నాలుగు రోజుల్లోనే ఏడెన్‌కు పల్లె జీవితం అంటే మొహం మొత్తింది. ఐర్లాండ్ విడిచి బర్మాకు వెళ్ళే ముందర ఒక నెల రోజులు అమ్మానాన్నలతో ఉండాలని వచ్చాడు కానీ తనుఈ పల్లెలోనే కాదు ఐర్లాండ్ అంతటికీ ఒక పరాయివాడిగా మారిపోయానని అతనికి అర్థం అయ్యింది. అతని వేషభాషలే కాదు, కళ్ళల్లోని చూపు, శరీరపు కదలికలు కూడా మారిపోయాయి. తన కుటుంబం కూడా తననొక పరాయివాడిగా చూస్తోందని అర్థం చేసుకున్నాడు. అతని అడుగులు చప్పుడు వినపడగానే అప్పటిదాకా ఉత్సాహం నిండిన గొంతులతో వినపడే పూచికోలు కబుర్లన్నీ జీవం లేని పేలవమైన నవ్వుల కింద మారిపోయేవి. అమ్మ ఒక్కతే, తెచ్చిపెట్టుకున్న చనువుతో ప్రవర్తించేది. మిగతా వాళ్ళందరూ ఏడెన్ ఎవరో బయటి వ్యక్తి లాగా ముభావంగా ఉంటూ తమ చూపుల్లో తెచ్చిపెట్టుకున్న గౌరవాన్ని చూపించేవారు.
ఒక వారం తర్వాత, ‘ఇంక వెళ్ళిపోదాం,’ అని నిశ్చయించుకున్న తర్వాత అమ్మ ఒక్కతే కొద్దిగా నిరసన వ్యక్తం చేసింది. “నీకిక్కడ ఏం తక్కువయిందని? ఇంకొన్ని రోజులు నాతో ఉండొచ్చుగా?” అంటూ అడిగింది.
“నా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలి. నాతో కల్సి ప్రయాణం చేసే వాళ్ళను కూడా కలవాలి,” అని ఏడెన్ సమాధానం ఇచ్చాడు.
ఆమె ఇంకేమీ వాదించలేదు. తాను వెళ్ళిపోవడం గురించి అమ్మ మరీ దిగులు పడనందుకు ఏడెన్ విపరీతంగా నిరుత్సాహపడ్డాడు. అతను ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. ఎక్కడో మారుమూలనున్న ప్రదేశం. పురుగు పుట్రా, పాములూ, యుద్ధాలు, విచిత్రమైన వ్యాధులతో నిండి ఉన్న దేశం. మృత్యువులా దూరాభారం. అమ్మకిదంతా తెలుసు. ఆ రోజుల్లో ఐర్లాండ్‌లోని యువకులంతా బ్రిటిష్ సైన్యంలో చేరి, పండిన ఆపిల్ పళ్ళు చెట్ల మీంచి రాలినట్టు కింద పడి దొర్లుకుంటూ మృత్యు భూముల్లోకి వెళ్ళిపోతున్నారు. పల్లె వాసన, పల్లె జీవితం గిట్టని ప్రతి యువకుడి ముందున్న ఏకైక గమ్యం అదే. పొగురుమోతు గుర్రం రౌతును కిందికి తోసేసినట్టు ఐర్లాండ్ వాళ్ళందరినీ తెలీని ప్రపంచంలోకి విసిరి కొడుతోంది. చాలా ఏళ్ళు గడిచిన తర్వాత అతను బోలెడంత డబ్బునీ తెలీని వింత రోగాల్నీ మోసుకుంటూ కొత్త వ్యక్తిగా మారి వెనక్కి తిరిగి ఇంటికి రావచ్చు. లేదంటే నిండా స్టాంపులు అంటించిన పసుపుపచ్చ కవర్లో సైన్యం పంపించే సమాచార రూపంలోనూ చేరుకోవచ్చు. తపాలా బంట్రోతు ఎక్కి వచ్చే గుర్రం గిట్టల చప్పుడు ఇంట్లో వాళ్ళ చెవిన ఎప్పుడు పడినా ఓ రెండు క్షణాలు ఎలాంటి కబురు వచ్చిందోనని భయపడతారు.
ఏడెన్ గుర్రం మీదెక్కి బయలుదేరుతూంటే తమ్ముడు లియామ్, నాన్న గుర్రాలెక్కి అతనికి తోడుగా వచ్చారు. కానీ వాళ్ళు దారి మధ్యలో ఏం మాట్లాడుకోలేదు. ఇంటినుంచి వచ్చే అడ్డ దారి రహదారిని కలిసే కూడలి దగ్గర అతన్ని పట్టణానికి తీసుకెళ్ళడానికి వచ్చిన గుర్రం బగ్గీ ఆగి ఉంది. గుర్రబ్బండి మీద కోడి రూపంలో ఉన్న గాలి పడగ గిర్రున తూరుపు నించీ దక్షిణానికి తిరిగి మళ్ళీ తూర్పుకి తిరగడం అతను గమనించాడు. తన గుర్రం కళ్ళెం లియామ్‌కిచ్చి తానెక్కవలసిన బగ్గీ ముందు వైపు సీటు మీద కూర్చొని ఉన్న తోలరికి సైగ చేశాడు. “హోరున వర్షం పడేట్టుంది” అన్నాడతను. ఏడెన్ చిన్నగా నవ్వాడు. నాన్నకు వీడ్కోలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. లియామ్ భుజం మీద ఏడెన్ నెమ్మదిగా తట్టాడు. నాన్న చేతుల్ని తీసుకుని ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు కానీ కృతకంగా ఉంటుందని ఆగిపోయాడు.
నాన్న టోపీ తీసి జుట్టును సరి చేసుకున్నాడు. అలవాటుకి విరుద్ధంగా ఏడెన్ కళ్ళు ఆయన మీదే నిశ్చలంగా ఉండిపోయాయి. నాన్నకున్న పొడవాటి ముదురు గోధుమ రంగు జుట్టు పూర్తిగా మాయమైపోయి ఉంది. నాగలి కొర్ర చాళ్ళల్లా నుదురంతా లోతైన గీతలు. ఆయన ముఖం మీదున్న ఎర్రటి చర్మం మీద మునుపు కనపడ్డ మచ్చలు ఎండకు మాడి నల్లబడి పెద్దవైనాయి. బుగ్గలు, దవడ కింది భాగం బాగా ముడతలు పడుంది. గడ్డం కింది చర్మం, నీళ్ళు నిండి పొర్లిపోబోయే తోలు సంచీలా కిందికి వేలాడుతోంది. ఇంకెప్పటికీ మళ్ళీ నాన్నను చూడలేనని అతనికి చప్పున ఓ క్షణం స్ఫురించింది. అవును, అదే జరగబోయేది. ఇదే ఆఖరి చూపు. ఆయన్ను ఒక్కసారి తాకాలని చాలా అనిపించింది. క్షమించమని అడుగుదామనుకున్నాడు.
‘కానీ దేనికి? తనే తప్పూ చేయలేదు.’ అయినా ఎందుకో, ఎండకు ఎండీ వానకు తడిసీ మంచుకు బిగిసి అడవి బాటలో పక్కన పడున్న రాతి బండలా ఎదురుగా వచ్చి నిల్చున్న ఆ మనిషికి, తెలీకుండా తన వల్ల ద్రోహమేదో జరిగినట్టు అనిపించిందతనికి. ‘కొడుకుగా పుట్టడమే కాక ఆయనకస్సలు తెలీని జీవన విధానాన్ని తను ఎంచుకున్నందువల్లే ఆయనకు అన్యాయం జరిగింది. కాదు, కాదు. నాన్న వడిని వదిలేసి తను ఆయన చేతుల్ని విడిపించుకు వెళ్ళిపోయాడు. ఆయన పాటించే పద్ధతులు, సంప్రదాయాలను వదిలేసి పూర్తి పరాయివాడిగా మారిపోయాడు. వందలాది పుస్తకాలతో అడ్డు గోడను తనలో కట్టుకుని తండ్రికి పూర్తిగా దూరం అయిపోయాడు.’
“గుర్రాలను ఇంటికి తీసుకెళ్ళు, నేను వెనక వస్తాను” అని నాన్న ఎర్రబడ్డ కళ్ళతో లియామ్‌తో చెప్పాడు. లియామ్, ఏడెన్ ఎక్కి వచ్చిన గుర్రం కళ్ళెం చేతిలోకి తీసుకుని తల కొద్దిగా వంచి సెలవు తీసుకున్నాడు. గుర్రాలు రెండూ తమ తోకల్ని అటూ ఇటూ ఊపుతూ ఇంటివైపు నడిచాయి. గిట్టల శబ్దం క్రమంగా చెవి మరుగైంది. మాటలు కరువై ఏడెన్ గుర్రబ్బండి వైపే చూస్తున్నాడు. ఉన్నట్టుండి గాలి పడగ గిర్రున తూర్పుకు తిరిగింది. ఏడెన్ పాంటు జేబులో చేతులు దూర్చాడు. నాన్నకు తనతో ఏదో చెప్పాలనుంది కానీ చెప్పలేకపోతున్నాడు అని ఏడెన్‌కు అర్థం అయ్యింది. మాట్లాడ్డం ఆయనకెప్పుడూ కష్టమైన పనే.
“వెళ్ళగానే అమ్మకుత్తరం రాస్తాను” అన్నాడు ఏడెన్. “ఓ ఐదేళ్ళలో వెనక్కి వచ్చేస్తాను.”
ఆ మాటలు ఆయన వినిపించుకున్నట్టులేదు.
“బర్మాలో పోలీసు ఆఫీసరు ఉద్యోగం వచ్చింది. వేడి, గాలిలో ఎక్కువ తేమ తప్ప అక్కడ వేరే ఇబ్బందులేవీ ఉండవుట.”
నాన్న టోపీ తీసి, జుట్టును మళ్ళీ ముడి వేసుకున్నాడు. ‘ఆయనేం చెప్పాలనుకుంటున్నాడు? ఎవరైనా ఎక్కడో గుండె లోతుల్లో చిక్కుకుపోయిన మాటలని ఎలా వెలికితీస్తారు?’
“నీ పేరు వెనక ఉన్న చరిత్ర నీకు తెలుసా ?” మొదలెట్టాడాయన. ఒక్క క్షణం ఏడెన్‌కు ఏం అర్థం కాలేదు. ఆయన ఇంతకంటే ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతాడేమోననుకున్నాడతను. ఏదో కథల్లోలా – ఆయన చెప్పబోతున్న విషయం ఏడెన్ జీవితాన్ని సంపూర్తిగా మార్చేయబోతోంది. ఏడెన్ మౌనంగా నిలబడ్డాడు. వాళ్ళ నాన్న మనసులో ఏం జరుగుతోందో ఊహించలేకపోతున్నాడు.
“బిర్న్ అనే పేరు ఓబ్రాయిన్ నించి వచ్చింది. దానర్థం, ‘బ్రాన్ వంశం’ అని. మనం లీన్స్టర్ రాజ్యపు చక్రవర్తి బ్రాన్ మాక్ మెల్మోర్డా, వంశానికి చెందిన వాళ్ళం. మనం నిల్చున్న నేల ఐర్లాండ్, మన దేశం.” ఏడెన్‌కు ఆయనేం చెప్పబోతున్నాడో చూచాయగా అర్థం అయ్యింది. “నువ్వు మాత్రం మనల్ని ఆక్రమించిన బ్రిటన్ తరఫున యుద్ధం చెయ్యడానికి వెళుతున్నావు.” ఆ మాటలు ఆయన నోట్లోంచి రాగానే ఏడెన్ కళ్ళు కిందికి దించేసుకున్నాడు.
అగాధమంత మౌనానికి కొద్ది సేపు ఇద్దరూ చెరో పక్కా నిల్చున్నారు. బండికి కట్టిన గుర్రాల్లో ఒకటి చిన్నగా సకిలించి చెవుల్ని టప టప ఆడించి అటూ ఇటూ కదిలింది. ఏడెన్ కొద్దిగా వణికి ఈ లోకంలోకి వచ్చాడు.
“నేను ఇంటికి డబ్బులు బ్యాంకు ద్వారా పంపిస్తాను,” అన్నాడు ముఖం కొంచెం ఇబ్బందిగా పెట్టి.
“ఆ అవసరం లేదు,” అన్నాడు ఆయన నెమ్మదిగా తన దృఢమైన స్వరంతో. ఇంకొక్క క్షణం కూడా వృధా చేయకుండా తన గుర్రాన్ని వెనక్కి తిప్పాడు. గిట్టల చప్పుడు ప్రతిధ్వనిస్తూంటే దౌడు తీయించాడు. తన భారీ శరీరం గాల్లో లేస్తూ పడుతూంటే ఆయన క్రమంగా దూరమై అదృశ్యమైపోయాడు.
చల్లని గాలి తెమ్మెర తాకి వెళ్ళినప్పుడు అర్థం అయ్యింది ఏడెన్‌కు తన ఒళ్ళంతా చెమటతో తడిసిపోయిందని. గాఢమైన నిట్టూర్పు కూడా సాంత్వన ఇవ్వలేకపోయింది. బగ్గీ ఎక్కి తలుపు మూసాడు. తోలు సీటు మీద కూర్చుని కాళ్ళు బారా చాపుకున్నాడు. కళ్ళు మూసుకుంటే గాలి ముఖాన్ని తాకి వెళ్ళింది. తోలరి, రెండు సార్లు గంట కొట్టి గుర్రాలను అదిలించాడు. కొరడా విదిలించగానే గుర్రాలు ముందుకు దూకాయి. ఒక్క ఊపుతో బండి ముందుకు కదిలింది. మట్టి రోడ్డు మీద గుర్రబ్బండి అటూ ఇటూ ఊగుతూ ముందుకెళ్తోంది. చక్రాలు వేగం పుంజుకుని గులక రాళ్ళను తొక్కుకుంటూ ముందుకెళ్తూంటే, ఇరుసు కదిలిపోతూ శబ్దం చేస్తోంది. చల్ల గాలి నెమ్మదిగా మొహాన్ని తాకుతూ వెళ్తూంటే ఏడెన్ మనసు నెమ్మదించింది. మురికి బట్టల దొంతర కింద కప్పెడిపోయిన బట్టలు గాలికి ఒక్కొక్కటి ఎగిరిపోతున్నట్టు, గుండె బరువు రాను రాను తగ్గుతోంది. అతని మనసు తేలిక అవుతూ వస్తోంది.
ప్రతి రోజూ ఏడు గంటలకు అడయార్ నది ఒడ్డున ఉన్న తన బంగ్లా నించి ఏడెన్ గుర్రం మీద బయలుదేరి మెరీనా తీరాన్ని తాకుతూ ఉండే గుర్రాలు నడిచే బాట మీద ప్రయాణిస్తూ అయోధ్య కుప్పం బస్తీ గుండా సముద్రం పక్కనే ఉన్న పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటాడు. మళ్ళీ రాత్రి తొమ్మిదిగంటలకు అదే బాటలో ప్రయాణించి బంగ్లాకు చేరుకుంటాడు. ఒక్కసారి ఆఫీసులోకి వెళ్ళాడంటే ఇంక బయటికి రావటం కష్టం. అందువల్ల రోజు మొత్తం మీద ఏదన్నా వ్యాయామం చేస్తాడంటే అది ఈ గుర్రపు స్వారీనే. ఆదివారాలు కూడా సెలవు ఉండదు. ఏడెన్ ఈ రోజువారీ ప్రయాణం, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే తనదైన అనుభవంగా భావిస్తాడు. కుడివైపునున్న నీలి సముద్రపు ఒడ్డున ప్రయాణించే ప్రతి క్షణం, అతని రోజువారీ జీవితంలో ఉన్న ఇబ్బందులనీ చిరాకులనీ అత్యంత అల్పమైన విషయాల కింద మార్చేస్తుంది. ఆ అపార జలరాశి అంచున తానొక చిన్న గాలి బుడగనన్న అనుభూతి అతనికిచ్చినంత సాంత్వన, ఏడెన్‌కు వేరేదీ ఇవ్వలేదు.
అన్నిటికంటే మద్రాసు పట్టణంలో తాను ఇష్టపడేది, అచ్చెరువున ముంచేసే సముద్రం. స్పటికమంత స్వచ్ఛమైన నీలాన్ని నింపుకుని అంతేలేని తీర రేఖ పొడుగునా ఇసక పరుచుకుని కనిపిస్తూ కనుమరుగౌతున్న పట్టుబట్టలా అలలు, మిరిమిట్లు గొలిపే నీలపు సముద్రం మీద సెంబదేవ జాతి బెస్త వాళ్ళ కట్టమరాలు, ఒంటి రెక్క పక్షుల్లా పయనిస్తున్న పడవల మీద నగిషీ పెట్టిన తెల్లటి తెరచాపల రెపరెపలు. రేవున లంగరు వేసిన ఓడలు దిగ్మండల రేఖ మీద సూక్ష్మరూపం ధరించిన నల్లటి గుట్టల్లా నిలబడివున్నాయి. ఏడెన్ తనకెదురుగా సముద్రం ఎప్పుడూ కనపడేలా ఆఫీసు గదిని ఎంచుకున్నాడు. చట్టాలు, న్యాయ మీమాంసలు, పనుల్లో అడ్డంకులు, విధి విధానాలు, పైనుంచి వచ్చే తాఖీదులు నిండిన ఆఫీసు కాగితాల్లోంచి తల పైకెత్తి చూస్తే, కిటికీలోంచి కనపడుతోన్న నీలపు వర్ణం తనను ఆకాశంలోకి తీసుకెళ్ళిపోతోందన్న అనుభూతి కలుగుతుంది.
ఎంత ఘనంగా ఉంది సముద్రం, నిండా నీలపు కాంతిని నింపుకున్నట్టు? ఇంగ్లాండ్‌లో తను చూసిన సముద్రం వేరు; వింతైన బురదలాంటి చిక్కని ద్రవ పదార్థం ఘనీభవించి నీలం రంగు పాలరాయిలా మారినట్టనిపిస్తుంది. ఎప్పుడైతే మొరాకో సముద్ర జలాల్లో ప్రవేశించాడో అప్పుడే భూమధ్యరేఖా ప్రాంతంలో సముద్రాలు వేరే వర్ణంలో ఉంటాయని అర్థం అయ్యింది. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ రేవులో బయలు దేరినపుడు ఆకాశం మేఘావృతమై ఉంది. ఓడలోని యంత్రాలన్నీ ఒక్కసారిగా పనిచేయడం మొదలెట్టి చెవుల్లో చిల్లులు పడేట్టు పిడుగుల్లా ప్రతిధ్వనించాయి. ఓడ ప్రయాణం మొదలై ముందుకెళ్ళినతర్వాత ప్రయాణీకులు అందరూ బార్లు కట్టి డెక్ మీద నిలబడి తీర రేఖ వైపు చూట్టం మొదలెట్టారు. ఎత్తైన చిమ్నీలు, పొడవాటి శంకువు ఆకారంలోనున్న పెంకుటింటి కప్పులతో సౌతాంఫ్టన్, మరీ మరీ దూరానికి తేలుతూ వెళ్ళిపోయింది. కనుమరుగౌతున్న నగరం వినీలాకాశపు జలాల్లో మునిగిపోతున్న మహానౌకలా గోచరించింది. లంగరు వేసిన ఓడలు సముద్రంలో పైకీ కిందికీ ఊగుతున్నాయి.
నేల కనపడటం మానేసాక ప్రయాణీకులందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. ఊలు రగ్గులు కప్పుకుని నిద్ర పోవడానికి ప్రయత్నించారు. వాళ్ళ ముఖాల్లో ప్రతిఫలించే భావాలు వేర్వేరుగా ఉన్నా అందరి మనస్సులో దొర్లే ఆలోచన ఒకటే అన్నట్టు ఏడెన్‌కు అనిపించింది. ‘మళ్ళీ మనం నేలపై అడుగు పెట్టగలమా?’ అదే ఆలోచన. అది కాకుండా వేరే ఏం ఆలోచన ఉంటుంది? వాళ్ళల్లో ఎక్కువమంది భోజన సమయంలో తప్ప మిగతా అప్పుడంతా పడుకునే ఉన్నారు. వందల మంది ప్రయాణీకులున్నా భోజనశాల నిర్వహణ సజావుగా ప్రశాంతంగా జరిగేది. గిన్నెలకు కంచాలకు చెంచాలు తగిలి వినపడే శబ్దాలు, దుస్తుల రెపరెపలు, చెక్క నేల మీద అడుగుల శబ్దాలు , బూట్లు రాచుకున్న శబ్దాలు, ఎప్పుడైనా గుసగుసల స్థాయిలో వినిపించే సంభాషణలు తప్ప వేరేదీ అక్కడ చెవిన పడేది కాదు.
ఏడెన్‌తో పాటూ అతని గదిని పంచుకుంది, లాంకషైర్ నించి వచ్చిన ఒక యువకుడు. అతను కూడా ఏదో కోల్పోయినట్టు నిస్పృహతో తన పాటికి తను ఉండేవాడు. అంతా చేసి మొదటి పదిరోజుల్లో ఏడెన్ అతనితో ఒకటో రెండో మాటలు మాట్లాడుంటాడు. ఒక రెండు వారాలకు వాళ్ళ శరీరాలు సోమరితనానికి అలవాటు పడ్డాయి. రోజులో ఇరవై గంటలు పడుకుని గడపడం సాధ్యమయ్యేది. నిద్రామెలకువల మధ్యలో నడిచే పగలూ రాత్రిళ్ళను, ముత్యాల హారంలో దారంలా కలిపి ఉంచేది, ఓడ ముందుకు ప్రయాణిస్తూన్నట్టుగా తెలిపే ఇంజిన్ల శబ్దం మాత్రమే.
‘పక్కరోజు కాసాబ్లాంకా రేవుకు చేరుకోబోతున్నాం’ అనే కబురుతో భోజనాల హాలంతా అట్టుడికిపోతోంది. ఏడెన్ ఏమంత ఆసక్తి కన్పరచలేదు. వర్షపు హోరు ఓడను విసురుగా కొడుతూంటే నీటి చుక్కలు కిటికీల సందుల్లోంచి పరుపు మీద, ఊలు కంబళ్ళ మీద, విరిగిన గాజు రజనులా పడుతున్నాయి. దుప్పట్లో దూరి కళ్ళు మూసుకుని ఏడెన్, ఇంటి చుట్టూతా ఉండే పచ్చిక బయళ్ళను గుర్తుకుతెచ్చుకున్నాడు. పక్కరోజు పొద్దున్న ఓడ హార్న్ శబ్దం విని కళ్ళు తెరిచి ఓవర్ కోటు మీదేసుకుని వంగి కిందుగా ఉన్న ద్వారబంధాన్ని దాటి తన గదిలోంచి బయటికొచ్చాడు. హఠాత్తుగా కళ్ళల్లో ఎవరో వెలుగును కుమ్మరించినట్టనిపించింది.
వృత్తి రీత్యా మెకానికల్ ఇంజనీర్. తెలుగు ఆంగ్ల కథా సాహిత్యం పై ప్రత్యేకమైన ఆసక్తి. హర్షణీయం పాడ్కాస్ట్ నిర్వాహకుల్లో ఒకరు.
హర్షణీయం పాడ్కాస్ట్ లింక్ – https://bit.ly/harshspot




Discussion about this post