• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

పూలతావుల కథాపరిమళాలు

ఎమ్వీ రామిరెడ్డి by ఎమ్వీ రామిరెడ్డి
July 1, 2025
in సమీక్షలు
0
పూలతావుల కథాపరిమళాలు

..ఎమ్వీ రామిరెడ్డి

తెలుగు కథాసాహిత్యాన్ని పరిపుష్ఠం చేయటానికి రచయితలెందరో విశేషంగా కృషి చేశారు. వివిధ కోణాల్లో కదం తొక్కిన ఆ కలాల ‘కథనం’… మరిన్ని ప్రయోగాల దారుల్లో పరుగులు తీస్తోంది. కథ పుట్టి, నూరేళ్లు దాటిన సందర్భంగా ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాం. తొలి తరం మొదలు తాజాతరం దాకా ఈ కృషిలో భాగస్వాములైన వారిని తలచుకున్నాం.

అయితే, ‘వందేళ్ల కథకు వందనాలు’ అర్పిస్తూ సమర్పించిన 118 కథనాల్లో కేవలం 12 మంది రచయిత్రులు మాత్రమే దర్శనమిచ్చారు. సాహిత్య చరిత్రపై సమగ్ర అవగాహన ఉన్న ప్రముఖ కవయిత్రి, రచయిత్రి శీలా సుభద్రాదేవి గారిని ఆ విషయం బాధించింది. వ్యక్తిగత ఆసక్తితో కథాసాహిత్య నిర్మాణంలో రచయిత్రుల భాగస్వామ్యం గురించి ఆమె ఆరా తీస్తూ పోతే, ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి.

పెద్దాడ కామాక్షమ్మ, భాస్కరమ్మ, గుమ్మడిదల దుర్గాబాయి, నండూరి సుబ్బలక్ష్మీదేవి, ఐ.ఎస్.లక్ష్మి, లీలా సరోజిని వంటి రచయిత్రులు 1930లలోనే కథలు రాశారు. ఆ చిట్టా అంతకంతకూ పెరిగిపోతుండటంతో, తన పరిశోధన ప్రయాణాన్ని 1950 నుంచీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తవ్వే కొద్దీ కథలగుట్టలు బయల్పడసాగాయి. 50కి పైగా కథలు రాసిన రచయిత్రులు చాలా మంది కనిపించారు. కనీసం 1950 నుంచి 1980 వరకు వెలువడిన కథలు; ఆ రచయిత్రుల కృషికి పట్టం కట్టాలనుకున్నారు. వాళ్లందరినీ చదవటం మొదలు పెట్టారు.

అతిత్వరలోనే అర్థమైంది, తానో సాహసానికి ఒడిగట్టానని! ఆ లోతుల్లోకి దిగి, మునుగీతలు ముగించుకొని, ఒడ్డుకు చేరటం అంత సులభం కాదని! అయినా, దిగారు. అయిదేళ్ల తర్వాత తీరం చేరారు. ఫలితంగా, ఆణిముత్యాలను మనకందించారు. ఇల్లిందల సరస్వతీదేవి నుంచి జె.భాగ్యలక్ష్మి దాకా మూడు తరాల సీనియర్ రచయిత్రుల అపూర్వ అక్షరసేద్యాన్ని వ్యాసాలకెత్తారు.

అధ్యయనాన్ని మించిన అమూల్యమైన సంపద మరోటి లేదు. విద్యార్థికైనా, రచయితకైనా అది అతి ముఖ్యమైన అంశం. ఎంత ఎక్కువగా చదివితే మన లోపలి ప్రపంచం అంతగా విశాలమవుతుంది. సమాజం అంత సూక్ష్మస్థాయిలో ప్రత్యక్షమవుతుంది.

రచయిత బాధ్యత మరింత కీలకం. సాహిత్యంలో తనకంటూ ఒక స్థానం దక్కించుకోవాలన్నా, సృజనాత్మక సూత్రాల రహస్యాల్ని అర్థం చేసుకోవాలన్నా నిన్న-మొన్నటి తరాల్ని అధ్యయనం చేయాలి. ఆయా రచయితల దృక్పథాలు, వస్తుశిల్పాలు, శైలీ విన్యాసాల గురించి తెలుసుకోగలిగినప్పుడే వర్తమాన సమాజాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించగలరు.

అయితే, అదంత తేలికైన విషయం కాదు. పుస్తకాలు సేకరించాలి. సమయం వెచ్చించాలి. సహనం వహించాలి. ఈ భారాన్ని తగ్గించటానికన్నట్లు సుభద్రాదేవి గారు చాలా సమయం వెచ్చించి, రచయిత్రుల కథల్ని అధ్యయనం చేశారు. కేవలం తన మనోవికాసానికే కాకుండా, పది మందికీ పనికొస్తాయన్న సంకల్పంతో ఆయా కథల ఆనుపానుల్ని వ్యాసాల రూపంలో అందించారు. ఆ విలువైన విశ్లేషణల సమాహారమే ‘‘కథారామంలో పూలతావులు’’.

తెలుగు సాహిత్యచరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సొంతం చేసుకున్న రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి. 300కు పైగా కథలు, నాలుగు నవలలు, నాలుగు వ్యాససంపుటాలు, మరో నాలుగు బాలసాహిత్య గ్రంథాలు, ఒక నాటికల సంపుటి వెలువరించి; కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత్రి.

నూరు కథలతో వికసించిన ‘‘స్వర్ణకమలాలు’’ చదవటం ప్రారంభించిన వ్యాసరచయిత్రి అర్ధాంతరంగా ఆగలేకపోయారు. కథలన్నిటినీ సుష్టుగా భుజంచి, ఆ రుచిని తొలి వ్యాసంలో మనకు పంచిపెట్టారు. ప్రధానంగా సరస్వతీదేవి కథల్లో వైవిధ్యమైన కథావస్తువు ఉంటుందని, 30-40 ఏళ్ల వ్యవధిలోని సమాజ పరిణామక్రమానికి ఆ కథలు అద్దం పట్టాయని; నాటి సామాన్య జనజీవన విధానం, ఆలోచనా ధోరణి, మానసిక సంఘర్షణలు, ఆర్థిక సంక్షోభాలు, అంతులేని ఆవేదనలు, ఆశనిరాశలు, ఆశావాదంతో కూడి దృఢచిత్తాలు ఆమె కథల్లో సహజంగా ఒదిగిపోయాయని సుభద్రాదేవి వివరించారు.

రెండో ప్రపంచయుద్ధ సమయం, మనకు స్వాతంత్ర్యం సిద్దించిన తొలి రోజుల్లోని వాతావరణంతో పాటు; మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లోనే చిన్నచేపల్ని మింగే పెద్దచేపలు పుట్టుకొచ్చాయని (సహోదరుడు), తెల్లదొరల స్థానంలో వచ్చిన నల్లదొరలూ పెత్తనం చలాయించారని (దొరలు, గళ్లలుంగీ కథలు), కార్మికుడి శ్రమను దోచుకునే వర్గం పెరిగిపోయిందని (కలసి వీడిన జోడు) సరస్వతీదేవి తన కథల్లో చిత్రించనట్లు తెలిపారు. స్త్రీవాద కథల (అడ్డుతెరలు, అక్కరకు రాని చుట్టం, అసమర్థుడు వంటివి)తోపాటు 1960లోనే చైతన్యస్రవంతి శైలిలో ‘అంతర్గతం’, సర్రియలిస్టు విధానంలో ‘సాహిత్యోద్యానం’, ట్రాన్స్‌జెండరు నేపథ్యంతో ‘కంటిమెరుపు’, హైదరాబాదు మతకల్లోలాలపై ‘వడగాడ్పు’ వంటి కథలు రాసిన విషయాన్ని విశదీకరించారు.

‘‘కొద్దిపాటి చదువే వున్నా స్త్రీలు కష్టపడి అవసరమైనంత మేరకు చదువును కొనసాగించి వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడి ఒంటరిగా పిల్లల్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లిన అభిమానవంతులైన స్త్రీలు వీరి (ఇల్లిందల సరస్వతీదేవి) కథల్లో కనిపిస్తారు’’ అంటారు వ్యాసరచయిత్రి.

‘అలరాస పుట్టిల్లు’ కథ పేరు వినగానే మనకు కళ్యాణ సుందరీ జగన్నాథ్ గుర్తొస్తారు. అరవై డెబ్భై ఏళ్ల కిందటే కలకాలం గుర్తుండిపోయే కథలు రాసిన రచయిత్రి. మల్లంపల్లి సోమశేఖరశర్మ ప్రోత్సాహంతో భారతిలో 1939లో ‘చిన్నకథ’తో రచనా వ్యాసంగం ప్రారంభించిన సుందరీ జగన్నాథ్ సుమారు అరవయ్యేళ్ల కాలంలో కేవలం పాతిక కథలు మాత్రమే రాశారు.

‘‘కళ్యాణ సుందరీ జగన్నాథ్ కథలు ఆనాటి సమాజంలోని వాస్తవ చిత్రణ కన్నా ముందటితరంలోని శిథిలమై మరుగున పడిపోతున్న నాటి ప్రజాజీవితాలలోని సంప్రదాయాలూ, ఔన్నత్యాలూ, నాగరికతా వైశిష్ట్యాలూ ప్రస్ఫుటింపజేయటమే కాకుండా తర్వాతి తరం వారికి ఎత్తి చూపాలనే తపన కనిపిస్తుంది’’ అని విశ్లేషించారు సుభద్రాదేవి. అప్పట్లోనే ప్రయోగాత్మక శైలీ విన్యాసంతో కథనాన్ని పరుగులు తీయించారంటూ ప్రశంసించారు.

మానవీయ విలువలకు పట్టం కడుతూ కథలు రాసిన మరో రచయిత్రి ఆచంట శారదాదేవి. ఈమె రాసిన దాదాపు వంద కథలు ‘పగడాలు’, ‘పారిపోయిన చిలుక’, ‘మరీచిక’, ‘వానజల్లు’ సంపుటాలుగా వెలువడ్డాయి. ‘‘ఈ కథల్లో ఉద్యోగినులైన స్త్రీ పాత్రలు అతి తక్కువ. వీరి కథలన్నీ గ్రామీణ ప్రాంతపు మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి, బడుగు జీవుల కథలే. స్త్రీ పాత్రలన్నీ అమాయకమైన, అంతర్ముఖీనమైన, అంతర్మథనంతో తమలో తామే సంఘర్షించేవిగా ఉంటాయి’’. అనవసరమైన వర్ణనలు, వ్యాఖ్యానాలు, సిద్ధాంతాలు, దిగ్భ్రమ కలిగించే ముగింపులు, భాషతో కుస్తీలు, నిర్మాణంలో కసరత్తులూ లేకపోవటమే శారదాదేవి ప్రత్యేకతగా విశ్లేషించారు.

1950-60లలో సాహిత్యరంగంలో ఆధునిక భావజాలం గల అతితక్కువ మంది రచయిత్రులలో కె.రామలక్ష్మి ఒకరు. చలం ప్రభావంగానీ, జీవిత భాగస్వామి ఆరుద్ర ప్రభావం గానీ లేకుండా సాహిత్యంలో రామలక్ష్మి తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారు. ‘చీకటిదారిలో చిన్న వదిన’, ‘ఆశకు సంకెళ్లు’, ‘దేవుడు లేనిచోట’, ‘కస్తూరి’, ‘ఈ తరం పిల్ల’, ‘నన్ను వెళ్లిపోనీరా’ వంటి నవలలతోపాటు ‘ఈ జీవికి స్వేచ్ఛ’, ‘అద్దం’ కథానికా సంపుటాలు వెలువరించారు. ‘‘అనవసర వర్ణనల జోలికి పోకుండా విషయాన్ని సూటిగా స్పష్టంగా మనసుకు తాకేలా చిన్న కథలలోనే పొందికగా చెప్పా’’రంటూ వ్యాస రచయిత్రి కితాబునిచ్చారు. స్వచ్ఛమైన సరళమైన వ్యావహారిక భాషతో కథను పరుగులు తీయించే నైపుణ్యం రామలక్ష్మి కథల్లో కనిపిస్తుందని పేర్కొంటూ కొన్ని కథలను ఉదాహరించారు.

‘‘కాలాతీత వ్యక్తులు’’ పేరుతో చిరకాలం గుర్తుండిపోయే నవల రాసిన డాక్టర్ పి.శ్రీదేవి రాశిలో తక్కువే అయినా వాసిగల కథలు రాశారు. అయితే ప్రధానంగా ‘‘వాళ్లు పాడిన భూపాలరాగం’’ కథపైనే దృష్టి కేంద్రీకరించి, విశ్లేషణ సాగించారు. కథంతా చెప్పకుండా పాత్రల్ని, వాటి స్వభావాల్ని సమగ్రంగా విశ్లేషించారు. ఆ పాత్రల్ని కూడా కాలాతీత వ్యక్తులు నవలలోని వ్యక్తులతో పోల్చి విశ్లేషించటంలో సుభద్రాదేవి లోతైన పరిశీలన కనిపిస్తుంది.

అచ్చమైన గ్రామీణ జీవనచిత్రాలను కథలుగా ఆవిష్కరించిన పి.యశోదారెడ్డి, మధ్యతరగతి ప్రజల జీవన సంక్షోభాన్ని సజీవంగా చిత్రించిన ద్వివేదుల విశాలాక్షి, మానవనైజాన్ని భిన్నకోణాల్లో పాఠకుల ముందు పరచిన మాదిరెడ్డి సులోచన… ముగ్గురూ మూడు మార్గాల్లో సాహిత్యాన్ని సంపద్వంతం చేశారు. ‘మా ఊరి ముచ్చట్లు’ (1973), ‘ఎచ్చమ్మ కథలు’ (1999) ద్వారా యశోదారెడ్డి తెలంగాణ గ్రామీణ జనజీవన విధానాన్ని చిక్కటి పాలమూరు జిల్లా మాండలికంలో అక్షరబద్ధం చేస్తే; ‘ఆమె కోరిక’, ‘కథామాలిక’, ‘తప్పెవ్వరిది’, ‘భావబంధం’ కథాసంపుటాల ద్వారా ద్వివేదుల విశాలాక్షి సంసారసాగరాల్లో ఈదుతున్న మహిళల తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడారు. ‘మాదిరెడ్డి సులోచన కథలు’, ‘అక్కయ్య చెప్పిన కథలు’లో మానవత్వం, వాస్తవికత, హేతుబద్ధమైన దృక్పథం ముప్పేటగా దర్శనమిస్తాయని వ్యాసరచయిత్రి పేర్కొన్నారు.


ఆరు దశాబ్దాల సాహిత్యానుభవంతో వందకు పైగా కథలు రాసిన రచయిత్రి నిడదవోలు మాలతి. ఆమె తన కథలన్నిటినీ ఆరు సంపుటాలుగా వింగడించి, తన బ్లాగులోనే పీడీఎఫ్ రూపంలో భద్రపరచుకున్నారు. తన జ్ఞాపకాల్నీ, అనుభవాల్నీ ‘ఎన్నెమ్మ కతలు’గా అక్షరీకరించి నాలుగు సంపుటాలుగా కూర్చారు. 1973లో అమెరికా వెళ్లాక కూడా తన సాహితీసేద్యాన్ని కొనసాగించారు.

‘‘వాస్తవికత, సామాజిక స్పృహ పేరుతో బీద, బడుగుజీవుల బతుకుచిత్రాల్ని కరుణార్ద్రంగానో, బీభత్సంగానో చిత్రించే కథలు కావు. అబ్బాయి, అమ్మాయి ప్రేమ పేరుతో జరిపే సరససల్లాపాలూ ఉండవు. దాంపత్య జీవితంలోని అపార్థాలూ అపోహలూ అనర్థాలూ లేవు. అయితే ఏమీ లేని నిస్సార కథలా ఈ రచయిత్రివి అనుకోవల్సింది లేదు’’ అంటూ నిడదవోలు మాలతి సాహిత్యసారాన్ని అపురూపంగా విశ్లేషించారు వ్యాసరచయిత్రి. రావిశాస్త్రి, మునిమాణిక్యం వంటి రచయితలేకాక మేరీ కొరెల్లీ వంటి ఆంగ్ల రచయిత్రల రచనలలోని హాస్యం, శైలిలోని చమత్కారాలకు మాలతి ప్రభావితురాలైనట్లు కూడా చెప్పటంలో సుభద్రాదేవి నైశిత్యం కనిపిస్తుంది. మొత్తంమీద ‘సర్రున కోసే గరిక నూగులాంటి సమస్యల్ని చర్చించిన కథలు నిడదవోలు మాలతి కథలు’.

ఆరేడు దశాబ్దాల కిందట బ్రాహ్మణేతర కులాల నుండి సాహిత్యరంగంలోకి అడుగు పెట్టిన ఒకరిద్దరు రచయిత్రులలో తనకంటూ ఒక ముద్రని సాధించుకొని నిలబడిన వారిలో ‘వాసిరెడ్డి సీతాదేవి’ ఒకరు. 42 నవలలే కాక 11 కథాసంపుటాలతో బలంగా తన ఉనికిని చాటుకున్నారు. అప్పటికి కొనసాగుతున్న రచనా ధోరణికి భిన్నంగా ఒక కొత్త రీతినీ, సమాజంలోని మరో కోణాన్నీ, ఇతరేతర కుటుంబ జీవనాల్నీ పరిచయం చేస్తూ వైవిధ్యం చాటుకున్నారు. ఆమె రాసిన ‘‘సానుభూతి’’ కథ గుండెల్ని మెలి తిప్పుతుంది. ‘మీ ఓటు నాకే’ (1979) కథ ఎన్నికలలోని లొసుగులు, స్వార్థ రాజకీయాలను ఎండగడుతుంది. ‘కొండవెనుక కనిపిస్తున్న తూర్పు ఆకాశం అరుణరేఖలు పులుముకొని పులి చంపిన లేడినెత్తుర్ని ఆత్రంగా తాగిన తోడేలు మూతిలా ఉంది’ వంటి కథా ప్రారంభాలూ; ‘రేషనుషాపు దగ్గర క్యూలో నుంచున్న వ్యక్తికి తన వెనక పెరుగుతోన్న క్యూ ధనవంతుడి బొజ్జలా ఉంది’ వంటి వర్ణనలూ సీతాదేవి రచనాకౌశలాన్ని పట్టిస్తాయని వివరించారు.

రాసిన కథల్లో సగానికిపైగా (33) ‘భారతి’ పత్రికలో ప్రచురించబడటం మామూలు విషయం కాదు. అలాంటి ఘనతను సొంతం చేసుకున్న రచయిత్రి ఆర్.వసుంధరాదేవి. కానీ కథాసాహిత్య చర్చల్లో ఆమె పేరు వినబడటం లేదనీ, క్రమంగా ఆమె విస్మృత రచయిత్రిగా మారే ప్రమాదం పొంచి ఉందన్న సుభద్రాదేవి ఆవేదన సత్వర పరిగణనాంశం. గాలిరథం (1977), నీడలు (1982) సంపుటాలతో సాహిత్యానికి విలువైన భాగస్వామ్యం అందించిన వసుంధరాదేవి కథల్లో తాత్విక చింతన, మానసిక విచికిత్స, మార్మికత, ఆధ్యాత్మికత, తార్కికత ప్రధాన భూమిక పోషిస్తాయని వ్యాస రచయిత్రి విశ్లేషించారు. ఈమె కథల నడక సముద్రంలా గంభీరంగా, లోతుగా ఉంటుందంటారు.

‘‘హృదయం నుండి మెదడులోకీ, నిస్సహాయత నండి అధికారానికీ, స్త్రీత్వం నుండి పురుషత్వంలోకీ, అనుభూతి నుండి అహంకార వ్యాపారంలోకీ పెరగడం మనిషికి తప్పనిసరేమో. ప్రకృతి ధర్మంలో గొంగళి పురుగులు సీతాకోకచిలుకలుగా మారతాయి. కానీ ఈ మానవ పరిణామంలో సీతాకోక చిలుకలు గొంగళి పురుగులుగా మారుతున్నాయి. మనిషికీ మనిషికీ మధ్యన ఉండగల వంతెన ప్రేమ ఒక్కటే’’ అన్న వసుంధరాదేవి అమూల్య అభిప్రాయాన్ని సందర్బానుసారంగా కోట్ చేయటం వ్యాసరచయిత్రి అనుభవానికి నిదర్శనం.

సామాజిక మార్పులకనుగుణంగా కథన పద్ధతిని మార్చుకుంటూ, సమకాలీన రచయితలతో పోటీ పడుతూ, అరవై ఏళ్లకు పైగా అదే వేగంతో సాగుతున్న రచయిత్రి డి.కామేశ్వరి. అనేక నవలలే కాకుండా 12 కథాసంపుటాలు వెలువరించారు. ‘ఒక్కొక్కప్పుడు విడమరచి వివరిస్తూ ఉపన్యాస ధోరణిలో అనేక విషయాలను కథల్లో చర్చించటం రచయిత్రి కథనశిల్పంగా’ సుభద్రాదేవి భావిస్తారు. కాదేదీ కవితకనర్హం అన్న శ్రీశ్రీ గేయంలోని తొమ్మిది అంశాల ఆధారంగా కామేశ్వరి ‘కాదేదీ కథ కనర్హం’ అనే ఉపశీర్షికతో రాసిన 9 కథల సారాంశాన్ని వివరించటం గొప్ప ప్రయత్నం. ముఖ్యంగా ‘రొట్టెముక్క’ కథను రెండు వాక్యాల్లోనే వివరించినా (పేజీ నం. 136), ఆ కథలోని అనివార్య బీభత్సం మనల్ని కుదిపేస్తుంది. రావిశాస్త్రి కూడా ‘‘ఋక్కులు శ్రీశ్రీ కోసం కథలు’’ పేరిట 9 కథలు రాసిన విషయాన్ని ప్రస్తావించటం విస్మరించలేదు.

దాంపత్య జీవనంలో స్త్రీ ఆలోచనల్ని ఆధునిక దృక్పథంతో ఆవిష్కరించిన రచయిత్రి ఇంద్రగంటి జానకీబాల. కాలానుగుణ మార్పులకు, ఉద్యమాలకు, సాహిత్యపరమైన పరిణామాలకూ ప్రతిస్పందించి రచనలు చేశారు. ఆరు కథానికా సంపుటాలలోని 130 కథలతో వెలువడిన ‘‘ఇంద్రగంటి జానకీబాల కథలు’’ సాహిత్యానికో చేర్పు. బలి, గుండె చెరువయ్యింది, నాన్నా ఎప్పుడొస్తావు, స్మృతి, దేవమ్మ, వెలుగును మింగిన చీకటి, పెట్టుబడి, పూలబాసలు వంటి కథలు ఆ కాలంలోని బడుగు, బలహీన వర్గాల జీవన విధానంలో ఎదుర్కొంటున్న ఆటుపోట్లను నిశితంగా చిత్రించాయని వివరిచారు. అయితే, 90ల తర్వాత రాసిన కథల్లో మాత్రమే స్త్రీగళాన్ని బలంగా వినిపించారని పేర్కొన్నారు. ఓ కథకు పెట్టిన ‘‘నిచ్చెన పైకి, మెట్లు కిందకీ’’… ఇప్పటికీ ఓ వైవిధ్యమైన శీర్షికే.

పి.సరళాదేవి, డి.సుజాతాదేవి, తురగా జానకీరాణి, వేదుల మీనాక్షీదేవి, పరిమళా సోమేశ్వర్, నల్లూరి రుక్మిణి, ఐ.వి.ఎస్.అచ్యుతవల్లి, జె.భాగ్యలక్ష్మిల కథల గురించి, వారి జీవన నేపథ్యం గురించి, రచనల సారాంశం గురించి రాసిన వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. మందరపు పద్మ, లలితలపై రాసిన చివరి వ్యాసం ఆసక్తికరం. వీరిని మొట్టమొదటి జంట కథారచయిత్రులుగా అభివర్ణించారు.

పుస్తకం చివర్న ప్రచురించిన శీలా సుభద్రాదేవి గారి ముఖాముఖి ద్వారా ఆమెకున్న విస్తృత సాహిత్యావగాహనను అర్థం చేసుకోవచ్చు. గోదావరి వెబ్ పత్రిక అడిగిన ప్రశ్నలకు సమాధానాల రూపంలో ప్రధానంగా ఆమె స్త్రీవాదం, దాని పూర్వాపరాలు, ఆవశ్యకతల గురించి స్పష్టంగా చెప్పారు.

24 మంది రచయిత్రులపై రాసిన వ్యాసాలతోపాటు ఈ సంపుటిలో ‘రచయిత్రుల కథానికాసాహిత్యంపై వెనుకబాటుతనం ప్రభావం’, ‘రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం’ శీర్షికలతో మరో రెండు వ్యాసాలున్నాయి. వెనుకబాటుతనాన్ని రచయిత్రులు దర్శించిన తీరు, ఆ క్రమంలో భాషను బలమైన వాహికగా మార్చుకున్న పరిణామాలను ఈ రెండు వ్యాసాల్లో చక్కగా విశ్లేషించారు.


ఇంతమంది రచయిత్రులను నిర్వచించే ప్రయత్నంలో శీలా సుభద్రాదేవి గారి సూక్ష్మదృష్టి, విశ్లేషణా చాతుర్యం అపూర్వం. కొన్ని వందల కథల్లో ఏ రెండు కథల్లో ఒకే తరహా వస్తువు ఉందో, ఎవరికి వారు ఆ వస్తువును ఎట్లా భిన్నంగా కథనీకరించారో, అందుకోసం ఆ రచయిత్రులు పాటించిన వైవిధ్య శిల్ప పద్ధతులేమిటో వివరించారు. కథల ప్రారంభం, ముగింపు ఏయే కథల్లో భిన్నంగా; ఇప్పటికీ నవ్యంగా ఉన్నాయో బేరీజు వేశారు.

సాధారణంగా రచయిత/రచయిత్రి తాను పుట్టిపెరిగిన ప్రాంతం ఆలంబనగా రచనకు పూనుకొంటారు. ఈ రచయిత్రులందరూ ఆయా ప్రాంతాల ప్రజాజీవితం, ఆనాటి వాతావరణం, సంస్కృతీ సంప్రదాయాలను తమ కథల్లో ఏ కోణాల నుంచి దర్శించారో వివరించే ప్రయత్నం చేశారు.

చాలా మంచి కథల్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు. సందర్భానుసారంగా కథల్లోని వాక్యాలు కోట్ చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం రాసిన కథల్లోని గ్రాంథిక భాష క్రమంగా వాడుకభాషగా పరిణామం చెందటం, సాహిత్యం సామాన్యుడికి చేరువయ్యే క్రమంలో సంభాషణల్లో స్థానిక పలుకుబళ్లు చేరటం తదితర అంశాలను చక్కగా వివరించారు. ఆయా రచయిత్రుల గురించి ప్రముఖుల ప్రశంసలను సందర్భానుసారంగా అందించారు.

చాలా కథల్లో రచయిత్రులు సూచించిన పరిష్కారాలు ఆనాటి కాలమాన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని బేరీజు వేసుకోవాలని చెప్పటం సుభద్రాదేవి గారి పరిణతికి నిదర్శనం.

కథల్లో రొడ్డకొట్టుడు ప్రతిపాదనలు, అరిగిపోయిన నినాదాలు ఉండకూడదన్న స్పృహతో అర్ధ శతాబ్దం కిందటే రాసిన ఈ రచయిత్రుల వ్యూహాత్మక సాధన వల్లనే కథ రాటుదేలిందని పేర్కొన్నారు.

‘‘సాహిత్యచరిత్ర పరిశీలించినప్పుడు కొందరి పేర్లు ప్రముఖంగా పదేపదే కనిపిస్తాయి. మరికొందరి పేర్లు అప్పుడప్పుడూ ఎక్కడన్నా దొర్లుతూ ఉంటాయి. మరికొందరు అకస్మాత్తుగా ఏ సంకలనంలోనో కనిపించి పాఠకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. అటువంటప్పుడైనా అటువంటి రచయితలను వెలికితీసి వారి ప్రతిభాపాటవాలను పాఠకులకు పరిచయం చేయకపోతే సాహిత్య చరిత్ర మనల్ని క్షమించదు’’ అంటూ ఆర్.వసుంధరాదేవి పరిచయానికి రాసిన ప్రారంభ వాక్యాలు ‘‘కథారామంలో పూలతావులు’’ పుస్తకావశ్యకతకు అద్దం పడతాయి.

మొన్నటి రచయిత్రులు ఇంత అరుదైన వస్తువుల్ని కథలుగా మలచి, సాహిత్యానికి గొప్ప మేలు చేశారు. ఈ తరం ఆ మేలును విస్తారం చేయాల్సిన బాధ్యతను గుర్తించటానికి ఈ పుస్తకం ప్రేరణ నిస్తుందనటంలో సందేహం లేదు. ఇంత మంచి పుస్తకాన్ని అందించిన శీలా సుభద్రాదేవి (8106883099) గారికి అభినందనలు.

పాఠకులతోపాటు ప్రతి రచయితా తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

ఎమ్వీ రామిరెడ్డి
ఎమ్వీ రామిరెడ్డి

ఎం వి రామిరెడ్డి జర్నలిస్టు, రచయిత, సంఘసేవకుడు. ముప్ఫయ్యేళ్లుగా కథలు రాస్తున్నారు. రామ్‌కీ ఫౌండేషన్ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి పేరిట మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా.. పెదపరిమిలో వృద్ధాలయం నిర్వహిస్తున్నారు.

Previous Post

కాలమే కవిత్వం

Next Post

తమిళ నవల : తెల్ల ఏనుగు (అధ్యాయం 1)

Next Post
తమిళ నవల : తెల్ల ఏనుగు (అధ్యాయం 1)

తమిళ నవల : తెల్ల ఏనుగు (అధ్యాయం 1)

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com