ఇరానీ కథ . రచయిత్రి: కోడ్సీ కాజీ నూర్ [ ఎక్లిప్స్]
తెలుగు అనువాదం: పి. వి. ఆర్. శివకుమార్
అడుగుల చప్పుడు వినబడటం లేదు. అడుగు జాడలు సైతం కనబడటం లేదు. కానీ, తెలుసు. ఇక్కడే, ఈ చుట్టుప్రక్కలే, అంతటా ఉన్నాడు. గాలిలా, సంతూర్ వాద్యపు నాదంలా… వ్యాపించే ఉన్నాడు – మా మనసుల్లో, స్మృతుల్లో జీవించే ఉన్నాడు.
అని సరిపెట్టుకోగలమా? నేను సరిపెట్టుకునే ప్రయత్నంలో సతమతమవుతున్నాను. అమ్మ? ఆమె వేదనను ఏం చెప్పి అయినా సరిపెట్టగలనా? రగులుతున్న బడబానలనాన్ని, నోటితో’ ఉఫ్’ మని ఊది ఆర్పగలనా?
అమ్మ అలాగే కూర్చుని ఉంది శూన్యంలోకి తదేకంగా చూస్తూ – రోజులు, వారాలు గడుస్తున్నానిశ్చేతనంగా ! ఆ మౌనానికి అర్ధం ఏమిటి? అన్నీ మరచిపోయిందా? లేక ఆ జ్ఞాపకాలన్నీ తుడిచి పెట్టే ప్రయత్నంలో ఉందా?
మరచిపోవటం అసాధ్యం. ఆ జ్ఞాపకాలని మనసు మూలల్లో అణిచిపెట్టే ప్రయత్నం అది! ప్రమాదకరమైన ప్రయత్నం! నిప్పురవ్వని గుప్పిట్లో బంధించే అమాయక ప్రయత్నం! అలానే ప్రయత్నిస్తూ పోతే, నిలువునా బూడిద చేసే ప్రయత్నం.
ఆ మనసులో రగులుతున్న అగ్ని పర్వతం బయటికి లావా చిమ్మటం లేదు. కానీ, ఎన్నాళ్లిలా? కాలుకుంటూ వస్తున్న వత్తితో ఉన్న డైనమైట్ ఎన్నాళ్లు ప్రేలకుండా ఉండగలదు? అలా పేలకముందే, ఎలా చల్లార్చాలి ఆమెని? ఆ ఘనీభవించిన మనస్సముద్రం లోనుంచి ఎలా బయటకు రావాలి ఆ క్షోభ?
మళ్ళీ, మళ్ళీ , ఎన్నవసారో లెక్క తెలియదు, వెళ్ళి ఆ పాత భోషాణాన్ని చిందరవందర చేసి వెతికాను. ఒక్కటి, ఒక్కటంటే ఒక్కటైనా కనపడలేదు, స్మృతిని వెలిగించే గుర్తు! ఒక చదరంగం పావు, ఒక్క క్యారమ్స్ కాయిన్, ఆఖరికి, ఆ సంతూర్ వాయించిన ప్లాస్టిక్ ముక్క…అదికూడా దొరకలేదు – ఇన్ని వస్తువులతో నిండిన ఈ భోషాణం, ఖాళీగా తోస్తోంది.
ఏం చెయ్యాలి? ఏదైనా చెయ్యాలి. ఆ వత్తి పూర్తిగా కాలి , డైనమైట్ ని ఛిద్రం చేయక ముందే, ఏదో ఒకటి చేయాలి!
లేచి బయటకు నడిచాను. టాక్సీ ఎక్కాను. దారిపొడుగూతా రెండువైపులా పేరు తెలియని చెట్లు,
భాష తెలియని శబ్దంతో గాలులు పరుస్తున్నాయి.
టాక్సీ నెమ్మదిగా ఆగిపోయింది. ఆపేశాడు డ్రైవర్.
“ఇక్కడినుంచీ, గతుకులు నిండిన మట్టిబాట. టాక్సీ వెళ్ళదు.” చెప్పాడు.
ఎన్నాళ్లయిందో, తాతగారింటికి వచ్చి. ఎప్పుడూ ఆయన అక్కడకు రావటమే తప్ప, తను ఇటు వచ్చి ఏళ్ళు దాటింది. రోడ్డు పరిస్థితి తెలియదు.
టాక్సీ దిగి, డబ్బులిచ్చేసి, ఆ మట్టిరోడ్డులో నడక సాగిస్తూ, తాతగారిల్లు చేరాను.
గుమ్మంలోకి అడుగు పెట్టగానే, ఎదురొచ్చాడు తాతయ్య. మట్టికొట్టుకు పోయిన కాళ్ళను చూశాడు.
“మేముంటున్న లోకాలిటీ, మునిసిపాలిటీ వాళ్ళకి టౌన్ లో భాగంగా అనిపించదు – టాక్సు లెక్కలు వేసేటప్పుడు తప్ప! మట్టి కొట్టుకుపోయిన రోడ్డుమీద ఇంత తారు అయినా పోయించరు.” అన్నాడు నొచ్చుకుంటూ.
వరండాలో షూ స్టాండ్ మీద ఉన్న గుడ్డ తో షూస్, కాళ్ళు దులుపుకున్నాను. షూస్ అక్కడే విడిచి, లోపలికి నడిచాను.
అయిదు నిమిషాల అసందర్భపు పిచ్చాపాటీ నడిచింది. ఇద్దరి మనసులూ మనసుల్లో లేవు. కప్పుకున్న కపట గాంభీర్యం కాసేపు అక్కడ రాజ్యమేలింది! తాతయ్య ఒక ప్లేట్ లో స్వీటు తీసుకు వచ్చి, నా ముందు పెట్టాడు. తినాలన్న మనసు లేకపోయినా, వద్దనే ఓపిక కూడా లేదు. మాట్లాడకుండా తినేసి, వచ్చిన పని ప్రస్తావించాను. నా ఆలోచన వివరించాను.
“ఏదో ఒక వస్తువు, ఇక్కడేమైనా దొరుకుతుందేమో, చూడు తాతయ్యా!”
ప్రాధేయపడుతున్నట్టే, అడిగాను.
ఆయన నిరాశగా తలూపాడు. “ఏదో ఒక గుర్తు, వాడు ఆడుకున్న చదరంగం కాయినైనా… కనీసం ఒక పాత ఫోటో అయినా…”
తాతయ్య నా వైపు సూటిగా చూశాడు. ఏమీ మాట్లాడలేదు. నేనే అన్నాను,
“వీలయినంత త్వరగా మనం ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలి తాతయ్యా. ఆ కాలుతున్న వత్తి, డైనమైట్ ను చేరక ముందే, అమ్మని మన లోకంలో పడేయాలి.” ఉద్వేగంగా అన్నాను.
తాతయ్య విషాదంగా నవ్వాడు, “పిచ్చి తల్లీ, మీ అమ్మ గురించి నీకేం తెలుసమ్మా? జరిగిన ఘోరం తెలియనన్నాళ్లే ఆమె భ్రమలో గడిపేస్తుంది. జరిగిన విషాదం తెలిస్తే, ఆమె మరి తట్టుకోలేదు. వాడు లేదన్న సత్యాన్ని అంత సునాయాసంగా అంగీకరించ గలదనుకుంటున్నావా?”
తల అడ్డంగా ఊపాను. “లేదు తాతయ్యా, అమ్మ రాజీ పడుతుంది. ముందు ఆమె మనసు కదిలించాలి. గడ్డ కట్టిన దైన్యాన్ని బద్దలు కొట్టాలి. ఆలస్యమైన కొద్దీ, ఆ గుండెలు మరింత గట్టిపడి, భరించలేని బరువెక్కి, మనిషినే కూల్చేస్తాయి. ఆ మనసులో లావా లాగా మరుగుతున్న దుఃఖం, జలపాతంలా బయటకు ఉరకాలి. ఆ దుఃఖం పంచుకునేందుకు మనమంతా ఉన్నామన్న స్పృహ కలగాలి.”
తాతయ్య కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తరవాత లేచి, కలంకారీ అద్దకంతో అందంగా ఉన్న కర్టెన్ తొలగించుకుని, లోపలి గదిలోకి వెళ్ళాడు.
నేను కూర్చొన్న చోటు నుంచి లేచి, ఆ గదిలోని వస్తువులను పరిశీలనగా చూడసాగాను.
ఆ గది ఒక మ్యూజియం ను తలపిస్తోంది! గతకాలపు జ్ఞాపకాల మ్యూజియం.
గోడలమీద ఫోటోలు, గది నిండా పాత వస్తువులు… ప్రతిదాని వెనకా దశాబ్దాల చరిత్ర!
వాటిని పరికిస్తుండగానే, తాతయ్య బయటకు వచ్చాడు. ఆయన చేతిలో, రంగు వెలిసిన అతి పాత న్యూస్ పేపర్ లో చుట్టబడిన వస్తువేదో కనబడింది.
దగ్గరగా వచ్చి, జాగ్రత్తగా ఆ న్యూస్ పేపర్ మడతని నా చేతుల్లో పెట్టాడు తాతయ్య.
ఆత్రంగా అందుకుని, మడతలు విప్పాను. ఒకో మడతా విప్పుతుంటే, మడతల దగ్గరే చిరిగి పోతుందేమో నన్న భయం కలిగింది. అలాగే జాగ్రత్తగా విప్పాను. ఒకటొకటిగా నాలుగు మడతల్లో అతి భద్రంగా చుట్టబడ్డ ఫోటో , చివరకు బయటపడింది –
లేలేత ముఖంతో, తల కొద్దిగా వంచుకుని, దీక్షగా సంతుర్ వాయిస్తున్న సుకుమారుడైన యువకుడి చిత్రం అది! నల్లనైన ఉంగరాల జుట్టు అలవోకగా నుదుటి పై పడుతోంది.
దానిని లక్ష్య పెట్టనట్లుగా, ప్రాణంలేని ప్లాస్టిక్ స్ట్రిప్ లతో, సుతారంగా సంతుర్ వాయిద్యానికి ప్రాణం పోస్తూ, దివ్య నాదాన్ని సృజిస్తుంటే, అవిరామంగా కదులుతున్నఅతని రెండు చేతుల వేళ్ళు బ్లర్ అయి కనిపిస్తున్నాయి. నల్లని పొడవైన కనుబొమల క్రింద అరమోడ్చిన కనురెప్పలు… ఆ రెప్పల క్రింద దాగున్న తేనె రంగు కళ్ళు నాకు తెలుసు!
నా కళ్ళు అప్రయత్నంగా తడిసాయి.
“మీ అమ్మ ఈ ఫోటో చూసిందంటే, ఆమె గుండె ఆగిపోతుంది.” అన్నాడు తాతయ్య, ఆయన గొంతులో అదో వణుకు.
“లేదు తాతయ్యా, ఆమె గుండెలు ఆగిపోవు. ఆర్ద్రంగా స్పందిస్తాయి.” నమ్మకంగా అన్నాను. ఆయన ‘అదే జరగాలన్నట్టు’ నా భుజం తట్టాడు.
ఇంటికి వస్తూనే, ఆ ఫోటో ను నా దగ్గర ఉన్న వెండి ఫ్రేమ్ లో అమర్చాను. అమ్మ కూర్చొన్న మంచం ఎదురుగా గోడకి తగిలించాను.
నెమ్మదిగా అమ్మ కళ్ళు ఆ ఫ్రేమ్ మీద పడ్డాయి. అమ్మ కళ్లలో కదలిక. చూపులో నైశిత్యం!
మంచం దిగి వచ్చింది. ఆ ఫోటో ముందు నిలబడింది.
“ఎక్కడ దొరికింది ఈ ఫోటో నీకు?”
కంపిత స్వరంతో అడిగింది. అది అమ్మ గొంతులా లేదు. ఎన్నడూ వినని వింత స్వరం.
“ నా బుర్రలో దొరికింది. నీ మనసులోనే దొరికింది.” అన్నాను, కొద్దిగా జంకుతూనే.
“తీసెయ్. ఈ ఫోటో ఇక్కడినుంచి తీసెయ్.” అంటూ హిస్టీరికల్ గా అరిచింది అమ్మ. నేను మౌనం వహించాను. కొద్ది నిముషాల్లో అమ్మ గొంతులోని కరుకుదనం తగ్గిపోతూ, ఏడుపుగా రూపాంతరం చెందింది. క్రమంగా చూపు నా వైపు త్రిప్పి, బెక్కుతోంది. ఎర్రబారిన ఆమె కళ్ళలో అంతులేని విషాదం. ఆమెని అలాగే, పదినిముషాలు వదిలేసి, తరవాత నెమ్మదిగా అన్నాను,
“కొద్దిగా టీ తీసుకొస్తాను.”
జవాబు రాలేదు. ప్రతిఘటన రాకపోవటమే పెద్ద జవాబు. గబగబా వంట గదిలోకి నడిచాను. అమ్మ రోదన, వంటగదిలోకి కూడా సన్నగా వినిపిస్తూనే ఉంది.
అంతలో, సంతూర్ వాదన! ఎప్పటిలాగే, పక్కింటి అబ్బాయి ప్రాక్టీస్ చేస్తున్న సంతూర్ వాదన.
ఆ శబ్దాన్ని వెలివేస్తూ, ప్రతిరోజూ కిటికీ తలుపులు మూసి వేసే నేను ఈ రోజు ఆ పని చేయలేదు. రోజూ చూస్తున్నట్టు అమ్మ వైపు అపరాధ భావంతో చూడలేదు.
మౌనంగా టీ తీసుకు వెళ్ళి, ఆమెకి అందించాను. అమ్మ కప్పు అందుకుని, పక్కనున్న బల్ల మీద పెట్టింది. కప్పు అందుకుంది. అది చాలు నాకు.
తను లేచి వెళ్ళి, ఆ ఫోటో ముందు నిలబడింది.
“ఇలాగే, సరిగ్గా ఇలాగే వాయించేవాడు…” రుద్ధ కంఠంతో అంటూ, ఆ ఫోటో ఫ్రేమ్ ని గోడ నుంచి తీసి, తన చేతి లోని లేత గులాబీ రంగు రుమాలుతో శుభ్రంగా తుడిచింది. పసి బిడ్డ కందిపోతాడేమోనని సుకుమారంగా రుద్దుతూ స్నానం చేయించినట్లుగా తుడిచింది.
తరవాత దాన్ని తన ముఖం దగ్గరగా తెచ్చుకుని, తదేకంగా చూస్తూ నిలబడిపోయింది.
ఒక నిముషం గడిచాక, పెదాలు ఆనించి, ఆ ఫోటోని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. ఒక్కసారి భోరుమంటూ గుండెలకు హత్తుకుంది.
ఆ ఫోటోలోని గిరజాల ముంగురులు చెదరలేదు. అరమోడ్పు కనులు విడివడలేదు. అయినా సరే, ఆ కను రెప్పల క్రింది తేనేరంగు కళ్ల లోని కళ నాకు కనుపించింది.
అగ్ని పర్వతం పైన నేనాశించిన మంచు వాన కురిసింది.
![]()

వృత్తి రీత్యా ఇంజనీర్. గత అరవై ఏళ్ళుగా కథలు రాస్తున్నారు. మూడువందల యాభై పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వాటిలో నలభై ఆరు కథలకు బహుమతులు వచ్చాయి. విపులలో యాభై పైగా అనువాద కథలు రాశారు. అయిదు కథా సంపుటాలు, పి వి ఆర్ శివకుమార్ కథానికలు, కిరణం, అతిథి(కి)దేవుడు,నీదే గానీ నీదే కాదు, అవ్యక్త రాగం, మూడు నవలలు, శమంత -హేమంత, జీవన పోరాటంలో ఆశలు ఆరాటం, ఆచరణల్లో ఆదర్శాలు పుస్తకాలుగా వచ్చాయి. 70 వ దశకంలో హైదరాబాద్ ఆకాశవాణిలో నాటికలు, ఇతర కార్యక్రమాలు యాభై దాకా ప్రసారమయ్యాయి.




Discussion about this post