మూలం : సర్ బాసిల్ థామ్సన్
తెలుగు అనువాదం : శొంఠి జయప్రకాష్
మిస్సస్ ఆగర్–ఒక అపార్ట్మెంట్లో వసతి గృహాలను అద్దెకు నడుపుతోంది. గదిలో చేరి బాడుగ చెల్లించక విదేశానికి వెళ్లిన ఒక కిరాయిదారుని లగ్గేజ్ స్వాధీనం చేసుకొని, అందులో ఒక ట్రంక్ పెట్టెను తెరచి చూసి భయంతో గజ గజా వొణికి పోయింది. మానవ అవయవాలు– ఏ భాగానికాభాగం ఖండించబడి అందులో కూర్చబడి ఉన్నాయి.
హుటాహుటిన ఆమె తన అన్న దగ్గరకు పరుగెత్తింది. విషయం చెప్పింది. వెంటనే అతడు నా మిత్రున్ని సంప్రదించాడు–ఏం చేయాలో చెప్పమని. అతడు మామూలుగానే–పోలీస్ రిపోర్ట్ ఇమ్మని సలహా ఇచ్చాడు. ఆమె దృశ్యాన్ని చూడడం ఆ ఉదయం జరిగింది.అందుకని ఆమె పోలీసులకు రిపోర్ట్ చేయడం సాధ్యం కాలేదు. ఆమె చిరునామా మాత్రం అతడు నాకు ఇచ్చాడు.
నేను నా టోపీ పెట్టుకొని టాక్సీ లో హానోవర్ కోర్టుకు చేరుకున్నాను. ఆ సమయంలో భయాందోళలనతో ఆమె చేతులు నులుము కుంటూ ఉంది. నన్ను చూడగానే “ నా అన్న ద్వారా మీరు కేసును గురించి తెలుసుకొని ఉంటారు. మీరొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పోలీసు రిపోర్ట్ ఇవ్వాలని అనుకున్నాను. కానీ అదేమంత వివేకమైన పని కాదు. నా లాడ్జిని అతలాకుతలం చేస్తారు. నా పరువును గంగలోకలిపేస్తారు. కోతి పుండును బ్రహ్మరాక్షసి గా మార్చి, కేసును తల్ల కిందులు చేస్తారు. సవాలక్ష ప్రశ్నలు సంధించి, మృతికి కారణాలను అధికారితో విచారణ జరిపిస్తారు. నన్ను సాక్షిగా అడ్డ మైన విచారణలకు పిలుస్తారు. మొత్తం వివరాలను పత్రికల్లో ప్రచురిస్తారు. హత్య జరిగిన లాడ్జిలో మర్యాదస్తులు, ఉన్నత శ్రేణికి చెందిన పెద్దమనుషులు మా లాడ్జిలో దిగారు. అందువలన నా వ్యాపారం కోలుకోలేనంత దెబ్బతింటుంది. కాబట్టి నేను కోరేదేమంటే–ఈ పెట్టెను మీరు తీసుకెళ్లి , బాధ్యతంతా మీరు తీసుకుంటే నేను స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటాను.ఒకవేళ నిజంగా హత్య గాని జరిగి ఉంటే ఉత్పన్నమయే పరిణామాలకు నేను కట్టుబడతాను. దయచేసి మీరు ఈ హత్యారహస్యాన్ని ఛేదించండి. మళ్ళీ ఈ విషయం గురించి నేను వినగూడనుకుంటున్నాను.”
ఆమె దగ్గరున్న సమాచారమంతా నాకు సమకూర్చి, నాకు అందుబాటులో ఉంచే షరతు మీద నేను ఆ కేసు తీసుకున్నాను. రెండవ అంతస్తు లో ఉన్న ట్రంక్ పెట్టెను నాకు చూపించింది. వొణికే చేతులతో ఆ పెట్టెను తెరిచాను. అందులో కొన్ని చిన్న చిన్న మూటలున్నాయి. అవి మురికి పట్టిన కాగితాలలో చుట్టబడి, పాత మిలిటరీ దుప్పటిలో కట్టిఉన్నాయి.స్పర్శను బట్టి ఆ మూటలలో ఎముకలున్నాయని నిర్ధారించుకున్నాను.బహుశా అవి మనిషి ఎముకలు అయి ఉండొచ్చని కూడా నిర్ణయించుకున్నాను. ఆమె సహాయంతో ఆ పెట్టెను కింది అంతస్తులోకి చేర్చాను. ఈ లోపల ఆమె గదిలో అద్దెకున్న శాల్తీ కథ చెప్పింది.
“సార్! అతను ఒక వింతైన మనిషి . అకస్మాత్తుగా ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళుతుంటాడు. గదిని తన కోసమే అట్టేపెట్టమని, గదిలో ఉన్న సామానును చాలా జాగ్రత్తగా చూసుకోమని ఉత్తరాలు రాసేవాడు. అతడు ఊర్లో లేనప్పుడు బాడుగ డబ్బులు ఠంచనుగా పంపించే వాడు. నేపుల్స్, ఈజిప్టు, ఏథెన్స్ నుంచి రాసేవాడు.ఒక ఉత్తరం మాత్రం పెరు నుంచి వచ్చింది. అతను ప్రయాణ సమయంలో చేతిలో బ్యాగు గానీ, పెట్టె గానీ ఉండేది కాదు. అతను చెప్పేదేమంటే తానలా విదేశాలకు పోవడం వ్యాపార నిమిత్తమే అని.”
“మిస్సస్ ఆగర్! ఇంతవరకూ అతని పేరు చెప్పనే లేదు.”
“నిజం చెప్పాలంటే అతని పేరును నే నెప్పుడో మరచిపోయాను. అతన్ని మేమెప్పుడూ డాక్టర్ అని పిలిచేవాళ్లం. ఎందుకంటే– `అయిదేళ్ళ క్రితం అతనిక్కడికొచ్చినప్పుడు అతని వృత్తి– వైద్యసంబంధితమని చెప్పాడు. అతని అసలు పేరు అలెన్–హెన్రీ అలెన్.”
“అది ఇంగ్లీష్ పేరు లా ధ్వనిస్తుంది.కదూ? మరి అతని వయసెంతుంటుంది?” అడిగాను.
“ముప్ఫై అయిదూ –యాభై మధ్య ఉండొచ్చు.”
“అతని స్నేహితులుగానీ, అతన్ని చూడ్డానికొచ్చే పరిచయస్తులు గానీ ఉన్నారా?”
“అదే సార్ అతి వింతైన సంగతి. అతనికెవరూ లేరు. కాదు కాదు.. ఇప్పుడు జ్ఞాపకమొస్తూ ఉంది. మూడేళ్ళ క్రితం ఒక మహిళ వచ్చి అతని గురించి అడిగింది. ఆమె పేరడిగాను. ఆమె పేరు అనవసరం అనీ, అతడు ఏ గదిలో ఉన్నాడో చెబితే చాలు తాను వెతుక్కుంటానని చెప్పి, నాతో గది నంబరు చెప్పించుకొని, పై అంతస్తుకు కెళ్లింది. ఆమె కంఠస్వరం అతను విన్నాడనుకుంటాను. ఆమె అతని గదిలో ప్రవేశించింది. కానీ అతను గదిలో లేకపోవడం చూసి ఆమె కిందకొచ్చేసింది. వెళ్ళిపోయింది. తరువాత నేను పైకి వెళ్లాను. అతను మంచం కింద నక్కి ఉండడం చూశాను. అతనేమీ చెప్పలేదు. ఆ వచ్చినామే అతని భార్య అని అనుకోకుండా ఉండలేకపోయాను. నాకు తెలిసినంత వరకూ ఆమె ఎప్పుడూ ఇటువైపు రాలేదు.”
“అతనికెప్పుడూ ఉత్తరాలు రాలేదా?”
“ప్రతినెలా రెండవ తేదీన ఉత్తరాలొచ్చేటివి– అదీ ఆనాడు ఆదివారం కాకపోతే. లావుపాటి రిజిస్టర్ లెటర్స్ వచ్చేటివి. ఆ కవరు మీద హెన్రీ –అలెన్ ఎస్క్వైర్ అనే అడ్రస్స్ రాయబడి ఉండేది. డాక్టర్ అని ఉండేది కాదు. బహుశా ఆ కవర్లు ఏదో బ్యాంకు నుంచి వచ్చేవనుకుంటాను. పేరు గుర్తు లేదు. ఇంకొక్క విషయం సార్! అతనెప్పుడూ గదిలో భోజనం చేసేవాడు కాదు.”
“అతను పగలంతా ఎక్కడికెళ్లేవాడు?”
“అతను ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటలకు– ఖచ్చితంగా తొమ్మిది గంటలకు– మెట్లు దిగివచ్చేవాడు. నా ముందు నుంచి నడిచివెళ్లేటప్పుడు నాకు ‘గుడ్ మార్నింగ్ ’ చెప్పేవాడు. అంతకు మించి ఏమీ మాట్లాడే వాడు కాదు. ఆదివారాలు మాత్రం ఉదయమంతా బెడ్ మీదనే కాలక్షేపం చేసి, సరిగ్గా పన్నెండు గంటలకు బయటికెళ్ళే వాడు. చాలా విచిత్రమైన, ప్రత్యేక మైన వ్యక్తి. అయితే సౌమ్యుడు. అట్లాంటి వ్యక్తి ఒళ్ళు గగుర్పొడిచే ఇటువంటి ఘోరహత్యకు పాల్పడినాడంటే నమ్మశక్యంగా లేదు. అదీ ఒక మనిషిని చిన్న చిన్న ముక్కలుగా నరికి పెట్టెలో కూరినాడంటే అసలే నమ్మదగిన విషయం కాదు మిస్టర్ మెడిల్ సన్ జోన్స్! తలచుకుంటేనే గుండె జారిపోతుంది. అతని గదిలో ఒక్క పుస్తకం కూడా లేదు. కనీసం రాసిన చిన్న పనికి మాలిన కాగితమైనా లేదు. పగలంతా అతనేం చేస్తాడో అంతుబట్టని విషయం.”
“మీరు ఆఖరుసారిగా అతన్ని మీరెప్పుడు చూశారు?”
“ఏప్రిల్ నెలలో. అంటే ఇప్పటికి మూడునెలలు గడిచాయి. అతను మామూలుగానే గది వదలి వెళ్లిపోయాడు.గది సర్వీస్ చేద్దామని నేను అతని గదిలోకి వెళ్లాను. అతను అప్పటికే వస్తువుల్ని కట్టలు కట్టి ట్రంకుల్లో పెట్టి సిధ్ధంగా ఉంచాడు. ఈ సారి మాత్రమే నేను ఉత్తరం అందుకోలేదు.అతడు బాడుగ కట్టలేదు. డబ్బు గురించి నాకు చింత లేదు. ఎప్పుడో ఒకసారి డబ్బు అందుతుందనే నమ్మకం నాకుంది.”
“మరి బ్యాంకు నుండి వచ్చే ఉత్తరాల సంగతి?”
“అదే విచిత్రంగా ఉంది. అతనెప్పుడైతే ఈ ప్రదేశం వదలి వెళ్లాడో, అప్పటినుండి ఉత్తరాలు రావడం నిలిచి పోయింది.
‘‘అతను హత్య చేసిన తరువాత ఆత్మహత్యకు పాల్పడ్డాడని మీరనుకుంటున్నారా?”
“మిసస్ ఆగర్! మొదట హత్య జరిగిందో లేదో నిర్ధారణ కావాలి కదా! చుట్టుపక్కల ఏ వ్యక్తి అయినా తప్పిపోయారా అనే వదంతులేమైనా ఉన్నాయా?”
కొన్ని క్షణాలు ఆమె దీర్ఘాలోచనలో మునిగిపోయింది. తరువాత తల పంకించుతూ,
“ఆనాడు అతన్ని చూడ్డానికొచ్చిన ఆడదే అతని భార్య ఐవుంటుందని ఖచ్చితంగా చెప్పగలను.”
“అలా ఎందుకనుకుంటున్నారు?”
“ఆమె ప్రవర్తన.. ఆమెను చూడగానే.. ఏదో కిలాడిలేడిలా అనిపించింది. ఆమె వాలకం అనుచితంగా ఉంది. ఆమె వచ్చినట్లు పసిగట్టగానే అతడు వెళ్ళి మంచం కింద దాక్కున్నాడు. ఒక పురుషుడు భార్యను చూస్తే తప్ప ఎప్పటికీ అలా తప్పించుకోడానికి ప్రయత్నించడు.”
‘మిస్సెస్ ఆగర్ తన కున్న వైవాహిక జీవితానుభవం తో అలా నిర్ణయించిందేమో?’ అని నేననుకొన్నాను.
“సరే. ఆమెను అతని భార్యే అనుకుందాము. అయితే ఏమిటీ?”
“ఆ పెట్టెలో ముక్కల రూపంలో ఉన్నది అతని భార్య శరీర భాగాలై ఉండొచ్చని నా అనుమానం.”
ఆ పెట్టెను పై అంతస్తు మెట్ల మీదుగా మా ఆఫీసు లోనికి తరలించడంలో సహాయపడిన టాక్సీ డ్రైవర్ కు పెట్టెలో ఏమున్నదో తెలియదు. పెట్టెను చూసి మా చీఫ్ దానివైపు ప్రశ్నార్థకంగా చూశాడు. డ్రైవర్ వెళ్ళిపోయిన తరువాత, జరిగిన కథ చెప్పి పెట్టెను తెరిచాను. పెట్టె లోపలికి చూసి మా చీఫ్ చలించిపోయాడు. ఆయన అటువంటి విభ్రాంత స్థితిలోకి వెళ్ళడం ఇదివరలో నేనెప్పుడూ చూడలేదు.
బంగారు నగలా అన్నట్టుగా, మా చీఫ్ పెట్టెలో నుంచి ఎముకలను ఒక్కొక్కటిగా తీసి టేబుల్ మీదుంచాడు. ఆ ఎముకలు కొన్నింటి మీద ఎండిపోయిన మాంసం అతుక్కుని ఉన్నట్లుగా నేను గమనించాను. అవి ఆపేక్షణీయంగా మాత్రం లేవు. పెట్టె అడుగున కపాలం ఏదో పాత వార్తాపత్రిక తాలూకు కాగితంతో చాలా జాగ్రత్తగా చుట్టబడి ఉంది.
వాటిని తీసుకెళ్ళి లాబొరేటరీలో చేర్చి, వాటికోసం ఒక ప్రత్యేక బల్లను ఏర్పాటు చేసి, వాటిని ఒక క్రమ పధ్ధతిలో అమర్చాం.
నాకది గొప్ప అవకాశం. నేను లాబరేటరీ లోనికి అనుమతించ బడ్డాను. అప్పటికే ఎముకలన్నీ టేబుల్ మీద క్రమంలో పరచబడ్డాయి. ఇప్పుడవన్నీ పేర్చిన తరువాత సంపూర్ణ అస్థిపంజరం ఆకారంలో కనబడుతున్నాయి. మా చీఫ్ మొదటి వాక్యాలే నిరుత్సాహ ధోరణిలో సాగాయి.
“ఇందులో కొన్ని ఎముకలు లోపించాయి”. అని కొన్ని క్షణాల విరామమిచ్చి, చెప్పడం కొనసాగించాడు.
అయితే, చెప్పుకోదగ్గ అంశమేమంటే- ఈ ఎముకల తాలూకు శరీరం అసలు ఆకృతిని కోల్పోయింది. కాబట్టి మన పని సులభమైంది. ఇదొక విలక్షణమైన కేసు. ఈ అస్థిపంజరం ఒక స్త్రీది. ఈమె ఎడమ కాలు కుడికాలు కన్నా మూడంగుళాలు తక్కువుంది. కుడి చేయి, ఎడమ చేయి కన్నా రెండంగుళాలు తక్కువుంది. బతికున్నప్పుడు ఈమె ఆకారం చూడ్డానికి వింతగా ఉండుంటుంది. కొంతసేపట్లో ఆమె అసలైన రూపమేదో తెలిసిపోతుంది.” అని అచంచల ఆత్మవిశ్వాసంతో చెబుతూనే, ఒక లోహపు పెనం లో కొన్ని గోరువెచ్చని నీటిని తీసుకున్నాడు.
టేబుల్ కు అనుసంధానించబడిన ఒక చెక్క పరికరం మధ్యలో కపాలం భద్రంగా బిగించబడింది. అసాధారణమైన చాకచక్యంతో, నేర్పు ప్రదర్శించి, ఇంతకు ముందే పెనంలో ఉన్న మైనపు ముద్దకు తగులుకొని ఉన్న చిన్న చిన్న బుడిపెలను గిల్లేసి, స్పిరిట్ దీపం కింద వేడి చేసి, కపాలం చుట్టూ అంటించాడు. క్రమంగా ముఖాకృతి వచ్చేలా చేతులు కదిలించాడు. అత్యంత నైపుణ్యంతో కొన్ని గంటల పని తర్వాత ఒక మనిషి ముఖం తయారైంది.
“ఈమె మిస్టర్ అలెన్ భార్యా? కాదా ? అని గుర్తించడానికి మిస్సెస్ ఆగర్ ను పిలిపించండి ” అని సలహా ఇచ్చాను.
“అందుకిది సమయం కాదు. ఈమెను చంపిన హంతకుణ్ణి మొదట పట్టుకోవాలి. అతడు ఈమెను చూడాలి. నేరం ఒప్పుకోవాలి.” అన్నాడు చీఫ్.
“అవును హంతకుడు వచ్చి నేరాన్నిఅంగీకరిస్తాడనుకుందాం.. ఆ తరువాత తప్పకుండా మనం హంతకుణ్ణి పోలీసులకు పట్టిస్తాం. అంతేగా ” అన్నాన్నేను.
“ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరస్తుణ్ణి చట్టానికి పట్టివ్వడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. నువ్వాపనిలో ఉండు. నేను వార్తా పత్రికల్లో ప్రకటన ఇప్పిస్తాను.”
“ఏమని?’’ అడిగాను.
“మిస్టర్ హెన్రీ అలెన్? వెనక్కొచ్చేసేయ్. నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించబడతాయి.” అని.
“రేప్పొద్దున అతడు కోర్టులో ‘నాకు క్షమాభిక్ష పెడతారని హామీ ఇచ్చారు’ అని వాదిస్తేనో?”
“మిస్టర్ మెడిల్ స్టన్ జోన్స్! అలాగైతే ఒక పనిచేద్దాం. ఒక గొప్ప ధనవంతురాలు– హెన్రీ అలెన్ అనే ఇంగ్లీష్ వ్యక్తికి– పదహైదులక్షల పౌండ్ల ఆస్థి చెందేలా వీలునామాలోపేర్కొందని, సదరు వారసుడు విదేశాల్లో అనామకునిగా జీవిస్తున్నాడని, అతని చివరి చిరునామాకు ఉత్తరం రాస్తే పోస్ట్ ఆఫీసు వాళ్ళు వాపసు చేశారని,’ వార్తాపత్రికల్లో ప్రకటన ఇద్దామ్. ప్రతి ఒక్కరూ ఎవ్వరూ క్లెయిమ్ చేయని అటువంటి ప్రకటనను ఆసక్తిగా చదువుతారు. చాలా మటుకు లాయర్లు నేరస్తులనే ఎలుకలను– కలుగులోంచి బయటకు రప్పించడానికి ఇటువంటి ఆశ చూపించే టక్కరి పనులు చేస్తుంటారు.”
“ఇటువంటి ప్రకటనలకు ఆకర్షించబడే నకిలీలు నేనంటే నేనని వరదలా మీదికొచ్చి పడితే ఎం చేస్తావ్?”
“మరీ మంచిది. వాళ్లందరినీ మొట్టమొదట శవాన్ని గుర్తుపట్టమని చెప్తాను. ఆ తరువాత మిసస్ ఆగర్ వద్దకు తీసుకెళ్తాను. నకిలీ వాళ్ళందరూ ఆమె అడిగే ప్రశ్నలకు బదులు చెప్పలేక ‘బ్రతుకు జీవుడా! ప్రాణాలతో బయటపడ్డామ’ని తోకముడుస్తారు.”
నా చీఫ్ అనుసరిస్తున్న ఈ పధ్ధతిలో చాలా ఆలస్యం జరిగింది. పత్రికా విలేఖరులు నన్ను– ఎంతకూ తేల్చని ఈ విషయంపై వీధిలో నిలదీశారు. దీంతో నా బాస్ విపరీతంగా మనసు నొచ్చుకున్నారు. ఫలితంగా మా బాస్ న్యూస్ ఏజెంట్లతో రహస్యంగా మాట్లాడి, లండన్ పత్రికలలో ఆ ప్రకటన రాకుండా నిలుపుదల చేయించాడు. ఎందుకంటే మిలియనీర్ లేడీ అసలు లేనే లేనందువల్ల. అయితే విదేశీ పత్రికల్లో మాత్రం ప్రచురించబడేలా చూశాడు. తరువాత ఒక ఇంగ్లీష్ వనిత లేఘోర్న్ నుండి ఇలా రాసింది:
“లేఘోన్ పట్టణంలో వేలాది పిల్లులు ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాయి.లండన్ లో అంతకంటే ఘోరం. నాకు గనుక ఆ డబ్బిచ్చినట్లయితే, వాటి మ్యావ్, మ్యావ్ అరుపులతో నన్ను అవి అర్ధరాత్రి నిద్ర మేల్కొల్పుతాయి. వాటి పోషణకు మంచి ఆశ్రయం ఏర్పాటు చేయగలను.”అని.
హెన్రీ అలెన్ అని సంతకం పెట్టిన మరొక ఆసామీ, ఇలా రాశాడు:
“లండన్ వచ్చి నన్ను నేను హెన్రీ అలెన్ గా నిరూపించుకోవడానికి ఖర్చులకు డబ్బిస్తే నేను మీ ముందు హాజరౌతాను” అని.
మరో శాల్తీ ఇంకాస్త ముందుకెళ్లి, సాల్ట్ లేక్ సిటీ నుండి “నా పేరు రిచర్డ్ దోహర్టీ. మా అమ్మ పేరు అలెన్. కాబట్టి ఆ విల్లులో పేర్కొనబడిన అలెన్ అనే వ్యక్తి నేనే అయిఉండొచ్చు. కాబట్టి ఆ వారసత్వ ఆస్తి నాకు చెందుతుంది.” అని రాశాడు.
బ్యూనోస్ నుండి ఒకామె “నా పేరు మేరీ అలెన్. స్కూలులో చదువుతున్నప్పుడు హెన్రీ అని పిలవబడేదాన్ని. కానీ హెన్రీ అలెన్ అని నన్నెవ్వరూ పిలిచేవారు కారు. కాబట్టి ఒకటిన్నర మిలియన్ ఆస్తి నాకు ఇప్పించండి.” అని రాసింది.
ఈ పరిణామాలతో నా బాస్ సహనం కోల్పోయాడు.. ఆ సమయంలో ఆయనకు చేతిలో చాలా కేసులున్నాయి. ఆయన లాబోరేటరీ సగం స్థలం, హతురాలి శరీర భాగాలతో నిండి పోయింది. ఆయన మృతురాలి తలవెంట్రుకలకు, చెంపలకు బాదం కాయ రంగులద్దాడు. ఇప్పుడా హతురాలి శవం సజీవంగా ఉన్నట్టుంది.
ఒకనాటి ఉదయం నా బాస్ నాతో ఇలా చెప్పాడు.
“మిస్టర్ జోన్స్! ఈ హెన్రీ అలన్ కేసు ఒక అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. ఆ లాడ్జ్ యజమానురాలిని పిలువనంపి శవాన్ని గుర్తించమని చెప్పండి.అప్పుడేమైనా కేసుకు కొంచెం చలనం వస్తుందేమో చూద్దాం!”
మిసస్ ఆగర్ నా సలహా అసలు మనసుకే వేసుకోలేదు. తనను శవం వద్దకు రమ్మని పిలువకూడదని, మా మధ్య అవగాహన ఉందని, కాబట్టి తనను ఇబ్బంది పెట్టొద్దని అభ్యర్థించింది. ఎట్టకేలకు ఆమెను ఒప్పించ గలిగాను. ఆమె మా ఆఫీసుకొచ్చింది. నేను శవం మీదున్న తెల్లని దుప్పటి మెల్లగా లాగాను. లోపాలున్న ఆకారాన్ని చూసి మిసస్ ఆగర్ కెవ్వున కేకవేసింది. గుండెలను అరచేత పట్టుకొని దగ్గరున్న కుర్చీలో కూలబడింది. ఆమె శరీరం భయంతో వొణుకుతూంది.
“ఆమెను గుర్తుపట్టారా? ఆమె అలెన్ భార్యలాగే ఉందా?” అని అడిగాను.
“అట్లాంటి మనిషిని ఇదివరకెప్పుడూ చూడలేదు. ఆమెను చూసిన తరువాత ఒక వారం రోజులు జ్వరంతో పడడం మాత్రం ఖాయం. చెప్పలేని నిరాశ కలిగింది నాకు” ఆమె చెప్పింది.
మా బాస్ కు ఒక సలహా ఇచ్చాను– శవం తలను ఫోటో తీసి ఏదైనా సచిత్ర పత్రికకు పంపిస్తే బాగుంటుందని. ఆ ఫోటోలో ఉన్నది తప్పిపోయిన వ్యక్తి అని, ఎవరైనా గుర్తుపట్టితే మన అడ్రస్సుకు సమాచారమివ్వవలసిందిగా కోరదా మంటే, ఒప్పుకున్నాడు బాస్. నేను ఆ ఫోటో తీసుకొని పత్రికాఫీసుకు బయదేరుతున్న వేళప్పుడు సరిగ్గా మిసస్ ఆగర్ మళ్ళీ కనబడింది.దాంతో మొత్తం కేసు పరిశోధన ప్రక్రియ పూర్తిగా పక్కదారి పట్టింది.
ఆమె చేతిలో జెనోవా పోస్ట్ ఆఫీసు ముద్ర ముద్రితమైన పోస్ట్ కార్డ్ ఒకటి చూపించింది. అందులో హెన్రీ అలన్ ఒక వారం రోజుల్లో లండన్ చేరుకుంటానని రాశాడు. “ఇప్పుడు చెప్పండి? అతనొచ్చి తన గదిలో ఉన్న తన ట్రంకు పెట్టె ఏమయిందని అడిగితే?.. నేనేం సమాధానం చెప్పాలి? పోలీసు వాళ్లెట్టుకెళ్లారని చెప్పాలా?.. కాబట్టి వెంటనే అందులోంచి తీసిన ఎముకలు పోగుచేసి, న్యూస్ పేపర్లలో కట్టి మరలా వాటిని యధాస్థితిలో ఉంచి, లాడ్జికి చేర్చండి.”
ఈ ప్రతిపాదనకు మా చీఫ్ అంగీకరించలేదు. పైగా, చట్టప్రకారం అతడు లాడ్జిలోకి అడుగు పెట్టిన తక్షణం అతన్ని అరెస్ట్ చేసి పోలీసులకు ఒప్పగించే బాధ్యత మిసస్ ఆగర్ మీదుంది అని అని గట్టిగా వాదించాడు.
“నేనతన్ని అరెస్ట్ చేయాలా?” ఆమె బిత్తరపోయింది. “ఆడమనిషి ఒక మగవాడిని ఎట్లా అరెస్ట్ చేయాలి. ఆ?”
“చట్టానికి ఆడా మగా తేడాలేదు మిసస్ ఆగర్!” అన్నాన్నేను. తిరిగి నేను చెప్పసాగాను. “అమ్మా ఆగర్! కోర్టుల్లో మహిళలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆడవాళ్లు పనిచేస్తున్నారు. అతను రాగానే నువ్వు చేయాల్సిన పనేమంటే– అతను హోటల్లోకి అడుగు పెట్టగానే అతని భుజం మీద చెయ్యెసి ‘అబ్బాయ్ హెన్రీ అలెన్! ఒక అనామక ఆడదానిని ఉద్దేశ పూర్వకంగా హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నీవేమైనా చెప్పదలచుకుంటే వాంగ్మూలం రాసివ్వు. అది కోర్టులో వాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.’ అని అతడు చెప్పే విషయాల్ని రాసుకొని అతని చేత సంతకం తీసుకో. గదిలో బంధించు. తరువాత మిస్టర్ పెప్పర్ కు–అంటే మా చీఫ్ కు ఫోన్ చేసి చెప్పు.”
నేను చెప్పవలసింది చెప్పాను.
అందుకు ప్రతిస్పందనగా అంది, “ నేనా పని చేయలేను మెడిల్ స్టన్ జోన్స్! అతను మర్డర్ చేసి మూడు నెలలు దాటుతుంది. ఆ పని మీరే చేయండి.” తెగేసి చెప్పింది ఆగర్.
నేనూ మిస్టర్ పెప్పర్ ఒకరి మొహాలొకరు చూసుకున్నాము.
పోలీసులను పిలిపించడం సరైన పరిష్కారంగా అనిపించింది నాకు. కానీ అలా చెప్పడానికి నాకు ధైర్యం చాలలేదు.
ఎందుకంటే– ఒకసారి ఇట్లాంటి ఒక సందర్భంలో నాకు చేదు అనుభవం ఎదురైంది. ఒక వ్యక్తిని నిందితునిగా అనుమానించి ఛార్జ్ షీట్ తయారు చేశాము. తీరా చూస్తే ఆ వ్యక్తి మీద చార్జెస్ రుజువు కాకపోవడంతో, నేనూ మరియు పెప్పర్ భయంకర, దయనీయ స్థితిలోకి నెట్టబడ్డాం . చివరకు లండన్ సెంట్రల్ క్రిమినల్ కోర్టుబోనులో దోషిగా నిలబడవలసిన స్థితి దాపురించింది.
ఎలాగోలా ఆగర్ను పంపించివేశాము. ఇంకా నాలుగు రోజుల వ్యవధి ఉంది మాకు.
మిస్టర్ పెప్పర్ నాకంటే ఎక్కువగా మానసికంగా కలవరపాటు చెందాడు. ఇక అతని ముందున్న మార్గమొక్కటే.
రోజు మారి రోజు ఆగర్ అపార్ట్మెంట్ ముంగిలిలో కాపలా కాసి, హెన్రీ అలెన్ కనబడగానే అతన్ని పెప్పర్ ఆఫీసుకు నచ్చజెప్పి పిలుచుకొని రావడం. అతని చేత హతురాల్ని గుర్తింప చేయడం.తరువాత జరుగబోవు పరిణామాల్ని బట్టి అనుసరించి పోవడం. అతను ప్రదర్శించే హావభావాలు, ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారమివ్వడం.. ఇవీ మా ముందున్న ప్రత్యామ్నాయాలు.
కానీ నేనలా కాపలా ఉండడం ఎందుకో నాకిష్టం లేదు. మిస్టర్ పెప్పర్ అలా నన్నాదేశిస్తాడని, నేనలా అతని ఆదేశాల్ని పాటిస్తే, డిటెక్టివ్ గా నాపరువుప్రతిష్టలకు భంగం కలుగుతుంది. అది నా కిష్టం లేదు. అయితే దైవికంగా అటువంటి దుస్థితి జరగకపోవడంతో నేను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. అనుకోకుండా అది తప్పిపోయింది. క్లబ్ మెంబరైన నా స్నేహితుడు అలాంటి దురవస్థ నుండి తప్పించాడు.
![]()
నేను వెళ్ళేవేళకు నా మిత్రుడు టేబుల్ వద్ద మరొక వ్యక్తితో కలిసి భోజనం చేస్తున్నాడు. నన్ను చూడగానే దిగ్గున లేచి విష్ చేశాడు. తన పక్కనున్న అతిథిని పరిచయం చేశాడు.అతడు నడివయస్సులో ఉన్నాడు.గడ్డం కొంచెం నెరిసింది. నన్ను భోజనానికి ఆహ్వానించాడు నా మిత్రుడు. మాటలమధ్యలో తెలిసింది– నెరిసిన గడ్డం గల వ్యక్తి ఒక లండన్ లో ఒక పేరుపొందిన మెడికల్ కాలేజ్ హెడ్ అని. నేను అక్కడకు వెళ్లిన ఆ సమయంలో, ఆ హెడ్డుకు సంబంధించిన కాలేజీలో జరిగిన ఒక అసంబధ్ధ సంఘటన గురించి చెబుతూ ఉన్నట్లుంది అతని వాలకం.
నా మిత్రుడు అతనికి పరిచయం చేస్తూ, “ఇతను నా మిత్రుడు మెడిల్ స్టన్ జోన్స్. మీ సమస్యకు పరిష్కారం సూచించే సమర్ధుడు. లండన్ లోని తెలివైన డిటెక్టివ్ లతో ఇతనికి సాహచర్యముంది. పైగా నేరవిభాగంలో మంచి అనుభవముంది.”
నన్ను కొంచెం ఎక్కువ చేసి మాట్లాడినా, నా మిత్రుడు కొంత వరకూ సరిగ్గానే చెప్పాడు.
“కానీ వివరాలు పూర్తిగా తెలిసేంతదాకా పోలీసులను రంగం లోనికి దించడం నా కిష్టం లేదు” కాలేజ్ హెడ్డు తన మనసులోని మాట చెప్పాడు.
“అలాగే కానీ. మెడిల్ స్టన్ జోన్స్ కు స్కాట్ లాండ్ యార్డ్ తో సంబంధాలు లేవు. అయినా మంచి ఔత్సాహికుడు. తెలివైన వ్యక్తి.” నా మిత్రుడు నోట వచ్చిన పలుకులవి. అలా నాపై విశ్వాసం కలిగించడంతో, నా మిత్రుని ప్రోత్సాహంతో డాక్టరు అతని కథ చెప్పాడు.
“శరీరశాస్త్రం బోధించే కళాశాల అధిపతికి సహాయకుడిగా ఉన్న ఒక యువకుడు రెండు రోజులక్రితం అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. అతడు అందరికీ ఆదర్శనీయుడు.అతనికి డబ్బుతో పనిలేదు. ఆ అధిపతికి తెలిసి నంతమటుకు అతనికి బాధలు విచారాలూ లేవు. అయితే విచిత్రంగా అతడు ఒక సోమవారం సాయంకాలం శవాలన్నిటినీ దూరంగా నెట్టేసి, ఆ విషయం కస్టోడియన్ కు తెలిసే లాగా చేశాడు. అతనెప్పుడూ క్రమశిక్షణ పాటించేవాడు కాబట్టి, మరుసటి రోజు ఠంచనుగా కళాశాలకు, ఉదయం ఎనిమిది గంటలకు తిరిగి హాజరు అయిఉండాల్సింది. మరుసటి రోజు చాలా రద్దీగా ఉండింది. విద్యార్థులు అందరూ పది గంటలకు రావడం వల్ల ప్రతిఒక్కపనీ ఆలస్యమైంది. వారిలో కొంతమంది విద్యార్థులు, తమకు శవాల్ని అందజేయకపోతే పరీక్షల్లో తాము సరిగా రాయలేమని డాక్టర్ కు ఫిర్యాదు చేశారు.కస్టోడియన్ దృష్టికి వెళ్ళింది విషయం. మొట్ట మొదటి సారి జాన్ అనే విద్యార్థి తప్పిపోయినట్టు తెలుసుకున్నారు. కారణమేమై ఉంటుందా అని వాళ్లింటికి వెళ్ళి వాకబు చేశారు. అతను ఇంట్లో కూడా లేడు. రోజంతా గడిచినా ఆ అబ్బాయి జాడ తెలియలేదు. జాన్ తప్పిపోయిన విషయం పోలీసు వాళ్ళకు తెలియచేయడం తక్షణ కర్తవ్యం. కానీ అలా చేస్తే యువత మెదళ్ళలో అలజడి, ఆందోళన మొదలౌతుందని, అది వాళ్ళ భవిష్యత్తును దెబ్బ తీస్తుందని భావించారు. అందుకని ప్రైవేట్ డిటెక్టివ్స్ ద్వారా పరిశోధింపజేసి, ప్రతి ఒక్కరినీ ప్రశ్నించి, బిల్డింగ్ అణువణువునూ గాలిస్తే ఫలితముంటుంటుందని కళాశాల నిర్ణయించింది. తప్పని సరైతేనే పోలీసులదాకా విషయం వెళ్లాలని, కస్టోడియన్ కూడా అదే పరిష్కారమని నమ్మాడు. అసలు పోలీసుల జోక్యం వద్దని అందరికీ చెప్పాడు. ఆ పిల్లవాడు నిజంగా బిల్డింగ్ పరిసరాలలో ఏదైనా ద్రోహచింతన తలపెట్టి ఉంటే, అప్పుడు..”
“అయితే ఎందుకలా అలా అనుమానిస్తున్నారు?”
“నాకు కూడా సరిగ్గా తెలియదు. కొన్ని సాయంత్రాలు నేను అలా బిల్డింగ్ పరిసరాల్లో రౌండ్స్ కొడుతుంటే, లాబొరేటరీ లోపలనుండి ఏదో గొడవ జరిగి నట్టు, పరుష మైన సంభాషణ వినిపించింది. అక్కడ విద్యార్థులెవ్వరూ లేరు. నేను లాబొరేటరీ తలుపు దగ్గరకెళ్ళి విన్నాను. కస్టోడియన్ ఆ అబ్బాయితో చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఆ అబ్బాయి కూడా అదే తీవ్ర స్వరంతో మాటకు మాట అప్పజెప్పుతున్నాడు. ఆ మాటలు రోజువారీ విధులకు సంబంధించినవి. ప్రిన్సిపాల్ హోదాలో ఉన్న నేను అవి పట్టించుకోనవసరం లేదనుకుంటూ ఆ చోటు వదిలాను. కానీ ఏదో నాకు రుచించని ముద్ర నా మెదడుపై పడిందని నేనొప్పుకొని తీరాలి. కస్టోడియన్ చాలా నిబధ్ధమైన, ఉన్నతమైన వ్యక్తి. చాలా ఏళ్లుగా మాతో ఉన్నాడు. కానీ ఆనాటి ఆయన ముఖంలో ప్రజ్వరిల్లుతున్న అసహ్యకరమైన కోపం చూసి, ఆ వల్గరు మాటలు విని నేను ఒక విధమైన షాక్ లో మునిగి పోయాను. బహుశా, ఖచ్చితత్వవిధి నిర్వహణలో ఆయన హృదయమలా కరడుగట్టి ఉండొచ్చు.”
“అయితే వల్గర్ భాషకూ, హత్యకూ మధ్య చాలా తేడా ఉంది” అన్నాన్నేను.
“అవునవును. నాకు తెలుసా విషయం. నాకు తట్టిన విషయమది. విషయంలో నేనధికంగా ఆలోచిస్తుండవచ్చు. ఈ బిల్డింగ్ లో ఉన్న ప్రతివ్యక్తికి, అర్ధరాత్రి సమయంలో ఒక శవాన్ని మాయం చేయడానికి సవాలక్ష అనుకూలతలున్నాయి. ఉదాహరణకు– నిప్పుల కొలిమి వగైరా.. వగైరా.. కాకపోతే నాది అర్థంలేని, అస్పష్ట సందేహమంతే.”
చాలా సేపు మా ముగ్గురి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. టేబుల్ మీదున్న ప్లేట్లలో ఆహార పదార్థాలను తినడం మరచిపోయాము.
నా మిత్రుడు నిశ్శబ్దాన్ని ఛేదించాడు. గడ్డమతనితో అన్నాడు, “మీరు జోన్స్ ను మీ వెంట తీసుకెళ్ళి ఆ ప్రదేశాన్ని చూపించొచ్చుగా. అతను అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి తనదైన విధానంలో పరిశోధిస్తాడు. అక్కడ కాపలా ఉన్న వ్యక్తిని కలుసుకొని ఉపాయంతో సమాచారాన్ని బయటకు లాగుతాడు. తప్పిపోయిన పిల్లవాడి ఉనికి కనుక్కునేందుకు అతడిని నియమించండి.”
కాలేజ్ హెడ్డు నా వైపు తిరిగి, “మీరేమంటారు? మీరు ఈ కేసులో కల్పించుకుంటే నాకంతకన్నా కావాల్సినదేముంది? నానెత్తి మీది భారం దిగిపోయినట్లుంటుంది కూడా ”. అన్నాడు.
భోజనం చేయడం త్వర త్వరగా ముగించి, డాక్టర్ గారి కారులో ఆ పాఠశాలకు వెళ్లాం.
“మీరేమీ అనుకోకపోతే కస్టోడియన్ గారికి నన్నుపరిచయం చేసి స్కూలు పరిసరాలనలా చుట్టి రావడానికి నాకు అవకాశం కలిగించండి. మేమలా వెళ్తూ వెళ్తూ ఆయన్ను కొన్ని పశ్నలడుగుతాను. ఆ విధానం యధాలాపం గానూ ఉంటుంది, అధికారయుతం గానూ ఉంటుంది.”
డాక్టర్ కు కావాల్సిందిదే. తలపంకించి, అతను నేరుగా లాబొరేటరీ వద్దకు నన్ను తీసుకెళ్ళి కస్టోడియన్ కు పరిచయం చేశాడు. “మిస్టర్ స్టోక్స్!ఈయన మెడిల్ స్టన్ జోన్స్. అదృశ్యమైన విద్యార్థి కేసు విచారణ చేయడానికొచ్చాడు. ఈ భవనం ఆవరణాన్ని పరిశీలించాలనుకుంటున్నాడు.” అతన్ని పరిచయం చేసి వెళ్లిపోయాడు.
స్టోక్స్ నన్ను చూసి స్నేహపూర్వక చిరునవ్వు నవ్వాడు. “ విద్యార్థులంతా అయిదు గంటలకెళ్లిపోతారు. అంతవరకూ వాళ్ళకు అంతరాయం కలిగించకూడదు. బేస్ మెంటుకు పోదాం రండి. ఇది దుర్బలమైన గుండె గల ఒక అబ్బాయి వింత కేసు. మంచి అబ్బాయి. ఈ మధ్యన నేను గమనించిందేమంటే– అతడు తప్పు దారి పడుతున్నట్టనిపించింది. పనిలో శ్రధ్ధ తగ్గిపోయింది.”
“అతని మనసులో ఏముందో ఏమైనా పసిగట్టారా?”
“అదే నేనూ ఆలోచిస్తున్నాను. అతని ప్రవర్తన బట్టి ఆ అబ్బాయి ఎవరో ఒక అమ్మాయి వెంటబడ్డాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని పట్టించుకున్నట్లు లేదనిపిస్తుంది. ఒకనాడు అతడు నన్ను ‘మిస్టర్ స్టోక్స్! ఒక యువజంట లండన్ లో బతకడానికెంత డబ్బు అవసరముంటుందీ?’ అని అడిగాడు. నేను ‘వారానికి రెండు పౌండ్లు’ అని జవాబివ్వడంతో, అతని శరీరం గానుగ చక్రాల మధ్యలో పడి నలిగినట్లుగా ఆక్రందిస్తూ కింద పడిపోయాడు– అదేమో నేనే అలా నలిపినట్లు. ఆర్మీ వాళ్ళు అతన్ని చేర్చుకోనప్పటినుంచి పూర్వపు మనిషి కాలేకపోయాడు. అక్కడినుంచే వారు వాటిని తెచ్చేవారు.”
“ఏమిటీ తేవడం?”
“డిస్సెక్షన్ కోసం అంటే పరీక్షార్థం ఏ అవయానికా అవయవాన్ని విభజించడం కోసం తీసుకురాబడే శవాలు సార్!”
మేము బేస్మెంట్ సొరంగ ద్వారంలో ఉన్నాం. “ఇదుగో చూడండి! ఇది బాయిలర్ గది.”
నేను అటువైపు తిరిగాను. ఎర్రగా మండుతున్న డోర్ కనబడుతూ ఉంది.
“కొలిమిని అంటించే పని ఎవరిది?”
“అదే సార్! వాడిదే. తప్పిపోయిన అబ్బాయిదే. తరువాత్తరువాత వాడు నిర్లక్ష్యం చేశాడు. ఆ పని నా మీద పడింది. ప్యాకింగ్ విషయం లోనూ అంతే.”
“ప్యాకింగా?”
“అవును.శవాల అవయవ భాగాలను ప్యాక్ చేసి శవపేటికల్లో అమర్చడం. చూడండి. ప్యాకింగ్ గది ఈ పక్కనే ఉంది.”
మేము సెల్లార్ గదిలో ఉన్నాము. ఒక పక్క అస్తవ్యస్తంగా పేర్చిన నల్ల పెయింట్ వేయబడిన శవపేటికలు. మరొకపక్క ఎముకలు, కపాలాలుంచిన లోహపు ట్రేలు. ఎండిపోయిన మాంసం వాటికి అతుక్కొని ఉంది.
“అవి పై గదుల్లోంచి ఉన్నవి ఉన్నట్టుగా తేబడినవి. వాటిని క్రమాకృతిలో పేర్చి, ప్రతి పేటికలో, శవాకారంలోకి కూర్చడం ఆ యువకుడి విధి. ఒక శవపేటికను మేకులతో బిగించేముందు, అందులో ఒక తల, రెండు చేతులు, రెండు కాళ్ళు ఉండేలా జాగ్రత్త తీసుకొని శ్మశానానికి తీసుకెళ్లాలి. కానీ ఆ అబ్బాయి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. తరువాత నేనే స్వయంగా ఆ పని చేయాల్సి వచ్చింది.”
“అంటే కళేబరాల్ని కలిపేశాడా?”
“కాదు సార్! అలా ఒకదానికొకటి తారుమారైతే మనం చేసేదేమీ లేదు. అది సాధ్యం కాదు కూడా. మేమొక రిజిస్టర్ నిర్వహిస్తున్నాం. అందులో ప్రతి పేటికలో ఉన్న శవాలకు సంబంధించిన పేర్లు రాసి వాటిపైన లేబుల్ ఉంచుతాము– సంబంధిత బంధువులు అంత్యక్రియలు పూర్తిచేసుకోవడానికి వీలుగా. కానీ అందులో ఆ శవానికి సంబంధించిన కపాలం, ఎముకలు పూర్తిగా ఉండకపోవచ్చు. నూటికి పదిశాతం అలా జరగడానికి అవకాశముంది.”
బయటి సెల్లార్లో నేను ఒక భారీ పెట్టెనానుకొని, నిల్చుని మాట్లాడుతున్నాను. అప్పుడు ఒక ప్రశ్న సంధించాను.
“ఇక్కడకు తీసుకొచ్చిన శవాలతో ఏం చేస్తారు?” అని.
“మీరక్కడే నిలుచొండి సార్. నేను చూపిస్తాను. మీరు వాటిమీదనే ఆనుకొన్నారు” నేను వెంటనే అక్కడ్నుంచి కదిలాను.
“ఆహాహా! అవేమీ చేయవు సార్!.” అని నవ్వుతూ, బరువైన పెట్టె పైమూత తెరిచాడు.
నేను అతని భుజాల మీదుగా తొంగి చూశాను. లోపల కొన్ని అరలున్నాయి. ఒక్కొక్క అరలో పది మృతకళేబరాలున్నాయి– ముసలోళ్లవీ, పడుచువాళ్లవీ, బిగుసుకుపోయిఉన్నవీ, నగ్నంగా ఉన్నవీ, బీదాబిక్కీవీ, తెల్లవీ, బతికున్నప్పుడు ఆప్యాయతానురాగాలు నోచుకోనివీ, స్నేహబంధాలు లేనివీ– వగైరా– రకరకాలవీ ఉన్నాయి. వాళ్ళందరూ లండన్ కర్మాగారాల్లో పనిచేసిన వారు. వారు చనిపోయిన తరువాత కూడా మానవ సమాజానికి ఎనలేని సేవ చేస్తున్నారు. వారు బతికున్నప్పుడు ఎంతో హేయమైన , దయనీయ దుర్భర జీవితాల ననుభవించారు. చచ్చిన తరువాత ప్రపంచానికి ఎంతోమంది కొత్త సర్జన్ లకు తమ శవాలను కోసి శస్త్రచికిత్సా కోవిదులు తయారుకావడానికి, తద్వారా ప్రపంచప్రజలకు ఉపయోగ పడుతున్నారు. బతికున్నప్పుడు సమాజానికేమాత్రం వినియోగపడని వారి కళేబరాలు చచ్చాక ప్రపంచానికెంతో పనికొస్తున్నాయి.”
ఒక శవం మీది గాయాన్ని చూపిస్తూ, “ఆ కళేబరాలు చెడిపోకుండా ఉండడానికి ఫార్మాలిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నాం.” అని చెప్పి, పెట్టె మూతయధాప్రకారం మూసివేశాడు. చేతి గడియారం వైపు చూసి, “ ఈ వేళకు విద్యార్థులంతా వెళ్లిపోయుంటారు. మిమ్మల్ని శవాలను
డిస్సెక్షన్ చేసే, అంటే కోసే గదికి తీసుకెళతాను. రండి” అని పై అంతస్తు మెట్లవైపు దారితీశాడు. నేను అనుసరించాను.అది చాలా పెద్ద గది. గోడ పొడుగునా కిటికీ లున్నాయి. గదిలో డజన్ బల్లలున్నాయి. వాటిమీద దుప్పట్లు పరచిఉన్నాయి. విద్యార్థులు ప్రయోగాలకు వీలుగా వాటికింద మానవ అవయవాలు అమర్చి ఉన్నాయి.
ఆ గది చివరికొచ్చేసరికి, వరుసగా ఇనుప ద్వారాలు కనబడ్డాయి. ఆ తలుపుల మీద తల, చేయి, కాలు, పెల్విస్ –ఇలా లేబుల్స్ అతికించి ఉన్నాయి. ఆ గదులు తప్పిపోయిన అబ్బాయి శవాన్ని దాచిపెట్టి ఉంచడానికి అనుకూలమైన ప్రదేశం. మిస్టర్ స్టోక్స్ ను అదే విషయమడిగాను.అతడు ఒక గదిని తెరిచి చూపించాడు. అందులో డిస్సెక్షన్ చేయగా మిగిలిన అవశేషాలున్నాయి.
“వీటిని అసెంబ్లింగ్ చేయడమంటే మాటలు కాదు. ఎంతో శ్రమించాలి.. ఇందుకుగాను ఇరవైమంది పనివాళ్లున్నారు”, అని స్టోక్స్ చెబుతుండగా, పెద్దగా ఆసక్తి లేకుండా వింటున్నాను. మరోపక్క ఎముకలకు అంటుకున్న ఎండిన మాంసం పొరలు గమనించి, అలాంటివి ఇంతకు ముందెక్కడో చూసినట్టు అనిపించింది. ఎక్కడ చూశానా అని ఆలోచిస్తుండగా నా బుర్రకు మెరుపులా ఆ విషయం తట్టింది. మా ఆఫీసులో, పెట్టెలో ఉంచబడ్డ ‘ఆ హతురాలి’ ఎముకల మీద చూశాను. అవును కరెక్ట్. అక్కడే చూశాను.
స్టోక్స్ వైపు తిరిగి, “ఈ కళేబరాల్లో ఏవైనా ఈ మధ్య అదృశ్యమైనాయా?” అని అడిగాను.
“ఓహ్! అప్పుడప్పుడు ఒకానొక విద్యార్థి ఒక కాలో, ఒక చేయో ఇంటికి తీసుకెళ్ళి అధ్యయనం చేస్తుంటాడు. నాకు తెలియకుండా ఎవరైనా విద్యార్థి అలా తీసుకెళ్లితే చాలా ఇబ్బందౌతుంది సార్! ఎవరెవరి దగ్గరేమున్నాయో రిజిస్టర్ లో నమోదు చేసి సంతకాలు తీసుకుంటాను. ఎవరైనా వచ్చి మోకాలి కీలు కావాలని అడిగితే, మొత్తం కాలు తీసుకున్నట్టు సంతకం పెట్టాలి. మరి ఏదైనా కొత్త అవయవం కావాలంటే, ఇంతకు ముందు తీసుకున్న పాత అవయవం వెనక్కివ్వాలి. అదీ అమలవుతున్న పధ్ధతి. ఏదైనా అవయవం తో అవసరం పడితే నేను తెచ్చుకునే వాడ్ని కాను. అలెన్ ద్వారా తెప్పించేవాడిని. అన్నట్టు అలెన్ తిరిగొస్తే వాడి తో కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను.. కానీ అతనింతవరకూ వెళ్ళినవాడు తిరిగి రాలేదు.”
“అలెన్ గురించి చెప్పండి.” అడిగాను. అలెన్ పేరు ప్రస్తావించబడగానే నా గుండె వొణికింది. అయినా నాలో ఉత్పన్న మైన ఉద్విగ్నతను అణిచేసుకున్నాను.
“మీరు అలెన్ గురించి ప్రిన్సిపాల్ నడగండి. అతన్ని గురించి చాలానే చెబుతాడు. అలెన్ పూర్తి కళేబరాన్ని తీసుకుపోయాడు. ఒక సంవత్సరమైంది. తరువాత నేనావిషయమే మరచిపోయాను. రికార్డ్స్ తనిఖీ చేస్తుంటే అప్పుడు తెలిసింది ఒక బాడీ లేదని, అది అలెన్ వద్ద ఉందని. టక్కరి.. ఆ విషయంలో అతనికెవరూ సాటి రారు. ఒకానొక సోమవారం ఒక తల కావాలని అడిగాడు. ఇచ్చాను. ఒకరోజు సాయంత్రం అయిదు గంటలౌతుండగా, అతను తలను చేత్తో పట్టుకొచ్చి లాకర్ వద్దకెళ్లాడు. తలను లాకర్లో పెట్టాడు కదా అనుకున్నాను. ఒక వారం వరకూ అతను కనబడలేదు. మళ్ళీ వచ్చి ‘చేయి’ అడిగాడు. ఆ తరువాత మరొకటి. ఇలా సాగిపోయింది. బయటికెళ్ళిన వాడు కొన్ని రోజులదాకా తిరిగి రాలేదు. అతనేం చేస్తున్నాడో తెలుసుకోవాలనేటప్పటికి సమయం మించిపోయింది. Too late. అప్పటికే అతను విదేశాలకెళ్లిపోయాడు. అతనెప్పుడూ అలాగే చేసేవాడు. కళాశాలకు ఎంత వేగంగా వస్తాడో, అంతే వేగంతో మాయమౌతాడు. అతనలా ఇష్టానుసారం రావడానికీ, పోవడానికీ ప్రిన్సిపాల్ ఎలా అనుమతిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఈ సారొచ్చినప్పుడు అతడు నేనడిగిన వాటికి సమాధానం చెప్పి తీరాలి.”
ఆయన లెడ్జర్ పేజీలు తెరచి అందులోని ఎంట్రీస్ చూపించాడు.హెన్రీ అలెన్ పేరుకింద ‘జూన్ 20 th –హెడ్ నం.128, male –జూలై 2 nd fore arm నం.43–female ’ ఇలా ఉన్నాయందులో. ఒక పూర్తి పేజీ అతనికే కేటాయించడం జరిగింది.
“మళ్ళీ ఆ అవయవాలను చూస్తే గుర్తుపట్టగలరా?” అడిగాను.
“తప్పకుండా. అలెన్ కిచ్చిన వాటిమీద నా స్వంతగుర్తు వేశాను.”
“ఇప్పుడు ప్రిన్సిపాల్ ను కలుసుకోవడానికి వీలుంటుందా?”
“మీరు ఇప్పుడు త్వరగా వెళ్లాలి. ఆరుగంటలకు సరిగ్గా ఆయన బయలుదేరుతారు. కింద ప్యాసేజ్ గుండా వెళ్ళి ఎడమకు తిరిగితే రెండో గది.”
డాక్టర్ నన్ను చూసి “ఏదైనా కొత్త విషయం వెలుగు చూసిందా?” అడిగాడు.
“ఆహా! ఒక విషయం నేను కనుక్కోగలిగాను. ఆ అబ్బాయి ఈ భవనంలో హత్యచేయబడలేదు. ఆత్మ హత్య అని నా సిక్త్ సెన్స్ చెబుతూ ఉంది.” అన్నాను.
(అనుకున్నట్టుగానే ఆ అబ్బాయి శవం థేమ్స్ నదిలో తేలింది. అతని పాకెట్ లో అతని ఆత్మీయులకు ఉద్దేశించి రాసిన సూయిసైడ్ నోట్ దొరికింది)
“నేను మీతో ఇంకో విషయం మాట్లాడ్డానికొచ్చాను. హెన్రీ అలెన్ అనే విద్యార్థి మీ కళాశాలలో చదివేవాడు కదా!”
దాంతో అతడు చేతులు పైకెత్తి ఆకాశం కేసి చూపిస్తూ, “నా జీవితంలో ఇంతవరకూ అటువంటి వ్యక్తిని చూడలేదు. ఎంతటి ఉత్తమ సంస్కారులైనా అటువంటి వ్యక్తిని పిచ్చివాడుగానే పరిగణిస్తారు. ఆ మనిషి ఈ కాలేజీలో ఆరేళ్ల పాటు ఉన్నాడు. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణుడై నిలిచాడు. సక్రమంగా ఫీజు చెల్లిస్తున్నాడు. కష్టపడే మనస్తత్వం. ఫైనల్ ఎగ్జామినేషన్ కు ప్రిపేర్ అవుతాడనుకున్నాను. పరీక్షలకు ముందు నాకొక విన్నపం పంపించాడు– ‘తాను ఏదో అర్జెంట్ వ్యవహారం మీద విదేశాలకు వెళ్తున్నాన’ని తెలుపుతూ. ఇప్పటికీ ఆరునెలలైంది అతను వెళ్ళి. ఏదైనా ప్రేమవ్యవహారంలో చిక్కుకున్నాడా? లేక అతనికి స్టేజ్ ఫియర్ పట్టుకుందా? లేకపోతే రెండూ కొంచెం కొంచెమున్నాయా? అతనితో ఒక్కసారి మాట్లాడితే, మళ్ళీ మళ్ళీ అతని గొంతు వినాలనే ఆసక్తి కలిగి తీరుతుంది. అన్నట్టు మీకు స్టోక్స్ ను అతని గురించి అడిగారా?”
“అడిగాను డాక్టర్! శవాల శరీరభాగాలను దొంగిలించినట్టు అభియోగం మోపుతున్నాడు.”
“ఆయన చెప్పింది కరెక్ట్. కానీ అంతగా వాటితో మీకు అవసరముంటే మీకు వాపసు తెచ్చివ్వగలను. అవెక్కడున్నాయో నాకు తెలుసు.”
స్టోక్స్ ను కలిశాను. మిస్సింగ్ అయిన అవశేషాలను గుర్తించగలనని అతడు చెప్పాడు. నాతో వస్తే వాటిని చూపిస్తానని చెప్పాను. ఒప్పుకున్నాడు.
మేము వెళ్ళేసరికి ఏడుగంటలవబోతూ ఉంది. మా చీఫ్ ఆఫీసు గదిలోనే ఉన్నట్టు తలుపు కింద– లోపలినుంచి ప్రసరించే దీపపు కిరణాలు తెలుపు తున్నాయి. స్టోక్స్ ను బయట వేచి ఉండమని చెప్పి నేను లోపలి కెళ్లాను.
నన్ను చూడగానే నన్ను మాట్లాడనీయకుండా తానే మాట్లాడాడు చీఫ్.
“మిస్టర్ మెడిల్ టన్ జోన్స్. నేను హెన్రీ అలెన్ కేసు గురించే ఆలోచిస్తున్నాను. మధ్యాహ్నం నుంచి మీకోసం వేచి చూస్తున్నాను. అలెన్ కేసులో పాపం ఆ ఆడది బలికాబోతుంది.”
ఆ మాటలు విని నేను అంతులేని ఆశ్చర్యానికి లోనయ్యాను. స్టోక్స్ బైట వేచిఉన్నాడనే సంగతే మరిచాను.
తిరిగి చీఫ్ కొనసాగించాడు. “అవును. ఎన్ని కోణాల్లోంచి ఆలోచించినా, అలెన్ వ్యక్తిగత ప్రవర్తన, గోప్యత, అకస్మాత్తుగా అదృశ్యం కావడం– ఇవన్నీ అతనే దోషి అని సూచిస్తున్నాయి. అతన్ని అరెస్ట్ చేసేముందు ఒక విషయం గుర్తుపెట్టుకో జోన్స్! అలెన్ దగ్గర పదునైన కత్తి ఉండొచ్చు. జాగ్రత్త!”
“మిస్టర్ పెప్పర్! నేను చెప్పే వివరాలు మీకు చెప్పే వరకైనా మీ దృష్టి కోణం మార్చుకోండి. మనదగ్గరున్న ఎముకలు గుర్తించడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అవి వైద్య శాస్త్ర బోధనలో ఉపయోగించే ఎముకలు. వాటిని అలెన్ దొంగిలించాడు.”
నా మాటలు విన్న మా చీఫ్ రంగులు మారిన ముఖం చూడాలి అప్పుడు. కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు. పూర్తిగా డీలా పడిన ఆయన తేరుకొని, “అతన్ని లోపలికి రమ్మని చెప్పండి.” అంటూ లాబొరేటరీ లైట్లు వెలిగించాడు. నేను స్టోక్స్ ను లోపలికి పిలుచుకెళ్ళాను.
చీఫ్ టేబుల్ మీదున్న బెడ్ షీట్ లాగాడు. నేను స్టోక్స్ ముఖ కవళికల్ని గమనించసాగాను. అతనిది భావాలు పలికే ముఖం కాదు. మొదట అతని కళ్ళు గుండ్రంగా మారిపోయాయి. నోటమాట రాలేదు. చివరకుఅతని నోరు పెగిలింది. అందులోని తొడ ఎముక తీసి పట్టుకొని, రెట్టించిన ఉద్విగ్నతతో, “అవును సార్! ఇవి మా లాబొరేటరీకి సంబంధించిన ఎముకలే. ఇదిగోనండి నేను వేసిన ప్రత్యేక ముద్రా చిహ్నాలు.”
అని అతి సూక్ష్మ లిపితో ఎముక మీద రాయబడిన ‘128’ అనే నంబరు చూపించాడు. అతని శరీరం నిజంగానే తీవ్ర ప్రకంపనలకు గురి అయ్యింది. క్రమంగా ప్రకంపనలు అణగారిపోయాయి. స్వరాన్ని నెమ్మదిగా అదుపులోనికి తెచ్చుకున్నాడు.
“మీరు నంబర్ 48 ను మంచి పురుషునిగా తయారు చేశారు. కానీ అతని పొడవైన గడ్డ మేదీ? ఇతను మాతో ఉన్నప్పుడు పొడవైన గడ్డంతో ఉండేవాడు.”
నేను మా చీఫ్ ముఖానికేసి చూడలేకపోయాను.
“మిస్టర్ స్టోక్స్! ఈ ఎముకలన్నీ మూటకట్టి తమ మెడికల్ కాలేజీకి తీసుకుపోవడం మంచిది.”
మా చీఫ్ మౌనంగా ఉండిపోయాడు. స్టోక్స్ నెమ్మదిగా ఒక్కొక్క ఎముకనే సేకరించి ప్యాక్ చేసి, ట్రంక్ పెట్టెలో పెట్టుకోసాగాడు. “మిస్టర్ మెడిల్ టన్ జోన్స్! మీరేమీ అనుకోకపోతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. హెన్రీ అలెన్ వచ్చి తన ట్రంక్ లోని అవయవాల గురించి అడిగితే , కాలేజ్ ప్రిన్సిపల్ ను సంప్రదించమని చెప్పండి.” అని ప్యాక్ చేసేముందు ఒకసారి మా హెడ్ వంక తదేకంగా చూశాడు.
“ఈ మైనపు ఆకృతిని నాశనం చేయలేను. ప్రపంచజనుల ప్రదర్శన కోసం దీన్ని మ్యూజియం లో పెట్టిస్తాను.”అన్నాడు.
పై అంతస్తు నుంచి కిందకు లగేజీని మెట్ల మీదుగా తీసుకురావడంలో నేను సహాయపడ్డాను. ఆ సమయంలో ప్రిన్సిపాల్ నాతో, “మీ హెడ్డు వేరువేరు సైజుల ఎముకలను చూసి తికమక పడిఉంటాడు. ఎందుకంటే, వాటిలో ఒక చేయి, ఒక కాలు ఆడవారివి. అతను హతురాలు వికలాంగురాలేమో అనుకోని, విస్మయపడి ఉంటాడు. మా హెడ్డు ఆ ఆడదానికి మూడు చేతులున్నాయని గమనించి ఉండడు. నా ఎదురుగానే– మిస్సయిన ఒక కాలు స్థానంలో–చేతిని పెట్టాడు.
నేను ఆగర్ లాడ్జ్ వద్దకు చేరుకున్నాను. అంతలో ఒక వ్యక్తి అపార్ట్మెంట్ గది వద్ద నిలుచుని అదేపనిగా కాలింగ్ బెల్ కొడుతున్నాడు. ఒక ముప్పై ఏళ్ల వ్యక్తి సన్నగా , మూడురోజుల గడ్డం పెంచుకొని దీనంగా నిలబడి ఉన్నాడు. తలుపు తీసి, మిస్సస్ ఆగర్ బయటికొచ్చి, హెన్రీ అలెన్ ను చూసి, “ ఓ అలెన్! ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లావ్?” అని అడిగింది.
“లిస్బన్ వెళ్లాను.” చెప్పాడు హీన స్వరంతో.
నేను అతని భుజాన్ని బలంగా పట్టుకొని, “హెన్రీ అలెన్! మెడికల్ కాలేజీ వాళ్ళు నీ కోసం ఎదురుచూస్తున్నారు.
వారి ఆస్తి అయిన అనాటోమికల్ నమూనాలు అనధికారంగా నీ వద్ద ఉంచుకున్నందుకు వివరణ అడగాలనుకుంటున్నారు. నీ వేమైనా చెప్పాలనుకుంటే రాతమూలకంగాఅది రికార్డ్ చేయబడుతుంది. అది కోర్టులో విచారణాధికారికి సమర్పించవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నాను.” అని అనగా విన్న ఆగర్ తలుపు వద్దనేకుప్ప కూలిపోయింది.
అయితే ప్రిన్సిపాల్ కోర్టులో కేసు వేయడానికి ఇష్టపడలేదు.
![]()

M. Com. చదివారు. సిండికేట్ బ్యాంక్ లో క్లర్క్ గా చేరి 2012లో మేనేజర్ గా పదవీవిరమణ పొందారు. ప్రస్తుత నివాసం హిందూపురం. సాహిత్యం, సంగీత మంటే ఇష్టం. ప్రచురణ పొందిన మొదటి తెలుగు కథ కాగితపు పులి (ఆంధ్రప్రభ వీక్లీ). మొదటి అనువాద కథ పంజరం (విపుల). మూడు అనువాద కథా సంపుటాలు, ఒక్క తెలుగు కథా సంపుటం, రెండు నవలలు ప్రచురణ జరిగింది. ఒక నాటకం DTP లో ఉంది.




Discussion about this post