• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ : చాక్లెట్ కేక్

కోడిహళ్లి మురళీ మోహన్ by కోడిహళ్లి మురళీ మోహన్
December 11, 2025
in అనువాద కథలు
0
కన్నడ కథ : చాక్లెట్ కేక్

కన్నడ మూలం: కావ్య కడమె
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్

నాలుక మీద పెట్టుకునే ముందు ఎప్పుడైనా చాక్లెట్ కేక్‌ని వాసన చూశారా? తల నిండా చీర కొంగు కప్పుకొని, పారాణి పెట్టుకున్న పాదాలను మాత్రమే బయటికి చాచి, పూల మంచం మీద ముడుచుకు కూర్చున్న కొత్త పెళ్ళికూతురులా ఉన్న ఈ చాక్లెట్ కేక్‌ని దయచేసి ఒక్కసారి చూడండి.

మైదాపిండి, పంచదార, గుడ్లు, వెన్న, కోకో పౌడర్, నాలుగైదు వెనిలా చుక్కలు కలిసి ముద్దగా లోపలికి వెళ్ళి,  చక్కగా ఓవెన్‌లో కాలి,  పువ్వులా మృదువుగా బయటకొచ్చి, తన తీపి సమయాన్ని తీసుకొని నెమ్మదిగా చల్లబడి, ఇసుక రేణువుల్లా  కేకు కణకణాల లోపల గాలిని నింపుకుని, దూది వంటి నునుపును కప్పుకొని, దివ్యమైన పరిమళాన్ని వెదజల్లుతూ తన ఉనికితోనే మాయ చేసి మన ధ్యానాన్ని చెదరగొడుతుంది కారునల్లని ఒక చాక్లెట్ కేక్.

ఇక దానిని సరిగా మధ్యలో రెండు పొరలుగా చీల్చి, కింది పొరకు వెన్న, చక్కెర పొడి, కరిగించిన చాక్లెట్‌తో తయారు చేసిన క్రీమ్‌ని మెల్లగా పరచాలి. తర్వాత నాజూకుగా ఇంకొక పొరను పైన పెట్టి, పూర్తిగా కేకును  కొంచెమైనా బయటికి కనిపించకుండా ఫ్రాస్టింగ్ చెయ్యాలి.

అంతే, అయిపోయింది. ఉద్వేగభరితమైన సంభోగం కంటే అద్భుతమైనది ఈ లోకంలో ఇంకేమైనా ఉందా? అని ఎవరైనా అడిగితే ‘సార్, సరిగా తయారుచేసిన చాక్లెట్ కేక్‌ని తాజాగా ఉన్నప్పుడే కోసి మీరు ఎప్పుడూ తినలేదా?’ అని నేను బదులుగా ప్రశ్నిస్తాను.

అలాంటి ఒక చాక్లెట్ కేక్ ఇప్పుడు నా కిచెన్ ఐలాండ్ మీద తిష్టవేసుకుని కూర్చుంది. రాత్రి పన్నెండు లేదా ఒంటి గంట అయి ఉండాలి. ఎంత సమయం, ఏ రోజు అన్నది ఎవడికి కావాలి? ఆ క్షణంలో ఎన్నో రహస్యాలను తనలో దాచుకుని నిలబడ్డ దానిలా చాక్లెట్ కేక్ ఇలా ఎదురుగా ఉన్నప్పుడు? ఇప్పుడు ఆలోచిస్తే, ఈ రోజు శుక్రవారం రాత్రి అంటే వారాంతం ప్రారంభ సమయమని జ్ఞాపకాల పొరల వెనుక ఎక్కడో రికార్డయింది.

అదే కదూ చెప్పింది గ్రేస్? ఈ కేక్ డబ్బాను నా చేతికి ఇచ్చే ముందు? “హ్యాపీ ఫ్రైడే, నీకిష్టమైన ఈ కేక్ ఆస్వాదించడానికి నీకు పూర్తి వీకెండ్ దొరుకుతుంది. ఎంజాయ్!” అని.

అప్రయత్నంగానే ‘ఓహ్ మై గాడ్, థాంక్స్!’ అనే పదాలు నా నోటి నుంచి బయటికి వచ్చాయి.

‘థాంక్స్ నాకు కాదు. ఇటలీ నుంచి సెలవులకు వచ్చిన మా పిన్నికి చెప్పు’ అని తన సాధారణ శైలిలో కౌగలించుకొని నుదుటిపై ఒక ముద్దుపెట్టి వెళ్ళిపోయింది గ్రేస్, ఆమె ఖరీదైన అత్తరు పలుచని పొర కొద్దిగా నా గుండెలపైనా, కొద్దిగా ఆమె వెళ్ళిన దారిలోని గాలిలో కలిసిపోయి కొన్ని క్షణాలు సమ్మోహనంలా నన్ను కమ్మివేసింది.

మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, ఆమె స్వయంగా నాకిచ్చి వెళ్ళిన చాక్లెట్ కేక్ సృష్టించిన మరో మాయాజలంలో ఇరుక్కుని.

అయినా ఈ సుహాస్ ఈరోజే టెక్సాస్‌కు చెక్కేయాలా? ఆఫీసుకు సంబంధించిన ఏ ప్రోగ్రాములనూ  వారాంతాల్లో పెట్టుకోవద్దు అని  నాకు హుకుం జారీచేసి, ఇప్పుడు ‘అలాంటి బిలియనీర్ క్లయింట్ రమ్మని పిలిచినప్పుడు, వారాంతం నా పెళ్ళాం  పక్కన పడుకోవాలి, కుదరదు  అని చెప్పగలనా?’ అంటూ ఎవడో లెవెన్స్కీ అనేవాడి పుట్టినరోజు పార్టీకి బుకే పట్టుకొని ఎగేసుకుని  వెళ్ళాడు దుర్మార్గుడు. ఇక వాడు సోమవారమే న్యూయార్క్‌కు ఫ్లైట్ ఎక్కేది. అప్పటివరకు ఈ ఇంట్లో నేను, ఈ కేక్ ఇద్దరమే. వాడైనా ఉండుంటే, మూడో వ్యక్తి ఒకరైనా ఉండి నాకు కొద్దిగా ధైర్యంగా  ఉండేది అనుకున్నాను.

‘ఈ క్లయింట్‌ను చేజిక్కించుకుంటే అయిపోయింది చినా, నా కంపెనీ ఎలా దూసుకుపోతుందో చూడు. రెండేళ్ళలో ఎస్ & పీ ఇండెక్స్ మీద పేరు వచ్చేలా చేస్తాను చూస్తూ ఉండు. తర్వాత పామ్ బీచ్‌లోనే ఇల్లు కట్టుకుందాం. నా తలలో అన్నీ ప్లాన్స్ అలానే ఉన్నాయి. నీకోసం, నాకోసం, మనకోసం! ఆ నీ జాబ్‌ను కూడా మానేయడానికి సిద్ధంగా ఉండు. ఇంకేంటి మనం కూడా ఫ్యామిలీ మొదలుపెట్టాలి కదా? ఇదే సరైన సమయం. మనం ఆగలనుకున్నా నీ దేహపు క్లాక్ ఆగదు కదా? నీకు ముప్పై మూడు నిండకముందే నాకు ఇద్దరు పిల్లలు కావాలి. ఒక కొడుకు, ఒక కూతురు. ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ. అరె, ఎందుకు ముఖం ఆముదం తాగినట్టు  పెడతావు? నీకు కూడా అదే కావాలి కదా? దట్ వాస్ ఎ ప్లాన్. వాసంట్ ఇట్? చినా… ఇంకేంటి ఈ ఇంటిపై అప్పు కూడా తీరిపోవడానికి వచ్చింది. అంటే ఇంటి మొత్తం క్యాపిటల్ చేతిలో ఉన్నట్టే కదా?’

అంటే వీడి ప్లాన్ ప్రకారం ఇద్దరు పిల్లలను కనడానికి నాకు నాలుగేళ్ళు ఉన్నాయన్నమాట. అదేమి మినప దోసెనా ఇలా వేసి అలా ఇవ్వడానికి? వీడి తల. ఎప్పుడూ ప్రభుత్వ ప్యాకెట్ సారానే తాగుతూ ఉండే  మా ఫిరంగిపురం పెదనాన్న  కాలువలో పడే ముందు కలవరించే మాటలన్నీ వీడు తాగకుండానే వాగుతున్నాడు, ఏం చేయాలి వీణ్ణి?

‘హల్లో, నీ కంపెనీ అభివృద్ధికి, నేను ఉద్యోగం మానేయడానికి ఏంటి సంబంధం?’ అని అడిగితే, ‘నువ్వు మాయామృగ సీరియల్‌లోని మాళవికలా నటించకు సరేనా? అదంతా రియల్ లైఫ్‌లో జరగదు. నీకు వస్తున్న జీతానికి ఐదు వేలు కలిపి నేనే పాకెట్ మనీ ఇస్తాను కావాలంటే, పిల్లల ఆరోగ్యం ముఖ్యం. అంతేగా చినా?’ అంటాడు. ఇంకా పుట్టబోయే కొడుకూ, కూతురు పైనే వీడి శ్రద్ధ అంతా.

వీడు చీటికిమాటికి చిన అనడం కేజీఎఫ్ యష్ మీదున్న అభిమానంతో ఏమీ కాదు. చిరంతన అన్న నా పూర్తి పేరుకు సంక్షిప్త రూపం అది. ఆఫీసులో కూడా అందరూ నన్ను అలాగే పిలుస్తారు. నో, నాట్ చైనా, అది దేశం అయింది. ఇది చిరంతన, యూ కెన్ కాల్ మీ చినా.

గ్రేస్ కూడా అలాగే కదా పిలుస్తుంది నన్ను? మళ్ళీ మళ్ళీ ఆమెనే గుర్తుచేసుకోవడానికి ఆమె మీద వివరించలేని అసూయ, ఆకర్షణలకు మించిన ఒక కారణం ఉంది. అది ఆమెకు, నాకు, మా ఉద్యోగానికి, మా ఇద్దరి బాహ్యలక్షణాలకు, అన్నింటికీ మించి ఇప్పుడు నా ముందు ఇలా పంజరంలో చిరుతపులిలా నిటారుగా ఊపిరి తీసుకుంటూ, మౌనంగా నన్నే చూస్తూ కూర్చున్న ఈ చాక్లెట్ కేక్‌కు సంబంధించింది.

మేమిద్దరం జీ-మెడ్ అనే బయో-ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాం. వంశపారంపర్యంగా వచ్చే అరుదైన వ్యాధులపై పరిశోధనలు చేసి దానికి అనుగుణమైన ఔషధ సేవలను అందించడం మా కంపెనీ ఉద్దేశ్యం. నేనూ, గ్రేస్ ఒకే సమయంలో ఇక్కడ ఉద్యోగంలో చేరాం. మా ఉద్యోగానికి ‘థెరప్యూటిక్ స్పెషలిస్ట్’ అనే వినసొంపైన పేరు ఇచ్చినా మా పని ఒక రకంగా కంపెనీ అమ్మకాలను పెంచడమే. కానీ మా గొప్ప కార్పొరేట్ కంపెనీ మూలసూత్రాలకు భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతో ‘సేల్స్’ అనే పదం ఎక్కడా రాకుండా జాగ్రత్త పడ్డారు.

ముఖ్యంగా మా పని అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారిని కలవడం. రోగులను క్లయింట్‌లు అని పిలవకూడదని కూడా మాకు మేనేజ్‌మెంట్ నుంచి కఠినమైన ఆదేశం ఉంది. రోగుల ఇళ్ళకు వెళ్ళి ఈ ‘సఫరర్‌’లను, వారిని చూసుకునే ‘కేర్ టేకర్’లను మాట్లాడించి వారి పరిస్థితి యొక్క రోగ లక్షణాలను పట్టిక లో నమోదు చేయడం మా ముఖ్య బాధ్యతల్లో ఒకటి, మా కంపెనీ తయారుచేసే డ్రగ్స్ ప్రయోగాత్మక ట్రయల్స్‌లో పాల్గొనడానికి వీరిని ప్రోత్సహించడం, ఆ ఖర్చులో కొంత భాగాన్నైనా రోగుల ఆరోగ్య బీమా కంపెనీనే  భరించేలా చూసుకోవడం మాకు ఉన్న మరో బాధ్యత. సంవత్సరాంతంలో షేర్ల రూపంలో ఇచ్చే బోనస్ కూడా కంపెనీ అభివృద్ధికి మేమెంత లాభాన్ని చేర్చామన్న దానిపై ఆధారపడుతుంది.

ఈ రోగుల నిర్దిష్ట అవసరాలను, ఉన్న సౌకర్యాలను,  కావలసిన సౌకర్యాలను  వ్యక్తిగత స్థాయిలో తెలుసుకోవడం ఒక రకంగా సున్నితమైన వ్యవహారం. వారి పరిస్థితి గురించి కంప్యూటర్ ముందు కూర్చుని పొడిపొడి భాషలో రిపోర్ట్ వ్రాయడం, రోగుల డేటాబేస్ తయారు చేయడం, చాలా అరుదైన కేసు ఉంటే దాని గురించి మీటింగ్‌లో సమర్పించడానికి పవర్‌పాయింట్ స్లైడ్‌లను రూపొందించడం లాంటివే  కాకుండా రోగులతో మాట్లాడేటప్పుడు మేమొక  కొత్త ముఖాన్ని ధరించి, వ్యక్తిగత బంధాన్ని సురక్షితమైన దూరంలో ఏర్పరచుకొని సంభాషించా ల్సి ఉంటుంది.

ఎంత డబ్బు వెచ్చించినా కాని పని ఒక్కోసారి చిరునవ్వు, కొద్దిగా సరస సంభాషణ, ఒక సానుభూతి స్పర్శతో సాధ్యమైపోతుంది. ఎన్నోసార్లు కేశ విన్యాసం, ధరించిన దుస్తుల రంగు, షూల హీల్స్ కొలత కూడా రోగులతోనూ, వారి కుటుంబ సభ్యులతోనూ జరిపే సంభాషణపై ప్రభావం చూపుతుంది అంటే మీరు నమ్మరేమో?

మాతోపాటు  థెరప్యూటిక్ స్పెషలిస్ట్‌లుగా పనిచేసే మిగిలినవారంతా పురుష పుంగవులే కాబట్టి, నాకూ, గ్రేస్‌కూ మధ్య ఒక సూక్ష్మమైన పోటీ ఎప్పటినుంచో నడుస్తోంది. ఈ లావా పైకి కనిపించకుండా నిద్రాణమై ఉన్నా  తీవ్రంగా మరుగుతోంది. దానిని సమర్థించేలా ఆమె గర్భవతి అయినప్పుడు నావి, నేను శ్రుతి మించి పిజ్జా తిని లావైనప్పుడు ఆమెవి రిపోర్టులు మేనేజ్‌మెంట్ మీటింగ్‌లలో చాలా త్వరగా ముందుకు కదిలాయి అంటే ఈ అంతర్గత రాజకీయాలు మీకు అర్థమౌతాయి.

ఈ రోజు నా ముందు ఉగ్రనరసింహుడిని గుండెల్లో పెట్టుకొని శాంత స్తంభంలా నిలబడిన ఈ చాక్లెట్ కేక్ గ్రేస్ నన్ను ముంచడానికి పన్నిన అలాంటి ఒక కుట్రలో భాగమే అని నా బలమైన నమ్మకం. గత వారమే ఆఫీసు వీకెండ్ పార్టీలో ఎరుపు రంగు ఆఫ్-షోల్డర్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నన్ను చూసి, “అరెరె, ఎంత అందంగా ఉన్నావు. నీ పొట్ట కూడా ఎంత చదునుగా ఉందో చూడు” అని మెచ్చుకుంటూ చెప్పిందే.

ఒకసారి ఏదో సెమినార్‌కు ఇద్దరం పది నిమిషాలు ముందుగా చేరుకొని, ఏదో మాటల సందర్భంలో  మా మధ్య చాక్లెట్ కేక్ సంగతి వచ్చింది. ‘ గుంటూరులో పెరుగుతున్నప్పుడు నేను నిలబడిన చోటు నుంచి ఐదు వందల మీటర్ల పరిధిలో ఎక్కడ బేకరీ ఉన్నా అది నా ముక్కు ద్వారానే తెలిసేది. భారతదేశంలో దొరికే కేకులకు వేరే రకమైన వాసన ఉంటుంది. అదేం డాల్డానో, ఏంపాడో వేసి తయారుచేస్తారో ఎవరికి తెలుసు. కానీ అక్కడ బేకరీలో కేక్ తిన్నవారికి ప్రపంచంలో ఏ కేక్ కూడా నచ్చదు’ అని ఒక రహస్యాన్ని చెప్పేసాను. అప్పుడు గ్రేస్ మూడు నెలల బాలింత, తన మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకొని అప్పుడే డ్యూటీకి రిపోర్ట్ చేసింది. ఆమె నడుము చుట్టూ కొత్తగా ఏర్పడిన టైరును నా కళ్ళు అప్పుడప్పుడూ మెరుపు వేగంతో కొలుస్తున్నాయన్నది సూక్ష్మ దృష్టి గల గ్రేస్ గమనించి ఉండదనుకోను నేను.

‘ట్రస్ట్ మీ. నువ్వు ఏం చెప్తున్నావో నాకు తెలుసు. నేను జీవితాంతం అమెరికాలోని ఈ దరిద్రమైన పంచదార కేకులనే తిని పెరిగాను. ఇటలీలో నా పిన్ని ఒకరున్నారు. మిలాన్‌లోని టోర్టా అల్ చికలాటో అనే పెద్ద బేకరీలో పేస్ట్రీ షెఫ్ ఆమె. ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు తయారుచేసింది చూడు ఒక చాక్లెట్ కేక్. అప్పటి నుంచి నేను ఇక్కడ దొరికే బేకార్ కేకుల వైపు కన్నెత్తి కూడా చూడను’ అని చెప్పినట్టు గుర్తు.

నాకు మొదటి నుంచీ అంతే, తీపి అంటే నోట్లో నీళ్ళూరుతాయి.  ‘ అర్రే, చిన్నపిల్లల్లా ఇంకా చాక్లెట్ తింటుందా ఈ పాప’ అని ఆట పట్టించాడు సుహాస్ మొదటిసారి తెలిసినప్పుడు. పెళ్ళైన కొత్తలో న్యూయార్క్ వీధి వీధి తిరిగి దొరికిందల్లా తిని ఒకే సంవత్సరంలో ఇద్దరం పది పది కిలోలు పెరిగాము. తర్వాతి ఆరు నెలల్లో సుహాస్ తన వంతు బరువునంతా  కరిగించేసుకున్నాడు. నాకు అదే పది కిలోలు కరిగించడానికి తర్వాతి మూడు సంవత్సరాలు పట్టింది.

ఆరడుగుల సుహాస్, ఐదడుగులకు ఒక అంగుళం తక్కువ ఉన్న నేను రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు ఒకే భోజనం తెప్పించుకున్నా క్యాలరీల లెక్క ప్రకారం నేను అతని భోజనంలో మూడో వంతు మాత్రమే తినాలి. దాన్ని ఆరగించిన తర్వాత కూడా కడుపులో నకనకలాడే ఆకలిని నియంత్రించుకోవడం కష్టమయ్యేది. అందుకే నేను బయటికి వెళ్ళినప్పుడల్లా పెద్ద గార్డెన్ సలాడ్ ఆర్డర్ చేస్తాను. సుహాస్ ప్లేట్ నుంచి ఫైవ్ చీజ్ టార్టిల్లినీని, ‘నాకు ఒక స్పూన్ చాలు’ అని నాది కాని మాట మాట్లాడి నమలక మింగేస్తాను, ‘డెజర్ట్ కావాలా?’ అనే ప్రశ్న వినిపించనట్టే ఎక్కడో చూస్తూ.

ఉదయం ఓ గంట జాగింగ్, సాయంత్రం ఆఫీసు జిమ్‌లో అరగంట కసరత్తు చేయకపోతే నెమ్మదిగా వెయింగ్ స్కేల్ ముల్లు కొద్దికొద్దిగా ముందుకు జరిగి నన్ను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు బుర్రలో తిండియావ కలగకూడదని అక్కడక్కడా సువాసన వెదజల్లే కొవ్వొత్తులను పెట్టాను. ఒక్కోసారి ఆపుకోలేనప్పుడు వాటిని వెలిగించి వాసన చూస్తూ జిహ్వచాపల్యాన్ని అదుపు చేసుకుంటున్నాను.

“అయ్యో అదేం అంత పెద్ద విషయమా? కొద్దిగా బొద్దుగా ఉంటే బాగానే  కనిపిస్తావులే, కావల్సింది తింటూ ఉండు?” అని సర్ది చెప్పవచ్చు మీరు.  కానీ ఇరవై ఐదు దాటిన ఒక స్త్రీ తన బరువును నియంత్రించుకుంటే లభించే ప్రయోజనాల అనుభవం ఉంటే ఖచ్చితంగా మీరు అలాంటి మాట అనరు.

వారూ వీరూ అని కాదు. ఒక వయస్సు దాటిన తర్వాత కూడా సన్నగా ఉండే ఆడవారిని ఈ లోకం ఒక రకమైన కుతూహలంతోనూ, ఆకర్షణతోనూ చూస్తుంది. రోడ్డుపై నడిచే అపరిచితులు కూడా మెచ్చుకుంటూ కళ్ళు పెద్దవి చేసుకుంటారు.  ఎవరో లిఫ్ట్ తలుపును ఆపి, ‘ఏ ఫ్లోరు?’ అని మృదువుగా అడుగుతారు. ఎంత పెద్ద తప్పు చేసినా పరుషంగా మాట్లాడడానికి బాస్ ఇబ్బంది పడతాడు. అంతెందుకు? నడుము సన్నగా ఉన్నప్పుడు ఇంట్లో భర్త కూడా ఎక్కువ వాదనకు దిగడు అంటే మీరు నమ్ముతారా?

టైమ్ చూసాను. రాత్రి నాలుగో జాము నడుస్తోంది. ఎదురుగా నిగనిగలాడుతూ నిప్పులా మండుతున్న చాక్లెట్ కేక్. ఎన్ని క్యాలరీలు ఉండవచ్చు? ఈ గదినే కాదు, మొత్తం ఇంటినీ ఆవరించిన పరిమళం చూస్తే బాగా వెన్న వేసి తయారుచేసి ఉంటారు. సుమారు మూడున్నర వేల క్యాలరీలు అనుకుందాం. వారానికి ఒక పీస్ తింటే చాలు అని ప్రతిజ్ఞ చేసి మిగిలిన కేక్‌ను ఫ్రీజ్ చేసి పెడితే? అప్పుడు క్యాలరీలు పంచబడి వెయింగ్ స్కేల్‌పై నమోదు కాకపోవచ్చు. కానీ చెప్పలేం. ఐదు వేల క్యాలరీలు ఉన్నా ఉండవచ్చు. ఎందుకో పిన్ని కేక్ బ్యాటర్ తయారుచేసేటప్పుడు ఇంకో రెండు బటర్ స్టిక్‌లను కలుపుతున్న గ్రేస్ చిత్రం నా కళ్ళ ముందు మెరిసింది.

ఒకవేళ మొదటి పీస్ తిన్న తర్వాత ఇంకొకటి కావాలనిపిస్తే? ఆ తర్వాత ఇంకొకటి. ఆపై ఒకటే ఒకటి అని మరోకటి. తర్వాత ఇదంతా అయ్యాక ఇంకోటేం ఎక్కువని ఇంకోటి… అలా మొత్తం కేక్ తెల్లవారే లోపల కడుపులోకి వెళ్ళిపోతే.. లేదు.. లేదు… గత ఆరు నెలలుగా కఠినమైన ఆహార నియంత్రణలో ఉన్నాను. ఇంతకాలం  కష్టపడి ఏర్పరచుకున్న కట్టు  ఒక్కసారి తెగిపోతే ఆ ప్రవాహపు ఉద్ధృతి ఎలా ఉంటుందో అనుభవంతో చూసాను. అప్పుడు అది ఈ ఒక్క కేక్‌తో ఆగదు.

ముందు మెదడు రెండు అడుగులు వెనక్కి జరిగి నిష్క్రియమవుతుంది. చెయ్యి దానంతటదే ఫ్రీజర్ తెరిచి అక్కడ మిగిలిపోయిన ఐస్‌క్రీం డబ్బా కోసం వెతుకుతుంది. తర్వాత స్టోర్‌రూంలో దాచిపెట్టిన చాక్లెట్‌లు, క్రీం బిస్కెట్‌లు. తర్వాత ఇంట్లో ఏయే తీపి పదార్థాలు మిగిలి ఉన్నాయో అవన్నీ… ఏమీ లేకపోతే రోజూ టీలో వేసుకునే తేనె, బెల్లం, పంచదార క్యూబ్‌లు, పొడి పంచదార. తీపి తీపి తీపి విషం అంతటా… అయ్యో, అయ్యో దేవుడా అన్న ధ్వని నా గొంతులోంచి బయటికి వచ్చింది.

ఏడాది పొడవునా శ్రద్ధగా బొట్టు బొట్టుగా  తగ్గించుకున్న బరువును ఒకే వారంలో బొసబొసమని తిరిగి పెంచుకోవచ్చా? అడగాల్సిన పనే లేదు. ఊయల ఎంత బలంగా ఒక వైపుకు ఊగుతుందో, అంతే బలంగా వెనుకకు వెళ్ళడం ప్రకృతి నియమం.

ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ఈ చాక్లెట్ కేక్ అత్యంత క్రూరమైన శత్రువులా, నరక ద్వారపు తాళం చెవిలా కనిపించసాగింది.. గబగబా లేచిపోయి పడకపై దొర్లిపడ్డాను. ఊహూ, కళ్ళు మూతపడటం లేదు. నాలుక ఆ రుచిని ఊహించుకుంటోంది. గుండె దడదడలాడుతోంది. ఇలాంటప్పుడు నిద్ర  దగ్గరకు వస్తుందా?

అలమటించిపోయాను. సమయం చూస్తే తెల్లవారుజామున నాలుగున్నర. లేచి దానిని ఒక్క క్షణంలో చెత్తలో పడేస్తే పోలా అనిపించింది. పడేయవచ్చు. అప్పుడు సజీవమైన కొండచిలువను ఒక మూటలో కట్టి ఉంచినట్లు చెత్తబుట్టలో అది ఉందని నాకు తెలిసి ఉంటుంది. చెత్తవాళ్ళు వచ్చేది సోమవారం ఉదయాన్నే, అప్పటివరకు అది అక్కడే ఉంటుంది. అది అక్కడే ఉందని తెలిసి ఈ ఇంట్లో నేను ఊపిరి తీసుకుంటూ బతకడం సాధ్యమేనా?

మంచం దిగి లేచి మళ్ళీ కిచెన్ ఐలాండ్ చుట్టూ అక్కడే తిరిగాను. వేర్వేరు కోణాల్లో కూర్చుని దానిని కొలిచాను. ప్రపంచం అంతా చీకట్లో మునిగి ఉన్నప్పుడు వెలిగించిన ఒకే ఒక్క దీపం వైపు కళ్ళు తిరిగినట్లు నాలో ఈ కేక్ త్రివిక్రముడిలా పెరిగి నిలబడింది.

రాత్రి భోజనం కూడా చేయలేదని గుర్తుకొచ్చింది. ఏం తినాలి? సాక్షాత్తు దేవుడే ఎదురుగా ప్రత్యక్షమైనప్పుడు అల్ప మానవుల వలె గడ్డి సలాడ్ తినగలమా?

‘క్రేవింగ్ కంట్రోల్ చేసుకోవడం ఎలా?’ అని ఫోన్‌లో గూగుల్ చేశాను. అది ఏమేమో అసంబద్ధంగా జవాబిచ్చింది. ‘ఆకలి అంటే ఆకలి. మన మెదడుకు అది ఏ ఆకలి అని వేరు చేసి చెప్పలేదు. అందుకే మీ ఫోకస్‌ను వేరే ఆకలి వైపు మళ్ళించండి, మీ భాగస్వామిని పడకమీదికి ఆహ్వానించండి.  కామకేళిలో పాల్గొనండి. గుర్తుంచుకోండి, సెక్స్ బర్న్స్ క్యాలరీస్! అప్పుడు కడుపు ఆకలి ఎలా వెంటనే మాయమవుతుందో చూస్తారు’ అంది. ఛ, ఎవరు రాస్తారు ఇవన్నీ? నా భాగస్వామి వెధవ అక్కడ ఎవడో బిలియనీర్ కాళ్ళ దగ్గర కుక్కలా పడున్నాడు. ఇక్కడ పాల్గొనడానికి ఏముంది? మళ్ళీ అడిగాను. ‘ఛీ ఛీ, చింత ఎందుకు? దానికంతా భాగస్వామి కావాలనేం లేదు కదా’ అని బదులిచ్చింది. ఈ సర్చ్ ఇంజిన్‌కు పిండం పెట్టా. అలాంటి వాటికంతా మనసు ఎంత ప్రశాంతంగా ఉండాలి. లోపల మారథాన్ రన్నర్ ఒకడు అశ్వ వేగంతో పరుగెడుతుంటే ఇక్కడ కూర్చుని చదరంగం బోర్డు మీద ఏకాగ్రత నిలపమంటే, అది సాధ్యమా?

బయట నెమ్మదిగా వెలుతురు రావటం మొదలైంది. ఎక్కడో స్టార్లింగ్ పక్షుల కిలకిలరావాలు. ఆకలి, నిద్ర లాగి లాగి చివరకు శరీరం ఒక హద్దుకు చేరి నిశ్చలమైనట్లుంది. ఇప్పుడు రెండూ అనుభవంలోకి రావటం లేదు. నోరు ఊరడం కూడా ఆగిపోయింది. అయినా ఏడుపు పొంగుకొచ్చింది. ఐలాండ్‌కు ఆనిచ్చి ఉన్న కుర్చీపై శరణార్థిలా కూలబడిపోయాను. ఒళ్ళంతా వణుకుతోంది. ఫోన్‌లో చూస్తే ముందు రోజు రాత్రే వచ్చిన రెండు మెసేజ్‌లున్నాయి.

ఒకటి సుహాస్‌ది. ‘సూపర్‌గా ఉంది చినా ఈరోజు పార్టీ. లెవెన్స్కీ చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఎంత మంది ప్రభావవంతమైన ఇన్వెస్టర్‌ల పరిచయం అయ్యింది అనుకుంటున్నావు? ఇక మన కల నిజమవడానికి ఎక్కువ రోజులు దూరంలో లేదు. అర్థమైందిగా? నువ్వు ఈరోజు నుంచే బర్త్ కంట్రోల్ టాబ్లెట్ వేసుకోవడం ఆపేయడానికి అభ్యంతరం లేదు’ అని కళ్ళు కొట్టే ఎమోజీతో పంపాడు.

కడుపులో దేవినట్టయ్యింది.

మరొక సందేశం గ్రేస్‌ది. ‘కేక్ ఎలా ఉంది? నీకు తెలుసు ఇంతసేపటికి నువ్వు ఫ్రాస్టింగ్‌లో మునిగి తడిసిపోతావని భయం వద్దు. నేను కూడా ఇక్కడ అదే చేస్తున్నాను’ అని రాసింది.

వీరిద్దరూ ఈ రోజు నా ముందు ఉంటే ఏమైతే అది అవుతుందిలే అని లాకర్ నుంచి గన్ తీసి వీరిద్దరినీ ఒక్క దెబ్బకు కాల్చి పడేసేదాన్నేమో. వెధవన్నర వెధవలు, దరిద్రగొట్టు పీనుగులు, బురదలో దొర్లే పందికొక్కులు  అని తెలిసిన తిట్లన్నీ తిట్టుకున్నాను. సరిపోలేదు. హల్కా నా కొడుకులు అన్నాను. ఊహూఁ. బోగం దానికి పుట్టినోళ్ళు  అన్నాను. ఊహూఁ, చివరకు నేనే ఓడిపోయి ఊరుకోవలసి వచ్చింది.

చాక్లెట్ కేక్ పరిమళం ఇప్పుడు ఇంటినే కాదు నా లోపల కూడా ఆవరించి, అది, నేను వేర్వేరు అస్సలు కానట్టు అయిపోయింది. నిరాశతో, నిస్సహాయతతో పరిమళం వెదజల్లే కొవ్వొత్తిని వెలిగించి వాసన చూడటానికి ప్రయత్నించాను.

ఒక్కసారిగా ఫోన్ బిగ్గరగా పరిచితమైన స్వరాన్ని పలికింది. నాకైతే ఎవరో తలపై రాయి ఎత్తి వేసినట్లే అయింది. చూస్తే అలారం, అంటే సమయం ఉదయం ఆరు గంటలు, రోజూ నేను జాగింగ్ వెళ్ళే సమయం.

మూసిన తెరల నుండి కాంతి కిరణాలు నెమ్మదిగా లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. అలారం శబ్దానికి కీ ఇచ్చినట్లు లేచి కేక్ మీద ఒక కన్నేసి రన్నింగ్ షూస్ ధరించి, షర్టు మీద ఒక హూడీ ధరించాను. అయినా కాలు ఐలాండ్ నుండి కదలడానికి ఒప్పుకోలేదు.

ముట్టుకుంటే ఎక్కడ చేతికి-ఒంటికి అంటుకొని ఈ కేక్ నా ప్రయత్నం లేకుండానే నా లోపలికి చొచ్చుకుపోతుందో అని భయమేసింది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోయినా జాగింగ్ ముగించుకుని వచ్చినప్పుడు ఇది ఇలాగే ఇక్కడే ఉంటుందని బాధేసింది. పక్కనే అప్పుడే నేనే వెలిగించిన సెంటెడ్ క్యాండిల్ మండుతోంది. కేక్‌ను, కొవ్వొత్తిని నా కళ్ళు మునిగిపోతున్న వ్యక్తిని గట్టు మీద నిలబడి చూస్తున్నట్లు నిశితంగా చూసాయి.

తర్వాత ఏం జరిగిందో ఎలా చెప్పను? నెమ్మదిగా నా కాళ్ళు గ్యాస్ వైపు కదిలాయి. వేళ్ళు మెల్లగా గ్యాస్ ఆన్ చేసాయి. అంతటా సున్నితంగా గ్యాస్ వాసన వ్యాపించసాగింది. మళ్ళీ గ్యాస్‌ను, కేక్‌ను, క్యాండిల్‌ను నా కళ్ళు ఏకాగ్రతతో చూసాయి. నిపుణుడైన కళాకారుడు రాత్రంతా తల పగలగొట్టుకుని, చివరకు ఒక్క గీత గీసి పెయింటింగ్ పూర్తయిందని సంతృప్తి చెందినట్లు నా పెదవుల చివర చాలా చిన్న నవ్వు మెరిసింది.

హెడ్ ఫోన్‌లలో హెవీ మెటాలికా పెట్టుకొని, తలుపు లాక్ చేసి రోడ్డుపైకి దిగాను. పరుగెత్తడం మొదలుపెట్టి ఎంతసేపయిందో. ఒక్కసారిగా నా ముక్కు గాలిలోని ఏదో వాసనను పట్టుకొని నన్ను ఆపివేసింది. ఆగగానే, ఇన్నేళ్ళు అదెక్కడ దాక్కొని ఉందో, దూరంలో ఒక బేకరీ ఉన్నట్లు చాక్లెట్ కేక్ నిగనిగలాడే ఘమఘమలాడే వాసన మెల్లగా నా ముక్కును తాకింది.

కోడిహళ్లి మురళీ మోహన్

రచయిత, సాహిత్యాభిమాని, అనువాదకుడు, సంపాదకుడు వికీపీడియన్. తెలుగు కన్నడ భాషలలో అనువాదాలు చేస్తున్నారు. కథాజగత్, సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం, జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు, రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులంకథ, క్రీడాకథ, రామకథాసుధ, పదచదరాలు, స్వాతంత్ర్యభారతికి అమృతోత్సవ హారతి అనే పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రముఖ హేతువాది, విద్యావేత్త డా.హెచ్.నరసింహయ్య ఆత్మకథను పోరాటపథం పేరుతో తెలుగు ప్రజలకు పరిచయం చేశారు.

Previous Post

జోర్డాన్ కథ : నాకు తెలియని మృతదేహం

Next Post

జపాన్ కథ : నేను కన్న కల – 3

Next Post
జపాన్ కథ : నేను కన్న కల – 3

జపాన్ కథ : నేను కన్న కల - 3

Discussion about this post

ఈ సంచికలో…

  • కన్నడ కథ: బేలా
  • ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు
  • కన్నడ కథ: ఐదు రూపాయల రుణం
  • రైదాస్
  • మహిళల మధ్య
  • తమిళ కథ : చెడ్డ కుమారుని కథ
  • నేను నిన్ను ప్రేమిస్తున్నాను !
  • గుజరాతీ కథ : వైట్ హార్స్
  • తొలి ప్రేమ
  • కన్నడ కవిత : నవ్వు
  • 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • కన్నడ కథ: ఆ ఒక విధంగా …
  • రష్యన్ కథ : మాస్క్
  • తమిళ కథ : పుష్పించని చెట్టు
  • యుగోస్లేవియా కథ : కాప్టెన్
  • అనువాద కవిత : నూతన సంవత్సర ఉదయం
  • ఆంగ్ల కథ : టెలిఫోన్ కాల్ 
  • కన్నడ కథ :  అంతర్వాహిని

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com