తమిళ మూలం : ఎస్.కె.పి.కరుణా
అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ
మా బడిలో ప్రవేశించటానికి మొత్తం ముప్పైఏడు దారులున్నాయి. అందులో హెడ్మాస్టరుకు తెలిసిన అధికార పూర్వకమైన దారులు మూడే. కనకరాజ్, సాలమన్ వంటి బడిలోని ప్యూన్‌లకు తెలిసింది ఎనిమిది. మిగిలిన ఇరవై ఆరు దారులు మాలాంటి విద్యార్థులకు మాత్రమే తెలుసు. ఒక్కొక్క దొంగ దారీ తెలిసిపోయిప్పుడల్లా ఇంకో రహస్య దారి తెరవబడుతూ ఉండేది. మా నగరం నడిబొడ్డున బ్రహ్మాండంగా నెలకొని ఉన్న మా బడికీ, అందులో చదివే విద్యార్థులకూ మధ్య ఆంతరంగికమైన స్నేహం అది.
రోజూ ఉదయం సరిగ్గా 8.50 కి బడి ప్రధాన గేటును లాగి మూస్తున్నప్పుడు, ఎలా కాదన్నా బడి బయట యాభైమంది విద్యార్థులైనా ప్రేయర్ వరుసలో లేక దొరికిపోవటం కద్దు. కొన్ని సమయాలలో ఆ సంఖ్య తగ్గుతుంది. లేదూ అధికమవుతుంది. ఎలా ఉన్నప్పటికీ, కచ్చితంగా నేనూ, ఇళంగో ఎప్పుడూ అందులో ఉంటాం.
ఆ సుదీర్ఘమైన ప్రేయర్ మీటింగ్ ముగిసి, వరసల్లో విద్యార్థినీ విద్యార్థులందరూ వాళ్లవాళ్ల తరగతులకు వెళ్లాకే ఆ స్వర్గ ద్వారం తెరవబడుతుంది. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు తలలు దించుకుని నడిపించుకుంటూ తీసుకెళ్లి హెడ్మాస్టరు గది ముందు బలిపశువుల్లా నిలబెడతారు. శిక్ష అమలు పరిచేందుకు అంటూ అక్కడ ప్రత్యేకమైన శిక్షణ పొందిన కొందరు ఉపాధ్యాయులు ఎదురుచూస్తుంటారు. వెదురుకర్ర దెబ్బలు, ఎండలో మోకాళ్లమీద నిలబడటం, గ్రౌండు చుట్టూ పరుగెత్తటం అంటూ… వాళ్ల మానసిక స్థితికి తగ్గట్టుగా అవ్వాల్టికైన శిక్షలు నిర్ణయింపబడతాయి.
తొమ్మిదవ తరగతికి రాగానే, ఇలాంటి శిక్షలన్నీ మా ఆత్మాభిమానానికి సవాలు విసురుతున్నట్టుగా మారిపోయాయి. అందులోనూ ఒకసారి భరించలేకుండా ఇళంగో, ‘‘సార్! కొట్టాలనుకుంటే, వేరుగా తీసుకెళ్లి కొట్టండి. అమ్మాయిల ముందు కొట్టే పనులన్నీ పెట్టుకోకండి!’’ అంటూ రెచ్చిపోయి పి.ఇ.టి. తో అనేసరికి, దండనలోని తీవ్రతా, ఆత్మాభిమానపు కొలతలూ వేగంగా అధికమై పొయ్యాయి. అధికార వర్గంలో మాకు వ్యతిరేకమైన పరిస్థితీ, ఎప్పుడు ఎక్కడ చూసినా హి…హి… అంటూ కిసుక్కున నవ్వే కొందరు అమ్మాయిలూ కలిసి, దీనికి తగ్గ ఒక తీర్మానం గురించి మమ్మల్ని వేగంగా ఆలోచింపజేసింది.
ఆ సాయంత్రం, లక్ష్మి టీ కొట్లో వడలు తింటున్నప్పుడు, ‘‘మనమేరా ఇలా ప్రతిరోజూ దెబ్బలు తింటున్నాం. పెద్ద పిల్లలందరూ వేరే వేరే దార్లో లోపలికి వెళ్లిపోయారు.’’ అన్న నిర్ఘాంతపోయే విషయాన్ని చెప్పాడు ఇళంగో.
‘‘ఎలా రా కుదురుతుంది? అన్ని గేట్లలోనూ కనకరాజూ, సాలమనూ నిలబడతారు కదా?’’ అన్నాను.
‘‘అవన్నీ మనలాగా గేటు నుండి వెళ్లే వాళ్లకే! మిగిలినవాళ్లకంతా స్కూలు చుట్టూరా గేట్లే.’’ అన్నాడు.
వందేండ్లకు ముందు మా చిన్న నగరంలో అధికశాతం పిల్లలకు విద్య లేకపోవటాన్ని చూసిన డెన్మార్క్ దేశస్థులు, ఇక్కడికొచ్చి ప్రారంభించిన బడి అది. చుట్టూరా కాంపౌండ్ గోడతో, విశాలమైన మైదానంలో నిర్మించబడిన మా బడి చుట్టూరా తర్వాతి రోజుల్లో మా నగరం తన వీధులను కౌగిలించుకున్నట్టుగా పెరిగింది.
మరుసటి ఆదివారం, నేనూ ఇళంగో మా బడికున్న రహస్య దారులను కనిపెట్టే సాహస పయనం మొదలుపెట్టాం. అప్పటివరకూ బడికి లోపలివైపు నుండే ఆ కోటలాంటి ఎత్తైన కాంపౌండు గోడను చూశాను. ఇప్పుడు, దాని పైన్నుండి చూస్తున్నప్పుడే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రవేశాలు బడిలో కెళ్లటానికి ఉన్నాయని నాకు తెలిసొచ్చింది. ఇదే విహంగ వీక్షణం లా ఉంది. త్యాగి అణ్నామలై నగర్ పక్క నుండి, ఆర్.డి.ఓ కార్యాలయం లోపల నుండి, జిల్లా కోర్టు ప్రాంగణం లోపల నుండి, లక్ష్మీనగర్ పక్క నుండి, గాంధీనగర్ పక్కన నుండి, కార్ఖానావీథి నుండి అంటూ… లెక్కపెట్టే కొద్దీ కొత్తకొత్త దారులు కనిపిస్తూనే ఉన్నాయి.
‘‘ఇంతకాలమూ, ఇన్ని దారులుండటం తెలియకుండా ఉండిపోయామే అని సిగ్గుగా ఉందిరా.’’ అన్నాను ఇళంగో తో.
‘‘పోనీలేరా! స్కూల్ కాంపౌండ్‌లోనే ఉన్న మన హెడ్మాస్టరుకే ఇదంతా తెలియకుండా ఉంది. మనం వేరే ఏరియా వాళ్లం కదా.’’ అని సమాధానమిచ్చాడు.
‘‘మచ్చాన్!(బామ్మర్దీ) ఇకమీదట సమస్య ఉండదురా! ఇందులో ఏదో ఒక దాంట్లో దూరి లోపలికెళ్లిపోవటమే!’’
‘‘రేయ్, ఇది ఆయా ఏరియా పిలకాయలు కనిపెట్టి ఉంచుకున్న దారులు. అందులోకి వాళ్లు తప్ప ఇంకెవరినీ అనుమతించరు. మనకు కావాలంటే, మనమే వేరేగా ఒక దారిని కనిపెట్టాలి.’’ అని ఒక కొత్త రూల్‌ను చెప్పాడు. మాకంటూ ఒక దారిని వెతుకుతూ కార్ఖానా వీధిలో నుండి మళ్లీ మా కాంపౌండ్ గోడ చుట్టూ ప్రయాణం మొదలైంది.
కార్ఖానా వీధికి సరిగ్గా మధ్యలో, ఒక చిన్న వీధి ఉండటాన్నీ, దాని పేరు ‘ఆరుముగనార్ వీధి’ అన్న విషయాన్నీ, నేను ఆ బడిలో చదవటం మొదలుపెట్టిన ఈ నాలుగేళ్ల తర్వాత అవ్వాళే తెలుసుకున్నాను. ఆ వీధిలోని ఒక ఇంటి వెనక వైపున్న మిద్దె బాల్కనీలో నుండి ‘‘ఏమిట్రా చేస్తున్నారు?’’ అన్న ఒక గొంతు విని వెనక్కు తిరిగి చూశాం. అప్పుడు, మేము సరిగ్గా ఆ ఇంటికీ, మా బడికీ మధ్యనున్న ఆ సన్నని ప్రదేశంలో నిలబడి ఉన్నాం.
అరే, కస్తూరి అక్క! మా ఇంటి పక్కన ఉండి, తర్వాత పెళ్లై ఈ వీధిలోని ఒక మిద్దింటికి కాపురానికి వచ్చింది. చాలారోజుల తర్వాత నన్ను చూడటంతో ఆమెకు చాలా సంతోషం కలిగింది. ‘‘ఇంట్లోకి రారా!’’ అని ఆహ్వానించగానే, పెద్ద శ్రమలేకుండా ఒక చిన్న గెంతుతో ఆమె ఇంట్లోకి వెళ్లిపోయాం. అతిరసాలు, మురుకులూ తింటూ మా పథకాన్ని వివరించాం.
‘‘రేయ్! మీరెంత ఆలస్యంగా వచ్చినా, నేరుగా ఇక్కడికొచ్చేయ్యండి. మీ బావ సైకిల్ పెట్టిన చోటే, మీ సైకిళ్లను పెట్టి, ఇలాగే మా ఇంటి దారి గుండా స్కూల్ లోపలికి వెళ్లిపోండి.’’ అంది. ఆహా, మాపైన ఎంత ప్రేమ!
మరుసటిరోజు సోమవారం! ప్రేయర్‌కన్నా ముందుగానే బడికొచ్చేశాం. అయినా నేరుగా కస్తూరి అక్క ఉంటున్న వీధికెళ్లి, సైకిళ్లను అక్కడే పెట్టి ఆమె ఇంట్లోకెళ్లాం. పెరట్లోకెళ్లి అక్కడున్న బట్టలుతికే రాతి మీద కాలు పెట్టి ఎక్కుతున్నప్పుడు, ఆ ఇంటి మిద్దెవైపుకు చూశాను. అక్కడొక బాల్కనీ ఉంది. ఇళంగోతో కలిసి మిద్దెమీదికెళ్లి బాల్కనీ నుండి చూస్తున్నప్పుడు నాకొక విషయం అర్థమైంది. నేను నిలబడున్నది మా తరగతి గదికి నేరుగా పైనున్న ఒక పెద్ద గదిలోని ఇనుపచువ్వలు లేని కిటికీకి పక్కన అని! కస్తూరక్క ఇంటి బాల్కనీ నుండి, ఒకచిన్న గెంతుతో బడి భవనాల్లోని ఒక మిద్దె గదిలోకి వెళ్లొచ్చు ఆ గది తలుపును తెరిచి అక్కడున్న మెట్లమీదుగా కిందికి దిగొచ్చాం. నమ్మితే నమ్మండి. మేము నేరుగా వచ్చి చేరింది, ప్రేయర్‌కు వరుసలో నిలబడున్న మా తరగతి వరుస యొక్క చివరి స్థానానికి. నాకు ఆనందంలో కళ్లు చెమర్చాయి. వరుసలో ముందు నిలబడున్న మా తరగతి లీడర్ వెనక్కు తిరిగి మమ్మల్ని చూశాడు. ఇళంగో తన వేలిని చూపిస్తూ, ‘‘తంతాను! తిరుగురా అటువైపుకు!’’ అన్న మొరటు సైగతో, వాడు అలాగే ముందుకు తిరుక్కున్నాడు.
తర్వాత కొన్ని నెలలు మేము దాదాపు స్వర్గంలో ఉన్నాం. ఇంట్లో నుండి తొందరగా బయలుదేరి బడికి వచ్చినా, మేము నేరుగా వెళ్లేది కస్తూరక్క వాళ్లింటికే! అక్కడ భద్రంగా సైకిల్ పార్కింగ్! తర్వాత కడుపు నిండుగా కుండనీళ్లు తాగి, ఆ ఇంటి మేడమీద నుండి మా ప్రత్యేకమైన దారి గుండా లోపలికి దూరి కిందికి దిగి ప్రేయర్‌లోకి ప్రవేశించటంతో, అక్కడ విల్సన్ కనకరాజ్ సార్, తన గంభీరమైన కంఠంతో… ‘యేసు ప్రభువా! నా రక్షకుడా! మా హృదయంలో నిండినవాడా, స్తుతి, ప్రార్థన!’ అంటూ పాడుతుంటాడు. నిజంగానే యేసు ప్రభువు వచ్చేటట్టుంటే కూడా మాతోపాటు ఆ దారిలోనే వస్తారు. అంతటి అందమైన దారి అది!
ఎంతో రహస్యంగా, మా ఇద్దరికీ మాత్రమే ఉన్న ఆ దారిని, ఇళంగో మూడవ వ్యక్తిగా ఒకడికి బార్లా తెరిచినప్పుడే ఈ కథ మొదలయ్యింది. అలవాటు ప్రకారం ప్రేయర్ మొదలై గేటు మూసెయ్యటం జరిగింది. కస్తూరక్క వీధికి వెళ్లే దారిలో మా బడికేసి బయలుదేరాం. అప్పుడు ఇళంగో, ఆ సంవత్సరం కొత్తగా మా తరగతిలో చేరిన, తమ వీధి స్నేహితుడొకడు, గేటుకు బయట నిలబడి ఉండటం చూశాడు. ‘నేనుండగా భయమెందుకు?’ అన్నట్టుగా అతడినీ ‘‘రారా నాతో!’’ అంటూ తనతో పాటు పిలుచుకొచ్చాడు.
ఆ రోజు మాకు ఇంకొక పరీక్షా ఎదురైంది. కస్తూరక్క ఇంటి మిద్దెపైనుండి దూకినప్పుడే గమనించాం. ఆ కిటికీ ఒక పెద్ద అట్టతో మూయబడి ఉంది. అయితే, చెయ్య పెట్టగానే విరిగిపోయి కింద పడిపోయేలా ఉన్న కాట్‌బోర్డ్ అది. దాన్ని చేత్తో తోసేసి లోపలికెళ్లి చూస్తే, ఆ గదిలో సగానికి పైగా పేపర్ బండిళ్లు కనిపించాయి. అలవాటుకు భిన్నంగా ఆ గది బయటవైపూ తాళం వెయ్యబడిరది. ఏం చెయ్యాలో తెలియక, కాసేపు అక్కడే కూర్చొని, తర్వాత వచ్చిన దారినే బయటికొచ్చి, నేరుగా మీనాక్షి థియేటర్‌కు మార్నింగ్ షో సినిమాకు వెళ్లిపోయాం.
తర్వాత కొన్నాళ్లకు ఆ గది తాళం తెరిచేంతవరకూ నేరు దారిలోనే బడికి వెళ్లసాగాం. ఆ మరుసటి వారంలో బడిలో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంది. మా తరగతికి నేరుగా ఉన్న హెడ్మాస్టరు గదిలో, ఎప్పుడూ ఏదో ఒక విచారణ జరుగుతూ ఉండటం చూడగలుగుతున్నాం. అప్పుడు ప్యూన్ కనకరాజ్‌ను విషయమేమిటని అడిగాను. ‘‘పదవ తరగతి కామన్ పరీక్షల ప్రశ్నపత్రాలు దొంగతనం జరిగిందట!’’ అన్నాడు.
‘‘ఎక్కడ దాచారంటన్నా?’’ అన్నాను. అతను నా తలకు పైనున్న మా రహస్య గదిని చూపించాడు. దొంగతనమూ, అక్రమ సంబంధమూ ఒంటరిగా చెయ్యాలి. తోడును పెట్టుకోకూడదన్న సామెతను ఆ వయసులో నేను వినలేదు. మేము ఒకే ఒకసారి తోడును తెచ్చుకున్నందుకు, వెంటనే ఫలితం కనిపించింది. కచ్చితంగా ఆ పిల్లవాడే తీసుండాలని ఇళంగోతో చెప్పాను.
‘‘వాడిని పట్టిస్తే మనమూ దొరికిపోతాం. మేటర్ చాలా పెద్దది. నోరు మూసుకుని ఉండు.’’ అని చెప్పేశాడు. రహస్యాలు కాళ్లూని నడవలేవు. మారుగా చెవులలోకి దూరి నోటి ద్వారా నడిచి వెళ్తున్నాయి. ప్రశ్నపత్రాలను పట్టుకెళ్లిన మా తరగతి పిల్లవాడి దగ్గరనుండి, అతని అన్న తీసుకెళ్లి, తన పదవ తరగతి ప్రేయసికి ఇచ్చినట్టున్నాడు. ఆమె ఆ సంతోషాన్ని తనతో చదివే స్నేహితురాలితో పంచుకోగా, ఆమె తన ప్రియుడికి చెప్పగా, ఆ ప్రియుడు మా బడిలోని ఒక ఉపాధ్యాయుడికి కొడుకుగా ఉన్నాడు. సమస్య ఒక చిక్కుముడి రూపంలో బడి హెడ్మాస్టరు దగ్గరకు వెళ్లి చేరింది. ఆయన, దాని ఏదో ఒక కొసను కనుగొని లాగటం మొదలుపెట్టేసరికి, అది నేరుగా మా తరగతి గదిని చేరుకుంది.
‘‘ఈ తొమ్మిదవ తరగతి ఎ సెక్షన్‌కు చెందిన ఎవరో ఒక విద్యార్థి మూలంగానే, పదవ తరగతి కామన్ పరీక్షలకంటూ ప్రభుత్వం పంపిన కొన్ని ప్రశ్నపత్రాలు దొంగిలించబడి, బయటికెళ్లాయి. దొంగిలించింది ఎవరో కనిపెట్టి, అన్ని ప్రశ్నపత్రాలను వెనక్కి తీసుకోకపోతే, జిల్లా విద్యాశాఖాధికారి ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళతాడు. తర్వాత, మన బడికున్న మంచిపేరు చెడిపోయి, హెడ్మాస్టరు పై చర్యలు కూడా తీసుకుంటారు. కాబట్టి, మీలో ఎవరు ఆ పనిని చేశారో మర్యాదగా చెప్పెయ్యండి.’’ అని దాదాపు బడిలోని ఉపాధ్యాయులందరూ మా తరగతి గదికొచ్చి మమ్మల్ని బెదిరించారు.
అది 1984 వ సంత్సరం. ఇప్పటిలాగా ఇన్ని టెలివిజన్ ఛానల్స్, వార్తా మాధ్యమాలు లేని కాలం! కనుకనే, ముఖ్యమైన విషయమైనప్పటికీ కూడా, అనవసరమైన సంచలనాలు లేక నిదానంగా విచారించటానికి వీలైంది. మా హెడ్మాస్టరు అరుళ్‌దాస్ సారే, ఆ సంవత్సరం మాకు ఇంగ్లీషు టీచరు కూడా. కొంచెం పొట్టిగా, లావుగా ఉండి, తెల్లని ప్యాంటూ, తెల్లని చొక్కా, నల్లటి బెల్టూ ధరించి బడిలో గంభీరంగా నడిచి వస్తున్నప్పుడు, విద్యార్థులెవరూ ఆయనను చూసి భయపడేవాళ్లం కాము. మా బడిలో, విద్యార్థుల భుజాలపై చెయ్యి వేసి మాట్లాడుకుంటూ వెళ్లే ప్రియమైన మనిషాయన.
గట్టి విచారణ మధ్య, అప్పుడప్పుడూ మాకు ఒకట్రెండు తరగతులూ జరగసాగాయి.
ఒకరోజు, పోలీసు జీపొకటి వచ్చి హెచ్చెమ్ గదిముందు ఆగి ఉండటాన్ని చూశాం. నాకు చెమటలు పట్టేశాయి. ఇళంగో, అతని స్నేహితుడి దగ్గరికెళ్లి, ‘‘రేయ్, నువ్వు తీసుంటే చెప్పేయ్! విషయం తలకు మించిపోయింది.’’ అని మళ్లీ అభ్యర్థించాడు.
వాడు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. ఈమధ్య, వాడు ఎవరితోనూ ఏమీ మాట్లాడటం లేదు. తీసింది వాడే అనటంలో నాకు ఏ అనుమానమూ లేకపోవటంతో, నేను వాడితో మాట్లాడటం మానేశాను. ఆరోజు మధ్యాహ్నం ‘బైబిల్ తరగతి’కి అలవాటుగా వచ్చే మా తరగతి టీచరుకు బదులుగా మా హెడ్మాస్టరు అరుళ్‌దాస్ సార్ వచ్చారు. అందరూ లేచి నిలబడ్డాం. మమ్మల్ని కూర్చోమని సైగచేశారు. ఎన్నో రోజుల తర్వాత అప్పుడే ఆయన మా తరగతికొచ్చారు.
అప్పుడు కనకరాజ్ ఒక పొడవైన వెదురుకర్రను తీసుకొచ్చి బల్లపైన పెట్టేసరికి, తన చూపుల ద్వారా దాన్ని వెనక్కు తీసుకెళ్లమని చెప్పారు. ఎప్పుడూ నున్నగా షేవ్ చేసుకుని ఉండే ఆయన ముఖంలో పలుచని వెంట్రుకలు మొలుచుకొచ్చాయ. కళ్లు ఎర్రబడి, నీరసించిపోయి, ఓడిపోయిన రాజు హావభావాలతో వచ్చి కూర్చున్నారు. నిజానికి, నాకు ఆయన్ను చూస్తుంటే ఎంతో బాధగా అనిపించింది.
బల్లమీద పెట్టి ఉన్న బైబిల్‌ను తీసుకున్నారు. మధ్యలో ఒక పేజీని తెరిచి చూసి, దాన్ని మళ్లీ బల్లమీదే పెట్టి, తలెత్తి మమ్మల్ని చూశారు. మౌనంతో తరగతి గదంతా స్తంభించింది.
‘‘బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో నేను మీకొక కథ చెప్పాలనుకుంటున్నాను. దేవుని కుమారుడైన యేసు ప్రభువు చెప్పిన కథ అది. తరతరాలుగా ఆయన వంశస్థులు ఆ కథను తమ కుమారులకు చెప్పినట్టుగా, నా తండ్రి నాకు చెప్పారు. నా పిల్లలుగా మీకు దాన్ని చెప్పబోతున్నాను.’’ అని ఆ కథను మొదలుపెట్టారు.
‘‘ఒక ధనవంతుడికి ఇద్దరు కొడుకులుండేవారు. అందులో చిన్నవాడు తాను స్వేచ్ఛగా జీవించాలని భావించి, ఆస్తిలోని తన భాగాన్ని వేరుచేసి ఇవ్వమని, తండ్రిని బలవంతం చేశాడు. ఆ తండ్రీ ఆ విధంగానే అతని భాగాన్ని వేరుచేసి ఇవ్వగానే, దాన్ని తీసుకుని వేరే దేశానికి వెళ్లి అక్కడ విలాస ఖేళీలలో పాల్గొంటూ, ఆస్తినంతా పోగొట్టుకుని నిర్గతిగా మారుతాడు.
తన ఆకలికి తిండి కూడా లేని స్థితిలో, ఒక పందుల కొట్టంలో కూలివాడుగా చేరుతాడు. అక్కడ, పందులకు ఆహారంగా పెట్టే తవుడును తీసి తింటున్నప్పుడు, యజమానికి తెలిసిపోయి కఠినంగా శిక్షింపబడతాడు. అప్పుడతనికి అనిపిస్తుంది, తన తండ్రి దగ్గర పనిచేసే పనివాళ్లు కూడా ఇంతకన్నా మంచి ఆహారాన్ని తింటున్నప్పుడు, మనమిలా నాశనమైపోయి పడున్నామే అని వెంటనే, అక్కణ్ణించి బయలుదేరి తన తండ్రి దగ్గరికే వెళ్లి చేరుతాడు.’’
బిడ్డలారా, ఇక్కడ గమనించండి. ‘చెడిపోయి తిరిగొచ్చిన కొడుకును అతని తండ్రి అసహ్యించు కోలేదు. దానికి భిన్నంగా, అతనిని ఆహ్వానించి ఇంటికి వెంటబెట్టుకుని వెళ్తాడు. పనివాళ్లను పిలిచి, అతని వేళ్లకు ఉంగరాలూ, కాళ్లకు చెప్పులూ తొడగమని చెబుతాడు. ఉన్నంతలోనే బాగా బలిసిన పందిని చంపి విందును ఏర్పాటు చెయ్యమని చెబుతాడు. ఆయన పెద్ద కుమారుడు ఆయన చేష్ఠలను చూసి నిర్ఘాంతపోయి నిలబడప్పుడు అతనిని సమాధానపరిచేందుకు అతనితో, ‘‘నాయనా, నువ్వు ఎప్పుడూ నాతో ఉన్నావు. నాకు సంబంధించినదంతా నీదే. అయితే, నీ తమ్ముడు చనిపోయాడు. మళ్లీ ప్రాణం పోసుకున్నాడు.’’ అని అతనికి తెలియజేశాడు.
‘‘బిడ్డలారా, ఆ తండ్రిలాగానే నేనూ ఉన్నాను. ప్రభువు చెప్పినట్టుగా, ఎప్పుడంతా ఒకడు నేరు దారిలో నుండి తప్పుకుని వెళ్తాడో, అప్పుడంతా అతను మరణిస్తాడు. మళ్లీ సరిదిద్దుకుని, మంచి దార్లోకి వస్తే, ప్రభువు ముందు అతనినే హత్తుకుని ఆహ్వానిస్తారట. మీలో ఎవరో ఒక విద్యార్థి, ఒక చిన్న పొరబాటు చేసినందువల్ల, అతనిని నేనెప్పటికీ అసహ్యించుకోను. మారుగా, నా భావన ఎప్పుడూ అతనిని మంచి దార్లోకి తెచ్చేందుకే ఆలోచిస్తుంటుంది. అతనికి తెలియకుండా చేసిన పొరబాటుకు, ఎప్పటికీ అతనిని నేను దండిరచను. అతను ఎప్పటికైనా మనసు మార్చుకుని మంచి దార్లోకి వస్తే అంతే చాలు నాకు.’’
అలా, బైబిల్లోని చెడ్డ కుమారుని కథను మాకు చెప్పి, ఆయన ప్రశాంతంగా తల వంచుకుని మాకోసం జపించటం మొదలుపెట్టారు.
తరగతంతా ఘనీభవించినట్టయింది. నా శరీరం వణకసాగింది. మమ్మల్ని ఎవరినీ ఆయన తలపైకెత్తి చూడకుండా, తల వంచుకునే తరగతి గదిని వదిలి వెళ్లిపోయారు. ఆయన, వెళ్లిపోయిన చాలాసేపటి తర్వాత మా అందరి కళ్లూ, ఆయన నిలబడున్న చోటునే చూస్తూ ఉండిపోయాయి. ఆయన చెప్పి వెళ్లిన వేగంలో మాటలు మంత్రంలా ఈ చోటును నింపి ఆగిపోయాయి. ఆ పీరియడ్ పూర్తి కావటానికి ఇంకా మిగిలిన కొంత సమయమూ నాకొక యుగంగా తోచింది.
ఇప్పుడు ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు. ఇళంగో దగ్గరికెళ్లి ఏదో చెప్పి, వేగంగా బయటికెళ్లాడు. ఇళంగో అతని వెనకే వెళ్లేసరికి, నేనూ లేచి బయటికొచ్చాను. వాడు నేరుగా హెడ్మాస్టరు గదిలోకి వెళ్లటం చూశాము. ఇళంగో నా పక్కకొచ్చి, ‘‘హెచ్చెమ్ చెప్పినదాంతో కదిలిపోయాడు. వాడే తీశాడని అంగీకరించటానికి వెళ్లాడు. దిగులుపడకు. మన గురించి ఏమీ చెప్పనని నాకు సత్యం చేసే వెళ్లాడు.’’ అన్నాడు. వాడు మమ్మల్నీ కలిపి నేరం చేశామని చెప్పేస్తే కూడా పర్వాలేదని అప్పుడు నాకనిపించింది. ఆ సాయంత్రం, బడి పూర్తయ్యి అందరూ వెళ్లిపోయారు. జిలా విద్యాశాఖాధికారి హెడ్మాస్టరు గదిలో విచారణను కొనసాగిస్తున్నారు. నేనూ, ఇళంగో కిటికీ పక్కన నిలబడి లోపలికి చూడసాగాం. ముఖ్యమైన ఉపాధ్యాయులు, ఇప్పుడు ఏ ఆదుర్దా లేకుండా, అటుఇటు నడుస్తున్నారు. మేము నిలబడున్న చోటు నుండి, జరుగుతున్నదంతా స్పష్టంగా వినటానికీ, చూడటానికీ వీలైంది.
తల వంచుకున్నట్టుగా తన విచారణా నివేదికను రాస్తున్న డి.ఇ.ఓ. తలపైకెత్తి వాడిని చూస్తూ, ‘‘తమ్ముడూ, నువ్వు మొత్తం ఎన్ని ప్రశ్నపత్రాలను తీసుకెళ్లావు?’’ అని అడిగాడు. వాడేదో గొణిగాడు.
‘‘బాగా, భయపడకుండా గట్టిగా చెప్పవయ్యా? ఎన్ని?’’ అన్నారు.
వీడు గట్టిగా ‘‘మూడు’’ అన్నాడు. ఆ సమాధానంతో ఆ గదంతా అదిరిపడింది.
డి.ఇ.ఓ. తన కాగితాలను అటుఇటు తిప్పి చూస్తూ, మళ్లీ వాడిని అడిగారు, ‘‘ఎన్ని తీసున్నప్పటికీ శిక్ష ఒకటే. భయపడకుండా, నిజాన్ని చెబితే, నీకు శిక్ష తక్కువగా పడేటట్టు నేను చూస్తాను.’’ అన్నారు.
వాడు మళ్లీ, ‘‘మూడే సార్ తీసుకెళ్లాను. ఆ మూడే ఇదిగో హెచ్చెమ్ సార్ టేబుల్లో ఉంది.’’ అన్నాడు. ఎవరో ఒక ఉపాధ్యాయుడు వాడిని కొట్టటానికి దూసుకెళ్లాడు. ఆ పిల్లవాడు, హెచ్చెమ్ పక్కకెళ్లి దాక్కునేసరికి, అరుపులు ఇంకా ఎక్కువయ్యాయి.
‘‘అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి.’’ అన్న డి.ఇ.ఓ. తన సహాయకుడితో, ‘‘మొత్తం ఎన్ని ప్రశ్న పత్రాలు కనిపించకుండా పోయాయి.’’ అని అడిగారు. అందుకతను, ‘‘పదమూడు’’ అన్నాడు.
నేనూ, ఇళంగో అలాగే నిశ్చేష్టులమైపోయాం. వాడు కాస్త గట్టిగా, ‘‘సార్, మా అమ్మ మీద సత్యంగా నేను మూడే తీసుకెళ్లాను.’’ అన్నాడు.
హెడ్మాస్టరు ఎదురుగా ఉన్న శిలువకు వేలాడుతున్న యేసు ప్రభువునే చూస్తూ, ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు.
డి.ఇ.ఓ. తన విచారణను కొనసాగించారు. ‘‘సరే, నువ్వు ఆ కట్టను ఎలా విప్పదీశావు? అందుకు కత్తో, బ్లేడో అవసరమవుతుందిగా?’’ అని అడిగారు.
వాడు ప్రశాంతంగా చెప్పాడు: ‘‘సార్, ఆ కట్ట అప్పటికే విప్పదీసి ఉంది. బయటికి కనిపించిన మూడు పేపర్లను మాత్రం నేను తీసుకుని నా సంచిలో పెట్టుకున్నాను.’’ అన్నాడు. వాణ్ణి ఎవరూ నమ్మలేదు. మళ్లీ మళ్లీ ప్రశ్నలూ, బెదిరింపులూ, అప్పుడప్పుడు దెబ్బలూ పడుతూనే ఉన్నాయి.
నేనిప్పుడు వాడిని పూర్తిగా నమ్మాను. నాకూ బాగా గుర్తుంది. నేనూ చూశాను. ఆ పేపర్ బండిళ్లలో ఒకటి మేము చూసేసరికే విప్పదీసి ఉంది. ఇళంగోకు గుసగుసగా చెప్పాను. వాడూ దాన్ని చూశాడు. మా ఇద్దరిలో ఒక్కడైనా, వాడికోసం సాక్ష్యం చెప్పటానికి వెళ్తామేమో అన్నట్టు యేసు ప్రభువు గోడమీద నుండి మమ్మల్నే చూస్తున్నట్టుగా అనిపించింది. మేమిద్దరమూ, అప్పుడు కూడా నోరు మూసుకుని మౌనంగానే ఉన్నాం.
అయోమయం ఎక్కువైన స్థితిలో, మాట్లాడే గొంతులు తారాస్థాయిలో వినిపించటం మొదలయ్యాయి. ప్రత్యేకించి ఒక ఉపాధ్యాయుడు మాత్రం ఎంతో ఆదుర్దాతో వాణ్ణి మళ్లీ మళ్లీ కొడుతున్నాడు.
ఎవరూ ఊహించని ఒక తరుణంలో, ‘‘సైలెన్స్’’ అన్నట్టుగా హెడ్మాస్టరు తన సీట్లో నుండి లేచారు. ‘‘నేను ఈ పిల్లవాణ్ణి నమ్ముతున్నాను. వీడు మూడే తీశాడు. డి.ఇ.ఓ. సార్! మీరు నామీద శాఖాపరమైన ఏ చర్య అయినా తీసుకోవచ్చు. జరిగిన పొరబాటుకు నేను పూర్తి బాధ్యతను తీసుకుంటున్నాను.’’ అంటూ, తన విద్యార్థిని దగ్గరికి పిలిచి, వాడి భుజాన్ని గట్టిగా పట్టుకుని దగ్గరికి తీసుకున్నారు.
అక్కడున్న ఇద్దరికీ, వాళ్ల ముందు జరుగుతున్న దృశ్యాన్ని నమ్మలేకపోతున్నారు. మనసు మార్చుకుని వచ్చిన కుమారుణ్ణి, అతని తండ్రి ఎదురేగి వెళ్లి కౌగిలించుకుని తడుముతున్న దృశ్యం అది. అందులో, రెండువేల ఏళ్ల కాలం నాటి సత్యం కలిసిపోయి ఉంది.
జరిగినదాన్ని చూసిన డి.ఇ.ఓ. కూడా కరిగిపోయారు. ఆయన లేచి తన కాగితాలన్నింటినీ బొత్తుగా పెట్టుకుని హెడ్మాస్టరుతో, ‘‘సార్, జరిగింది జరిగిపోయింది. దీన్ని ఇలాగే వదిలిపెట్టేద్దాం. నేను కొత్త బ్యాచ్ ప్రశ్నపత్రాలను పంపిస్తాను. ఇకపై, దాన్ని మీ గదిలోనే పెట్టుకుని కాపాడండి.’’ అంటూ ఆ పెద్ద నేరాన్ని, లాఘవంగా ముగించారు. అందరూ ఏదేదో మాట్లాడుకుంటూ బయటికెళ్లిపోయారు.
వాడు బయటికొచ్చే వరకూ, నేనూ ఇళంగో గది వాకిట్లోనే ఎదురుచూడసాగాం. రాత్రి బాగా పొద్దు పోయింది. చాలాసేపటి తర్వాత హెడ్మాస్టరు తన గదిని వదిలి బయటికొచ్చారు. ఆయన క్యారియర్ సంచులను తీసుకుని ప్యూనూ వెంట నడిచాడు. వెనకనే, చేతులు కట్టుకుని వాడూ వచ్చాడు. కొంచెం దూరం నడిచి వెళ్లిన హెడ్మాస్టరు, ఆగి వెనకొస్తున్న వాడిని దగ్గరికి పిలిచారు. వెక్కిళ్లు పెడుతూ, వాడు ఆయన దగ్గరికెళ్లాడు.
వాడి భుజమ్మీద చెయ్యి వేసి, తన ప్యూన్‌ను దగ్గరికి పిలిచి, ‘‘కనకరాజ్, రేపటి నుండి గేటుకు బయట నిలబడే విద్యార్థుల్ని నా గదికి తీసుకురావద్దు. తగిన కారణాలుంటే, వాళ్లను నేరుగా తరగతులకు వెళ్లనివ్వు. విద్యార్థులు నెలకు కొన్నిసార్లు మాత్రం బడికి ఆలస్యంగా రావటానికి అనుమతి ఉంది. దీన్ని అలాగే సంపత్ దగ్గర చెప్పి ఒక సర్క్యులర్ తయారుచేసి పంపించమను.’’ అన్నారు.
మా బడి శతాబ్దానికి పైగా పాతబడిన ఎర్రని భవనం ముందు నిలబడి, ఒక రాత్రి సమయంలో మా హెడ్మాస్టర్ ఇచ్చిన ఆ ఒక్క ఉత్తర్వు, అప్పటివరకూ పనిచేసిన, మా బడి చుట్టూరా ఉన్న అన్ని అనధికార ద్వారాలూ ఆ క్షణం మొదలు శాశ్వతంగా మూతబడ్డాయి.

1961 మే 1 న తిరుత్తణిలో జన్మించారు. ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎంఏ చేశారు. 1983 రచనలు చేస్తున్న ఆయన 161కి పైగా కథలూ, 123 పైగా కవితలూ రాశారు. ఏడు కథాసంపుటాలు, ఒక కవిత్వ సంపుటి, ఒక నవల వెలువరించారు. వీరి సాహిత్య కృషికి పలు పురస్కారాలు లభించాయి. తమిళం నుంచి తెలుగులోకి అనువాదాలు చేస్తుంటారు. తమిళం నుండి 130 కి పైగా కథలు, 11 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం అనువదించారు. అనువాదంలో చేసిన కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు మరిన్ని అవార్డులు లభించాయి.




Discussion about this post