• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

తమిళ కథ : బిరియానీ (హాస్య కధ)

జిల్లేళ్ల బాలాజీ by జిల్లేళ్ల బాలాజీ
April 11, 2026
in అనువాద కథలు
0
తమిళ కథ : బిరియానీ (హాస్య కధ)

తమిళ మూలం : ఎస్‌.కె.పి.కరుణా
అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ 

ఓ జనవరి నెల ఉదయం పూట, ‘పిళ్లయార్‌ గుడి వీధిలో’ ఉన్న గణేష్‌ ఇంటి అరుగు మీద కూర్చుని నేనూ వాడూ క్లాసు టెస్టు కోసం లెక్కలు ప్రాక్టీసు చేసుకుంటున్నాం. ఆ లెక్కలు కూడా ఇంకా నాకు గుర్తుంది. కాల్‌కులస్‌ (Second Order Differential Equation) లెక్కల్లో పులి అని మమ్మల్ని మేమే అమాయకంగా నమ్ముతున్న కాలం. సంపత్‌ సార్‌ను మేమే కోరిన ఓ మోడల్‌ టెస్ట్‌ ఇంకాసేపట్లో మొదలుకాబోతుంది.

పదిగంటల పరీక్షకు, ఎనిమిది గంటలకే వచ్చి పక్క వీధిలో ఉండే గణేష్‌ ఇంటి అరుగుమీద లెక్కల పుస్తకంలో మునిగిపోయి ఉన్నాం. కాల్‌కులస్‌ లోతుల్లోకి వెళ్లి ఒక థియరీని నేను సాల్వ్‌ చేస్తున్న సమయంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి, ఎక్కడికో వెళ్లటానికి దారి అడిగాడు. లేదూ అడుగుతున్నట్టుగా భ్రమ కలిగింది. తల వంచుకుని ఎలా వెళ్లాలో చెబుతూ, కాల్‌కులస్‌నూ పూర్తిచేసి, తల పైకెత్తి చూసేసరికి, ఎదురుగా నిలబెట్టిన నా సైకిలు కనిపించలేదు. 

‘‘గణేష్‌, నా సైకిల్‌ను చూశావా?’’

‘‘నువ్వు సైకిల్లోనా వచ్చావు?’’

వాడు ఇంకా తన నోటు పుస్తకం నుండి తల పైకెత్తలేదు.

‘‘పోరా,  నీ…’’

నేను లేచి, అరుగుమీద నుండి దిగి వీధిలోకి చూశాను. రెండు వైపులా ఒక్క సైకిలూ వెళ్లటం కనిపించలేదు. నేను గణేష్‌ ఇంటి మెట్లపై అలవాటుగా నా సైకిలును వాల్చి నిలిపే చోటుకేసి చూశాను. అక్కడ, నా సైకిలు పెడలు రోజూ రాసుకుంటూ ఉండటంతో రాలిన సిమెంటు పొడితో, నా సైకిలు లేని ఆ ఖాళీ చోటును చూస్తుంటే కళ్లల్లో నీరు పొంగుకొచ్చింది.

తర్వాత కొన్ని గంటలుగా అక్కడికీ ఇక్కడికీ పరుగులు తీసి చూశాం. సరైన సమయంలో అక్కడికొచ్చి చేరిన ఇళంగో సైకిల్లో కూర్చుని మరొకసారి వెతుకులాడాం. నా సైకిలు వెళ్లినట్టుగా ఒక్క ఆనవాలూ లేదు. ఇంటి ముందు గుంపుగా ఉండటాన్ని చూసిన పాలవాడు వచ్చి విచారించేసరికి, జరిగింది చెప్పాం.

‘‘అరె, ఔనూ, ఒకడు నీ సైకిలును తీసుకెళ్లటాన్ని నేను కూడా చూశాను.’’ అని మొదటి క్లూ ఇచ్చాడు.

‘‘ఎవరన్నా?’’ అన్నాను ఆసక్తిగా.

‘‘నాకెలా తెలుస్తుందప్పా. నీ దగ్గరికొచ్చి మాట్లాడుతున్నాడు. తర్వాత బయటికొచ్చి నీ సైకిలును తీసుకుని బయలుదేరి వెళ్లిపోయాడు. అంతే నేను చూశాను.’’ అన్నాడు.

ఆ రకంగా, ఒకడొచ్చి దారి అడగటం భ్రమ కాదు, నిజంగానే వచ్చాడు. మాలోని జాగురూకతను పరిశోధించి చూశాడు. వెళుతున్నప్పుడు నా సైకిలును నడుపుకుంటూ వెళ్లిపోయాడు.

‘‘అదెలా రా, ఒకడొచ్చి మీ కళ్ల ముందరే సైకిలును తీసుకుని, మిమ్మల్నే దారి అడిగి వెళ్లటం కూడా తెలియకుండా, లెక్కలేసుకుంటున్నారు.’’ అంది గణేష్‌ వాళ్లమ్మ.

చెప్పేందుకు బదులేమీ లేదు. అయితే, సత్యంగా, సర్‌ ఐసక్‌ న్యూటన్‌ ఉండుంటే, నా కాల్‌కులస్‌ ఆసక్తిని గమనించి చాలా సంతోషించి ఉండేవాడు.

మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో, నాకు అర్థమైపోయింది! ఇక నా సైకిలును నేను మళ్లీ చూడబోవటం లేదు. శోకంతో కూర్చొని ఉన్న నాతో, ‘‘ఒరేయ్‌, వెళ్లి స్టేషన్లో ఒక కంప్లైంటు ఇచ్చేస్తే మొత్తంగా దొరికినప్పుడు నీ సైకిలూ దొరుకుతుంది.’’ అన్నాడు అరుళ్‌ వాళ్ళన్న. నేనూ, ఇళంగో ఇద్దరమూ స్టేషన్‌కెళ్లాం.

పట్టణ రక్షక భట నిలయం గుమ్మంలోనే హెడ్డయ్య నిలబడి సిగరెట్టు తాగుతున్నాడు. నన్ను చూడగానే, ‘‘ఏంటప్పా? ఏంటి ఇటు వైపు?’’ అన్నాడు.

‘‘నా సైకిలు దొంగతనం జరిగింది సార్‌!’’

‘‘ఏంటీ? నీ సైకిలు కనిపించలేదా? ఏదీ ఆ నీలి రంగు సైకిలేనా? చక్రంలో కలర్‌ కలర్‌గా లైట్లూ అవీ తగిలించి ఉంటావే. అరె. చాలా అందమైన సైకిలు కదప్పా.’’ అన్నాడు. 

అప్పటివరకూ కళ్లల్లో నిండిన కన్నీళ్లు గట్లు తెగి బయటికొచ్చాయి. హెడ్డయ్య దాకా నా సైకిలు గొప్పతనం ప్రాకినట్టుంది.

‘‘సరే, సరే. ఏడవొద్దు. లోపలికొచ్చి ఒక కంప్లయింటు రాసివ్వు. కనిపెట్టేద్దాం.’’ అన్నాడు. 

‘‘సార్‌, కంప్లయింటు రాసిచ్చేలోపు వాడు నా సైకిలును ఈ ఊరి నుండే తీసుకెళ్లిపోతాడు. తొందరగా వచ్చి కనిపెట్టండి.’’ అన్నాను.

ఒక సైకిలు కనబడటం లేదనగానే, ‘పోలీసు స్టేషన్ హడావిడిగా, వెంటనే వైర్‌లెస్‌లో అందరినీ హెచ్చరించి, ఊరిని వదిలి బయటికెళ్లే తొమ్మిది రోడ్లల్లోనూ చెక్‌పోస్ట్‌లు పెట్టి, సైకిలు దొంగతనం చేసినవాడిని పట్టుకుంటారు’ అని అప్పటిదాకా నమ్మేవాడిని.

అయితే, హెడ్డయ్య ఏ హడావిడీ చెయ్యలేదు. నిదానంగా సిగరెట్టును పూర్తిచేసి, ‘‘శేఖర్‌, నీ సైకిలును బయటికి తియ్యి. వెళ్లి చూసొద్దాం.’’ అని ఇంకో పోలీసును వెంటబెట్టుకుని మాతో బయలుదేరాడు. 

ఆదికాలం నుండి మన న్యాయ విచారణా పద్ధతిలో ఒక అలవాటుంది. ఏదైనా కనిపించలేదని ఫిర్యాదు చేస్తే, మొదట ఫిర్యాదు చేసిన వాళ్ళనే అనుమానంతో విచారణ చేస్తారు.

‘ఎలా కనిపించకుండా పోయింది? అప్పుడు నువ్వెక్కడున్నావు? నీకు బయటెక్కడైనా అప్పుందా? నీ భార్యతో సఖ్యతగా ఉంటున్నావా?’ అన్న ప్రశ్నలను వాళ్లు అడుగుతున్నప్పుడు, తొంభై శాతం మంది, ‘అయ్యా, నా మేక కనిపించకుండా పోలేదయ్యా. నేనే నిద్రలో దొంగతనం జరిగినట్టుగా కలగన్నాను.’ అని చెప్పి పారిపోతారు.

నేను నా సైకిలు విషయంలో మొండిగా ఉండటం వల్ల, హెడ్డయ్య విచారణ గణేష్‌ ఇంటి అరుగు నుండి ప్రారంభమైంది.

ముందుగా పాలవాడు. ‘‘ఓయ్‌, పాలాయనా! ఆ సైకిలును తీసుకెళుతున్నప్పుడు నువ్వు చూశావా?’’ 

‘‘చూశానయ్యా.’’

‘‘అలాగా. ఎటు వైపుగా వెళ్లాడు.’’

‘‘ఈ వైపుగానే వెళ్లాడయ్యా.’’

‘‘అలాగా. సరే. తీసుకెళ్తున్నవాడు నీకెలా పరిచయం?’’

సరిగ్గా మూడవ ప్రశ్నతో పాలవాడికి భీతి కలిగేలా చేశాడు హెడ్డయ్య.

ఆ లోపు అక్కడ ఓ చిన్న గుంపు చేరింది. గుంపును దూరం చేస్తూ, గణేష్‌ వాళ్ల నాన్న అంగడి నుండి భోజనానికి ఇంటికొచ్చాడు. తెల్లని బట్టలు ధరించిన ఆ ఎత్తైన మనిషి అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ మౌనంగా ఇంట్లోకెల్లిపొయాడు.

‘‘ఇప్పుడు ఇంట్లోకెళ్లారే, ఎవరాయన?’’ అన్నాడు హెడ్డయ్య. ఈసారి నేను భీతి చెందాను.

‘‘సార్‌, ఆయన మా నాన్న.’’ అన్నాడు గణేష్‌.

హెడ్డయ్య, ఆపైన ఆ దిశగా వెళ్లకుండా, విచారణ నా మీదికి మళ్లించాడు.

‘‘సరే, ఒక దొంగ వచ్చి నీ సైకిలును తీసుకుని వెళ్లేంత వరకూ నువ్వేం చేస్తున్నావు?’’

‘‘లెక్కలు వేసి చూసుకుంటున్నాను సార్‌.’’

‘‘ఏదీ? దాన్ని చూపించు చూద్దాం.’’

నా లెక్కల నోటు పుస్తకాన్ని చూపించాను.

దాన్ని చేతిలోకి తీసుకుని తిప్పించి మళ్లించి చూశారు. క్యాలకులస్‌ తెలిసిన మా టీచరు కూడా అంతసేపు దాన్ని చూసుండరు. మేమందరం హెడ్డయ్యనే కళ్లార్పకుండా చూస్తున్నాం. హెడ్డయ్య కళ్లు మాత్రమే నోటు పుస్తకాన్ని చూస్తోంది. ఆలోచనలన్నీ నా నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నట్టుంది.

నోటు పుస్తకాన్ని చేతికిచ్చి, ‘‘సరే, రా. వెళ్లి వెతికి చూద్దాం.’’ అని బయలుదేరాడు.

హమ్మయ్య! స్టేషన్లో నుండి బయలుదేరినప్పటి నుండి ఆయన చేసిన మొదటి ప్రయోజనకరమైన పని ఇదే. ఆయనా, శేఖర్‌ పోలీసూ ఒక సైకిల్లోనూ, నేనూ ఇళంగో వాడి సైకిల్లోనూ బయలుదేరిన మొదటి పదడుగుల్లోనే ఆయన బండి ఆగింది. వెనక్కు చూసి ఇళంగోను దగ్గరికి పిలిచారు.

‘‘ఔనూ, నువ్వెవరు?’’

‘‘వీడి క్లాస్‌మేట్‌ను సార్‌.’’

‘‘ఇది నీ సైకిలా?’’

‘‘ఔను సార్‌.’’

‘‘సరే, నువ్వెందుకు ఇతనితో పాటు లెక్కలు వెయ్యలేదు.’’

‘‘నాకు లెక్కల పరీక్ష లేదు సార్‌. అందుకనీ నేనప్పుడు రాలేదు.’’

‘‘అంటే, వీడి సైకిలు కనిపించకుండా పోయినప్పుడు, నువ్వక్కడ లేవు.’’

దేనికీ భయపడని ఇళంగో సన్నగా వణికాడు.

‘‘రేయ్‌, నన్ను ఇంట్లో వెతుకుతుం టారు. నే వెళ్తాను. నా సైకిలును నువ్వు ఉంచుకో!’’ అని చెప్పి వేగంగా వెళ్లిపోయాడు.

దేన్నో సాధించిన తృప్తితో, హెడ్డయ్య సైకిలు వెనక కూర్చొని బయలుదేరటంతో, ఆయన సైకిలు వెనకే నేను బయలుదేరాను. అక్కడా ఇక్కడా తిరగకుండా, నేరుగా దొంగ ఇంటికే వెళ్లే లాఘవంతో హెడ్డయ్య సైకిలు సన్నిధి వీధికి నేరుగా ఉన్న వీధిలోకి వెళ్లి, పోలీసు స్టేషన్నూ దాటుకుని తిరువూడల్‌ సందులోకి ప్రవేశించింది.

ఆ వీధికి మధ్యలో ఉన్న పేరుపొందిన స్టార్‌ బిరియానీ హోటల్‌ ముందు ఆయన సైకిలు ఆగింది. వెనకనే వెళ్లిన నన్ను చూసి, ‘రా’ అంటూ హోటల్లోకి ప్రవేశించాడు. నేనూ, శేఖరూ(పోలీసు) మా సైకిళ్లకు తాళాలు వేసి లోపలికి వెళ్లేలోపు, టేబుల్‌ మీద మూడు ఆకులు పరిచి, అందులో మటన్‌ బిరియాని వడ్డించబడి ఉంది.

మంచి ఆకలి సమయం. నా సైకిల్‌ను కూడా కాసేపు మరిచిపోయి బిరియానీని తినటం మొదలుపెట్టాను. వాళ్లు ఏదేదో కేసుల గురించి మాట్లాడుతున్నవాళ్లు, ఉన్నట్టుండి, ‘‘సైకిలును దొంగ తీసుకుని పోవటం కూడా గమనించకుండా, ఈ పిల్లవాడు చక్కగా లెక్కలేస్తాడు. నా కొడుకు ఏమిరా అంటే లెక్కల పుస్తకం వైపే చూడనంటాడు. చదివే పిల్లవాడంటే ఇలాగే ఉండాలి.’’ అని నన్ను పొగిడాడు. 

వాళ్ళు, నాకన్నా రెండు రెట్లు ఎక్కువ తిన్నా, నాకన్నా ముందే లేచి బయటికెళ్లిపోయారు. బిల్లు నా చేతికొచ్చింది. దాన్ని తీసుకుని బయటికొస్తే, హెడ్డయ్య, క్యాష్‌ కౌంటర్‌ పక్కన నిలబడి పన్ను గుచ్చుకుంటూ కనిపించాడు.

బిల్లు చేత బట్టుకుని నిలబడున్న నన్ను చూసి, ‘‘తమ్ముడూ, బిల్లు కట్టేయ్‌!’’ అన్నాడు. 

బిల్లు మొత్తం తొంభై రూపాయలు. 1984 వ సంవత్సరంలో ఒక మటన్‌ బిరియాని గుడ్డుతో సహా, పన్నెండు రూపాయలని గుర్తు. ‘‘సార్‌, నా దగ్గర డబ్బులు లేవు.’’ అన్నాను బిత్తరపోతూ.

‘‘బాయ్‌, తమ్ముడు దగ్గర డబ్బుల్లేవంట. తర్వాత వచ్చి ఇచ్చేస్తాడు. తమ్ముడెవరో తెలుసుకదా?’’ అన్నాడు హెడ్డయ్య. ‘‘తెలియకేం. బాగా తెలుసే. దానికేమప్పా. నువ్వు తర్వాతే తెచ్చివ్వు.’’ అంటూ ఒక నోటు పుస్తకాన్ని తెరిచి లెక్క రాసుకున్నాడు.

ఇలా, నేను సైకిలును పోగొట్టుకున్న ఐదు గంటల సమయంలోనే హెడ్డయ్య నాకు బిరియానీ తినిపిచ్చి, బిరియానీ హోటల్లో నాకొక అకౌంటూ ఓపెన్‌ చెయ్యించాడు.

అవ్వాల్టి వెతుకులాట, బిరియానీ అంగడితో ముగిసింది.

‘‘నువ్వు ఇంటికి పో. అక్కడికీ ఇక్కడికీ తిరగొద్దు. ఎవరు తీసుకెళ్లుంటారో మాకు తెలుసు. ఇప్పుడు వెళ్తే ఇంట్లో ఉండడు. రాత్రికెళ్లి అలాగ్గా జవురుకుని వచ్చేస్తాం. నువ్వు వెళ్లి లెక్కలేసుకో.’’ అని వెళ్లిపోయారు వాళ్లిద్దరు.

మరునాడు బడిలో మొదటి ఇంటర్వెల్లో, ఇళంగోను వెంటబెట్టుకుని పోలీస్టేషన్‌కెళ్లాను. 

‘‘నేను రాను రా.’’ అన్నాడు వాడు మొదట్లో.

‘‘తిరిగొస్తున్నప్పుడు నా సైకిలునూ తీసుకుని రావద్దా? రారా.’’ అని నమ్మకంతో బయలుదేరాము. నిన్న చూసిన అదే చోట హెడ్డయ్య నిలబడి సిగరెట్టు పీలుస్తున్నారు. బడి యూనిఫామ్‌తో ఆయన ముందు నిలబడేసరికి, గుర్తు పట్టటానికి కాస్త తడబడ్డాడు. తర్వాత,

‘‘నిన్న వాడు దొరకలేదప్పా. ఈ దినం తీసుకొచ్చేస్తాం. నువ్వు స్కూలుకు పో.’’ అన్నాడు.

ఎలాగైనా తిరిగొస్తున్నప్పుడు నా సైకిల్లోనే వస్తానని భావిస్తున్న నాకు గొప్ప నిరుత్సాహం కలిగింది. నా హావభావాలను చూసినందు వల్లో, లేదూ ఈపాటికే బిరియానీ అంగడి తెరిచి ఉంటుందని కాబోలో హెడ్డుగారు మనసు మార్చుకున్నారు. నేను బడికి వెళ్లటానికి వెనుతిరిగేసరికి, ‘‘తమ్ముడూ, ఉండుండు. ఇప్పుడెల్లి చూద్దాం.’’ అన్నాడు.

అలవాటు ప్రకారం, ఇళంగోను పంపించేసి, ఇంకొక కొత్త పోలీసును వెంటబెట్టుకొచ్చాడు. ఈసారి నేరుగా మండి వీధిలోకి ప్రవేశించి కల్‌నగర్‌, సముద్రం కాలనీ దారిగుండా కామరాజు శిల దగ్గరికొచ్చి చేరాం. దార్లో అక్కడక్కడా ఆగి ఎవరినైనా పిలిచి ఏదో విచారించేవారు. తర్వాత అక్కడ నుండి నేరుగా బయలుదేరి స్టార్‌ బిరియానీ సెంటర్‌.

బడిలో చదువుకునే విద్యార్థిగా ఉన్నప్పటికీ కూడా, చేతిలో డబ్బు రాబడికి ఏ కొరతా లేని కాలమది. రోజూ ఇరవై రూపాయలు మా బస్సు కంపెనీ లెక్కలో నుండి నేను తీసుకోవటానికి అనుమతించబడి౦ది. ఆ డబ్బుతో నలుగురు మిత్రులం అరుణా రెస్టారెంట్లో మసాలా దోసె తినే స్థాయికి సరిపొయ్యేలా ఉంటుంది. సైకిలు పోయిన దగ్గర నుండి నా అడుగులు నేరుగా స్టార్‌ హోటల్‌కు వెళుతోంది.

వారం రోజులు గడిచాక, స్టార్‌ హోటల్లో నా ఖాతాలో 400 రూపాయల బాకీ ఉంది.

‘ఇంకో 400 రూపాయలు వేస్తే కొత్త సైకిలే కొనుక్కోవచ్చు. ఇంక, అనవసరంగా ఖర్చు చెయ్యొద్దు.’ అని స్నేహితులు కచ్చితంగా చెప్పేశారు. దొంగతనం జరిగిన నా సైకిలు మీదికే మనసు పోతున్నా, ప్రస్తుత పరిస్థితిని గ్రహించి పోలీస్టేషన్‌కెళ్లటం మానేశాను.

ఒకరోజు, హెడ్మాస్టరు పిలుస్తున్నారని మా తరగతి గదికి ప్యూను వచ్చాడు. దేనికోసమో తెలియక అయోమయంగా హెడ్మాస్టరు గదికి వెళితే, అక్కడ హెడ్డయ్య, శేఖర్‌ పోలీసూ నవ్వుతూ కూర్చొని కనిపించారు. అరుళ్‌దాస్‌ సారే హెడ్మాస్టరు. ఎంతో ప్రశాంతమైన స్వభావం కలిగిన ఆయన, పోలీసుల ముందు ఆదుర్దాతో కూర్చొని కనిపించారు.

‘‘నిన్ను కలవటానికే వచ్చారు.’’ అన్నాడు కోపంగా.  నేను హెడ్డయ్యను దీనంగా చూశాను.

‘‘ఏం తమ్ముడూ, తర్వాత స్టేషన్‌ వైపు మనిషే కనిపించలేదు. నేను రోజూ నీ కేసునే చూస్తున్నాను. ఒక ఆనవాలు దొరికింది! కొంచెం వస్తావా? వెళ్లి చూసొచ్చేద్దాం.’’ అన్నారు.

నేను చేతి గడియారంలోకి చూశాను. సరిగ్గా మధ్యాహ్నం 12.00. స్టార్‌ హోటల్‌ తెరిచి ఉంటుంది. హెచ్చెమ్‌ నన్నే సూటిగా చూస్తుంటే, నేను ప్రశాంతంగా బలిపశువులాగా వాళ్లతో బయటికెళ్లాను. 

ఈసారి మా వెతుకులాట, కొత్త వీధిలో ప్రారంభించి, అలాగే విక్టోరియా పాఠశాల మార్గం గుండా పెద్ద వీధి మిట్టకొచ్చి, అలవాటుగా స్టార్‌ హోటల్‌ దగ్గరికొచ్చి ముగిసింది. మధ్యలో అక్కడక్కడా విచారణలు. ఈ మధ్యలో నా సైకిలు కనిపించకుండా పోయిందనీ, అదొక నీలిరంగు సైకిలనీ, ఆ సైకిలు చక్రంలో కలర్‌ కలర్‌గా లైట్లు పెట్టుంటాయని మా ఊరికంతా తెలిసిపోయింది.

ఈలోపు నాకూ, హెడ్డయ్యకూ మధ్యలో ఒక వినోదమైన స్నేహం రూపొందింది. తర్వాత రోజుల్లో, ఆ స్నేహానికే Stockholm Syndrome అని పేరు పెట్టి పిలిచింది ఈ సమాజం. ఒకసారి ఆయన నన్ను ఇంటికి కూడా తీసుకెళ్లి, ఆయన భార్యకు పరిచయం చేశాడు. కొన్ని సమయాలలో అక్కడక్కడా కాఫీ తాగేసి మా వెతుకులాటను కొనసాగించేవాళ్లం.

ఎంతో ప్రశాంతమైన ఊరు మా ఊరు. అయితే, రజినీ సినిమా, టి.రాజేందర్‌ సినిమాలు రిలీజ్‌ అయ్యే రోజు మాత్రం, కచ్చితంగా మా ఊరి థియేటర్లలో లైటుగా గొడవలు కొట్లాటలు జరుగుతాయి. నాకు ఆ దిగుళ్లేవీ లేవు. హెడ్డయ్యతో నేను థియేటర్‌కు వెళ్తే, అక్కడున్న పోలీసులు గుంపును పక్కకు తోసి దారి వదిలేలా చేస్తే, ఇరువైపులా మెల్లగా తల తిప్పుతూ లోపలికి ప్రవేశించి కూర్చొని, ముందు సీట్లపై కాళ్లు పెట్టుకుని సినిమా చూసిన ఆ కాలమే నా జీవితంలోని వసంత కాలం.

సాయంకాల సమయాలలో మద్రాస్‌ టీ కొట్లో హెడ్డయ్యతో, నా స్నేహితులతో టీ తాగుతున్న సమయాల్లో దాదాపు మా సంభాషణలు ఇలాగే ఉండేవి. 

‘‘మన ఊళ్లో న్యాయం పద్ధతేం బాగాలేదు హెడ్డయ్యా?’’ అంటాడు ఇళంగో.

“ఏం తమ్ముడూ, ఎందుకలా అంటున్నావు?’’

‘‘లేకపోతే ఏంటి సార్‌, బయాలజీ రికార్డు మొత్తం రాస్తేనే మార్కులిస్తానని చెప్పేశారు. అందులో చాలా బొమ్మలు కూడా వెయ్యాల్సి ఉంటుంది. నేను అక్కడ బొమ్మలు గియ్యనా, లేదూ మీతో కలిసి వీడి సైకిలు వెతకనా?’’

‘‘ఏమయ్యా, ఆ మాత్రం దానికేనా బాధపడతారు. రేపొచ్చి మీ టీచరుకు ఒక్కమాట చెప్పి వెళ్తానులే. సరేనా?’’

‘‘ఏమో హెడ్డయ్యా, నాకు ఫుల్‌ మార్కులు తీసివ్వటం మీ బాధ్యత.’’

‘‘ఆ విషయం నేను చూసుకుంటాను తమ్ముడూ. నువ్వు దేనికీ దిగులు పడకు.’’

మరునాడు, బయాలజీ మేడమ్‌ నన్ను స్టాఫ్‌ రూమ్‌కు పిలుస్తున్నట్టుగా ఒక పిల్లవాడు వచ్చి చెప్పాడు. కోపమొస్తే వెదురుదబ్బ తీసుకుని ఇష్టమొచ్చినట్టు కొట్టటంలో ప్రసిద్ధులు ఆమె. హెడ్డయ్య ఏదేదో చెప్పి కన్‌ఫ్యూజ్‌ చేసి పెట్టారో ఏమో అని ఆలోచిస్తూ వెళ్లాను. నన్ను లోపలికి రమ్మని పిలిచింది. అప్పుడక్కడ ఎవరూ లేరు.

‘‘రేయ్‌, పోయిన వారం మా ఇంటి కిటికీ పక్కన తీసిపెట్టిన నా కమ్మలు కనిపించటం లేదురా. మొత్తం నాలుగు సవరాలు. పోలీస్టేషన్‌కెళ్లి కంప్లైంటు ఇవ్వమని సార్‌ (ఆమె భర్త)తో చెప్తే, పోలీస్టేషన్‌కు వెళ్లటానికే భయపడుతున్నార్రా. నీకు పోలీసులందరూ ఫ్రెండ్స్‌ అంట కదా? నువ్వు కొంచెం పోలీసులతో చెప్పి కనిపెట్టి ఇవ్వమని చెబుతావా?’’

సైకిలు పోయిన దగ్గరనుండి నా జీవితం మారిపోయింది.

ఇంటికీ, బడికీ మధ్యన పోలీస్టేషన్‌. వెళ్తున్నప్పుడు ఒకసారి, వస్తున్నప్పుడు ఒకసారి అంటూ లోపలికి ఒక విజిట్‌ చేసి రావటం అలవాటైపోయింది. అందులో శని, ఆదివారాలు సెలవు దినాల్లో సగం పూట స్టేషన్లోనే. హెడ్డయ్య కుర్చీకి పక్కన నాకంటూ ప్రత్యేకంగా ఒక స్టూలు వెయ్యటం జరిగింది. పోలీస్టేషన్‌ వ్యవహారాలు మెల్లగా పరిచయం కావటం మొదలైంది.

పోలీస్టేషన్‌ ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఒక గుంపు పరుగెత్తుకొచ్చి గోలగోల చేస్తుంది. ఒక స్త్రీ తల విరబోసుకుని ఏడుస్తుంది. ఒకడు రక్త గాయంతో సైకిల్లో వచ్చి దిగుతాడు. అతణ్ణి ఆసుపత్రికి పంపిన కాసేపటికి, చేతిలో కొడవలి పట్టుకొని అతన్ని నరికిన మనిషొచ్చి చేరుతాడు. ఎవరూ ఎక్కడికీ కదలకుండా, కూర్చున్న చోటే కేసు ముగిసిపోతుంది. కొన్ని నిమిషాలలోనే, పోలీసు స్టేషన్‌ మళ్లీ ప్రశాంతంగా మారిపోతుంది.

ఎవరికి ఎక్కడ డ్యూటీ, పట్టణంలో ఎక్కడ ఎప్పుడు సభలు, ఊరేగింపులు జరుగుతున్నాయి. అన్నీ నాకు తెలిసిపోతుండేవి. ఎన్నో సమయాలలో పార్టీవాళ్ల సమావేశ సభకు అనుమతి ఉత్తరాలన్నీ నన్నే రాసివ్వమనేవాళ్లు. నేనూ రాసి, అలాగే స్టేషన్‌ నోటు పుస్తకంలో రాసి, పోయినసారి ఏ పార్టీకి ఏ చోటులో సభకు అనుమతి ఇవ్వటం జరిగింది అన్న విషయాలనూ రాసి ఉంచేవాడిని.

ఫిర్యాదు దరఖాస్తు రాయటం ప్రారంభించి, విచారణ సమయంలో స్టేట్‌మెంట్‌ రాయటం వరకూ అనుభవాన్ని సంపాదించేశాను. పోలీస్టేషన్‌లో ఒక అంగంగానే మారిపోయిన నన్ను ఇన్‌స్పెక్టరూ మిగిలిన అధికారులూ ఎలా పట్టించుకోకుండా ఉండిపోయారన్నది ఇప్పటిదాకా ఒక పొడుపు కథే. అయితే, అలజడి లేని ప్రశాంతమైన ఒక చిన్న పట్టణంలో అప్పుడు ఏదైనా సాధ్యమే.  

పోలీస్టేషన్‌తో నా హనీమూన్‌ ముగింపుకొచ్చే సమయం వచ్చింది. నేను పదేపదే హెడ్డయ్యతో తిరగటం చూసిన మా అన్న స్నేహితులు అన్నకు చెప్పగానే, నన్ను పిలిచి, ‘‘పోలీస్టేషన్లో నీకేంట్రా పని?’’ అని అడిగాడు.

నా సైకిలు కనబడకుండా పోయిన విషయాన్ని చెప్పాను. అన్న ఇన్‌స్పెక్టర్‌ను పిలిపించి విషయాన్ని చెప్పగానే, తర్వాత రోజు నన్నొచ్చి కలవమని చెప్పాడు. నేనూ మరునాడు ఇన్‌స్పెక్టర్‌ గదికెళ్లాను. ఇన్‌స్పెక్టర్‌ గదిలో లేరు. కొంతసేపు ఎదురుచూసి, అలవాటుగా హెడ్డయ్య పక్కనున్న నా కుర్చీ దగ్గరికెళ్లిపోయాను. కొంతసేపటికి కాలింగ్‌ బెల్‌ శబ్దం వినిపించింది.

లోపలికెళ్లి చూసేసరికి, ఇన్‌స్పెక్టర్‌ చేతిలో నా మ్యాథ్స్‌ నోటు పుస్తకం ఉంది. ఆయన బల్లమీదే పెట్టి మరిచిపోయి వచ్చేసినట్టున్నాను.

నన్ను కూర్చోమని చెప్పిన వ్యక్తి, హెడ్డయ్యను బెల్‌ కొట్టి పిలిచాడు. లోపలికొచ్చి పెద్ద సెల్యూట్‌ చేసిన హెడ్డయ్యకు నా నోటు పుస్తకాన్ని చూపించి, ‘‘ఏంటి ఇదీ?’’ అన్నాడు.

మొదట హెడ్డయ్యకు ఏమీ అర్థంకాలేదు. తర్వాత, తేరుకుని ‘‘తమ్ముడి నోటు పుస్తకం సార్‌.’’ అన్నాడు. ‘‘అది తెలుస్తోంది. ఇదేంటీ?’’ అని నా నోటు పుస్తకంలోని చివరి పేజీని చూపించాడు. 

దాన్ని చూసి నేను అదిరిపడ్డాను. అక్కడే, నేను నా ఖర్చు లెక్కలన్నీ రాసి పెట్టాను.

హెడ్డయ్య తన ముందుకు చాపిన నోటు పుస్తకాన్ని తీసుకుని చూశాడు. అందులో, టేబుల్‌ రూపంలో అందంగా గీత గీసి నా ఖర్చు లెక్కల్ని రాసి ఉంచాను. ఆ లెక్కలు మొదటిరోజు హెడ్డయ్యకు స్టార్‌ హోటల్లో బిరియానీ తీసిచ్చినప్పటి నుండి ప్రారంభమై ఉంది.

చదివే కొద్దీ, హెడ్డయ్యకు చెమటలు పట్టటం మొదలైంది. బిరియానీ లెక్కలు నుండి టీ కొట్టు వరకూ తేదీ, సమయం, తోడొచ్చిన పోలీసుల పేర్లు దాకా నా అందమైన చేతిరాతతో రిజిష్టరై ఉంది. తమిళనాడు పోలీసు శాఖా చరిత్రలో, ఇలాంటి ఒక ముత్యాల్లాంటి ఎవిడెన్స్‌ అంతకు మునుపు ఎప్పుడూ, ఎవరికీ లభించి ఉండదు. హెడ్డయ్య దీనంగా నన్ను చూశాడు. సత్యంగా, నేను నా ఖర్చు లెక్కల కోసమే రాసి పెట్టుకున్నాను. అది నా అలవాటు. అన్న విషయాన్ని నేనెలా ఆయనకు చెప్పటం? అందులోనూ కళ్లతోనే?

‘‘మొత్తానికి, ఒక స్కూలు పిల్లవాడి నుండి నెలల తరబడి బిరియానీ తీసి తిన్నావు? కొంచెం కూడా సిగ్గుగా అనిపించటం లేదా నీకు?’’ ఇన్‌స్పెక్టర్‌ తిట్టటం మొదలుపెట్టారు. హెడ్డయ్యకు, తర్వాత చాలా నిమిషాల వరకూ విరామం లేకుండా తిట్లు పడ్డాయి. ఎదురుగా ప్రశాంతంగా తల వంచుకుని కూర్చొని ఉన్న నన్ను ఇన్‌స్పెక్టర్‌ ఒక్కమాట కూడా అనలేదు. నాకూ ఆయనకు చెప్పేందుకు ఏమీ లేదు. అన్నీ ముగిశాక, ఇన్‌స్పెక్టర్‌ నన్ను స్టేషన్‌ వెనక వైపుకు తీసుకెళ్లారు. వెనకే హెడ్డయ్య కూడా. ఒక పోలీసును పిలిచి అక్కడ కప్పబడి ఉన్న పెద్ద టార్పాలిన్‌ పట్టను తొలగించమన్నాడు. తొలగిస్తే అక్కడ చిన్నవీ పెద్దవీ, కొత్తవీ పాతవీ కొన్ని వందల సైకిళ్లు నిలబెట్టబడి ఉన్నాయి.

‘‘ఇందులో నీ సైకిలు ఉందా? చూసి చెప్పూ.’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.

ఓపికగా, ఒక్కొక్క సైకిలునూ చూశాను. ఎందులోనూ నా సైకిలు లేదు. ‘‘లేదు సార్‌.’’ అన్నాను.

ఇన్‌స్పెక్టరే మళ్లీ ఒకసారి చూశారు. తర్వాత, లోపల ఒక వరుసలో నుండి ఒక సైకిలును బయటికి తియ్యమన్నారు. తీసి, దాన్ని తుడిచాక తెలిసింది అది ఒక కొత్త హీరో సైకిలు.

‘‘నీ సైకిలు దొరికేంత వరకూ, నువ్వు ఈ సైకిలును నీ దగ్గర ఉంచుకో.’’ అన్నారు ఇన్‌స్పెక్టర్‌. 

హెడ్డయ్యను చూశాను. ఇప్పుడు ఆయన తన కళ్లతోనే, ‘దయచేసి ఆ సైకిలును తీసుకో’ అని అభ్యర్థించాడు. నాకు అర్థం కాక ఇన్‌స్పెక్టర్‌కేసి చూశాను.

‘‘పర్వాలేదు. నీ సైకిలు దొరికినా దీన్ని నువ్వే ఉంచుకోవచ్చు.’’ అన్నారు.

‘‘తర్వాత ఏమైంది? ఎక్కడ్రా ఆ సైకిలు?’’ అన్నాడు ఇళంగో.

‘‘ఉన్నట్టుండి ఒక కొత్త సైకిలును తీసుకోమని చెప్పేసరికి, నాకేమీ అర్థంకాలేదు రా. తర్వాత వస్తాను సార్‌ అని చెప్పి వచ్చేశాను. నాకేమో అది సరైనదిగా అనిపించలేదు. దొంగ సైకిలును తీసుకొచ్చానని తెలిస్తే ఇంట్లోవాళ్ళు నా కాళ్లు విరగ్గొడతారు.’’

‘‘పోరా, నా… తీసుకొచ్చి ఇంకెవరికైనా ఇచ్చుండొచ్చు కదా? అరె. ఆ సైకిలును అమ్మేసి, నీకోసం వేరే ఒక కొత్త సైకిలును కొనుక్కొని ఉండొచ్చు కదా? ఎందుకురా వద్దని వచ్చేశావు?’’

ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చిన ఆ సైకిలును నేనెందుకు తీసుకోలేదనటానికి అప్పుడు నా దగ్గర సరైన జవాబు లేదు. అయితే, కచ్చితంగా నేను తీసుకున్న ఆ నిర్ణయానికీ, బిరియానీకీ ఏదో సంబంధం ఉండి ఉండొచ్చు అని ఇప్పుడు అనిపిస్తోంది.

జిల్లేళ్ల బాలాజీ
1961 లో తిరుత్తణిలో జన్మించిన వీరి విద్యాభ్యాసమంతా చిత్తూరులోనే సాగింది. ఎస్వీ యూనివర్సిటీ నుండి ఎమ్మే పట్టా పొందారు.
వీరు 1983 నుండి రచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 167 కి పైగా కథలూ, 123 కి పైగా కవితలూ, 1 నవలా ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 20 కథలకు  బహుమతులు పొందారు.
ఇప్పటివరకూ 1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా… 5) పగడాలు పారిజాతాలూ…6) నిరుడు కురిసిన వెన్నెల 7) గుప్పెడు మల్లెలు (కథా సంపుటాలు) 8) కవన కదంబం (కవితా సంపుటి) 9) జీవితమొక పయనం (నవల) పుస్తకాలను వెలువరించారు.
వీరి సాహిత్య కృషికి గాను 1) ‘గురజాడ కథా పురస్కారం’ (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) కీ.శే. శ్రీమతి కామాక్షీబాయి శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు)  మొదలైనవి వరించాయి.
తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు.
ఇప్పటిదాకా వీరు… 139 కి పైగా కథలు, 12 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 జీవిత చరిత్ర,  2 వ్యాస సంపుటాలు, 1 వచన రామాయణ గ్రంథం… అనువదించారు.
మరో రెండు అనువాద నవలలు సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది.
అలాగే అనువాదంలోనూ… 1) “నల్లి దిశై ఎట్టుమ” పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం
2) ప్రతిష్టాత్మకమైన “కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం”
3) “కె.ఎస్.మొళిపెయర్పు విరుదు” పురస్కారం
4) ‘పడైప్పు’ సంస్థ నుండి ‘ఇలక్కియ చుడర్’ పురస్కారాన్ని పొందారు.
Previous Post

కన్నడ కథ : వర్షరూపిణి

Next Post

జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి

Next Post
జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి

జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి

Discussion about this post

ఈ సంచికలో…

  • ఆంగ్ల కవిత : బందీ 
  • వయసు మీద పడిన …. తరువాత… !
  • ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!
  • ఆంగ్ల కవిత: నేను  అనుక్షణం ఎగసిపడతాను!
  • ఆంగ్ల రచన : వేకువ పాఠం 
  • ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’
  • రష్యన్ కథ : శిక్ష
  • జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి
  • తమిళ కథ : బిరియానీ (హాస్య కధ)
  • కన్నడ కథ : వర్షరూపిణి
  • ఒడియా కథ : భయమే బంధమా?
  • హిందీ కథ : చీకటి గీతం
  • గుజరాతీ కథ: సైనికుడి సంతానం 
  • నిజమే చెప్తాను
  • కన్నడ కథ : ఉత్తమ నటుడు
  • ఒడియా కథ : తప్పెవరిది?
  • అనువాద కవిత: పరిచయం
  • ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com