• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

వయసు మరిచిన మనసు

పివిఆర్ శివకుమార్ by పివిఆర్ శివకుమార్
September 5, 2025
in అనువాద కథలు
0
వయసు మరిచిన మనసు

ఇంగ్లీష్ కథ . రచయిత్రి: ఐ. బుయిగైస్ [ క్లిమాక్టెరిక్ ]

అనువాదం: పి.వి.ఆర్. శివకుమార్ 

మూడునెలల నుండీ  విజయవంతంగా అతడిని ఎవాయిడ్ చేయగలుగుతున్నాను. అతడితో కలిసి ప్రయాణించే అవసరం లేకుండా, మెట్రో పట్టుకునే టైమ్ మార్చాను. అతడు తొమ్మిదిన్నరకల్లా బయలుదేరతాడని తెలుసు. నేను తొమ్మిదిన్నర దాటే దాకా బయటకు రాకుండా ఆగుతున్నాను. ఉదయమే వీధి చివరికి వెళ్ళి న్యూస్ పేపర్ కొనటం మానుకున్నాను. ఎప్పటిలా డస్ట్ బిన్ తీసుకు వెళ్ళి, రోడ్డుమీద పెట్టటం లేదు. అతడు ఎక్కడ ఎదురు పడతాడోనన్న భయం. ప్రత్యేకించి ఉదయాల్లో! ఆ సమయం లోనే అతడు ఎదురు పడే అవకాశం ఎక్కువ. 

నా ప్రయత్నం ఫలితం ఇచ్చింది. ఈ మూడు నెలలుగా అతడి ఆలోచనలని దూరం చేశాను. మాములుగా ఆఫీసుకి వెళ్ళి వస్తున్నాను. వంట చేస్తున్నాను. ఫాంటసీ మాని, ఆయనతో రాత్రులు మనసారా గడిపే ప్రయత్నం చేస్తున్నాను. ‘ఫరవాలేదు, నన్ను నేను అదుపులో పెట్టుకున్నాను’ అనుకున్నాను నిన్నటిదాకా- నిన్న మళ్ళీ అతడు కంటబడే దాకా! 

నిన్న ఆ వేళలో, తలుపు తీసుకు బయటకు వచ్చేసరికి, దూరంగా పేవ్ మెంట్ మీద నిలబడి, పోస్ట్ మాన్ తో మాట్లాడుతూ కనిపించాడు. నా కాళ్ళు నా మాట వినలేదు. అటుకేసి నడిపాయి. ఆ పాతిక అడుగులు నడవటానికి ఎంత ప్రయాస పడ్డానో! ఊపిరి  బిగబట్టి, పొట్ట లోపలికి లాక్కున్నాను. నిటారుగా నడుస్తూ, తల సాగదీసి, గడ్డం పైకెత్తి, డబల్ చిన్ కనపడకుండా ప్రయాస పడ్డాను, ఎన్ని చేసినా, ఈ యాభయ్యేళ్ల వయసు దాగేనా? వాళ్ళని సమీపించాను. 

పోస్ట్ మాన్ నన్ను చూసి, పలకరింపుగా చిరునవ్వు నవ్వి, వెళ్ళిపోయాడు. 

ఇప్పుడు మేమిద్దరమే! నేను అతడి కళ్లలోకి చూడకుండా ఉండలేకపోయాను. అతడిలోని ఆకర్షణ ఆ కళ్ళే! అవి  తప్పితే, అతను మామూలు మధ్య వయసు మనిషి! 

అతను సూటిగా నా కళ్ళలోకి చూశాడు. కొద్దిమందే చేయగల పని! చాలామంది చూపు పక్కకి తిప్పుకు మాట్లాడతారు. సూటిగా కళ్ళలో కళ్ళు కలిపి చూస్తూ, మాట్లాడలేరు. 

“హాయ్!” అన్నాను, గంభీరంగా కనబడాలని ప్రయత్నించాను. నా వల్ల కాని పని. మెదడంతా ప్రెషర్ కుక్కర్ లా ఉంది. 

“చాలా రోజులుగా కనబడలేదు?” నా వైపు రెండడుగులు వేస్తూ అన్నాడు.

‘ఓ గాడ్! దగ్గరకు వచ్చి, ఏం చేయబోతున్నాడు? నిజంగా ఇన్నాళ్లుగా నన్ను మిస్ అయ్యాడా?’

నాలో కలుగుతున్న భావ సంచలనం అతడికి తెలియకుండా ఉండాలని విశ్వ ప్రయత్నం చేశాను. అతను కూడా ఇలాటి సంచలనానికే గురి అవుతున్నాడా? లేక, ఇది నా ఊహ మాత్రమేనా? 

కాదు.  నేను కొద్ది రోజులుగా కనిపించటం లేదని గుర్తించాడంటే, అర్ధం ఏమిటి? అతడు కూడా నన్ను చూడాలనే కోరుకుంటున్నాడనేగా? 

భావ రహితంగా కనిపించాలన్నట్టు చూశాను.

“ఎక్కడకైనా వెళ్ళావా?” మళ్ళీ అడిగాడు.

“లేదు. ఎప్పటిలాగే ఇక్కడే ఉన్నాను, పని వత్తిడి…” నీళ్ళు నమిలాను.

‘నువ్వెందుకు కనిపించలేదు? అని అతడిని అడగకు. అతడిని పట్టించుకోనట్లే నటించు.’

నాకు నేనే చెప్పుకున్నాను. నా జీవితాన్ని, నా ఆలోచనలని అదుపులో పెట్టుకునే ఉద్దేశ్యంతో అతడిని ఎవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నానని అతడికి తెలిసిపోయిందా? 

నా మనసు బలహీన పడుతున్నట్లు  నాకే తెలుస్తోంది. ఇంకా కాసేపు అక్కడే ఉంటే, నేనేం మాట్లాడతానో నాకే తెలియదనిపిస్తోంది. “ బై. సీ యూ.” అనేసి, వెనక్కి తిరిగాను. 

మరునాటి నుంచీ మరో కొత్త ఆలోచన వచ్చి పడింది. 

‘అతడు నా ఉనికిని గుర్తిస్తున్నాడా? ఇన్నాళ్ళూ నేను కనిపించలేదని ఆరాట పడ్డాడా?’ 

ఎంతసేపూ  ఇదే ఆలోచన. ఏ పని మీదా మనసు నిలవదు. తప్పు అని తెలిసినా, తిప్పుకోలేని తప్పుడు ఆలోచనలు మనసుని చెరుస్తున్నాయి. భర్త మీద ధ్యాస లేదు, పిల్లల మీద శ్రద్ధ లేదు. ఆఫీసు పని మీద ఆసక్తి లేదు. అహరహం బుర్ర నిండా అతడొక్కడే! పెళ్లి కాని, పాతికేళ్ల పడుచుదనపు ఆలోచనలు, పెళ్ళయిన పాతికేళ్ళ తరవాత రావటం ఏమిటి?  ఈ మనసు కేమయింది? వయసుని దాచే ప్రయట్నంలో, మెదడు మనసుని తోడు చేసుకుంటోందా? ఏమో, వ్యామోహం తర్కానికి లొంగుతుందా  ? 

రాత్రి టి వి ముందు కూర్చొంటాను. తొమ్మిది గంటల వార్తలు వస్తుంటాయి. మనసు వార్తల మీదకు పోదు. ‘అతడు కూడా ఇప్పుడు వార్తలు చూస్తూ ఉంటాడా? లేక, పది గంటల వార్తలు చూస్తాడా? తను రెండు సమయాల వార్తలనీ చూడటం మంచిది. అతడనుభవించేది ఏదీ తను మిస్ కాకూడదు.  

అతడు ఫెర్రెట్స్ మీద వస్తున్న ప్రోగ్రామ్ చూస్తుంటాడా? అతడు హెమింగ్వే మీద వచ్చిన ఆర్టికల్ చదివి ఉంటాడా? అతడికి  పుస్తకాలు చదవటం ఇష్టమా, సినిమాలు చూడటమా? అతడు ‘డామేజ్’ సినిమా చూసి ఉంటాడా? బీనోష్ తో జెరేమీ ఐరన్స్ ఎఫైర్ నడుపుతున్న దృశ్యాల్ని చూస్తుంటే, అతడికి తను గుర్తువచ్చి ఉంటుందా? తమ మధ్యా అలాంటి రసవత్తరమైన ఎఫైర్ ఊహించుకుంటాడా? 

అతడా సినిమా చూశాడో లేదో తెలియదు,  అసలు సినిమాలు చూస్తాడో, లేదో కూడా తెలియదు. అయినా మనసంతా ఇటువంటి ఆలోచనలే! మనసుని కట్టుకోవటం ఎంత కష్టం! ఆలోచనలతోనే వళ్లంతా వేడెక్కిపోతోంది. ఎక్కడో ఏదో అయిపోతోంది!

నిజానికి, తనది ఏ లోటూ లేని ఉత్తేజకరమైన జీవితం. అన్నీ కావలసినదానికన్న ఎక్కువే ఉన్నాయి. పెద్ద బంగాళా, బుద్ధిమంతులైన పిల్లలు, ఎందులోనూ లోటు చేయని, ప్రేమించే భర్త.

అయినా ఎందుకో అసంతృప్తి! అసంతృప్తి కాదేమో, కేవలం అదో తీవ్రమైన కోరిక. 

’అతడిని నేను కోరుకుంటున్నాను. కాదు, కాదు, అతడు నన్ను కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను.’ అదీ నిజం.  

ఏ పని చేస్తున్నా అతడి ధ్యాస వదలటం లేదు. ఏ పనీ లేనప్పుడూ అతడి ధ్యాసే! నిరంతరం అతడి ధ్యాసే! 

ఇద్దరం కలవటం తప్పదు. అది జరగకపోతే, తను తట్టుకోలేదు. అయితే ఎప్పుడు? ఎలా? అతడితో తొలి ముద్దు అనుభవం ఎలా ఉండబోతుంది? ఇద్దరి తొలి సమాగమం ఎలా జరగబోతుంది? అతడికి ఎలాటి అనుభవం ఇష్టం? సున్నితంగా ప్రవర్తిస్తాడా లేక మొరటుగా అనుభవం కోరుకుంటాడా? ఆ అనుభూతులు ఎలా ఉండబోతున్నాయి? ఎలా ఉన్నా ఫరవాలేదు. అతడు తనకి కావాలి, అంతే. అతడికి ఎలా కావాలంటే, తనావిధంగా ప్రవర్తిస్తుంది. కానీ, ఎప్పుడు, ఎప్పుడు ఇదంతా సంభవం అయ్యేది? తీవ్రమైన తపన. చల్లారని తపన.

అనుకోకుండా ఈవేళ ఇద్దరం కలిశాం! ఈసారి మా ఆఫీస్ దగ్గరి స్ట్రీట్ లో- మా ఇద్దరి ఆఫీసులకీ దగ్గరగా ఉన్న ఆ స్ట్రీట్ లో! ఉహుఁ …అతడికి దగ్గరౌతుందని నేనేం ఆ ఆఫీస్ లో చేరలేదు. అక్కడ చేరిన తరవాతే, కొన్నాళ్ళకి తెలిసింది, అతడి ఉద్యోగమూ అక్కడికి దగ్గరలోనే మరో ఆఫీస్ లో అని.  

 

అది లంచ్ టైమ్. నేను క్రంబుల్ స్ట్రీట్ లోకి నడిచాను. అతడు రావటం కనిపించింది. నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అతడిని చూడనట్లే నటించాను. అతడూ నన్ను చూడనట్లే నటిస్తున్నాడు, లేదా నిజంగానే చూడలేదా? అయ్యో, ఈ అవకాశం పోనివ్వకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి మాట్లాడి, తన ఉనికిని అతడి దృష్టికి తేవాలి. ఏం మాట్లాడాలి? అతడంటే లక్ష్యం లేనట్టు, ఏదైనా అంటే బాగుంటుందేమో!  అడుగుల వేగం పెంచి, అతడి కంట బడేలా వెళ్ళి, 

“హాయ్, నువ్వేమిటీ, ఇక్కడ ?”  అన్నాను కాజువల్ గా అన్నట్టు.  

“జోనా! హాయ్!” అన్నాడతను. ఆ ఒక్క పలకరింపుతో నా మనసెటో వెళ్లిపోయింది.

నన్ను అకస్మాత్తుగా చూసి, ఫ్లాటైపోయాడా? ‘ఎప్పటిలాగే ఎదురు పడ్డామన్న రొటీన్ పలకరింపేనా, ఇప్పటికైనా ఎదురు పడటం జరిగిందన్న సంతోషమా? తెలియటం లేదు. 

అతడి కళ్లలోకే చూస్తుండిపోయాను. అరుదుగా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.   అయితే, ఎలా? నేనే చొరవ తీసుకుంటే? చులకన అవుతానా? లేక, అతడు కూడా ఎదురు చూస్తున్న అవకాశం అందించినదాన్ని అవుతానా? అతడు చొరవ తీసుకున్నాక, తను ప్రతిఘటిస్తే, పరువు పోతుందని సంశయించి, ఆగి పోతున్నాడేమో! మగవాళ్ల ఇబ్బందులు మగవాళ్లకి  ఉంటాయి కదా! అతడు కూడా ఊహల్లో తనతో ఫాంటసైజ్ చేస్తున్నాడేమో. పోనీ, నేనే ముందడుగు వేసి….

“ఏం చేస్తున్నావ్ ఇక్కడ?” అతడు నా ఆలోచనలని భగ్నం చేస్తూ అడిగాడు. 

ఇదేమిటి? నా ప్రశ్న నా మీదకే సంధించాడు? ఏం మాట్లాడాలో తెలియని సందిగ్ధతా? లేక, ఏం చేయాలో చెప్పమన్న ప్రోత్సాహమా? 

ఆలోచనలు ఆపి, ఏదో ఒకటి చెప్పేయ్యాలి. అతడు కదిలి వెళ్లిపోకముందే, చొరవగా ఏదో చెప్పేయ్యాలి. అలసిపోయినట్టు మొహం పెట్టి, “ఉదయం నుంచీ ఊపిరి సలపనంత పని… ఆకలి దంచేస్తుంటే, బలవంతాన బయటపడ్డాను.” అన్నాను. 

“ఓ…లంచ్ టైమ్ కదా.” 

అతనికి ఇండియన్ ఫుడ్ ఇష్టమని, ఇదివరకు ఒకసారి అన్నాడని నాకు గుర్తు వచ్చింది. 

“అవును. ఈ స్టీట్ చివర్లో ఉన్న రెస్టారెంట్ నా కిష్టం. అక్కడ  ఇండియన్ ఫుడ్ బాగుంటుంది.” 

చెప్పాను. ‘నాతో కలిసి తిందువు గానివి, రా’ అనికూడా అనవలసిందా?  అమ్మో, అనలేను. ‘నన్ను తినేద్దువు గానివి’ అన్న భావం పలికేస్తుంది నా గొంతులో, ఆ మాట అంటే! నాలో నేనే సిగ్గుపడిపోయాను.  

పోనీ, ‘పద, ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం.’  అంటేనో? ఇది అస్సలు అనలేను. ‘ఇద్దరం కలిసి’ అనటంలో, ఇద్దరి కలయిక అన్న అర్ధం ధ్వనిస్తోంది. ఆ ఊహకే నేను అతడి కౌగిట్లో ఒదిగిపోయిన భావం నన్ను ఆవహించేసింది. నడి రోడ్డు మీదే… రాకూడని, అవకాశం ఉండని చర్య ఏదో మా ఇద్దరి మధ్యా జరిగిపోతున్నట్లే అనిపించి, నేను వివశనై పోతున్నాను. ఆ రెస్టారెంట్ ఫ్యామిలీ సెక్షన్ లో ఇద్దరిద్దరికి విడి కేబిన్స్ కూడా ఉంటాయి. ఆ రెస్టారెంట్ కి వెళ్ళి, అతడితో ఆ క్యాబిన్ లో కూర్చొంటే, ఆ ఏకాంతంలో  అతడితో మమేకమైపోతూ ..     

అయితే, తెగించి, ఇప్పుడు తను లంచ్ కి రమ్మని అడిగితే, అతడు కాదంటే? ఏదో ఒక కారణం, లేదా ఏదో ఒక వంక చెప్పి ఇప్పుడు కుదరదనేస్తే? తను భరించ గలదా? ఒద్దొద్దు, అతడినే ముందు ప్రపోజ్ చెయ్యనిస్తే మంచిది. అంతదాకా నిగ్రహించుకోవటం నయం. 

“ఎటువైపుంది నీ రెస్టారెంట్?” 

“ఉఁ..” ఊహల్లో మునిగిపోయిన నాకు ఒక్క క్షణం అతడు ఏమడుగుతున్నాడో అర్ధం కాలేదు. 

అయోమయంగా చూశాను. 

“అటువైపు కార్నర్ లో ఉన్నదేనా?” చేయి దక్షిణానికి చాపుతూ అడిగాడు అతడు.

ఆ చేయి నాకోసమే సాగుతున్నట్టు అనిపించింది. 

‘వస్తాడా నాతో? అందుకేగా అడుగుతున్నాడు. వచ్చేసిందా నేను కలలు కంటున్న ముహూర్తం?’ 

ఉద్వేగాన్ని అదుపు చేసుకుంటూ, గబగబా మాట్లాడాను, “ అవును. అదే. లంచ్ లో స్పెషల్ బఫే ఉంటుంది. వెరీ డెలిషియస్.” ఆశగా అతడి కళ్లలోకే చూస్తూ అన్నాను. 

“ఓహ్…ఐ సీ. అయితే, ఒకసారి వెళ్ళాల్సిందే.”

ఎప్పుడు? ఎప్పుడు? ఇప్పుడే ఎందుకు కాదు? ఈ రోజుని వదులుకోలేను. ఇంకా వేచి ఉండలేను.

పద వెళ్దాం. ఆ క్యాబిన్ లో, ఆ ఏకాంతంలో, నన్ను నీలో కలిపేసుకో… అన్నీ మరిచి, ఆ కొన్ని నిముషాలు ఇద్దరమే…మనమిద్దరమే…ఒక్కరమై…తనువొక్కటిగా…

“ఓకే. ఆకలిగా ఉందన్నావ్. క్యారీ ఆన్. ఎంజాయ్ యువర్ మీల్. సీ యూ.”

నా కలల గాజు సౌధం మీద బండరాయి పడేస్తూ, ఆ మాటలంటూ అతడు మరో వైపుకి తిరిగి, గబగబా నడుస్తూ వెళ్లిపోయాడు. 

నేను చేష్టలుడిగిన దానిలా నిలబడిపోయాను, అతడికి తెలుసా నేనిలాగే నిలబడిపోయానని? ఒక్క సారైనా వెనక్కి తిరిగి చూడడేం? అతడికి తెలియలేదా నా అవస్థ? తెలిసీ, పట్టలేదా, పట్టించుకోలేదా? నా చెవుల్లో పదే పదే వినబడుతూ అవే మాటలు…. ‘అయితే, ఒకసారి వెళ్ళాల్సిందే.’

ఆ అనటంలో ‘ఇద్దరం కలిసి వెళ్ళాలి’  అన్న భావం ఉందా అసలు? ఇంకా ఎప్పుడు? ఇక అసలు సాధ్యమేనా? 

నా మనసును లెక్కచేయకుండా పరుగులు తీసిన వయసు, నన్ను ఒక్కసారిగా కృంగదీసి చంపింది.

లేక, వయసును లెక్కచేయకుండా పరుగులు తీసిన మనసు బండరాతిలాంటి నిజానికి తగిలి బొక్కబోర్లా పడిందా!

శూన్యమైన మనసుతో, ఆకలిని మరిచి అలాగే నిలుచుండి పోయాను ఆ మూడు రోడ్ల కూడలిలో.  

 

పివిఆర్ శివకుమార్

వృత్తి రీత్యా ఇంజనీర్. గత అరవై ఏళ్ళుగా కథలు రాస్తున్నారు. మూడువందల యాభై పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వాటిలో నలభై ఆరు కథలకు బహుమతులు వచ్చాయి. విపులలో యాభై పైగా అనువాద కథలు రాశారు. అయిదు కథా సంపుటాలు, పి వి ఆర్ శివకుమార్ కథానికలు, కిరణం, అతిథి(కి)దేవుడు,నీదే గానీ నీదే కాదు, అవ్యక్త రాగం, మూడు నవలలు, శమంత -హేమంత, జీవన పోరాటంలో ఆశలు ఆరాటం, ఆచరణల్లో ఆదర్శాలు పుస్తకాలుగా వచ్చాయి. 70 వ దశకంలో హైదరాబాద్ ఆకాశవాణిలో నాటికలు, ఇతర కార్యక్రమాలు యాభై దాకా ప్రసారమయ్యాయి.

Previous Post

ఇనుపచువ్వల దడి

Next Post

అపార్ట్మెంట్ మిస్టరీ

Next Post
అపార్ట్మెంట్ మిస్టరీ

అపార్ట్మెంట్ మిస్టరీ

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com