మూలం : ఎడ్గార్ అలెన్ పోయే. (Alone -by Edgar Allan Poe)
అనుసృజన : గీతాంజలి
నా చిన్నప్పటినుంచీ నేను ఇతరుల లాగా లేనే లేను!
వాళ్ళు చూసింది నేను చూడలేదు!
వాళ్ళు స్వంతం చేసుకుంది నేను పొందలేదు!
నా చుట్టూ ఉన్న సాధారణమైన ప్రవాహం నుంచి కూడా
నేను నా ఆకాంక్షలను తీసుకోలేకపోయాను!
ఒకే వేరు నుంచి కనీసం
నా విషాద దుఃఖాలను పొందలేక పోయాను!
సంతోషానందాలకి నా హృదయం
ఒకే పిలుపుతో, స్వరంతో మేల్కొనలేదు!

నేను చేసింది ఏంటంటే..
నేను ఒక్కడినే, అవును ఒఖడినే
అంతటినీ, సమస్తాన్నీ ఒంటరిగా ప్రేమించాను!

ఇక అప్పుడు నా బాల్యంలో,
ఒకానొక ప్రాతః కాలంలో
సరిగ్గా సూర్యోదయం ముందు…
అత్యంత తీవ్రమైన తుఫాను లాంటి జీవితం
నా ముందుకి వచ్చి, నన్ను గుంజుకు పోయి
ఒక చిత్రంలా స్థిరంగా నిలుచోబెట్టింది!
జీవితంలోని మంచి చెడులలోని అగాధాల లోతులనుంచి,
నన్ను ఈ రోజు వరకూ కట్టి పడేసే ఒక రహస్యం నన్ను అలా
వేగంగా పారే సెలయేటి వడినుంచి,
చిన్న నీటి ఊట నుంచి,
ఇంకా ఎర్రని కొండ శిఖరం నుంచి,
నా చుట్టూ తిరిగే సూర్యుణ్ణించి,
నన్ను కదలకుండా నిలబెట్టింది!

అప్పుడు అందమైన శరద్ ఋతువులో కూడా
సూర్యుని బంగారు రంగు కాంతి
నన్ను గుండ్రంగా ఉండ చుట్టినట్లు అనిపించినప్పుడు
ఆకాశంలో నా పక్కనుంచే వెళ్ళినట్లున్న
మెరుపుల, ఉరుముల కాంతుల మధ్య నుంచి,
నేను ఒంటరిగానే వెళ్ళాను.
(ఆకాశంలో మిగిలిన స్వర్గం అంతా నీలి రంగులో ఉన్నప్పటి సందర్భం అది!)
అయినా కానీ,
మామూలు మేఘం దెయ్యపు రూపం తీసుకుని
నన్ను భయపెట్టినప్పుడు,
నేను వాటి మధ్యలోనుంచే ఒఖడినే,
అవును మరి ఒక్కడినే
వొంటరిగా ప్రయాణం చేశాను.






Discussion about this post