• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

తమిళ నవల : తెల్ల ఏనుగు (అధ్యాయం 2)

కుమార్ ఎస్ by కుమార్ ఎస్
August 2, 2025
in అనువాద కథలు
0
తమిళ నవల : తెల్ల ఏనుగు (అధ్యాయం 1)

తమిళ మూలం – జయమోహన్ రచన : ‘వెల్లై యానై’

తెలుగు అనువాదం : కుమార్. ఎస్ , అవినేని భాస్కర్. 

తెల్లఏనుగు పుస్తకం (మొత్తం14 అధ్యాయాలు) ఆగస్టు లో ఛాయా పబ్లిషర్స్ ద్వారా మార్కెట్ లోకి రానుంది. కథావసుధ పాఠకులకోసం ముందుగానే రెండు అధ్యాయాలు మాత్రం ప్రత్యేకం. జులై సంచికలో 1వ అధ్యాయం, ఆగస్టు సంచికలో 2వ అధ్యాయం పబ్లిష్ అవుతాయి. ఆ తర్వాత పుస్తకం మార్కెట్లోకి వస్తుంది. 

 

– 2 –

ఏడెన్ స్వారీ చేసుకుంటూ ఆఫీసు ఆవరణలోకి రాగానే దురైసామి , కన్నన్ పరిగెత్తుకుంటూ వచ్చారు. దురైసామి కళ్ళెం అందుకుంటే, కన్నన్ జీనుకు తగిలించిన సంచీని తీసాడు. ఏడెన్ బెల్టు తీసి దురైసామి వైపు విసిరేసి పెద్ద అంగలేసుకుంటూ ఆఫీసులోకి నడిచాడు. రాతి నేల మీద బూట్లు శబ్దం చేస్తూంటే మెట్లెక్కుతున్నాడు. సిపాయి సామి కన్ను ఎదురు రాగానే, “సామ్, నార్‌నొచ్చి నాకు కనపడమనిచెప్పు” అన్నాడు. 

ఆఫీసులోకొచ్చి కుర్చీలో కూచోగానే గది బయట గొంతుకు కూర్చుని ఉన్న అంటరాని కులానికి చెందిన ఓ ముసిలాయన పంఖాకు కట్టున్న తాడును లాగడం మొదలుపెట్టాడు. కిటికీల్లోంచి ధారాళంగా గాలి కొడుతున్నా పంఖా నెత్తి మీద ఊగడం అనేది అధికార హోదాకి సూచన. ఏడెన్ సర్దుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. తాటాకు ఈనెలతో చేసిన కుర్చీ అతని బరువుకి కిర్రుమంది. 

తోపుడు తలుపు తెరుచుకున్న చప్పుడైతే కళ్ళు తెరిచి చూశాడు. ‘నార్’ అనబడే నారాయణన్ లోపలికొచ్చి తటాలున ఒక సెల్యూట్ కొట్టాడు. ఏడెన్ ఓ రెండు క్షణాలు మౌనంగా అతని మీదే చూపుని నిలిపాడు. తలపాగా లాంటి నీలం రంగు టోపీ. మెరిసిపోతున్న ఎర్రటి కోటు మీద అడ్డంగా పైనుంచి కిందికి బుల్లెట్లు వరసలో అమర్చివున్న తోలు బెల్టు. నడుము చుట్టూ బిగించి ఉన్న ఇంకో బెల్టు దగ్గర కోటు తెరుచుకుని అందులోంచి కనపడుతున్న తెల్లటి నూలు చొక్కా. ఆ బెల్టుకి ఒక వైపు బాకు, ఇంకో వైపు కంచు పిడికిలి ఉన్న చేతి తుపాకీ, మోకాళ్ళదాకా ఉండే ఖాకీ ప్యాంటు, కాలి మడిమ నించి మోకాళ్ళదాకా కట్టుకున్న ఖాకీ పుట్టీలు, చేత్తో అస్తవ్యస్తంగా కుట్టించుకున్న తోలు బూట్లు. 

బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియా, బర్మా, మలేషియాల్లో ఉండే సిపాయిలంతా ఒకే రకమైన యూనిఫారం వేసుకుంటారు. యూనిఫారాలు ఒకటే అయినా మనుషులు వేర్వేరు. ఏ రకమైన అస్తిత్వమూ వాళ్ళను ఒకటిగా చెయ్యలేదు. పక్క వాళ్ళ నుండి తమను వేరు చేసుకోడానికి మాత్రమే వాళ్ళు తమ అస్తిత్వాన్ని ప్రకటిస్తారు. నారాయణన్ నుదుటి మీద కనుబొమ్మల మధ్యలో నిలువుగా ఒక సన్నని ఎర్రటి గీత ఉంది. ‘నేను మిగతా వాళ్ళ లాగా కాదు’ అని చూపించుకోడానికే ఆ గీత అతనికి ఉపయోగపడుతుంది. 

నారాయణన్, “సర్” అంటూ పిలిచాడు. 

ఆ పిలుపు తోటి మేల్కొని ఏడెన్, “అక్కడ ఏంటదీ?” అంటూ నారాయణన్ నుదుటివైపు వేలు చూపిస్తూ పరాగ్గా అడిగాడు. 

ఒక్క క్షణం ఆశ్చర్యంగా మొహం పెట్టి నారాయణన్ సమాధానం ఇచ్చాడు, “అది మా మతానికి సంకేతం, సర్.”

ఎక్కడ పట్టారో కానీ ఆ మాటలని మాత్రం వీళ్ళందరూ బాగా నేర్చుకున్నారు. సిపాయి తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నించి అధికారం బ్రిటిష్ ప్రభుత్వం హస్తగతం చేసుకోగానే – సిపాయిల మత పరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ అందరికీ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి. రాత్రికి రాత్రి సిపాయిలందరూ తమ కుల పరమైన చిహ్నాలను మత పరమైన చిహ్నాల కింద మార్చేశారు. అలా మార్చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఎలా వచ్చిందీ అనేది బ్రిటిష్ వాళ్ళకు బుర్రలు ఎంత బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. 

“ఓహ్, అంటే కనీసం నువ్వైనా వేరే వాళ్ళను తాకుతావా?”

నారాయణన్ మౌనం వహించాడు. 

“మాట్లాడు, నార్!” రెట్టించాడు ఏడెన్. 

“నేను తాకకూడని వాళ్ళు కొంతమంది ఉన్నారు, సర్” అన్నాడు నారాయణన్. 

ఏడెన్‌కు ‘అతన్ని ఐస్‌హౌస్‌‌కు పంపించడం వృధా ప్రయాస’ అని వెంటనే అర్థం అయ్యింది. లెఫ్టినెంట్ మెకంజీ తేనాంపేటకు వెళ్ళాడు. చాలా మంది పోలీసుల్లాగే ‘మాక్’ అనబడే మెకంజీ ఇంతకు ముందు బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడు. ఇప్పుడు ఆఫీసులో ఉన్న వాళ్ళల్లో నారాయణన్ కాకుండా స్థానికులతో వాళ్ళ భాషలో మాట్లాడగలిగినవాడు మెకంజీ ఒక్కడే. అయితే ఈ నల్ల వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నా వాళ్ళను నమ్మటం అసాధ్యం. 

 ఏడెన్ కుర్చీలోంచి లేచి “నాతో రా!” అన్నాడు. ఆఫీసు గది బయటికి అడుగుపెడుతూ “నీతో పాటు ఒక ఇరవై మంది సిపాయిలను తీసుకునిరా” అంటూ ఆజ్ఞాపించాడు. 

“ఆయుధాలతోనా సార్?” అడిగాడతను. 

 

జెయమోహన్ తమిళ నవల ‘తెల్ల ఏనుగు’ ను తెలుగులోకి అనువదించిన అవినేని భాస్కర్, ఎస్ కుమార్ లు తొలి రెండు అధ్యాయాలను కథావసుధ పాఠకులకోసం ప్రచురణకు ముందే అందించారు. వారికి, ఆ పుస్తకాన్ని ప్రచురించిన ఛాయ పబ్లికేషన్స్ వారికి కృతజ్ఞతలు. ఆగస్టు 10వ తేదీన బెంగుళూరు బుక్ బ్రహ్మ ఉత్సవంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. తొలి రెండు భాగాలు చదివి ఆ పుస్తకం మీద ఆసక్తి కలిగిన పాఠకులు విడుదలైన తర్వాత పుస్తకం కొనుక్కోవచ్చు. తెల్లఏనుగు ను కొనదలచుకున్న వారు సంప్రదించండి : +91 98801 20221

 

“ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు” అంటూ ఏడెన్ హడావుడిగా మెట్లు దిగి మళ్ళీ ఆవరణలోకి అడుగుపెట్టాడు. అప్పటికే నడినెత్తికెక్కిన సూర్యుడు ముందు వరండానంతా కరిగిన పాదరసంలా మార్చేశాడు. తెల్లగా ఉన్న భవనపు గోడలన్నీ మెరిసిపోతున్నాయి. ఆ చుట్టుపక్కలంతా తక్కువ ఎత్తులో పెంకుల కప్పులతో నిర్మించిన ఆఫీసు భవనాలు కిక్కిరిసివున్నాయి. పెంకుల పైనంతా రాలిపోయిన వేప ఆకులు. అదే పనిగా ఆగకుండా కోయిల కూస్తోంది. ఏడెన్‌కు ఎలా ఉన్నావంటూ కోయిల పలకరిస్తోంది అనిపించింది. 

ఏ పాడుబడ్డ ఓడ నుంచో తీసుకొచ్చిన పొడుగాటి సన్నటి ఇనప స్థంభం భవనం ముందు పాతివుంది. స్థంభానికి దన్నుగా మందమైన తాళ్ళు కట్టి ఉన్నారు. గాలి విసురుకు ఆ తాళ్ళు ఊగుతూ శబ్దం చేస్తున్నాయి. స్థంభం పైన కట్టిన బ్రిటిష్ జెండా సముద్రపు గాలికి రెపరెపలాడుతోంది. చూడ్డానికి ఆ భవనం ఒడ్డున పాతేసిన ఓడలాగుంది. వందల వేల మైళ్ళు ప్రయాణించి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నట్టుంది. కొంత కాలం తర్వాత దాని లంగరు వేర్ల కింద మారి అక్కడ ఒక వటవృక్షంలా నిలుస్తుంది. ఇంకొన్నాళ్ళ తర్వాత అది ఒక్క పెద్ద బండరాయిగా రూపాంతరం చెంది చివరికి ఒక పర్వతంలా మారిపోతుందేమో! 

ఏడెన్ ఆఫీసులోంచి బయటికి అడుగు పెట్టగానే దురైసామి గుర్రాన్ని తీసుకొని అతని దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. గుర్రం తల తిప్పి తన గడ్డాన్ని ఏడెన్ భుజం మీద ఆనించింది. గుర్రం నోటి నుంచి చిక్కగా ఉండే చొంగ జారి అతని ముంజేతి మీద పడింది. దురైసామి జీను బిగిస్తూండగానే ఏడెన్ గుర్రం మీద కూచుని చెయ్యి విదిలించాడు. గుర్రం ముందుకు అడుగువేసి కొద్దిగా పక్కకు తిరిగింది. ఏడెన్ కళ్ళెం పట్టుకుని లాగితే మెడ బిగించి చిన్నగా మూలిగింది. నారాయణన్ హడావుడిగా ఆ భవనం కుడి పక్క చెక్కతో చేసిన వేదిక మీదికెక్కి బాకా నోట్లో పెట్టుకుని గట్టిగా ఊదాడు. బిగ్గరగా పక్షి కూతలాగున్న బాకా శబ్దం సముద్రపు గాలితో పాటూ పైకెగిసి నీటి మీది సిరాలా గాల్లో కలిసిపోయింది. బాకా శబ్దం బదులు అశ్వికులు వరసలో నిలబడుతూ సర్దుకుంటూ చేసే శబ్దం ఇప్పుడు వినపడుతోంది. “అటెంషన్!” అంటూ అరిచాడు, నారాయణన్. ఏడెన్ రోడ్డు వైపు వెళ్తూంటే నారాయణన్ కేక ఆ పరిసరాల్లో ప్రతిధ్వనించింది. 

ఏడెన్ గుర్రం రోడ్డు మీది కెక్కగానే అశ్విక దళం కవాతు చేస్తున్న శబ్దం గాలిని నింపేసింది. దళంలో మొత్తం ఇరవై మంది ఉన్నారు. ఏడెన్ వెనక్కి తిరిగి చూడలేదు. సముద్రపు ఒడ్డు పక్కనే ఉండే గిడ్డంగుల్లో పనిచేసే సిబ్బంది కవాతు శబ్దం చెవిలో పడి వట్టి వేళ్ళ తడికలు వేలాడదీసిన గాజు కిటికీలు పైకెత్తి తల బయటికి పెట్టి చూస్తున్నారు. 

అవతలివైపు నించి వస్తోన్న పైకప్పు లేని రెండు గుర్రాల బగ్గీ నెమ్మదించి ఆగింది. కళ్ళెం బిగుతై గుర్రాలు తమ మెడలను వెనక్కి లాక్కుని చిన్నగా సకిలించి పుల్లల్లా ఉన్న తమ ముందు కాళ్ళను కొద్దిగా పైకెత్తాయి. ఎడమ చక్రం కదిలిపోయి బండి ఒక పక్కకు ఒరిగి చివరకు ఎలాగోలా సర్దుకుంది. తోలరి, కొరడా చేతిలో పట్టుకుని రోడ్డు మీదికి దూకి గుర్రాలను అదుపుచేశాడు. తేరులో కూచుని ఉన్న మూడు కొమ్ముల ఎర్ర టోపీ పెట్టుకున్న తెల్ల జాతి మహిళ ఏడెన్ వైపు చూసింది. పౌడరు కొట్టిన ఆమె ముఖమంతా పాలిపోయి ముడతలతో నిండిపోయుంది. నిస్తేజంగా ఉన్న ఆమె నీలం రంగు కళ్ళు అటూ ఇటూ చూస్తూ ఏం జరిగిందో అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. 

ఆ బండి దాటాకే ఏడెన్‌కు తన వెనకనే పదడుగుల దూరంలో నారాయణన్ తీసుకొస్తున్న సిపాయిల దండు విషయం గుర్తుకు వచ్చింది. అతనికి కంటికి ఐమూలగా అటూ ఇటూ ఊగుతోన్న నీడలా మొదలై చిక్కటి నలుపు రంగులో ఉన్న ఒక ఏనుగు రోడ్డు పక్కనే ప్రత్యక్షమైంది. ఏనుగు ఒక పెద్ద చెక్క పెట్టెను తొండంతో చుట్టి మోస్తోంది. దాని మీద కూచున్న మనిషి పూర్తిగా నగ్నంగా ఉన్నట్టు అనిపించింది. అతను కట్టుకున్న నల్లటి గోచీ ఏనుగు శరీరం రంగులో కలిసిపోవడం వల్ల కలిగిన భ్రమ అది. ఏనుగు కాళ్ళ పక్కనే ఓ పన్నెండేళ్ళ పిల్లవాడు దాంతో పాటూ నడుస్తున్నాడు. వాడి చేతిలో కర్ర, ఒంటి మీద గోచీ తప్ప ఇంకేమీ లేవు. ఏడెన్ గుర్రం ఏనుగును చూసి కొద్దిగా బెదిరి వెనక్కి తగ్గింది. ఏడెన్ గుర్రం మెడ మీద తట్టి దాన్ని శాంతపరిచాడు. 

ఒక్క క్షణం ఏడెన్ కళ్ళు తడితో మెరుస్తున్న ఏనుగు కళ్ళతో కలిసాయి; కొండ రాళ్ళ పగుళ్ళ లోతుల్లో చిక్కుకున్న నీటి చుక్కలు. ఈ నల్ల బండరాయి మనసు లోతుల్లో ఏం దాగి ఉంది? ఈ పిల్లాడు ఒక చిన్న కర్ర ముక్క చేత పట్టుకుని ఏనుగును తనకు కావాల్సినట్టు ఆట ఆడించగలుగుతున్నాడు. దాని కాళ్ళు, తొండం, దంతాలు, చెవులు అన్నీ వాడేం చెపితే అవి చేస్తున్నాయి. కానీ ఏనుగు కళ్ళే వాడి పెత్తనాన్ని అంగీకరించడం లేదు. ఆ కళ్ళు మానవుడి మేధకు అందనివి. చీకటి మూలల్లో దాగిన నిప్పు కణికల్లా ఆ కళ్ళలో ఏదో తెలీని మర్మం ఉంది.

ఐస్‌హౌస్‌ దగ్గర పడుతూంటే ఏడెన్ ఆగాడు. ఇంతకు ముందు తాను చూసిన చెట్టు దగ్గర ఎవ్వరూ లేరు. కొద్ది దూరంలో అర్థ చంద్రాకారంలో ఒక కోట లాంటి ఎరుపు రంగు కట్టడం కనపడుతోంది. ముందు భాగాన పక్క పక్కనే ఉన్న కిటికీలకు ముదురు గోధుమ రంగు అద్దిన గ్లాసులు అమర్చి ఉన్నాయి. అన్ని కిటికీలు గట్టిగా బిగించున్నాయి. గేటులోకి ప్రవేశించిన తర్వాత భవంతి లోపలికి వెళ్ళడానికి ఒక ఏడెనిమిది మెట్లు ఉన్నాయి. భవంతి పైభాగాన గుండ్రటి కిరీటంలా ఉన్న భాగానికి కట్టున్న రెండు జండాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. బ్రిటిష్ జెండా పక్కనే ఫ్రెడరిక్ ట్యూడర్ ఐస్ కంపెనీ వాళ్ళ ఎరుపు చారలున్న తెల్ల జెండా. ఒక మూల నీలం రంగు చతురస్రం, సున్నా ఆకారంలో పెట్టిన తెల్ల చుక్కలు వదిలేస్తే అది ఖచ్చితంగా అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ రాష్ట్ర జెండా అని చెప్పెయ్యొచ్చు. 

ఆ భవంతికి ఒక పక్కగా ముందు భాగాన బాగా అలంకరించిన బగ్గీ ఒకటి నిలిపివుంది. లండన్ నించి దిగుమతి చేసుకుని మరీ తెప్పించినట్టుగా స్పష్టంగా తెలియచేస్తున్నట్టుంది. ఆ బండి మహాగొనీ చెక్కతో తయారు చేశారు. బగ్గీ, నగిషీ పెట్టిన తోలు లాగానో మైనం లాగానో మెరిసిపోతోంది. అక్కడక్కడా కనపడే కంచుతో చేసిన భాగాలు బంగారంలా తళుక్కుమంటున్నాయి. తలుపులకు వెండి తాపడం చేసుంది. నాలుగు నల్లటి అందమైన గుర్రాలు బండి నించి విడదీసి పక్కన కట్టేసి ఉన్నాయి. అశ్విక దళం వస్తోన్న శబ్దం విని తమ మెడలకు కట్టిన దాణా సంచీలతో సహా తల పైకెత్తి చూశాయి. అవి తల పైకెత్తి చూసినప్పుడు వాటి తోకలు సన్నగా వణికాయి. శబ్దం చేస్తూ ఊపిరి బయటికి వదిలింది ఒక గుర్రం. అది విని మిగతావి నెమ్మదిగా పక్కకి తిరిగి తల కొద్దిగా వంచి ఆడించి కింది దవడ కొద్దిగా పైకి లేపాయి. వాటి తోకల మీదున్న జుట్టు నిటారుగా లేచి నిలబడింది. 

ఏడెన్ నారాయణన్‌తో సైన్యాన్ని అక్కడే నిలపమనిచెప్పి తాను గుర్రాన్ని స్వారీ చేసుకుంటూ ఫ్యాక్టరీ ఆవరణలోకి ప్రవేశించాడు. ట్యూడర్ కంపెనీ మేనేజరు పొట్టి కోటు, వదులుగా ఉన్న ప్యాంటు, పొడవాటి బూట్లు వేసుకుని తల మీదున్న అమెరికన్ టోపీ గాలికి పైకి లేవకుండా చేత్తో పట్టుకున్నాడు. అతను తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో దగ్గరకొచ్చి నిలబడగానే ఏడెన్‌కు విషయం అర్థం అయ్యింది; ముందుగానే వాళ్ళన్ని రకాల ఏర్పాట్లూ చేసుకుని ఉన్నారని. 

మేనేజర్ దగ్గరికొచ్చి అతి వినయంగా వంగి నిల్చున్నాడు. ముసిలి ఘటం. అతని గడ్డం కింద రెండు సంచులు వేలాడుతున్నాయనిపించింది. వదులైపోయిన బుగ్గలతో, కొట్టొచ్చినట్టు కనపడే ఎర్రటి ముక్కుతో, పగిలిపోతుందేమో అనిపించే భారీ సైజు పుండులా, తెల్ల పంది ఆకారంలో ఉన్నాడతను. 

ఏడెన్ గుర్రం కిందికి దిగి కళ్ళేన్ని ఒక సిపాయి వైపుకి విసిరి మేనేజర్ దగ్గరికి నడిచి వెళ్ళాడు. “కెప్టెన్ ఏడెన్ బర్న్!” అని ప్రకటించాడు. “మీ కంపెనీ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలని వచ్చాను.”

“తప్పకుండా! ఇక్కడ మా వ్యాపారం అంతా చట్టబద్ధంగా జరుగుతోంది” అన్నాడు మేనేజర్. “నా పేరు నిక్ పార్మర్. మిమ్మల్ని రోజూ చూస్తూంటాను కానీ కలిసే అవకాశం ఎప్పుడూ రాలేదు. లోపలికి రండి.” అతని పలకరింపు నాటకీయంగా ఉంది. ఏడెన్ అతని కళ్ళల్లోకి చూశాడు. అవి నగిషీ పెట్టిన చిన్న లోహపు గోళీల్లా ఉన్నాయి. 

“ఈ రోజు పొద్దున మీ మేస్త్రీ ఒక కూలీని కొడుతూండగా చూశాను. బ్రిటిష్ పాలనలో ఇలా ఉద్యోగిని కొట్టటం నేరం. అతన్ని నేను విచారించాలి” అంటూ మెట్లెక్కాడు ఏడెన్. 

ఆందోళన పడుతున్నట్టుగా పార్మర్ కళ్ళు చిన్నవి చేసి, “క్షమించాలి. అతను మా ఉద్యోగి అయ్యుండడు. మేము అలా కొట్టడాల్లాంటివి చేయం. మా వ్యాపారం అంతా పూర్తి చట్టప్రకారం జరుగుతుంది. మీరొచ్చి మా అకౌంట్లు, కాయితాలు అన్నీ పరీక్షించుకోవచ్చు” అన్నాడు. 

ఏడెన్ అతని కళ్ళల్లోకి నేరుగా చూశాడు. “నేను మీ కాయితాలు చూసిపోదామని రాలేదు, మీ మేస్త్రీని విచారించడానికి వచ్చాను” అన్నాడు. 

“తప్పకుండా” అన్నాడు పార్మర్ వినయంగా. “నేను మా మేస్త్రీలను అందరినీ వరసలో మీ ముందు నిలబెడతాను” అన్నాడు. “మీరెంతసేపు కావాలంటే అంతసేపు విచారించుకోండి. అసలలాంటి సంఘటన జరిగే అవకాశమే లేదు. మా రూల్సు కూడా అందుకు ఒప్పుకోవు.”

ఒకర్నొకరు పరీక్షించుకుంటూ ఇద్దరి కళ్ళు కొంతసేపు కల్సి ఉన్నాయి. ఏడెన్ గట్టిగా నిట్టూర్చి నిశ్శబ్దాన్ని భగ్నం చేశాడు. “మీ వేర్ హౌస్ నేను చూడొచ్చా?” అడిగాడు. 

“మీ దగ్గర అనుమతి ఉందా?” పార్మర్ సాగతీసాడు. 

వాక్యం మధ్యలోనే తెంచేస్తూ, “నాకు ఎవ్వరి అనుమతులు అవసరం లేదు” అంటూ ఏడెన్ తిరుగు సమాధానం ఇచ్చాడు. “నేను ఇంపీరియల్ పోలీస్ డిపార్ట్మెంట్‌ అధికారిని.”

“కానీ మేము అమెరికన్లం. బ్రిటిష్ ప్రభుత్వంతో ప్రత్యేకమైన ఒప్పందం చేసుకున్నాం.” 

 “అది అట్లా ఉండనివ్వండి. మీ కంపెనీ మా భూభాగం మీదుంది. ఘనత వహించిన బ్రిటిష్ మహారాణి ఏలికలో ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు నేను సహించను.”

“మిమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తే నన్ను తప్పు పడతారు.”

“మంచిది. అలాగైతే నా అంతట నేనే లోపలికి వెళ్ళానని చెప్పండి.” సమాధానం కోసం వేచిచూడకుండా బూట్ల మడిమ మీద వేసున్న ఇనప తొడిమలు రాతి మెట్ల మీద ఖంగుమంటూ శబ్దం చేస్తూంటే ఏడెన్ పరుగు పరుగున మెట్లెక్కాడు. పార్మర్ గబగబా అతన్ని అనుసరించాడు. నారాయణన్‌ను గేటు దగ్గరే నిలబడమని చెప్పి ఏడెన్ ఆ భవంతిలోకి అడుగు పెట్టాడు. సగం తెరిచిన పెద్ద పొడుగాటి తలుపు. తలుపుకు అవతల నల్లటి పరదా వేసి ఉంది. దాన్ని పక్కకు తోసి లోపలికి అడుగేశాడు. అంతా చిమ్మ చీకటి. కళ్ళకేమీ కనపడ్డం లేదు. ఎండనుండి నీడలోకి వచ్చిన కళ్ళు ఆ చీకట్లో ఏమీ చూడలేకపోతున్నాయి. 

కుమార్ ఎస్
కుమార్ ఎస్

వృత్తి రీత్యా మెకానికల్ ఇంజనీర్. తెలుగు ఆంగ్ల కథా సాహిత్యం పై ప్రత్యేకమైన ఆసక్తి. హర్షణీయం పాడ్కాస్ట్ నిర్వాహకుల్లో ఒకరు.

హర్షణీయం పాడ్కాస్ట్ లింక్ – https://bit.ly/harshspot

Page 1 of 3
123Next
Previous Post

కువైట్ కథ : బొమ్మలదుకాణం

Next Post

పరిశోధనాత్మక విశ్లేషణం – సినారె కథా కావ్య సమాలోచనం

Next Post
పరిశోధనాత్మక విశ్లేషణం – సినారె కథా కావ్య సమాలోచనం

పరిశోధనాత్మక విశ్లేషణం - సినారె కథా కావ్య సమాలోచనం

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com