మూలం: రస్కిన్ బాండ్
తెలుగుసేత: పంతుల కల్యాణి
అరుణ్ ని కలుసుకునే నాటికి నేనింకా దొంగనే. వయసు పదిహేనేళ్లే ఐనా అప్పటికే హస్తలాఘవంలో చెప్పుకోదగిన అనుభవమే ఉంది.
మల్లయోధుల ప్రదర్శనను చూస్తున్నాడు అరుణ్. మెల్లగా అతడి వద్దకు వెళ్లాను. మనిషికి ఇరవై యేళ్లు ఉంటాయేమో! సన్నగా, పొడవుగా ఉన్నాడు. దయగా, అమాయకంగా, నేను తలపెట్టిన ‘పని’కి అనువైన వాడిగానే కనబడ్డాడు. అప్పటికి కొంతకాలం క్రితంవరకూ చాలామందితో నాకు అదృష్టం కలసిరాలేదు. కాని ఆ యువకుణ్ణి బుట్టలో వేసుకోవడానికి పెద్దగా కష్టపడనక్కరలేదనిపించింది. అతడు పహిల్వానులను అబ్బురంగా పరిశీలిస్తున్నాడు. నిండుగా నూనె పట్టించుకున్న దృడకాయులిద్దరు మెత్తటి మట్టిలో జారిపోతూ లేస్తూ వగరుస్తూ తొడలు చరుచుకుంటున్నారు. అతడిని సంభాషణలోకి దింపినపుడు నేను అపరిచితుణ్ణన్న సంగతి అరుణ్ గమనించనేలేదు.
‘‘మీరే ఒక మల్లుడిలా ఉన్నారు.’’ అన్నాను.
‘‘నువ్వూనూ’’ వెంటనే అతడు అనేసరికి ఒక క్షణం కంగారు పడ్డాను. పీలగా ఉండే పిల్లవాణ్ణి నేనెు! ఒంట్లో ఎముకలన్నీ పొడుచుకొచ్చి కనబడతాయి మరి!
‘‘ఔను.’’ అన్నాను. ‘‘అప్పుడప్పుడూ కుస్తీ పడుతుంటాను.’’
‘‘నీ పేరేమిటి?’’
‘‘దీపక్.’’ …. అబద్ధం.
‘దీపక్’ నా ఐదో నామధేయం. అంతకుముందు రణబీర్, సుధీర్, త్రిలోక్, సురీందర్.
ఈ ప్రాధమిక సంభాషణ తరువాత, జరుగుతున్న పోటీకే తన వ్యాఖ్యానాలను పరిమితం చేశాడు అరుణ్. మాట్లాడడానికి నాకు మరో అవకాశం దొరకలేదు. కాసేపటికి ప్రేక్షకుల గుంపు నుండి బయటకు వచ్చాడు. నేనూ వెనుకనే నడిచాను.
‘‘ఓయ్, మంచి హుషారులో ఉన్నట్లున్నావే!’’ అన్నాడు.
అభ్యర్థన పూర్వకంగా చిన్న నవ్వు నవ్వాను. అది నా సమ్మోహనాస్త్రం. ‘‘మీ దగ్గర పని చేద్దామని ఉంది.’’
అతడు నడక ఆపలేదు. ‘‘నేను ఎవరినైనా పనిలో పెట్టుకుంటానని ఎందుకు అనుకున్నావు?’’
‘‘అబ్బే, ఏంలేదు. రోజంతా మంచి యజమాని కోసం తిరుగుతూనే ఉన్నాను. మిమ్మల్ని చూశాక మరెవరూ తగిన వారు కాదనిపించింది.’’
‘‘నన్ను పొగిడేస్తున్నావు.’’
‘‘కాదు. నిజమే చెప్పాను.’’
‘‘నువ్వేమనుకున్నా నేను పనేమీ ఇవ్వలేను.’’
‘‘ఏం?’’
‘‘డబ్బులు ఇచ్చుకోలేను కదా!’’
లిప్తపాటు ఆలోచించాను. ఇతడిని ఎంచుకోవడంలో పొరబడ్డానా?
‘‘నాకు తిండి పెట్టగలరా పోనీ?’’
‘‘నీకు వంట చేతనౌనా?’’ –ప్రతిగాప్రశ్న.
‘‘ఆ! చేతనౌను.’’ మరో అబద్ధం మళ్లీ.
‘‘నువ్వు వండగలిగితే, నేను నీకు భోజనం పెట్టగలను.’’
తన గదికి తీసుకువెళ్లి, వరండాలో పడుకోవడానికి చోటు చూపించాడు. కానీ ఆ రాత్రికే మళ్లీ వీధిన పడినంత పనైంది. నా వంట పరమచెత్తగా ఉండి ఉండాలి; ఎందుకంటే దాన్నంతా అతడు పక్క వాళ్ల పిల్లికి పడేశాడు; నన్ను పొమ్మనీ చెప్పేశాడు. నేను పోలేదు. అక్కడే తారట్లాడుతూ ఉండిపోయాను. నా ప్రార్థనా పూర్వక మందహాసాన్ని– నా సమ్మోహనాస్త్రాన్న– మళ్లీ మళ్లీ ప్రయోగిస్తూనే ఉన్నాను. అతడికీ నవ్వు వచ్చేసింది. మంచం మీద కూలబడి కొంచెంసేపు నవ్వాక, నా తల మీద మృదువుగా తట్టి, ‘‘సరేలే, రేపు పొద్దున నీకు వంట నేర్పుతా.’’ అన్నాడు.
వంట మాత్రమే కాదు; నాకు అక్షరాలు కూడా నేర్పాడు అరుణ్. తన పేరూ నా పేరూ రాయడం వచ్చేసింది నాకు. పూర్తి వాక్యాలు ఎలా రాయాలో, కాగితం మీద డబ్బు లెక్కలు ఎలాగ వేయాలో కూడా నేర్పిస్తానన్నాడు, జేబుల్లో సొమ్ములు లేకపోయినా!
అక్కడ పని చేయడమూ ఆనందమే. పొద్దున ‘టీ’ కాచేశాక, బజారుకి బయలుదేరేవాణ్ణి. రోజువారీ ఖర్చులో ఒక పావలా మిగుల్చుకునేవాణ్ణి. బియ్యం ఖరీదు పౌనుకి యాభయ్యారు పైసలైతే, యాభైకే తెచ్చేవాణ్ణి. ఆపాటి లాభాన్ని నేను వేసుకుంటున్నట్లు తెలిసినా, అతడు పట్టించుకునేవాడు కాదు. ‘రోజుకింత’ అని నాకు జీతమేమీ ఇవ్వడం లేదుగా!
రాత నేర్పుతున్న అరుణ్‌కి నేను కృతజ్ఞుడినే. చదువొచ్చిన వాడిలా రాయడం నేర్చుకుంటే నా ఎదుగుదలకి హద్దే ఉండదు. నిజాయితీగా మారడానికి విద్య ఒక ప్రేరణ కూడా కావచ్చు.
అతడి సంపాదన ఒక క్రమ పద్ధతిలో ఉండేది కాదు. ఒక వారం అప్పుపెడితే, మరో వారం తనే అప్పు ఇస్తూండేవాడు. తరువాతి ‘చెక్’ ఎప్పుడు వస్తుందని ఎదురు చూడడం, రాగానే బయటికి వెళ్లి ఘరానాగా ఖర్చు పెట్టేయడం.
ఒక సాయంత్రం వేళ, కొన్ని నోట్లు కట్టగా పట్టుకురావడం చూశాను. రాత్రి వాటిని పక్క తలాపిదిక్కున పరుపు కింద దాచడమూ గమనించాను.
పదిహేను రోజులుగా పని చేస్తున్నా, సరుకుల కొనుగోలు ద్వారా తప్ప అతని నుండి నేను పోగేసుకున్నదేమీ లేదు. అలా చేసే అవకాశం మాత్రం బోలెడంత. అతడు బయటికి వెళ్లినప్పుడల్లా ఆ గదిలో వెతకడానికి వీలుగా తాళంచెవి నా దగ్గరే ఉండేది. నా మీద అంత నమ్మకం ఉంచిన మనిషిని మోసగించడానికి మనసొప్పలేదు అన్నాళ్లూ.
లోభిని దోచెయ్యడం సులభమే; వాడు దోపిడీకి అర్హుడు కాబట్టి. ధనవంతుడిని దోచెయ్యడమూ సులువే; వాడు నష్టాన్ని తట్టుకోగలడు కనుక. కాని డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వని అల్ప ఆదాయపరుడిని దోచడంలో ఇబ్బంది ఉంది; దోచబడినా అతడు తన నష్టాన్ని లెక్కచేయడు! పిసినారి కాని, సంపన్నుడు కాని, జాగ్రత్త పరుడు కాని, తన డబ్బుని తలగడ కిందనో పరుపు అడుగునో దాచడు. రక్షతి ప్రదేశంలో దాన్ని భద్రపరుస్తాడు. అరుణ్‌కి తెలియకుండా అతని కష్టార్జితాన్ని కొట్టేయడం నాకు ఆట అంత తేలిక– భౌతికంగా.
ఇక అసలైనప ‘పని’కి సమయం వచ్చింది. ఈ మధ్య అలవాటు పోగొట్టుకున్నాను. ఇప్పుడు కానీ నేను ఆ డబ్బుని తీయకపోతే, అతడు దాన్ని స్నేహితుల మీద వృథా చేసేస్తాడు… నాకు జీతమైనా ఇవ్వడు….
అరుణ్ మంచి నిద్రలో ఉన్నాడు. వరండా నుండి వెన్నెల అతడి పక్కమీద పడుతోంది. నేను లేచి నేలమీద కూర్చున్నాను. దుప్పటిని ఒంటి నిండా కప్పుకున్నాను. పరిస్థితిని సరగ్గా అంచనా వేసుకుని పథకం ప్రకారం వెళ్లాలి. బొత్తిలో బోలెడు డబ్బు. అది తీసుకుంటే ఈ ఊరు వదిలేయాలి. పదిన్నర ఎక్స్‌ప్రెస్‌లో అమృతసర్ పారిపోవాలి.
చటుక్కున దుప్పటి జార్చేశాను. వంగి పాకుతూ ద్వారం దాటి పడకదాకా చేరాను. అరుణ్‌ని పరిశీలించాను. ప్రశాంతంగా క్రమబద్ధంగా ఊపిరి తీసుకుంటున్నాడు. ముఖంలో స్వచ్ఛత. ఏ గీతలూ లేవు. నా ముఖం మీద మాత్రం ఎన్నెన్నో గుర్తులు. ఎక్కువగా మచ్చలు.
నా చేతికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఏర్పడిపోయింది. దానంతట అదే చకచకా పరుపుకిందికి చేరిపోయింది. వేళ్లు నోట్లని వెతికేశాయి. వాటిని వెంటనే కనుక్కున్నాయి. వడిగా సడ లేకుండా ఒదుపుగా కట్టని బయటికి లాగేశాయి.
నా చెయ్యి పరుపు మీద ఉండగానే నిద్రలో నిట్టూర్చాడు అరుణ్. నా వైపుగా పక్కకి తిరిగాడు. అతడి జుట్టు నా వేళ్లకి తగిలింది.
భయం వేసింది నాకు. త్వరత్వరగా నిశ్శబ్దంగా పాక్కుంటూ గది నుండి వచ్చేశాను.
వరండా వదిలి వీధిలోకి వచ్చాక పరుగు మొదలుపెట్టాను. బజారునుండి స్టేషన్ దాకా ఒకటే పరుగు. దుకాణాలన్నీ మూసి ఉన్నాయి. ఏవో కొన్ని లైట్లు పైకిటికీల్లో వెలుగుతున్నాయి. నడుము దగ్గర పైజామా మడతలో నోట్లు. రైలుకి ఆలస్యమౌతుందన్న అనుమానం ఉన్నా, ొక్క మాటాు ఆగి డబ్బు ఎంత ఉందో చూసుకోవాలనిపించింది. క్లాక్ టవర్లో సమయం పదీ ఇరవై. వేగం తగ్గించి గబుక్కున నోట్లు పైకి లాగాను. ఐదులుగా ఓ వంద రూపాయలున్నాయి. మంచి లాభమే; ఒకటి రెండు నెలలు రాజాలా గడిపేయచ్చు.
స్టేషన్‌లో టికెట్ కొనడానికి ఆగలేదు నేను. (అసలెప్పుడూ నేనది కొననేలేదు జీవితంలో). ప్లాట్‌ఫామ్ మీదికి దూపుకువెళ్లాను. అమృతసర్ ఎక్స్‌ప్రెస్ అపుడే కదులుతోంది. కాని ఎక్కేయడానికి ఎందుకో సందేహించాను. ఏదో అత్యవసరమైన, అవగాహనకందని శంక.
ఆ తటపటాయింపు క్షణాల్లోనే రైలు వెళ్లిపోయింది– నేను లేకుండానే.
అది సాగిపోగానే ప్లాట్‌ఫామ్ మీద గోలా గందరగోళం ఆగిపోయింది. నిర్జనంగా మారిన ఆ చోట నేను ఒంటరిగా మిగిలిపోయాను. వంద విలువైన దొంగ సొమ్ము నా రొంటినే ఉన్నదన్న ఎరుక వలన నా ఏకాకితనం మరీ ఎక్కువైపోయింది. ఆ రాత్రి ఎక్కడ ఉండాలో పాలుపోలేదు. నేనెప్పుడూ మిత్రులను చేర్చుకోలేదు– చేసే పనులను వాళ్లు పాడు చేసేస్తారేమోనని. ఇప్పుడు హోటలుకి వెళ్తే నా నేరం బట్టబయలైపోతుందని బెరుకు. టౌన్‌లో నాకు తెలిసిన మనిషి ఒక్కడే. నేను దోచేసిన వ్యక్తి!
స్టేషన్ వదిలి బజారు బాట పట్టాను. చీకటి నిండిన ఖాళీ సందులలో అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి. అరుణ్‌ని గూర్చిన ఆలోచనలు ఆగకుండా కమ్ముకుంటున్నాయి. తన డబ్బు దొంగిలించబడిందని తెలియని అతడు ఆనందంగా నిద్రిస్తూనే ఉంటాడు.
విలువైన వస్తువులు పోయినప్పుడు మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో నేను ఎరుగుదును. పిసినిగొట్టు తెగ కంగారు పడిపోతాడు. ధనికుడు కోపంతో రగిలిపోతాడు. పేదవాడు భయపడతాడు. కాని నా దొంగతనాన్ని కనుగొన్నప్పుడు అరుణ్ ముఖంలో కలవరంకాని, కోపంకాని, భీతికాని, కనబడదని నాకు తెలుస. ఒక పెను విచారం మాత్రమే ఉంటుంది. ఆ విషాదం– తను ధనం నష్టపోయినందుకు కాదు; తన నమ్మకానికి నేను ద్రోహం చేసినందుకు.
బజారు దాటి మైదానం దాకా వచ్చేశానని గ్రహించాను. బెంచీమీద బాసంపట్టు వేసుకుని కూర్చున్నాను. రాత్రి చలిగానే ఉంది. అరుణ్ ఇచ్చిన దుప్పటిని వదిలేసి వచ్చినందుకు చింత పడ్డాను. పడుతున్న తుంపర నా అసౌకర్యాన్ని పెంచింది. తొందరలోనే చిరుజల్లు జడివానగా మారిపోయింది. నా షర్టు, పైజామా, ఒంటికి అతుక్కుపోయాయి. రొజ్జుగాలి ముఖానికి కొరడాలా తాకింది. బెంచీ మీద నిద్రపోవడం నాకు అలవాటైనదే అనుకున్నానంతవరకూ. కాని అరుణ్ నివాసంలో వరండాలో పడక నన్ను సుకుమారుణ్ణి చేసేసింది!
వెనక్కి నడిచి బజారు చేరి, ఒక మూసిన షాపు మెట్ల మీద కూర్చున్నాను. దిమ్మరులు కొందరు నా పక్కనే పల్చని దుప్పట్లలో ముడుచుకుని పడుకున్నారు. గడియారం అర్ధరాత్రిని సూచించింది. నడుము తడిమితే నోట్లు తగిలాయి. కాని వాన నీటిలో నానిపోవడంతో వాటి రెపరెపలు సమసిపోయాయి.
అరుణ్ డబ్బు సినిమాకి వెళ్లమని పొద్దునే నాకో రూపాయి ఇచ్చేవాడేమో. కాని ఇఫ్పుడు అంతా నా దగ్గరే ఉంది. ఇంక అతడికోసం వంట చేయడం, బజారుకి పరుగులెత్తడం, వాక్యాలను నేర్చుకోవడం, ఉండవు. పూర్తి వాక్యాలు రాయడం…
పూర్తి వాక్యాలు… నా వద్ద వంద రూపాయలున్నాయన్న ఉత్సాహంలో చదువు విషయమే మరచిపోయాను. చదవనూ రాయనూ నేర్చుకుంటే అవి ఏదో ఒకనాడు నూరు రూకల కన్న ఎక్కువే తేగలవు… దొంగతనం సులభం. (పట్టుబడిపోవడమూ సులభమే). కాని నిజమైన పెద్దమనిషికి లభించే మన్నన– అదే కదా విజయం! విద్య నా జీవితానికి విలువను ఇస్తుంది. నేను బాగుపడాలి, వెంటనే అరుణ్ దగ్గరకు వెళ్లాలి. పూర్తి వాక్యాలు రాయడం నేర్చుకోవాలి.
బహుశా అరుణ్ పై ఉన్న అభిమానం కూడా నన్ను వెనెక్కి మళ్లించిందేమో. నా బలహీనతల్లో సానుభూతి కూడా ఒకటి. దొంగతనాల్లో సందేహానికి తావు ఇచ్చిన సమయాల్లోనే నేను దొరికిపోయేవాణ్ణి. జాలిపడని చోరుడే దొంగతనంలో పనితనం చూపగలడు. అరుణ్ పట్ల నాకు ఏర్పడిన ప్రేమ, అతడి అభిప్రాయాలతో కలిగిన ఏకీభావం, అంతకన్న ఎక్కువగా సంపూర్ణ వాక్యాలు రాయడం నేర్చుకోవాలన్న తపన– నన్ను మళ్లీ అతడి రూముకి లాక్కెళ్లాయి.
ఆదుర్దాగా ఉంది. ఎవరి వస్తువులనైనా వారికి తెలియకుండా తీయడం కన్నా వారు గమనించకుండా తిరిగి పెట్టేయడం కష్టం. అరుణ్ పడక మీదనో పరుపు కిందనో నా చేతిని పెట్టినప్పుడు అక్కడ డబ్బు కనబడితే దానికి ఒకటే వివరణ– నేను దొంగతనం చేస్తున్నట్లు. నోట్లు మళ్లీ పెట్టేస్తుండగా అతడు లేస్తే ఇక నా ఆశా, కథా ముగిసినట్లే.
ఆందోళనగా తలుపుతీసి ద్వారం వద్దనే నిలబడ్డాను కొంతసేపు. వెన్నెలలేదు, మబ్బు కమ్మేసింది. క్రమంగా కళ్లు గదిలోని చీకటిని అలవరచుకున్నాయి. అరుణ్ నిద్రపోతూనే ఉన్నాడు. ముందులాగే పాక్కుంటూ సవ్వడి లేకుండా పక్క తలాపి దిక్కుకు చేరుకున్నాను. నోట్లతో ఉన్న చేతిని కదిల్చినప్పుడు అతడి ఊపిరి నా వేళ్లను తాకింది. లయబద్ధమైన శ్వాస, ప్రశాంతమైన ముఖం. ఎందుకో ఒక క్షణం చేష్టలుడిగి ఉండిపోయాను. అటు తరువాత నా చెయ్యి పరుపుకింద శోధించింది; చివరను చేరుకుంది; స్వంతదారు ఉంచిన స్థానానికే డబ్బు దాంతరను చేర్చేసింది.
మర్నాడు ఆలస్యంగా నిద్ర లేచాను. అప్పటికే ‘టీ’ తయారు చేసేశాడు అరుణ్. పగటి కటువు వెలుగులో అతడి ఎదుట పడడానికి సంకోచం. తన చేతిని నావైపు చాపాడు. ఐదు రూపాయలున్నాయి వెళ్ల మధ్య. నా గుండె క్రుంగి పోయింది.
‘‘నిన్న కొంతడబ్బు వచ్చింది. ఇక నుండీ నీకు జీతం ఇవ్వగలను.’’ అన్నాడు. క్రుంగిన మనసు పొంగింది మళ్లీ. తప్పు దిద్దుకున్నందుకు నన్ను నేనే అభినందించుకున్నాను.
అరుణ్‌కి అంతా తెలిసిందని నోటును అందుకుటున్నప్పుడు నాకు తెలిసింది. రాత్రి కురిసిన వర్షానికి అది ఇంకా తడిగానే ఉంది.
‘‘ఇవాళ కొత్త పాఠాన్ని మొదలుపెడతాను’’ అన్నాడు.
అతడికి తెలుసు. ఐనా తెలుసునన్న విషయం అతడి పెదవులు చెప్పలేదు. కళ్లూ తెలియజేయలేదు.
నేను మళ్లీ చిరునవ్వు నవ్వాను.. సమ్మోహితుడినై– అప్రయత్నంగా.
![]()

పంతుల కల్యాణి
ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టా అందుకున్నారు. విద్యార్థి దశలో ఆమెకు ఆకాశవాణితోను, వివిధ యువ సాహితీ సంస్థలతోనూ, విశేషమైన సాన్నిహిత్యం లభించింది. విశాఖపట్నంలో సుమారు మూడున్నర దశాబ్దాలు కళాశాల అధ్యాపకురాలిగా పనిచేశారు. విఖ్యాత కంప్యూటర్ విషయజ్ఞుడు సుబ్రతో బాగ్చి రచించిన Go Kiss the World ని ‘ప్రపంచాన్ని ప్రేమించు’ పేరుతోను, Zen Garnden ని ‘ధ్యానవనం’ గానూ తెలుగులో అనుసృజన చేశారు. మరి రెండు అనువాద గ్రంథాలు కూడా ప్రచురితాలు.




Discussion about this post