా ప్రవేశించగానే–వస్తువులన్నీతలకిందులుగా,   అస్తవ్యస్తంగా,చిందరవందరగా పడిఉన్నదృశ్యం కుడివైపున కనబడింది. ఎడమవైపున ఆఫీసర్ల కోసం రెండు బంకర్లతో కూడిన ఒక గది ఉంది. కొంచెం దూరంలో పన్నెండు చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలంలో జెండాలు,కాన్ వాస్ గుడ్డ చుట్టలున్నాయి. గోడల చుట్టూ– చవకరకం గుడ్డలతో జిగురుతో తాపడం చేయబడి, దానిపైన నాణ్యమైన కలపతో సుందరంగా తీర్చి దిద్దబడిన కార్పెంటరీ కళానైపుణ్యంతో మెరుగు పరచ బడి ఉన్నాయి.

ఇంకో వైపున ఒక భారీ చెక్కపెట్టె కనబడుతూ ఉంది.ఆ పెట్టెకు ఎరుపు, తెలుపు చారలతో  రంగులద్దబడి ఉన్నాయి. ఎరుపు రంగు వెలిసిపోయి ఉంది. తెలుపు రంగు మురికిగా కనబడుతూ ఉంది.దాని పైన నేరుగా  వెలుతురు పడితే గానీ ఆ రంగునెవ్వరూ గుర్తించలేరు. తరువాత కొలతలు తీసుకోవడం జరిగింది. అది–నాలుగడుగులా మూడు అంగుళాల పొడవుతో, మూడు అడుగులా రెండు అంగుళాల ఎత్తుతో,మూడడుగుల వెడెల్పుతో భారీగా ఉంది. ఒక సముద్రనావికుని  పెట్టె  కన్నా పరిమాణంలో పెద్దగా ఉంది.

నేను స్టోర్ రూమ్ లో ప్రవేశించగానే నా కళ్ళు, ఆలోచనలు  పెట్టెమీదకు  మళ్లలేదు. ఆ పెట్టెకు కొంచెం దూరంలో చెత్తా చెదారం మధ్యలో, కాళ్ళు బారజాపుకొని పడిఉన్న ఒక నల్లని, పొట్టి మనిషి కేసి నా దృష్టి సారించాను. అతనికి ఉంగరాలు రింగులు తిరిగిన చిన్న గడ్డం ఉంది. పెట్టె వైపుగా కాళ్ళు చాపుకొని ఉన్నాడు.తల ఇవతల వైపు ఉంది. తెల్లని కాన్ వాస్ గుడ్డ మీద –చిరుగును కప్పివేయుటకు కాషాయ రంగు అతుకు వేయబడి ఉంది. దాని మీద అతని తల ఉపస్థితమై ఉంది. రిబ్బన్ పీలికలు అతని మెడను చుట్టుకొని ఉండి, మిగతా పీలికలు నేలమీద పొడవుగా  పరచుకొని ఉన్నాయి. అయితే అతని శరీరం మీద  స్వల్పాతి స్వల్ప మైన గాయం కూడా కనిపించలేదు. అతని ముఖం– లోకం మరచి నిద్రపోతున్న పసిబాలుడి ముఖం లాగా ప్రశాంతంగా  ఉంది. 

వంగి అతని తలమీది గాయాన్ని పరిశీలించినప్పుడు మాత్రం అంతులేని భయం నన్నునివ్వెర పోయేట్టు చేసింది.

పైకి లేచి నిటారుగా నిలబడ్డాను– నా మనో సముద్రం లో ఒక పెద్ద భయానక కెరటం లేచి పడుతుండగా.

అతడు–  డేరా వేసేటప్పుడు బిగువు కోసం భూమిలో పాతే పదునైన ఇనుప గుంజ వంటి ఆయుధంతో తలమీద మోద బడి, ఘోరంగా చంపబడ్డాడు. బహుశా ఎవరో వెనుక నిలుచుని,  ఆయుధాన్నితలలో లోతుగా దించి ఉంటాడని ఊహించాను. సదరు పదునైన ఆయుధం ధాటికి –అతని తల ఛిద్రమై, మొన మెదడులోకి లోతుగా చొచ్చుకొని పోయుంటుంది. స్ప్లిట్ సెకండ్ వ్యవధిలో మరణం సంభవించినందువల్ల, బహుశా అతని మొహంలోని  ప్రశాంతత చెక్కుచెదర లేదు. తల వెనుక  భాగం మీద దెబ్బ పడడం మూలంగా, హతుడు–హంతకుణ్ణి చూసే అవకాశమే లేదు.

“అది అనుకోకుండా జరిగిన ఆక్సిడెంట్ అంటారా? లేకుంటే ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన హత్య అంటారా కెప్టెన్ బార్క్లే?” నా సహాయకుడు నిర్మొహమాటంగా సందేహం వెలిబుచ్చాడు. 

“నీవు సరిగ్గా ఊహించావు ఆలార్డైస్. ఇతను హత్య చేయబడ్డాడు.అందులో సందేహం లేదు. ఎవరో పదునైన, బరువైన                        యుధంతో కొట్టి చంపివేశారు. అయితే ఎవరు వారు? ఎందుకింత ఘోరానికి పాల్పడ్డారు?”

“ఇతను సాధారణమైన నావికుడు సార్.ఒకమారు అతని చేతి వేళ్ళు గమనించండి.” అని మాట్లాడుతూ అతని జేబులు వెతికి, వాటిల్లోంచి పేక ముక్కలు, ఒక తారుపూసిన దారం, ఒక బ్రెజిలియన్ పొగాకుఈనెల కట్ట బయటికి  తీశాడు.

“అరే! దీన్ని చూడండి!” అని నేలపైన పడి ఉన్న ఒక వస్తువును చూపిస్తూ అన్నాడు.

 అదొక పెద్ద కత్తి.దానికి ఒక పొడవైన, బలమైన స్టీల్  స్ప్రింగ్ బ్లేడ్ అమర్చబడి ఉంది.స్టీలు తళతళ మెరుస్తూ ఉంది. ఆ హత్యకూ, ఆ స్టీలు కత్తికీ ఏమైనా సంబంధముంటుందనుకోను. తనపై హత్య జరిగిన సమయంలో హతుడు తన   పిడికిట్లో కత్తిని పట్టుకొని ఉంటాడని ఊహించొచ్చు.కారణం? హతుని చేతిలో ఆ కత్తి ఇంకా అతని గుప్పిట్లో ఇమిడి ఉండడమే. 

“సార్!హతుడు ముందుగానే ప్రమాదాన్ని కనిపెట్టి, ముందు జాగ్రత్తగా చేతిలో కత్తి పట్టుకొని ఉంటాడని అనుకుంటున్నాను.”

“అంతా జరిగి పోయింది. పాపం!  ఇప్పుడతనికి ఏమీ సహాయం చేయలేము. అయితే ప్రస్తుతం ఇక్కడున్న ఆయుధాలు,విగ్రహాలు,మిగతా సామగ్రి అంతా కొట్టుకుపోయి  గోడ పక్కకు చేరిఉన్నాయి.  ” అన్నాడు నా సహచరుడు.  

“సరిగ్గా చెప్పావ్ అలార్దైస్! ఇవే మనకు పనికొచ్చే వస్తువులు. ఈ సామాన్లు తరలించి, ఓడలోనికి చేర్చడానికి  మరో పెద్ద బోటును పంపించమని మనవాళ్లకు చెప్పు.  ”   

అతనలా వెళ్ళగానే,  ఈ అరుదైన వస్తువుల దోపిడీ ద్వారా మా చేతికి ఎంత విలువైన సామగ్రి అందిందో మనసులోనే లెక్కించసాగాను. అరుదైన వస్తువులు దేనికదే  పొట్లాలుపొట్లాలుగా కట్టి ఉంచబడ్డాయి. ఇక చారలపెట్టె విషయానికొస్తే –అది– వెలుతురు ధారాళంగా పడే ప్రదేశంలో ఉంచబడింది కాబట్టి, దాన్ని పరిశీలించడం సులభతరమౌతుంది.  ఆ పెట్టె మూత మీద కొన్ని లోహపు చిహ్నాలు చెక్కబడినవి. దాని కింద,  స్పానిష్ లో  కొన్ని అక్షరాలు చెక్కబడి ఉన్నాయి.వాటిని అనువదిస్తే, కింద సూచించిన విధంగా అర్థమౌతుంది.

ఇది డాన్ రమిరెజ్ డి లీరా, సెయింట్ జేమ్స్ ప్రభువు,

గవర్నర్ మరియు ప్రధాన కెప్టెన్,టెర్రా ఫిర్మా,

ప్రొవిన్స్ ఆఫ్  వెరాక్వాస్.

ఒక మూల 1606 సంవత్సరం  రాసిఉంది. మరోవైపున ఒక తెల్లని లేబుల్ అతికించబడి ఉంది. దానిపై ఇలా రాయబడి ఉంది.

‘‘అందరికీ విన్నవించుకుంటున్నదేమిటంటే–ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పెట్టెను తెరవకూడదు.”

 అని ప్రస్ఫుటంగా కనబడే విధంగా రాయబడి ఉంది.

అదే హెచ్చరిక దాని కిందనే స్పానిష్ లోనూ లిఖించబడి ఉంది. ఏ సముద్ర నావికుని మేధకూ  అందనంత సంక్లిష్ట విధానంలో దానికి వేయబడిఉన్న తాళం రూపొందించబడి ఉంది.   

నేను ఆ వింతైన పెట్టెను పరిశీలిస్తుండగా, మొదటి ఆఫీసర్ మిస్టర్ ఆర్మ్ స్ట్రాంగ్ ను తీసుకొచ్చిన  క్వార్టర్ బోట్ (ఓడ సిబ్బంది నివాసం గా ఉపయోగపడే  బోట్) మా పక్కగా వచ్చి ఆగింది. పరిత్యజించబడి ఉన్న ఓడ నుండి  మాకు పనికి వచ్చే అరుదైన వస్తువులను కొన్నిటిని తీసుకొని బోట్లోకి చేరవేశాం. ఆ పడవ మొత్తం నిండాక మా బార్క్( మూడు స్తంభములు గల పడవ) వద్దకు పంపించి వేశాం. తరువాత నేనూ, అలార్డైస్, కార్పెంటర్, ఒక నావికుని సహాయంతో, అత్యంత బరువైన చారల పెట్టెను తరలించి,మా బోట్ మధ్యలో ఉన్న అడ్డపలకల మధ్యలో కదలకుండా ఉంచాం. చనిపోయిన వ్యక్తి ఎలా పడున్న వాణ్ని అలాగే వదలి వెళ్ళి పోయాం.           

చనిపోయిన వ్యక్తి గురించి నా సహచరుడు చెప్పిన సిధ్ధాంతమేమంటే–ఓడను వదలి పోవలసిన ప్రమాద పరిస్థితి  దాపురించినప్పుడు ఇతగాడు ఓడలోని విలువైన సామగ్రిని దోచుకోవడానికి తెగబడి ఉంటాడు. క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు గ్రహించి, అతనిపై ఆగ్రహించి కెప్టెన్ ఏదో పదునైన ఆయుధంతో వీడి నెత్తి మీద బాది ఉంటాడు.దాంతో అతడు చచ్చి ఉంటాడని. ఆ వాదన సబబుగానే ఉన్నట్లు తోచినా నాకు సంతృప్తి నివ్వలేదు. అయితే సముద్రం ఎన్నో మిస్టరీలకు,రహస్యాలకు కేంద్రబిందువు. ఈ  సంఘటన ప్రతి నావికునికీ గుణపాఠం కావాలి. కాబట్టి మరణించిన ఆ అభాగ్య జీవిని , అతని మానానికి అతన్నొదిలి పెట్టిపోవడమే ఉత్తమనుకొని నిర్ణయించుకున్నాను.        

బరువైన  పెట్టెను బలమైన తాళ్ళసహాయంతో మా ఓడ  ‘ మేరీ సింక్లయర్ ’ డెక్ మీదకు చేర్చాము.అక్కడ నుంచి నలుగురు సముద్ర నావికులు కేబిన్ లోకి మోసుకెళ్ళి టేబుల్ కు, లాకర్ మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేమందరం విందు చేసుకున్నాం. మిస్టర్ ఆర్మ్ స్ట్రాంగ్ పొడవుగా,సన్నగా , అందంగా ఆకర్షణీయంగా  ఉన్న వ్యక్తి.  సమర్థవంతమైన నావికుడు. పెట్టెలో దాచబడిన పురాతన సంపదను గురించి  తలచి మురిసి పోసాగాడు. అతడు మనసులోనే  ఎన్నో ఆశల మేడలు నిర్మించుకుంటున్నాడు. అక్కడున్నవారంతా ఆ సంపదను పంచుకుంటే ఒక్కొక్కరికి ఎంతెంత వాటా వస్తుందని అప్పటికే లెక్కలు కట్టేశాడు మనసులోనే.  

‘‘మిస్టర్ బార్క్లే!ఈ కాగితాల ప్రకారం ఈ సామగ్రి అంతా అమూల్యమైనదే అయిన పక్షంలో, దాని విలువ వెలకట్ట నసాధ్యమైనదని ఢంకాపథంగా చెప్పొచ్చు. అపురూపమైన పురాతన వస్తువులు సేకరించేవారు ఎంత డబ్బిస్తారో అంచనా వేయలేము.ఒక వెయ్యి పౌండ్లు అయినా సరే వారికొక లెక్కలోనివి కావు. అయితే ముందుగానే  కొన్ని వస్తువులు బయటికి తీసి నిర్ధారణ చేసుకోవడం మంచిది. లేకుంటే మన అంచనా పొరపాటైతేనో? ” అన్నాడు ఆర్మ్ స్ట్రాంగ్.

“నేనలా అనుకోను. నా ఊహ సరైనదైతే, అవి దక్షిణ అమెరికా చెందినవాటికన్నా భిన్నంగా మాత్రం ఖచ్చితంగా  ఉండవు.” అని నేను నిశ్చయంగా చెప్పాను. 

“సరే సార్! నేను పద్నాలుగేండ్లుగా అక్కడ వ్యాపారం చేస్తున్నాను. ఇలాంటి పెట్టెను మరెక్కడా నేను చూసుండలేదు. అదొక అపారధనరాశికి ప్రతీక. అత్యంత బరువుందా పెట్టె. తప్పక అందులో అమూల్యసంపద తప్పకుండా ఉండి  ఉంటుంది.  దాన్ని తెరిచి చూస్తే ఎలా ఉంటుంది ?” 

“దాన్ని పగలగొట్టితే అది చెడిపోవచ్చు.” అలార్డైస్ అన్నాడు వారింపుగా.

ఆర్మ్ స్ట్రాంగ్ మోకాళ్లమీద పెట్టె ముందు  కూర్చొని, అతని పొడవైన సన్నని ముక్కును తాళం కప్పకు రెండు మూడు అంగుళాల దూరంలో పెట్టి, కూర్చున్నాడు.             

“పెట్టె ఓక్ కలపతో తయారు చేయబడింది. చాలా పాతకాలం నాటి చెక్క కాబట్టి కొంచెం కుంచించుకు పోయింది. ఒక ఉలి కానీ, బలంగా ,వాడి అంచుగల కత్తి గానీ ఉంటే, ఎటువంటి నష్టం కలగకుండా తాళం తీయగలను.” ధీమాగా చెప్పాడు ఆర్మ్ స్ట్రాంగ్.  

 వాడి అంచుగల కత్తి ప్రస్తావన రాగానే, నాకు  ఓడలో హతుడై ఉన్న ఆ అభాగ్యుని  చేతిలోని కత్తి మదిలో మెదిలింది.

“ఓడలోని అభాగ్యహతుడు ఇటువంటి ప్రయత్నంలో ఉన్న సమయంలోనే చంపబడి ఉండొచ్చు.” అనుమానం వ్యక్తం చేశాను.

“నాకా విషయం తెలీదు సార్! కానీ నేను ఈ పెట్టెను నిశ్చయంగా తెరువ గలను. ఈ లాకర్ లో స్క్రూ డ్రైవరుంది. మిస్టర్ అలార్డైస్! ఈ దీపం పట్టుకో చాలు.మీరంతా చూస్తుండగానే క్షణాలలో పెట్టెను తెరుస్తాను.” అతనికళ్ళలో ఆత్మ విశ్వాసం తళుక్కంటూ ఉంది.

 అత్యుత్సాహం నిండిన కళ్ళతో, దురాశ ఒళ్లంతా ఆవరించిన దూకుడుతో పెట్టె పై మూత మీదకు ఒంగబోతున్న అతన్ని చూసి, 

“కాస్సేపు ఆగవయ్యా!” అని మందలించాను. “ ఇందులో అంత తొందర పడనవసరం లేదు. లేబుల్ చూశావుగా.అందులో ఏముందో గమనించావా?… పెట్టెను తెరవకూడదని హెచ్చరిక మరచిపోకూడదు.  ఆ హెచ్చరికలో  ప్రమాదం ఉండొచ్చు. ఉండకనూ పోవచ్చు. ఏదేమైనా ఆ హెచ్చరికను మనం పాటించి జాగ్రత్తగా ఉండడం మంచిది.”    

 మా పై ఆఫీసరు ఆర్మ్ స్ట్రాంగ్ కు  నా సలహా రుచించలేదు. అతనిలో నిరాశ ఆవరించింది.

“మంచిది సార్!అలాగే. ఒక్కసారి ఆ పెట్టె మనచేజారిందంటే అందులో ఏముందో  శాశ్వతంగా  తెలుసుకునే అవకాశమే ఉండదు.  మన వద్దనే ఉంది కాబట్టి దాన్ని తెరిచిచూసే హక్కు మనకుంటుంది. ఆ హక్కుతో మనం దాన్ని తెరవ్వొచ్చు.”                              “ సరి సరి మిస్టర్ ఆర్మ్ స్ట్రాంగ్! ఈ రాత్రి ఆ పెట్టెను తెరవడానికి వీల్లేదు.” కట్టె విరిచినట్లు మధ్యలోనే కలుగజేసుకొన్నాను. “ అలా ఎందుకు? ఇంతకు ముందు ఆ పెట్టెను యూరోపియన్లు పరీక్షించినట్టు లేబుల్ మీద రాసున్నది కదా?” అలార్డైస్ కలుగజేసుకొన్నాడు.

“ఇక వాదోపవాదాలు అనవసరం” నేను స్థిరంగా అన్నాను. “” “ “ నీ ఇష్టం.” అని  ఆర్మ్ స్ట్రాంగ్ తన చేతిలోని స్క్రూ డ్రైవరును టేబుల్ మీదకు విసిరేసి, భుజాలెగురవేశాడు. అయినా ఆ రాత్రంతా అతడు మాటీమాటికీ చారల పెట్టె వంకనే చూస్స్తుండడం  నేను గమనించాను. 

ప్రధాన కేబిన్ లో ఆఫీసర్లకోసం నిర్మించబడిన గదులున్నాయి.నా గది వాటికి  కొంచెం దూరంలో ఉంది. నా ముగ్గురు సహచరులు వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. నాకు వంతు లేదు.  అందుకే బాగా నిద్రపోయాను.  అత్యవసర పరిస్థితులలో తప్ప నన్నెవ్వరూ లేపరు.

 నా క్రోనో మీటర్– అప్పుడు సమయం  తెల్లవారు ఝామున 3.30 గంటలని చూపిస్తూ ఉంది.

 ఏదో భయంకర శబ్దం నన్ను ఉలిక్కి పడేలా చేసింది.  దిగ్గున మేల్కొన్నాను. నా వొళ్ళు కంపించింది. నా నరనరాలలో విద్యుత్ పాకినట్లైంది.  నేను వెంటనే లేచి నా  బెర్త్ మీద అలాగే కూర్చుండి పోయాను.ఆ శబ్దంతో పాటు–ఒక మనిషి గొంతు నుండి వెలువడిన ఒక చావు కేక తాలూకు హృదయ విదారక ధ్వని నా చెవులను తాకింది. నేను లేచి కూర్చోగానే అంతా నిశ్శబ్దమై పోయింది. అయినా ఎక్కడ్నుంచో అణచిపెట్టినట్టున్న ధ్వనులు నా మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ శబ్దాలు నాకు దగ్గరలో నుంచే వినిపిస్తున్నాయి. నేను స్ప్రింగులా బెర్త్ మీద నుంచి దూకి, చేతికందిన దుస్తులు ధరించి, కేబిన్ వైపు అడుగులేశాను.

 మొదట్లో అక్కడ అసాధారణ వాతావరణం కనిపించలేదు. ఆ చలిలో, మసక వెలుతురులో ఎర్రని క్లాత్ పరచబడిన టేబుల్,ఆరు కుర్చీలు,వేలాడుతున్న బారోమీటరు కనబడ్డాయి. చివరగా చారల పెట్టె కనబడింది. ఇక డెక్ మీదకెళ్ళి , అలార్డైస్ ఆ శబ్దాలు విన్నాడేమో  కనుక్కోవాలని అనుకుంటుండగా, నా కళ్ళు – టేబుల్ కింద  ఒక వస్తువును చూశాయి. అదొక మనిషి కాలు. ఆ కాలికి సముద్రనావికులు తొడుక్కునే పొడవైన బూటు ఉంది. అతని చేతులు ముందుకు చాచబడి ఉన్నాయి.అతని శరీరం మెలితిరిగి ఉంది. ఒక్క చూపుతూనే, ఆ శరీరం ముఖ్యాధికారి  ఆర్మ్ స్ట్రాంగ్ దని, అతను మరణించాడని తెలుసుకున్నాను. ఆ సమయంలో నా ఊపిరి స్తంభించి పోయింది. నేను వెంటనే డెక్ మీదకెళ్ళి, అలార్డైస్ ను డెక్ లోపలికి పిలుచుకొచ్చాను. ఇద్దరం కలసి టేబుల్ కిందున్న ఆ దురదృష్టవంతుణ్ణి బయటికి లాగాము.నెత్తురోడుతున్న అతని తలకేసి చూసి, ఒకరిమొహాలొకరు చూసుకున్నాం.ఎవరి ముఖం ఎంత పేలవంగా ఉందో మాకే తెలియలేదు.

“ఆ స్పానిష్ సైలర్ కు జరిగిందే ఇతని విషయంలో కూడా జరిగింది.” అన్నాన్నేను.   “ అవును. అలాగే జరిగింది.దేవుడు మనల్ని రక్షించాడు. దీనిక్కారణం అదిగో ఆ చారల పెట్టె!… అరే! ఆర్మ్ స్ట్రాంగ్ చేయి వంక చూడు!”  అలార్డైస్ అంటూ, చనిపోయినతని కుడి చేయి పట్టుకొని చూశాడు. హతుని చేతిలో స్క్రూ డ్రైవరుంది. ఆ ముందు రాత్రి దాంతోనే పెట్టెను తెరవాలని ప్రయత్నించాడు. అతను పెట్టె దగ్గర ఉండి ఉంటాడు.  నేను డెక్ మీద, మీరు నిద్రపోయుంటారని అతనికి తెలుసు.అతను ఆ పెట్టె ముందు మోకరిల్లి, ఆ ఆయుధంతో తాళాన్ని తెరచి  ఉంటాడు. అప్పుడు ఏదో జరిగింటుంది. వెంటనే చావు కేక వేసి ఉంటాడు. అదే  మీకు వినబడిన కేక!” 

నేను చేష్టలుడిగి వింటున్నాను.

“అలార్డైస్! అతనికేం జరిగి ఉండొచ్చంటావు?” నేను గొణిగాను.

అతడు నా చెయ్యిపట్టుకొని కేబిన్ లోనికి నడిపించుకుంటూ వెళ్ళాడు.    

“మనం  చాటుగా మాట్లాడుకుందాం సార్! గోడకు చెవులుంటాయ్.ఎవరైనా వింటున్నారేమో మన మాటల్ని.కెప్టెన్ బార్క్ లే. ఆ పెట్టెలో ఏముంటుందని భావిస్తున్నారు?” అని అడిగాడు అలార్డైస్.

“మిస్టర్ అలార్డైస్! నిజంగా నా ఊహకూ ఏదీ  అందడం లేదు. ” అన్నాను.

“మంచిది! నా అభిప్రాయం చెబుతున్నా వినండి. అది అన్ని అంశాలకూ సరిపోతుందని భావిస్తున్నాను. ఆ పెట్టె సైజు చూడండి.దాని చుట్టూ చెక్కడాలూ, లోహపు పని నైపుణ్యం ద్యోతకమౌతున్నాయి.  చిన్న రంధ్రం కూడా కనబడకుండా మూసుకు పోయింది…. మరి దాని బరువు? దాన్ని మోసుకు రావడానికి నలుగురు బలమైన మనుషులు కావాలిసి వచ్చింది. దాని మూతను తెరవడానికి ఇంతకుముందు ఇద్దరు మనుషులు ప్రయత్నించారు. కానీ వారు హతమయ్యారు. అంటే దాని అర్థమేమిటీ?”

“అంటే అందులో మనిషి ఎవరైనా దాక్కుని  ఉన్నాడనా నీ ఉద్దేశ్యం?” అడిగాను

“అందులో  ఒక మనిషి  దాక్కున్నాడనే సార్ , నా అనుమానం. ఆ మనిషి మారణాయుధాలు కలిగి ఉండి, పెట్టె మూత తెరవగానే వారిని చంపుతున్నాడని నమ్ముతున్నాను.”

“నీ వాదన నిజమనుకుందాం. అయితే ఆ మనిషికి ఆహారం,నీళ్ళు?”

“అది విశాలమైన పెట్టె సార్! అందులో కొన్ని ఆహారపదార్థాలు దాచిపెట్టుకొని ఉండొచ్చు. తాగడానికి నీళ్ళ కోసం, మరి ఇతర అవసరాలు తీర్చడం కోసం ఈ ఓడ లోనే అతనికి సహాయం చేసేవాళ్ళుండుంటారు.”

“నీ అభిప్రాయం ప్రకారం పెట్టె మీద రాయబడిన ‘ ఈ పెట్టె తెరవకూడదు’ అనే హెచ్చరిక లోపలున్న మనిషి రక్షణ  కోసమే నన్నమాట.”

“సార్! నా అభిప్రాయమది. మీరేమన్నా మరో విధంగా వివరించగలరా?” 

నా బుర్రకు ఏ ఆలోచనా తట్టడం లేదని ఒప్పుకున్నాను.

“సరే అలార్డైస్! పెట్టె లోపల మనిషి ఎవరైనా ఉంటే, అతన్నెలా బయటికి రప్పించాలో నాకు తెలుసు.” అంటూ కోపంగా అరచి నా గది కెళ్ళి చేతిలో రివాల్వర్ తో వెనక్కొచ్చాను.

“అలార్డైస్! ఇప్పుడు నీవు తాళం తెరు.నీకు రక్షణగా నేనుంటాను.”అన్నాను.

అతను విపరీతంగా భయపడి పోయాడు. నిలువునా  వొణికి పోతూ ,

“సార్! మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు.అందులో, కార్పెట్ మీద పడిన ఒకని  రక్తం ఇంకా ఆరనే లేదు.” గగ్గోలు పెట్టాడు.

“మనం వాడి మీద పగ తీర్చుకోవాలి.”

“సరే సార్! కనీసం కార్పెంటర్ నైనా పిలుద్దాం.ఇద్దరి కంటే ముగ్గురు మేలు కదా? పైగా అతను బలమైన వ్యక్తి.” అంటూ, అలార్డైస్ కార్పెంటర్ ని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. నేనొక్కడినే పెట్టె తో పాటు కాబిన్ లో మిగిలిపోయాను.              

కొంతసేపటికి కార్పెంటరూ, అలార్డైస్ ఇద్దరూ తిరిగొచ్చారు.కార్పెంటర్ చేతిలో సుత్తి ఉంది.

అలార్డైస్ స్క్రూ డ్రైవర్ ను చేత్తో పట్టుకున్నాడు.

“మీ ఇద్దరు నాకు తోడుగా నిలుచుంటే, నేను తాళాన్ని ఊడబెరుకుతాను. లోపలున్న వ్యక్తి పైకి లేస్తే, కార్పెంటర్! నువ్వు వాడి నెత్తి మీద సుత్తితో గట్టిగా కొట్టు .” అని సూచనలిస్తూ, నా వైపు తిరిగి, “సార్! అతడు గాని  చేయెత్తితే నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేయండి.” అని చెబుతూ,  పెట్టె ముందు మోకాళ్ళమీద కూర్చుని, దాని బ్లేడ్ కొసను మూత కిందకు చొప్పించాడు. చిన్న చప్పుడుతో తాళం ఊడి వచ్చింది.

“సిధ్ధంగా ఉండండి.” అని గట్టిగా అరిచాడు. ఒక దీర్ఘ నిశ్వాసంతో, దృఢంగా నున్న పై మూతను తెరిచేశాడు.

అది తెరుచుకోగానే, ఉన్నపాటుగా మేం ముగ్గురం వెనక్కి స్ప్రింగ్ లా గెంతాము. నేను చేతిలోని పిస్టల్ గురి సరిచూసుకున్నాను.కార్పెంటర్ చేతిలోని సుత్తిని పైకెత్తి పట్టుకున్నాడు. అయితే ఏమీ జరగలేదు.మేము ఒక అడుగు ముందుకేసి పెట్టె లోపలికి తొంగిచూశాము.

పెట్టె లోపల యేమీ లేదు. అంతా శూన్యం 

అంటే పూర్తి ఖాళీగా ఉందని చెప్పదానికి లేదు.  అందులో ఒక మూల పసుపు పచ్చని దీపపు స్తంభం పడిఉంది. దానిపై ఉన్న చెక్కడాలు గమనిస్తే ఆ పెట్టె ఎంత పురాతనమో, అది కూడా అంతే పురాతనమైనది తెలిసి పోతూ ఉంది. ఆకర్షణీయ మైన దాని పసుపు రంగు, కళాత్మకత చూస్తే, అదెంతో విలువైన వస్తువని తేలిగ్గా చెప్పొచ్చు. అంతకు మించి బరువైన, విలువైన వేమీ ఆ బరువైన చారల ఇనప్పెట్టెలో లేవు–లోపల పేరుకున్న దుమ్ము తప్ప.  

 అలార్డైస్ శూన్య దృక్కులను, పెట్టె లోపలికి ప్రసరిస్తూ, “ అయితే అంత బరువు ఆ పెట్టె కెలా వచ్చింది?” అరిచాడు.

“పెట్టె పక్క అంచులు, పైనున్న మూతను గమనించు. అవి దాదాపు అయిదు అంగుళాల మందం కలిగి ఉన్నాయి.          

దాని కడ్డంగా ఉంచబడ్డ ఘనమైన ఉక్కు  స్ప్రింగ్ చూడు.”

“అది పై మూతను కదలకుండా దిట్టంగా పట్టి ఉంచడానికోసం.” అలార్డైస్ అన్నాడు.   

“గమనించారా? పై మూత వెనక్కి ఒరగడం లేదు…. జర్మన్ భాషలో చెక్కి ఉన్న ఆ అక్షరాలేమిటీ?” అడిగాడు అలార్డైస్.

“వాటి అర్థమేమిటంటే–అది జోహాన్ రోట్ స్టీన్ ఆఫ్ ఆగ్స్ బర్గ్, చేత 1606 సంవత్సరంలో తయారు చేయబడిందని.”

“పైగా మంచి పనితనం కూడా కనిపిస్తుంది. అయితే ఈ వివరాలు దీని పూర్తి చరిత్ర తెలుసుకొడానికి ఉపయోగ పడవు.  ఆ దీపస్తంభం బంగారుదని ఖచ్చితంగా చెప్పగలను. మన కష్టానికి తగ్గ ఫలితం దొరికింది.ఏ మంటారు కెప్టెన్ బార్క్లే?”

అలార్డైస్ చెబుతూ, దాన్ని బయటికి తీయాలనే ఉద్దేశ్యంతో పెట్టె లోపలికి వంగబోయాడు.

సరిగ్గా  అప్పుడు నా సిక్స్త్ సెన్స్ ఏదో  ప్రమాదం శంకించింది. క్షణంలో వెయ్యోవంతు వ్యవధిలో అతని షర్ట్ కాలర్ పట్టుకొని గట్టిగా వెనక్కి లాగి మళ్ళీ నిటారుగా నిలబెట్టానతన్ని.

నా చర్య వెనుక ఒక కారణం ఉంది. ఆ సమయంలో నాకు అకస్మాత్తుగా మధ్యయుగం నాటి కథ 

 జ్ఞాపకమొచ్చింది.అదీగాక–పెట్టె తాళం పైభాగాన ఎర్రని ప్రదేశం– చిలుము కాదని నా కళ్ళు గుర్తించాయి. అందుకే మెరుపు వేగంతో అలార్డైస్ ను ఇవతలకు లాగాను.     

“లోపల ఒక భూతముంది.ఆ మూల్లో వంకీ కర్ర ఉంది.తీసుకు రా.”చెప్పాను.

 ఆ కర్ర, వాహ్యాళికి  తీసుకెళ్లే సాధారణ చేతికర్ర. దానికొక చివర వంపు తిరిగి ఉంది. దాన్ని  దీపస్తంభం మీదకు పోనిచ్చి,లాగాను.అంతే ఒక మెరుపు మెరిసినట్లుగా, పెట్టె  పైమూత కిందనుంచి, మెరుగుపెట్టిన కోరల వంటి ఉక్కు కత్తుల వరుస ఒకటి  గణగణ శబ్దం చేస్తూ, ఆ ఘనమైన చారల పెట్టె మా ముందు దభాలున  విరుచుకుపడింది–ఒక భయంకర అడవిజంతువు లాగా. తరువాత  అంత భారీ పెట్టె పైమూత కింది భాగంలో – పూర్వం అది ఉన్న స్థానంలో అది వెళ్ళి ఇమిడి పోయింది. దానంతకదే పైమూత మూసుకు పోయింది. కన్నుమూసి తెరిచేలోగా,జరిగిన  ఆ భయంకర సంఘటన సమయంలో అలార్డైస్  అక్కడ ఉండి  ఉంటే, ఆ పదునైన ఉక్కు కడ్డీలు, అతని తలను  ఛిద్రం ఛిద్రం చేసేటివి. ఇంతకుముందటి అభాగ్యహతులకు పట్టిన గతే అతనికి కూడా పట్టిఉండేది.              

 ఒళ్లంతా చెమటలు పట్టిన అలార్డైస్,  టేబుల్ అంచుమీద మీద కూర్చుని భయంతో–బెదిరిన గుర్రంలా– గజగజా  వొణుకు తున్నాడు.

 “నా ప్రాణాల్ని కాపాడినారు కెప్టెన్ బార్క్లే .” అన్నాడు కృతజ్ఞత నిండిన కళ్ళతో. 

 ఇదీ–డాన్ రమిరెజ్ డి లేరా యొక్క  చారల పెట్టె రహస్యం. ఈ విధంగా వెరాకస్ ప్రొవిన్స్ యొక్క తెర్రా ఫిర్మా నుంచి, అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకో గలిగాడు.     

అతను దొంగ కాబట్టి–ఇతర వస్తువుల గురించి పేర్కొన్నాడు కానీ, ఆ బంగారు దీపస్తంభం గురించి చెప్పలేదు. దాని మీద చేయి వేసిన క్షణంలో, భయంకరమైన స్టీల్  స్ప్రింగ్ వదులైఉంటుంది. మారణాయుధమైన ఉక్కు కడ్డీలు అతని తలలోపలికి దూసుకెళ్ళి మెదడును చీల్సి వేసిఉంటాయి.  అప్పుడు కలిగిన షాక్ వల్ల వెనక్కి విరుచుకు పడిపోయి ఉంటాడు. తరువాత పెట్టె మూత అదంతకదే మూసుకుపోయి ఉంటుంది. ఆగ్స్ బర్గ్ కనిపెట్టిన ఆటోమేటిక్ యంత్రానికి బలై, దీని మూలంగా ఇప్పటివరకూ ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకొని ఉంటారో! ఆ భయంకరమైన పెట్టె గురించి కొంచెం ముందుగానే  ఊహించి ఉండడం వల్ల, నేనంత వేగంగా స్పందించగలిగాను.

ఇకముందు భవిష్యత్కాలంలో  ఏ ఒక్కరూ ఈ విచిత్ర మారణాయుధయంత్రానికి బలియై ప్రాణాలు పోగొట్టుకోకూడదనే ఆశయం తో   మేం ముగ్గురమూ కలసి వొట్టి చేతులతోనే, చారల పెట్టెను సముద్రం లోకి తోసివేశాం. అది ఆరువేల అడుగుల లోతుకెళ్ళి బురదలో కూరుకు పోయుంటుంది. ఇక ఎప్పుడో, ఎంతకాలానికో, ఏదో ఒక రోజు  సముద్రపు నీరు ఆవిరై పోయి నేల ఎండిపోయినప్పుడు, అది ఏ వ్యక్తి  దృష్టిలోనైనా పడిన సందర్భంలో–  రహస్యఛేదన నిమిత్తం – ఆ వ్యక్తి పెట్టెను తెరిచి, తలవంచి లోపలికి తొంగిచూసినప్పుడు–జరిగే విధ్వంసం ఊహించుకుంటుంటుంటే నా వొళ్ళు జలదరించింది. అట్టి దురదృష్ట,అభాగ్య   జీవికోసం–సంతాప సూచకంగానా  అన్నట్లు  రెండు కన్నీటి బొట్లు నా చెంపలమీద నుంచి అసంకల్పితంగా జారిపోయాయి.     

శొంఠి జయప్రకాష్

M. Com. చదివారు. సిండికేట్ బ్యాంక్ లో క్లర్క్ గా చేరి 2012లో మేనేజర్ గా పదవీవిరమణ పొందారు. ప్రస్తుత నివాసం హిందూపురం. సాహిత్యం, సంగీత మంటే ఇష్టం. ప్రచురణ పొందిన మొదటి తెలుగు కథ కాగితపు పులి (ఆంధ్రప్రభ వీక్లీ). మొదటి అనువాద కథ పంజరం (విపుల). మూడు అనువాద కథా సంపుటాలు, ఒక్క తెలుగు కథా సంపుటం, రెండు నవలలు ప్రచురణ జరిగింది. ఒక నాటకం DTP లో ఉంది.

Previous Post

ఇంగ్లీషు కథ : దొంగ

Next Post

ఇరానీ కథ : అగ్ని పర్వతం

Next Post
ఇరానీ కథ : అగ్ని పర్వతం

ఇరానీ కథ : అగ్ని పర్వతం

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com