• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

చైనా కథ : అమ్మ

ఎడిటర్ by ఎడిటర్
July 1, 2025
in అనువాద కథలు
0
చైనా కథ : అమ్మ

-3-

బ్రతకాలనే సంకల్పబలం చేతనే అమ్మ త్వరగా కోలుకొన్నది. కొన్నాళ్ళ తరవాత వాకిట ఎండలో అమ్మ కూర్చుంది. ఇంటి స్త్రీజనం చుట్టూ మూగి ఉన్నారు. అమ్మ చెపుతూఉంది: ‘‘పిల్ల ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ ఉంది. నగారాకర్రలవలె కాళ్లు రెండూ కొట్టుకొంటూనే ఉన్నాయి. మంచువంటి తెల్లని శరీరంమీద దుస్తులులేవు…’’

‘‘అమ్మా, నీ కాళ్ళకు మొక్కుతా, మరి చెప్పకు; భయంగా ఉంది.’’ రెండు చేతులతోనూ మొఖం కప్పుకుంది సోనా.

‘‘ముగ్గురు రాక్షసులు కలిసి ఆమెను పట్టుకున్నారు.’’

మనవరాలిని భయపెట్టగలిగినందుకు గర్విస్తూ ఉంది అమ్మ.

‘‘ఒకసారి లేవడాానికి కూడా ఆ పిల్లకు వీలుకాలేదు. మొఖం నేరేడు పండులా నల్లబడి పోయింది. ముసలిపశువు మూలుగువలె మూలుగు మాత్రం వినిపిస్తూ ఉంది. ఎంత దీనంగా చూసిందని! ‘నాలిక కరచి పారెయ్యి, కరచి పట్టుకో జోరుగా.’ ఇంతకంటె ఆమెకు చావే నయ మనిపించేది నాకు.’’

‘‘అమ్మా, అమ్మా’’

పెద్ద కోడలు మొఖం నిర్జీవమైపోయింది.

అలాగే నిష్ఠురంగా అమ్మ చెపుతూనే ఉంది.

‘‘చివరికి అమ్మాయి చచ్చేపోయింది. కాని సహజమైన చావుకాదు. బంగారంవంటి చిన్ని శరీరం మీద రక్తం తేలిపోయింది. ఎంత రక్తం! ప్రసవకాలంలో కూడా ఇంత రక్తం ఉండదు. గుండెలనుండి రక్తం కారిపోయి శరీరమంతా పులముకు పోయింది. ఆమె గుండ్రని స్తనాలు రెండూ కరచి త్రుంచేశా రా పిశాచులు. నీకంటె ఆమె స్తనాలు పెద్దవిగా ఉండేవి మరి!’’

భూతంలా సోనాదిక్కు చూసింది అమ్మ.

‘‘రాక్షసులు, ఆమె చిన్నారి ముఖం, మెత్తని బుగ్గలు ముక్కలు ముక్కలుగా కరిచేవారు; సగం సగం కొరికిన యాపిలుపండు వలె పెద్ద పెద్ద కళ్ళతో నన్ను అమ్మాయి చూస్తూనే ఉంది జాలిగా.’’

అమ్మ ఇపుడు మునుపటి అమ్మగాలేదు. ఎంతో మారిపోయింది. తన కుటుంబం మీద ప్రేమ మరిలేదా? ఉంటే మరి మాటి మాటికీ ఈ కథ చెప్పి వాళ్ళనెందుకు బాధపెడుతుంది? ఆమె కథవిని ఎవరైనా నిట్టూర్పు విడిచారా. ఆమె కోపంతో కేకలు వేస్తూ లేస్తుంది.

‘‘పోండి, పోండి. మూల కూర్చుని ఏడవండి. రెండు రోజులు పోనీ ఆ పిశాచాలు, జపానువాళ్లు మళ్లీ వస్తే…’’

అలాకాక విన్నవాళ్లు కోపంతో ఎర్రబడ్డారా ఆమె సంతోషిస్తుంది. ఊది ఊది మంట రాజేస్తుంది.

పిల్లలు దగ్గరకు చేరితే ఆరంభంలో మాట్లాడకుండా ఊరికే కూచుంటుంది. పిల్లల అమాయకపు చూపులకు భయపడుతుంది. ఏదో సిగ్గూ, బాధా అనుభవిస్తుంది. తన కథ యేమాత్రమూ చెప్పలేదామె.

మనవరాలి మృత్యువు వర్ణిస్తుంది. పదమూడేళ్ళ పిల్లను కామవాంఛకు ఉపయోగించుకొన్నారు. సైనికుల ముష్కర దేహాలక్రింద నలిగిపోతూ ఆ పిల్ల నాయనమ్మనూ, తల్లినీ పిలుస్తూ ఆర్తనాదం చేసింది. కామాంధులైన సైనికులు పాశవికంగా అనుభవించిన తరవాత ఆమెను ఒక మూల పారవేశారు. ఆ తరవాత ఒక్కరోజు మాత్రమే బ్రతికింది. సద్యోమృత దేహం రెండుకళ్ళల్లో నుంచీ కన్నీళ్లు ధారలు కట్టాయి. కొన ఊపిరితో ఉండగానే ఆ పిల్లను నేలమీద ఈడుస్తూ తీసుకుపోవడం చూసింది అమ్మ. బహుశా కుక్కలకు వేస్తారేమో!

తుంగ్‌కుయా చావు రెండుకళ్ళతోనూ చూసింది అమ్మ. ప్రతీ చిన్నవిషయమూ విడవకుండా వర్ణించేది. పెద్ద కోడలు కడుపు తరుక్కు పోతుందని కించిత్తయినా లెక్కచేయదు. తన అభిప్రాయంలో తుంగ్‌కుయా సాహసంకల కుర్రాడు. బైనెట్ల ఎదటనుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఒక రాక్షసుడు ఎంత తీవ్రంగా బైనెట్‌తో పొడిచాడంటే, పోటుతో కిక్కురు మనకుండా కుర్రాడు చచ్చిపోయాడు. ఇలాంటివి చాలా జరిగాయి. ఈ పది రోజుల్లో ఎన్ని ఘోరాలు జరిగాయంటే అమ్మ తన యావజ్జీవంలోనూ అన్ని చూడలేదు; వినలేదు. ఊరిలోని వాళ్లు, వాళ్ళ వాళ్ళ స్వజనం గురించిన భోగట్టా కోసం అమ్మ దగ్గిరికి వచ్చేవాళ్లు. ఒక్కొటొక్కటిగ ఏవిషయాన్నీ వదిలెయ్యకుండా చెప్పేది. వాళ్ళ తండ్రులూ, కొడుకులూ, కోడళ్లూ ఏవిధంగా దురంతాలకు లోనయ్యారో, ఎంతలేసి బాధలు సహించవలసి వచ్చిందో చెప్పేది పూస గ్రుచ్చినట్టు. విన్నవాళ్ళ మీద తనమాటల ప్రభావం పడడం చూచి ఆనందంతో ఉప్పొంగి పోయ్యేది. వాళ్ళలో వేదన రేకెత్తడం గమనించి తనలోని ప్రతీకారవాంఛ వాళ్ళలో వ్యాపింప చేయగలిగినందుకు తృప్తిపడేది.

తనలో విసుగు అనే మాటేలేదు. చెప్పడం ఆరంభించిన మొదటి దినాల్లో మధ్య మధ్య ఆకస్మికంగా ఏడ్చేసేది. ఇప్పడలాకాదు; సమాళించుకుంటుంది. వినేవాళ్ళ ముఖ లక్షణాలు పరికించి ఎలాంటి మాటలు ప్రయోగిస్తే వాళ్ళల్లో తాననుకున్న భావాలు రేకెత్తుతాయో అలాంటి మాటల కోసం వెదకేది. తాను అనుభవించిన అవమాన విషయం కూడా దాచలేదు. జపానువాళ్ళ డేరాలో అన్ని విధాలైన పనులూ చెయ్యవలసివచ్చింది. మురికి బట్టలు ఉతికింది. మైల తీసింది. జపానీ సారా తయారు చేసింది. బెత్తం దెబ్బలు తిన్నాది. చెపుతూ చెపుతూ దుస్తులు తీసి కవుకుదెబ్బలు, నల్లని మచ్చలు చూపించేది.

ఒక చీనా వృద్ధుడితో బలాత్కారంగా సంగమం చెయ్యవలసి కూడా వచ్చిందామెకు. ఆ వృద్ధుణ్ణి అమ్మ మీదికి నిర్బంధంగా ఈ పనికి నియోగించి, చుట్టూ జపాను సైనికులు మూగి తమాషా చేశారు. వృద్ధుడి కన్నీళ్లు అమ్మమీద పడ్డాయి. మెల్లగా ‘నన్ను క్షమించు నా తప్పులేదు నా తప్పులేదు’ అన్నాడతడు.

ప్రతీదినం గ్రామంలో తిరిగి తిరిగి ఈ వృత్తాంతం వినిపించేది అమ్మ. గుంపులు గుంపులుగా జనం మూగేవాళ్లు. ‘‘ఈ ఘోరాలు మీరు మరచి పోతారా?’’ అని ఉద్రేకంతో అడిగేది. వీధుల్లో జనం కనపడకపోతే ఇంటింటికీ వెళ్లి చెప్పేది. జనం స్వంతపనులు ఆపేసి వినేవాళ్లు.

ఈ విధంగా ఊరిలోని బాలగోపాలమూ అందరితో ఆమె పరిచితురాలైంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆమెదగ్గరకు ప్రతీ దినం చేరేవాళ్లు. వాళ్ళకు ఆమె చిరపరిచితురాలైంది. కొన్నాళ్ళకు పిల్లలూ, తల్లులూ అమ్మ వారి ఇంటికి రావడం చూచి ‘పిచ్చిది వచ్చిందిరా బాబూ’ అనుకునే వాళ్లు. ‘తిండెపుడు తింటుందో ఎపుడు పడుకుంటుందో మరి! ఇంటి దగ్గర కాలు నిలువదాయె.’

పెద్ద కోడలు ఒకనాడు ఆపుకోలేక అనేసింది: ‘అమ్మ మునుపటి అమ్మకాదుమరి. రూపాతుంగ్‌కుయాల చావు వర్ణించేటపుడు కూడా ఆమెకళ్లు తడికావు ఇపుడు. ఇలా ఎందుకైందో నాకర్ధంకాదు నిజంగా.’’ చిన్నకోడలు తన భర్త దిక్కు చూసింది. అతని ముఖంలో విషాదచ్ఛాయ కనిపిస్తూ ఉంది. ఒకనాటి విషయం చేన్‌సింగ్ హాన్ మరచిపోలేదు. ఆవాళ వెళుతూ వెళుతూ దారిలో అమ్మ ఉపన్యసిస్తూ ఉండగా విన్నాడు. స్వవిషయం చెపుతూ ఉందామె. అతని రక్తం కుతకుత ఉడికిపోయింది. పిచ్చెత్తినట్టనిపించింది. పెద్ద కేకలు వేయాలో అమ్మను గట్టిగా పట్టుకోవాలో, అక్కడినుండి ఎక్కడికన్నా పరుగెత్తుకు పారిపోవాలో అతడికి తోచలేదు. నిలువునా రావాకులా కంపించిపోయాడు. అమ్మ అంతలో కుమారుణ్ణిచూసి, ఉపన్యాసం తగ్గించి కదలని చూపులతో అతణ్ణి చూడడం మొదలు పెట్టింది. అక్కడి ప్రతీవ్యక్తి తలత్రిప్పి అతణ్ణి చూశారు. కాని ఎవ్వరూ నవ్వలేదు. దగ్గరకు వెళ్లి చెయ్యెత్తి ‘అమ్మా, నీకోసం ప్రతీకారం చేస్తాం’ అన్నాడు. అమ్మ ముఖం వికృతం అయిపోయింది. చాచబోయిన చేయి వెనక్కు తీసేసుకుంది. దెబ్బలాటలో వీగిపోయిన కోడివలె వెనక్కు వెళిపోయింది. ఏడుస్తూ జనం మధ్యకు చూసింది. ఎవ్వరూ మాటాడలేదు. తలలు వంచుకొని, బరువుగా అడుగులు వేసుకుంటూ వెళిపోతున్నారు అంతా. జనశూన్యమైన ఆ దారి మధ్య ఆమె ఒంటరిగా ఉండిపోయింది. శూన్యహృదయంనుండి ఇంకా ఉప్పొంగి వస్తూనే ఉంది మంట, దుఃఖం.

‘‘చూస్తున్నాగా, పిచ్చి ఇంటిల్లి పాదికీ పట్టుకున్నట్టు ఉంది’’ పెద్దకోడలు మళ్లీ అంది. ‘‘అమ్మకు అడ్డుచెప్పరేం? మీకూ ఇది వంటపట్టినట్టు లేదు.’’ తన భర్తను ఉద్దేశించి అన్నదీ మాటలు.

‘‘ఏం చెయ్యమంటావు? అమ్మ నిజంగా చాలా కష్టాలు అనుభవించింది’’

‘‘కష్టాలు ఎవరు పడలేదూ అంటా!’’

ఈ మాటల మీద ఒక అశాంతి సృష్టి చేయడం సింగ్ హాన్‌కు ఇష్టంలేదు. మాటాడకుండా తమ్ముడి దిక్కు చూశాడు. తమ్ముడు తనతో ఏకీభవిస్తున్నట్టున్నాడు. ‘‘అయితే అమ్మను తాళ్ళతో ఇంట్లో కట్టెయ్యమంటారా?’’ అన్నాడు. ‘‘అలా కట్టెయ్యడానికి ఆమె ఎవ్వరికీ హాని చెయ్యలేదు కదా! నా అభిప్రాయంలో అమ్మమీద సోనా ఒక కన్నువేసి ఉంటే మరేగందరగోళమూ ఉండదు.’’

అమ్మ చిన్నకొడుకు మూడోవాడు గ్రామాంతరం నుండి తిరిగివచ్చాడు. అందరిలోకీ ఇతడంటే అమ్మకు ప్రాణం. ఆమె పండుతల మీద చేయిరాస్తూ అతడు ఏడుస్తూ భగ్న కంఠంతో అన్నాడు. ‘‘అమ్మా, తప్పంతానాది. నేనే ఇంటి దగ్గర ఉంటే నిన్ను ఆ దుర్మార్గుల చేత ఎంతమాత్రం పడనిచ్చేవాణ్ణికాదు. విన్నావూ, అమ్మా, సైనికులు ఎపుడూ వారి ఇష్టం వచ్చినట్లు చేయ్యడానికి అధికారంలేదు.’’

‘‘అది నిజవేకానీ, నువ్వు సైన్యంలోనే ఉండాలి కదా!’’ కొడుకును తేరిపార చూసింది. ఇరవై ఏళ్ళ వయస్సు. కాకీ కోటూ, నిక్కరూ మొలలో పిస్తోలూ. ఆమెకు సంతోషం కలిగింది. ఇది తుపాకీ పిస్తోళ్ళ యుగం. ‘‘అయితే బాబూ, నువ్వు ఎంతమంది జపాను వాళ్ళని చంపావో చెప్పూ’’ – కొడుకుతో మరి తనస్వవిషయం– అంటే ఈ మధ్య తనమీద జరిగిన అక్రమం, అత్యాచారం ఏదీ చెప్పవలసిన పనిలేదు. జపాను వాళ్ళతో గొరిల్లా సైన్యం చేసిన యుద్ధం విశేషాలు ఏమన్నా వినాలని ఆమెకాంక్ష. అవి వింటేనే ఆమెకుశాంతి.

‘‘భయపడవుకదా, అయితే విను.’’

చేన్‌లీహాన్ కళ్లు విస్ఫులింగాలులా మెరశాయి. కుదిరికిగా కూర్చొని చెప్పడం ఆరంభించాడు. అతడి దళం మొదట పశ్చిమ ఉయిలో గ్రామంలో ఉండేది. అక్కడ ఇరవైమంది జపాను వాళ్ళను చంపాడతడు. తరవాత తూర్పు ఉయిలో లోనూ గీకగ్రామంలోనూ రెండుసార్లు పోరాడారు. సాన్ ఇయాంగ్ నగరం జయించారు. కాని మళ్ళీ అదివారి చేతుల్లోనుండి పోయింది. ఇపుడు మళ్లీ అక్కడికే వారి ప్రయాణం ఇదంతటిలోనూ ఎందరిని చంపిందీ అతడికి జ్ఞాపకంలేదు. కాని వాళ్ళ మందుగుండుసామానూ, ఆహార పదార్థాలూ అధికంగా వీళ్ళ వశమైనాయి. వీళ్లదళంలోనే సుప్రసిద్ధ వీరుడు చాంగ్‌తాచూయాన్ ఉన్నాడు. చాంగ్‌తాచూయాన్ ఓసారి పట్నం వెళ్లాడు. కూడా ఒక తేలిక మెషీన్‌గన్ ఉంది. భుజంమీద మెషీన్‌గన్ దూదికోటుతో కప్పి పట్టుకున్నాడు. అనేకమైన అవాంతరాలవల్ల పట్నంలో ఏమీ చేయలేకపోయినాడు. అంచేత తిరిగి వెళ్లిపోవచ్చేశాడు. తిరిగి వచ్చేటపుడు పదిమంది జపాను సైనికులతో పోరాడవలసివచ్చింది. పదిమందినీ చంపి పారేశాడు. ఓసారి ఒక జపానువాణ్ణి జీవంతోనే పట్టుకున్నాడు. వాడు ఎంత స్థూలకాయుడంటే వాణ్ణి మోసుకు వెళ్లడానికి ఎంతమందో కావలసివచ్చింది. అయితే ఏం లాభం, దారిలో ఎలాగో తప్పించుకు పారిపోయాడు; మరి పట్టుబడలేదు.

కుతూహలంతో అవన్నీ విన్నది అమ్మ. అవన్నీ తిరిగి తాను అందరికీ చెప్పాకగాని ఊరుకోలేదు. ఇపుడు ఆమెకు మరింత స్వేచ్ఛగాఉంది. ఆమె పెద్దకొడుకు కిసాన్ యూనియన్‌లో వర్కరు; కొత్తవిత్తనాలు కొనడానికి వెళ్లాడు. రెండోకొడుకును సైన్యంలోకి పిలుస్తున్నారు. మూడోవాడు ఇంచుమించు ఇంటిదగ్గర ఉండనే ఉండదు. ఉన్నా ఫరవాలేదు. ఏమంటే అతడి దగ్గర జంకవలసిన పనేలేదు.

ఓనాడు సాయంకాలం వాకిటి ముందుగా పోతూఉన్న రెండు మోటారు ట్రక్కులుచూసి కొడుకుల్ని ప్రశ్నించింది.

‘‘ఇవి మనవాళ్ల ట్రక్కులేనా?’’

‘‘అవును, వీటిల్లో సామాను రవానా అవుతుంది.’’

‘‘సరే ఏమిసామాను రవానా అవుతుందో నాకవసరం లేదు. కాని అవి మనవాళ్లవే అయితేమాత్రం నాకో పనుంది. రేపు ఓసారి ఒయాంగ్ గ్రామం వెళ్లి రావాలి.’’

ఇంటిల్లి పాదీ అమ్మదిక్కు చూశారు.

‘‘జాగా ఉండదా? సామాను తప్ప మరేదీ వెళ్లిందికి వీలుండదా ఏమిటి? వీలుండనీ మాననీ నాకంతా తెలీదు. నేను మాత్రం వెళ్లితీరాలి. నాతమ్ముణ్ణీ వాడి భార్యనీ ఓసారి చూడాలని ఉంది.’’

అడ్డులూ, ఆటంకాలూ ఆమె లక్ష్యపెట్టలేదు. మర్నాడు సోనాను వెంటబెట్టుకొని ట్రక్కులో బయల్దేరింది. ఒయాంగ్ గ్రామానికి.

అక్కడ తన ఆత్మీయజనాన్ని కలుసుకుంది. తాను కళ్లారా చూసినవీ, స్వయంగా అనుభవించినవీ అత్యాచారాలూ, ఘోరాలూ ఆమె వాళ్లతో చెప్పినప్పుడు వాళ్లంతా కన్నీళ్లు కార్చారు. కేవలం కన్నీళ్లేకాదు, భయం, క్రోధమూ కూడా వాళ్ల మొగాలలో తాండవించింది. తరవాత కొడుకు దగ్గర విన్న వీరత్వం వినిపించింది. వాళ్లకు కొంచెం సాంత్వనం కలిగింది. పెదవుల మీద చిన్న చిన్న దరహాస ఛాయలు పొడసూపాయి. యువకులను గొరిల్లా దళంలో చేరడానికి ఒప్పించిందామె. వింటూఉన్న వాళ్లల్లో వెనకాడే లక్షణాలు ఏమాత్రం కనిపించినా తెల్లటి కనుబొమలు ముడివేసి గర్జించేది. ‘‘పిరికి పందలు! నీచులు! మిమ్మల్ని జపాను దెయ్యాలువచ్చి ముక్కలు ముక్కలుగా చెయ్యనీ! పిరికివాళ్లను పిశాచాలు ఎలా విరుచుకు తింటాయో నాకు తెలుసు!’’

అమ్మ మాటలు విని అనేకులు గొరిల్లా దళంలో చేరారు. మధ్య మధ్య కొంతమందిని కొడుకుల దగ్గరకు తీసుకువచ్చి అనేది ‘‘ఇదిగో, వీళ్లు మీలాగే తుపాకీ పుచ్చుకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు.’’

ఒయాంగ్ గ్రామంనుండి తిరిగివచ్చేసేక మరో ఊరువెళ్లింది సోనాను వెంటబెట్టుకొని. ట్రక్కు దొరకనప్పుడు ఇద్దరూ నడుచుకు వెళ్లేవాళ్లు. సోనాను గదమాయించింది అమ్మ. ‘‘జనం ముందు నోరు విప్పవేం?’’ అమ్మను వెంటనంటే ఉండేది సోనా. ఆమెను మనసా ప్రేమించేది. ఆమెనుండి ఆదరణపొంది తృప్తిపడేది. కలిసి కాలినడకను పోతూ ఉన్నప్పుడు సానుభూతితో అమ్మను చూసేది. హృదయానికి ఆమెను హత్తుకొని నిట్టూర్పు విడిచేది అమ్మ. అమ్మ గుండెల్లో వెచ్చదనాన్ని అనుభవించేది సోనా. ఆ వేడిలో విచారం కూడ లేకపోలేదు కొంత.

ఉత్సాహంగల భక్తురాలు అమ్మకి సోనా. అమ్మ లేకుండా జనంతో ప్రసంగించవలసి వచ్చినపుడు అమ్మ మాటల్లోనే మాటాడేది; మాటల్లో కొంచెం తడబాటు ఉంటే ఉండుగాక.

అమ్మ పుత్రవాత్సల్యంలో కూడ ఎంతో మార్పు కనిపిస్తూ ఉంది. కొడుకులు చిన్నవాళ్లుగా ఉన్నంత కాలం వాళ్లు పెంపుడు పిల్లి కూనల్లాగ ఉన్నారు ఆమెదగ్గర. త్వరత్వరగా పెద్దవాళ్లై ఆమె కష్టం తొలగిస్తారనే ఆశ ఉండేది అమ్మకు. పెద్ద వాళ్ళయ్యారు. వాళ్లల్లో జొంబవంతుడులాంటి బలమూ, గరుత్మంతుడులాంటి వేగమూ కుదురుకున్నాయి. కాని అమ్మను మాత్రం వాళ్లు అర్ధం చేసుకోలేదు. అంచేత ఆమె పుత్రప్రేమ ఆమె హృదయంలో ఒక రహస్య స్థానాన్ని చేరుకుంది– నీరవంగా కలత కలతగా కొడుకులతో ఏ నిమిషంలో సంబంధం విడిపోతుందో అన్న భయం ఎల్లప్పుడూ ఆమెను వేధిస్తూనే ఉంది. కొడుకులు మరీ పెద్దవాళ్లయిన కొద్దీ తనకు చెడ్డ దినాలు వచ్చినట్లై తన ప్రకృతిలో ఒక దృఢత్వం అలవడింది. అమ్మ ఊసే పట్టినట్టులేదు వాళ్ల వాలకం చూస్తే. అపుడపుడు వాళ్ల మీద ఓ విధమైన ఏవగింపూ పుట్టేది ఆమెలో. ఐనా కొడుకుల శ్రేయస్సే ఆమెకు ప్రాణం. మాతృహృదయంలో మలినంలేదు. కాని ఇపుడు మరీ ఆమె మాటలూ, భావాలూ అర్ధం కావడంలేదు. తన సంతానాన్ని మరి ప్రేమించడంలేదా? కాక వాళ్లంటే కోపమా? వాళ్లనిపుడు ఇంకో దృష్టి నుండి చూస్తూ ఉంది. జపాను వాళ్లను ఎదిరిస్తూ వాళ్లు తనతో ప్రసంగించేటపుడు పుత్రగర్వంతో ఆమె ఉప్పొంగిపోయేది. ‘ప్రాణం పెట్టి కొడుకుల్ని పెంచిన కష్టం వ్యర్థం కాలేదు’ అనుకునేది. అప్పటి ఆనందదానికి అంతం లేదు.

కొడళ్లు ఇపుడు ఆమెను మరింత గౌరవంతో చూస్తున్నారు. గతంలోని కష్టాలూ, భవిష్యత్తులోని ఆశలూ వారిని పెనవేసుకొని పెరుగుతున్నాయి. అందరూ ఒక్క దగ్గర ఉన్నప్పుడు ఇదే ప్రసంగం చేసేవాళ్లు. ఈ ఐక్యభావం వల్ల లోగడ అపుడపుడు కలిగిన చిలిపి కయ్యాలు మరచిపోయారు. ఇపుడు వారిలో ఉన్నది సాముదాయకమైన ఒకే ఒఖ్క ప్రేమ. ఇలాంటి ఐకమత్యమూ, అనురాగమూ ఆ కుటుంబంలో ముందేనాడూ కనపడలేదు. వారి ఊహాలు, భావాలు ఒక్కటిగానే ఉన్నాయి. ఐతే ఈ పరివర్తనానికి మూల ఖారణం అమ్మే అని మాత్రం వాళ్లెవళ్లూ గ్రహించలేదు.

ఓనాడు కుర్రాళ్లు ఒక చిత్రమైన కబురు తెచ్చారు. ‘అమ్మతో మాటాడిందికి ఎవరో వస్తారట!’ ఇది నిజంగా అమ్మ చేసుకున్న దానికి ప్రతిఫలం. బెంగగా అమ్మ చేతిని పట్టుకుంది నిలబడి సోనా. ఆమెకు ధైర్యం చెపుతూ అంది అమ్మ: 

‘‘భయమెందుకు తల్లి! జపాను వాళ్లు మనకు చేసినంత ఘోరంకంటె అధికం ఎవ్వరూ చెయ్యలేరుకదా! మనం సహించిన దురంతాలకంటె దుర్భరమైనవి మరేమున్నాయి గనక! నరకంలో బాధపడమన్న నేను భయపడనుకదా, ఇంత భయమెందుకు చెప్పూ!’’

పెద్దకోడలు కొంచెం తీవ్రంగా అంది ‘‘మాతో వాళ్లకేంపని? మేం మాట్లాడ్డం కూడా తప్పేనా ఏవిటి? మేం జపాను వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పాంగాని చీనాతో మాకు విరుద్ధం లేదుకదా! మా ప్రసంగం వాళ్ళకేం వచ్చింది?’’

కాని వాళ్లు అమ్మ దగ్గరకు ఎందుకు వస్తున్నట్టు పెద్ద కొడుక్కి ఏమీ బోధపడింది కాదు. సంఘం సభ్యుడొకడు ఓనాడు అతణ్ణి అడిగాడు; ‘అవ్వ మీ అమ్మేనా? ఆమె ఎక్కడ ఉంటుంది?’ అని ఎడ్రసుకూడా రాసుకు పట్టుకెళ్లాడు. సంగతేమిటో అర్ధం కాలేదు. అయితే ప్రమాదమేమీ లేదని మాత్రం తనకు బాగా తెలుసు. అయినా కబురు మాత్రం ఏదో సందేహంగానే అనిపిస్తూ ఉంది. అమ్మ జీవితంలో ఇంతవరకూ బైటివాళ్లెవళ్లూ ఆమెకోసం రాలేదు. ఎవరో వస్తారనగానే అమ్మ మాత్రం ఏమీ చెడ్డ తలంచలేదు. ఆమె బరువైన కనురెప్పలు కొంచెం విప్పారనైనా లేదు.

మర్నాడు ఇద్దరు యువతలు వచ్చారు. ఒకామె అమ్మలాగే సాదాదుస్తులు ధరించింది. రెండో అమ్మాయివి మిలిటరీ దుస్తులు, బాబ్డ్‌జుత్తూ. ఇద్దరూ తక్కువ వయస్సులో లాగే ఉన్నారు. ఆడంబరం లేకండా అమ్మాయీలను ఇద్దరినీ తీసుకువచ్చి ఇంట్లో కూచో పెట్టింది అమ్మ. ఇద్దరూ ప్రసంగం మొదలుపెట్టారు:

‘‘అమ్మా, విన్నారూ, మమ్మల్ని మీరు ఎరక్కపోయినా మిమ్మల్ని మేం చాలా కాలంనుండి ఎరుగుదుం. రెండుసార్లు మీ ఉపన్యాసం కూడా విన్నాం.’’

‘ఉపన్యాసం!’ ఈమాట అర్థంకాక తెల్లపోయింది అమ్మ.

‘‘మీ ఉపన్యాసం విని మేం ఏడవకండా ఉండలేకపోయాం. మీరు జపాను వాళ్ళ మధ్యగడిపారు. నిజంగా కళ్ళారా చూసిందే మీరు చెప్పిన వర్ణన అంతా…’’

వాళ్ల మాటలు విని అమ్మ మనసులో ఒక కలుపుగోరుతనం, స్నేహమూ కుదిరాయి.

‘‘అహా! అయితే వీళ్ళు ఇందుకోసం వచ్చారన్నమాట వినాలని.’’ అనుకుంది లోలోపల. ప్రవాహప్రాయంగా తన కథ చెప్పడం ప్రారంభించింది.

మెదలకుండా చాలాసేపు విన్నారు వాళ్ళు. తరువాత మాటకు అడ్డువచ్చి అన్నారు, ‘‘అమ్మా, వినండి, మీతో మేం సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాం. జపాను వాళ్ళంటే–  ఆ పిశాచాల మాటంటేనే మాకు రోత. వాళ్లను నిరసించడం కంటె మాకింకోపనేలేదు. చీనా మీద జపాను చేసిన దురంతాలకు ప్రతీకారం చెయ్యడం కోసం మేం ఒక సంఘం స్థాపించాం. అయితే చక్కగా మీలా ఉపన్యాసం చేసే వాళ్ళు మాలో ఎవళ్ళూలేరు. మా సంఘంలో మీరూ కలవండి. జపానువాళ్ళ దుర్మార్గాలు అందరికీ తెలియచెయ్యడం, వారితో యుద్ధానికి అవసరమైన పనులుసాగించడం మా ఆదర్శం.’’

వాళ్ళమాటలు పూర్తి కాకుండానే సోనాను పిలిచింది అమ్మ. ‘‘సోనా, వీరు తమ సంఘంలో చేరడం కోసం మనల్ని పిలుస్తున్నారు, ఏమంటావ్!’’ సోనానుండి జవాబు వినిందికి ఆగకుండానే వాళ్ళ దిక్కు తిరిగి ‘‘మేం అంత తెలిసిన వాళ్ళం కాం. మావల్ల ఏమాత్రమైనా పని అవుతుందని మీకుతోస్తే మేం తప్పకుండా మీ సంఘంలో చేరడానికి సిద్ధంగా ఉన్నాం. అలాకాదన్నా మేం ఏమీ అనుకోం. నాకొడుకులు ఇద్దరు గొరిల్లా సైన్యంలో ఉన్నారు. ఒకడు కిసాన్ యూనియన్‌లో పనిచేస్తున్నాడు. ఇందువల్ల మాకుపోయేది కూడా ఏదీలేదు. అయితే నా మనమరాలిని కూడా తీసుకు వెళ్ళాలి’’.

సోనాను సంఘంలో చేర్చడానికి సంతోషంతో అంగీకరించారు వాళ్ళు. అమ్మకోడళ్ళిద్దరూ కూడా సంఘానికి సేవ చేస్తామన్నారు.

అమ్మ చేరిన తరువాత ‘మహిళా సంఘం’ నిమిషాల మీద అభివృద్ధి చెందింది. క్రొత్త సభ్యుల్ని చేర్చడం కోసం ఊరూరూ తిరిగింది అమ్మ. ఆమె సంఘంలో ఉండడం విని వెనకాముందూ ఆడకండా అనేకులు చేరారు. మహత్తరమైన కార్యాలు సాధించడం మొదలు పెట్టింది సంఘం. 

అమ్మను చూసేవాళ్ళు ఆమె శరీరం కంటె వయస్సు తగ్గుతూ ఉన్నట్లు భావించేవాళ్ళఉ.

గడచిన మూడునెలల్లో గొరిల్లా దళం సాధించిన విజయాలను పర్యాలోచించడం కోసం సంఘం యాజమాన్యంలో ఒక మహాసభ ఏర్పాటైంది. సభ జరిగిన దినాన్ని ‘మహిళా దినం’ అన్నారు. చుట్టుప్రక్కల స్త్రీ జనానికి ఆహ్వానాలు వెళ్ళాయి. వయస్సు మాట లేకుండా ఆబాల వృద్ధ యువతులనూ తోడ్కొని వచ్చిందావాళ అమ్మ. ‘తల్లుల చేతులు పట్టుకు నడిచేవాళ్ళూ, చెంకలదిగని వాళ్ళూ– శిశువులు కూడా ఉన్నారు. తల్లులు ఈవాళ పిల్లల గురించి మాట్లాడుకోవడంలేదు. కొందరి పాదాలు కట్టేసే ఉన్నాయి. అయినా వాళ్ళు తోడివాళ్ళతో నడవడం శ్రమ అనుకోలేదు. సంఘశక్తి అందరిలోనూ విజృంభించనట్లుంది.

సమయానికి ముందుగానే సభాస్థలం నిండిపోయింది. అమ్మ కుటుంబం కూడా అందులో ఉంది. పరిచితులైన అనేకులు దూరంనుండే అమ్మను చూసి తలలూపారు. అమ్మ హృదయంలో ఒక ఆవేగం– ఒక గర్వం– ఒక చాంచల్యం. పదిమందినీ కలిసి మాటాడాక ఆవేశం కొంత తగ్గింది.

జనం నిమిష నిమిషానికీ అధికమౌతూ ఉంది. అమ్మ ఆనందానికి అంతంలేదు. ‘ఇంతమందీ మాసంఘంను బలపరుస్తున్నారు’. ఇదీ ఆమె తలంపు.

సభ ఆరంభమైంది. ఎవరో ఉపన్యసిస్తున్నారు. అమ్మ కదలకుండా విన్నది. ఉపన్యాసం అమ్మకు ఆశ్చర్యం కలిగించింది. పొల్లుమాట ఒకటీ లేదు. ఇలాంటి ఉపన్యాసంవిని చలించని వాళ్ళెవరైనా ఉంటారా? దేశసేవకు నడుం కట్టకుండా ఎలా ఉండగలుగుతారు? ఆ తరవాత ఉపన్యాసంకోసం ఆమెకే వచ్చింది పిలుపు.

మొదట కొంచెం జంకువేసింది. కాని వెంటనే ధైర్యం, సాహసం కలిగాయి. హర్షధ్వనుల మధ్య, కరతాళధ్వనుల మధ్య అమ్మ వంగి వంగి వేదికమీదికి వచ్చింది. వేదికమీది నుండి చూస్తే మనుష్యుల తలలు మహాసముద్రంలా కనిపిస్తున్నాయి. అన్ని కళ్ళూ అమ్మమీదే ఉన్నాయి. చూచి ఆమెకు తడబాటు కలిగింది. ఏమి మాటాడాలో తోచలేదు. కొంచెం ఆగి తనస్వంత కధ ఆరంభించింది. ‘‘నేను ముసలిపండును. ఐనా జపానువాళ్ళు వదలలేదు. నా మీద దురంతాలు చేశారు, ఇదిగో చూడండి–’’

శరీరం మీది దుస్తులు తీసిచూపింది; దెబ్బల గుర్తులు. సానుభూతి ధ్వనులు సభనుండి చెలరేగాయి. ‘‘ఇంత మాత్రానికే మీరు దారుణం అనుకుంటున్నారు. కాదు, అంతేకాదు–’ తరవాత ఎవ్వరి సానుభూతినీ అపేక్షించకుండా తాననుభవించిన నిష్ఠురమైన బాధలు, ఘోరమైన కష్టాలు, అత్యాచారాలూ వర్ణించింది. ఆమె ప్రసంగం వింటూ సభ సభంతా కరిగి పోయినట్టైంది. అందరి ముఖాల్లోనూ గంభీరమైన వేదన. వెంటనే అమ్మ అగ్నిశిఖలా విజృంభించింది. ‘‘నేను మీ దయాదాక్షిణ్యాలు కోరడంలేదు. మీ స్థితి మీద మీరు జాలిపడండి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం నేర్చుకొండి. ఇవాళ నేనీ అవస్థ అనుభవించాను. రేపు– రేపు మీరంతా ఒకటై, ఆ పిశాచాలను ఎదిరించకపోతే, నడుం కట్టకపోతే– అయ్యో! ఏమౌతుందో! నాలాంటి దుర్దశ మీకూ కలగకుండా ఉండాలని నా వేదన. నేను ముసిలి దాన్నైపోయాను. ఇక హెచ్చుకష్టం సహించడానికి శక్తిలేదు; చచ్చేసమయం దగ్గిరికి వచ్చేసింది. కాని మీజీవితాలు ఆరంభమౌతూ ఉన్నాయి. మీరు బ్రతకడం అవసరం. జీవితాన్ని అనుభవించే అవకాశమే మీకింకా దొరకడంలేదు. కేవలం దుఃఖాలకోసం, ఆసైతానులకు భోగవస్తువులు కావడం కోసం మాత్రమే మీరు జన్మ ఎత్తారా?’’

బాధగా వేయికంఠాలు ప్రతిధ్వనించాయి. ‘‘మేం బ్రతుకుతాం, ఈ అవమానం సయించం’’ సమస్రకంఠాల ఆవేదనా ఆమె అనుభవించినట్లైంది. ఒకే వాంఛ ఆమె హృదయంలో మిగిలింది; ప్రజల సౌఖ్యం కోసం ఆత్మత్యాగం చేయడం. మరింత గొంతెత్తి ఆరంభించింది.

‘‘కన్న సంతానంలాగు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఐతే ఈ పిశాచాలు నన్నొక్కర్తెనే కోరడం లేదు. మీ అందరినీ కోరుతున్నారు. ఎంతో, ఎంతో రక్తపాతం చేస్తారు వాళ్ళు. నాబోటి పదివేలమందైనా మిమ్మల్ని రక్షించలేరు. ఎవర్ని వారే రక్షించుకోవాలి. బ్రతికే ఉండాలని కోరిక ఉంటే మార్గం వెదకండి. నా కొడుకుల్ని నా కళ్ళ ముందునుండి నిముషం కూడా విడిచి పెట్టని దినాలున్నాయి. ఇపుడు వాళ్ళు గొరిల్లా దళంలో చేరి పోరాడుతున్నారు. ఏదో ఒకనాడు వాళ్ళు చంపబడతారు, నిజమే. కాని గొరిల్లా దళంలో చేరకపోతే అంతకంటే వేగమే చస్తారు. ఈ ఉత్తరక్షణం నుండీ జపాను వాళ్ళను తరిమివేయడానికి ప్రతిజ్ఞ చేస్తేనే మీ ప్రాణాలు సుఖపడతాయి. అందుకు అవసరమైతే పుత్రులు ప్రాణాలు అర్పించనీ. నా కొడుకుల్లో ఒకడు మరణిస్తే అతణ్ణి నేను చిరకాలం జ్ఞాపకం ఉంచుకుంటాను. మీరూ అతణ్ణి మరవలేరు. వాడు మన అందరికోసం ప్రాణం అర్పించిన వాడౌతాడు.’’

మహాప్రవాహంలాగ, జలప్రపాతంలాగ అమ్మ మాటలు దొరిలిపోతూ ఉన్నాయి. ఎలా ఆపడమో ఆమెకు తెలియడంలేదు. ఉద్రేకం వల్ల శరీరం నీరసిస్తూ ఉంది. సరిగ్గా నిలబడలేక పోతూ ఉంది. కంఠం డగ్గుత్తిక పడుతూ ఉంది. గొంతెత్తడం కష్టంగా ఉంది. గాని సభలో మాత్రం కరతాళ ధ్వనులు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. జనం శాంతించడంలేదు. ఇంకా, ఇంకా ఆమె ఉపన్యాసం కావాలి వారికి. 

దిక్కులు ప్రతిధ్వనిస్తూ ఉన్న ఆ కోలాహలంలో, ఊగుతూ ఉన్న శిరస్సులు ఉప్పెనలేచిన సముద్రంలా ఉన్నాయి. శరీరంలోని శక్తి యావత్తూ కూడదీసుకుని అమ్మ చీత్కారం చేసింది. ‘‘చివరి వరకూ మనం పోరాటం సాగించాలి.’’ ఈ మాటలకు జవాబుగా జనంలోనుండి వినిపించింది, చెవులు గింగురుమనే ఒక మహాగర్జన; భయంకరమైన పెద్ద తుఫాను వచ్చి విరుచుకు పడ్డట్టు.

ముందుకు లేచివచ్చిన ఇద్దరి భుజాలమీద శరీరం ఆనుకొని, ఆ సంక్షుభిత ప్రజాసముద్రం దిక్కు చూస్తూ ఉండిపోయింది అమ్మ. ప్రజల విరాట్స్వరూపం ఆమెకు అనుభవానికి వచ్చింది. అంతలో ఆమె వినీల ఆకాశం దిక్కు దృష్టిసారించింది. పురాతనమంతా ముక్క ముక్కలైపోతూ ఉంది. మరో క్రొత్త ప్రపంచం ప్రకాశిస్తూ ఉంది. కన్నీళ్ళల్లో దృష్టి మసకలు వారుతూ ఉంది. ఐనా నవ్యప్రపంచం ఉజ్వలంగా మెరుస్తూ కనిపిస్తూనే ఉంది.

ఎడిటర్

జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

Page 3 of 3
Prev123
Previous Post

సంపాదకీయం : స్వార్థ ప్రయత్నం!

Next Post

ఇంగ్లీషు కథ : దొంగ

Next Post
ఇంగ్లీషు కథ : దొంగ

ఇంగ్లీషు కథ : దొంగ

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com