పి. శ్రీనివాస్ గౌడ్
1945 ఆగష్టు 06,09 న అమెరికా జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణుబాంబు వేసింది. రాజకీయ, ఆర్థిక కారణాలు ఏమైనప్పటికీ ఈ దాడిలో సుమారు 1,29,000 మంది, ఆగష్టు 09,1945 న జరిగిన దాడిలో సుమారు 2,26,000 మంది అమాయక ప్రజలు, స్త్రీలు, పిల్లలు ప్రాణాలు విడిచారు. ఈ భీకర దాడిలో ఆనాటి జపనీయులు ఎవరూ మర్చిపోదామన్నా మర్చిపోలేనంత తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంఘటన ఇది. ప్రపంచ చరిత్రలోనే పెను విషాదాన్ని మిగిల్చిన ఈ దుర్ఘటన ఎంతో మంది మనుషుల హృదయాలను కదిలించి వేసింది. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఈ చర్యను ముక్తకంఠంతో ఖండించారు.
ఈ మానవ విషాదాన్ని ప్రతిబింబిస్తూ అనేక రచనలు వెలువడ్డాయి. నవలలు, కథలు, చిన్న కథలు, వ్యాసాలు, కవితలు, తంకలు, హైకులు విరివిగా వచ్చాయి. ఈ దాడిని ప్రత్యక్షంగా చూసినవారు, దాడిలో గాయపడినవారు ఎంతోమంది తమ తమ అనుభవాలను రచనలుగా వ్యక్తీకరించారు.
దానిలో భాగంగా రాసిన పుస్తకాలు –
1.The Atomic Bomb : Voices from Hiroshima and Nagasaki, Editors : Kyoko and Mark Selden
2.CHILDREN OF THE ATOMIC BOMB : An American Physician’s Memoir of Nagasaki, Hiroshima, and the Marshall Islands by JAMES N.YAMAZAKI with Louis B. Fleming వంటి పుస్తకాలు అప్పటి అసహాయుల ఆర్తనాదాలను నమోదు చేసాయి.
ముఖ్యంగా అందరి హృదయాలను కలచివేసింది వేలకువేల పసిపిల్లల మరణాలు. ఎందుకు తాము ఈ దాడికి గురయ్యామో, ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నామో కూడా తెలియకుండా, బంగారు భవిష్యత్‌ను కోల్పోయిన పిల్లల మృతదేహాలను చూసి చలించని మనషి లేడు. ఇక కవులు చలించకుండా వుంటారా..రచయితలు కదిలిపోకుండా వుంటారా?
అందుకే అప్పటి సంఘటన గురించి నమోదు చేసిన పిల్లల జ్ఞాపకాల సమాహారం ఈ కథనాలు..ఈ కథనాలు అప్పటి జపాన్ ప్రజల సామాజిక జీవనాన్ని, నైతిక వర్తనని, కుటుంబ బాంధవ్యాలని తెలుపుతాయి.
అలాంటి కథనాలు కొన్ని :
1. సుజిమోటో ఫుజియో (బాంబు దాడి సమయంలో 5 గం.)
అణు బాంబు పడినప్పుడు, నేను సురక్షితంగా ఉన్నాను, యమజాటో ఎలిమెంటరీ స్కూల్ ఆట స్థలంలోని ఒక మూల వాలులోని మాళిగలో వైమానిక దాడి ఆశ్రయంలో ఉన్నాను. ఆ సమయంలో పాఠశాలలో ఉన్న వారిలో నానమ్మ, నా స్నేహితురాలు నవోషి టాగావా, నేను మాత్రమే తప్పించుకున్నామని నేను జంకుతున్నాను.
ఎవరైనా బ్రతికి ఉంటే, వాళ్ళుఉవాళ్ళుఉ కొద్దిమంది మాత్రమే అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ చనిపోయారు.
అలారం మోగగానే, యునో-మాచిలోని వృద్ధులు, పిల్లలు అందరూ మేము అనుకున్నట్లుగా ఆశ్రయానికి పారిపోయారు. పాఠశాలలో సివిల్ గార్డుల ప్రధాన కార్యాలయం, ప్రథమ చికిత్స పోస్ట్ ఉన్నందున, గార్డులు, వైద్యులు, అనేక ఇతర పెద్దలు అక్కడ ఉన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా అక్కడ పనిలో ఉన్నారు.
విమానాలు రాకపోవడంతో ప్రమాదం సూచించే అలారం రద్దు చేసారు. అందరూ షెల్టర్ బయటకు వెళ్లారు. చాలా మంది పిల్లలు ఆట స్థలంలో బిగ్గరగా కేకలేస్తూ ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు, ఉపాధ్యాయులు కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఆట స్థలంలోకి వచ్చారు. ఆట స్థలం జనంతో, సందడితో నిండిపోయింది.
నాకు ఒక పెద్ద శబ్దం వినిపించింది.
మిగతా పిల్లలు చాలా గోల చేస్తున్నారు, వాళ్ళు దానిని వినలేదు.
నానమ్మ చేయి పట్టుకుని, నేను ఆశ్రయం వైపు పరిగెత్తాను. “శత్రువుల విమానం ” పాఠశాల పైకప్పు మీద ఉన్న కాపలాదారుడు గట్టిగా అరుస్తూ, గంట కొట్టాడు.
ఆట స్థలంలో ఉన్న వారందరూ గబగబా ఆశ్రయం వైపు పరుగెత్తారు. ఆశ్రయం వైపు పరిగెత్తిన మొదటివాడిని నేనే.. వెనుక వరకు. అప్పటికే మెరుపులా మెరుపులా వీచింది. బలమైన గాలి నన్ను గోడకు బలంగా తోసేసింది.
కొంత సేపటి తర్వాత నేను బయటకు చూసేసరికి – ఆట స్థలం అంతా మనుషులు, మ్రాన్పడినట్లుగా ఉన్నారు. మైదానంలో మురికి కనిపించనంతగా చాలా మంది అక్కడ పడిపోయి ఉన్నారు. చాలా మంది చనిపోయి కదలకుండా ఉన్నారు.
అయితే, అక్కడక్కడ కొందరు తమ కాళ్ళను తన్నడం లేదా చేతులు పైకెత్తడం చేశారు. కదలగలిగిన వారు ఆశ్రయంలోకి ప్రాకారు. కాబట్టి ఆశ్రయం గాయపడిన వారితో నిండిపోయింది.
నా అన్నయ్య, చెల్లెళ్ళు కూడా ఆశ్రయంలోకి నెమ్మదిగా పరిగెత్తుకుంటూ వచ్చారు, వారు కూడా కాలిన గాయాలతో ఏడుస్తున్నారు. అమ్మమ్మ తన జపమాల తీసి ప్రార్థన చేస్తోంది. నేను ఆశ్రయం ప్రవేశద్వారం వద్ద కూర్చుని నా తల్లి, తండ్రి కోసం ఎదురు చూస్తున్నాను.
దాదాపు ముప్పై నిమిషాల తర్వాత, చివరికి నా తల్లి వచ్చింది. ఆమె రక్తంతో తడిసిపోయింది. ఆమె ఇంట్లో భోజనం సిద్ధం చేస్తుండగా ఆమెకు దెబ్బలు తగిలాయి. నేను ఆమెను అంటిపెట్టుకుని ఉన్నప్పుడు నాకు కలిగిన ఆనందాన్ని నేను మర్చిపోలేను.
మేము వేచి చూస్తూనే ఉన్నా, నాన్న ఇంకా కనిపించలేదు.అతను ఉదయం సివిల్ గార్డుగా పని చేయడానికి బయటకు వెళ్ళాడు.
బ్రతికి ఉన్నవారు ఒక్కొక్కరుగా నొప్పితో చనిపోయారు. నా చెల్లెళ్ళు ఆ మరుసటి రోజే చనిపోయారు. తల్లి విషయానికొస్తే, ఆమె కూడా మరుసటి రోజు మరణించింది. అప్పుడు అన్నయ్య చనిపోయాడు. నేను కూడా చనిపోతానని అనుకున్నాను. ఎందుకంటే ఆశ్రయంలో పక్కపక్కనే పడుకున్న ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు. నా పెద్దన్నయ్య కూడా కాలిపోయాడు. అమ్మ కూడా నా కళ్ళ ముందే బూడిదయింది, నిప్పుల మధ్య కాలిపోయింది. నేను ఏడుస్తూ దాన్ని చూస్తూ ఉన్నాను.
కానీ అమ్మమ్మ, నేను బ్రతికిపోయాము, బహుశా మేము ఆశ్రయంలోనే తిరిగి వచ్చినందున మాకు రేడియేషన్ పడకపోవడం వల్ల కావచ్చు. ఆ తర్వాత నేను, అమ్మమ్మ ప్రతిరోజూ చనిపోయిన వారి ముఖాలను పరిశీలించేవాళ్ళం. అది నా తండ్రి కోసం వెతకడానికే. కానీ, బతికి ఉన్నాడా లేక కాలి చనిపోయాడా, నా తండ్రి ఎక్కడా కనిపించలేదు.
ప్రాణాలతో బయటపడిన వారు ఆట స్థలంలో కట్టెలు సేకరించి అక్కడ అనేక శవాలను దహనం చేశారు. అమ్మమ్మ జపమాల ప్రార్థనలు చదువుతూ దాన్ని చూసింది. నువ్వు స్వర్గానికి వెళితే నీ అమ్మను చూడగలవని అమ్మమ్మ అంటుంది.
అమ్మమ్మ ఇప్పటికే వృద్ధురాలు, కాబట్టి బహుశా ఆమె త్వరలో స్వర్గానికి వెళ్ళవచ్చు. కానీ నేను ఇంకా చిన్నపిల్లని కాబట్టి, నా తల్లిని చూడటానికి, నా పెద్ద అన్నయ్యతో ఆడుకోవడానికి, నా అందమైన అక్కలతో మాట్లాడటానికి పదేళ్లు పడుతుంది.
నేను యమజాటో ఎలిమెంటరీ స్కూల్లో చేరాను. నేను ఇప్పుడు నాల్గవ తరగతి చదువుతున్నాను.
నేను నా స్నేహితులతో ఉన్నప్పుడు ఉల్లాసంగా ఆడుకుంటాను, ఆట స్థలం చుట్టూ పరిగెత్తుతాను. కానీ కొన్నిసార్లు నాకు ఆ రోజు గుర్తుకు వస్తుంది. తల్లి కాలిపోయిన చోట వంగి, నా వేళ్ళతో మట్టిని తాకుతున్నాను..నేను వెదురు కర్రతో లోతుగా గుచ్చినప్పుడు, నల్ల బొగ్గు ముక్కలు బయటకు వస్తాయి. నేను ఆ ప్రదేశాన్ని చూస్తున్నప్పుడు, తల్లి ముఖం భూమిలో మసకగా కనిపిస్తుంది. ఆ స్థలంలో ఇతర పిల్లలు నడుస్తూ, తమ కాళ్ళతో అడుగు పెట్టడం చూసినప్పుడు, నాకు కోపం వస్తుంది.
నేను ఆటస్థలానికి వెళ్ళిన ప్రతిసారీ, ఆ రోజు నాకు గుర్తుకు వస్తుంది. ఆటస్థలం చాలా అందంగా ఉంటుంది. కానీ చూస్తుంటే బాధగా వుంటుంది. నేను ఈ పాఠశాలలో మరో నాలుగు లేదా ఐదు సంవత్సరాలు చదువుతాను. ఆ సమయంలో నేను ప్రతిరోజూ ఇలాగే అనుకుంటానా అని ఆశ్చర్యపోతున్నాను.
అమ్మమ్మ, నేను, మా అమ్మ, పెద్ద సోదరుడు, చెల్లెళ్లకు అంత్యక్రియలు నిర్వహించి, వారి ఎముకలను సమాధి కింద పాతిపెట్టాము. కానీ, తండ్రి శిలువ అక్కడ ఉన్నప్పటికీ, అతని ఎముకలు కింద లేవు.
నాన్నా, నాన్నా..మీ అస్థికలు ఎక్కడ ఉన్నాయి? నాన్నా, మీరు ఎక్కడ వున్నారు? ఆ ఉదయం మీరు ఆరోగ్యంగా బయలుదేరారు..
అమ్మమ్మ, నేను ఇప్పుడు శిథిలాల మీద నిర్మించిన గుడిసెలో ఒంటరిగా నివసిస్తున్నాము. ఆమెకు అరవై ఏళ్లు పైబడినప్పటికీ, ఆమె ఉరాకామి నది దిగువ ప్రాంతంలో నత్తగుల్లల కోసం వేటకు వెళుతుంది, ఎందుకంటే ఆమె పని చేయకపోతే మాకు తిండి లేదు. సాయంత్రం ఆమె తడిసి ముద్దగా ఇంటికి వస్తుంది. ఆ చిన్న చిన్న నత్తగుల్లలను అమ్మడం ద్వారా, మేమిద్దరం జీవిస్తున్నాము.
పాత రోజుల్లో, మాకు ఒక దుకాణం ఉండేది. మేము సోయా సాస్, ఉప్పు, సోయా బీన్ పేస్ట్, స్వీట్లు, బొమ్మలు కూడా అమ్మేవాళ్ళం. అంతేకాకుండా, నాన్న తెలివిగా, కష్టపడి మంచి డబ్బు సంపాదించేవాడు. మేము మంచి దుస్తులు ధరించేవాళ్ళం.
మేము మళ్ళీ పాత రోజుల్లోకి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు నా తల్లి కావాలి, నాన్న కావాలి, నా పెద్ద సోదరుడు కావాలి, నా చెల్లెళ్ళు కావాలి.అందరూ బతికి ఉంటే, వర్షం లోపలికి పడని ఇంట్లో మనం నివసించగలిగేవాళ్ళం. అమ్మమ్మ అంత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉండేది కాదు, నేను మరింత సంతోషంగా చదువుకునేవాడిని.
నేను ఇతర పిల్లలతో గొడవల్లో ఓడిపోవలసిన అవసరం ఉండేది కాదు. అమ్మమ్మ ప్రతి ఉదయం ప్రార్థనకు హాజరు కావడానికి కేథడ్రల్ చర్చ్ కు వెళుతుంది. ఆమె జపమాలతో ప్రార్థన కూడా చేస్తుంది. తర్వాత ఆమె నాతో, “అంతా దేవుని దయ. అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది” అని చెబుతుంది.
ఆమె స్వచ్ఛమైన హృదయాన్ని నేను కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను.
![]()
2. కవాసకి సాకు (బాంబు దాడి సమయంలో 11 గం.)
ఆగస్టు 1న ఉరగామిపై చాలా బాంబులు పడటంతో, మేమందరం అబురగి లోయలోని పెద్ద వైమానిక దాడి ఆశ్రయంలో దాక్కున్నాము. ఆ తర్వాత ప్రతిరోజూ వైమానిక దాడులు జరుగుతుండటంతో, మేము అక్కడే ఉండిపోయాము. 8వ తేదీన మేము మొదటిసారి ఇంటికి వెళ్ళాము. కుటుంబంలోని అందరూ కలిసి భోజనం చేసాము. చాలా కాలం తర్వాత మొత్తం కుటుంబం సమావేశమైంది.
“మనం మళ్ళీ ఎప్పుడు కలిసి ఉండగలమో చెప్పడం కష్టం, కాబట్టి ఈ రాత్రికి మనం రెగ్యులర్‌గా ఇరుగు పొరుగు వాళ్ళతో మీటింగ్ చేసుకుందాం” అని అమ్మ అంది.
సమావేశం మా ఇంట్లోనే జరిగింది. నా తల్లి పొరుగువారితో, “మనం చనిపోయినప్పుడు, చేతులు పట్టుకుని కలిసి చనిపోదాం” అని చెప్పింది.
అందరూ కలిసి బిగ్గరగా నవ్వారు. మా అమ్మ కూడా సంతోషంగా నవ్వింది.
మరుసటి రోజు-
ఏదో ఒక విధంగా మాకు అమ్మను వదిలి వెళ్ళాలని అనిపించలేదు. విమానాల దాడి అలారం మోగినప్పటికీ, మేము ఆశ్రయం వైపు పరిగెత్తకుండా లోపల ఆడుకుంటూనే ఉన్నాము. నా తల్లి పదే పదే చెప్పింది, “ఈ రోజు ప్రమాదం జరగవచ్చు, కాబట్టి త్వరగా దాంకోండి.”
అయినప్పటికీ మేము నిరాశ చెందాము. చివరికి మా అమ్మ మా భోజనాన్ని మాకు పెట్టి, మమ్మల్ని తరిమికొట్టినట్లుగా ఆశ్రయానికి వెళ్ళమని బలవంతం చేసింది. నా తల్లి ఒంటరిగా ఇంట్లో ఉండి, నీటిని తోడుకుంటూ, వాయు దాడులకు సిద్ధం కావడానికి వర్షపు తలుపులు మూసేస్తూ బిజీగా పనిచేసింది.
మేము పట్టణంలోని అందరితో కలిసి పర్వతం దిగువన మాళిగలో తవ్విన పెద్ద ఆశ్రయంలో ఆడుకుంటున్నాము.
అప్పుడు ఒక పెద్ద మెరుపు మెరిసింది – నాకు గుర్తుంది, పేలుడు గాలికి నేను ఎగిరిపోయినప్పుడు నేను స్పృహ కోల్పోయానా? నేను స్పృహలోకి వచ్చేసరికి, ఆ పెద్ద ఆశ్రయంలో ప్రజలు కిక్కిరిసి పోయారు. ఇంతమంది ఎక్కడి నుండి వచ్చారు? అక్కడ ఎన్ని వందల మంది ఉన్నారో నాకు తెలియదు. అంతేకాకుండా, ఆశ్రయం ప్రవేశద్వారం గుండా మరింత మంది వస్తున్నారు. గుమ్మడికాయల మాదిరిగా ఉబ్బిపోయి, ఏడుస్తూ, అరుస్తూ లోపలికి చొచ్చుకుపోయారు. చాలా మంది నగ్నంగా, బట్టలు లేకుండా ఉన్నారు.
మరింతగా లోపల గాయపడిన వాళ్ళ తాకిడి పెరిగింది. నేను కదలలేకపోయాను. అయినప్పటికీ, ఎక్కువసేపు అలాగే ఉండటం వల్ల పక్షవాతానికి గురైనట్లు అనిపించి, నేను కొంచెం కదలడానికి ప్రయత్నించాను. నేను అలా చేసిన ప్రతిసారీ, నా దగ్గరున్న వ్యక్తులు నొప్పితో కేకలు వేశారు.
వారందరికీ తీవ్రమైన కాలిన గాయాలు అయ్యాయి.
ఎలాంటి పెద్ద వైమానిక దాడి జరిగిందో…? అది అసాధారణమైనదే అయి ఉంటుందని నేను అనుకున్నాను. నేను ఎవరిని అడిగినా, నాకు తిరిగి వచ్చిన సమాధానం “మొత్తంగా..” అని మాత్రమే, ఎవరికీ నిజం తెలియదు.
తల్లిదండ్రుల తమ పిల్లలను పిలుస్తున్నారు..పిల్లల ఏడుపు గొంతులు తల్లిదండ్రులను వెతుకున్నాయి – అనేక గొంతులు ఒకదానికొకటి అస్తవ్యస్తంగా, మట్టి గోడలకు ఢీకొని, తిరిగి ప్రతిధ్వనించాయి, కేవలం మూలుగులాగా వినిపిస్తున్నాయి.
నా తల్లి గురించి నేను ఆందోళన చెందడం మొదలుపెట్టాను. నాన్న క్షేమంగా ఉన్నారా? నా పెద్దన్నయ్య? సమయం గడిచినప్పటికీ, మా కుటుంబంలో ఎవరూ ఆశ్రయం ప్రవేశద్వారం వద్ద కనిపించలేదు. నేను బయటకు వెళ్ళడానికి చాలా భయపడ్డాను. బహుశా తక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానం శబ్దం నిరంతరం వినిపిస్తూనే ఉంది.
షెల్టర్‌లోని గాలి క్రమంగా దుర్వాసన వచ్చింది. నేను ఊపిరాడకుండా పోతానని అనుకున్నాను. నాకు వికారం మొదలైంది. దాదాపు ఐదు గంటలకు నాన్నగారు ఆరోగ్యంగా కనిపించారు. దాంతో మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాము, మేమందరం కలిసి బిగ్గరగా ఏడ్చాము.
వెంటనే నాన్న నన్ను ఎత్తుకొని ఆశ్రయం నుండి బయటకు తీసుకువెళ్ళాడు. బయటి గాలి ఎంత హాయిగా ఉందో! అప్పుడు నాకు మొదటిసారి గాలి విలువ అంటే ఏమిటో తెలిసింది.
నాకు అకస్మాత్తుగా ఉత్సాహం వచ్చింది. గాయపడిన వారిని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాను. జాగ్రత్తగా ఉండండి, ఏమి చేయాలో నాకు తెలియకపోవడంతో, నేను వారిని అడిగాను, “ఏమిటి నీళ్ళు కావాలా?” అని. అందరూ సమానంగా సమాధానమిచ్చారు,,” అవును..” అని. నేను చుట్టుపక్కల అంతా వెతికాను, కానీ స్వచ్ఛమైన నీరు ఎక్కడా కనిపించలేదు. ఆశ్రయం ముందు కొంచెం నీరు ఉన్నప్పటికీ, ఆ నీరు బురదగా ఉంది. గాయపడిన వారికి నీళ్ళు ఇవ్వలేకపోయాను. నేను నిరాశలో ఉండగా, ఒక గాయపడిన వ్యక్తి ఆశ్రయం నుండి బయటకు వచ్చాడు. అతను నీళ్ళ కోసం తీవ్రంగా ఆరాటపడ్డాడు. అతను తన నోటిని నీళ్ళకు పెట్టుకుని, బురద నీటిని రుచిగా ఉన్నట్లుగా మింగాడు. తరువాత, సంతృప్తి చెంది, అతను పాకడానికి ప్రయత్నించాడు, కానీ ఒక నిమిషం గడిచేలోపు, అతను నేలపై పడిపోయాడు..ఇక కదలలేదు. నేను అతని దగ్గరకు వెళ్ళినప్పుడు, అతను అప్పటికే చనిపోయాడు.
గాయపడి ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి, ఈ బురద నీటిని తాగారు. తాగడం ముగించిన వెంటనే, ఎటువంటి మినహాయింపు లేకుండా మరణించారు. ఇది చూసి, నేను ఒక ఆలోచనలో మునిగిపోయాను:
“మానవులు ఎంత పేదవాళ్ళు. ఒక్క గుక్క నీరు తాగి చనిపోతారు.”
ఒక స్త్రీ తన బిడ్డ కోసం వెతుకుతూ వచ్చింది. ఆమె బిడ్డ పేరును బిగ్గరగా పిలిచింది, కానీ ఎక్కడి నుంచీ సమాధానం రాలేదు. ఆ స్త్రీ నీరు త్రాగి చనిపోయిన వారిని ఒక్కొక్కరిగా చూస్తూ చుట్టూ తిరిగింది. అకస్మాత్తుగా ఆమె ఒకరిని పట్టుకుంది. ఆమె వెతుకుతున్న బిడ్డ ఇతనే. తల్లి బాలుడి శవాన్ని పైకి లేపి, అతని చెవికి తన నోరు నొక్కి బిగ్గరగా పేరు పెట్టి, అతని ఛాతీని కొట్టింది, అతని వేళ్లను తట్టింది, తనకు సాధ్యమైనంతవరకు ప్రయత్నించింది. క్రమంగా ఆమె పిచ్చిదానిలా మారినట్లు అనిపించింది.
ఆ తల్లి వయసులోనూ, రూపంలోనూ నా తల్లిని పోలి ఉంది. ఆ అబ్బాయి, ఆమె కొడుకు, నా అన్నయ్యలా కనిపించాడు. నేను నా తల్లి, అన్నయ్య గురించి ఆలోచించాను. ఇద్దరూ తిరిగి రాలేదు. నా చెల్లి కూడా రాలేదు.
అకస్మాత్తుగా, తల్లి తన బిడ్డ మృతదేహాన్ని వదిలి నిలబడి, గాయపడిన వారిని చూసుకుంటున్న వారి వద్దకు పరిగెత్తి, వారిలో ఒకరి రెండు చేతులను పట్టుకుంది.
“నా బిడ్డను ఎందుకు కాపాడలేదు?” ఆ పేద తల్లి ఉన్మాదంగా అరిచింది. ఆ తల్లి ఇప్పుడు నన్ను కొట్టి చంపేస్తుందేమో అని నేను దాదాపుగా అనుకున్నాను.
ఒక విద్యార్థి వేరొకరి భుజంపై తనను తాను మోసుకుంటూ వణుకుతూ వచ్చాడు. జాగ్రత్తగా చూస్తే, అది వైద్య పాఠశాలలో చదువుతున్న నా పెద్దన్నయ్య అని తేలింది. మేము అతన్ని కలవడానికి పరిగెత్తాము. అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు.
నా సోదరుడికి మద్దతుగా ఆశ్రయానికి తిరిగి వస్తున్నప్పుడు, మేము సైడ్-హోల్ దగ్గరకు వచ్చేసరికి, అక్కడ ఒక యువకుడు పడి ఉన్నాడు. మా పొరుగువాడు. అతని వైపు చూస్తే, నేను షాక్ అయ్యాను. అతని కడుపు చీలిపోయి ఉంది, పేగులు బయటకు వచ్చాయి. బహుశా మా అడుగుల చప్పుడు విని, అతను బిగ్గరగా అరిచాడు, “ఏదైనా తీసుకురండి. నేను ఎంత బాధలో ఉన్నానో మీకు కనిపించడం లేదా? ఏదైనా చేయండి! నన్ను చంపండి! ఓహ్ ఎంత నొప్పి! ఎవరు? ఎవరు ఉన్నారు? రండి. రండి..”
అతను ఇక స్పృహలో లేడు. మా కళ్ళ ముందే అతను చనిపోయాడు. నేను చాలా భయపడ్డాను, నేను కంగారుగా ఇటు అటు వెళ్ళాను. ఇది గుర్తుకు వచ్చినప్పుడల్లా నా శరీరం వణుకుతుంది.
ఆ రాత్రి మేము మా అన్నయ్యను చాలా జాగ్రత్తగా చూసుకున్నాము. అదే పొరుగు యూనిట్‌కు చెందిన ఒక మహిళ తీవ్ర గాయాలతో ఒంటరిగా ఉండటంతో, మేము ఆమెను కూడా చూసుకున్నాము. మేము ఎంతసేపు వేచి చూసినా నా తల్లి ఎప్పుడూ కనిపించకపోవడంతో, నేను ఆ మహిళను నా తల్లి అని అనుకుంటూ హృదయపూర్వకంగా చూసుకున్నాను. అయితే, ఆ మహిళ తెల్లవారకముందే తుది శ్వాస విడిచింది. నేను ఇప్పుడు నా తల్లి గురించి తీవ్రంగా ఆందోళన చెందడం ప్రారంభించాను.
అక్కడ డాక్టర్ లేకపోవడంతో, తెల్లవారుజామున తీవ్రంగా గాయపడిన నా సోదరుడిని మేము విశ్వవిద్యాలయ ఆసుపత్రికి తీసుకెళ్లాము. ఆసుపత్రిలో మిగిలిన రెండు పొగ కుప్పలలో ఒకటి మధ్యలో వంగి ఉంది. దాని కింద ఒక తాత్కాలిక ప్రథమ చికిత్స ఆసుపత్రి తెరిచి ఉంది. ప్రాణాలతో బయటపడిన విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, నర్సులు బిజీగా పని చేస్తున్నారు. నా సోదరుడు ఆరోగ్యంగా ఉంటే, అతను వారికి సహాయం చేసేవాడు.
ఒక వైద్యుడు నా తమ్ముడికి చాలా ఇంజక్షన్లు ఇచ్చాడు. ఇది చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతను కోలుకుంటాడని నాకు ఖచ్చితంగా అనిపించింది.
కానీ అలా జరగలేదు. నాల్గవ రోజు సాయంత్రం అతను నాకు ఫోన్ చేసి, “వీడ్కోలు.. మనం విడిపోతున్నాం.. నా కలను కొనసాగించు. కష్టపడి చదువు, నేను ఎప్పుడూ చెబుతూనే వుంటానే..దాన్ని సాధించు” అన్నాడు. అతను ఎక్కువగా మాట్లాడుతున్నట్లు అనిపించింది, కానీ నేను అతని పెదవులు కదులుతున్నట్టు మాత్రమే చూశాను, మాటలు వినపడలేదు. తరువాత అతను చనిపోయాడు.
ఆయన ఎప్పుడూ చెప్పేది ఇదే: “నేను కష్టపడి చదువుతాను, ప్రయోజకుడ్ని అవుతాను, మంచి డాక్టర్ అవుతాను, ప్రపంచానికి మనమేమిటో తెలియజేస్తాను.”
ఈ మాటలు ఇప్పుడు నా కర్తవ్యంగా మారాయి. నా తలలో ఈ మాటలు ఎల్లప్పుడూ సజీవంగా ఉన్నాయి. తర్వాత మేము మళ్ళీ మా పాత ఇంటికి తిరిగి వచ్చాము. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. దాని ముందు కూర్చుని, మా అమ్మ వచ్చే వరకు వేచి ఉన్నాము. ఆమె అకస్మాత్తుగా వస్తుందని భావించి, మేము ఏ పని చేయక ఖాళీగా కూర్చుని ఉన్నాము.
శవాల కోసం వెతుకుతూ చాలా మంది మా ముందు నుంచి వెళ్ళారు. కాలక్రమేణా, మా అమ్మ, అక్క ఇంటి కింద ఉండి ఉండవచ్చని మేము భావించడం ప్రారంభించాము. కాబట్టి మేము శిథిలావస్థలో ఉన్న ఇంటి కింద తవ్వాలని నిర్ణయించుకున్నాము. మేము తవ్వుతూనే ఉన్నాము కానీ వారు దొరకలేదు. అయినప్పటికీ, ఏదో లాగినట్లుగా తవ్వుతూనే ఉన్నాము.
రోజంతా తవ్విన తర్వాత, చివరికి మాకు ఏదో నల్లగా కనిపించింది. మేము తవ్వాము..తవ్వుతూనే వున్నాము. ఊహించినట్లే అది ఒక శవం. అది నా అమ్మా? నా చెల్లా? లేక అపరిచితులా? మొత్తం శరీరాన్ని బయటపెట్టడానికి మేము దాని చుట్టూ ఇంకా తవ్వాము. శరీరం నల్లగా కాలిపోయింది. ఇప్పుడు మనం తలను వెలికి తీయాలి. తల – వింతగా, అది పూర్తిగా, కాలిపోలేదు. అది నా సోదరి.
నేను ప్రతిరోజూ చూడాలని, చాలా గాఢంగా కోరుకునేది నా సోదరి..ఆమె ముఖం చూసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో ఊహించుకోండి, నన్ను నేను చూసుకోకుండానే నేను నవ్వాను.
అప్పుడు, నేను అకస్మాత్తుగా విచారంగా ఏడ్చాను.
ఇప్పుడు మిగిలింది నా తల్లి మాత్రమే. మరుసటి రోజు, ఆ మరుసటి రోజు, మేము ఆమె కోసం ఓపికగా చుట్టూ వెతికాము. బహుశా మా ప్రయత్నాల వల్ల కావచ్చు, లేదా బహుశా నా తల్లి ఆత్మ మమ్మల్ని మౌనంగా పిలిచి ఉండవచ్చు: చివరికి ఆమె శవం దగ్గరి పొరుగువారి ఇంట్లో కనబడింది. ఆమె చనిపోయి, ఇంటి యజమానికి ఎదురుగా ఉంది. బహుశా వారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు.
నా తల్లి శరీరాన్ని చుట్టుముట్టి, మేము ఏడ్చాము. వెంటనే తేరుకున్నాము. అయితే, ఆ మృతదేహాలను ఏమి చేయాలో మాకు తెలియకపోవడంతో, మేము వాటిని అలాగే వదిలేశాము. మేము చూడగలిగినంత దూరంలో ఒక్క పచ్చని ఆకు కూడా లేదు, నైవేద్యాలకు పువ్వులు కూడా లేవు. మేము బ్రతికి ఉన్నవాళ్ళం చాలా పనులు చేయాల్సి వచ్చింది. మా అమ్మ, చెల్లితో కలిసి ఉండే స్తోమత మాకు లేదు.
ఒక వారం తర్వాత, అందరూ శవాలను దహనం చేయడం ప్రారంభించారు. కఠినమైన నియమాలు ఇప్పటికే కనుమరుగైపోయినట్లు అనిపించింది. ప్రాణాలతో బయటపడినవారు దగ్గరి బంధువులను ఒక్కొక్కరిగా తగలబెట్టారు. గుర్తు తెలియని మృతదేహాలను ఒకచోట చేర్చి దహనం చేశారు.
ఉరాకామిలోని కాలిపోయిన పొలాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి, అక్కడక్కడ ప్రజలను దహించే మంటలు ఎర్రగా ఉన్నాయి.
అమ్మ ఎర్రగా కాలిపోయింది. నా చెల్లి కూడా ఎర్రగా కాలిపోయింది. అవి కొన్ని ఎముకలుగా మారాయి. ఆ ఎముకలను తీసుకొని, మేము వాటిని పొయ్యిలో ఉంచాము. ఇది చాలా దారుణమైన ప్రవర్తన కాబట్టి, నా తల్లి, సోదరి మమ్మల్ని కోపగించుకుంటారని నేను భయపడ్డాను.
ఇక్కడితో అంతా అయిపోయింది. . అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుండగా, ఎక్కడి నుండి వచ్చిందో మాకు తెలియదు, దాదాపు మూడు సంవత్సరాల అమ్మాయి మా ముందు కనిపించింది. నన్ను చూడగానే, ఆమె “పెద్ద చెల్లెలు” అని చెప్పి నన్ను హత్తుకుంది.
ఆశ్చర్యంగా, నేను ఆమె వైపు చూశాను, కానీ నేను ఆమెను అస్సలు గుర్తుపట్టలేదు. నేను ఆమె పేరు అడిగాను, కానీ ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె ఎవరి బిడ్డ అని మాకు తెలియదు.
“నేను మీ అక్కని కాదు,” అని నేను పదే పదే అన్నాను, కానీ ఆమె, “అవును, అక్క, నా అక్క” అని చెప్పి, నవ్వుతూ నన్ను హత్తుకుంది.
ఈ పాప ఒంటరిగా బ్రతికిందని, ఆమెకు నాలాగే ఒక అక్క ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు. ఆమె నిజంగా అందమైన అమ్మాయి. ఎవరైనా బంధువు కనిపించే వరకు ఆమెను పెంచాలని మేము నిర్ణయించుకున్నాము. ఆ అమ్మాయి వెంటనే మాకు అలవాటు పడింది. కుటుంబంలో ముగ్గురు సభ్యులను కోల్పోయిన మేము ఒంటరిగా ఉన్నప్పటికీ, ఆమెను కొత్త కుటుంబ సభ్యురాలిగా స్వాగతిస్తూ మళ్ళీ ఆనందంగా వుండటం ప్రారంభించాము. మేము కొత్తగా ధైర్యాన్ని కూడగట్టుకుని నాగసాకి నుండి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాము.
మూడు రోజుల తర్వాత, మేము బయలుదేరబోతుండగా, ఆ అమ్మాయి అదృశ్యమైంది. మేమందరం వేర్వేరు దిశల్లో వెతికాం, కానీ ఆ అందమైన అమ్మాయి దొరకలేదు.
మేము ఇక వెతకడం మానేసి వేరే దేశానికి బయలుదేరాము. ఆ అమ్మాయి..ఆ చిన్న దేవదూత ఎవరు?
![]()
3. సకాకి చిజుయో (బాంబు దాడి సమయంలో 4గం.)
విమాన దాడి అలారం మోగగానే, అందరూ షెల్టర్‌లోకి వెళ్ళారు. వండిన బియ్యాన్ని కుండలో అలాగే ఉంచాము. అలారం ఆగిపోవడంతో, మేము షెల్టర్‌లో కలిసి తిన్నాము. అమ్మమ్మ, నాన్న, మామ, అక్క, తమ్ముడు కా-బో, నేను అందరం అక్కడే ఉన్నాము.
నాన్న, “మనం బయటకు వెళ్లి చూద్దాం?” అన్నాడు. మేము బయటకు వెళ్ళి చూసాము. ఆకాశం అంతా నీలంగా ఉంది.
అమ్మ, “నేను ఇంటికి వెళ్లి చూస్తాను. నేను ఇప్పుడే వస్తాను” అంది.
నాన్న, అమ్మ ఇంటికి వెళ్లారు.
ఆ తర్వాత, ఎవరో “బాంబు పడిపోతోంది!” అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మమ్మ, మేము ముగ్గురు పిల్లలు చాలా ఆశ్చర్యపోయాము. మేము ఆశ్రయంలోకి పరిగెత్తి, కదలకుండా ఉండిపోయాము. గోడకు వెనుకకు ఆనుకుని ఉన్నాము.
చాలా సేపటి తర్వాత, మేము ఇంకా భయం భయం గానే బయటకు వెళ్ళినప్పుడు, ప్రతి ఇల్లు, ప్రతి ఒక్కటి నేలమట్టమైంది. అప్పుడు నాన్న, అమ్మ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చారు.
మేము కుండలోని అన్నం తిన్నాము. రేపటికి కొంచెం ఉంచవలసి వచ్చింది కాబట్టి, మేము కొద్దిగానే తిన్నాము. మేము షెల్టర్‌లో అలాగే పడుకున్నాము.
మరుసటి రోజు, నాన్న, అమ్మ కోబాకు వెళ్లి ఒక గుడిసె కట్టారు. మేము ఈ గుడిసెలోకి మారాము.
ఆ తర్వాత కొద్దిసేపటికే నాన్న, అమ్మకు నొప్పులు మొదలయ్యాయి. వాళ్ళు చాలా బాధతో అణు ధార్మిక వ్యాధితో చనిపోయారు.
అమ్మమ్మ బియ్యం శుద్ధి చేసే ప్రదేశానికి వెళ్ళింది. పెద్ద చెల్లిని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. కా-బోను తోమాచి కుటుంబానికి తీసుకెళ్లారు. నన్ను ఆంటీ యాకో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు.
అత్త యాకో వివాహం చేసుకుంది. ఆమె నన్ను తనతో పాటు ఇప్పుడు మేము నివసిస్తున్న ఈ ఇంటికి తీసుకువెళ్ళింది. యమజాకి చిజుయో, అనే నా పేరు సకాకి చిజుయోగా మార్చబడింది, అది ఇప్పుడు నా పేరు.
సకాకిలో ఒక అక్క బాలికల పాఠశాలకు వెళుతుంది. నేను మొండిగా ఉన్నప్పుడు, ఆమె నన్ను “చిజుయో!” అని తిడుతుంది. సాధారణంగా, ఆమె మంచిగా ఉంటుంది. నన్ను “చిజు-చాన్” అని పిలుస్తుంది.
నాన్న ఇప్పుడు కూడా దయగల నాన్నే..ఇప్పటికి, నేను అత్త యాకోను “అమ్మా” అని పిలుస్తాను. అమ్మ కొన్నిసార్లు నాన్న మరియు అక్క మీద గౌరవం లేకుండా నన్ను తిడుతుంది. నేను విచారంగా ఉన్నప్పుడు, నా ముసలి తల్లి గురించి ఆలోచిస్తాను.
![]()

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి.
రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.




Discussion about this post