“ఆ కిటికీలు తెరవండి” ఆజ్ఞాపించాడు ఏడెన్.
“వెలుగుని లోపలికి రానీయకూడదు” అన్నాడు పార్మర్.
“ఏం?”
“ఉష్ణమండల దేశాలలో వెలుతురూ వేడీ ఒకటే…”
“ఓహ్!” ఆ చీకటికి అలవాటు పడటానికి ఏడెన్ పదే పదే తన కళ్ళు ఆర్పుతున్నాడు. అక్కడ గోడలు, తలుపులు ఉన్నట్టుగా లీలగా తెలుస్తోంది. కొద్ది క్షణాల్లోనే కళ్ళు చూడ్డానికి అలవాటుపడి అవి తమ పూర్తి రూపాన్ని సంతరించుకున్నాయి. చీకట్లో చూడటం నేర్చుకున్న అతని కళ్ళ ముందు కనపడుతున్న దృశ్యం, ఒక మధ్య యుగం నాటి యూరోపియన్ పెయింటింగ్ లాగా ఉంది. బొగ్గుతో ‘డాంటే’ నరకాన్ని గీచినట్టుంది. గడ్డకట్టే చల్లదనం అలలా వచ్చి అతని వేళ్ళ చివర్లకు చెవి తమ్మెలకు సర్రున పాకింది.
ఆ పెద్ద హాల్లో నలుదిక్కులా దిగువకు ఉన్న మెట్లు ఐదు అడుగులు కిందికి తీసుకెళ్తున్నాయి. పైన నించుని చూస్తే కింద దాదాపు యాభైకి పైగా మానవాకారాలు పని చేస్తూ కనిపిస్తున్నాయి. వాళ్ళ ఆకారాలు లీలగా కనపడుతున్నాయి. వాళ్ళ గుసగుసలు, ఊపిరి పీల్చే శబ్దాలు వినపడుతున్నాయి. వాళ్ళేం చేస్తున్నారో తెలుసుకోవడం కష్టంగా ఉంది. చీకట్లో వాళ్ళను చూస్తూంటే నల్లటి బురదలో పాకుతున్న పురుగుల్ని చూస్తున్నట్లుంది. వాళ్ళ శక్తినంతా ఉపయోగించి చీకటిని ముందుకు తోయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుంది. ‘లేదు, లేదు. ఉత్త చేతుల్తో చీకటిని తవ్వి తీస్తున్నట్టుంది. లేదంటే వాళ్ళు చీకటిని చుట్టుకుపోయి కిందినించి పైకి ఎక్కటానికి ప్రయత్నిస్తున్నారా?’ తెల్ల తలపాగా పెట్టుకున్న మేస్త్రీ ఒకడు ఊలు కోటు, ఖాకీ ప్యాంటు వేసుకుని చేతులు చాపుతూ స్థానిక భాషలో ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు.
“వాళ్ళేం చేస్తున్నారు?”
“చూపిస్తానుండండి!” అని పార్మర్ “లైట్!” అంటూ కేక పెట్టాడు. వాళ్ళల్లో ఒక మనిషి అక్కడున్న ఇనప నిచ్చెన ఎక్కి ఆ హాలు కప్పులో షట్టర్ లాగా అమర్చి ఉన్న చిన్న తలుపుని తెరిచాడు. ఆ సందులోంచి సూర్యుడి కాంతి రేఖ ఒకటి ఏటవాలుగా వచ్చి లోపలికి పడింది. ఆ రేఖ ఎక్కడైతే పడుతోందో అక్కడ ఒక పెద్ద ఐస్ దిమ్మె ప్రత్యక్షమైంది. కాంతి ఐస్ మీద పడగానే దాని పై పొర కరగటం మొదలైంది. అప్పటిదాకా పొరలు పొరలుగా ఉన్న తెల్ల వస్త్రం ఏదో ఐస్‌ను కప్పి ఉంచినట్టు, ఇప్పుడు ఆ పొరలు విడిపోతూ కింద ఇంకా తెల్లగా ఉన్న భాగాన్ని వెలువరిస్తున్నట్టు ఆ దిమ్మె కరుగుతోంది. కళ్ళ ముందు క్రమంగా ఆ ఐస్ దిమ్మె ఇంకా స్పష్టంగా గోచరిస్తూ వెలుగుతో నిండిన భారీ గాజు తొట్టి లాగా కనపడింది.
దిమ్మె నుంచి ప్రతిఫలించే వెలుగు మీద పడుతూంటే చుట్టూ ఉన్న బూడిద రంగు గోడలు రూపాన్ని సంతరించుకున్నాయి. ఆ వెలుగు నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న మానవాకారాలను చూడగలిగాడు ఏడెన్. దాదాపు ఆరడుగుల పొడుగూ ఆరడుగుల వెడల్పూ ఎనిమిదడుగుల ఎత్తు ఉన్న ఆ దిమ్మె అంతటా చెక్కలు అమర్చివున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా గడ్డపారతో తొలిగించి ఆ చెక్కల్ని హాల్లో ఒక మూలగా పెడుతున్నారు. పూర్తిగా నగ్నంగా ఉన్న ఆ ఐస్ దిమ్మె లోపల పడుతున్న వెలుగునంతా అమాంతం మింగేస్తూ ధగ ధగా మెరిసిపోతోంది. దానిలోపల పగుళ్ళు, బుడగలు బయటికి కనపడుతున్నాయి.
కనపడుతున్న దృశ్యం నుంచి చూపులు మరల్చుకోలేక “ఎక్కడ్నించి వచ్చిందిది?” అంటూ అడిగాడు ఏడెన్.
“ఉత్తర అమెరికా నించి వచ్చింది. న్యూ ఇంగ్లాండ్ ప్రాంతాల్లో ఉన్న అన్ని సరస్సుల నించి మేము ఐస్‌ను సేకరిస్తాము. అక్కడ దొరికేంత స్వచ్ఛమైన నీరు మీకు ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. ఇంత శ్రేష్టమైన ఐస్ మీకు దొరకటం అసాధ్యం” పార్మర్ సమాధానం ఇచ్చాడు.
ఏడెన్‌కు చూపులు మరల్చుకోవడం సాధ్యపడటం లేదు. ఆ దిమ్మె ఆరు నెలలపాటు ఎనిమిది వేల మైళ్ళు ప్రయాణం చేసి ఇక్కడికొచ్చింది.
“కరిగిపోకుండా ఇంత దూరం ఎలా వచ్చింది?”
“ఇవెంత పెద్ద సైజులో ఉంటే అంత తక్కువ కరుగుతాయి. ఐస్ పుట్టించే చల్లదనం కరగకుండా ఆపడానికి ఉపయోగపడుతుంది. న్యూ ఇంగ్లాండ్ సరస్సులు శీతాకాలంలో ఘనీభవిస్తాయి. అక్కడ నించి ఐస్‌ను దిమ్మెలుగా కోసి ఒడ్డుకు తీసుకొచ్చి మా లారీల్లో వేస్తాము. అక్కణ్ణించి రవాణా నౌకల్లోకి చేరుస్తాం. పెద్ద పెద్ద చెక్కపెట్టెల లోపల, చుట్టూ రంపం పొడి వేసి ఉప్పు దిమ్మెలను పెట్టి మధ్యలో ఐస్‌ను ఉంచుతాం. వేడిని దరిచేరనీకుండా చెక్క పెట్టెలని ఓడ కింది భాగంలో ఉంచుతారు. ఆరు నెలల ప్రయాణంలో బహుశా ఒక ఐదు శాతం ఐస్ కరిగిపోతుంది. అంతే.”
“ఇదెంత బరువుంటుంది?”
“ఏడు టన్నులు. ఏనుగంత బరువు.”
ఏడెన్ దృష్టి ఇంకా ఎదురుగా ఉన్న ఐస్ దిమ్మె మీద నించి కదలడం లేదు. దాని చివర్లు కరిగి మొద్దు బారి నున్నటి గుమ్మటంలా తయారైందది. తెల్లటి పెద్ద ఐస్ గుమ్మటం. తెల్ల ఏనుగు. దాని కళ్ళలోని కాంతే ఓ రూపం ధరించినట్టుగా వెలిగిపోతోందది. Still, snowy, and serene; Its subject mountains their unearthly forms. pile around it, ice and rock. వాక్యాలు… అర్థం లేనివో! అర్థం చేసుకోలేనివో! ‘ఎవరివీ వాక్యాలు? బహుశా షెల్లీవి అయుంటాయి.’
“క్రీ….క్” అంటూ హఠాత్తుగా పెద్ద శబ్దం చెవిన పడటంతో ఏడెన్ ఉలిక్కిపడ్డాడు. పక్కకు చూస్తే పార్మర్ వణికిపోతూ ఏదేదో అర్థం పర్థంలేని కేకలు పెడుతున్నాడు. ఆ వాతావరణం, ఆ కేకలు ఏడెన్‌కు భయం పుట్టించాయి, వణుకు మొదలైంది. ఏదో తెలీని శక్తి ఒక వైపు నించి బలంగా తోసినట్టు ఆ ఐస్ దిమ్మె నేలను రాచుకుంటూ ఒక పక్కకి వేగంగా జారడం మొదలైంది. తెల్ల ఏనుగు ఘీంకరించి తొండం పైకిలేపి రక్తదాహంతో ముందుకు పరిగెడుతోంది. అక్కడున్న కూలీలందరూ వణికిపోతూ కేకలు పెడుతున్నారు. మేస్త్రీ ఒకడు పక్కనున్న గట్టు మీద పరిగెడుతూ అటూ ఇటూ చేతులూపుతూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు. అతను తన చేతిలో ఉన్న కొరడా విసురుతూంటే వస్తున్న శబ్దం అతను పెట్టే కేకలతో పోటీ పడుతోంది.
ఇంకో పక్కనున్న తలుపు తెరుచుకుని మరో మేస్త్రీ పెను కేకలు పెట్టుకుంటూ పరిగెత్తుకుని వచ్చాడు. తెల్ల ఏనుగు మాత్రం దొరికిన మనుషుల్ని గోడకేసి అదిమి నలిపేసి పిప్పి కింది మారుద్దామని కంకణం కట్టుకున్నట్టు నిరాఘాటంగా ముందుకు వెళ్తూనేవుంది. వాళ్ళల్లో ఇద్దరు చప్పున కింద నేల మీద పడివున్న మందపాటి చెక్కల్ని చేతిలోకి తీసుకుని గోడకీ దిమ్మెకీ మధ్యలో దూర్చారు. ఆ చెక్కలు భీకరంగా మూలుగుతూ మధ్యలో పడి నలిగిపోయాయి. ఈ లోపల మధ్యలో ఇరుక్కోబోయిన కూలీలు ఎలాగోలా ఆఖరి క్షణంలో తప్పించుకున్నారు. ఐస్ దిమ్మె చెక్కల్ని తోసేసి ముక్కలు ముక్కలుగా చేసి ఆగకుండా ముందుకెళ్ళి గోడకు బలంగా గుద్దుకుని ఆగింది.
“ఎంత బరువున్న వస్తువైనా సరే, చదునుగా నున్నగా ఉన్న నేల మీద జారిపోతుంది. దిమ్మె బరువుగా ఉండడం వల్ల ఆ భారానికి కిందున్న పొర చిదిమి పోయి కరుగుతుంది. అందువల్ల నేలమీద ఐస్ దిమ్మె ఎప్పుడూ అస్థిరంగానే ఉంటుంది. కాబట్టి కొంత ప్రమాదకరమైన పరిస్థితే!” అన్నాడు పార్మర్ కొద్ది సేపాగి.
ఏడెన్ తనలోని వణుకు తగ్గేదాకా ఆగాడు. కొంతసేపాగి అడిగాడు, “పని చేసే వాళ్ళ ప్రాణాలు ఎప్పుడూ ప్రమాదంలో ఉన్నట్టే, కదా?”
“ఇలా ఎప్పుడైనా ఒక్కసారి జరుగుతుందంతే” అన్నాడు పార్మర్. “అయినా వాళ్ళకిదంతా అలవాటే.”
ఐస్ దిమ్మెను మళ్ళీ తీసుకొచ్చి యధాస్థానంలో పెట్టడానికి కూలీలు కష్టపడటం ఏడెన్‌కు కనపడుతూనే ఉంది. వాళ్ళు తెల్ల ఏనుగును కట్టేసి దాన్ని వెనక్కి తీసుకు రావడానికి లాక్కొస్తున్నట్టు ఉంది. ఏడెన్‌కు ‘రక్తం చిందేదాకా అది ఆగదు’ అనిపించింది.
అది మళ్ళీ పక్కకు జరగకుండా ఐస్ దిమ్మె కింద కొన్ని కీళ్ళు దూర్చి మళ్ళీ దానిపైకెక్కారు వాళ్ళు. దిమ్మె పైన నిలబడున్నప్పుడు వాళ్ళ శరీరాలు సముద్రపు గాలికి ఓడల మీది జెండాలు రెపరెపలాడినట్టు వణకడం ఏడెన్‌కు కనపడుతోంది.
అప్పుడే నీళ్ళలోంచి లేచి వచ్చినట్టు వాళ్ళ ఒళ్ళంతా నీళ్ళు కారుతున్నాయి. పెద్ద తెల్లటి పళ్ళు, ఆల్చిప్ప లాంటి కళ్ళు తప్ప వాళ్ళ శరీరంలో ఇంకే భాగమూ కనపడడంలేదు. మద్రాసు పట్టణంలోని నల్ల పట్టణంలో అంతటా తారసపడుతూ విధేయత చూపించీ చూపించీ వెన్ను పూస వంగిపోయిన మూగ జనాలే వీళ్ళంతా. ‘ఆ కళ్ళ వెనకాల ఏం దాగి ఉంది? వాళ్ళ మౌనం ఏం చెబుతోంది?’
ప్రస్తుతం వాళ్ళల్లో వాళ్ళు బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు. నలుగురు దిమ్మె పైకెక్కి రెండు పక్కలా ఎదురెదురుగా కూర్చున్నారు. రెండు పెద్ద రంపాలు ఐస్ మీద తీసుకొచ్చి పెట్టారు. ఇరువైపులా ఇద్దరు ఇద్దరుగా రంపం పట్టుకుని కూర్చున్నారు. వాళ్ళు చెక్కను కోసినట్టు ఐస్‌ని కోస్తూంటే చూస్తూండిపోయాడు ఏడెన్. ఐస్ దిమ్మె “ర్ర్ ర్ర్” అని శబ్దం చేస్తూ నిరసన తెలియచేస్తోంది. ఐస్ ముక్కలు నేల మీద పడి తెల్లటి గుట్ట కింద తయారౌతున్నాయి.
“ఐస్‌ని ఇక్కడ ముక్కలుగా చేస్తాం. వాటిని పెట్టెల్లో రంపం పొట్టుతో సహా నింపి ఎక్కడ అవసరముంటే అక్కడికి పంపిస్తాం” పార్మర్ కొనసాగించాడు. “మేము తయారు చేసే ఐస్‌ను ఉత్తరాన సికింద్రాబాద్ నించి కింద దక్షిణాన తెన్కాశి వరకు పంపిస్తాం. నిజానికి మా ఐస్ ఖరీదు మీరు తాగే అత్యంత ఖరీదైన విస్కీ కంటే ఎక్కువ” పార్మర్ చేయి చూపిస్తూ చెప్పాడు. “ఐస్ క్యూబులు సరిగా రవాణా అయ్యేందుకు ఆ ఐస్ పొడి, ఉప్పు, రంపం పొడితో కలిపి బాక్సుల లోపల అద్దుతాం.”
అప్పుడు కానీ ఏడెన్‌కు ఒంట్లోని వణుకు పూర్తిగా తెలిసి రాలేదు. కోటు జేబులో చేతులు పెట్టుకుని నెమ్మదిగా బయటికి నడిచివెళ్ళాడు. అతను బయట అడుగుపెట్టగానే కుంపటి వేడి దగ్గరగా తగిలినట్టు అతని బుగ్గలు చెవులు వేడెక్కాయి. అర్థం కాని కలలోంచి మెలకువ వచ్చినట్టు అతని బుర్రలో ఆలోచనలు పరిపరివిధాల వస్తున్నాయి, పోతున్నాయి. “మిస్టర్ పార్మర్, ఇక్కడ పనిచేస్తున్న వర్కర్లకు ఈ చలికి తగ్గ యూనిఫారాలు ఎందుకు లేవు?”
పార్మర్ మొహంలోకి నవ్వు వచ్చి పడింది. “ఊలు బట్టలు ఇంత తేమ ఉన్న ప్రదేశంలో మోయలేనంత బరువెక్కుతాయి.”
ఒక్కసారిగా ఏడెన్ ఆలోచనల్లోని గందరగోళం పోయి స్పష్టత వచ్చింది. శరీరంలోని ప్రతి అణువునించీ రక్తం బుర్రలోకి సర్రున పాకినట్టైంది. “పార్మర్ గారూ, మీ ఘనత వహించిన అమెరికాలో వాటర్ ప్రూఫ్ బట్టలు దొరుకుతాయనుకుంటాను?”
పార్మర్ తలూపి ఒక చిన్న వంకర నవ్వుతో అన్నాడు, “అవును. కానీ వీళ్ళు అసలు బట్టలేసుకోడానికే ఇష్టపడరు. మీరు నల్లవాళ్ళ పట్టణంలోకి అడుగుపెడితే మీకే తెలిసొస్తుంది. వీళ్ళు జీవితంలో ఎక్కువ భాగం దాదాపు ఏ బట్టలూ వేసుకోకుండానే గడిపేస్తారు.”
ఏడెన్ పొంగి వస్తున్న కోపాన్ని అణుచుకున్నాడు. ‘ఈ ముసిలి నక్కతో వాదించి సమయం వృధా!’ అని అనుకున్నాడు. నిట్టూర్చి, “సరే మిస్టర్ పార్మర్, మీ మేస్త్రీలందరూ మా ఆఫీసుకొచ్చి నాక్కనపడేలా చూసుకోండి” అన్నాడు.
“తప్పనిసరిగా” అంటూ వంగి నిల్చున్నాడు పార్మర్.
ఏడెన్ సముద్రపు ఒడ్డున నిలబడి తలవంచి నేల వైపు దృష్టి సారించాడు. కళ్ళల్లో పడే వెలుగు కొద్దిసేపు ఏమీ కనపడకుండా చేసింది. కళ్ళు మూసుకున్నాడు. బుగ్గల మీదినుంచి జారే కన్నీళ్ళను తన పట్టు రుమాలుతో గట్టిగా తుడుచుకున్నాడు.
నారాయణన్ “సర్?” అంటూ ముందుకొచ్చి నిలబడ్డాడు.
“మన వాళ్ళను ఇంక క్యాంపుకు వెనక్కెళ్ళమని చెప్పు” ఏడెన్ ఆజ్ఞాపించాడు.
నారాయణన్ బాకా ఊది కేక పెట్టిన మరుక్షణం సిపాయిలందరూ గాలిని బట్టి ఓడ దిశను మార్చుకున్నట్టు రోడ్డు వైపు తిరిగి ఒక పెద్ద జెర్రి కదిలినట్టు కవాతు మొదలెట్టారు. అశ్విక దళం బీచి రోడ్డు మీద ఒక ఐదువందల అడుగులు నడవగానే అప్పటిదాకా వాచీ వైపే చూస్తున్న ఏడెన్ తన నడుముకు కట్టున్న బాకా తీసి గట్టిగా ఊదాడు. “కంపెనీ, రివర్స్ ఛార్జ్!” అని గట్టిగా కేక పెట్టి గుర్రాన్ని వెనక్కి తిప్పి ఐస్‌హౌస్ వైపు పరుగులెత్తించాడు. నారాయణన్ తను కూడా అదే ఆదేశం ఇచ్చాడు. సిపాయిలందరూ, ఒకదాని వెనక ఒకటిగా దొర్లుతూ వచ్చే కొండ రాళ్ళలా అతని వెనకే వడివడిగా పరిగెత్తారు. ఐస్‌హౌస్ వైపు సముద్రపు అలల్లా ఎగసి పడుతూ ముందుకు వెళ్తున్నారు.
కొద్ది నిముషాలలోనే ఏడెన్ ఐస్‌హౌస్‌కు చేరుకున్నాడు. ఒరలోంచి కత్తిని తీసి గుర్రం మీంచి కిందికి దూకి లోపలికి పరిగెట్టుకుని వెళ్ళాడు. పార్మర్ లోపల్నించీ పరిగెత్తుకుని వచ్చాడు. చేతులు రెండూ బార్లా చాపి ఏదో చెప్పబోయాడు. ఏడెన్ ఒక్క క్షణం ఏదో చెప్పబోతూ నోరు తెరిచిన పార్మర్ మొహంలోకి చూశాడు. మరుక్షణం కాలు లేపి ఏడెన్ పార్మర్ గుండెల మీద లాగిపెట్టి తన్నాడు. పార్మర్ నోరు తెరిచి వెనక్కి వెల్లకిలా పడ్డాడు.
నారాయణన్ ఆజ్ఞలిస్తూంటే సిపాయిల దళం ఆ భవంతిలోకి ముంచుకొస్తున్న కొత్త నీటి వరదలా ప్రవేశించింది. “కనపడ్డ ప్రతి వాణ్ణీ తీసుకొచ్చి ముందున్న ఆవరణలో నిలబెట్టండి” ఏడెన్ ఆదేశించాడు. ఏడెన్, పార్మర్ ఒంటి కంటి కళ్ళద్ధం నేల మీద పడుంటే పక్కకి కాల్తో తన్నాడు. మసక మసగ్గా ఉన్న ఐస్‌హౌస్ లోపల కాలు పెట్టాడు. బూట్లు నేల మీద థడ్ థడ్ మని చప్పుడు చేస్తూంటే కత్తి ఎత్తి పట్టుకుని వరండాలోంచి హాల్లోకి వెళ్ళాడు. సిపాయిలు దొరికిన వాడినల్లా తీసుకొస్తున్నారు. ఏడెన్ ప్రతి గదిలోకి తానెళ్ళి వెతికాడు. అది కేవలం కంపెనీ వేర్ హౌస్ మాత్రమే, ఆఫీసు కాదని అర్థం అయ్యింది.
ఏడెన్ మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి రెండువందల మందికి పైగా మనుషులు కారు నలుపు రంగులో అర్థ నగ్నంగా ముందు ఆవరణలో నిలబడివున్నారు. వాళ్ళ శరీర ఛాయ వల్ల ఆ ప్రదేశం అంతా వెలుగు తగ్గినట్టనిపిస్తోంది. అతని ప్రతి కదలికను వాళ్ళు తమ భయం నిండిన కళ్ళతోటి గమనిస్తున్నారు.
నారాయణన్ ఒళ్ళంతా బిగించి సెల్యూట్ కొట్టి, “అందర్నీ పట్టుకొచ్చాం సార్” అన్నాడు.
ఏడెన్, “అంతా వెతికారా?” అంటూ అడిగాడు.
“వెతికాం సార్. అంగుళం అంగుళం వెతికి అందర్నీ లాక్కురమ్మని చెప్పాను” అని సమాధానం ఇచ్చాడు, నారాయణన్.
ఏడెన్ వచ్చి వాళ్ళ ముందు నిల్చున్నాడు. వీపు మీద వీచే గాలితో నిండిన ఏడెన్ చొక్కా టప టప కొట్టుకుంటూ చేసే శబ్దం తప్ప ఇంకేమీ వినపడ్డం లేదు. గుర్రం దగ్గరికి ఏడెన్ పోతూంటే అది నెమ్మదిగా సకిలించి తలను వంచి మెడతో అతని భుజాన్ని రాచింది. ఏడెన్ తన ముందున్న మనుషుల్ని పరీక్షగా చూశాడు. పన్నెండు మంది మేస్త్రీలు. అందరూ ఒకేలా బట్టలు వేసుకుని ఉన్నారు; ఖాకీ ప్యాంటు, ఖాకీ రంగు ఊలు కోటు, కాళ్ళంతా చుట్టుకున్న ఖాకీ పట్టీలు, పెద్ద సైజు బూట్లు. తల మీదున్న ఊలు టోపీ చేత్తో పట్టుకునో చంకలో పెట్టుకునో భయం నిండిన కళ్ళతో చూస్తున్నారు. మురికి పట్టిన తడి గోచీ తప్ప ఒంటిమీద ఏ ఆచ్చాదనా లేకుండా కూలీలు వరసలో నిల్చునున్నారు. చెక్క మోపు చుట్టూ అడవి తీగలు చుట్టుకుని ఉన్నట్టు మెలికలు తిరుగుతూ బయటకు కన్పడుతున్న ఒంటి మీది నరాలు వాళ్ళ ఎముకలని పట్టి ఉంచుతున్నాయి.
మేస్త్రీలనెవ్వరినీ పట్టించుకోకుండా ఏడెన్ తన దృష్టినంతా కూలీల మీదే కేంద్రీకరించాడు. తన గుండె చప్పుడు వింటూ నిలబడ్డ ఏడెన్ శరీరంలో కళ్ళు, మనసు తప్ప మరేవీ పని చేస్తున్నట్టు లేదు. రాళ్ళ మీద నాచు పట్టినట్టు కూలీల చర్మం మీద బూడిద రంగు పొక్కులు శరీరమంతా కనపడుతున్నాయి. ఎరుపు తెలుపు రంగులో ఉండే పొక్కులు మెడ మీద భుజం మీద ఉన్నాయి. కొన్ని పుండ్లు నోరు తెరిచిన చేపల్లా మిగతావి పీకేసిన కనుగుడ్లలా ఉన్నాయి. కింద కనపడుతున్న తెల్ల చర్మాన్ని వదిలేస్తే మురికి గుంటల్లోని ఏలిక పాముల్లా, చేతి కాలి వేళ్ళ మీద చర్మం లేచి ఉంది.
ఉన్నట్టుండి ఎవరో తట్టి చెప్పినట్టు ఏడెన్ ఒక విషయం గమనించాడు; వాళ్ళందరి కాళ్ళు వంగిపోయి చెట్ల కొమ్మల్లా కొంగర్లు తిరిగి పోయున్నాయి. “జీసస్!” అంటూ లోలోన స్మరించాడు. ఎలాగోలా ధ్యాస మళ్ళించుకుని దూరాన కన్పడుతోన్న సముద్రంలో ఒడ్డును ఢీకొడుతున్న అలల వైపు చూశాడు. అకస్మాత్తుగా ఈ మనుషులనందరినీ ఎవరో వల వేసి పట్టి సముద్రంలోంచి తీసుకొచ్చి ఒడ్డు మీద నిలబెట్టినట్టనిపించింది. మళ్ళీ ఈ లోకంలోకొచ్చి పడి వాళ్ళ కళ్ళల్లోకి చూశాడు. ‘పండిపోయి వడిలిపోయిన ద్రాక్ష లాంటి కళ్ళు. జీవం లేకుండా ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నట్టున్న చూపులు.’ ఏడెన్ కళ్ళు పక్కకి తిప్పుకున్నాడు.
ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదతనికి. చుట్టూ ఉన్న వాళ్ళంతా అతని పెదవుల వైపే దృష్టి సారించి ఎదురు చూస్తున్నారు. తనను తాను కూడగట్టుకుని తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిస్తూండగా అతనికి ఆ గుంపునించి వచ్చే వాసన ముక్కుపుటాలకు తగిలింది. కుళ్ళుతున్న మాంసం వాసన. కడుపులో తిప్పుతున్నా భరిస్తూ వరసలో నిలబడ్డ మేస్త్రీలను ఒకరి తర్వాత ఒకర్ని తేరిపార చూశాడు. కొద్దిసేపట్లోనే నీలమేఘం కనపడ్డాడు. కానీ అక్కడున్న కూలీల్లో దెబ్బలు తిన్న ఆ ఇద్దరు భార్యాభర్తలు కనపడ్డం లేదు. వాళ్ళందరి ముఖాలు ఒకేలా ఉన్నాయి. లేదంటే ఏడెన్‌కు అలా అనిపించిందో?
నీలమేఘం మొహంలో ఏమాత్రం భయం కానీ తత్తరపాటు కానీ లేకపోవడం ఏడెన్ గమనించాడు. దాని బదులు నీలమేఘం శక్తులన్నీ కూడగట్టుకుని రాయిలాగా నిలబడ్డాడు. తల దించి లేడు. నేల కేసి చూడటం లేదు. ఆల్చిప్పల్లాంటి అతని కళ్ళు ఏడెన్ మీదే నిలిచివున్నాయి.
“నీలమేఘం ముందుకురా!” ఏడెన్ ఆజ్ఞాపించాడు.
నీలమేఘం ముందుకొచ్చి నిలబడ్డాడు.
“నువ్వు పొద్దున హింసించిన కూలీలు ఎక్కడున్నారు?” ఏడెన్ ప్రశ్నించాడు.
“ఇక్కడ లేరు.”
వృత్తి రీత్యా మెకానికల్ ఇంజనీర్. తెలుగు ఆంగ్ల కథా సాహిత్యం పై ప్రత్యేకమైన ఆసక్తి. హర్షణీయం పాడ్కాస్ట్ నిర్వాహకుల్లో ఒకరు.
హర్షణీయం పాడ్కాస్ట్ లింక్ – https://bit.ly/harshspot




Discussion about this post