ఇరానీ కథ రచయిత్రి: నౌషిన్ సలరీ [ లైక్ ఎ వెల్ ]
తెలుగు అనువాదం: పి. వి. ఆర్. శివకుమార్
పాపకు నిద్రపట్టిందని రూఢి చేసుకుని, ఆమె నెమ్మదిగా లేవబోతుండగా మోగింది ఫోన్.
‘ఈవేళప్పుడు తనకి ఎవరు ఫోన్ చేస్తారు?’ అనుకుంటూ, తీసింది.” హలో” అంది లోగొంతుకతో. అవతలనుండి వెంటనే జవాబు లేదు. ఏవో కలగాపులగంగా వినవస్తున్న శబ్దాలు…దూరం నుండి …బహు దూరం నుండి వస్తున్న శబ్దాలు! కొద్ది క్షణాల తరవాత ‘బీప్’ మన్న శబ్దం. చిన్న నవ్వు. ఆ వెనకే పలకరింపు-
“హెలోవ్…” చివరి అక్షరాన్ని సాగదీస్తూ… కొంటెగా…
ఉలిక్కిపడిందామె. ‘ఎవరది? ఎవరు అలా అక్షరాన్ని సాగదీస్తూ పలకరించే మనిషి? ఎవరిదోగానీ, చిరపరిచితమైన చిరుహాసమే!’
“ఎవరది?” విసుగ్గా వినవచ్చింది జావద్ ప్రశ్న. బెడ్ రూమ్ తలుపు ముందు నిల్చుని అడుగుతున్నాడు.
“అదే తెలియటం లేదు. శర్జాద్ అనుకుంటాను.” మౌత్ పీస్ కి చేయి అడ్డం పెట్టి భర్తకు జవాబిచ్చింది.
“శర్జాద్? శర్జాద్ ఎవరు?” ఆసక్తి కాదు, అసహనం ఆ కంఠంలో.
ఆమె భర్తవైపు చూడకుండా, “ హలో” అంది, తను కూడా చివరి అక్షరం సాగదీస్తూ.
అవతలినుంచి ఈసారి బిగ్గరగా వినిపించింది నవ్వు,
”ఓ… అయితే గుర్తు పట్టావన్నమాట. ఎలా ఉన్నావ్?”
“శర్జాద్! నువ్వే? ఎన్నేళ్ళకి!” సంతోషంగా అందామె.
“ఎన్నేళ్లయినాగానీ! నేనే గుర్తు పెట్టుకు పలకరించాను తప్ప, నీకు గుర్తురాలేదుగా!”
నవ్వులోనే నిష్ఠూరం!, “ఇన్నాళ్లుగా ప్రయత్నించినా దొరకని నీ నంబర్, అదృష్టం కొద్దీ, మొన్న దొరికింది.”
“అదృష్టమా?”
“అంతే అనుకోవాలి. మొన్న బజార్లో అనుకోకుండా మీ కజిన్ కనబడింది. ఆమె దగ్గర నుంచి నీ నంబర్ తీసుకున్నాను. తను ఇక్కడే ఉంటోందిటగా! ”
“అవును.”
“మరి నాకెందుకు రాయలేదు ?”
“అంటే…అంటే… తనీమధ్యనే అక్కడకు వచ్చింది. నీకు రాద్దామనుకుంటూనే, తీరికలేక…” ఇటువంటి సందర్భాలలో అందరూ చెప్పే సాకునే చెప్పింది ఆమె.
“నీకెప్పుడు దొరుకుతుంది తీరిక మేడమ్?”
“వదిలెయ్. ఇకనుంచీ, తీరిక చేసుకునైనా రాస్తానులే.” అంది ఆమె.
“ఊఁ…చూస్తాను. సరే, ఇప్పుడు చెప్పు, మీ ఆయన ఎలా ఉన్నారు?”
తలత్రిప్పి, తలుపు వైపు చూసింది ఆమె. అతనక్కడ లేడు. వెళ్ళిపోయాడు.
‘పడుకుని, తన కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటాడు’ అనుకుంది.
“బాగానే ఉన్నాడు.” వస్తున్న నిట్టూర్పు అణుచుకుని, చెప్పింది స్నేహితురాలితో.
“నీ కూతురు ఎవరిలా ఉంటుంది?” అడిగింది శర్జాద్.
నవ్వింది ఆమె, “ఎవరిలా ఉంటుంది? నా కూతురిలాగానే ఉంటుంది!”
‘అంటే నీలాగేనా? నువ్వెలా ఉన్నావు ఇప్పుడు? పెళ్లి ఫోటో లో ఉన్నట్టేనా, ఏమైనా మారావా?”
“నువ్వే చూసి చెప్పాలి, ఎప్పుడొస్తావ్?” ఒక్క క్షణం ఆగి అంది, “ఎన్నేళ్లయిందో! నా పెళ్లి కన్నా ముందే వెళ్లిపోయావ్.”
ఒక్క క్షణం ఇద్దరు మౌనంగా ఉండిపోయారు.
“ఇప్పుడు అక్కడ టైమెంత అయిందే?” మౌనాన్ని భగ్నం చేయాలి గనుక, ఆ ప్రశ్న వేసింది శర్జాద్.
“పదకొండు దాటింది. మీ దగ్గర?”
“పదకొండు దాటింది, మధ్యాహ్నం!” గట్టిగా నవ్వింది శర్జాద్, “సో, మంచి నిద్రలో లేపేశానా!
మీ వారికి కోపం తెప్పించానా?” కాజువల్ గా వచ్చినా, ఆ ప్రశ్న సూటిగా తగిలింది ఆమెకి.
జవాబివ్వలేక, మాట మారుస్తూ అంది, “చెప్పవే శర్జాద్, ఏమిటి కబుర్లు, ఇన్నాళ్ళ తరవాత!”
“మన వాళ్ళ కబుర్లు ఏమైనా తెలుస్తుంటాయా?”
“మనవాళ్లు?”
“అదే, మన స్కూలు వాళ్ళు…” అంది శర్జాద్.
శర్జాద్ మాటతో ఆమె కళ్ళముందు క్లాస్ రూమ్ మెదిలింది. క్లాస్ రూం లోని గ్లోబ్ మెదిలింది.
నీలి రంగు సముద్రాలు, ఆకుపచ్చ మైదానాలు, మట్టి రంగు పర్వతాలు, గిరగిరా తిరుగుతూ… ప్రపంచమంతా కళ్లెదుటే…కానీ, ఏదీ అందుకునే అవకాశం ఉండదు. నమూనా ప్రపంచం!
“ఆఁ..అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు.” తడబడుతూ చెప్పింది.
‘అప్పుడప్పుడంటే ఎప్పుడు? ఏం కలవటం? ఎక్కడో, ఏదో క్యూ లో నిలబడి, క్యూ ఎంత పొడవుందోనని మెడ బయటకు సాచి చూస్తున్నప్పుడు, దూరంగా కనబడే ఒక తెలిసిన ముఖం! పాపను తీసుకుని, డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు డిస్పెన్సరీ లో ఎదురుపడి, ‘హాయ్’ అనే మరో ముఖం, జావద్ తో కలిసి, ఏ టాక్సీ కోసమో వెయిట్ చేస్తూ రోడ్డుమీద నిలబడి ఉన్నప్పుడు ఎదురుగా వెళ్తున్న కారు విండో లోంచి కనబడే చిరునవ్వూ, పలకరింపుగా ఊగే చెయ్యీ! అవే… అవే స్నేహితులతో సమాగమ సందర్భాలు!
“ఆ పిల్ల పేరేమిటి?” హఠాత్తుగా అడిగింది శర్జాద్.
“ఏ పిల్ల?” మళ్ళీ తడబడింది ఆమె. జీవితమంతా అలవాటైన తడబాటు!
“ఆ రోజు ప్రోగ్రామ్ లో పాట పాడిన పిల్ల. మనమందరం తెలియకుండానే ఏడ్చేశాం, ఆ పాట వినగానే! గుర్తు వచ్చిందా?” గట్టిగా నవ్వుతోంది శర్జాద్.
“ఓ.. ఆ పిల్లా!” శర్జాద్ నవ్వులో శృతి కలిపింది ఆమె, పేలవంగా. నిజానికి ఆ పిల్ల పేరు ఆమెకి గుర్తుకి రాలేదు, నల్లని కను పాపలు గుండ్రంగా తిప్పుతూ ఒక పిల్ల ఏదో విషాద గీతం పాడటం మాత్రం లీలగా గుర్తు.
‘ఎక్కడుందో ఇప్పుడు! ఏం చేస్తోందో! ఆమెకీ తన లాగే ఎవడో జావద్ దొరికితే, తన లాగే ఉంది ఉంటుంది. లేదా, శర్జాద్ లాగా, ఎవరితోనైనా సంతోషంగా కబుర్లు కలబోసుకుంటూ ఉండవచ్చు!’ అనుకుంది.
క్లాస్ రూం. మెటల్ గ్లోబ్. గిరగిర తిరిగే ప్రపంచం మళ్ళీ ఆమె కళ్ళ ముందు…
“హలోవ్…ఉన్నావా…” అరుస్తోంది శర్జాద్ అవతల నుంచి, “ఆలోచనల్లో పడిపోయావా?”
‘అంత అదృష్టం లేదు. ఆలోచనలు ఇక్కడ నిషిద్ధం’ మనసులోనే అనుకుని, పైకి మాత్రం
“ఆ పాట గురించే ఆలోచిస్తున్నాను.” అంది.
“నీ అడ్రసే తెలియదు. నిన్ను కాంటాక్ట్ చెయ్యటం ఈ జీవితంలో కుదరదనే అనుకున్నాను, మొన్న మీ కజిన్ ని కలిసేదాకా.” అన్నది శర్జాద్.
“ఆయన తరుచూ ఉద్యోగం మారుతూ ఉంటారు. మేము తరచుగా ఊళ్ళు మారుతూనే ఉన్నాం, ఏదో ఒక హడావుడి. ఎప్పటికప్పుడు నీకు ఉత్తరం రాయాలనుకుంటూనే… ” క్షమాపూర్వకంగా అన్నదామె.
ఇద్దరి మధ్యా మళ్ళీ శబ్దరాహిత్యం. నిశ్శబ్దానికి కూడా భావ ప్రసారం చేయగల శక్తి ఎందుకుండదో!
మళ్ళీ మొదలు పెట్టింది శర్జాద్, “ ఈ ఏడాదితో పూర్తయిపోతుంది నా చదువు. ఇన్నేళ్లలో ఎంతమంది పిల్లల్ని కన్నానో లెక్కలేదు…” గట్టిగా నవ్వుతూ చెప్పింది.
శర్జాద్ మంత్రసాని వృత్తిలో శిక్షణ పొందుతోందన్న విషయం పూర్తిగా మర్చిపోయింది ఆమె.
ఈ మాటలతో గుర్తుకు వచ్చింది. ‘కన్నాను’ అన్న పదానికి శర్జాద్ వాడిన అర్ధం ‘చూశాను’ అని తెలిసి, ఆమెకి ఆపుకోలేని నవ్వొచ్చింది.
“ఇంకా పూర్తి కాలేదా?” కర్కశమైన కంఠం ఆ నవ్వుని చిదిమేసింది. ఉలిక్కిపడి, తల తిప్పింది ఆమె. గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు జావద్..
“అయిపోవచ్చింది.” అంది తొట్రుపడుతూ.
“ఏమిటి అయిపోవచ్చింది?” అడిగింది శర్జాద్.
“అహఁ … అయిపోవచ్చిందా అన్నాను, నీ కోర్సు.” సర్దుకుంటూ అందామె.
జావద్ ఆమె వంక చురుగ్గా చూసి వెళ్లిపోయాడు.
“నీకు మన లిటరేచర్ టీచర్ గుర్తున్నాడా?”
‘నేను టీచర్లనే కాదు, కాలేజీ జీవితాన్నే మర్చిపోయాను’ గొణుక్కుంటూ, “ఏ టీచర్?” అడిగింది.
“ఆయనే, లిటరేచర్ టీచర్. తరచుగా అనేవాడు. జీవితమే నాటక రంగం. మనమంతా పాత్రధారులం.”
“ఓ…అవును.” నిరాసక్తంగా జవాబిచ్చింది.
“ఆయన చెప్పింది నిజమే అనిపిస్తోంది కదూ! నా స్టూడెంట్ రోల్ అయిపోవచ్చింది, తరవాతి పాత్ర వెదుకులాడే పనిలో పడ్డాను అప్పుడే!” అంటూనే, “మా వార్డెన్ వస్తోంది. ఫోన్ పెట్టేస్తున్నా. మళ్ళీ చేస్తాను ఎప్పుడో… వీలు కుదిరినప్పుడు. నువ్వు ఉత్తరాలైనా రాస్తుండు. ఇందాకే మాట ఇచ్చావు. గుర్తు పెట్టుకో!” హడావిడిగా అనేసి, ఫోన్ పెట్టేసింది శర్జాద్.
‘గుర్తు పెట్టుకో!’
ఫోన్ డిస్ కనెక్ట్ అయిందిగానీ, ఆ మాట ఆమె మైండ్ నుంచి డిస్ కనెక్ట్ కాలేదు.
గుర్తు పెట్టుకో!… గుర్తు పెట్టుకో!… గదిలో నలుమూలలనుంచీ ప్రతిధ్వనిస్తూ అదే మాట.
తనచుట్టూ తాను తిరుగుతూ భూగోళం…అదే మెటల్ గ్లోబ్!
‘గురుతు నిలుపుకొనుమా’ దయనీయంగా విషాద గీతం పాడుతూ, వెన్నాడుతున్న ఓ లేత గాత్రం!
చేతి వ్రేళ్లకి అంటిన చాక్ పీస్ పొడిని ఊదుకుంటూ వెనక్కు తిరిగి, ‘అర్ధమైంది కదా! గుర్తుపెట్టుకోండి’ అంటున్న ఓ టీచర్ కంఠం.
ఏవి గుర్తున్నాయి? ఎన్ని గుర్తున్నాయి? ఎవరు గుర్తున్నారు?
అందరూ గుర్తుపెట్టుకోమనేవారే!
“నీ కలల ప్రపంచంలో షికార్లు కొట్టకు. స్నేహానికి దాసోహం కాకు. నాకు స్నేహాలు అసహ్యం.
ఇది నా జీవితం. కనుక, నీకూ స్నేహాలు నిషిద్ధమే. నా జీవితంలో నువ్వు. నా అవసరాల కోసం, నా సుఖాలకోసం మాత్రమే నువ్వు. గతమంటే గతించిపోయిన ట్రాష్. ఫర్గెట్ ఆల్ దట్.’
ఎన్నోసార్లు చెప్పిన మాటలనే దృక్కుల్తో పునరావృతం చేస్తూ, తన జీవిత ద్వారంలో నిలువెత్తునా కాపలా నిలబడ్డ జావద్!
ఏదైనా ఎలా గుర్తుంటుంది?
పాపమీది దుప్పటి సవరించి, నుదుటి పై ఒక సున్నితమైన ముద్దు పెట్టి, గదిలోనుంచి బయటకు నడిచింది ఆమె, తమ బెడ్ రూమ్ లోకి.
సుపరిచితమైన పాదాల చప్పుడుకి కళ్ళు కూడా తెరవకుండానే అడిగాడు జావద్,
“ అయిపోయిందా?” జవాబిచ్చే అవసరం లేనట్లు మంచం అంచున కూర్చొంది. కాళ్ళు రెండూ ఒకదానితరవాత ఒకటి గా నెమ్మదిగా జాపుకుని, మడుచుకుంది.
తరవాత, పక్కమీద వాలింది. చేతులు రెండు పొట్టమీద పెట్టుకుని, కళ్ళు మూసుకుంది.
కళ్ళు మండుతున్నాయి, హృదయంలో ఏదో సన్నని మంట… నివురుని ఊది, శర్జాద్ రగిలించిన మంట. ఆ మంటల్లో ఎన్నాళ్లైనా భగ్గు భగ్గున మండటమే తప్ప , మాడి మసి కాలేని జ్ఞాపకాలు!
![]()

వృత్తి రీత్యా ఇంజనీర్. గత అరవై ఏళ్ళుగా కథలు రాస్తున్నారు. మూడువందల యాభై పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వాటిలో నలభై ఆరు కథలకు బహుమతులు వచ్చాయి. విపులలో యాభై పైగా అనువాద కథలు రాశారు. అయిదు కథా సంపుటాలు, పి వి ఆర్ శివకుమార్ కథానికలు, కిరణం, అతిథి(కి)దేవుడు,నీదే గానీ నీదే కాదు, అవ్యక్త రాగం, మూడు నవలలు, శమంత -హేమంత, జీవన పోరాటంలో ఆశలు ఆరాటం, ఆచరణల్లో ఆదర్శాలు పుస్తకాలుగా వచ్చాయి. 70 వ దశకంలో హైదరాబాద్ ఆకాశవాణిలో నాటికలు, ఇతర కార్యక్రమాలు యాభై దాకా ప్రసారమయ్యాయి.




Discussion about this post