“ఎక్కడికెళ్ళారు?”
“వాళ్ళెవరో కూడా నాకు తెలీదు, సర్.”
“తెలీదా? వాళ్ళు ఇక్కడేగదా పనిచేసేది?”
“వాళ్ళదే చెప్పారు. కానీ నేను తెల్సుకుందేమంటే వాళ్ళిక్కడ పని చేయడం లేదని. వాళ్ళు వెనక్కి తిరిగి రాకపోవడం కూడా అదే విషయాన్ని బలపరుస్తోంది.”
ఏడెన్ తనకున్న ఓర్పునంతా కూడగట్టుకుని అడిగాడు, “వాళ్ళు నీతోటి వెనక్కి రాలేదా?”
“లేదు. నా వెనకాలే రమ్మని వాళ్ళకి చెప్పి నేనిక్కడికి వచ్చేసాను. వాళ్ళు రాలేదు. వాళ్ళు ఐస్‌హౌస్ కూలీలు కాదు.”
ఏడెన్‌కు కోపం పొంగుకొచ్చింది. అతని గొంతు పీలగా అయిపోయింది. “నువ్వు వాళ్ళు… మీ కూలీలు అని చెప్పావు. పని ఎగ్గొట్టి తిరుగుతూంటే వాళ్ళను నువ్వు శిక్షిస్తున్నానని చెప్పావు.”
“అవును సర్. నేను కూడా అదే అనుకున్నాను. కానీ వాళ్ళు ఇక్కడికి రాలేదు” నీలమేఘం సమాధానం ఇచ్చాడు.
కోపం తగ్గడానికి ఏడెన్ గుర్రాన్ని దువ్వుతూ దాని పక్కనే నిలబడ్డాడు. నెమ్మదిగా గాఢంగా ఊపిరి వదిలి అడిగాడు, “నిజంగా చెప్పు, వాళ్ళెక్కడున్నారో?”
“ఈపాటికి నల్ల పట్టణంలో వాళ్ళ గూడేనికి చేరుకునుంటారు.”
“వాళ్ళ ఇల్లెక్కడో నీకు తెలుసా?”
“లేదు. నేనాపక్కకే పోను.”
ఏడెన్ కనురెప్ప కూడా మూయలేదు. నీలమేఘం చెబుతున్న మాటలకు అతనికి అర్థం తెలుసు. “వాళ్ళిద్దరినీ వెంటనే నా ముందుకు తీసుకురా. నువ్వు చేసిన నేరానికి వాళ్ళే సాక్షులు. వినపడుతోందా?”
నీలమేఘం ఏం మాట్లాడలేదు. ఏడెన్ తన స్వరం హెచ్చించాడు. “నాకు వాళ్ళు కావాలి… ఇప్పుడే. సరేనా?”
టోపీ తలమీద నొక్కిపెట్టుకుంటూ పార్మర్ లోపల్నించీ పరిగెత్తుకొచ్చాడు. దగ్గరికొచ్చే కొద్దీ వేగం తగ్గించి దాదాపు కుంటుకుంటూ వచ్చి నిలబడ్డాడు. “కాప్టెన్, మీరు రూల్సన్నీ తుంగలో తొక్కుతున్నారు” అని ఆయాసపడుతూ అరిచాడు. “ముందుగా మీరు అనుమతి లేకుండా మా కంపెనీలోకి ప్రవేశించారు. నేనూ…” అంటూ ఏడెన్ ఉగ్రరూపం చూసి తడబడ్డాడు. “ఇది న్యాయం కాదు. మా వ్యాపారం మేము పూర్తిగా చట్టబద్ధంగా చేస్తాం” అన్నాడు గొంతు బాగా తగ్గించి.
ఏడెన్ తన ముందున్న మనుషుల కృశించిన దేహాల్ని చూపిస్తూ, “వ్యాపారం? అంటే మీ అర్థం వాళ్ళనిలా చంపటమా?” అనడిగాడు.
పార్మర్ తన చెయ్యి టోపీ మీంచి తీయగానే అది సముద్రపు గాలికి పైకి లేచింది. దాన్ని పట్టుకుని మళ్ళీ తల మీదకు నొక్కుకున్నాడు. “కానీ పనిలో చేరే ముందే మేము వాళ్ళకు అన్ని విషయాలు చెప్తాము. వాళ్ళు ఇష్టపడే ఈ ఉద్యోగంలో చేరారు. వాళ్ళెవరినీ మేం బలవంతపెట్టలేదు. వాళ్ళెప్పుడు కావాలంటే అప్పుడు ఉద్యోగం వదిలి వెళ్ళిపోవచ్చు. ఇదంతా పద్ధతిగా ఒక ఒప్పందం ప్రకారం చేసాం, అంతే. వాళ్ళల్లో ఎవరైనా వెళ్ళిపోదలచుకుంటే నేను వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇచ్చేసి ఇప్పటికిప్పుడే పంపించేస్తాను.”
వాళ్ళెవ్వరూ విడిచిపెట్టి వెళ్ళరని ఏడెన్‌కు బాగా తెల్సు. అతి భీకరమైన బెంగాల్ రాక్షస కరువు తన విషపు కోరలను దక్కను ప్రాంతం నించి మద్రాస్ దాకా చాచింది. ప్రస్తుతం దానికి దక్కను రాక్షస కరువు అని పేరు పెట్టారు. ఆఖరికి ఇలాంటి పని కోసం కూడా వేలాదిమంది కాచుకు కూర్చునుంటారు. ఏడెన్ నిట్టూర్చాడు. “నేను వాదనలోకి దిగదల్చుకోలేదు. మీ మేస్త్రీ ఇద్దర్ని కొరడాతో కొట్టాడు. అది నా కళ్ళతో నేనే చూశాను. ఆ ఇద్దరూ ఇప్పుడిక్కడ లేరు.”
“మీ సమస్య నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ మనిషి వాళ్ళనెందుకు కొట్టాడో నాకు తెలీదు. అసలు మేము ఇక్కడ అలాంటివి సహించం. మా కంపెనీ రూల్సు కూడా అందుకు ఒప్పుకోవు. ఇంకా చెప్పాలంటే అసలు మాకు కొరడా వాడి పనిచేయించుకునే అవసరమే లేదు. ఇప్పుడు మాకు ఎంతమంది కూలీలు కావాలంటే అంతమంది దొరుకుతారు. నిజం చెప్పాలంటే మేము మా దగ్గరికి వచ్చే వందల మందికి పని కల్పించలేక వెనక్కి పంపించేస్తూంటాము. ఇదంతా జరగడానికి ఏదన్నా వ్యక్తిగతమైన కక్షలు కారణం అయ్యుండొచ్చు.”
“ఎక్కడున్నారు, వాళ్ళు?” అడిగాడు ఏడెన్ ఏమాత్రం తొట్రుపడకుండా.
“మా వర్కర్లు అందరూ మీ కళ్ళముందే ఉన్నారు. వీళ్ళు కాకుండా మా దగ్గర ఇంకెవ్వరూ లేరు.”
మాటలకు మధ్యలో అడ్డం వచ్చి గొంతు పెద్దదిగా చేసి, “నేను వాళ్ళను కలిశాను” అన్నాడు ఏడెన్. “మేమిక్కడ పనిచేస్తున్నామని వాళ్ళంతటకు వాళ్ళే నాకు చెప్పారు.”
“అవునా? వాళ్ళెందుకు అలా చెప్పారో నాకు తెలీదు. మిమ్మల్నించి తప్పించుకోవాలనేమో? బోలెడంతమంది నల్లోళ్ళు ఈ తెల్లోళ్ళ పట్టణానికి కుప్పతొట్లల్లో ఆహారం ఏరుకోడానికి వస్తారట. పోలీసులకేమో మేము ఐస్‌హౌస్‌లో పని చేస్తున్నామని చెప్తారట. బంగళాల్లో పనిచేసే వాళ్ళకు మంచి యూనిఫారాలుంటాయి. మేము వీళ్ళకు ఏ యూనిఫారాలు ఇవ్వం.”
ఏడెన్ కొద్దిసేపు పార్మర్ గాజు కళ్ళ వెనకాల ఏముందో తెలుసుకోడానికి ప్రయత్నించాడు. ‘వీడ్ని నేను లొంగతీసుకోటం అంత తేలిక కాదు’ అంటూ తనలో తాను సమాధానపడ్డాడు. “మీ దగ్గర పని చేస్తున్న వాళ్ళందరివీ పేర్లు చిరునామాలు మీ దగ్గర ఉన్నాయా? మీ రిజిస్టర్లు ఏవీ?”
“క్షమించాలి. ఈ దేశంలో పరిస్థితులు మీరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము వీళ్ళ పేర్లు రాసి పెట్టుకునే శ్రమ తీసుకోము. కారణం ఏమిటంటే వీళ్ళల్లో చాలా మంది పేర్లు కరుప్పన్ అనో సంగిలి అనో ఉంటాయి. వీళ్ళకు మేము నంబర్లిస్తాము. అది గుర్తుపెట్టుకోడం వాళ్ళ బాధ్యత. ఇంక చిరునామా విషయం అంటారా? మీకు తెలిసే ఉంటుంది, ఈ దేశంలో భూమి ఎవడికైతే ఉంటుందో వాడికి మటుకే చిరునామా అంటూ ఒకటుంటుంది. మిగతా వాళ్ళకు అసలు దాని గురించే తెలీదు. ఇంకా చెప్పాలంటే ఈ కరువు సమయంలో జనాలు ఇళ్ళూ వాకిళ్ళూ భూములూ వదిలేసి వలస వెళ్ళిపోతున్నారు. తామెవరమనేది చెప్పుకోడానికి ఎవ్వరి దగ్గర కూడా ఏ పత్రమూ ఉండడం లేదు.”
“మీ మేస్త్రీలకు తెలిసే అవకాశం లేదా?”
“ఎలా వీలవుతుంది? మేస్త్రీలు ఈ కూలోళ్ళని అంటరాని వాళ్ళ కింద జమకడతారు. వాళ్ళ ఇళ్ళ వైపుకు కూడా వీళ్ళు వెళ్ళరు. వాళ్ళిక్కడికి వచ్చినప్పుడే వాళ్ళతో మాకు పని.”
ఏడెన్ పార్మర్ వైపు తీక్షణంగా చూశాడు. ‘వీడికి ఒంట్లో భయమనేదే లేదు, అనుకున్నాడు’. “అయితే నేనిప్పుడు ఏం చేస్తే బావుంటుంది, మిస్టర్ పార్మర్? చెప్పండి.”
“మీ దగ్గర ఇంత పెద్ద సైన్యం ఉంది. ఇంత పెద్ద దేశాన్ని మీరు పాలిస్తున్నారు. మీ వాళ్ళను నల్లోళ్ళ పట్టణానికి పంపించి వాళ్ళ కోసం బాగా వెతికించొచ్చుగా? కొరడాతో కొట్టడం చూసి మీరు ఆ అన్యాయాన్ని సహించ లేకపోయారనుకుంటా! కానీ నాక్కూడా ఓ మనఃసాక్షి అంటూ ఉంది. నేను కూడా ఈ దేశపు లోతట్టు ప్రాంతాలకు ప్రయాణం చేసినప్పుడు ఒక పిడికెడు అన్నం కోసం వందలాది మంది వెతుక్కోడం, అడుక్కోడం చూశాను. కుళ్ళిన శవాలు రోడ్ల పక్కన గుట్టలు గుట్టలుగా పడుండటం లాంటివి చూడగలిగిన దానికంటే ఎక్కువే చూశాను. అదంతా సహించలేకే నేను వీళ్ళకు రోజుకు అర్ధణా జీతం ఇస్తున్నాను. వీళ్ళకది లక్షలతో సమానం. వీళ్ళు మిగతా చాలా మందికంటే ధనవంతులని మనం గుండెల మీద చెయ్యేసుకుని మరీ చెప్పుకోవచ్చు.”
ఏడెన్ పళ్ళు కొరుక్కుంటూ ‘ముసిలి గుంట నక్క’ అని లోలోపలే కచ్చెగా తిట్టుకున్నాడు. వందేళ్ళనించీ భారతదేశాన్ని గుప్పిట్లో పెట్టుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశపు సహజ వనరులు కొల్లగొట్టడం వల్ల వచ్చిపడ్డ కృత్రిమ కరువు, ఈ దేశంలోని ఇరవై ఐదు శాతం జనాభాను భూమి మీద నించీ తుడిచి పెట్టేసింది. దీనికి ప్రతిఫలంగా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోంచి దేశాధిపత్యం వెళ్ళిపోయి బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళిపడింది. దాంతోటి ఇంకా పెద్ద కరువు వచ్చిపడింది. దేశం మొత్తం ఆకలితో అలమటించడం మొదలై చావులు పెరిగాయి.
“మీరు ఆ కూలీలను చాలా తేలిగ్గా కనిపెట్టొచ్చు, పార్మర్ గారూ!” ఏడెన్ ఎదురు సమాధానం ఇచ్చాడు. “అదే ప్రాంతం నించి వచ్చి వేరే కూలీలు మీ దగ్గర పని చేస్తూంటారు. మీరు గట్టిగా చెప్తే వాళ్ళను తీసుకొచ్చి మీ ముందు నిలబెడతారు. వాళ్ళు రాగానే నా దగ్గరకి పంపించండి. అప్పటిదాకా ఇతను నా కస్టడీలోనే ఉంటాడు.”
పార్మర్‌కు నోటమాట రాలేదు. “అదెలా కుదురుతుంది? అతని మీద ఖచ్చితమైన ఆరోపణలంటూ ఏమీ లేవు కదా?” పార్మర్ అభ్యంతరం చెప్పాడు.
“అవును, సరిగ్గా అదే కారణానికి నేనతన్ని విచారించడానికి తీసుకెళ్తున్నాను. అతన్ని అరెస్ట్ చేస్తున్నానని చెప్పడం లేదు” అని సన్నగా నవ్వుతూ ఏడెన్ పార్మర్ వైపు చూసి కొద్దిగా తలవంచి తన మనుషుల వైపు తిరిగి సైగ చేశాడు. నారాయణన్ వచ్చి నీలమేఘాన్ని పట్టుకుని అతని చేతులకు బేడీలు వేసి ముందుకు తోసాడు. ఏడెన్ అతన్ని అనుసరించాడు.
రోడ్డు మీదికెళ్ళేదాకా ఏడెన్ మనసు నిశ్చలంగా ఉన్న సముద్రంలా ఉంది. రోడ్డు మీదికెక్కగానే అల్లకల్లోలమయ్యింది. ‘అసలు వీడినెందుకు లాక్కెళ్తున్నాను? నా ఆజ్ఞ పాటించనందుకు అక్కడే నిలబెట్టి కొరడా దెబ్బలు తినిపించుండొచ్చు. అందువల్ల నాకేం ఒరుగుతుంది? లేదు, ఆ తృప్తి కూడా మిగలదు. వాడేదో చచ్చి బిగుసుకున్న శవంలా ఆ దెబ్బలు తింటాడు. వాణ్ణి తన్నించిన సంతృప్తి కూడా నాకు మిగలనీడు. వాణ్ణి కింది కులం మనిషి చేత తాకిస్తేనే నేను గెలిచినట్టు. లేదంటే కనీసం వాణ్ణి కుంగదీసి కన్నీళ్ళు పెట్టుకునేలా చెయ్యాలి, అప్పుడే కొద్దో గొప్పో నేను గెలిచినట్టు. అయినా వాడు నాకలాంటి అవకాశం చేతికిచ్చేట్టు లేడు.
‘అవును, వాడు నోరు విప్పే ప్రశ్న లేదు. వాడి పిచ్చి నమ్మకాల కోసం ఎంత హింసనైనా పంటి బిగువున భరించి ప్రాణాలు కావాలన్నా ప్రశాంతంగా ఇచ్చేస్తాడు. వీడ్ని ఒక ‘సెయింట్’ అని అనుకోవచ్చా? అవును, తేడా ఏముంది? ఒక ‘సెయింట్’ నమ్మకాలను నేను అంగీకరిస్తే అతని త్యాగం నాకెంతో గొప్ప అనిపిస్తుంది. నా కళ్ళెదురుగా ఉన్న ఈ మనిషి మానవ అస్తిత్వానికే ప్రమాదకరమైన తన మూర్ఖపు విశ్వాసాల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టడానికైనా తయారుగా ఉన్నాడు. కానీ వీడి మానసిక స్థితికీ ఒక సెయింట్ కుండే మానసిక స్థితికి పెద్ద తేడా అంటూ ఏమీ లేదు. ఇదెంత అర్థరహితంగా ఉందీ? కానీ ఈ ప్రపంచం అంతా ఇలానే నడుస్తుంది. దూరాన ఎక్కడో ఉన్న ఒక పరాయి దేశం మీద పడి అక్కడి ప్రజలను బానిసలుగా చేసుకుని వాళ్ళను ఆకలి చావులు చచ్చేలా చేసి అందుకోసం యుద్ధభూమిలో తన ప్రాణాలు సమర్పించి కేవలం కొన్ని వ్యాపార సంస్థలకు దుర్మార్గమైన లాభాలు తెచ్చిపెట్టే బ్రిటిష్ సైనికుడికి కూడా నూరి పోసేదదే – ‘నీ చావు ఒక గొప్ప త్యాగం!’ తాను ప్రదర్శించబోయే అత్యద్భుతమైన ధైర్యసాహసాలు, తన పూర్వీకులకు, తమ వంశానికి గొప్ప పేరు తెచ్చిపెడతాయనే నమ్మకంతో వాడు తుపాకీ పట్టుకుని బయలుదేరతాడు. పూర్వపు రోజుల్లో తమ పరువు ప్రతిష్టల కోసం రాజ్యం కోసం కత్తులెత్తుకుని పోరాడిన గొప్ప యోధుల మనస్తత్వమూ వీడి మనస్తత్వమూ ఒకటేనా? లేదు, అస్సలు పోలికే లేదు. అలా పోల్చటం హాస్యాస్పదం. ఐర్లాండ్ విముక్తి కోసం పోరాడే విప్లవ కారుడు అతన్ని చంపే బ్రిటిష్ సైనికుడు ఒకే రకమైన దృక్పథంతో పోరాడతారు. తుపాకీకి నా వాళ్ళు పరాయి వాళ్ళు అన్న తేడా ఉండదు. మనుషుల్ని చివరగా తనలో కలుపుకునే మట్టికి కూడా ఆ తేడాలు ఉండవు.
ఏడెన్ నీలమేఘానికేసి చూశాడు. నీలమేఘం నిటారుగా ఠీవిగా నిలబడి ఉన్నాడు. ఆ బిగుసుకుపోయిన ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడుతున్న మొండితనం! ఎవడినైతే అంటరానివాడనీ పశువుల కంటే హీనుడనీ వీడు అసహ్యించుకుంటున్నాడో ఆ మనిషి కూడా అచ్చం వీడిలానే ఉన్నాడు. వీడితో పాటూ ఒకే కడుపు పంచుకుని పుట్టిన బిడ్డలా ఉన్నాడా మనిషి. అయితే వీడు ఆకలితో చచ్చిపోతున్నా ఆ మనిషితో ఒక్క ముద్ద పంచుకోడానికి కూడా ఇష్టపడడు. ‘ఎంత వెర్రి తనం? ప్రపంచమంతా పన్నెండు సుదీర్ఘమైన సంవత్సరాలు తిరిగిన తర్వాత తను తెలుసుకున్న సత్యం; మనిషంత వెఱ్ఱివాడు ఇంకొకడు లేడు! అత్యంత అద్భుతమైన మేధా శక్తినీ హద్దులు లేని దుర్మార్గాన్నీ తనలో దాచుకుని ఏ తర్కానికీ లొంగని మానవుడనే ఈ జీవి భూప్రపంచమంతా విస్తరించడానికి కారణం ఏమై ఉంటుంది? అసలు దేవుడనే వాడి ఉనికికి మూలం ఈ జీవి అస్థిత్వానికి ఒక అర్థం అంటూ కల్పించడానికేనా?’
ఆఫీసు దగ్గర పడగానే ఈ ఆలోచనలన్నిటినించి విముక్తి పొందాడు ఏడెన్. కొద్దిసేపు తానెక్కడికొచ్చి పడ్డాడో అర్థం కాలేదు. నారాయణన్ దగ్గరకొచ్చి నిల్చున్న తర్వాత కళ్ళు తెరిచి అటూ ఇటూ చూశాడు. తెలీని ఉద్విగ్నత ఏదో లోపల్నించి పొంగుకొచ్చింది. తనకేమీ తెలీని కొత్త ప్రపంచంలో తనకస్సలు పరిచయం లేని వింత మనుషుల గుంపు మధ్యలో నిలబడి ఉన్నట్టు అనిపించింది.
ఆ క్షణంలో అతనికి చెయ్యాలనిపించిన ఒకే ఒక పని ఉన్న పనులన్నిటినీ తరవాతెప్పటికో వాయిదా వేయడం. గుర్రం దిగుతూ “అతన్ని లాకప్‌లో వెయ్యండి” అంటూ ఆదేశించాడు. తన గదిలోకి వెళ్ళి కుర్చీలో కూలబడ్డాడు. మొట్టమొదటి సారి పంఖా నించి వస్తున్న గాలి హాయిగా అనిపించింది. నెమ్మదిగా సర్దుకుని పంఖా వంకే చూస్తూ కూర్చుండిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత అతని చేయి కాలింగ్ బెల్ మీదికి వెళ్ళింది. ప్యూను వచ్చి వంగి ముందు నిలబడ్డాడు. విస్కీ తీసుకురమ్మని పురమాయించాడు. అతను వెనక్కి తిరగగానే వీపు మీద ఎవరో పదునైన బల్లెం గుచ్చినట్టు “సామ్!” అంటూ కేక పెట్టాడు. గొంతుని ఎంత అదుపులో పెట్టుకోవాలనుకున్నా అది కీచుమనే శబ్దంతో బయటికొచ్చింది. “ఐస్ అవసరంలేదు.”
“ఎస్ సార్!” అన్నాడు సామ్యూల్. మళ్ళీ వంగి గది బయటకెళ్ళాడు. ‘మొదటి సారి ఇలా వెచ్చనైన విస్కీ తాగడం’ గ్లాసు పెదవులకు తగిలిస్తూ అనుకున్నాడు ఏడెన్. ఒంట్లోని ప్రతి అణువునించీ ఆవిర్లొస్తున్నట్టు ఉంది. గాలంటూ లేని సముద్రంలో నావ నెమ్మదించినట్టుగా అతని శరీరం మనసు కుదురుకున్నాయి.
ఉన్నట్టుండి పైకెత్తిన ఖడ్గం అంచు సూర్యుడి వెలుగులో మెరిసి కళ్ళను కమ్మినట్టుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతని దగ్గరున్న ప్రతి సిపాయి కళ్ళలో ఒకే రకమైన భావోద్వేగం కనపడుతుంది. నీలమేఘం కళ్ళల్లో కూడా అదే తను చూసింది. విరిగిన సముద్రపు గవ్వల్లా ఉండే కళ్ళు. అవన్నీ ఒకే భాష మాట్లాడతాయి. అతనిలో భయం ముప్పిరిగొంది. బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తూ 1857 సిపాయి తిరుగుబాటు గురించిన జ్ఞాపకాలను మనసులో మెదలకుండా తుడిచేయటం అసాధ్యం. తెల్లవాళ్ళను వీధుల్లోకి లాగి తలలు నరికారు. శవాలని కుప్పలకింద పేర్చారు. ఆఖరికి ఆడవాళ్ళ, పిల్లల శవాలతో నేల బావులు పొంగి పొర్లాయి.
“నా మాటలు జాగర్తగా గుర్తుపెట్టుకో, ఏడెన్. ఈ ఘోరం జరగడం వల్ల కలిగిన భీకర పరిణామం ఏదన్నా ఉందంటే, అది మనందరిలో కలిగిన భయం. మనం యుద్ధం చేసి ఈ దేశాన్ని గెలుచుకున్నాం. మన చుట్టూ అందరూ శత్రువులే అన్న విషయం మనకందరికీ తెల్సు. కానీ సిపాయి తిరుగుబాటు మనకో కొత్త నిజం తెలిసేలా చేసింది. ఈ దేశంలో మనం అనుభవిస్తున్న అధికారం మనకు విశ్వాసపాత్రులుగా ఉన్న ఈ నల్లవాళ్ళు వల్ల మన చేతిలోకి వచ్చింది. వాళ్ళ భయం మీద, స్వార్థం మీద, అనైతిక చర్యల మీద మన రాజ్యానికి మనం పునాదులు వేశాం. కానీ పునాదులకు తవ్విన గోతుల్లో కప్పెడిపోయి దాగున్న సత్యం ఒకటుంది. అదేదో నువ్వూహించగలవా?” రెండు పెగ్గులు వేసిన తర్వాత పదవీ విరమణ చేసిన కెప్టెన్ జె.ఏ. రైట్ మునుపెప్పుడో కలకత్తా ఇంగ్లీష్ క్లబ్‌లో కలిసినప్పుడు చెప్పాడు.
“ద్వేషం… మనమంటే ఈ నల్లవాళ్ళకుండే ద్వేషం… వాళ్ళ అంతరాంతరాల్లో, వాళ్ళ కళ్ళ వెనక మనమంటే దాగుండే ద్వేషం. అదొక కాలవిషంలా మన ఉనికి ఈ భూమ్మీదే లేకుండా చేయగలదు. సిపాయిల తిరుగుబాటులో మనం చూసిందదే. వాళ్ళు మన ఆడవాళ్ళ, పిల్లల గొంతులు కోసి రోడ్ల మీద పడేసినప్పుడు, వాళ్ళ బూట్లు మన మొహాల మీది గాయాల రక్తంతో తడిసినప్పుడు కూడా వాళ్ళకు మన మీద ఇంత ద్వేషం ఉందని మన వాళ్ళు నమ్మలేదు. వీధి కుక్కల్లాగా తోకలూపుకుంటూ మన బూట్లు నాకే వాళ్ళు, మనం చెప్తే కత్తులు దూసి యుద్ధాలు చేసే వాళ్ళు, ఇలాంటి పనికి ఒడిగడతారని అనుకోలేదు. మన వాళ్ళు అదేదో చెడ్డ కలలాగా పక్కకు తోసేశారు. ఏడెన్! ఆ శవాలు విసిరేసున్న వీధులన్నీ నేను తిరిగాను. లోపల గూడుకట్టిన అపనమ్మకం, బాగా తెరుచుకుని ఉన్న శవాల కళ్ళలోకొచ్చి గట్టిపడ్డట్టు అనిపించింది.
“ఆ రోజు నించీ మన వాళ్ళలో ఏదో మార్పు వచ్చింది. ఈ నల్లవాళ్ళు అదింకా గమనించకపోవడం మన అదృష్టం. అప్పటినించి మనమేం చేసినా అది భయంలోంచి పుట్టిందే. ఈ నల్ల జాతిని మాలిమి చేసుకోవాలని చూస్తున్నాం. వాళ్ళ కోపం మన మీదకు రాకుండా వేరే పక్కకు మళ్ళించి దాస్తున్నాం. అదే భయం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వాన్ని రద్దుచేసి అధికారాన్ని బ్రిటిష్ రాణి తన చేతుల్లోకి తీసుకునేలా చేసింది. మన భయాన్ని వీళ్ళ కళ్ళ పడకుండా దాచగలిగినన్నాళ్ళు మనం ఈ దేశాన్ని పాలించగలం. మన భయాన్ని వీళ్ళల్లో ఎవరైనా ఒక్కరైనా గుర్తించటం అంటూ జరిగితే మన పాలనకు అంతటితో అంతం మొదలౌతుంది. మన పైపూత పనులను ఈ దేశం ఎప్పుడైతే పట్టించుకోటం మానేస్తుందో ఆ రోజు మనం సర్వనాశనం అవుతాం.
పూర్తిగా కైపెక్కి ఎర్రబారిన కళ్ళతో కొనసాగించాడు కెప్టెన్. “విధ్వంసం! నీ జీవితం, నా జీవితం, మన పిల్లల జీవితం గొప్ప విధ్వంసానికి గురి కాబోతున్నాయి. ఏనుగు ఎప్పుడూ తనకు జరిగిన కీడును మర్చిపోదు. అసలీ నల్ల ఏనుగు మనసులో ఏముందో మనకెవరికీ తెలీదు.” ఈ దేశం గురించి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా, ‘ఏనుగు’ ఒక ప్రతీక అవుతుంది. అది మనిషికెందుకు తలవంచుతుందోనన్న ఆశ్చర్యం, తెల్లవాడిని వీడి ఎప్పటికీ పోదు.
ఏడెన్ నీలమేఘాన్ని పొద్దున్నే వదిలేయాలనే నిర్ణయానికి వచ్చాడు; ‘తను చెయ్యగలిగింది ఏమీ లేదు. ఏనుగును నువ్వు హింసించొచ్చు, దాని మీద పడి దుర్భాషలాడొచ్చు కానీ నువ్వెంత దూరం వెళ్ళగలవనేందుకు పరిమితులు నిర్ణయించేది మాత్రం ఏనుగే!’
![]()

జెయమోహన్ తమిళ నవల ‘తెల్ల ఏనుగు’ ను తెలుగులోకి అనువదించిన అవినేని భాస్కర్, ఎస్ కుమార్ లు తొలి రెండు అధ్యాయాలను కథావసుధ పాఠకులకోసం ప్రచురణకు ముందే అందించారు. వారికి, ఆ పుస్తకాన్ని ప్రచురించిన ఛాయ పబ్లికేషన్స్ వారికి కృతజ్ఞతలు. ఆగస్టు 10వ తేదీన బెంగుళూరు బుక్ బ్రహ్మ ఉత్సవంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. తొలి రెండు భాగాలు చదివి ఆ పుస్తకం మీద ఆసక్తి కలిగిన పాఠకులు విడుదలైన తర్వాత పుస్తకం కొనుక్కోవచ్చు. తెల్లఏనుగు ను కొనదలచుకున్న వారు సంప్రదించండి : +91 98801 20221
వృత్తి రీత్యా మెకానికల్ ఇంజనీర్. తెలుగు ఆంగ్ల కథా సాహిత్యం పై ప్రత్యేకమైన ఆసక్తి. హర్షణీయం పాడ్కాస్ట్ నిర్వాహకుల్లో ఒకరు.
హర్షణీయం పాడ్కాస్ట్ లింక్ – https://bit.ly/harshspot




Discussion about this post