అంగ్ల మూలం: మాయా ఏంజెలో
తెలుగు: బొల్లిముంత వెంకట రమణా రావు
మహావృక్షాలు కూలినప్పుడు,
దూరపు కొండలపై రాళ్లు కంపిస్తాయి;
సింహాలు
గుబురు గడ్డిలో తలదాచుకుంటాయి,
ఏనుగులు సైతం
ఆశ్రయం కోసం
భారీ అడుగులతో ముందుకు సాగుతాయి.
మహావృక్షాలు కూలినప్పుడు
అడవులలో—
చిన్న జీవాలు
నిశ్శబ్దంగా ముడుచుకుపోతాయి;
వాటి ఇంద్రియాలు
భయంతో కలవరపడతాయి.
.
మహాత్ములు మరణించినప్పుడు,
మన చుట్టూ గాలిస్పర్శ
తేలికగా, పలుచగా, నిర్మలంగా మారుతుంది;
మనం శ్వాసిస్తాం—ఒక క్షణం;
మన కళ్లూ—ఒక క్షణం—
బాధతో కలవరపడతాయి.
మన జ్ఞాపకాలు ఒక్కసారిగా పదునెక్కి,
మనసును తడుముతాయి—
మరచిపోయిన మంచి మాటలను,
నెరవేరని వాగ్దానాలను,
నడవని మార్గాలను
మళ్లీ మళ్లీ గుర్తు చేస్తాయి.
మహాత్ములు మరణించినప్పుడు,
వారితో ముడిపడిన మన ప్రపంచం
నిశ్శబ్దంగా మనల్ని విడిచి వెళ్తుంది;
ఒకరి ఆధారంపై నిలిచిన
మన ఆత్మలు కుంచించుకుపోతాయి.
వారి తేజస్సుతో రూపుదిద్దుకున్న
మన మనస్సులు
నెమ్మదిగా వెలిసిపోతాయి;
మనం పిచ్చివాళ్లం కాదుగాని—
చెప్పలేని అజ్ఞానంలోకి,
చీకటి గుహల్లోకి జారిపోతాం.
మహాత్ములు మరణించిన అనంతరం,
కొంతకాలం తరువాత
శాంతి మెల్లగా వికసిస్తుంది—
అది ఎప్పుడూ సమంగా ఉండదు.
శూన్యాన్ని నింపుతూ విస్తరిస్తాయి
ఒక మృదువైన, ఓదార్పునిచ్చే స్పందనతో;
మన ఇంద్రియాలు మళ్లీ మేల్కొని,
ఇక మునుపటిలా కాకుండా,
మనతో మెల్లగా మాట కలుపుతుంది—
వారు ఉన్నారు… వారు ఉన్నారు…
మనమూ ఉండగలం…
ఇంకా మెరుగ్గా ఉండగలం—
ఎందుకంటే వారు ఉన్నారు
తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్న కవి, కథకుడు, నాటక రచయిత. కొత్తగూడెం ఆకాశవాణి (ఎఫ్.ఎమ్) కేంద్రంలో సుమారు ఎనిమిది సంవత్సరాలు క్యాజువల్ ఉద్యోగిగా పనిచేశారు. విదేశీ సంస్థలో కంటెంట్ రివ్యూయర్‌గా, స్థానిక పత్రికలో సంపాదక సహాయకుడిగా కూడా సేవలందించారు.
ఇప్పటివరకు 150కు పైగా తెలుగు కవితలు, 15 కథలు రచించారు. ఆయన రచించిన 20 రేడియో నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. అలాగే 150కు పైగా ఆంగ్ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య వెబ్‌సైట్లలో ప్రచురితమయ్యాయి. 2002లో Poetry.com నిర్వహించిన కవితా పోటీలో బహుమతి అందుకున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిపి ఇప్పటివరకు 15 పుస్తకాలను ప్రచురించారు.
సాహిత్యం, మానవ సంబంధాలు, సామాజిక అంశాలు, సమకాలీన జీవన అనుభవాలు ఆయన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. రచనతో పాటు AI ఆర్ట్‌పై ఆసక్తి కలిగి, పజిల్స్‌ను రూపొందించడం, వాటిని సృజనాత్మకంగా మెరుగుపరచడం వంటి కార్యకలాపాల్లోనూ ఆసక్తిగా పాల్గొంటున్నారు.
ఆయన విద్యార్హతలు: M.A. (Sociology, English, Psychology), B.Ed., P.G. Diploma in Journalism and Mass Media.































