• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

తమిళ నవల : తెల్ల ఏనుగు (అధ్యాయం 1)

కుమార్ ఎస్ by కుమార్ ఎస్
July 2, 2025
in అనువాద కథలు
0
తమిళ నవల : తెల్ల ఏనుగు (అధ్యాయం 1)

తమిళ మూలం – జయమోహన్ రచన : ‘వెల్లై యానై’

తెలుగు అనువాదం : కుమార్. ఎస్ , అవినేని భాస్కర్. 

తెల్లఏనుగు పుస్తకం (మొత్తం14 అధ్యాయాలు) ఆగస్టు లో ఛాయా పబ్లిషర్స్ ద్వారా మార్కెట్ లోకి రానుంది. కథావసుధ పాఠకులకోసం ముందుగానే రెండు అధ్యాయాలు మాత్రం ప్రత్యేకం. జులై సంచికలో 1వ అధ్యాయం, ఆగస్టు సంచికలో 2వ అధ్యాయం పబ్లిష్ అవుతాయి. ఆ తర్వాత పుస్తకం మార్కెట్లోకి వస్తుంది. 

-1-

దూరంగా ఏదో కదిలినట్టు అనిపించి ఏడెన్ బిర్న్ కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు. వెంటనే అతని కుడి చేయి తుపాకీ మీదికీ ఎడమ చేయి గుర్రపు జీను మీదికి వెళ్ళాయి. కాళ్ళు గుర్రానికి రెండు పక్కలా బిగుసుకున్నాయి. మరుక్షణంలో తానెక్కడున్నాడో గుర్తుకొచ్చి ఏడెన్ నెమ్మదించాడు. పెదాల మీద ఓ చిరునవ్వు మెరిసింది. ఈ 1878 వ సంవత్సరంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు ఆధిపత్యంలో ఉన్న మద్రాసు పట్టణంలోని ఈ సెయింట్ జార్జి కోట సమీపాన తనకొచ్చే ప్రమాదం ఏముంటుంది?

ఏడెన్ తలపైనున్న టోపీ తీసి ఎర్ర గోధుమ రంగులో ఉన్న తన జుట్టు సవరించుకుని మళ్ళీ దాన్ని  తల మీద యధావిధిగా  పెట్టుకున్నాడు. పొద్దుటి సూర్యుడు ఇంకా ఒళ్ళు సరిగా విరుచుకోలేదు.  ఏడెన్ జుట్టు మాత్రం చెమటతో తడిసి ముద్దై పోయి ఉంది. వీపుకు అతుక్కుపోయిన తెల్ల చొక్కాకు సముద్రపు గాలి తగిలి వెళ్ళడంతో చర్మం మీది జిడ్డుతో చల్లదనం వచ్చి కలిసింది. రాత్రంతా చెలరేగిన దక్షిణపు గాలి, సముద్రపు ఒడ్డునున్న ఇసుకను లేపి తీసుకొచ్చి కడప నాప రాళ్ళు పరిచిన బాట మీద దట్టంగా చల్లిపోయింది. నల్ల రాతి కట్టడాల పైనుంచి ఆ నున్నని ఇసుక,  ఆవిరి పరదాలా కనపడుతోన్న గాలి దుమారంలో చిక్కి సుళ్ళు తిరుగుతూ దూరంగా వెళ్ళి  జలతారు పట్టబట్టలా పక్కకు తప్పుకుంది. 

ఏడెన్ గుర్రాన్ని నెమ్మదిగా ముందుకు నడిపించాడు.  దూరాన కదులుతున్నదేదో సరిగా చూద్దామని మళ్ళీ అటువైపు చూశాడు. చెట్టు నీడలో రెండు ఆకారాలు దగ్గరగా ఒదిగి కూర్చునివున్నాయి. నల్ల కూలీలిద్దరు మురికి పట్టిన తెల్లబట్టలు వేసుకుని ఉన్నారు. వాళ్ళేం చేస్తున్నారో సరిగా తెలీడం లేదు. వేళ్ళూనుకునున్న పెద్ద చెట్టు కింద కూర్చుని ఉన్నారు. చెట్టు గాలికి మెల్లగా ఊగుతోంది. వాళ్ళు సరిగా కనపడటంలేదు. కళ్ళెం బిగుసుకుంటూంటే సముదాయిస్తూ మెల్లగా గుర్రం మెడ మీద తట్టాడు ఏడెన్. గుర్రం తన  కళ్ళెం నోటితో కొరుకుతూ బుస్సుమని గాలి వదులుతూ ముందు కాళ్ళ గిట్టలతో నేల మీద శబ్దం చేస్తూ సకిలించింది. కుడి వైపున ఉన్న సముద్రం నుండి  తేమతో కూడిన గాలులు బయలుదేరి, పొంగి పొర్లుతున్న అలల మీదుగా ప్రయాణించి నగరం పైకొచ్చి ద్రవీభవించి కుండ పోత వర్షం కింద మారాయి. 

దూరాన గుంపుగా కన్పడుతోన్న సరుగుడు చెట్లు, కొబ్బరి చెట్లు గాలి ధాటికి వంగిపోయి నేల అంచును తాకుతున్నట్టున్నాయి. గాలి కెరటాలతో పాటూ అపుడపుడూ పైకి లేస్తూ ఆ చెట్లు ఊయలలూగుతున్నాయి. ఎక్కణ్ణించో ఒంటరిగా వస్తున్న గుర్రపు బగ్గీ, గుఱ్ఱానెక్కి స్వారీ చేసుకుంటూ వస్తున్న  ఓ ఒంటరి పోలీసు తప్ప ఆ సమయంలో మెరీనా తీర ప్రాంతం అంతా నిర్జనంగా ఉంది.  

ఏడెన్ తన అప్రమత్తతకు కొద్దిగా ఆశ్చర్యపోయాడు. ఏడెన్‌కు  ఏడేళ్ళ వయసున్నప్పటి నించీ నాన్నతో కలిసి చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో వేటకెళ్ళేవాడు.  ఆరోజుల్నించీ స్వాభావికంగా అలవడ్డ గుణమది. వాళ్ళ కుటుంబం ఐర్లాండ్‌లోని కెర్రీ కౌంటీ, టూమిష్ పర్వత సానువుల్లో కాపురముండేది. నాన్న వందకు పైగా పాడి పశువుల్ని పెంచి పోషించేవాడు. పశువుల్ని మేతకు తీసుకెళుతూ వాటితో పాటూ అక్కడున్న పచ్చిక బయళ్ళలో తిరగడం తోటే ఏడెన్‌కు సమయం అంతా  గడిచేది. పశువుల్ని కాయడం వేటకెళ్ళడం కాకుండా సాయంకాలప్పూట తప్ప తాగి వడ్ల కొట్టాల్లా ఉండే సారా దుకాణాల్లో నేల మీద పడి దొర్లటం అనేది ఒక వ్యాపకం అనుకుంటే తప్ప, సమయం వెళ్ళబుచ్చటానికి వేరే అవకాశం ఉండేది కాదు. నాన్న చాలా మంచి వేటగాడు. వేటగాళ్ళందరిలాగే ఒంటరితనాన్ని ఆస్వాదించేవాడు. ‘ఒంటరితనం వేటకు పురికొల్పుతుందా లేదంటే వేటకెళ్ళటం ఒంటరి తనానికి దారి తీస్తుందా?’ ఏదైతేనేం ఆయన ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఆయన్ను ‘ఇంటి దూలం’  అంటూ మారుపేరుతో  పిల్చుకునేది అమ్మ. అమ్మ ఆ మాట ఆయనకు వినిపించేట్టుగా బిగ్గరగా అన్నా కూడా ఆయన పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అందరి మధ్యలో ఉన్నట్టు కనపడ్డా, కనిపించని గాజు తెర వెనకాల ఉంటూ వేరే ప్రపంచంలో జీవించేవాడాయన. 

చీకట్లు తొలిగి పశువుల్ని మేతకు తోలుకెళ్ళడంతో మొదలైన రోజు, మధ్యాహ్నం  వేటకెళ్ళడంతో ముందుకెళ్ళి, సంజె తన రంగు మార్చుకొని సాయంత్రాన్ని చీకటితో కమ్మేయడంతో చివరికొచ్చేది. నాన్న మట్టి వాసన కమ్ముకున్న బూట్లతో చెమటతో ఆవిర్లొస్తున్న శరీరంతో నెమ్మదిగా నడుస్తూ ఇంట్లోకొచ్చేవాడు. టోపీ తీసి పక్కన గోడకు తగిలిస్తూ “జీసస్” అని గొణిగేవాడు. ఆ తర్వాత ఆయన గొంతు మూసుకపోయేది. అమ్మ ఇంట్లో ఆయనున్నా లేకున్నా ఒకటే అన్నట్లుండేది. అన్యా, ఐలీన్ ఆయనకేం కావాలో అంతా వాళ్ళే చూసుకునేవాళ్ళు. 

ఇంటి ఆవరణలోనే  పక్కన ఒక చిన్న గది ఉండేది.  కప్పు బాగా కిందికి ఉండే ఆ  గదిలో రాత్రి భోజనం చేసేవాళ్ళు. భోజనం తినడానికి ఉపయోగించే చెక్క బల్ల నాన్న తన చేత్తో తయారుచేసింది. భోజనంలో ఎప్పుడు చూసినా క్యాబేజీ సూప్. సూప్ ఆయన ముందుంచితే కళ్ళు మూసుకుని కొంతసేపు మౌనంగా ఉండేవాడు. అందరూ ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తూ చెవులు రిక్కించి ఆయన నోట్లోంచి శబ్దం ఏదన్నా వస్తోందా? అని వినేవాళ్ళు. ఆయన నిట్టూర్పు విడిచి “ఆమెన్” అనగానే, లియామ్ స్పూను సూపులోకి వదిలిన శబ్దం వినపడేది. లియామ్ శబ్దం చేస్తూ చప్పరిస్తూ సూప్ తాగుతూంటే నాన్న ఒక్కోసారి కళ్ళు చిన్నవి చేసి చూసేవాడు.  కానీ ఏం అనేవాడు కాదు. అన్నం తిన్నంతసేపూ ఆయన నోట్లోంచి ఒక్క మాట కూడా వచ్చేది కాదు. 

ఆయన ఇంట్లో ఉండటం చాలా అరుదు. వాతావరణం సరిగా లేక పశువుల్ని మేతకు తీసుకెళ్ళే అవకాశం లేకపోతే మాత్రమే ఇంట్లో ఉండిపోయేవాడు. పొద్దస్తమానం తనకంటూ తాను ఏదో ఒక పని సృష్టించుకునేవాడు. పశువుల్ని కట్టేయడానికి చెక్కతో దిమ్మలను తయారు చేసేవాడు. వలిచి పెట్టి ఉన్న చర్మాన్ని ముక్కలుగా చేసి ఎండ పెట్టేవాడు. గుర్రం జీన్లు బాగు చేసేవాడు. చెక్కలుపయోగించి పెట్టెలు తయారు చేసేవాడు. పొద్దుగూకగానే గ్లాసులో రమ్ము నింపుకుని, గ్లాసు చేతిలో పట్టుకుని చల్లబడ్డ ఆకాశాన్ని చూస్తూ సమయం గడిపేవాడు. ఊళ్ళో ఉండే ప్రతి జీవి ఆయనకు పరిచయమే కానీ స్నేహితుడనేవాడు ఒక్కడూ ఉండేవాడు కాదు. మొత్తం మీద ఆయన సంతోషంగా ఉన్నాడా లేదా విచారంగా ఉన్నాడా అన్నది మాత్రమే ఏడెన్‌కు అర్థం అయ్యేది. 

అయితే ఆయనతో ఉన్నంతసేపూ ఏడెన్‌లో ఏదో తెలీని సంతోషం పెల్లుబికేది. ఆ కారణం చేత నాన్నను ఎప్పుడు తలచుకున్నా ఏడెన్‌  మనసు ఆహ్లాదంగా మారిపోతుంది. ఎప్పుడైనా వాళ్ళిద్దరూ కల్సి వేటకెళ్ళినప్పుడు మాత్రమే ఆయన ఏడెన్​​‌‌తో మాట్లాట్టం జరిగేది. అది కూడా ఒకటో రెండో మాటలు. ఆ రెండు మాటలైనా నాన్న గంభీర స్వరం చెవిలో  పడుతూంటే అతనికి ఆనందంగా ఉండేది.  ఎప్పుడైనా తన భుజాల మీద ఆయన చేతులు  పెట్టి నిల్చున్నప్పుడు ఏడెన్ విపరీతంగా  సంతోషపడేవాడు. ఇరవై ఐదేళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయిన తర్వాత కూడా ఆ స్పర్శ తాలూకు అనుభూతి ఏడెన్‌ను విడిచిపెట్టి వెళ్ళలేదు. ఈ రోజుకీ ‘పట్టుకో, పట్టుకో, దాన్ని పోనీయొద్దు,’ అని పళ్ళు బిగబట్టి  పొడిపొడి మాటలు మాట్లాడుతూ ఆయన ఏడెన్ కలల్లోకి వచ్చి పలకరిస్తూంటాడు. 

‘నాన్న నించి అసలు నేనేమన్నా నేర్చుకున్నానా లేదా?’ అని అపుడపుడూ ఏడెన్‌ ఆలోచిస్తూంటాడు. 

తండ్రి లక్షణాలేవీ రాలేదతనికి.  పర్వతాలన్నా పచ్చిక బయళ్ళన్నా ఇష్టం ఉండేది కానీ కొద్ది కాలం తర్వాత వేటకెళ్ళటం పశువుల్ని మేపటం అంటే ఏడెన్  పెద్దగా ఇష్టపడేవాడు కాదు. కనుచూపు మేరంతా ఎగుడు దిగుడుగా పరుచుకుని ఉన్న పచ్చిక బయళ్ళు ఒక మార్మిక పుస్తకంలోని పేజీలలా అనిపించేవతనికి. ఆకాశాన్నంటే పర్వత శిఖరాలు ఎవరో తలవంచుకుని మౌనం పాటిస్తున్న వ్యక్తిలా కనపడేవి. కొత్త విషయాలు తెలుసుకోడానికి తరసి పోయేవాడు. తరచూ  ఆలోచనల్లో మునిగిపోయేవాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కొండల్నీ లోయల్నీ, రాతల్లో బంధించటానికి సాహసించేవాడు. 

కాగితం మీది అక్షరాలు ఏడెన్‌ను పరవశుణ్ణి చేసేవి. వాళ్ళింట్లో రెండంటే రెండే పుస్తకాలుండేవి. మొదటిది సన్నటి బూడిదరంగు కలపతో చేసిన పెట్టెలో దాచిన బైబిల్, పురాతన కాలానికి చెందింది. న్యూ టెస్టమెంటును చేత్తో తయారు చేసిన దళసరి కాగితం మీద పెద్ద అక్షరాలలో ముద్రించారు. బరువు ఎక్కువ అవడం వల్ల పుస్తకం చదవాలంటే దాన్ని బల్ల మీద పెట్టుకుని పేజీలు తిప్పాల్సివచ్చేది. వాళ్ళింట్లో ఏడెన్  ఒక్కడే ఆ పుస్తకాన్ని తెరిచేవాడు. బైబిల్‌ లోని వాక్యాలతో పాటూ వాళ్ళ తాత గారు అక్కడక్కడా చేత్తో రాసిన పదాలు, తేదీలు చిన్నతనంలో అతని బుర్రలో ఎంతగా ముద్రించుకుపోయాయంటే బైబిల్ తరతరాల నించి తమకు  వారసత్వంగా సంక్రమిస్తున్న  ఆస్తి అనుకునేవాడు. రెండోది షేక్స్పియర్ నాటకాల పుస్తకం. దాంట్లో నాలుగు నాటకాలుండేవి. చదవటం అలవాటైనప్పటినించీ ఏడెన్ వాటిని అదే పనిగా చదివేవాడు. విషయం ఏమీ అర్థం కాకపోయినా మాక్బెత్, ఒథెల్లో, కింగ్ లియర్, ది టెంపెస్ట్‌ నాటకాలను కంఠతా పట్టేసాడు. 

ఫాదర్ ఇయాన్, ఏడెన్ షేక్‌స్పియర్ నాటకాలు అప్పచెప్పటం చూసి తీసికెళ్ళి చర్చి నడిపే స్కూల్లో వేశారు. నాన్న స్కూల్లో చేరమని కానీ చేరొద్దని కానీ అనలేదు.  ఆయన తనకు ఈ విషయంతో ఏమాత్రం సంబంధం లేనట్టు ప్రవర్తించాడని చెప్పొచ్చు. ఏడెన్‌కు మాత్రం స్కూల్లో చేరి చదువు కోవడం అంటే రెక్కలొచ్చి ఎగిరినంత సంతోషం కలిగింది. ఎన్నో రోజుల తర్వాత ముసురు పట్టిన మబ్బులు తెరుచుకుని వెలుగు తొంగిచూసినట్టు, సంకెళ్ళు తెంచుకుని తాను  పచ్చిక బయళ్ళల్లో పిచ్చిగా పరిగెత్తుతున్నట్టు అనిపించింది. కొండ శిఖరానున్న ధ్యాన మందిరంలో ఏకాంతంగా ప్రార్థన చేస్తూ శూన్యంలో లీనమైపోయిన అనుభూతిని పొందాడతను. 

ఏడెన్‌కు యూనివర్సిటీలో చేరాలన్న కోరిక ఉంది. కానీ అందుకు కావాల్సిన డబ్బులు నాన్న దగ్గర లేవని తెలుసు. ఆ కాలంలో ఐర్లాండ్‌లోని పశువులన్నీ ఏదో వ్యాధి బారిన పడి చనిపోతున్నాయి.  నిమ్మళంగా నిశ్చయంగా ఊరూరా కరువు వ్యాపిస్తోంది. ప్రజలు గుంపులు గుంపులుగా తమ ఇళ్ళనూ పశువుల కొట్టాలనీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. దేశమంతా అమెరికాకు వలస వెళ్ళిపోవాలని కలవరించడం, కలలు గనడం మొదలెట్టింది. 

నాన్న రాను రానూ మరీ ఒంటరిగా ఉండిపోవడం మొదలెట్టాడు. ఆయన ఎప్పుడూ డబ్లిన్ నించి ‘డబుల్ బారెల్’ బ్రాండ్ సిగార్లు తెప్పించుకుని తాగేవాడు. అలాంటివాడిప్పుడు చుట్టుపక్కల సంతల్లో దొరికే నాసిరకం పొగాకు తెచ్చుకుని నిప్పుల మీద కాల్చి చుట్ట చుట్టుకుని తాగుతున్నాడు. లావుగా ఉండే ఆ చుట్టలు, నిలవబెట్టిన కొండ చెక్క వాసన వచ్చేవి. ఆ చుట్టలు తాగుతున్నప్పుడు ఆయన గుండెల్లోంచి కుళ్ళిన వాసనతో పొగ బయటికొచ్చేది.  

ఏడెన్ ‘నేను మిలిటరీలో చేరతాను,’ అని చెప్పినప్పుడు ఆయన చుట్ట నోట్లోంచి తీసి ఏదో చెప్పబోతున్నట్టు నోరు విప్పాడు. కానీ మరు క్షణంలోనే చుట్ట పళ్ళ మధ్య పెట్టేసుకుని గుర్రం జీను సరిచేసే పనిలో పడిపోయాడు. 

“నాకు  పాలనా నిర్వహణలో శిక్షణ ఇస్తారు. పై చదువులు చదువుకోవాలనుకునే నాలాంటి వాళ్ళకు వేరే దారి లేదు.”

ఏడెన్ మొహంలోకి నేరుగా చూడకుండా “అయితే ఇండియాకు వెళతావన్నమాట,” అన్నాడాయన. 

“వెళ్ళాల్సొస్తుందేమో? నా చదువు పూర్తయినతర్వాత నేను ఏదో ఒక బ్రిటిష్ కాలనీల్లో పని చేయాల్సివుంటుంది. చెప్పలేం, ఆఫ్రికా కూడా వెళ్ళాల్సిరావచ్చు,” ఏడెన్ సమాధానం ఇచ్చాడు. 

నాన్న ఏం మాట్లాడలేదు.  గుర్రం జీనుని ఒక్క సారి లాగి పైకెక్కి కూచున్నాడు. ఆ గులకరాళ్ళు పరిచిన బాటలో గుర్రం గిట్టలతో లయబద్ధంగా చప్పుడుచేసుకుంటూ ముందుకెళ్ళింది. దాని అడుగులు  రాళ్ళ మధ్యలో పడి అక్కడున్న దుమ్ము పైకిలేస్తూంటే చూస్తూ ఎక్కడున్నవాడు అక్కడే నిలబడిపోయాడు ఏడెన్.  

ఒకసారి మిలిటరీ స్కూల్లో చేరింతర్వాత ఏడెన్ వాళ్ళ ఊరు ‘కెర్రీ’కి చదువు పూర్తయ్యేదాకా తిరిగిరాలేదు. అమ్మతో మాత్రమే ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండేవి. నాలుగేళ్ళ తర్వాత ఒక రోజు  ఇంటికొచ్చినప్పుడు ఆమె పెరట్లో బట్టలు ఆరేస్తోంది. పొడుగు చేతుల జాకెట్ చేతుల పైకి ముడుచుకుని కళ్ళెత్తి చూసింది. అతన్నే తేరిపార చూస్తూంటే ఆమె కళ్ళ అంచుల్లో నాజూకైన ముడతలు ఏర్పడ్డాయి. ఆమె తలకు కట్టుకున్న స్కార్ఫ్ అంచు జారి కనుబొమ్మల మీది కొస్తూంటే, ఒక్కసారిగా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి; “ఏడీ!” అంటూ అరుస్తూ అతనివైపు పరిగెత్తుకొచ్చింది. అప్పుడామె మొహంలో కనపడ్డ భావావేశం ఏడెన్ ఎప్పటికీ మరిచిపోలేడు. 

సంతోషంతో బొమ్మలా గడ్డకట్టుకుపోయి గాలే ఆమెను ఎత్తుకుని మోసుకొస్తున్నట్టు హర్షాతిరేకంతో కేకలు వేసుకుంటూ అతని దగ్గరకు వచ్చింది. “ఏడీ, ఏడీ…” అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెడుతూ ఆయాసపడింది. ఆమె బట్టల్లోంచి రకరకాల వాసనలు – వాషింగ్ సోడా ఘాటు వాసన, పచ్చి ఉల్లిపాయల వాసన, వంటచూరు పొగ వాసన. ఒక్క ఉదుటున ఆమె భోరున ఏడవడం మొదలుపెట్టింది. ఏడెన్ ఆమెను గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్ళు తుడిచాడు.  “ఓహ్, ఏడీ! ఎంత పెద్దాడివైపోయావురా? చూడు, నీ చేతులు ఎంత పొడుగ్గా బలంగా తయారైనాయో?” అతని అరచేతులు తీసుకుని తన బుగ్గలకు తాకించింది. ఉన్నట్టుండి బిగ్గరగా నవ్వటం మొదలుపెట్టింది. “నువ్వు బాగా పెద్దవాడవైపోయావురా, ఏడీ!. ఊళ్ళో ఆడపిల్లలు నిన్ను గనక చూశారంటే అన్ని పనులూ వదిలేసి నీ వెనకపడతారు,” అంది. 

ఏడెన్ అమ్మ తలనిమిరాడు. “నాకు ఆకలేస్తోందే, ఏం పెడుతున్నావు?” 

అమ్మ, చెయ్యి పట్టుకుని “ మంచి పంది మాంసం వండిపెడతాను, లోపలికి రా!” అంటూ ఇంటి లోపలికి  తీసుకెళ్ళింది.  ఓ మూలనించీ ఆన్యా, ఐలీన్ తొంగి చూసారు. వాళ్ళిద్దరికీ  అమాంతం వయసు పెరిగిపోయినట్టు అనిపించింది. లేత ప్రాయంలో ఉన్నప్పుడు వేరుగా ప్రత్యేకంగా కనపడ్డ వాళ్ళ ముఖాలిప్పుడు, పల్లెల్లో  వళ్ళు వంచి పనిచేసే అందరు ఆడాళ్ళ ముఖాల్లా నలిగిపోయి ఒకేలా కనపడుతున్నాయి. ఏడెన్ చేతులు తమ చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ ఆహ్వానించినా వాళ్ళ కళ్ళలో మాత్రం నిస్తేజం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. 

నాన్న, లియామ్ సాయంత్రం ఇంటికొచ్చారు. లియామ్ కూడా పొలాల్లో పనిచేసుకునే  మామూలు పల్లెటూరి బైతులానే తయారయ్యాడు. నోరు మూత పడకుండా వాగే అలవాటున్న లియామ్ ఇప్పుడు నాన్నలాగే నిశ్శబ్దం పాటిస్తున్నాడు. తన టోపీ చీలకు తగిలిస్తూ “జీసస్!” అని గొణిగాడు లియాన్. కోటు తీస్తూ ఏడెన్‌ను చూసి కనపడీ కనపడకుండా నవ్వాడు, లియామ్. అతని చేతులు చెక్క మొద్దుల్లా బలంగా తయారైనాయి. ఒక్క నిముషం తర్వాత నాన్న ఇంట్లోకొచ్చి “జీసస్!” అని గొణుగుతూ టోపీ గోడకు తగిలించి లియామ్ తీసినట్టే కోటు తీసి పక్కన పెట్టి ఏడెన్‌ను చూసి పలకరింపుగా ఓ చిన్న నవ్వు నవ్వాడు. లియామ్ కళ్ళు మూసి తెరిచేలోగా పెద్ద వాడై పోయినట్టు అనిపించింది, ఏడెన్‌కు. ‘పల్లె, తనతో ఉండిపోయిన ప్రతి మనిషినీ నలిపేసి ఒకే మూసలో పోసి మార్చేస్తుంది,’ అనుకున్నాడు ఏడెన్. కానీ అలా జరగటం తను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాడు.

కుమార్ ఎస్
కుమార్ ఎస్

వృత్తి రీత్యా మెకానికల్ ఇంజనీర్. తెలుగు ఆంగ్ల కథా సాహిత్యం పై ప్రత్యేకమైన ఆసక్తి. హర్షణీయం పాడ్కాస్ట్ నిర్వాహకుల్లో ఒకరు.

హర్షణీయం పాడ్కాస్ట్ లింక్ – https://bit.ly/harshspot

Page 1 of 3
123Next
Previous Post

పూలతావుల కథాపరిమళాలు

Next Post

కువైట్ కథ : బొమ్మల దుకాణం

Next Post
కువైట్ కథ : బొమ్మల దుకాణం

కువైట్ కథ : బొమ్మల దుకాణం

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com