• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

జోర్డాన్ కథ : నాకు తెలియని మృతదేహం

డా. ఎ.యం. అయోధ్యారెడ్డి by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
December 11, 2025
in అనువాద కథలు
0
జోర్డాన్ కథ : నాకు తెలియని మృతదేహం

మూలకథ: ఇలియాస్ ఫార్కో (జోర్డాన్)
స్వేచ్ఛానువాదం: డా. ఎ.యం.అయోధ్యారెడ్డి

అతడు మోచేత్తో నా పక్కటెముకల మీద బలంగా పొడిచాడు.

బాధతో కెవ్వున అరుస్తూ తల గోడవైపు తిప్పుతుంటే పిడికిలి బిగించి ముఖం మీద కొట్టాడు.

ఆ దెబ్బకి కళ్లు మూతలు పడుతుంటే బాధ భరించలేక గట్టిగా కేకలు పెట్టాను. నా అరుపుల మధ్య అతడు హేళనగా

“ఏరా భయపడ్డావా?” అని అనడం వినిపించింది. నిజంగానే, భయంతో బిక్కచచ్చిపోయాను.

ఇంతలో వాళ్లు నన్ను వొదిలి రెండడుగులు వెనక్కి జరగ్గానే మరోక్షణంలో జరుగబోయేది గ్రహించాను. నా మోకాళ్లు హఠాత్తుగా కంపించినయి. పొత్తికడుపు కింద మంచుగడ్డలు పెట్టి నొక్కుతున్న అనుభూతి కలిగింది.

ఎంత నిలదొక్కుకున్నా సాధ్యపడక నేలమీద కూలిపోయాను. నా ముఖం వాళ్ళ బూట్లపైన సాగిలపడ్డది. తల పైకెత్తలేక అట్లాగే ఉండిపోయా. మంచులో కూరుకుపోయిన స్థితి ఆవహించింది. ఆ పరిస్థితి నియంత్రణలేని విధంగా నా దేహంలో మిగిలిన భాగాలకు విస్తరిస్తుండటం మెదడుకు తెలుస్తున్నది. చావు ఎప్పుడైనా చల్లగా వొస్తుందంటారు. గాలిలో పండుటాకు మాదిరి వొణికిపోతున్నప్పుడు నాకది నిజమే అనిపించింది.

ఈ యోచనతో భయం రెట్టింపయింది. జరిగిపోయిన పరిణామాలను మస్తిష్కం ఒక దశవరకూ నెమరు వేయగలదు. అయితే వాటి ఖచ్చితమైన క్రమాన్ని గుర్తుంచుకోవడం అంత సులభం కాదనిపించింది. జ్ఞాపకాల గడుల మధ్య ఖాళీలు అనివార్యం. ఆ కారణంతోనే వాళ్లచేత దెబ్బలు తిన్నాను. ఇంకా మరెన్నో దెబ్బలూ, చిత్రహింసలూ తప్పవేమో.

“ఏందిరా.. నొప్పిగా ఉందా? ఫరవాలేదు, ఈ నొప్పి నీ జ్ఞాపకశక్తిని బయటికి తీస్తుందిలే” ఒకడు నన్ను నిర్దయగా కొడుతున్నప్పుడు రెండోవాడు అనడం విన్నాను.

ఆ స్థితిలో నిజంగానే నా జ్ఞాపకశక్తి మందగించింది. ఏదీ సరిగా గుర్తురావడం లేదు.

“తొందరపడకు, పోయిన నీ జ్ఞాపకశక్తి తిరిగొస్తుంది. అట్లా మేము చేస్తాంగా” దగ్గర్లో మరో గొంతు కరుకుగా వినిపించింది.

గదిలో ఎందరున్నారో తెలియడం లేదు. అలాగే నిస్సహాయంగా తలవాల్చుకుని ఉండిపోయాను. మెల్లగా ఎడమచేత్తో నోట్లోంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకున్నా.

నా జ్ఞాపకశక్తి విఫలం కావడం ఇది ఎన్నోసారి? బహుశా నాలుగోసారి.. కాదు, అయిదోసారి కావొచ్చు.

మెదడును కమ్ముకున్న ఆందోళనలో అంతకు ముందు జరిగిందేదీ గుర్తురావడం లేదు. గుర్తురావడం లేదా.. రాకుండా చేశారా..?

ఏమో.. బహుశా ఏదైనా కావచ్చు. ఏదేమైనా దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలనే కోరిక లేదు.

అసలు ఇదంతా ఎప్పుడు మొదలైంది? ఏరోజు జరిగింది..? ఆ సమయానికి నేనెక్కడున్నాను?

రేడియోలో ఆరుగంటల వార్తలు చదివి చాలాసేపయింది. మత్తుగా కళ్ళు తెరిచి చూస్తే ఆ ప్రదేశం అంతా మారినట్టు కనిపించింది. వస్తువుల ఆకారం సూచాయగా కనిపించినా వాటిల్లో పదార్ధం లేదనిపించింది. ఒక సమగ్రత లేకుండా కేవలం ఆకృతులు. బహుశా చీకటి వాటి ద్రవ్యరాశిని కబళించివేసి కనీస నీడలు కూడా మిగల్చకుండా డొల్లలుగా మార్చేసింది. కళ్ళు మూసుకుని ఆ గదినీ, గదిలోని వస్తువుల్నీ గ్రహించేందుకు నా మానసిక శక్తిని సంసిద్ధం చేసుకుంటున్నా.

ఎదురుగా గోడపైన మా అమ్మ చిత్రం. నేను పుట్టాక తనకోసం స్వయంగా కుట్టుకున్న పొడవాటి చేతుల గౌను ధరించి ఉన్నది.

నేనీ లోకంలో కళ్ళు తెరిచిన సందర్భాన్ని గురించి ప్రస్తావిస్తూ, తనకు ప్రసవం సరిగా జరిగి నేను క్షేమంగా పుడతానో లేదోనని, ఆ తర్వాత తనకు తిరిగి తల్లినయ్యే భాగ్యం ఉంటుందో లేదోని ఆమె ఆందోళనతో విలపించినట్టు చెప్పింది. ఫోటోలో ఆమె కళ్ళు అందరిలాగే ఎదురుగా ఫోటోగ్రాఫరునే సూటిగా చూస్తున్నయి. ఆమె జుట్టు నల్లజాతి స్త్రీల మాదిరి సంక్లిష్టమైన జడలు జడలుగా చుట్టబడి ఉంటుంది. ఆమె అందగత్తె కాదు. కానీ ఆమెలో సున్నితత్వం, అనిర్వచనీయమైన మృదుత్వం ఎప్పుడూ వెలుతురులా పరుచుకొని వుండేవి. ఆమె మానసిక సౌందర్యం దేహ సౌందర్యాన్ని మించిపోయి కనిపించేది.

కిటికీ మూసివున్నది. గదిలో అదోరకమైన ముక్కవాసనతో గాలి చాలా దగ్గరైనట్టు అనిపించింది. నేనలాంటి గాలికే అలవాటుపడి

పెరిగినప్పటికీ, ఇప్పుడీ గాలి తాకిడికి ఆక్షణమే నిద్రలోంచి మేల్కొన్నట్టు అనిపించింది. ఈ గాలి ఎప్పటికంటే ఘాటుగానూ, హింసాత్మకంగానూ ఉంది. నేను లేచివెళ్లి కిటికీ తెరవడం, అంతలోనే బయటి నుంచి తలుపు తట్టిన ధ్వని నాకు బాగానే గుర్తుంది.

మా ఎదురింట్లో ఉండే ముఖ్తార్ కనిపించాడు. అతని వెనుక నిలబడివున్న ఇద్దరు వ్యక్తులు నా ముఖంలోకి గుచ్చిగుచ్చి చూశారు.

“అతడు నీకు తెలుసు కదూ?” ఇద్దరు అపరిచితుల్లో ఒకరు అడిగారు.

రెండో అతను తలవూపి, ముందుగా గదిలో అడుగుపెట్టాడు. అంతవరకే – నా మెదడు గదిలో మరొక ఖాళీ ఏర్పడింది. ఆపైన క్రమంగా అసలేమీలేని శూన్యం నెలకొంది. అదే ప్రశ్న పునరావృతమైంది “అతడు నీకు తెలుసా?” ఇద్దరిలో నాయకుడు అడిగాడు.

తెలియదు అన్నట్టు తల అడ్డంగా ఊపాను.

“ఇప్పుడు గుర్తుతెచ్చుకో…” అతడు గద్దించాడు.

ఎంతో ప్రయత్నించాను. ప్రయోజనం లేకపోయింది. అసలు వాళ్లు యిక్కడికెందుకొచ్చారు..? ఒక వ్యక్తి మృతదేహాన్ని బట్టలుచుట్టి ముసుగులో ఇక్కడికెందుకు తెచ్చారు? అట్లా టేబుల్ మీద ఎందుకుంచారు?

ఆ మరణించిన వ్యక్తితో నాకు పరిచయం లేదు. అసలు నాతల్లి తప్ప చనిపోయిన మనుషులేవరినీ ఇంతవరకు నేను చూడలేదు. చివరికి నా తండ్రిని కూడా. నేను కళ్లు తెరవకముందే.. తండ్రి అంటే అర్థం తెలియక ముందే ఆయన వెళ్లిపోయాడు.

“నీ పేరేమిటి?” జరిగేదంతా రికార్డు చేస్తున్న వ్యక్తి అడిగాడు.

నాపేరు చెప్పాను. చెపుతుంటే నాపేరు నాకే కొత్తగా, వింతగా వినిపించి ఆశ్చర్యపోయాను. నా కంటికి కనిపించని, పరిశీలనకు అందని దేనిగురించైనా అర్థంచేసుకోవాలనే కోరిక నాకెప్పుడూ లేదు. అలాగే మెదడు గ్రహించలేని ప్రశ్నలకు జవాబులు చెప్పే శక్తి నాకు లేదు. నేను ఊహల మీద ఆధారపడను. ప్రశ్నలు మాత్రమే ఇబ్బందులకు దారితీస్తాయని నాతల్లి నాకు చెప్పేది.

అయితే వాళ్ల ప్రశ్నలు తేడాగా ఉన్నయి. వారి ప్రశ్నలు మరిన్ని ప్రశ్నలకు దారితీస్తున్నయి.

“నీ వయసు?” రికార్డు చేస్తున్న వ్యక్తి అడిగాడు. నేను చెప్పాను.

“వృత్తి?” మరో ప్రశ్న. దీనికీ సమాధానం చెప్పాను.

“వైవాహిక స్థితి?”

అతని ప్రశ్న అర్థం కాలేదు “ఏమంటున్నారు?” అతన్ని మళ్ళీ చెప్పమని అడిగాను.

“ఒంటరిగా ఉన్నావా? లేక వివాహమైందా?” కోపంగా అరిచాడు.

శాంతించమన్నట్టు వాళ్ల నాయకుడు చేత్తో సైగలు చేశాడు. ప్రశాంతంగా పని పూర్తిచేయమని చెపుతున్నట్టు అతని సైగల ద్వారా నాకు అర్థమైంది. అతను సానుభూతి చూపినట్టు భావించి మనసులోనే ధన్యవాదాలు తెలిపాను. ప్రశ్నించే వ్యక్తి నావైపు గుర్రుగా చూశాడు.

“నాకు పెళ్ళికాలేదు. నేను ఒంటరినే” నా సమాధానం విని రికార్డు చేస్తున్నవాడు ఆగిపోవడం గమనించాను.

“మరైతే ఎందుకు పెళ్లిచేసుకోలేదు?” అడిగాడు నాయకుడు.

గదిలో వెలుతురు సరిగా లేదు. అతని ముఖం స్పష్టంగా కనిపించలేదు. కానీ వికారమైన అతని కరకు గొంతు బాణంలా దూసుకొచ్చి గుచ్చుకుంది. అతని ప్రశ్న నన్ను అటకాయించింది. జవాబు చెప్పేందుకు సంకోచించాను. నిశ్శబ్దం పెరుగుతూ అసౌకర్యంగా మారడంతో నేను మరింత ఆందోళనకు గురయ్యాను. పెళ్లిచేసుకోక పోవడానికి ఏ కారణం చెప్పాలా అని ఆలోచిస్తున్నా. కానీ ఏదీ తోచలేదు. ఎందుకంటే నేనెప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. అందువల్లనే కారణం తోచక సమాధానం చెప్పలేదు.

హఠాత్తుగా నా కళ్ల ముందు మెరుపు మెరిసినట్టయింది. అతడు బూటు కాలెత్తి బలంగా తన్నాడు. నొప్పి మెదడుకు తెలిసేలోగానే విసురుగా వెళ్లి దూరంగా పడ్డాను. బరువైన కుర్చీ ఒకటి నామీద పడింది. దాని బరువుతో నా మోకాళ్లు నేలకు గుద్దుకున్నయి. నుదురు గ్రానైట్ రాయికి తగిలింది.

దెబ్బకి మా అమ్మ ముఖం కళ్ల ముందు కనిపించింది. చేత్తో నా నుదుటిపైన కారుతున్న రక్తాన్ని తుడుచుకునే బదులు, తల్లి బతికివున్నప్పుడు తరచూ చెపుతూవుండే ఆమె నెరవేరని కోరికను నాకు గుర్తుచేసింది. ఆమె అట్లా చెపుతూ తన చిట్టచివరి దుఃఖానికి నేనే కారణమని ఆరోపించింది కూడా.

లేవలేక నేలపైన అట్లాగే పడివుంటే ఒకడు నామీద కేకలేశాడు

“రేయ్.. బాస్ నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు” అన్నాడు.

ఆ గొంతెవరిదని చిన్నగా తలతిప్పి చూశాను. ముసుగు కప్పిన శవాన్ని పడుకోబెట్టిన బల్ల చివరన కూర్చునివున్నాడు.

“నాపెళ్ళి నా ఇష్టం. అది వ్యక్తిగత విషయం” అన్నాను మొండిగా, కాదు బలహీనంగా.

నేను గొణుక్కోవడం నాకు మాత్రమే వినిపించింది.

అతడు పైకప్పు నుంచి దూకినట్టు హఠాత్తుగా నామీదకొచ్చాడు. జుట్టు పట్టుకొని తలను గోడకేసి కొట్టాడు. గోడ బండరాయిలా ఉన్నప్పటికీ నా తలకాయ అంతకన్నా గట్టిదనుకుంటా. ఎక్కువ రక్తస్రావం కనిపించలేదు. కళ్లు మాత్రం గిర్రున తిరిగినయి. మోకాళ్ళను వొంచి ఛాతికి అదుముకుంటూ ముడుచుకు పోయాను.

బాధకు వయసుతో నిమిత్తం లేదు. నలభయేళ్లు దాటిన నాగొంతు నిండా దుఃఖం. కళ్ళనుంచి జారుతున్న కన్నీళ్లతో పోరాడుతున్నాను.

నన్ను వెనుక నుంచి పట్టుకున్న చేతుల్ని మోచేత్తో నెట్టడానికి ప్రయత్నించాను. కాని వెనకున్న పట్టు బలిష్టంగా ఉంది. మరో క్షణంలో గాల్లోకి విసిరేయబడ్డాను. వెళ్లి మరోసారి నేలను తాకాను. ఇదిచూసి టేబుల్ అంచున కూర్చున్న వ్యక్తి బిగ్గరగా నవ్వసాగాడు.

పడినచోట నేల చల్లగా వున్నది. ఇసుకమూటలా అట్లాగే ఉండిపోయి అతని వికటహాసం విన్నాను. తర్వాత కొన్నిక్షణాలపాటు అక్కడ గూడుకట్టిన భయానక నిశ్శబ్దం ఒక సాధారణ ప్రశ్నతో విచ్ఛిన్నమైంది.

ప్రశ్న మామూలుదే అయినా తుపాకి గుండులా తగిలి కంపింప జేసింది.

“దొంగ నాకొడుకా… ఇప్పుడు నువ్వో విరిచిన కట్టెల మోపు అయ్యావు, కాదంటావా?”

నేను మాట్లాడబోయాను. కానీ పెదాలు అదురుతూ నాలుక తడబడింది. ముప్పిరిగొన్న దుఃఖం భారమైన నా ఊపిరిలో కలిసి అర్థరహిత, అసంబద్ధ ధ్వని శకలాలు బయటకి వస్తున్నయి. ఆ స్థితిలో… లేదా బహుశా ఆ దశకు ఒకటి రెండు క్షణాల ముందు కావొచ్చు, సరిగా చెప్పలేను, ఒక ప్రశ్న కటువుగా దూసుకొచ్చింది.

“నీకు నలభయేళ్ళు దాటినయి. ఇంకా ఆవివాహితునిగా ఎందుకున్నావు?”

“తెలియదు, బహుశా నాకు స్త్రీ అవసరం లేనందువల్ల కావొచ్చు” చెప్పాను.

అతడు అర్థంలేని మరో ప్రశ్న వేశాడు:

“ఒరే.. నీ అభిమాన సినిమా నటులెవరో చెప్పు. తోఫిక్ అల్-దఖన్? లేదా మహమూద్ అల్-మెలిగుయ్..?”

“వాళ్లు కాకుంటే ఫరీద్ అల్- అట్రాష్ లేక ఇస్మాయిల్ యాసిన్ లేక షుకోకూ?” రికార్డింగ్ చేసే వ్యక్తి అన్నాడు.

“తొందరగా చెప్పు.. ఇస్మాయిల్ యాసిన్ లేదా షుకోకూ..?”

ఇంతలో మూడో వ్యక్తి వెనుక నుంచి నా వీపులో తన్నాడు. బండ బూతులు తిడుతూ మెడమీద రెండుసార్లు బలంగా గుద్దాడు.

“చెప్పరా పనికిమాలిన వెధవా!” అదేపనిగా పొట్టలో పిడికిలితో పొడిచాడు. బాధ భరించలేక పెద్దగా అరుస్తున్నాను.

“పోనీ నీ అభిమాన నటీమణి ఎవరు? నదియా లుట్ఫీ లేక సుయాద్ హోస్నీ? అయినా నీకీ వయసులో ఇంతగొప్ప అందగత్తెలు కావాలట్రా?” అంటూ పైకప్పు పడిపోయేలా వికటాట్టహాసం చేశాడు.

తర్వాత వాళ్లు బల్లమీది మృతదేహాన్ని చూడమని నన్ను ఆదేశించారు. బల్ల దగ్గరకు బలవంతంగా ఈడ్చుకువెళ్లారు. శవం మీద కప్పివున్న ముసుగు పూర్తిగా తొలగించారు. తల పూర్తిగా ఎత్తకుండా మృతుని అంత్యభాగాలను చూడగలిగాను.

అతని బనియన్, అండర్వేర్ చాలా మురికిగా, రక్తంతో తడిసి ఉన్నయి. ముఖ్యంగా ఛాతిచుట్టూ, బొడ్డు కింది భాగం, మెడ, రెండు భుజాల

మీదా నెత్తురు స్రవించి గడ్డలు కట్టి ఉన్నది.

నేను ఏమీ మాట్లాడకపోవడంతో బకెట్ ఎత్తి విసురుగా నీళ్ళు నా నెత్తిమీద గుమ్మరించారు. నీళ్ళు జుట్టులోంచి ముఖం మీదకు జారుతూ అక్కణ్ణుంచి రక్తం మరకలున్న నా తెల్లచొక్కాను తడుపుతూ మరకల్ని మరింత విశాలం చేశాయి. ముఖంమీద నీటిని తుడుచుకున్నా. చచ్చినమనిషి ధరించిన అండర్వేర్ తెల్లదే కావొచ్చు, కానీ చెమట వల్లా దుమ్ము వల్లా పసుపుపచ్చ రంగుకు దరిదాపుల్లో ఉన్నది.

వాళ్ల ఆజ్ఞ మేరకు శవాన్ని జాగ్రత్తగా పరిశీలించాను.

“ఇప్పటికైనా గుర్తొచ్చిందా వీడెవరో..?”

నాకు అతడు తెలియదని ఖచ్చితమైన నిర్ణయానికొచ్చాను. అతనేకాదు, నా జీవితంలో మృతిచెందిన వ్యక్తుల భౌతికకాయాలతో నాకు అసలు పరిచయం లేదు. ఇంతవరకు ఎవరి శవాలను చూసివుండలేదు, ఒక్క నా తల్లి మృతదేహాన్ని తప్ప. నిజం చెప్పాలంటే మరణించిన వ్యక్తిని చూడటం ఇదే మొదటిసారి. అతనెవరో తెలియదని మళ్ళీ తలఅడ్డం ఊపాను.

“చివరిసారి చెపుతున్నా…జాగ్రత్తగా చూడు”

నాయకుడు పళ్ళుకొరుకుతూ నా ముఖంలో ముఖంపెట్టి “నీ కోసం ఒక అద్దం తెప్పించమంటావా?” అని అరిచాడు.

నామీద జరుగబోతున్న ఏదో దాడిని అడ్డుకుంటున్నట్టు చేతులు అడ్డుపెడుతూ హఠాత్తుగా లేచి నిలుచున్నాను. అతడు నాకు

మరింత దగ్గరకొచ్చాడు. భయపడుతూ అడుగు వెనక్కి వేశాను. వాళ్లలో ఒకడు నన్ను వెనుక నుంచి బల్లవైపు వైపు నెట్టాడు.

విసురుగా బల్లను తాకాను. బల్ల అంచు నా పొత్తికడుపు కింద బలంగా తగిలి నొప్పితో విలవిల్లాడాను. శరీరంలో మిగిలివున్న రక్తమంతా ముఖంలోకి చిమ్ముకొస్తున్న అనుభూతి చెందాను. మతి స్థిమితం కోల్పోతున్నట్టు అయింది. నా ఊపిరితిత్తుల్ని చీల్చి, ఛాతికి నిప్పంటించబడ్డ ఒక ఉన్మాదస్థితిలో గది దద్దరిల్లేలా కేకలు వేసాను.

నాకు మృత్యువు దగ్గరవుతున్నట్టు గ్రహించి ఒంట్లోని మిగులు బలాన్ని సమీకరించాను. ఆగంతకుడి మృతదేహానికి దూరంగా జరిగే ప్రయత్నంలో బల్ల చుట్టూ తిరిగాను. కానీ వాళ్లు నన్ను అడ్డుకున్నారు.

వాళ్ళ ముఖాలు దగ్గరవుతున్నయి. నేను వెనక్కి తగ్గుతున్నాను. వాళ్ల ముఖాలు మరింత దగ్గరైనయి. నేను తప్పించుకుంటూ వారిలో ఒకతని భుజంమీద కొట్టాను. అతడు కోపంతో ఊగిపోతూ పిడికిలితో నా పొట్టలో ఇష్టమొచ్చినట్టు గుద్దాడు. అడ్డుకునే బలహీన ప్రయత్నాలు చేశాను. అతడు చలించలేదు. స్థిరంగా కఠోరంగా కనిపించాడు. కళ్ళు ఒక దృఢనిశ్చయాన్ని చాటుతున్నయి.

అతడు మోకాలు ఎత్తి నా పక్కటెముకల మీద పొడవగానే భయంగా తలను గదిమూల వైపు తిప్పబోతే ముఖంమీద చెళ్లు చెళ్లుమని ఆగకుండా కొట్టాడు. బాధతో కేకలు వేస్తుంటే నా అరుపుల మధ్య అతడు “భయపడ్డావా..?” అని హేళనగా అన్నట్టు ఊహించుకున్నాను.

నిజంగానే భయంతో కంపించిపోయాను.

ఆదేసమయంలో గోడ మూలన నిలబడివున్న ఒక మనిషి హఠాత్తుగా పడిపోవడం కనిపించింది. అతడు అచ్చంగా బల్లమీది మృతదేహాన్ని పోలివున్నట్టు అనిపించింది. అతనికేమీ నొప్పి కలిగినట్టు లేదు. శబ్దం లేకుండా నేలను కొట్టుకున్నాడు.

అలాంటి విభ్రాంతికర దృశ్యాల్ని ఊహించగలమే కానీ స్పర్శించి చూడలేం. కిందపడిన అతని తల కదలకుండా ఉంది. అతని దేహం మంచుముద్దల కింద కూరుకుని గడ్డగట్టిన స్థితిలో ఉండిపోయింది.

అతనిలో అన్ని భాగాలు నిశ్చలనమై పోవడాన్ని చూసాను. ఆ తర్వాత రికార్డింగ్ చేయడానికి మరింకేమీ మిగల్లేదు.

ఇలియాస్ ఫార్కో పరిచయం
అసాధారణ ప్రతిభతో అరబ్ సాహితిలో తనదైన ముద్రవేసిన మలితరం జోర్డానియన్ దిగ్గజం ఇలియాస్ ఫార్కో రచయితగా, ప్రచురణకర్తగా ప్రసిద్ధులు. ఆయన 1948లో అమ్మాన్‌లో జన్మించారు. విద్యాభ్యాసం అమ్మాన్, తూర్పు జెరూసలేంలో జరిగింది.
అరబ్ యూనివర్సిటీ ఆఫ్ బీరూట్ నుంచి ఫిలాసఫీ, సైకాలజీ సబ్జెక్టుల్లో పీజీ చేశారు. కెరీర్ ప్రారంభంలో కొంతకాలం పాత్రికేయుడిగా పనిచేశారు. అల్-మనరత్ ప్రచురణ సంస్థలో సంపాదకునిగా చేసి తర్వాత 1991లో సొంతంగా దార్ అజ్మానా పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ సంస్థను స్థాపించి తను మరణించేవరకు నడిపారు.
ఇలియాస్ ఫార్కో ప్రత్యేకించి కథలో ఎక్కువ కృషిచేశారు. రాజకీయం, మతం, సంస్కృతుల్ని ముక్కలుచేసే విచ్చిన్నకర శక్తులపై ధ్వజమెత్తుతూ రచనలు చేశారు. అరబ్ దేశాల్లోని పరిణామాలు, మారుతున్న జనజీవనాన్ని నిర్వచించాడు. చారిత్రక, రాజకీయ శక్తుల వలయంలో కొట్టుకుపోతున్న బతుకుల్ని, సంఘర్షణల్ని బలమైన పాత్రల ద్వారా కదిలించేలా చిత్రించి సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. ఆయన జోర్డానియన్ కళాసాంస్కృతిక రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ఒక పబ్లిషరుగా జీవితకాలంలో
అనేక విలువైన గ్రంథాలు ప్రచురించి అరబ్ గ్రంథాలయాన్ని సుసంపన్నం చేశారు. సాహిత్యానికి ఈ రూపంలోనూ గొప్ప సేవలు అందించారు.
ఫార్కో జీవితకాలంలో ఎనిమిది కథా సంపుట్లు ప్రచురించారు. అరబిక్ సాహితిలో సుస్థిరమైన నాలుగు నవలలు వెలువరించారు. 1987లో తొలి నవల ‘కాలమ్స్ ఆఫ్ ఫోమ్’ అరబ్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఫార్కో కెరీర్లో ఒక కళాఖండంగా ప్రస్తుతి పొందింది. ఇరవయ్యో శతాబ్దపు వంద అత్యుత్తమ అరబిక్ నవలల్లో ఒకటిగా ఎంపికైంది. 2007లో వెలువడ్డ ‘ది ల్యాండ్ ఆఫ్ పర్గేటరీ’ నవల పలు విదేశీ భాషల్లోకి అనువాదమైంది.
ఫార్కో అనేక కథలు ఆంగ్లంలోకి అనువదించబడ్డయి. పదుల సంఖ్యలో కథలు ప్రపంచ అగ్రశ్రేణి ‘బనిపాల్’ పత్రికలో ప్రచురితమైనయి. అంతేకాదు, తను స్వయంగా ప్రపంచ సాహిత్యంలోని పలు ప్రసిద్ధ రచనల్ని అరబిక్‌లోకి అనువదించారు. ముఖ్యంగా ఆయన ఎంపికచేసి, అనువదించిన లాటిన్ అమెరికన్ రచయిత్రుల కథల సంకలనాన్ని 1997లో ప్రచురించారు.
ఎలియాస్ ఫార్కో అనేక జోర్డానియన్ పురస్కారాలు అందుకున్నారు. స్టేట్ మెరిటోరియస్ అవార్డు, మహమూద్ సయ్ఫ్ ఎడ్-దిన్ ఇరానీ అవార్డు, జోర్డానియన్ రైటర్స్ అవార్డు వాటిల్లో ముఖ్యమైనవి. ఆయన కథా సంకలనాల్లో ‘ది స్లాప్’, ‘అమ్మాన్స్ బర్డ్స్ స్వీప్ లో’, ‘ట్వంటీవన్ షాట్స్ ఫర్ ది ప్రొఫెట్’, ‘ఫీల్డ్స్ ఆఫ్ షాడోస్’ బాగా పేరు తెచ్చినయి. ‘కాలమ్స్ ఆఫ్ ఫోమ్’, ‘పిల్లర్స్ ఆఫ్ డస్ట్’, ‘ది ల్యాండ్ ఆఫ్ ప్యూగెటరీ’,‘ సీక్రెట్స్ ఆఫ్ ది శాండ్ క్లాక్’ నవలలు అత్యంత ప్రజాదరణ చూరగొన్నయి. ఫార్కో 72 సంవత్సరాల వయస్సులో 2020 జూలై 15న మరణించారు. ఆయన ప్రసిద్ధ కథానిక ‘ఎ మ్యాన్ ఐ డోంట్ నో’ కు ఇది నా అనువాదం.
డా. ఎ.యం. అయోధ్యారెడ్డి

నాలుగు దశాబ్దాలుగా హైదరాబాదులో నివాసం. 1983లో జర్నలిజంలో మొదలైన ప్రయాణం, తర్వాత దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత దక్కన్ క్రానికల్ సంస్థలో న్యూస్ ఎడిటరుగా పదవీవిరమణ. సాహిత్యపఠనం, కథా నవలా రచన, అనువాదం ఇప్పటి ప్రవృత్తి. 70కి పైగా కథలు, రెండు నవలలు రాశారు. 50 విదేశీ కథలు, ఒక విదేశీ నవల తెలుగులోకి అనువదించారు. ఇప్పటివరకు రెండు కథా సంపుటాలు– ఆహారయాత్ర, అక్కన్నపేట రైల్వేస్టేషన్, అనువాదాలు– ఏడవకుబిడ్డా, కథాసంగమం, అరబ్ కథలు ప్రచురించారు.

Previous Post

కన్నడ కథ :  ఒక కుర్రవాడికి వచ్చిన కల

Next Post

కన్నడ కథ : చాక్లెట్ కేక్

Next Post
కన్నడ కథ : చాక్లెట్ కేక్

కన్నడ కథ : చాక్లెట్ కేక్

Discussion about this post

ఈ సంచికలో…

  • కన్నడ కథ: బేలా
  • ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు
  • కన్నడ కథ: ఐదు రూపాయల రుణం
  • రైదాస్
  • మహిళల మధ్య
  • తమిళ కథ : చెడ్డ కుమారుని కథ
  • నేను నిన్ను ప్రేమిస్తున్నాను !
  • గుజరాతీ కథ : వైట్ హార్స్
  • తొలి ప్రేమ
  • కన్నడ కవిత : నవ్వు
  • 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • కన్నడ కథ: ఆ ఒక విధంగా …
  • రష్యన్ కథ : మాస్క్
  • తమిళ కథ : పుష్పించని చెట్టు
  • యుగోస్లేవియా కథ : కాప్టెన్
  • అనువాద కవిత : నూతన సంవత్సర ఉదయం
  • ఆంగ్ల కథ : టెలిఫోన్ కాల్ 
  • కన్నడ కథ :  అంతర్వాహిని

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com