తమిళ మూలం: బవా చెల్లదురై
అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ
ఏదో శబ్దం విని, టాయిలెట్ తలుపు దగ్గరున్న వాష్‌బేషిన్ కింద పడిపోయున్న అలమేలును నేనే మొదట తిరిగి చూశాను. కుడి చేతిని నడుము మీద పెట్టుకుని ఏదో గెలుపొందిన ధోరణిలో టి.టి.ఆర్. (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) కృష్ణ నిలబడున్నాడు.
మెల్లగా లేచి, అతణ్ణి తల పైకెత్తి చూడగానే, దానికోసమే ఎదురుచూస్తున్నట్టుగా తన షూ కాలితో ఆమె గుండెమీద గట్టిగా తన్నాడు. శబ్దం బయటికి రాకుండా నేలకు కరుచుకుపోయింది. ఎన్ని దెబ్బలు తిన్నప్పటికీ శబ్దం చెయ్యకూడదని ఇన్నేళ్ల రైలు జీవితం ఆమెకు నేర్పింది.
‘‘ఎవడు మిలిటరీ నుండి ఆకలితో వస్తాడా అని ఎదురుచూస్తున్నావా, లం…’’ అంటూ తెలుగులో గొంతెత్తి తన మాతృభాషను మలినపరిచాడు కృష్ణ.
నాకు కృష్ణ, అలమేలు ఇద్దరూ రెండేళ్లుగా తెలుసు.
‘‘ఈ రైలు మీ నాయన సొత్తా రా, అది మాది కూడా. అది నీకు జీతం ఇస్తుంది, మమ్మల్ని సంపాదించుకోమంటుంది, అంతే!’’ అని టి.టి.ఆర్ మీద గొంతెత్తిన ఆ మహిళను అంతటి ఆదుర్దాలో చూశాను. దెబ్బలు తిని కింద పడిపోయినప్పటికీ… నిస్సందేహంగా ఆమె అందగత్తే!
అందగత్తెలకు ఎప్పుడైనా ఇలా అలమేలు అన్న సంబంధమే లేని పేరునూ పెట్టేలాగుంది.
ప్యాంట్రీ కారులో (రైలు ప్రయాణీకులకు ఆహారమందించే ప్రత్యేకమైన బోగీ) నాతోపాటు పనిచేసే యువకులు ఒక్కొక్కరూ ఆమెకు ఒక పేరు పెట్టారు. నాకు మాత్రమే ఆమె అలమేలు. కాదు, అలమేల్. పలుకుతున్నప్పుడే పెదాల చివరన ఎప్పుడూ నాలో ఒక చిరునవ్వు తొంగిచూసేది.
నాకు సంబంధించినంత వరకూ అది లోలోపల ఉచ్ఛరించగల అందమైన పేరే.
పరుగెత్తుకెళ్లి ఆమెను లేపి నిలబెట్టటానికో, టి.టి.ఆర్‌ను అడ్డుకోవటానికో వీలుకాని నిస్సహాయుడుగా, ఉన్న చోట్లోనే మౌనంగా కూర్చుని వేడుక చూడ్డానికే వీలైంది.
ఒకసారి ఆమె తలతిప్పి నావైపు చూసినట్టుగా అనిపించింది. జీవితంలో ఆ చూపులను ఇంకెప్పటికీ నేను ఎదుర్కోకూడదు.
మధ్యాహ్నపు ఎండను భరిస్తూ రామగుండం నుండి వరంగల్‌కు మితమైన వేగంతో వెళ్తోంది రైలు. తెలుగులో ఆమెకు మాత్రమే వినిపించేటట్టుగా తిడుతున్నాడు కృష్ణ. అంతా బూతు మాటలే. అతని భార్య ఊరికెళ్లింది. ఇవ్వాళ డ్యూటీ ముగించుకుని వెళ్తున్నప్పుడు అలమేలును క్వార్టర్స్‌కు వెంటబెట్టుకెళ్లాలన్న అతని అధికార స్వరం, ప్రారంభంలోనే ఆమెవల్ల నలిపివేయబడిందన్న ఆక్రోశం అతని గొంతులో వినిపిస్తోంది. ‘‘ఒక రేత్రంతా అట్టా మీతోపాటే వొచ్చేందుకు కుదరదు సార్. ఇక్కడే టాయలెట్ రూమ్ ఉండాది. అదీగాక మిగతా వోళ్లు ఏమిస్తారో అంతే నీక్కూడా. నీకోసరమంటూ ఏదీ తగ్గించేందుకు ఈలుకాదు.’’ అన్న మాటల్ని ఆమె నిదానంగానే అన్నప్పటికీ, అతను ఆ సెగను తట్టుకోలేకపోయాడు. అందుకనే ఈ దెబ్బలు, తన్నులూను.
అతని మనసులో, ఒక రోజుకు పద్దెనిమిదిసార్లు అటూ ఇటూ పరుగెత్తే ఈ రైళ్ళకు నేనే యజమానినన్న భావనా, తానే యజమానురాలినన్న ఆలోచనా ఆమెకూ… ఉంది. ఇద్దరి అహంకారాలకు వ్యతిరేకంగా కాసేపటి క్రితం మొదలైన ఈ గొడవ ఆమెను నేలమీదికీ, అతణ్ణి నడుముమీద చెయ్యి పెట్టుకుని ఎదురుగా నిలబడేలాగానూ చేసింది.
ఇప్పుడు కృష్ణ, ఆమె నుండి కాస్త పక్కకు జరిగి మూసి ఉన్న తలుపుకు ఎదురుగా వెళ్లి నిలబడ్డాడు, ఇప్పటిదాకా ఏమీ జరగనట్టుగా.
నాకు తెలుసు ఇంకో పది నిమిషాల్లోనే వరంగల్ స్టేషన్ వచ్చేస్తుందని! అతనక్కడ దిగి, విరక్తితో, నిరాకరణలోని వేదనతో, స్టేషన్‌కు వెనకవైపున వ్యాపించి ఉన్న వేపచెట్టు నీడలో కూర్చుని, ఒక హాఫ్ లాగించి ఊగుతూ, తూగుతూ ఇంటికి చేరుకుంటాడు. ఎవరూ లేని ఆ ఇల్లు అతణ్ణి లోపలికి లాక్కుంటుంది.
ఇవ్వాళ ఒక సెక్స్యువల్ వర్కర్ యొక్క నిరాకరణ, ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నల్లకోటు వేసుకున్న అహకారంపై కారి మూసింది. అదికూడా గ్రహించకుండా ఏదో గెలుపొందిన గొప్పతనంతో మూసి ఉన్న ఆ కంపార్టుమెంట్ తలుపు ముందు స్టేషన్‌ను ఎదురుచూస్తూ నిలబడున్నాడు.
అలమేలు చాలాసార్లు తలపైకెత్తి అతణ్ణి చూసింది. అతనికి వెనకవైపున కళ్లు లేకపోవటం ఎంతటి హాయి ఆమెకు. తనలో ఏదో వెతికి నిర్ణయించుకుంది.
మెల్లమెల్లగా వేగం తగ్గుతూ వరంగల్ స్టేషన్‌లోని మూడవ నెంబర్ ప్లాట్‌ఫామ్ మీదికి రైలు ఆగే ముందు కృష్ణ తలుపు తెరిచి దిగేలోపు ఆమె తేరుకుంది.
నిస్సహాయత యొక్క ఆత్రాన్నంతా, తనలోని బలాన్నంతా కాళ్లల్లోకి తెచ్చుకుని, లేచి, నిదానంగా వెనకవైపు నుండి ఎగిసి అతణ్ణి ఒక్క తన్ను తన్నింది.
ఊహించని ఆ దాడికి తడబడి ప్లాట్‌ఫామ్ మీద తలకిందులుగా పడ్డాడు కృష్ణ. పొరబాటున పడ్డాడని అనుకునే చాలామంది రైల్వే ఉద్యోగులు భావించారు. ఆవేశం ఇంకా తగ్గని దానిలా అలమేలు అతని చేతిలోని రశీదు పుస్తకాన్ని లాక్కొని తన నడుము దగ్గర దోపుకుంది.
‘‘అయ్యో నా బుక్కు… బుక్కు…’’ అని తన బాధనూ మీరి అతను గొణగటాన్ని విని ఆమె లోలోపల సంతోషించింది. తన కళ్లను పైకెత్తి మూడు వైపులా గమనించింది. రైల్వే పోలీసులతో సహా చాలామంది వాళ్లకేసి రావటం ఆమెకు లోలోన ఒక భయాన్ని కలిగించింది.
నడుము దగ్గరున్న ఆ రశీదు పుస్తకాన్ని తీసి అతని ముఖం మీదికి విసిరికొట్టి తెలుగులో ఎంతో హీనమైన ఒక బూతు మాటను అంది. అది అతనికి తాకింది.
‘‘బతికిపోరా కుక్కా!’’ అని మెల్లగా కదులుతున్న రైల్లో ఏదో ఎదురుపడ్డ ఒక మెట్టు మీది కెక్కింది. ముఖంలోనూ, మనసులోనూ దెబ్బలు తగిలిన చోటల్లా నిప్పులా మండింది. ఇది ఆమె వ్యవహరించే ఊరు కాదు. వరంగల్‌తో ముగిసే ఆమె సామ్రాజ్యం ఇవ్వాళ ఎక్కడిదాకా సాగుతుందో సాగనీ!
నొప్పా? మంటా? అని శరీరం అనుమానించటానికి వీలు కాలేదు. అతను తనతో అన్న మాటలు గుర్తుచేసుకున్నప్పుడు ఎదుట నుండి వచ్చిన చల్లని గాలులు ఆమె ముఖానికి తగిలి మనసుకు హాయినిచ్చింది.
అయితే ఆ తర్వాత జరగబోయే క్రూరత్వం లోలోపల ఆమెను అస్థిరపరిచింది. రైలు జీవితం దాదాపు ఇవ్వాల్టితో ముగుస్తుందన్నట్టుగా అనిపించింది. పుట్టినప్పటి నుండి రైలు శబ్దాన్ని వింటూ నిద్రపోవటం, మేల్కోవటం, పడుకోవటం, జీవించటం అన్నీనూ. ఇక ఏ జైలో, లేదూ కంటికి కనిపించని ఊరు బహిష్కరించిన గుడిసెనో? మనసు ఛిన్నాభిన్నమైంది. కళ్ల నుండి నీళ్లు కారసాగింది.
నా కదలికను అనుమానించి కిటికీ పక్కనుండి తన చూపుల్ని నా వైపుకు తిప్పింది అలమేలు.
‘‘బావా…’’
నాకు మాత్రమే వినిపించేలా కీచుమన్న గొంతును నాలోకి స్వీకరించాను.
చాలాసార్లు పెట్టెల్ని కలిపే ఆ చిన్న స్థలంలో ఈ గొంతును ఎన్నో రకాలైన భావాలతో నేను విన్నాను.
గట్టిగా, మృదువుగా, అర్థింపుగా, ప్రేమగా, కామంతో, సణుగుడుతో ఇలా చెప్పుకుంటూ వెళ్లొచ్చు.
ఇప్పుడు విన్నది ఇంతకు మునుపు ఎప్పుడూ విన్నటువంటిది.
ఇది ప్రాధేయతతో కూడిన గొంతు.
‘‘నన్ను నీ భుజాలమీద ఆనించుకో బావా.’’
అన్నట్టున్న ఒక గొంతును అలమేలు నుండి ఇప్పుడే వింటున్నాను. నా ఒళ్లు చల్లబడిపోయింది. నేను మొట్టమొదటిసారిగా ఆమె చేతులను పట్టుకున్నాను. నా మొత్తం ప్రేమనూ అభిమానాన్నీ ఆమె రక్తనాళాల్లోకి ప్రవహింప చేయటానికి వీలవుతుందాని ప్రయత్నించాను. ఆమె నన్ను వెంబడించింది. ఈ తరుణం మాటలు లేనిది. ఇద్దరికీ మాటలు అవసరం లేనిది. మా భాషలలో మేము ఇప్పటిదాకా నేర్చుకున్న అన్ని మాటలూ ఇదిగో ఈ రైలు దడదడమంటూ చేయనున్న శబ్దానికి మారుతున్న ఈ కృష్ణా నదిలో పడిపోయింది.
నిశ్చేష్టులై ఉన్నాం. చేతుల కలయికకూ, ఈ సాన్నిహిత్యానికీ భాష ఎందుకు?
ప్యాంట్రీ కారు పెట్టెలోకి ప్రవేశించినప్పుడు మమ్మల్ని తలెత్తి చూసిన ఆ కొన్ని కళ్లల్లోని ఉత్సాహమూ, అనుమానమూ, పెదాల చివరన మొలిచిన నవ్వులూ నన్ను గమనించేలా చేసింది.
నేను అలమేలును పై బెర్తుమీద పడుకోబెట్టాను. పసిపాపలా తనలో తాను ముడుచుకుంది. కింద పడున్న, మేము కిరాణా వస్తువులు కొనే అట్టపెట్టెల్ని చించి ఆమెను దాచాను. దాదాపు ఆమె కనిపించదని నాకు నేనే తృప్తిపడ్డాను. వీటికంతా నేను మాత్రమే తృప్తి పడగలను.
తోడుగా ఉన్న పిల్లవాళ్లను కొన్ని మాటల ద్వారా హెచ్చరించాను. నా చేత్తో నా నోటిని మూసిపెట్టి వాళ్లను నన్ను గమనించేలా చేశాను. వాళ్లకు పరిస్థితి అర్థమై జాగ్రత్తపడ్డారు. ఇక వాళ్లు ఆమెను చూసుకుంటారు.
ఏమీ జరగనట్టుగా ప్రయాణికుల పెట్టె కేసి నడిచాను.
ఇవ్వాళ నాకు అలవాటైన రైలు ప్రయాణం కాదు. అందరినీ అనుమానించే విధంగానూ, అందరూ ఎవరినో వెతుకుతూ తిరుగుతున్నట్టుగానూ, నాకనిపించింది. అది అనుమానం కాదు నిజమనిపించేలా రైల్వే పోలీసులు ఒక్కో టాయిలెట్‌నూ క్షుణ్ణంగా గాలించారు. రైల్వే పోలీసులు మాత్రమే వెతుకుతున్నారు. కానీ మిగిలినవాళ్లూ కలిసి వెతుకుతున్నట్టుగా అనిపించింది. నా భ్రమే కాబోలు.
ఎదురుగా అలమేలు స్నేహితురాళ్లల్లో కొందరిని చూశాను. వాళ్ల ముఖాలలో భీతి అలుముకుని ఉంది. ఆమె స్నేహితురాళ్లల్లో సగం మంది వరంగల్ స్టేషన్‌లోనే దిగేశారు. ఈరోజు ఇవన్నీ జరగకుండా ఉండుంటే అలమేలు కూడా దిగేసేది.
ఆ టి.టి.ఆర్. మొదటి దెబ్బే ఈరోజుటి ఉత్సాహాన్నంతటినీ చెదరగొట్టింది. అతను రైలు అధికారం యొక్క తారాస్థాయిని తన షూ కాళ్లల్లోకి తెచ్చుకుని ఉండటాన్ని ఇప్పటిదాకా ఎవరూ గ్రహించలేకపోయాం.
ఆమెకు కూడా ఈ రైల్లో హక్కుంది. అది అతనికన్నా ఇంకా సాన్నిహిత్యమైనది.
పరీక్షలు రాసి ప్యాసైన రైల్వే కుక్క వాడు.
ఆమెకు అలా కాదు. అన్నీ ఈ రైలే.
మిలట్రీ నుండి ఊరికి రైలెక్కే మిత్రులను, ‘‘బామ్మర్దీ, రామగుండం వరకూ ఎలాగైనా ఓర్చుకో…’’ అని ఉత్సాహపు మాటలతో రైలెక్కిస్తున్నప్పుడు వాళ్ల మనసులో ఈ రేణిగుంట తక్కాళి (టమోటా) ఎప్పుడూ కదులుతుంటుంది.
‘‘అలమేలును చూస్తే, దీన్ని ఇచ్చెయ్!’’ అని ఆమెకోసం ఎన్నెన్ని స్వెట్టర్లు, కంబళ్లు, ఆరెంజ్ పండ్లు! ఎప్పుడైనా ధర ఎక్కువున్న బాటిళ్లు, అన్నీ ప్రేమకు చిహ్నాలే. అన్నింటినీ ఇవ్వాళ నాశనం చేసేశాడు ఆ టి.టి.ఆర్. కృష్ణ.
ఏమిటో ఈ రైలు అతనికి మాత్రమే సొంతమైనట్టుగా విర్రవీగుతున్నాడు.
ఒకవేళ ఆమె మూలాల్ని ఆమే వెతుక్కుంటూ వెళితే ఇదిగో తలుపుల్లేకుండా ఎంతో కాలంగా ఈ రైలు పట్టాలపై ఉన్న ఈ తుప్పు పట్టిన రైలు పెట్టెలో కూడా ఆమె మానభంగం జరిగుండొచ్చు. పాడుబడ్డ రైలుపెట్టె నుండి రూపొందిన ఒక స్త్రీని, పరీక్షలు రాసి ఉద్యోగానికొచ్చిన ఇతను ఎలా కాలితో తంతాడు? అతనికున్న అధికారం ఇప్పటికీ ఈమెకు అర్థం కాలేదు.
కల లాగానూ, కలలో లేని విధంగానూ, కలలో మిగిలినదిగానూ లేచి, కృంగిపోయి మళ్లీ ప్రాణం పోసుకుని, రైలు దడదడమనే శబ్ధంలో అలమేలు అలాగే నిద్రలోకి జారిపోయింది.
రేణిగుంట స్టేషన్ వరకూ ఈమెను కాబందు చేస్తే చాలు. తర్వాత అక్కణ్ణించి గోవాకో, బెంగుళూరుకో ఎందుకూ మద్రాసుకో కూడా రైలెక్కించొచ్చు.
మనుషులు ఉన్నంత వరకూ అలమేలూ బతికిపోవచ్చు. ఖాళీగా ఉన్న సీట్లో జారగిలబడి కూర్చుని ఆలోచిస్తుంటే చప్పున గుర్తుకొచ్చింది బాలరాజు పేరు.
పాత రైలు స్నేహితులలో ఇంకా రాలిపోకుండా మిగిలినవాడు. ‘‘నువ్వు మాత్రమే నా ప్రాణం.’’ అని ఇప్పటిదాకా అబద్దపు మాట మాట్లాడనివాడు.
నా మొబైల్లో బాలరాజును పిలిచి, కొంత సరిగ్గానూ, చాలా తప్పుతప్పుగానూ పరిస్థితిని చెప్పాను. నా గొంతు నాకే వినిపించనట్టుగా మౌనం వహించి ఉండటం ఆ పరుగులు తీసే రైల్లో గ్రహించగలిగాను. బాలరాజుతో నా వేడుకోలు ఇదే!
ఇంకో అర్థగంటలో నా ప్యాంట్రీ కార్లో నుండి భద్రంగా అలమేలును దించి, ప్లాట్‌ఫామ్ మీద ఎదురుచూసే రైల్వే పోలీసుల కళ్లకు కనిపించకుండా నీ దగ్గర చేరుస్తాను. తర్వాత పదినిమిషాల్లో దక్షిణం వైపుకు వెళ్లే ఏదో ఒక బండ్లో ఆమెను ఎక్కించెయ్. అది చాలు. ఆమె ఎలాగైనా బతికిపోతుంది. ఆమెకు అలవికాని అందమూ, టి.టి.ఆర్‌ను ఎగిసి తన్నే ధైర్యమూ ఉన్నాయి.
అలమేలును అతనికి తెలుసు. ఆమెను ఎవరికి తెలియదని? ఎప్పుడూ రామగుండంలో ఎక్కి వరంగల్‌లో దిగిపోయినప్పటికీ, ఆమె ఆకర్షణ విజయవాడ, రేణిగుంట దాకా ప్రాకి ఉంది.
బండి ఐదు నిమిషాలే ఐదవ ప్లాట్‌ఫామ్‌లో ఆగే ఈ సమయంలో ఈ అందగత్తె మార్పిడి ఏ చిన్న పొరబాటుకూ ఆస్కారం లేకుండా జరిగిపోవాలి.
జరుగుతుంది!
ఇన్నేళ్ల రైలు అనుభవం ఆ ధైర్యాన్ని నాలో కలిగించింది.
తర్వాతి ఐదవ నిమిషం… ప్లాట్‌ఫామ్ పైన నా చేతిని పట్టుకుని నడిచి వచ్చిన అలమేలును ఎవరూ అనుమానించలేదు. నా భార్యతో నేను ప్లాట్‌ఫామ్ మీద నడుస్తున్నాను.
ఒక అనుభవమున్న దంపతుల ప్లాట్‌ఫామ్ నడక అది. ఒక తాత్కాలిక వెసులుబాటు మా ఇద్దరికీ అలా సహకరించింది.
నాటక బాణీలో బాలరాజు చేతులను పట్టుకోకనే, నా కొన్ని మాటలలో, అలమేలును నా నుండి బాలరాజ్‌కు కదిలించాను.
కళ్లల్లో నీరు నిండుతుంటే ఆమె నన్ను వెనక్కు తిరిగి చూసి… ‘‘బావా…’’ అంది. కృతజ్ఞతలను తడి బారిన ఆమె కళ్ల నుండి స్వీకరించాను.
అంతే!
రైలు కదిలే శబ్దంలో ‘‘బావా…’’ ను మాత్రం నాలోకి స్వీకరించి అలవాటైన కాళ్లతో పరుగెత్తే రైల్లోకెక్కాను.
ఇప్పటిదాకా ఏంటో ఎదురుచూస్తున్నట్టుగా నిద్ర ఆహ్వానించింది.
మేల్కొనేసరికి కాట్పాడి జంక్షన్‌లో ఉన్నాను. ఇక్కణ్ణించి వేరే రైల్లో గంట ప్రయాణం. నా ఊరూ ఇలాంటి ఒక జంక్షనే. జోలార్‌పేట్టై.
నేనూ ఒక మగ అలమేలునే.
పసి ప్రాయంలోనే జంక్షన్ రైలుశబ్దం వింటూనే అనురాధ నర్సింగ్ హోమ్‌లో పుట్టాను. చివరి రైలు శబ్దం వినే నిద్రపోతాను. లేస్తాను. తింటాను. సంగమిస్తాను. జీవిస్తాను.
నేనూ ఒక మగ అలమేలునే.
అయితే ఈ రైలు నాకు సొంతమైనది అన్న భావన ఎప్పుడూ నాకు కలగలేదు. రైలు మా ఊళ్లో ఐదు నిమిషాలు ఆగి తర్వాత వెళ్లిపోతుంది. ఆలోపు అందులో నుండి దిగెయ్యాలి. అలాగే ఇవ్వాళా దిగేస్తాను.
కృష్ణ లాగా రైలు అధికారం నా రక్తంలోకి ఎక్కలేదు.
అలమేలు లాగా ఆమె శరీరమంతా ఎప్పుడూ ఒక రైలు దడదడమంటూ పరుగుదియ్యలేదు.
అర్థరాత్రి రైలు శబ్దంతోపాటు నా ఇల్లు చేరుకున్నాను. అలమేలును రేణిగుంటలోనే విడిచిపెట్టేశాను.
అంత రాత్రిలోనూ సద్దన్నంలో మిరపకాయల సాంబారును పోసుకుని పిసికి ఇచ్చే రేవతి ప్రేమలో కరిగిపోయినప్పుడు, ఆ రైలుశబ్దం నా నుండి చాలా దూరం వెళ్లిపోయింది.
కాలం ఎప్పుడూ తన చేతిలో ఒక రబ్బరును అట్టిపెట్టుకునే ప్రయాణిస్తుంది. వాన, ఎండ, తుఫాను, కరోనా ఏదైనప్పటికీ అది తన చేతిలోని రబ్బరును జారవిడుచుకోదు.
జ్ఞాపకాలను, ప్రేమను, మనుషులను, రైలును, ప్యాంట్రీ కారును, అలమేలును ఇలా అన్నింటినీ అది తప్పకుండా చెరిపేస్తుంది.
ఆ కాలమే ప్యాంట్రీ కారు తలుపులను నాకు మూసేసి, కొరియర్ సంస్థ తలుపులను తెరిచింది. ఇందులో నాకు తృప్తి అన్నది, రెండూ నాకు నచ్చిన ప్రయాణం కు సంబంధించింది ` అన్నది మాత్రమే. స్నేహితుల కోసం అన్న అబద్దపు కారణంతో నిన్న రాత్రి అదనంగా రెండు పెగ్గులు లోపలికెళ్లినప్పుడే ఇలా ఏదైనా అడ్డదిడ్డంగా జరుగుతుందని ఊహించాను.
లేకపోతే ఉదయం 3.10కి జోలార్‌పేట్టై జంక్షన్ నుండి చెన్నైకు బండి ఎక్కాల్సినవాణ్ణి ఇలా మధ్యాహ్న సమయానికి తెలుగు మాటలను వింటూ రేణిగుంటలో దిగుతానా?
నాలో నేనే చిన్నగా నవ్వుకున్నాను. ఇక మళ్లీ రాత్రికే చెన్నై వెళ్లటానికి వీలవుతుంది, అయితే ఏం? ఈలోపు నాకివ్వనున్న కలెక్టర్ ఉద్యోగాన్ని చెన్నై ఇంకెవరికైనా చేతులు మార్చి ఇచ్చేస్తుందా ఏం? ప్లాట్‌ఫామ్‌లో దిగి ప్రయాణించే ఎన్నో తెలుగు గొంతులను దాటుకుని, ఎదురుపడ్డ టీ షాపులో చక్కెర తక్కువున్న టీ చెప్పి ఎదురుచూస్తున్న విరామంలో…
‘‘బావా…’’
ఎన్నో ఏళ్ల క్రితం విన్న ఆ గొంతు…
ఇంతకాలం లోలోన అణిగిన ‘బావా…’ ను అలమేలు మాత్రమే ఉచ్ఛరించగలదు.
ఆ గొంతు విని నేను తిరిగిచూసే లోపు… నా భుజమ్మీద ఆమె కుడి చెయ్యి పడింది.
‘‘హాయ్ అలమేల్, ఎలా ఉన్నావు?…ఇక్కడేంటీ?’’
నేను అదే పాత ఉత్సాహంతో దాదాపు అరిచాను.
అప్పుడే ఏడేళ్లకు మునుపు ఇదే విధంగా ఒక మధ్యాహ్న సమయంలో, ఆమెను ఇదే ప్లాట్‌ఫామ్‌లో దింపిన జ్ఞాపకం మెరుపులా వచ్చి వెళ్లింది.
‘‘ఇక్కడే సెటిలై పోయావా అలమేలు?’’
ఏ కారణానికో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
ఆనందంలో కూడా కళ్లల్లో నీళ్లు కారవా ఏంటీ?
‘‘నేనెక్కడ బావా సెటిలయ్యాను. వాడే నన్ను ఇక్కడే సెటిల్ చేసేశాడు.’’ అని అలమేలు చెయ్యి చూపించిన దిశలో… బాలరాజు పాలక్యాన్‌లను మినీ లారీలో నుండి దింపుకుంటున్నాడు.
నాకంతా అర్థమైపోయింది.
అదే పదినిమిషాలు నాకోసం మాత్రం ఎదురుచూసినట్టుగా రైలు బయలుదేరి చెన్నైకేసి వెళ్తోంది.
అలవాటు పడ్డ నా రైలు కాళ్లతో కూడా పరుగెత్తి దాన్ని అందుకోవటానికి వీలుకాలేదు.
![]()

1961 మే 1 న తిరుత్తణిలో జన్మించారు. ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎంఏ చేశారు. 1983 రచనలు చేస్తున్న ఆయన 161కి పైగా కథలూ, 123 పైగా కవితలూ రాశారు. ఏడు కథాసంపుటాలు, ఒక కవిత్వ సంపుటి, ఒక నవల వెలువరించారు. వీరి సాహిత్య కృషికి పలు పురస్కారాలు లభించాయి. తమిళం నుంచి తెలుగులోకి అనువాదాలు చేస్తుంటారు. తమిళం నుండి 130 కి పైగా కథలు, 11 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం అనువదించారు. అనువాదంలో చేసిన కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు మరిన్ని అవార్డులు లభించాయి.




Discussion about this post