ఆంగ్ల మూలం: మాయా ఏంజెలో
తెలుగు: బొల్లిముంత వెంకట రమణా రావు
నన్ను నిశ్శబ్దంగా కూర్చుని చూస్తే,
పక్కన పెట్టిన సంచిలా ఉంటాను—
నీ మాటల హడావిడి అవసరం లేదు,
ఇప్పుడు-
నా మనసు మాటలే నేను ఆలకిస్తునాను.
ఆగు— ఇప్పుడు నా మీద జాలి పడకు,
ఆగు—నీ సానుభూతి అసలు వద్దు;
నన్ను నువ్వు అర్థం చేసుకుంటే చాలు,
లేకపోతే—అదీ లేకుండా నేనుంటాను.
నా ఎముకలు నొప్పితో వేదించవచ్చు
నా కాళ్లు మెట్లు ఎక్కలేకపోతేనేం—
నేను కోరేది ఒక్కటే-
నన్ను ఊయల కుర్చీలో కూర్చోపెట్టకు.
నన్ను నడుస్తూ తడబడుతుంటే చూస్తే,
అది తప్పుగా అర్థం చేసుకోకు;
అలసట అంటే అలసత్వం కాదు,
ప్రతి వీడ్కోలు అంతిమం కాదు.
నేను అప్పట్లో ఉన్న అదే మనిషిని—
కొంచెం జుట్టు రాలింది, కొంచెం ముఖం ముడతలు పడింది
శ్వాస బరువైనా, శక్తి తగ్గినా—
ఇంకా శ్వాస తీసుకుంటున్నాను కదా… అదృష్టమే కదా…!
![]()
తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్న కవి, కథకుడు, నాటక రచయిత. కొత్తగూడెం ఆకాశవాణి (ఎఫ్.ఎమ్) కేంద్రంలో సుమారు ఎనిమిది సంవత్సరాలు క్యాజువల్ ఉద్యోగిగా పనిచేశారు. విదేశీ సంస్థలో కంటెంట్ రివ్యూయర్‌గా, స్థానిక పత్రికలో సంపాదక సహాయకుడిగా కూడా సేవలందించారు.
ఇప్పటివరకు 150కు పైగా తెలుగు కవితలు, 15 కథలు రచించారు. ఆయన రచించిన 20 రేడియో నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. అలాగే 150కు పైగా ఆంగ్ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య వెబ్‌సైట్లలో ప్రచురితమయ్యాయి. 2002లో Poetry.com నిర్వహించిన కవితా పోటీలో బహుమతి అందుకున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిపి ఇప్పటివరకు 15 పుస్తకాలను ప్రచురించారు.
సాహిత్యం, మానవ సంబంధాలు, సామాజిక అంశాలు, సమకాలీన జీవన అనుభవాలు ఆయన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. రచనతో పాటు AI ఆర్ట్‌పై ఆసక్తి కలిగి, పజిల్స్‌ను రూపొందించడం, వాటిని సృజనాత్మకంగా మెరుగుపరచడం వంటి కార్యకలాపాల్లోనూ ఆసక్తిగా పాల్గొంటున్నారు.
ఆయన విద్యార్హతలు: M.A. (Sociology, English, Psychology), B.Ed., P.G. Diploma in Journalism and Mass Media.































