కన్నడ మూలం: ప్రకాష్ నాయక్
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్
రాత్రి తొమ్మిది గంటల సమయంలో నిద్రపోతున్న నన్ను, ‘అడవిలో మంటలు చెలరేగాయి, అందరూ వెంటనే బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి’ అనే అరుపు మేల్కొల్పింది. ఎలా ఉన్నానో అలాగే, కట్టుకున్న బట్టలతో, ఫోన్, నా హ్యాండ్‌బ్యాగ్ తప్ప మరేమీ తీసుకోలేనంత భయంతో, గది నుండి బయటపడ్డాను. అప్పటికే రిసెప్షన్ ముందు జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. కొందరు నిద్రమత్తులో, మరికొందరు పడుకునే ముందు తీసుకున్న మందుల ప్రభావంతో మత్తులో,
ఈ అర్ధరాత్రి తమను ఎందుకు లేపారో, తాము ఏమి చేయాలో తెలియని స్థితిలో భయంతో అటు ఇటూ తిరుగుతున్నారు. సియారా పర్వత శ్రేణి పశ్చిమ వాలున పచ్చదనంతో స్వర్గంలా భాసించే మా ట్రాంక్విల్ మీడోస్ వృద్ధాశ్రమం అగ్నిప్రమాదానికి వణికిపోతోంది; ఏ క్షణంలోనైనా నోరు తెరుచుకుని కబళించడానికి వస్తున్న మంటలకు బలికావచ్చనే భయం అందరి ముఖాల్లోనూ స్పష్టంగా కనిపించ సాగింది. వృద్ధాశ్రమం వైపు దూసుకుపోతున్న పొగ నల్లటి మేఘాలు ఇంకా దూరంలో ఉన్నప్పటికీ, వాటి వెనుక ఉన్న మంటల కారణంగానేమో ఆ చీకటిరాత్రి కూడా పట్టపగలులా ప్రకాశిస్తున్నట్టు అనిపించింది.
రాత్రి గడిచేకొద్దీ ట్రాంక్విల్ మీడోస్ వాతావరణం మరింత అల్లకల్లోలంగా మారసాగింది. ఆ పొగను పీల్చుకుంటూ, ఏ క్షణంలోనైనా కనిపించగల అ కార్చిచ్చును ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాం. క్షణక్షణం ఆ కారుమేఘం రాక్షసుడిలా పెరిగి, గెలుపు అంచున ఉన్న ఉన్మత్త సైన్యంలా ముందుకు దూసుకు వస్తోంది. రాబోయే అగ్నిప్రమాదం చేయగల భీభత్సం పక్కనున్నవారి ముఖాల్లో అప్పటికే నాట్యం చేయడం చూసి, సాధారణంగా ధైర్యం కోల్పోని నా మనస్సు కూడా డీలా పడసాగింది. నా చర్మం లోపలి భయంతో కాలిపోతోందో లేక నా శరీరంపై పడుతున్న వేడి బూడిద వల్లనో అర్థం కావడం లేదు. అక్కడ ఉన్న కొద్దిమంది సహాయకులు ఆశ్రమంలోని వృద్ధులను శాంతపరచడానికి నానా తంటాలు పడుతున్నారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని, కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నామని పదేపదే చెబుతున్నారు. వారు శాంతంగా ఉండమని చెప్పిన కొద్దీ, మాలో భయం మరింత పెరిగింది. మాలో కొందరు అప్పటికే శ్వాస ఆడక కుర్చీలలో, అవీ దొరకనివారు నేలపై కూలబడ్డారు. నిస్సహాయత అందరి ముఖాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. బీభత్స నాటకాన్ని ఆడటానికి ఆకాశం నుండి దించిన తెరలాంటి దావానలపు కారుమేఘాలు; మరణపు అంచు తాకేలా వీస్తున్న వడగాడ్పులకు బెదరిపోయిన మాకు కాలుతున్న వాసన, లేదా బహుశా దాని గురించిన అవగాహన కావచ్చు, క్షణక్షణం మారసాగింది; వాసన వేయడానికి కొత్త కొత్త కారణాలు ఆవిష్కరించబడి హీన స్వరంలో వినిపించసాగాయి. ‘అడవి జంతువులు సజీవంగా మంటలకు ఆహుతవుతున్నాయి. ఇది వాటి కాలిన వాసన..’ అని ఒకరంటే, “కాకపోవచ్చు, ఇంత ఘాటు వస్తుందంటే దగ్గరలోనే.. పక్కన ఒక పాల డైరీ ఉంది. అక్కడ మూగజీవాలు తప్పించుకోలేక…” అని మరొకరు తమ మాట పూర్తి చేయలేక తడబడ్డారు; ఇంకొకరు ‘అదేమీ కాదు, ఎండుగడ్డి, పచ్చని మొక్కలు ఒకేసారి కాలిపోవడం వల్ల వస్తున్న వాసన. అంతే, భయపడాల్సిన అవసరం లేదు’ అని తమకు తామే సమాధానం చెప్పుకుంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం పక్క గ్రామం మొత్తం జనంతో సహా బూడిదైపోయింది’ అని ఇంకొకరు నిరాశాజనకంగా నిట్టూర్చారు. ఊహాగానాలు నమ్మశక్యం కాని, తిరస్కరించలేనటువంటి సాక్ష్యాలతో తేలియాడుతున్నాయి; వాటి ప్రతిధ్వని దృఢమైన నా మనస్సును కూడా గందరగోళపరచసాగింది. అప్పుడప్పుడు అగ్నిమాపక యంత్రపు సైరన్ వినిపిస్తోంది; అది మావైపు వస్తుందా, మా నుండి దూరంగా వెళ్తుందా, లేదా మా చుట్టూ ప్రదక్షిణ చేస్తోందా తెలియక కొద్దిపాటి ఆశతో నిట్టూరుస్తూ ఉన్నాము. ‘పైన హెలికాప్టర్ శబ్దం వింటున్నారా? అది బహుశా ఈ మంటలను ఆర్పడానికి సహాయపడవచ్చు’ ఎవరో అన్నప్పుడు నేను కూడా ఆలకించాను. ఆ గందరగోళంలో, ఆ మానసిక స్థితిలో మేం ఏదైనా వినగలిగేవాళ్ళం. కార్లు అక్కడి నుండి వెళ్లే శబ్దం; బస్సు రాబోతున్న వార్త, ఏ దారిలో వెళ్తే సురక్షితం, ఎక్కడికి చేరుకుంటే గట్టెక్కినట్లు వంటి భరోసానిచ్చే మాటలు చెవికి తాకుతున్నాయి. నేను నా కోసం రాబోయే కారు కోసం వేచి ఉన్నాను.
గాలి మరింత తీవ్రమైంది. దీపాలు ఆరిపోయి ఎమర్జెన్సీ దీపాలు వెలిగాయి. దూరంగా ఇప్పుడు ఎర్రటి మంటలు కనిపించసాగాయి. వాతావరణం మరింత వేడెక్కి, ట్రాంక్విల్ మీడోస్ ఇప్పుడు బయటకు వెళ్ళడానికి దారిలేని నరకంలా, ఎవరికి లొంగిపోవాలో తెలియని యుద్ధభూమిలా అనిపిస్తోంది. అప్పుడు నేను మంటల లేదా ముక్కు ద్వారా లోపల చేరిన పొగ లేదా నాలుక కొనపై కూర్చున్న బూడిద రుచిని కూడా అనుభవించగలిగాను. దగ్గరగా వస్తున్న మంటలు, చుట్టూ ఆవరించుకుంటున్న పొగ, జడివానలా క్రిందికి దిగుతున్న బూడిద, చుట్టూ అందరి ముఖాల్లో నాట్యం చేస్తున్న భయం వల్ల నేను వణకడం మొదలుపెట్టాను. చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలనే ఆలోచన రాసాగింది. కళ్ళు మూసుకున్నాను; ఎదలో మృత్యుదేవత చేస్తున్న కరాళ నృత్యపు గజ్జెల చప్పుడు వినకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. అదే సమయంలో ఎవరో నా పేరును జాగ్రత్తగా, ప్రేమగా, నెమ్మదిగా ఉచ్ఛరిస్తూ, ముందెన్నడూ వినని విధంగా, ‘వ…సుం…ధ…రా…’ అని పిలవడం విని నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ పిలుపు వచ్చిన వైపు గుంపు మధ్య దారి చేసుకుంటూ వెళ్ళసాగాను. ఎవరో నా చేయి పట్టుకుని దాటించారు. ఇంకెవరో కారు తలుపు తెరిచారు. మేము కూడా రావచ్చా అనే అభ్యర్థన కూడా వినిపించింది. నేను కారు లోపల కూర్చుని ‘త్వరగా వెళ్ళిపోదాం’ అని మెల్లగా గొణిగాను. బయట వ్యాపించిన కమరు వాసనతో కారు రిఫ్రెషర్‌లో పెట్టిన సుగంధతైలపు సువాసన కలిసిపోయింది. ఇంకా వస్తున్న మంటల తాలూకు వేడి సెగలు నేనెక్కడున్నానో తెలియనంత స్పృహ కోల్పోయేలా చేసినప్పుడు కళ్ళు మూసుకుని వెనుకకు ఆనుకున్నాను. బయలుదేరుతున్న మా కారు వైపు ఆశతోనూ, అసూయతోనూ చూస్తున్న కళ్ళ పదునైన చూపులు నన్ను తాకుతున్నట్టు అనిపించింది. కారు వెంటనే కదలలేదు; ఇంకా కొందరిని ఎక్కించుకోవడానికి వేచి ఉన్నాడనిపించి, మళ్ళీ కొంచెం గట్టిగా ‘వెళ్ళిపోదాం’ అన్నాను. మెల్లమెల్లగా పాము కదిలినట్లు కారు బయలుదేరింది.
![]()
బామ్మగారూ.. బామ్మగారూ..
అది బయటి శబ్దమా, లోపలి శబ్దమా తెలియక ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. మేము అప్పటికే చాలా దూరం వచ్చి ఉంటామనిపించింది. కారులోని మందపాటి వెలుగులో డ్రైవర్ ముఖం కనిపించింది. అతని ముఖంలో చిన్న నవ్వు చూసి కొంచెం ఊరట కలిగింది. అయితే, మేము అప్పటికే కార్చిచ్చు బారినుండి బయటపడి మా గమ్యాన్ని చేరుకున్నామా?
‘ఇంత త్వరగా వచ్చిందా?’ అని అడిగాను.
‘ఇంకా లేదు. ఊరికే పిలిచాను. నిద్ర వచ్చిందేమో!’ అన్నాడు. అతని స్వరంలో ఉపశమనం ఉంది. నేను శాశ్వతంగా కళ్ళు మూసుకున్నానేమో అనుకున్నాడు భడవ అని కొంచెం కోపం వచ్చింది.
‘కావాలనుకున్నప్పుడు నిద్ర రాదు, చావు కూడా రాదు’ అన్నాను.
నా స్వరంలోని కఠినత్వాన్ని చూసి అతను జడిసి ఉంటాడు. అతనిని కదిలించడానికే అన్న మాట అది. నిద్ర రాక బాధపడేటంత, చావును ఆశించేటంత నిస్సహాయురాలను ఎప్పుడూ కాదు నేను. ఉన్న సకల సౌకర్యాలను విస్మరించి స్వతంత్రంగా జీవించడానికి వచ్చిన నన్ను చావు అంత సులభంగా భయపెట్టలేదు, భయపెట్టదు. అయినా గాలిలోని ఆ వేడి; ఆ నిట్టూర్పులు, ఆ నిస్సహాయ చూపులు…
‘ఎందుకలా అంటారు బామ్మగారూ, వదిలేయండి. మంచి మాట చెప్పండి.’ అతని స్వరంలోనూ చెప్పలేని భయం. ఎవరినైనా భయపెట్టగల చూపు అది. పాపం పిల్లాడే అయి ఉంటాడని అనుకుని ఊరుకున్నాను. పైగా ఆ సమయానికి నాకు మాట్లాడటానికి ఏమీ లేదు. అతను కూడా మాట పెంచకుండా కారు రేడియో ఛానెల్ మార్చడం మొదలుపెట్టాడు. అన్ని ఛానెళ్లలో కార్చిచ్చు మంటల గురించే వార్తలు. ఇంకొద్దిసేపట్లో మంటలు వృద్ధాశ్రమాన్ని కూడా చేరుకునే అవకాశం ఉందని, అప్పటికే అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారని చెబుతున్నారు. మరో అరగంటలో అదే గ్రామంలోని నూట ఇరవై ఇళ్ళను ఖాళీ చేయాల్సి వచ్చింది లేదా ఖాళీ అయ్యాయని నిర్ధారించుకోవాల్సి వచ్చింది. పెంపుడు జంతువులను తీసుకెళ్ళాలనే పట్టుబడుతున్న వారిని, అప్పటికే ప్రాణాల మీద ఆశ అచేతనంగా నిలబడిన వారిని ఒప్పించాల్సి వచ్చింది., ఆ వివరాలను వినడానికి అతనికీ మనసొప్పలేదో, లేదా నాకు వినడం కష్టమవుతుందని భావించాడో ఏమో ఛానల్ మార్చి పాటలు పెట్టాడు. అవి కూడా వినసొంపుగా లేవు. మరుగుతున్న రక్తాన్ని ఒక్కసారిగా గడ్డకట్టించే విడంబనంతో అవి మరింత కఠినంగా ఉన్నాయి. రేడియో కట్టేసాడు. అప్పుడు ఏర్పడిన నిశ్శబ్దం క్షణకాలం ఊరటనిచ్చినా అది కూడా భరించలేనంతగా అనిపించింది.
‘చుట్టూ కనిపిస్తున్నది పొగేనా లేక నాకే అలా అనిపిస్తుందా? పూర్తిగా బయటపడటానికి ఇంకా ఎంత సమయం పడుతుంది?’ అని అడిగాను.
‘అవును బామ్మగారూ, ఆ పొగ, కాలిపోయిన వాసన గాలికి ఇటు వైపు వస్తోంది. కానీ తగ్గుతోంది. చాలా దూరం లేదు, కానీ ట్రాఫిక్; అందరూ మంటల నుండి మనలాగే పారిపోతున్నవారే. GPS ఇంకా అరగంట ఉందని చూపిస్తోంది. కొద్దిసేపట్లో మనం సురక్షిత ప్రాంతానికి చేరుకుంటాం’ అతని మాటలపై అతనికే నమ్మకం ఉన్నట్లు లేదు.
‘సరే’ అంటూ కళ్ళు మూసుకున్నాను.
![]()
వదిలి వచ్చిన ఆశ్రమం, గాబరా పడిన తెలిసిన ముఖాలు, నేను అక్కడ వదిలి వచ్చిన నిత్యావసర వస్తువులు గుర్తుకొచ్చాయి. ఇంకెన్ని రోజులో? ఆరు నెలల క్రితం వదిలి వచ్చి, ఇప్పుడు మళ్ళీ వెళ్ళవలసి వస్తున్న నా ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో? మళ్ళీ రేపు ఎదుర్కోవాల్సిన వాస్తవాలు – నేను ఎదురుగా వచ్చినప్పుడు చూపు తిప్పుకునే కొడుకు, అతని అనారోగ్యం, తన ఉద్యోగ తొందరలో నిర్లక్ష్యం చేసే అతని భార్య, ఏమి మాట్లాడినా ప్రతిధ్వనించే గోడలు… బయటి మంటల నుండి పారిపోవచ్చు, లోపల చెలరేగే మంటల నుండి… ముందుకు ఆలోచించలేక మళ్ళీ ప్రస్తుతానికి వచ్చాను.
కారు అప్పటికే చాలా దూరం వచ్చి ఉండాలి, అప్పుడప్పుడు కిటికీ గాజు దించి బయటి గాలిని లోపలికి రానిస్తున్నాడు; పొగ పూర్తిగా పోలేదు. కొంచెం దగ్గు వచ్చింది.
‘నేను బామ్మ అని సంబోధించినందుకు మీకు కోపం రాలేదు కదా?’
నిద్ర పట్టే ఆ సమయంలో మేల్కొని ఉండటానికేమో అతనికి ఏదైనా మాట్లాడాలనిపించి ఉంటుంది. నా కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయో లేదా కారులోని వెలుగు మరింత పెరిగిందో అతని ముఖాన్ని మొదటిసారి సరిగ్గా చూసినప్పుడు నా మనవడి వయసువాడే అయి ఉంటాడని అనుకున్నాను. ఈ అర్ధరాత్రి మంటలతో పోరాడుతున్న అతని గురించి జాలి కలిగింది.
‘అదేమీ లేదు, నీ పేరేమిటి?’ అన్నాను.
‘అన్నెల్మో; పిలవడానికి కష్టమైతే ఏమూ అని కూడా పిలవవచ్చు’ అన్నాడు.
ఏమూ అని చెప్పే విధానంలో, అతనిని ఇంట్లో అలాగే పిలుస్తారని, అది అతనికి ఇష్టమని అర్థమయ్యింది.
‘అన్నెల్మో అందమైన పేరు, అయినా ఏమూ అనే పిలుస్తాను. ఇంకా చదువుకుంటున్నావా?’
‘లేదు’ అతని స్వరంలో నిరాశో, ఆత్మన్యూనతో తెలియలేదు.
‘పోనీలే, ఏదో ఒక పని చేసుకుంటున్నావు, సంతోషంగా ఉంటే చాలు’ అన్నాను.
అప్పుడప్పుడు నా వైపు చూస్తున్నాడు. ఏదో అడగడానికి జంకుతున్నట్లుంది. కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు.
‘ఇప్పుడు మీరు వెళ్తున్నది మీ ఇంటికేనా?’
‘అవును, నా ఇంటికే. కొడుకు ఉన్నాడు. అతనికి నీ అంత వయసున్న కొడుకు ఉన్నాడు. నా మనవడు ఇంకా చదువుతున్నాడు.’
మనవడి ముఖం గుర్తుకు రాగానే ఆనందం కలిగింది; ఏదైనా చేయగల ధైర్యం, పట్టుదల, తామరాకుపై కదిలే నీటిబిందువులాంటి చురుకుదనం; అన్నీ నా లాగే, ఇంటిలో ఏ సమస్య కూడా వాణ్ణి కృంగదీయలేదు. కానీ చిన్న వయసులోనే బాధ్యత తెలిసిన పిల్లవాడు. ‘నాన్నమ్మా, ఇంట్లో ఉండటానికి విసుగు అనిపిస్తే ఔట్‌హౌస్‌లో ఉండవచ్చు కదా? మీ వయసు వారి కోసమైతే వృద్ధాశ్రమంలో చేరండి. మీకు ఎలా కావాలంటే అలా చేయండి’ అంటాడు. తనకి ఇష్టమైనప్పుడు ఫోన్ చేస్తాడు. చేతిలోని ఫోన్‌ను ఒకసారి చూసుకున్నాను. తెల్లవారగానే వాడికి కూడా ఫోన్ చేసి విషయం చెప్పాలి అనుకున్నాను.
‘అంటే మీ కొడుకు ఇంటికి వెళ్తున్నారు. వారికి మీరు వస్తున్నారని తెలుసా?’
‘ఇల్లు నాదే, కొడుకు-కోడలు అక్కడ ఉంటారు; నేను ఈరోజు వస్తున్నది వారికి తెలిసి ఉండదు’ అని మాత్రమే చెప్పాను.
అతని ప్రశ్నలు లాంఛనప్రాయమైనవి కావు. అయినా అపరిచితుడికి ఎంత చెప్పాలో తెలియలేదు. నేను వస్తున్నది కొడుకుకు తెలిసి ఉండదు; వృద్ధాశ్రమం వారు మెసేజ్ పెట్టి ఉండవచ్చు లేకపోవచ్చు. మెసేజ్ వచ్చినా.. అతని నిస్సహాయత. అతనిని చూస్తుంటే మంటను చూస్తూనే వణికిపోయే భయాన్ని మించిన నిస్సహాయత వద్దనుకున్నా నన్ను ఆవరించుకుంటోంది. నేను అక్కడి నుండి తప్పించుకుని ట్రాంక్విల్ మీడోస్‌కు వెళ్తే, ఇప్పుడు అక్కడి నుండి ఈ మంటలకు భయపడి… పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు…
‘ఓహ్’ అన్నాడు.
పూర్తిగా నమ్మకుండా, అక్కడ ఇల్లుంటే మీరెందుకు ఈ అడవిలో ఉన్నారు అనే సుపరిచితమైన ప్రశ్న గుచ్చినట్లు అనిపించింది. నేను ఇలాగే జవాబు చెప్పినప్పుడు వృద్ధాశ్రమంలోని చాలా మంది సహచరులు సరిగ్గా ఇలాగే నమ్మలేనట్లు తల ఊపి, బేరం చేస్తున్న వారిలా ‘ఉండవచ్చులే’ అని ఔదార్యపు లేపనాన్ని పూశారు.
‘నీవు ఎన్ని సంవత్సరాల నుండి కారు నడుపుతున్నావు?’ అని అడిగాను.
‘ఇంకో రెండు నెలలు గడిస్తే రెండు సంవత్సరాలు అవుతుంది’ అన్నాడు. మళ్ళీ, చెప్పాలో వద్దో అని తటపటాయిస్తూనే, ‘రెండు సంవత్సరాల క్రితం, ఇదే నెలలో జరిగిన క్యాంప్ ఫైర్ కార్చిచ్చు గుర్తుందా? మీ వృద్ధాశ్రమం నుండి నలభై ఐదు మైళ్ళ దూరం, అంతే. అప్పుడు మా ఇల్లు మంటల్లో కాలిపోయింది. హైస్కూల్ కూడా.’
మండే వేసవి; వాన కరువైన నేల; ఉధృతంగా వీచే గాలి; చెక్కతో కట్టిన ఇళ్ళు; అప్పుడో ఇప్పుడో కూలిపోయే రాజసౌధంలా కాలిపోవడానికి ఒక సాకు కోసం వేచి ఉంటాయి. కమ్ముకున్న మేఘాలు వర్షానికి బదులు మెరుపులను మాత్రమే విరజిమ్ముతున్నాయి. అది కాకపోతే విసురుగా ఊగుతున్న కరెంటు వైర్లు; అది కూడా కాకపోతే మరేదో సాకులు.
‘మళ్ళీ కట్టించి ఉంటారు కదా?’ అన్నాను.
కొద్ది సంవత్సరాల్లో నగరాలు నిర్మితమయ్యే కాలం ఇది.
‘బడి తయారవుతోంది. కానీ మేము ఊరు వదిలి, నగరం చేరాము. అప్పటి నుండి డ్రైవింగ్ పని, మళ్ళీ ఇల్లు కట్టడానికి డబ్బు కావాలి కదా?’
అతనిలో బాధ ఉన్నట్లు లేదు, లేదా ప్రదర్శించుకోవడం లేదు. పిల్లవాడికి స్వాభిమానం ఎక్కువగా ఉన్నట్లుంది.
‘మీ వృద్ధాశ్రమం ఈ మంటల బారి నుండి తప్పించుకుంటుందని అనిపిస్తుందా?’ అని అడిగాడు.
‘చాలా కష్టం, మంటలు అప్పటికే చాలా దగ్గరికి వచ్చాయి. అది మనుగడ సాగించలేదు’ అని చెప్పడానికి తటపటాయించాను.
‘వృద్ధాశ్రమం కాలిపోతే కట్టడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత… మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్తారా?’
నాతో సహా అక్కడ ఉన్న అందరు వృద్ధులకూ చెందిన ఆ వృద్ధాశ్రమం అది. ఎన్నెన్నో కసరత్తులు చేస్తే కానీ ఈ స్థితిలోకి రాలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా కాలిపోతే! అంతా సరిపోయి కట్టించడానికి రెండు సంవత్సరాలు పట్టవచ్చునేమో? అంతవరకు ఎవరెవరు ఎక్కడికక్కడ ఉంటారో, ఎలా ఉంటారో? ఇన్ని ఇళ్ళు ఒక్కసారిగా కాలిపోతే డబ్బులు ఇవ్వడానికి ముందు ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుందా?
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే లోపే మెసేజ్ వచ్చిందని నా ఫోన్ హెచ్చరించింది. చూసాను.
నేను కాల్ చేసిన ట్రావెల్ కంపెనీ, సింగ్ అండ్ సింగ్ ట్రావెల్స్ నుండి రాంజీ సందేశం:
‘కారు వెళ్ళి తిరిగి వస్తోందంట. కానీ మిమ్మల్ని అక్కడ కనుక్కోలేకపోయింది; అప్పటికే బయలుదేరారా?’ ఆశ్చర్యమేసింది, భయమేసింది కూడా. అయితే ఈ పిల్లవాడు ఎవరు? నన్ను నా పేరుతో ఎలా పిలిచాడు? బయట మేమెక్కడ ఉన్నామో తెలియనంత చీకటి.
‘బయలుదేరాను, కానీ కారు ఎవరిదో తెలియదు’ అని రాంజీకి మెసేజ్ చేశాను.
సరిగ్గా విచారించుకోకుండా చావుకు భయపడి ఈ కారు ఎక్కేశానా? నా పేరు ఇతనికి ఎలా తెలిసింది? భయంతో పాటు, నా తొందరపాటు నిర్ణయం గురించి అసహ్యం కూడా కలిగింది.
‘జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఉన్నారో తెలియజేస్తే కారు పంపిస్తాను. మీ జవాబు కోసం వేచి ఉంటాను’ అని ప్రత్యుత్తరం వచ్చింది.
‘ బామ్మగారూ, నాకు జవాబే ఇవ్వలేదు మీరు, మళ్ళీ వెళ్తారా అని అడిగాను’
మళ్ళీ ప్రశ్న; ఇప్పుడు అతని స్వరంలో కొంత అసహనం గోచరించింది. ఇతనికి దాని అవసరం ఏమిటి? రాత్రికి రాత్రి ఆవరించుకున్న అడవి మంటలు నిద్రమబ్బులో ఉన్న నన్ను మందకొడిగా మార్చి ఉండవచ్చు. పూర్వాపరాలు ఎక్కువ తెలుసుకోకుండా అపరిచితుడి కారు ఎక్కేలా నిస్సహాయురాలిని కూడా చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు… ఎవరినీ పూర్తిగా నమ్మని నేను మరింత జాగ్రత్తగా ఉన్నాను. నాలోని అలజడిని ఎంతగానో అణచివేస్తూ చెప్పాను.
‘అలా అయినప్పుడు చూద్దాంలే’
అతడు అప్పుడప్పుడు వెనక అద్దంలో నన్ను గమనిస్తున్నాడు.
‘మీరు ఏ విషయాన్నీ బయటపెట్టరు, మంచి కోటలా ఉన్నారు! ఇంటి నుండి మెసేజ్ వచ్చిందా?’
వీడు కూడా నన్ను కోట అంటున్నాడా! ఇంట్లో అది నా విశేషమైన లక్షణం. ఏదీ బయటపెట్టని, ఏ ఆక్రమణకూ గురికాని అభేద్యమైన కోట. కానీ ఇప్పుడు? స్వయంగా ఎక్కడున్నానో తెలియని పొగ మబ్బులో మునిగిపోయిన కోట. కారును మళ్ళీ పరిశీలించాను. దీనిని అద్దె కారు అని చెప్పలేము- డ్రైవర్ సమాచారం లేదు, దారి చూపించే పెద్ద మానిటర్ లేదు, కార్డ్ రీడర్ జాడ లేదు, అక్కడక్కడా అతుకులుపడ్డ సీట్లు, ఏదో దాచిపెడుతున్న సెంటు వాసన; బయలుదేరి అరగంట అయినప్పటికీ ఇంకా ఫ్రీవే రాలేదు. సందేహించడానికి ఎదురుగానే కనిపిస్తున్న ఇన్ని సాక్ష్యాలు. కానీ ఇంతవరకూ, అర్ధరాత్రి కారు ఎక్కుతున్నప్పుడు, ఆ తర్వాత కూడా వీటిలో దేన్నీ గమనించ లేదు. ఛా! నేను జాగ్రత్తగా ఉండాల్సింది. అతను అప్పుడప్పుడు వెనక చూస్తున్నాడు. అతనికి నా అనుమానం తెలియకూడదని జాగ్రత్త పడ్డాను.
‘లేదు, నెట్‌వర్క్ దొరకడం లేదు. ఫోన్ చార్జ్ కూడా అయిపోతోంది. ఇంకా ఎంత సమయం పడుతుంది? మనమెక్కడ ఉన్నాం ఇప్పుడు?’
‘బామ్మగారూ, ఎక్కడ ఉన్నా మీరు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. తెల్లవారే లోపు ఇంటికి చేరుకుంటారు.’
అతని ముఖం మీద చెరగని నవ్వు! అది చూసి నాకు మరింత భయం, ఎక్కడున్నాడో అతను చెప్పకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుంది? మళ్ళీ అదే ప్రశ్న అడిగితే అతనికి అనుమానం రావచ్చు.
నా అదృష్టం అన్నట్లు కొన్ని క్షణాల తర్వాత కారు ఆగింది. ‘ఐదు నిమిషాల్లో వస్తాను, ఇక్కడే ఉండండి’ అని అతను బయటకు వెళ్ళాడు. అతను దిగగానే అతనికి కనిపించకుండా నేను కూడా దిగాను.
‘హెవెన్లీ లాడ్జ్’ అనే బోర్డు ఉన్న పాత భవనం. ఇంకా కొన్ని కార్లు నిలిచి ఉన్నాయి. చుట్టూ చీకటి. జన సంచారం అంతగా లేదు, తలుపు దగ్గర నిలబడి మాట్లాడుతున్న ఇద్దరు ఏమూతో పాటు లోపలికి వెళ్లారు. వారి ముఖాల్లో వార్డు ముందు కనిపించే భయం, బహుశా కార్చిచ్చు గురించే వార్త అయి ఉండవచ్చు లేదా దానిని దుర్వినియోగం చేయడానికి ఏమి పన్నాగం పన్నుతున్నారో? అక్కడ కారు ఆపడానికి కారణం ఏమిటి? ఏమైనా అక్కడ ప్రమాదం తక్కువ అని అనిపించి ఏమూ తిరిగి వచ్చేటప్పుడు అతని కంటికి పడకూడదని చాటున నిలబడ్డాను. కొన్ని నిమిషాల్లో తిరిగి వచ్చి కారు తలుపు తీసి నన్ను వెతికాడు. మళ్ళీ లోపలికి పరిగెత్తాడు, మళ్ళీ తొందరగానే పరిగెత్తుకుంటూ వచ్చి, అటూ ఇటూ చూసి, ఎవరికో ఫోన్ చేసి మళ్ళీ కారు ఎక్కాడు. బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ కారు బయలుదేరిన తర్వాత కొంచెం ఊరట అనిపించింది. కాలిపోతున్న మంటల నుండి, అపరిచితుడి కారు నుండి తప్పించుకుని సురక్షిత స్థావరం చేరుకున్న ఊరట, అయినా వెలుగు రావడానికి ఇంకా మూడు, నాలుగు గంటలు ఉంది.
‘హెవెన్లీ లాడ్జింగ్ ముందు ఉన్నాను. త్వరగా కారు పంపించండి’ అని రాంజీకి మెసేజ్ పంపించాను.
ఐదు నిమిషాలు గడిచినా రాంజీ నుండి జవాబు లేదు. చలి నా స్వెట్టర్‌ను కూడా చీల్చుకుంటూ గుచ్చసాగింది. లాడ్జింగ్ లోపలికి వెళ్ళాను. రంగు పాలిపోయిన కౌంటర్‌లో ఎవరూ లేరు; గదంతా ముగ్గువాసన వేస్తోంది. దీపాలు కాంతిహీనంగా వెలుగుతూ ధైర్యం పుట్టించడం లేదు. బయట అంత చలి లేకపోయినా వెచ్చగానూ లేదు. కౌంటర్‌కు ఎవరైనా రావచ్చని వేచి ఉన్నాను. రాంజీ నుండి జవాబు వచ్చి, నా కోసం కారు వచ్చే వరకు అక్కడ వేచి ఉండాలి.
‘అక్కడికి చేరుకునే రోడ్లను పబ్లిక్‌కు తాత్కాలికంగా మూసివేశారు. మీరు ఉన్న ప్రదేశం అడవి మంటల నుండి సురక్షితంగా ఉంది. నేను ఎలాగైనా తెల్లవారే లోపు స్వయంగా వస్తాను. మీరు అలసిపోయి ఉండవచ్చు, విశ్రాంతి తీసుకోండి. గది దొరికితే అక్కడే ఉండండి.’
రాంజీ జవాబు కొంచెం నిరాశ కలిగించినా, వేరే మార్గం లేదు. తొందరపడి వెళ్ళి ఏమి చేయాలి?
కౌంటర్‌కు ఒక వ్యక్తి వచ్చాడు; అతను ఇదివరకు తలుపు దగ్గర నిలబడి మాట్లాడుతున్నవాడే. అతని ముఖంలో నన్ను చూసిన ఆశ్చర్యం ప్రతిబింబిస్తోంది. అర్ధరాత్రి, ఒంటరి మహిళ, అదీ వృద్ధురాలు. కౌంటర్ వదిలి నేరుగా నా దగ్గరికే వచ్చాడు. ‘ఇక్కడ ఒక రోజు కోసం గది దొరుకుతుందా?’ అక్కడ పడుకుంటే నిద్ర వస్తుందనే ఆశగానీ, అది సురక్షితం అనే ధైర్యంగానీ కలగలేదు. అయినా ఆ రాత్రి అక్కడ ఇంకేమీ అడగాలో తెలియక అడిగాను.
‘లేదు మేడమ్, క్షమించండి, అన్ని గదులు నిండిపోయాయి. సాధారణంగా మా వద్ద ఒకటి రెండు గదులు ఉంటాయి. కానీ ఈ రోజు కార్చిచ్చు వల్ల నిరాశ్రయులైనవారు చాలా మంది రావడంతో అన్నీ నిండిపోయాయి. ఈ వారం మొత్తం గది దొరకడం కష్టం.’
అతను ఇంకా నేను అతని ఎదురుగా ఉన్నానో లేదో అన్నట్లు చూస్తున్నాడు. ‘ఫరవాలేదు, ఇక్కడే కూర్చుంటాను, తెల్లవారే లోపు కారు రావచ్చు’ అన్నాను. ‘ తప్పకుండా! కాఫీ కావాలంటే అడగండి, తెచ్చిస్తాను’ అని చెప్పి, అప్పటికే కాలి చల్లబడిన ఫైర్‌ప్లేస్‌లో మంట వెలిగించాడు. వెచ్చగా అవసాగింది. వెలుగు వచ్చే వరకు అక్కడే కూర్చుకోవచ్చనే ఆశ కూడా చిగురించింది.
అక్కడ కూర్చుని ఉండగానే ఇంకొకరు వచ్చి, ‘మీరు అన్నెల్మో వైపు వారు కదా? అదే… వసుంధర ట్రాంక్విల్ మీడోస్ నుండి..’
ఒప్పుకోవాలో వద్దో అని వెంటనే నిర్ణయించుకోలేకపోయాను. ఊరికే ఉండిపోయాను. అతనే కొనసాగించాడు.
‘వారికి మూడు గదులున్నాయి, రెండింటిలో అప్పటికే జనం ఉన్నారు. అక్కడ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇంత సమయం తర్వాత ఎవరూ రారు. తెల్లవారి లేచిన తర్వాత వివరాలు ఇద్దురు గానీ ‘ అని రిసెప్షన్‌లో కూర్చున్న అతని వైపు సైగ చేశాడు.
‘నో, థాంక్స్’ అని అక్కడే కూర్చున్నాను.
అతనికి ఏమనిపించిందో, ఊరికే వెళ్ళిపోయాడు.
ఎలాగైనా వెలుగు రావడం కోసం వేచి ఉండాలి అని ధైర్యం తెచ్చుకుని కూర్చున్నాను. రెప్పలు బరువెక్కసాగాయి.
రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఫోన్ ఒక్కసారిగా చప్పుడు చేసినప్పుడు ఉలిక్కిపడ్డాను. మనవడి నుండి. అతను ఉన్న ఊరిలో అప్పటికే ఉదయం ఆరు గంటలు,
‘నాన్నమ్మా, ఎక్కడ ఉన్నారు? సేఫ్‌గా ఉన్నారు కదా?’
‘నేను హెవెన్లీ లాడ్జింగ్‌లో ఉన్నాను. తెల్లవారగానే ఇంటికి చేరుకుంటాను.’
‘మరి.. హోటల్‌కు మీరు ఇంకా రాలేదు అన్నారు. ఇప్పుడే వచ్చారా? అన్నెల్మో నుండి కూడా ఫోన్ లేదు.’
‘ఊహ్, కానీ ఇవన్నీ నీకు ఎలా తెలుసు?’
‘నాకు అన్నీ తెలుసు. కాలిఫోర్నియా సహవాసం వద్దు, మా రాష్ట్రానికి వచ్చేయండి నాన్నమ్మా. ఇక్కడ అక్కడి కంటే మంచి వృద్ధాశ్రమాలున్నాయి. మరింత చురుకైన వృద్ధులు కూడా.’
సరదాగా అన్నట్లు అనిపించినా అతను భయపడ్డాడని నాకు విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు.
‘అవన్నీ తర్వాత, ఇది నీకెలా తెలుసు?’
‘ప్రపంచం చిన్నది. అన్నెల్మోను నేనే పంపించాను. అతనికి డబ్బు కావాలి, నాకు మా నాన్నమ్మ సేఫ్టీ. కానీ మీరెందుకు కారు నుండి తప్పించుకున్నారు?’
అతని ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఒక్కసారిగా పుట్టిన సందేహాలను ఇప్పుడు ఎలా వివరించాలి?
‘అతనికి ఎంత ఇచ్చావు?’
‘అవన్నీ తర్వాత.’
‘ఉండనివ్వు, అతనికి థాంక్స్ చెప్పేయ్’ అన్నాను. మరు క్షణంలో, ‘వద్దు, అతని నంబర్ పంపించు. నేనే చెబుతాను.’ అని జోడించాను.
కౌంటర్‌లో కూర్చున్న వ్యక్తి మళ్ళీ నా ముందు నిలబడ్డాడు. రూముకు వెళ్ళడానికి లేచి నిలబడినప్పుడు నా గురించి గర్వం, సిగ్గు రెండూ ఒకేసారి కలిగాయి.
![]()

రచయిత, సాహిత్యాభిమాని, అనువాదకుడు, సంపాదకుడు వికీపీడియన్. తెలుగు కన్నడ భాషలలో అనువాదాలు చేస్తున్నారు. కథాజగత్, సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం, జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు, రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులంకథ, క్రీడాకథ, రామకథాసుధ, పదచదరాలు, స్వాతంత్ర్యభారతికి అమృతోత్సవ హారతి అనే పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రముఖ హేతువాది, విద్యావేత్త డా.హెచ్.నరసింహయ్య ఆత్మకథను పోరాటపథం పేరుతో తెలుగు ప్రజలకు పరిచయం చేశారు.




Discussion about this post