రష్యన్ మూల రచయిత : మక్సీమ్ గోర్కీ
తెలుగు అనువాదం : కేశవ్ గోపాల్
ఇటలీలోని రోమ్, జెనోవా నగరాల మధ్య ఒక చిన్న స్టేషన్‌లో రైలు కండక్టర్ మా బోగీ తలుపు తెరిచాడు. ఒక కన్నులేని పొట్టి వృద్ధుణ్ణి మురికిగా వున్న ఆయిలర్ సహాయంతో లోపలికి తీసుకొచ్చాడు.
‘‘చాలా ముసలాయన!’’- బోగీలోని అందరూ ఒక్కసారిగా అన్నారు స్నేహపూర్వకంగా నవ్వుతూ.
కానీ ఆ వృద్ధుడు చాలా హుషారుగా కనిపించాడు. తనకు సహాయం చేసిన వారికి ముడతలు పడ్డ చేయి వూపుతూ ధన్యవాదాలు చెప్పాడు. నెరిసిన తలమీదినుంచి చిరిగిపోయిన టోపీని మర్యాదగా, ఉల్లాసంగా పైకెత్తి సీట్లవైపు నిశితంగా చూస్తూ:
‘‘కూచోవచ్చా?’’ అని అడిగాడు.
ప్రయాణీకులు కొద్దిగా సర్దుకుని అతనికి సీటిచ్చారు. తేలికపడ్డట్టు నిట్టూరుస్తూ అతడు మోకాళ్ల మీద చేతులు వేసి కూచున్నాడు. పెదాలు విచ్చుకున్నాయి. బోసినోటితో ఆప్యాయంగా నవ్వాడు.
‘‘దూరప్రయాణమా తాతగారూ?’’ అని ఒక తోటి ప్రయాణీకుడు అడిగాడు.
‘‘అబ్బే.. లేదు. ఇక్కణ్ణించీ మూడు స్టేషన్లే! నా మనవడి పెళ్ళికి వెళ్తున్నా…’’ అని వృద్ధుడు జవాబిచ్చాడు. వెంటనే.
కొన్ని నిముషాల తర్వాత, రైలు చక్రాలు లయబద్ధమైన శబ్దం చేస్తుండగా, తుఫాను గాలికి విరిగిన చెట్టుకొమ్మలా ఇటూ అటూ వూగుతూ తన కథ చెప్పడం మొదలెట్టాడు.
‘‘నేనొక లిగూరియన్. మాది గట్టి శరీరం. నన్ను చూడండి. నాకు పదముగ్గురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు. మనుమళ్ళు, మనుమరాళ్ళు ఎంతమంది వున్నారో లెక్కపెట్టలేదు. ఇది రెండోవాడి పెళ్ళి. బాగుంది కదా?’’
వాడిపోయినా ఇంకా ఉల్లాసంగా వున్న ఒంటి కంటితో సగర్వంగా మమ్మల్నందర్నీ సగర్వంగా పరికిస్తూ నవ్వాడు.
‘‘నేను దేశానికీ, రాజు గారికీ ఎంతమంది పిల్లల్ని ఇచ్చానో చూడండి!’’
‘‘నా కన్ను ఎలా పోయింది? ఓహ్.. ఇది జరిగి చాలా కాలమైంది. అప్పుడింకా నేను చిన్న పిల్లాడిని. కానీ నేను మా నాన్నకు సాయం చేస్తూ వుండేవాణ్ణి. ఆయన ద్రాక్షతోటలో మట్టి తవ్వుతున్నాడు. మాది గట్టి రాతినేల. చచ్చేంత జాగర్తగా వుండాలి. పికాక్స్ కిందినుంచి ఒక రాయి పైకెగిరి నేరుగా నా కంటికి తగిలింది. నొప్పి పెట్టినట్టు నాకు గుర్తులేదు. కానీ ఆ రోజు రాత్రి నేను భోజనం చేస్తున్నప్పుడు నా కనుగుడ్డు వూడి పడిపోయింది. అది భయంకరం! దాన్ని మళ్ళీ యథాస్థానంలో పెట్టి వుడికించిన బ్రెడ్‌తో పిండికట్టు కట్టారు. కానీ ఫలితం లేదు. కన్నుపోయింది సిన్యోరి!’’
వృద్ధుడు జారిపోయిన తన బుగ్గను గట్టిగా రుద్దుతూ మళ్ళీ మృదువుగా నవ్వాడు.
‘‘ఇప్పుడున్నంత మంది వైద్యులు అప్పట్లో లేరు. ప్రజలు మూర్ఖుల్లాగా బతికేవాళ్ళు. కాకపోతే, బహుశా దయాగుణం కాస్త ఎక్కువగా వుండేది.’’
ఇప్పుడు అతని ఒంటికన్ను, లోతుగా ముడతలు పడిన ముఖం, బూజులాంటి ఆకుపచ్చ- బూడిదరంగు జుత్తుతో హుషారుగా మారింది.
‘‘నాలాగా ఇంతకాలం బతికిన ఒక మనిషి ఇతరుల గురించి తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పొచ్చు- కాదంటారా?’’
అతడు వంకరతిరిగిన వేలిని పైకెత్తి ఎవరినో బెదిరిస్తున్నట్లుగా అన్నాడు.
‘‘సిన్యోరి! మనుషుల గురించి నా మనసులో మాట కొంచెం చెప్తాను..’’
‘‘మా నాన్న చనిపోయినప్పుడు నా వయసు పదమూడేళ్ళు. అప్పుడు నేను ఇప్పటికన్నా హీనస్థితిలో వుండేవాణ్ణి. కానీ చురుకైన వాణ్ణి. కానీ పని విషయానికొస్తే ఎంత కష్టమైన పనైనా ఎంతసేపైనా చేయగలిగేవాణ్ణి. ఈ లక్షణమే నాకు మా నాన్న ద్వారా అబ్బింది. మా అప్పులు తీర్చడానికి మాకున్న రవ్వంత భూమి, ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది. అందువల్ల కేవలం ఒంటికన్నుతో, రెండు చేతుల్తో జీవనం సాగించాను. ఎక్కడ పనిదొరికితే అక్కడల్లా పనిచేస్తూ బతికాను. చాలా కష్టంగా వుండేది. కానీ యవ్వనం కష్టాలకు భయపడదు కదా?’’
‘‘నాకు పందొమ్మిదేళ్లు వయసున్నప్పుడు, నేను ప్రేమించాలని రాసిపెట్టివున్న ఒక అమ్మాయిని కలిశాను. నాలాగే ఆమె కూడా పేదరికంలో వుండేది. నాకన్నా బలిష్టురాలు. జబ్బు పడిన తల్లితో వుండేది. నాలాగే ఏ పని దొరికితే ఆ పనిచేసేది. అంత అందగత్తె ఏమీ కాదు. కానీ దయాశీలి. తెలివైనది. తీయటి కంఠస్వరం. ఎంత చక్కగా పాడేదో- అనుభవమున్న గాయకురాలిలాగా! అలాంటి స్వరమే ఒక సంపద. నేను కూడా బాగానే పాడేవాణ్ణి.
‘‘మనం పెళ్ళి చేసుకుందాం’’ అని ఒకరోజు ఆమెతో అన్నాను.
‘‘అంతకన్నా తెలివితక్కువ పని ఏదీ వుండదు ఒంటికన్నోడా’’ అని విచారంగా జవాబిచ్చింది. ‘‘నీ దగ్గర గానీ నా దగ్గర గానీ ఏమీలేదు. ఎలా బతుకుతాం మనం’’ అంది.
‘‘అది పరమసత్యం. మా ఇద్దరిలో ఎవరి దగ్గరా ఏమీ లేదు. కానీ వయసులో వున్న జంటకు ప్రేమకన్నా మించి ఇంకేం కావాలి? ప్రేమించడానికి చాలా ఏమీ అవసరం లేదని నీకు తెలుసు. అని పట్టుబట్టి ఆమెని పెళ్ళికి ఒప్పించగలిగాను.
‘‘అవును. నువ్వు చెప్పేదీ బహుశా నిజం కావచ్చు.’’ అంది ఇడా చివరకు. ‘‘ఇప్పుడు మనం విడివిడిగా వున్నప్పనుడు మేరీమాత మనకు సాయం చేస్తోంది. మనం కలిసివుంటే ఇంకా ఎక్కువ సాయం చేయగలదు!’’
‘‘మేము పూజారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాం’’
‘‘మీకేమైనా పిచ్చి పట్టిందా?’’ అన్నాడాయన. ‘‘అగురియాలో ఇప్పుడున్న బిచ్చగాళ్ళు చాలరా? దయ్యం మిమ్మల్ని ఆడిస్తోంది. మీరు మీ బలహీనతలకు లొంగిపోకూడదు. లేకపోతే ఇందుకు మీరు భారీమూల్యం చెల్లించాల్సి వుంటుంది’’ అన్నాడాయన.
‘‘సమాజంలోని మా తోటి యువత మమ్మల్ని చూసి నవ్వింది. పెద్దలు మమ్మల్ని తప్పుపట్టారు. కానీ ఈడొచ్చిన వాళ్ళది మొండిపట్టుదల. ఒకరకంగా వాళ్ళు తెలివైన వారు కూడా! పెళ్ళిరోజు దగ్గరపడింది. ఆరోజుకు కూడా మేము మునుపటిలాగా పేదవాళ్ళమే. పెళ్ళయిన రాత్రి మేము ఎక్కడ పడుకోవాలో కూడా మాకు తెలీదు.’’
‘‘మనం పొలాల్లోకి వెళ్దాం!’’ అంది ఇడా. ‘‘ఎందుకెళ్ళకూడదు? మనుషులు ఎక్కడున్నా దయచూపుతుంది మేరీమాత’’
‘‘అలా మేము నిర్ణయించుకున్నాం- నేలతల్లి మాకు పడక అవుతుంది. ఆకాశం దుప్పటి అవుతుంది..’’
‘‘సిన్యోరి! ఇక్కడ మరో కథ మొదలౌతుంది. జాగ్రత్తగా వినండి. ఇది నా సుదీర్ఘ జీవితంలో అత్యుత్తమమైన కథ!
‘‘పెళ్ళికి ముందురోజు ఉదయాన్నే వృద్ధుడు జియోవన్నీ (అతని దగ్గర నేను చాలా పనిచేశాను) నాతో అన్నాడు చాలా చిన్న విషయం లాగా..
‘‘హ్యూగో! నువ్వు పాత గొర్రెల కొట్టాన్ని శుభ్రం చేసి గడ్డి పరచాలి. అక్కడ ఎండుగడ్డి వుంది. ఏడాదికి పైగా గొర్రెలు అక్కడ వుండటం లేదు. ఒకవేళ నువ్వూ ఇడా అందులో వుండాలనుకుంటే కొట్టాన్ని శుభ్రం చెయ్!’’
‘‘అంతే మా ఇల్లు తయారైపోయింది!’’
‘‘నేను కూని రాగాలు తీస్తూ గొర్రెల కొట్టాన్ని శుభ్రం చేస్తూండగా తలుపు దగ్గర వడ్రంగి కన్‌స్టాన్‌జియో నిలబడి వుండటం కనిపించింది.
‘‘ఇడాతో నువ్వు వుండబోయేది ఇక్కడేనా? మరి నీ మంచం ఎక్కడ? నువ్వు పని పూర్తి చేసింతర్వాత నా దగ్గరికి రా- వచ్చి మంచం తీసుకెళ్లు, నా దగ్గర ఇంకొకటి వుందిలే’’ అన్నాడు.
‘‘నేను అతని దగ్గరికి వెళ్తూండగా దుకాణం యజమానురాలు కోపంగా అరిచింది.
‘‘సొంతంగా ఒక దుప్పటీ, ఒక దిండూ లేదు. తెలివితక్కువ మనుషులు- పెళ్ళి చేసుకుంటున్నారట! ఓ ఒంటికన్ను చిన్నోడా.. నీకు బుర్రలేదా?.. పెళ్ళికూతుర్ని మా అంగడికి పంపించు..’’
‘‘కీళ్ళవాతంతో, జ్వరంతో చాలాకాలంగా బాధపడుతున్నకుంటి ఎట్టోరెవియానో తన ఇంటి గడపలోంచి ఆమె వైపుకేసి..
‘‘అతిథులకు కావాల్సినంత ద్రాక్షసారా అతని దగ్గర వుందో లేదో కనుక్కో. మనుషులు రవ్వంతైనా ఆలోచన లేకుండా ఎలా బతుకుతారో కదా!’’ అన్నాడు.
లోతుగా ముడతలు పడిన వృద్ధుడికి చెంపమీద ఒక ఆనంద బాష్పం మెరిసింది.. తల వెనక్కు వాల్చి చప్పుడు కాకుండా నవ్వాడు.. గొంతు దగ్గర వదులుగా వున్న చర్మం వణికింది.
‘‘ఓహ్.. సిన్యోరి, సిన్యోరి!’’ నవ్వుతో ఉక్కిరిబిక్కిరి అవుతూ పసిపిల్లాడు ఆనందిస్తున్నట్టుగా చేతులు వూపుతూ అన్నాడు. మా పెళ్ళి రోజు పొద్దున్నే మా ఇంటికి అవసరమైనవన్నీ సమకూరాయి- మేరీమాత విగ్రహం, వంటపాత్రలు, పడకమీదికి దుప్పట్లూ వగైరా, ఫర్నిచర్- సర్వం.. ఒట్టు..’’
ఇడా నవ్వింది, ఏడ్చింది. నేను కూడా. పెళ్ళి రోజు ఏడవడం మంచిది కాదు కాబట్టి మాతోపాటు మా వాళ్ళంతా నవ్వారు.
‘‘సిన్యోరి! తమ వాళ్ళను సొంత మనుషులు అనుకునే హక్కు వుందే బాగుంటుంది. మీ జీవితం ఒక తమాషా కాదని, మీ సంతోషం ఒక జూదం కాదని అనుకునే మనుషులను తమ సొంత బంధువులుగా భావించడం ఇంకా బాగుంటుంది!’’
‘‘ఎంత అద్భుతమైన పెళ్ళి అంది! ఎంత అద్భుతమైన రోజు! తోటివారందరూ మొత్తం ఆ ఉత్సవానికి హాజరయ్యారు. ఉన్నట్టుండి ధనిక భవంతిగా మారిన మా గొర్రెల కొట్టానికి అందరూ వచ్చారు. మా దగ్గర అన్నీ వున్నాయి! ద్రాక్షసారా, పండ్లు, మాంసం, బ్రెడ్డు- అందరూ తిన్నారు. అందరూ ఆనందించారు. ఎందుకంటే సిన్యోరి!- ఒకరికి మంచి చేయడం కంటే మించిన ఆనందం మరొకటి లేదు. నన్ను నమ్మండి- అంతకంటే అందమైనది, మంచిది మరొకటి లేదు!’’
‘‘పూజారి కూడా వచ్చాడు. మంచి ఉపన్యాసం ఇచ్చాడు. ‘ఇక్కడ మీ అందరికోసం పనిచేసిన ఇద్దరు వ్యక్తులున్నారు. వాళ్ళజీవితంలో ఈ రోజును చిరస్మరణీయమైనదిగా మార్చడానికి మీరు చేయాల్సిందంతా చేశారు. కాబట్టి మీరు చేసింది మంచిపని. రాగిడబ్బు, వెండి డబ్బుకంటే ముఖ్యమైనది. పనిచేసినందుకు మీకు దక్కే జీతం కంటే పని ఎప్పుడూ ముఖ్యమైనదే! డబ్బు వస్తుంది, పోతుంది. కాని పని నిలిచివుంటుంది. వీళ్ళు ఉల్లాసంగా నిరాడంబరంగా ఉన్నారు. వీళ్ళ జీవితం కష్టంగా గడిచింది. కానీ వీళ్ళు అందుకు బాధపడలేదు. వీరి కష్టకాలంలో మీరు ఆదుకోవాలి. వీళ్లకు మంచి నైపుణ్యం గల చేతులు, గొప్ప మనసు వున్నాయి.’’
‘‘ఇంకా, నన్ను, ఇడాను, మొత్తం అందర్నీ మెచ్చుకుంటూ ఎన్నో మాటలు చెప్పాడు పూజారి’’
ఆ వృద్ధుడు మళ్లీ యువకుడైపోయినట్లు మమ్మల్నందర్నీ చూపులతో పలకరించాడు.
‘‘సిన్యోరి! మనుషుల గురించి నాకు తెలిసింది కొంచెం చెప్పాను. బాగుంది కదా!’’
![]()
(మక్సీమ్ గోర్కీ రాసిన ఇటలీ కథల్లో ఇదొకటి, 1911లో ప్రచురితం)
కొన్ని వివరణలు :
- ఆయిలర్ : రైలు చక్రాలు, ఇతర భాగాలు సాఫీగా పనిచేసేందుకు వాటికి నూనె పూసే రైల్వే ఉద్యోగి
- లిగూరియన్లు: ఒకప్పుడు పశ్చిమ యూరప్ లోని లిగూరియా ప్రాంతంలో నివసించినవారు.
- సిన్యోరి : ఇటాలియన్ భాషలో గౌరవంగా ‘మహాశయులారా’ అనే సంబోధన.

ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో సీనియర్ రష్యన్ డిప్లొమా చేశారు. 6 ఏళ్లు మాస్కోలో అనువాదంలో శిక్షణ పొంది, ఉద్యోగం చేశారు. జర్మన్ భాషతో కూడా పరిచయం ఉంది.
అభిరుచులు: చిత్రలేఖనం,ఫోటోగ్రఫీ, భాషల అధ్యయనం




Discussion about this post