తెలుగు అనువాదం : శ్రీమతిహవాయి కావేరిబాయిగారు
(1931 అక్టోబరు 1న వెలువడిన గృహలక్ష్మి మాసపత్రికలో ప్రచురితమైన అనువాద కథ. మూలకథారచయిత వివరాలు తెలియవు.)
(కథా నిలయం సౌజన్యంతో)
భోజనము జరిగిన పిమ్మట అడవిజంతువులను గూర్చిన సంభాషణ ప్రారంభమయ్యెను.
“ఒక రాత్రిపూటలో వాహారార్ధమై ముప్పది, నలువది మైళ్లుకూడ వ్యాఘ్రములు సాగింపగలవని మాలోనొకరు చెప్పితిమి.
“ముప్పది, నలువది మైళ్ళు సునాయాసముగానే పెద్దపులి ప్రయాణము చేయును. ఆరుగంటల కాలమునకు లోపుగానే డెబ్బది మైళ్లకు హెచ్చుగా ఒక బెబ్బులి వెళ్ళుట నేనెఱుగుదు”నని కర్నల్ బోలాంగ్ గారనిరి.
“అయితే, పులివెనుక మీరుకూడను వెళ్లియుంటిరా, యేమి?” యని మాసీనియర్ క్యాప్టెన్ (Senior Captain) ప్రశ్నించిరి.
“వెనుక వెళ్లితినా? శార్దూలముతోనే పయనము చేసితిని. చెప్పెదవినుడు.” ఇట్లు కర్నల్ బోలాంగ్ గారు ఉత్తరమిచ్చిరి.
“ఇది సంభవించినప్పుడు నేనింకను కుఱ్ఱవాడ. హిందూ దేశ మదియే రావడము, బొంబాయిలో దిగి నేను చేరవలసినదండుయుండిన X అనుయూరికి పోవుచుంటిని. ఆచ్చటచ్చట, విశ్రాంతినిమిత్తము, మజిలీలు చేయుటలో Z అనుచోట మిక్కిలి యాలస్యము చేసితిని. అందుచేత నచ్చటినుండి సాధారణమైన మార్గమున ప్రయాణము చేసినయెడల నేను చేరవలసిన వేళకు నా గమ్యస్థాన మందుకొననని తెలిసి యడవిలో పడిపోవు యడ్డదారిలో పోదమని నిశ్చయించితిని,
నాపామానులు నదివరకే సాగనంపియుంటిని. ఇప్పుడు గుర్రమునెక్కి యడవిజొచ్చి చార్టులు కంప్యేసుల (Chart and Compass) సహాయమువలన నరుగుచుంటిని. ఒక పాతిక మైళ్ళు వెళ్ళువరికి చీకట్లు క్రమ్మెను. ఏదైన నొక చిన్న గ్రామము కనబడినచో నచ్చట విశ్రమింతుననుకొనుచుండగా హటాత్తుగా వాయువు మీద సవారీ చేసినవాడనై దగ్గరనున్న పొదలలో పిల్లి మొగ్గవేసి పడిపోతిని, నాతురగముమీద కొక మువ్వన్నె మెకమురికి దానిని క్రిందపడద్రోసి భక్షించుచుండెను,
నాకు . గాయము లెట్లు తప్పెనో యెఱుగను. అయినను పెద్దపులివారు విందారగించి స్వగృహమున కేగువరకు కదలక మెదలక పడియుండవలెనని నిశ్చయించితిని.
విందు ముగిసెను. తన పాదములను నాసికా కేసరములమీద దుడుచుకొని యొడలు విరిచి పెద్దపులి యావుళించెను. ఇక నీక్రూరమృగము వెడలిపోవునని తలంచితిని. అబ్బో! యది వెర్రిదికాదు. అది నా వాహనమును భక్షించుచుండిన సమయమంతయు నామీద నొకకంటి దృష్టి నిలిపియుండెను. ఇప్పుడు నా వైపునకు యడుగులు వేయుచుండెను. సరే, ముందు నాగుర్రము. తరువాత నేనుకదా యనుకొంటిని,
అయితే ఆమె (ఆది యాడుపులియని గ్రహించితిని) యుద్దేశము వేరుగా నుండెను. నాయంగీని తనదంతములతో కఱచుకొనియెత్తి నన్ను వీపుమీద వేసుకొని బయలుదేరెను. గంటకు నాలుగు మైళ్ల చొప్పున ప్రాకుచు వెళ్లుచుంటి మనుకొందురా? ఆతిశీఘ్రముగా దౌడుతీయుచుంటిమి. అడ్డము వచ్చినవానిమీదనుండి
దుమికి వెళ్ళుచుంటిమి. మ్రానులుండినచో ప్రక్కకుతిరిగి వెళ్లుచుంటిమి.
అంధకారమందు క్రూర మృగముమీద స్వారి చేయుట భీతికర మైనను ముఖమల్ పాన్పులు వేసి (Springs) కలిగిన మంచముమీద పరుండి ప్రయాణము చేసినట్లే, శార్దూలము వీపుమీద ప్రయాణము చేయుచుంటిని,
కొంతకాలమునకు, చంద్రోదయమగుట చేత, చుట్టుప్రక్కలనున్న వస్తువులు గోచరములయ్యెను. రెండు పర్యాయములు దాహము తీర్చుకొనుటకు నిలిచితిమి. మొదటిసారి యొక చిన్న చెరువులో నా వాహనము పానము చేయు చుండగా నొకతుపాకిగుండు యా మెకర్ణములవంటివెళ్లెను. మిక్కిలి యద్భుతముగా నాపె
ప్రాణముదక్కెను. ప్రచండమైన యాగ్రహముతో గర్జించుచు నచ్చటనుండిన యొక వృక్షముడిక్కు యురికెను. ఆవృక్షముమీద నే యీవ్యాఘ్రము నంత మొనరింపవలెనని వచ్చిన వేటకాడు కూర్చుండియుండెను.
ఇక నేను తప్పించుకొందువని యుల్లాసమొందితిని. ఆకటా! తక్షణమే శారూలము మరల దౌడు మొదలుపెట్టెను. రెండవసారి యొక చిన్న యేటిలో పులినీరు త్రాగుచుండగా నా పాన్కును (Flask) దీని దానిమూతయందు కొంచెము బ్రాంది నీటిలో కలిపి పుచ్చుకొనగలిగితిని. మరునాడు X చేరువరకు నిదియే
నాకాధారమయ్యెను.
మేమెంతవడిగా పోవుచుంటిమో చెప్పజాల. ఒకప్పుడు తుపాను గాలియొక్క యురువడితో వెళ్లుచుంటిమి. చతుష్పాద జంతువులలో నేదియైన వింతవేగముగా పోవునని నాకు తెలిసియుండలేదు.
ఒకానొకచోట మామార్గమున నొక పెద్దకొండవలె నొక మదపుటేనుగు నిలువబడియుండెను. వెన్నెల దానిమీదపడగా నెట్లువర్ణింతు దంతియొక్క ప్రభావము? ఆహా! నేనే నా పాదములమీద నిలువబడి యొక తుపాకి హ స్తమునపొందినవాడనైయుండినచో పర్వతమువలె నిలచియుండు దంతి నేలమీద సాష్టాంగ దండములు నాకిడునుకదా యనుకొంటిని.
మాయిరువురి వాసనతగిలిన వెంటనే మేము చొరబోవుచున్న పొదలమీదికి గజము వచ్చుచుండెను. తొండమును తోకను పైకెత్తెను. మహాకోపముతో పరచుచు ఖడ్గములవలె తీవ్రముగానుండు దంతములతో భయంకరరూపముదాల్చెను.
మేమైతెనో చక్కగా స్టీం (Steam) ఎక్కించితిమి. మెఱుపుతీగను మించినది మా వేగము. కారు దున్నల మందయొకటి గురకలు పెట్టుచు నిద్రించుచుండెను. ఆ గురకలకు కొమ్మల మీద యాకులు కదలుచుండెను. ఈయడవిదున్నల మధ్యనుండి వెళ్లునప్పుడు మట్టుకు మావేగము కొంచెము తగ్గెను.
మరొకచోట నొక చిఱుత యొక లేడిపిల్లను తినుచుండెను. మమ్మును జూచి గుర్రుమనుచు పాఱిపోవుటకు ప్రయత్నించెను గాని దానియాహారమును మేము లక్ష్య పెట్టక దానిమీదనుండి దుమికి వెళ్లి తిమి.
మరొక స్థలమున నావాహనము కొబ్బరి చెట్టు శిఖరమంత యెత్తు పై కురికెను. దీనికి కారణము నాకు తెలియదు. అచ్చటచ్చట మానులకుచుట్టుకొని గొప్ప సర్పములు కనబడెను. ఏదైన నొక పెద్ద యురగము మామార్గముననుండెను గాబోలు,
మరికొంతదవ్వున నొక వానర సేనకనబడెను. మమ్ములను చూచి నలుదిక్కులకు చెదరి చెట్లలో దాగెను. శ్వేత శిరోజములు దాడియు క లిగియున్న నొక్క వృద్ధ మర్కటము వెనుక నీ కోతులదండు సిపాయిలవలె నలుగు రేసిగల లై ను ను (Lines) లలో మార్చింగు (marching) చేయుచుండెను. మావలన కార్యము చెడగా నవితిట్టుచు, పళ్లనుజూపుచు, మరియు సలిపిన ఇతర కృత్యములను మీరు చూచియుండినచో కడుపుబ్బ నవ్వియుందురు.
రాత్రి దాదాపు యెనిమిదిగంటలు కొట్టిన పిదప మేము బయలు దేరియుంటిమి. సుమారు రెండుగంటలు వేయువరకుకూడ మేము వెళ్ళుచుంటిమి. చివరకు వృక్షవిహీనమై రాతిబండలు గల తావు చేరితిమి. ఒక పెద్ద బిలమును దాటి దానిగుహలోనికి తీసుకపోయి నావాహనము నన్ను క్రిందకుదిం చెను.
లోనికి వెన్నెల వచ్చుచుండగా నా గుండె ఝల్లుమనెను. నెత్తుటి చే తడసిన యిసుక పైన రెండు పులికూనలు పరుండియుండెను. గుహయందంతటను దుమ్ములుండెను. ద్వారమునొద్ద దట్టముగా మృదువైన యీకలుపడియుండెను. ఏదో నొకమయూరమునుబట్టి పొట్టపగులునట్లు దీని మాతృప్రవేశము కూడ గమ
నింపలేనంతటి గాఢనిద్రలో నాకూనలుండెను. పసిబిడ్డలకు మృదువైన మాంసముకావలెనని తల్లి నన్ను తాభక్షింపక పిల్లల కొరకు తెచ్చెను.
సరే గుహ చేరిన పిమ్మట నన్ను క్రిందవైచి వ్యాఘ్రము ద్వారమున కడ్డముగా పరుండెను. నేను తప్పించుకొను టెట్లు? నేను ప్రాణములతో నున్నాను అను సంగతి గ్రహించినచో నన్ను పులి వెంటనే కైలాసమునకు బంపును. కొంతకాలమునకు మెల్లగా తెల్లవారుచుండెను. ఆజంతువులను గుహయందలి యెముకలు జూడ
నాహృదయము చిందరవందర య్యెను. పైగా మానవయంగములలోని దుమ్ముల నేకములుండెను. కొన్ని గంటలలో నాశరీరము శార్దూలములకు భోజనమగునని తలచితిని.
వెలుతురు తీవ్రముగా ముదురుచుండెను. ఇంతలో నురుములను మించుగర్జనయొకటి వినవచ్చెను. దాని ప్రతిధ్వని మైలు దూరము వెళ్లెను. ఆహా! ఈవ్యాఘ్రుకుటుంబమునకు యజమానుడగు మగ పులియొక్క రాకడయిదియని గ్రహించితిని. గర్జనము అంతకంతకు బిగ్గరగా వినుచు సమీపించుచుండెను. తుదకు వెలుపల రాలియున్న యెండుటాకులమీద నడుగుల చప్పుడు విశదమయ్యెను. నాకు మృత్యువు సమీపములో నేయున్న దనుకొంటిని.
అయితే, దైవము మరియొక విధముగా నేర్పాటు చేసియుండెను. గృహస్తురాలు పురుషుని యాగమనము జూచి తొందరగా లేచి నాశరీరముపై వంతెనవలె తన శరీరమునుంచెను. తోకతో విసుకమీద దెబ్బలు వేయుచు గుర్రుమని మగనితో కలబడుటకు సిద్ధపడెను. ఇప్పటికి పట్టపగలు వలె వెలుతురాయెను. మగశార్దూలము
యొక్క భీకరరూపము నాకు కనబడెను. చింతనిప్పులవంటి కండ్లతో, కోరలు పైకి చూపుచు, కోపముతోను, యాతురతతోను గుహలో ప్రవేశింపజొచ్చెను.
ఆహా! మాతృవాత్సల్యము! పసిబిడ్డలకై సంపాదించిన రుచ్యమగు పదార్థమును, వేటాడుటకు బద్ధకించి సోమరిపోతుగా తిరుగుచుండు పెనిమిటికి తల్లియిచ్చునా? ఒక క్షణములో మగనిమీదికి బాణమువలె భార్యపడెను. వెనుకటి కాళ్ళమీద నిలువుగా నిలువబడి వారిరువురును ఘోరయుద్ధము చేసిరి. దెబ్బలుకొట్టు కొనుట, గోళ్ళతో రక్కుకొనుట, నొకరినొకరు క్రిందపడద్రోయుటకు చూచుట, నింకన నేక విధములుగా భయంకరమగు పోరుసలిపిరి. అది యెట్లు ముగియునో, యెవరికి జయముకలుగునో చూచుట కత్యంతయుత్సాహకరముగానుండెను. అయినను యేపక్షమువారు గెల్చిన గాని, నాకు మరణముతప్పదు గావున విజయే
మంచివేళయని చల్లగా తప్పించుక పోతిని.
మిక్కిలి భయముతో నొక గంటసేపు తిరుగగా నొక బయలుకనబడెను. అచ్చట కొందరు పచ్చిక తీయుచుండిరి. నేను ప్రశ్నింపగా వారు నేను జేరవలసినదండునకు చెందిన గడ్డితీయువారని తెలిసికొంటి. కంటూజ్ మెంట్ (Cantonment) మిక్కిలి సమీపముగా నున్నదని చెప్పి, మరింత దగ్గరగానుండు దారిని వారు నాకు చూపిరి.
నేను వెళ్ళుచుంటిని. నాపటాలమునకు చెందిన ఆఫీసరులు (Officers) పరేడు (Parade) నుండి తిరిగివచ్చుచుండిరి. వారిని కలిసికొని నేనెవరనో చెప్పుకొంటిని.
“నీ గుర్రమెక్కడ?” యని యడ్డుటండు (adjutant) గారడిగిరి.
” నేను తీసుక రాలేదని జవాబు చెప్పితిని.
“అడ్డుటంటు గారికి నీవు వ్రాసిన జాబులో నీవు 2 నుండి నిన్నటిదినమున బయలు దేరుదునని తెలిపియుంటివిక దా? అయితే, బోలాంగ్ ! నీ వతి త్వరితముగా వచ్చినట్లు కనబడుచున్న దే?”యని తారుమారులుగా చిరిగిన నాదుస్తులను చూచుచు కర్నల్ గా రడిగిరి.
“అయ్యా! నిన్నటిదినమే నేను Z విడచివచ్చినాను” అంటిని,
“ఎట్లు ప్రయాణము చేసితివి?” అనిరి.
“మొదటి పాతిక మైళ్ళు గుర్రముమీద
“ఆటుతరువాత, పల్లకీ మీద కాబోలు?” అనిరి.
“ఆబ్బే, లేదండి” యని యుత్తరమిచ్చితిని.
“నాటుబండిమీద నా?” యని ప్రశ్నించిరి.
“అదికూడ కాదు” అని చెప్పితిని.
“మరెట్లు వచ్చితివి, చెప్పవయ్యా?” యని యడిగిరి.
ప్రపంచమున నెట్టి శూరుడైనను తలబెట్టజాలని పరాక్రమకృత్యము, నేనే నర్చియుండినను మిక్కిలి దైన్యతవహించి, భయభ క్తులతో నిట్లంటివి.
“మిగిలిన డెబ్బది మైళ్లు సుమారు, పెద్ద పులిమిదవ స్త్రీని,”
“పులిమీదనా? పులిమిదనే!” యని యందరు నొక్కమారు గా నరచి గట్టిగా నవ్వసాగిరి. జరిగిన విషయములు విశదముగా చెప్పినను వారు నమ్మకపోయిరి.”
![]()
జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.




Discussion about this post