కన్నడ మూలం: డా. బెసగరహళ్ళి రామణ్ణ
అనువాదం : రంగనాథ రామచంద్రరావు
ఈ మధ్యన ఒక రోజు ఇలా జరిగింది:
స్థలం: దేశంలోని ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలోని పాత నగరం. పాత నగరం అన్నాక గడిచిపోయిన అనేక సామ్రాజ్యాల, ఈ సామ్రాజ్యాల వంశీయుల కథకో, చరిత్రకో సంబంధించినట్టే దేవస్థానాలు, రాజభవనాలు, గురుగృహాలు, మొదలైనవాటిని విపులంగా పొందో లేదా గతంలో ‘అలా ఉండేది` ఇలా ఉండేది’ అనే మాటలకు వస్తువైంది. ఈ నగరం ఇప్పుడు పాడైపోలేదు. బతికివుంది. ఇది అనేక రాజ వంశస్థుల మూలస్థలం లేదా వారి అస్థికలను దాచిపెట్టుకుని బుసలు కొడుతున్న అనేక సమాధులను కలిగివున్న పవిత్ర స్థలమనే పరిమితినీ మీరి పెరిగినట్టి నగరం. ఇక్కడొక విశ్వవిద్యాలయం, కొండ మీదొక దేవస్థానం, దాంతోపాటు ఒక జంతు సంగ్రహాలయం (Zoo-Garden) ఇంకా అనేక చిన్న చిన్న ఆకర్షణలు ఉన్నాయి.
‘ఈ మధ్యన ఒక రోజు ఇలా జరిగింది’ అని మొదలుపెట్టి ఏదేదో చెబుతూ పోవటం మన సామాజిక జీవితంలో ఒక అవిభాజ్యమైన అంగం కావటం వల్ల ఎవరూ నా తీరును విమర్శించరనే నమ్మకంతో ఇప్పుడు అసలు విషయానికి వస్తాను.
-2-
పాత నగరం చుట్టుపక్కల అనేక తాలూకా కేంద్రాలు. వేళ్ళ మీద లెక్కించగలిగే జిల్లా కేంద్రాలు. అసంఖ్యాక గ్రామాలు ఉన్నాయి. ఈ అసంఖ్యాక గ్రామాల్లో ఒక గ్రామంలోని ఒక సంసారంలో ఇలా జరిగింది. ఈ సంసారంలో తల్లీ`తండ్రి, అన్నా`చెల్లెలు ఇంత మందే
ఉన్నారు. కుటుంబ నియంత్రణను మీరని, దేశ జన నియంత్రణ నీతికి కట్టుబడిన కుటుంబం. తండ్రికి సుమారు నలభై నాలుగేళ్ళు. తల్లికి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో అనుకోండి. పిల్లవాడికి పన్నెండేళ్ళు, అమ్మాయికి ఆరేళ్ళు.
పాత నగరం చరిత్ర విని తల్లికి చాలా కుతూహలం కలిగింది. కొడుకును ప్రేరేపించి భర్తను పాతనగరానికి కుటుంబ సమేతంగా పర్యటించడానికి ఒప్పించింది.
కుటుంబమంతా బస్సులో వచ్చి పాత నగరం బస్టాండులో దిగింది. బస్టాండుకు అంటుకుని ఉన్నట్టే ఆకాశానికి తన కొమ్మలను నిగడదన్ని నిలుచున్న ఒక పెద్ద భవనాన్ని చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. పిల్లవాడు కుతూహలం ఆపుకోలేక ప్రశ్నల మీద ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు.
‘‘నాన్నా! నాన్నా!! ఇదేమిటి నాన్నా…?’’
‘‘రాజభవనం బాబు. మనల్ని పాలించే రాజు ఉంటున్న ఇల్లు’’
‘‘ఇలాంటి ఇంట్లో ఎంతమంది ఉండొచ్చు. ఎంత మంది రాజులు ఉన్నారిక్కడ…’’
‘‘పోరా కోతి! ఒక్కరే. లేకపోతే ఒక రాజ్యానికి వెయ్యిమంది రాజులు ఉంటారని అనుకున్నావా…’’
ఈ జవాబుతో పిల్లవాడి ఉత్సాహం కుంగవచ్చని భావించిన తండ్రి ఊహ తప్పయింది.
‘‘ఒక రాజ్యానికి ఒకే రాజు. అయితే అతనికి లెక్కలేనంత మంది భార్యలు ఉండాలి, అవునా?’’
‘‘ఊఁ! వందలాది జనుల అంతఃపురమే ఉంది’’
పిల్లలకు తండ్రి జవాబు కాస్త అయోమయాన్ని కలిగించింది. తమ తండ్రికి అమ్మ ఒక్కతే భార్య. రాజుకు ఎందుకు వందలాది మంది భార్యలు? ఛీ! చాలా చెడ్డ రాజై ఉండాలి. ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడినా ఈ విషయాన్ని ఇక్కడితో తుంచేసి, రాజభవనాన్ని చూడటానికి కుటుంబమంతా గబగబా అడుగులు వేసింది. తండ్రికి రాజభవనాన్ని చూడటంలో అంత కుతూహలం లేదు. తల్లి, పిల్లలు రెప్పలు వాల్చకుండా, తెరిచిన నోరు మూయకుండా రాజభవనాన్ని చూశారు. లోపలికి వెళ్ళే ద్వారం దగ్గర గుర్రాల మీద కూర్చున్న తుపాకులు ధరించినవారిని చూసి కాస్త కలవరం అనిపించి మనస్సు లోలోపల బెదిరినా రాజభవన వైభవాన్ని మెచ్చుకుని తలూపారు. కుర్రవాడు తమ ఇంటినీ రాజభవనాన్నీ పోల్చి మనస్సులోనే -ఉంటే ఇలాంటి రాజభవనంలో ఉండాలి అనిపించి కొద్ది క్షణాలు తన తండ్రి`తల్లి, ‘రాజు`రాణి’లా, తానూ, తన చెల్లెలు రాజకుమారుడు`రాజకుమారి అని భ్రమించి ఆనందించాడు. ఊహాలోకం తుడుచుకుపోయిన తర్వాత, ‘‘నాన్నా, ఈ రాజభవనాన్ని రాజులే కట్టారా?’’
‘‘లేదు బాబు, జనం కట్టారు’’
‘‘ఎందుకు?’’
‘‘రాజబొక్కసం నుంచి జనులకు కూలీ ఇచ్చి పనిచేయించి కట్టించారు’’
‘‘రాజు బొక్కసానికి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది నాన్నా?’’
‘‘ప్రజలనుంచి; పన్ను అంటే మనమంతా భూమిశిస్తును కరణానికి చెల్లిస్తాం కదా, అలాంటి సొమ్ము నుంచి’’
‘‘అలాగైతే ఇది ప్రజల సొమ్ము నుంచి కట్టించింది. అలాగైతే ఇది ప్రజలదేకదా; రాజులది ఎలా అయింది నాన్నా?’’
‘‘చూడు నాయనా, మెల్లగా మాట్లాడు. సొమ్ము ఎవరిదైనప్పటికీ రాజభవనం రాజుల ఆస్తి…’’
‘‘నాన్నా! రాజు చెమటలు కార్చడు. ఇలాంటి పెద్ద ఇల్లు అంటే నేను నమ్మలేకపోతున్నాను. మన పుస్తకంలో బసవణ్ణగారు ‘కాయకమే కైలాసం’ అని చెప్పారుకదా’’
కొడుకు అడిగిన ఈ ప్రశ్న అత్యంత జటిలత వైపు తీసుకెళుతుండటం గమనించిన తండ్రి విషయాన్ని మార్చాడు:
‘‘రేయ్, రాజభవనం విషయం ఇప్పుడు మనకెందుకు! రాజుల కాలం ముగిసింది. ఇప్పుడు మన దేశంలో ఉన్నది మన రాజ్యం’’
‘మన రాజ్యం’ అనే మాట తన చెవిన పడటమే ఆలస్యం పిల్లవాడు సంతోషపడ్డాడు.
‘‘అలాగైతే ఈ రాజభవనం మనది! నువ్వు రాజు. అమ్మనే రాణి. నేను రాజకుమారుడిని, నా చెల్లెలు రాజకుమారి’’ అని ఠీవిగా రొమ్ము విరుచుకుని, మీసం తిప్పుతున్నట్లు నటించి; ‘‘భళా భళిరా భువనా, ఈ ధరణిలో నాకు సమానులైనవారు ఎవరు… మంత్రివర్యా… మన రాజ్యంలో వానలు పంటలు సమయానికి చక్కగా వస్తున్నాయో లేదో తెలియజేయవాడవుకమ్ము’’ అని గ్రామీణ నాటకాలు వాడి మీద కలిగించిన పరిణామాన్ని అభినయించి చూపించాడు. వాడి చెల్లెలు సంతోషంతో పడీ పడీ నవ్వింది. తల్లీతండ్రులైతే కుమారుడి ప్రతిభావంతమైన ప్రదర్శనకు సంతోషంతో పొంగిపోయారు. తండ్రి గబుక్కున మళ్ళీ విషయానికి వచ్చాడు. ‘‘రేయ్, కొండ కోతి, మన రాజ్యం అంటే మన ఇల్లు కాదురా! ‘ప్రజల రాజ్యం’ అని. నువ్వు ఇంత మూర్ఖుడని నేను అనుకోలేదు. నువ్వు మూర్ఖుడివిరా. ప్రతి సంవత్సరం ఆగస్ట్ పదిహేనవ తేదీన మనం ఏమి ఆచరిస్తున్నాం? చెప్పుమరి. నీ తెలివితేటలు ఏపాటివో తెలుస్తుంది’’
‘‘ఆగస్ట్ పదిహేనవ తారీఖు… ఆఁ ! ఓ ఓ ! అది ఏమిటంటే స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆచరించటం… కదా!’’
‘‘రైట్! ఆ రోజు నుంచి తెల్లవాళ్ళు మన దేశం నుంచి తొలగిపోయారు. ఈ రాజభవనపు రాజులంతా మూలన పడ్డారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దీన్ని పొందటానికి తిలక్, మహాత్మా గాంధీ, పటేల్, రాజేంద్ర ప్రసాద్ ఇంకా లక్షలాది జనం పోరాడారు. జైలు శిక్షలు అనుభవించారు.ఎంతోమంది తుపాకి గుళ్ళకు బలయ్యారు; ఉరికంబాలకు తలలను అర్పించారు… నీకు ఆ రోజు చెప్పలేదా? భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, చంద్రశేఖర ఆజాద్ ఆ తర్వాత మదన్‌లాల్ డింగ్ర; జలియన్ వాలాబాగ్ ప్రకరణం అన్నీ… చూడూ, అక్కడ ఏమి కనిపిస్తుందోనని’’ అని తండ్రి రాజభవనం ముందు భాగంలో సుమారు ఒక ఫర్లాంగ్ దూరంలో ఒక మంటపం కింద ప్రతిష్ఠించిన ఒక విగ్రహం వైపు చేయి చూపించింది.
‘‘ఏ దేవుడి మంటపమో కావచ్చు’’
‘‘నీ తల… పదా. అక్కడొక మృదువైన పాలరాయి మీద కన్నడలో, ఇంగ్లీషులో ఆ మంటపాన్ని, విగ్రహాన్ని ఎందుకు, ఎప్పుడు కట్టించారోనని చెక్కి నిలబెట్టారు. చదివి తెలుసుకుందాం’’
ఉన్నట్టుండి ప్రస్తావనకు వచ్చిన ఈ విషయం నుంచి తల్లీ`పిల్లల గుండెల్లో కొత్త ఉత్సాహం, కుతూహలం ‘భగ్గు’మని ఎగిసింది. గబగబా మంటపం వైపు అడుగులు వేసి దాని ముందు నిలుచున్నారుÑ చూశారు. అది ఒక పిల్లవాడు గాంధీ టోపిని పెట్టుకుని, పెద్ద పెద్ద అంగలు వేస్తూ, చేతిలో జెండా పట్టుకుని నిలుచున్న విగ్రహం. దాని పక్కనే పాలరాయి మీద ఇలా రాసివుంది. తండ్రి చదవటానికి ప్రయత్నించాడు. పిల్లవాడు తానే చదివి చెబుతానని చదవటం మొదలుపెట్టాడు: ‘‘ఈ స్మారకం నేపథ్యంలో ఒళ్ళు పులకరించే మన దేశ స్వాతంత్య్ర పోరాటపు సంఘటన ఉంది. ఈ విగ్రహం`కరుణాకర అనే పిల్లవాడిది. మహాత్మా గాంధీగారు, ‘బ్రిటీషులారా, భారత్‌ను వదిలి వెళ్ళండి’ అని పిలుపు ఇచ్చినపుడు, స్వాతంత్య్ర పోరాటపు ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండాను రాజభవనం గోపురం మీద ఎగరేయాలని బయలుదేరిన జనం గుంపును బ్రిటిషువారు, స్వదేశీ రాజుల పోలీసు దళాలు అడ్డుకుని, లాఠీ ప్రహారం చేశారు. రక్తం చిందించి చాలామంది మూర్ఛపోయారు. అయితే ఒక దిట్టమైన పిల్లవాడు మాత్రం అసాధారణమైన ధైర్యంతో జెండాను పట్టుకుని పోలీసుల కళ్ళు గప్పి రాజభవనం వైపు పరుగెత్తాడు. ఆ సమయంలో బ్రిటిష్ సైనికుల తుపాకీ గుళ్ళ వర్షానికి బలై ఇక్కడే ప్రాణాలొదిలాడు. పరాయి పాలన నుంచి మన విశాలమై దేశం విముక్తి పొంది, మన ప్రజలంతా ఆకలి నుంచి, పేదరికం నుంచి, అజ్ఞానం నుంచి, నిరక్షరాస్యత నుంచి విముక్తులై, అంతే కాకుండా తమ తమ అభిప్రాయాలను ఎలాంటి భయం లేకుండా వ్యక్తపరచడానికి కరుణాకరలాంటి బాలలు అసంఖ్యాకంగా తమ రక్తాన్ని ఇక్కడ కార్చారు. దేశం మూలమూలల్లోనూ కరుణాకరలాంటి బాలలు బలిదానం చేశారు. కరుణాకర సదా మన యువకుల శక్తికి సంకేతం’’
పిల్లవాడు అది చదివి ముగించేసరికి వాడి కళ్ళ చివర కన్నీళ్ళు చేరి, వాడి గొంతులోంచి మాటలు స్పష్టంగా వెలువడటం కష్టమైంది. వాడి చెల్లెలైతే వెక్కి వెక్కి ఏడ్చింది. తండ్రి కరుణాకర విగ్రహాన్ని తన కుమారుడి విగ్రహానికన్నా ఎక్కువ ప్రేమతో ముఖాన్ని, జెండాను పట్టుకుని నిలుచున్న అతడి చేతులను నిమిరాడు. పిల్లవాడు జెండాను అత్యంత గౌరవంతో తాకి కళ్ళకు ఒత్తుకున్నాడు.
కొద్ది నిముషాలు వారి చుట్టూ ఉన్న వాతావరణం మౌనంగా ఉంది.
‘‘అర్థమైందా మన స్వాతంత్య్రం కోసం ఎలాంటివారు తమ ప్రాణాలు బలియిచ్చారోనని’’ అని తండ్రి అన్నాడు.
పిల్లవాడు ‘ఊఁ’ అన్నట్టు తలూపాడు. తల్లి కళ్ళు తుడుచుకుంది. అమ్మాయి అయితే ఇంకా వెక్కుతూనే ఉంది.
రాజభవనం చూసినపుడు పిల్లలకు ఉన్న ఉత్సాహం కరుణాకరుని స్మారక మంటపంలో తుడుచుకుపోవటాన్ని చూసి, తాను వీళ్ళకు మొదట జంతు సంగ్రహాలయం చూపించివుంటే అక్కడవున్న విచిత్రమైన సజీవ జంతువులను చూసి చాలా ఆనందించి ఎగిరి గంతులు వేసేవారని అనిపించింది. తన తప్పుకు తానే లోలోపల సిగ్గుపడి, ‘‘ఇక పదండి, జూగార్డెన్‌కు వెళదాం. అక్కడ మీకు చాలా వినోదం కలుగుతుంది’’ అని మంటపాన్ని వదిలి కాలిదారిలో జూగార్డెన్ వైపు భారమైన అడుగులు వేశారు.
ఇలా ఒక ఐదు నిముషాలు గడిచింది. పిల్లవాడి దృష్టి ఒక విశాలమైన, విచిత్రమైన రాళ్ళు, ఊచలు కొట్టొచ్చినట్టు కనిపించే ఒక పెద్ద కట్టడం మీద పడిరది. దాని ముందే ఒక బోర్డ్ వేలాడదీశారు. ‘‘బందీఖానా…Jail’’ అని చదివాడు.
‘‘నాన్నా, జైల్లోనే కదా, దొంగతనాలు చేసినవారిని బంధిస్తారు… తర్వాత ఉరితీస్తారు’’
‘‘ఊఁ! ఊరకే రా నాయనా, వాటన్నిటికి ఎందుకు బుర్ర పాడుచేసుకుంటావు’’ అని తండ్రి జైలు విషయం ఎత్తగానే విసుగ్గా జవాబిచ్చాడు.
-3-
‘జూగార్డెన్’ లోకి వెళ్ళడం ఆలస్యం పిల్లలకు ఒక కొత్త ప్రపంచాన్నే చూసినట్టయ్యింది. పాము, కుందేలు, విచిత్రమైన పక్షులు, నక్క, తోడేలు, ఎలుగుబంటి, నీటి గుర్రం, మొసలి, పులి, సింహం, ఒంటె, ఏనుగు, వాటి పిల్లలు, చిరుత దాని కుటుంబం, విచిత్రమైన కోతులు, అడవి మనుషులు… ఇలా ఒకటా రెండా. పిల్లవాడికి కరుణాకర మంటపంలో కలిగిన దుఃఖం, జైలును చూసినపుడు కలిగిన భయం అన్నీ మాయమై మనస్సు ఉల్లాసం చెందింది. ఉల్లాసంతోపాటు అతని బుద్ధి కూడా కాస్త చురుకుగా పని చేయటం మొదలుపెట్టింది.
‘‘నాన్న’’ అన్నాడు.
‘‘ఏమిట్రా! మళ్ళీ నీ గోల మొదలైంది’’ అని తండ్రి నవ్వాడు.
‘‘జూగార్డెన్ ఒక విధంగా జైలు ఉన్నట్టుకదా! ఇక్కడ ప్రాణులన్నిటిని బోనులోనూ, పంజరాల్లోనూ, గుహల్లోనూ పెట్టారు. ఇవి ఏమి తప్పు చేశాయి? జైల్లో అయితే దొంగలను పెట్టారు, అది న్యాయం!’’
‘‘ఇక్కడ ఈ జంతువులన్నిటినీ బంధించి పెట్టకపోతే నువ్వు ఏం చూస్తావు, మట్టిని చూసేవాడివి…వయస్సుకు మించి మాట్లాడకూడదు, ఊరకుండు’’
‘‘అదికాదు నాన్నా, కావాలంటే పులి, సింహం, ఎలుగుబంటి, చిరుత, తోడేలు, వీటిని పట్టుకోనీ. ఈ విధంగా ‘బంధించనీ’. ఇంకా కావాలంటే ఈ ఏనుగులనూ పట్టుకోనీ… అయితే ఈ నెమలి, కుందేలు, ఈ పక్షులు, జింకలు వీటన్నిటినీ ఊరకనే పట్టుకుని బంధించటం ఏమి న్యాయం?’’ అని పిల్లవాడు తండ్రిని మరో ప్రశ్న వేశాడు.
‘‘చూడు, ఇప్పుడు కొన్ని పక్షి ధామాలు, అభయారణ్యాలు అని ఏర్పాటు చేశారు. అక్కడ జంతువులకు ఎలాంటి భయమూ లేదు. పంజరంలోని బాధ, గుహలోని హింస ఏమేమి లేదు. ఆనందంగా ఉంటాయి. కావాలంటే మరోసారి మీ మాస్టారుకు చెప్పి అక్కడికి ఒక ‘టూర్’ వేయిస్తాను. ఊరుకో. ఇప్పుడు మాట్లాడకుండా చూడు. చూడు చూడు పులి ఎలా మనల్నే బోను ఊచల్లోంచి చూస్తోందో?’’
‘‘పాపం! బక్కచిక్కిపోయింది. నాన్నా! ఈ అడవి మనుష్యులు, మనిషి తాతముత్తాతలని పుస్తకంలో చెప్పారుకదా. మనమంతా ఈ అడవిమనుష్యుల్లాగే ఉండిపోయివుంటే బాగుండేదికదా. ఏ బాధ ఉండేదికాదు… దేశమంతటా, ఎందుకు మొత్తం ప్రపంచం అంతటా అడవి మనుష్యులుÑ ఎంత బాగుండేది. రాజభవనాలు, దేవస్థానాలు, జైళ్ళు, ఈ జూగార్డెన్, మాలాంటి పిల్లవాళ్ళు మాస్టారు చేతుల్లో దెబ్బలు తినటం, కరుణాకరలాంటి కుర్రవాళ్ళు చావటం … ఏదీ ఉండేది కాదు’’ అని తన కల్పనా సామ్రాజ్యాన్ని కళ్ళల్లో ఏర్పరిచేలా కళ్ళు మూసుకుని తలూపాడు.
‘‘అయ్యో, నడవరా కోతి నా కొడకా. నీకు మైల మాంసం లేకపోయినా అదేమి మాటలో, అదేమి కథనో, భవిష్యత్తులో ఏమవుతావో’’ అని తన కొడుకు ఆలోచనల గొలుసును చూసి లోలోపల ఆనందించాడు.
-4-
మొత్తం కుటుంబం ఊరికి వెనుతిరిగింది.
ఆ రాత్రి పిల్లవాడికి ఒక కల వచ్చింది.
తన స్కూలు పిల్లలతో, తన మాస్టార్ల నేతృత్వంలో పక్షి ధామాన్ని, అభయారణ్యాన్ని చూసుకుని రావటానికి బయలుదేరాడు. బస్సు బర్రుమని శబ్దం చేస్తూ, లోతట్టులోకి దిగి, “ఎక్కి మధ్యాహ్నం సమయానికి పక్షిధామం చేరింది. పిల్లలంతా పక్షులతోపాటు పక్షులై తిరిగారు. మాస్టార్లు అరకొర జ్ఞానాన్ని , పక్షుల పుట్టుక`చావుల గురించి ప్రదర్శించినపుడు విని సంతోషపడ్డారు. తర్వాత ఊరి నుంచి చేయించుకొచ్చిన పెరుగున్నం, చిత్రాన్నాన్ని తిని, అక్కడే ప్రవహిస్తున్న నది నీటిని తాగారు.
పక్షిధామం నుంచి అభయారణ్యానికి సుమారు పన్నెండు మైళ్ళ దూరం. బస్సు అటు వైపు ప్రయాణం సాగించింది.
అభయారణ్యాన్ని చేరారు. పిల్లలు జింక, అడివి గొర్రెలు, అడవి పశువులు, రకరకాల కోతులను అడవిలోనే చూడటానికి దొరికిన అవకాశానికి ఆనందంగా కిందికి దిగారు. మాస్టార్లు జాగ్రత్తగా ఉండమని పిల్లలకంతా తెలియజేస్తుండగా అభయారణ్యాన్ని కాపలా కాస్తున్న కొందరు అధికారులు వచ్చి మాస్టారులకు, పిల్లలకు ఒక బోర్డు చూపించి, చదువమని చెప్పారు. అక్కడ ఇలా రాసివుంది: ‘‘నశించిపోతున్న వన్యమృగాలను కాపాడి, మన ముందరి తరానికి ఈ జంతువులను చూసి ఆనందించే అవకాశాన్ని కాపాడుకోవటానికి ఈ అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. జంతువులకు ఎవరూ ఎలాంటి హింసను చేయకూడదు. ఎవరైనా వేటగాళ్ళు పొరబాటున జంతువులు వేటాడి దొరికిపోతే, అలాంటివారికి తీవ్ర కారాగార శిక్షను విధిస్తారు’’. ఈ బోర్డు పక్కనే మరొక బోర్డు, అందులో: ‘‘అహింసే ధర్మం, సత్యమే దైవం’’ ` మహాత్మా గాంధీ ` అని రాసివుంది.
ఇవన్నీ చదివి ముగించి అభయారణ్యంలోకి దూరారు. గడ్డి పరకలను తినే కుందేళ్ళను చూసి ఆనందించారు. అక్కడే జలజలమని ప్రవహిస్తున్న చిన్న నదిలో నీళ్ళు తాగుతున్న జింకలను చూసి , ‘‘హో…ఓ’’ అని వాటిని తరుముతూ వెళ్ళారు. చాలా దూరం పరుగెత్తి అలసి నీళ్ళు తాగి అక్కడే కూర్చుని అలసట తీర్చుకున్నారు. ఇలా కూర్చుని ఉన్నప్పడు కోతుల గుంపొకటి వచ్చి వీళ్ళను వెక్కిరించటం మొదలుపెట్టింది. వీళ్ళు వాటిని వెక్కిరించారు. అవి పళ్ళికిలించాయి. వీళ్ళూ పళ్ళికిలించారు. ఉన్నట్టుండి ఏదో భారీ శబ్దం వినిపించింది. కోతులు చెదిరిపోయాయి. పిల్లలు బెదిరిపోయారు. కొద్ది నిముషాల తర్వాత పిల్లలలో ఉత్సాహం మళ్ళీ వచ్చింది. కోతులు పరుగెత్తిన జాడనే పట్టుకుని నడిచారు. చాలా దూరం నడిచిన తర్వాత, ‘‘ఇక్కడి నుంచి ముందుకు ఎవరికీ ప్రవేశం లేదు’’ అనే బోర్డు కంటపడిరది. దాంతో పిల్లల్లో తీవ్రమైన కుతూహలం కలిగి మెల్లమెల్లగా ఎవరి కంట పడకుండా చెట్ల చాటున, పొదల గుంపు నడుమ దూరుతూ దాగుడుమూతలు ఆడుతూ చాలా దూరం పోయారు. అప్పటికే సూర్యుడు ముసలివాడవ్వసాగాడు. ఒక పిల్లవాడు ‘‘అక్కడ’’ అని చూపించాడు. మిగతా వారందరూ చూశారు. దూరంలో కొన్ని వరుసల చెట్లు. వాటి కొమ్మలకు `గబ్బిలాల పక్షుల్లా ఏదో వేలాడుతున్నాయి. పిల్లలకు ఈ ప్రాణులు ఏ జాతివో చూడాల్సిందేననే దృఢ నిర్ణయం గుండెలో పుట్టి ముందుకు నడిచారు. ఊగుతున్న వస్తువులకు కాళ్ళు, చేతులు ఉన్నాయని అనిపించింది. హో! హో! కోతులు సర్కస్ చేస్తుండవచ్చని అనిపించి మరింత ముందుకుపోయారు. ఒక పిల్లవాడు, ‘‘రేయ్, చప్పుడు చేయకుండా అక్కడ చూడండి’’ అన్నాడు. ఆ చెట్ల చుట్టూ నల్లటి దుస్తులు ధరించి, ముఖానికి ముసుగు తొడుక్కున్న వ్యక్తులు తిరుగుతున్నారు. పిల్లలకు ఒళ్ళు జుమ్మంది. కొందరు వణుకుతున్నారు. పిల్లలను అనుసరిస్తూ వచ్చిన ఒక మాస్టారును మాస్క్ ధరించిన వ్యక్తి వచ్చి గబుక్కున పట్టుకున్నాడు. మాస్టారు పెనుగులాడారు. పిల్లలు చెదిరిపోయి పొదల్లో దాక్కున్నారు. మాస్టారు అడిగారు: ‘‘మీరు ఎవరండి? నన్ను ఎందుకు పట్టుకున్నారు? నేను ఏమి తప్పు చేశాను? అభయారణ్యంలో మీలాంటి దోపిడీ దొంగలంతా చేరుకుని మాలాంటి పర్యాటకుల తలలు పగులగొట్టి డబ్బులు లాక్కోవటానికి నిలబడ్డారు. దీన్ని నేను అటవీశాఖావారికి ఫిర్యాదు చేసి మీ అందరికి శిక్ష పడేలా చేయకపోతే…’’ మాస్టారు ముఖానికి జవాబుగా పటపటమని నాలుగైదు దెబ్బలు పడ్డాయి. ‘‘చూడు, అక్కడ వేలాడుతున్నవి ఏమని అనుకుంటున్నారు! మీకూ అదే గతి పడుతుంది!’’ ఆ సమయానికి మరో ఇద్దరు మాస్క్‌లు వేసుకున్న వ్యక్తులు వచ్చారు. వాళ్ళలో వాళ్ళు ఏదేదో మాట్లాడుకుని మాస్టారును ‘‘పదా’’ అన్నారు. మాస్టారుకు కోపం పొంగి పొంగి వచ్చింది.
‘‘మీరు ఎవరండి? దాన్ని ముందుగా చెప్పండి. నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతున్నారో చెప్పండి. నాలాంటి నిరపరాధి మీద చేయి చేసుకోవడానికి మీకు సిగ్గు వేయదా?’’
‘‘రేయ్, నిన్ను ఇక్కడే కొట్టి చంపేస్తాం’’
‘‘చంపండి. ఇప్పుడు నేను బతికి మాత్రం చేసేదేముంది?’’
‘‘మాట్లాడకుండా నడువుమరి. ఎందుకు పెనుగులాడుతున్నావు’’
‘‘చావు మనిషికి వచ్చేది ఒకే ఒకసారి`వెయ్యిసార్లు కాదు’’
‘‘తత్వం చెప్పకు నడవ్వోయ్…’’ అని మాస్టార్ను దబదబమని లాక్కునిపోయారు. పిల్లలంతా ‘‘మా మాస్టార్ను వదలండి’’ అని అరుస్తున్నా వాళ్ళు పట్టించుకోలేదు.
లాక్కుంటూ వెళ్ళిపోయారు. కొద్దిసేపు మౌనం అక్కడ ఘనీభవించింది. తర్వాత చాలా దూరం నుంచి ‘ఢాం’ అనే శబ్దంతో, ఎవరో మనిషి చేసిన ఛీత్కారపు ధ్వని వినిపించింది.
పిల్లవాడు ‘‘మా మస్టార్ను చంపకండి. ఆయన చాలా మంచివారు. దేశమంటే ప్రాణాలు వదులుతారు’’ అని అరుస్తూ పక్క మీది నుంచి గభాలున లేచి కూర్చుని వెక్కివెక్కి ఏడ్వటం మొదలుపెట్టాడు.
![]()

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 14 అనువాద నవలలు, 17 అనువాద కథా సంకలనాలు, 5 ఆత్మకథలు, ఒక జీవిత చరిత్ర, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.



Discussion about this post