విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో!
హిందీ కవిత: పుష్యమిత్ర ఉపాధ్యాయ్
తెలుగు అనువాదం: మల్లేశ్వర రావు ఆకుల.
ఇప్పుడు గోవిందుడు రాడు.
గోరింట పూసిన చేతులతో ఆయుధం చేతపట్టు.
నీవే నీ చీరను సంరక్షించుకో!
పాచికలు పరిచి ఉన్నాడు శకుని.
తలలన్నీ అమ్ముడుపోతాయి..
వింటున్నావా ద్రౌపదీ?
ఇంకెంతదాకా ఆశలు పెట్టుకుని ఉంటావు?
అమ్ముడుపోయిన వార్తాపత్రికల నుంచి
ఎలాంటి రక్షణ కోరుకుంటున్నావు?. .
ఈ దుశ్శాసనుల దర్బారు నుండి.
స్వయంగా సిగ్గుతో తలలు ఉంచుకొని ఉన్నారు.
వాళ్లేం రక్షించగలరు నీ మానాన్ని?
ఇక గోవిందుడు రాడు..
నిన్నటి వరకు గుడ్డివాడు మాత్రమే!
రాజు. ఇప్పుడు మూగ చెవిటివాడు కూడా!
ప్రజల నాలుకల కుట్టి వేయబడ్డాయి.
చెవులకు కూడా కాపలా ఉంది.
నువ్వే చెప్పు నీ అశృధార
ఎవరిని, ఏమని వేడుకుంటాయి?
ఆయుధం చేతబట్టు ఇకనైనా,
![]()
విజ్ఞప్తి
హిందీ కవిత: పుష్యమిత్ర ఉపాధ్యాయ్
తెలుగు అనువాదం: మల్లేశ్వరరావు ఆకుల,
(ముఖం మీద యాసిడ్ దాడికి గురైన యువతి వాడితో ఇలా అంది… ఒక అమ్మాయి.. ఒక అబ్బాయి ప్రేమను తిరస్కరించింది. అంతమాత్రానికే అబ్బాయి యాసిడ్ దాడి చేశాడు. గాయపడిన యువతి ఆ అబ్బాయితో ఇలా అంది.. ఆ మాటలను మీరు కూడా ఒకసారి వినండి!)
సరేకానీ దాడి చేశావు, యాసిడ్ తో..
ఇప్పుడు నా తప్పేంటో చెప్పు కాస్త.
నీ అంగీకారానికి నా తిరస్కారం..
ఇంత చిన్న విషయానికి నా ముఖాన్ని
ఇలా తగలబెట్టేసావ్!
తప్పు నాదే అయ్యుండొచ్చు..
నీ ప్రేమెంత పవిత్రమైందో
చూడలేకపోయి ఉండొచ్చు,
ఊహించలేకపోయి ఉండొచ్చు.
తప్పు నాదేనంటే.. నన్ను స్వీకరించగలవా?
నన్ను నీ దాన్ని చేసుకోగలవా?
నా ముఖాన్ని నీ చేతుల్లో లాలించగలవా?
ముఖం మీద లేచిన బొబ్బలతో ఉన్న
నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలవా?
లోతులకు కూరుకుపోయిన ఆ కళ్ళను,
కనురెప్పలు కాలిపోయి మసిబొగ్గైన
నా చెక్కిళ్ళ మీద
నీ వేళ్ళతో స్పృశించగలవా?
ఆ గాయాల నుండి ద్రవాలు కారుతుండగా!
ఏమో నీ ప్రేమ నిజమైనదైతే
అలా చేయగలవేమో!?
ఇంకో మాట కూడా చెప్పు.
ఈ యాసిడ్ ఊసు నీకు ఎలా తెలిసింది?
ఇది నీ బుద్ధిలోకి తనంతట తానుగా చొరబడిందా?
ఈ దాడి తర్వాత.. ఇప్పుడు ఏమనుకుంటున్నావు?
నా ముఖాన్ని ఇలా తగలేసి,
నీవే మాత్రం గౌరవం సంపాదించుకున్నావ్?
ముందుకంటే నీ మగతనానికి మిడిసి పడుతున్నావా?
నాకు తెలుసు..
కాలిపోయింది నా మొఖం మాత్రమే!
ఇంకా ఇంత పెద్ద శరీరం మిగిలే ఉంది.
ఒక సలహా ఇవ్వనా..?
ఆసిడ్ గుంతనొకదాన్ని తయారు చేయి.
తర్వాత అందులోకి నన్ను తోసి
పూర్తిగా నేను కాలి బుగ్గి అయిన తర్వాత
నీ ప్రేమలో నాలో ఇంకా
సత్యమైనదిగా, గాఢమైనదిగా
మారుతుందేమో?
నాదొక ప్రార్థన..
వచ్చే జన్మలో నేను నీకు కూతురుగా పుడితే..
నాకు మళ్ళీ నీలాంటి ప్రేమికుడే ఎదురైతే..
అప్పటికి
నీకు అర్థం అవుతుందేమో!?..
నీవు చేసిన పనికి, నేను నా కుటుంబం
ఎంత దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చిందో?..
నువ్వు నా నిండు జీవితాన్ని
తగలేశావు, నాశనం చేశావు”.
![]()

ఆకాశవాణి విశ్రాంత సంచాలకులుగా 2016 డిసెంబర్ లో రిటైర్ అయ్యారు. 1.1.1977 గుడివాడలో జననం. ఉద్యోగ విరమణ తర్వాత తిరుపతిలో నివాసం. B.com., MCJ, MA. (HINDI), రంగస్థల యోగా విజ్ఞాన్ లో సుశిక్షితులు. 28సం.ఆకాశవాణిలో ఉద్యోగం. అక్షరాలు నా ఆనవాళ్లు, ప్రకృతి నేపథ్యంలో, దృశ్యం విత్తై మొలకెత్తితే- కవితా సంపుటులు, వెన్నెలలో మల్లియలు- నాజీవన యానం. ఇప్పుడు ముద్రణలో చాంద్ ఫిర్ నికలా- 100 హిందీ పాటలకు వ్యాఖ్యానం, ఆయన రచనలు. రంగస్థల విమర్శ- సమీక్షకులు. వాట్సాప్ గ్రూపులో హిందీ అనువాదాలు. కథాయాత్ర పేరుతో కథల ఆడియో, చిత్ర కవితలు, పుస్తక సమీక్షలు, పరిచయాలు వగైరా.




Discussion about this post