తెలుగు అనువాదం: పి.శ్రీనివాస్ గౌడ్
ప్రపంచ సాహిత్యంలో వెలువడిన ప్రతి రచనా నమోదుకు నోచుకోలేదు. లిపిలేని కాలాల్లో మౌఖికంగా ఒక తరం నుండి ఒక తరానికి సాహిత్యం, కళలు కొనసాగాయి. అటువంటి సాహిత్య సంపద ప్రతి దేశానికి వుంది. ప్రతి ప్రాచీన నాగరికతకూ వుంది. అయితే వేల లక్షల సంవత్సరాల నుండి మౌఖిక పరంపరగా వస్తున్న ఈ సాహిత్య సంపదకు కర్తలు ఎవరనేది తెలియకుండా అజ్ఞాతంగా వుంది. కారణం ఏమిటంటే సాహిత్యంలోని సారాంశం, సృజన మీద తప్ప సృజనకారుడి అజ మీద అప్పటికాలంలో పట్టింపు లేదు. కానీ కాలాలు గడిచే కొద్దీ, నాగరికతలు అభివృద్ది చెందే కొద్దీ మానవ జీవపరిణామం మీద పరిశోధనలు చేసిన కొద్దీ, సాహిత్యము, కళలు మానవ జీవ పరిణామంలో ముఖ్య భూమిక పోషిస్తుంది కాబట్టి దీని మీద ఆసక్తి మొదలయింది. దీనితో పరిశోధకులు, కవులు అంతగా వెలుగు ప్రసింరించని ప్రాచీన సాహిత్య అధ్యయనం చేయడం ద్వారా అప్పటి సామాజిక స్థితిగతులు, ప్రాచీనుల ఆలోచనలు తెలుసుకోగలుగుతున్నారు. దానిలో భాగమే ఈ గ్రీక్ కవితలు.
అన్ని దేశాల నాగరికతలకు వున్నట్టుగానే గ్రీకుల సాహిత్యం ఉన్నతంగా వుంది. కొన్ని కవితలకు అవి ఎవరు చెప్పారో చారిత్రక ఆధారాలు లేవు. ఆ కవితలు ఎవరు రాసారో నిరూపణ అయిందాక వాటిని అజ్ఞాత కవిత్వం గానే వ్యవహరిస్తారు.
Poems from the Greek Anthology అనేది గ్రీక్ ఆంథాలజీ నుండి ఎంపిక చేసిన కవితల నుండి కెన్నెత్ రెక్స్‌రోత్ చేసిన అనువాద సంకలనం. దీనిలో కొన్నింటికి వాటి రచించిన కవులు / కవయిత్రుల సమాచారం లేదు.
Poems from the Greek Anthology మొదట 1962లో యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ప్రెస్ ద్వారా ప్రచురించబడింది. తరువాత 1999లో డేవిడ్ ముల్‌రాయ్ పరిచయంతో విస్తరించిన ప్రతిగా పునఃప్రచురణ చేయబడింది. గ్రీక్ ఆంథాలజీ అనేది 7వ శతాబ్దం BCE నుండి 6వ శతాబ్దం CE వరకు రచించిన 4,000కు పైగా ఎపిగ్రామ్‌లు, ప్రేమ కవితలు, శవపేటిక శాసనాలు, ఇతర చిన్న కవితల సంకలనం. ఈ సంకలనం మొదట మెలియాగర్ ఆఫ్ గడారా (1వ శతాబ్దం BCE) చేత సంకలనం చేయబడింది. తరువాతి శతాబ్దాల్లో వివిధ సంపాదకులు వాటిని సవరించి, ఆధునీకరించారు.
రెక్స్‌రోత్ అనువాద విధానం సాంప్రదాయికమైనది కాదు. కొన్ని అనువాదాలు మక్కీకి మక్కీ ఉంటాయి. మరికొన్ని గ్రీక్ టెక్స్ట్‌పై వ్యంగ్యాత్మక వ్యాఖ్యానాలుగా, స్వేచ్ఛగా ఉంటాయి. చాలా సందర్భాలలో ఆయన అసలు టెక్స్ట్‌ను ఉపయోగించకుండా తన జ్ఞాపకశక్తి ఆధారంగా అనువాదాలు చేశాడు. గ్రీక్ కవితల వ్యాకరణాన్ని అనుకరించడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఇంగ్లీష్‌లో అవి సహజంగా అనిపించవని ఆయన భావించాడు. బదులుగా ఆయన సరళమైన, సంగీతాత్మకమైన ఇంగ్లీష్‌ను ఉపయోగించాడు. ఈ విధానం ఆయన సృజనాత్మక స్వేచ్ఛను, గ్రీక్ కవితల భావోద్వేగ సారాంశాన్ని సంగ్రహించింది. ఇది గ్రీక్ కవితల యొక్క సార్వత్రిక ఇతివృత్తాలైన – ప్రేమ, మరణం, కాలం లాంటి వాటితో ఈ అనువాదాలను ఆధునిక పాఠకులకు సమీపంగా తీసుకువచ్చింది.
రెక్స్‌రోత్ గ్రీక్ ఆంథాలజీ నుండి తనకు ఇష్టమైన కవితలను ఎంపిక చేశాడు. సప్ఫో, అనైట్, గ్లైకాన్, ఆంటిపాట్రోస్, లియోనిడాస్, అస్క్లెపియాడెస్, అమ్మియానోస్ వంటి కవుల రచనలను చేర్చాడు. ఈ ఎంపికలు ఆయన వ్యక్తిగత అభిరుచిని, తన మానవ అనుభవాన్ని, ప్రేమానుభూతులను, ఉద్వేగాలను, అప్పటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే ఇతివృత్తాలపై దృష్టి పెట్టాయి.
రెక్స్‌రోత్ Poems from the Greek Anthology లోని అనువాద కవితలు సాధారణంగా చిన్నవి, ఎక్కువగా ఆరు నుండి పది పంక్తుల వరకు ఉంటాయి, కానీ అవి లోతైన భావోద్వేగాలను, స్పష్టమైన ఆలోచనలను, త వ్యక్తీకరిస్తాయి.
రెక్స్‌రోత్ శైలి సరళమైనది, కానీ సంగీతాత్మకమైనది. ఇది గ్రీక్ కవితల సౌందర్యాన్ని, భావోద్వేగ గాఢతని ఆంగ్లంలో సంగ్రహిస్తుంది. ఆయన కవితలు “plain language”ను ఉపయోగిస్తాయి. ఇది ఆధునిక ఇంగ్లీష్ పాఠకులకు సమీపంగా ఉంటుంది, కానీ అదే సమయంలో గ్రీక్ కవితల సాంస్కృతిక, చారిత్రక సందర్భాన్ని గౌరవిస్తుంది.
రెక్స్‌రోత్ ఈ అనువాదాలు గ్రీక్, రోమన్ సాహిత్యాన్ని ఆధునిక అమెరికన్ పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చాయి, ఇది ఆయన సాంస్కృతిక, సాహిత్య రంగాలలో భాషలను, భిన్న జీవన విధానాలను ప్రపంచానికి పరిచయం చేసే ఒక వారధిగా పనిచేసింది. కొందరు విమర్శకులు రెక్స్‌రోత్ యొక్క స్వేచ్ఛాయుత అనువాద విధానాన్ని సాంప్రదాయిక గ్రీక్ టెక్స్ట్‌కు దూరంగా ఉందని భావించారు. అయితే, ఈ స్వేచ్ఛ ఆయన అనువాదాలకు ఒక ప్రత్యేక ఆకర్షణను ఇచ్చిందని చాలామంది అంగీకరిస్తారు.
కెన్నెత్ రెక్స్‌రోత్ Poems from the Greek Anthology ఇంగ్లిషు అనువాదం గ్రీక్ లిరిక్ కవిత్వం యొక్క శాశ్వత సౌందర్యాన్ని ఆధునిక పాఠకులకు అందించే ఒక అద్భుతమైన సంకలనం. రెక్స్‌రోత్ సరళమైన, శక్తివంతమైన ప్రతిభతో గ్రీక్ కవితలను సమర్థవంతంగా అనువదించాడుత. ఈ పుస్తకం రెక్స్‌రోత్ కవిత్వ ప్రతిభ, అనువాద నైపుణ్యం, సాంస్కృతిక వారధిగా ఆయన నిర్వహించిన కీలక పాత్రను ప్రదర్శిస్తుంది. కవిత్వ ప్రేమికులు, సాహిత్య విద్వాంసులు, సాధారణ పాఠకులు ఈ సంకలనాన్ని ఒక సంతోషకరమైన, జ్ఞానోదయం కలిగించే అనుభవంగా భావిస్తారు.
ఎందుకు ఈ అనువాదానికి పూనుకున్నారనే ప్రశ్నకు రెక్స్‌రోత్ ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో ఇలా రాసాడు. “నేను పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గ్రీకు నుండి చేసిన మొదటి అనువాదం సప్ఫో’ ఆపిల్ తోట’. అది నన్ను చాలా ఉత్సాహ పరిచింది. నేను రాత్రులు సరిగ్గా నిద్రపోలేకపోయాను. అప్పటి నుండి నా యవ్వన కాలంలో సరుకు రవాణా రైళ్లలో, ఎడారి, పర్వత శ్రేణులపై, నక్షత్రాలతో నిండిన శిబిరాలలో, మంచుతో కప్పబడిన క్యాబిన్లలో, ఓడబోర్డులపై, ప్రేమలో, ఒంటరితనం, నిరాశా సమయాలలో, జైలులో, పిచ్చివారి సహాయకుడిగా పనిచేస్తున్నప్పుడు, అనేక ఇతర ఉద్యోగాలలో, అనేక ఇతర ప్రదేశాలలో, గ్రీస్ కవులు నా నిరంతర సహచరులుగా ఉన్నారు.”
కెన్నెత్ రెక్స్‌రోత్ (1905 -1982) కవి, విమర్శకుడు, అనువాదకుడు. చైనీస్, జపనీస్ భాషల నుండి తన అనువాదాలకు పేరు చెందాడు. అతను 1950లలో బీట్ ఉద్యమాన్ని ప్రారంభించడంలో ఎంతో సహాయపడ్డాడు. సాహిత్య ఆవిష్కరణల కేంద్రంగా శాన్ ఫ్రాన్సిస్కో ఆలోచనను కనుగొన్నట్లు విస్తృతంగా పరిగణించబడ్డాడు. డేవిడ్ ముల్రాయ్ మిల్వాకీలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో విదేశీ భాషలు, ఇంకా భాషాశాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్. అతను ప్రారంభ గ్రీకు లిరిక్ పొయెట్రీ, హోరేస్ యొక్క ఓడ్స్, ఎపోడ్స్ అనువాదకుడు.
అజ్ఞాత కవితలు
1.
నాకు రెండు రోగాలు ఉన్నాయి,
ఒకటి ప్రేమ, రెండు పేదరికం.
పేదరికాన్ని నేను భరించగలను,
కానీ ప్రేమ జ్వరం
భరించలేనిది.
2.
విందుల మాధుర్యాన్ని,
కొంటెతనం ప్రతిఫలాన్ని,
ప్రేమికులతో పంచుకునే
ఉల్లాసాన్ని నిలుపుకుంటాను,
కానీ వాటిని
నా ఆధీనంలో వుంచుకోను.
3.
నేను పేదదాన్నే
నా పేరో, ఇది ఏ వారమో నాకు
గుర్తు చేయాల్సిన అవసరం లేదు
మీ గీర వల్ల ఏం ఉపయోగం లేదు
నేను మద్యం పోస్తున్నప్పుడు
మీరు నెత్తాళ్ళు కడగాలి
మనం నగ్నంగా మద్యం తాగి,
శయ్య మీద వైభోగం అందుకుందాము.
4.
ఓయ్! ఏమిటి విషయం?
గమ్ముగా ఉండు.
లేచి అతను రాకముందే వెళ్ళిపో,
లేకపోతే అతను నీకు
ఏదైనా దారుణం తలపెడతాడు
నాకు ఏదైనా హాని చేస్తాడు.
ఇప్పటికే తెల్లవారింది.
కిటికీలోంచి వెలుతురు
నీకు కనిపించడం లేదా?
5.
విశ్రాంతి లేని, లాలనైన కళ్ళు
నువ్వొక ప్రత్యేకమైన విషయం చెబుతున్నావు
ఆనందం, చిరు ప్రేమ అక్కడ కూర్చున్నాయి
మధ్యలో దివ్యానుభూతి..
6.
ప్రియమైన సబినోస్,
ఈ చిన్ని సమాధి రాయి
మన అమర ప్రేమకు నిదర్శనం
నేను నిన్నెప్పుడూ కోల్పోతాను
నువ్విప్పుడు చనిపోయిన వారి
జీవజలాలను సేవించినప్పుడు
నన్ను మరిచే జలాన్ని
తాగలేదని ఆశిస్తున్నాను.
![]()

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి.
రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.




Discussion about this post