• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

టర్కిష్ కథ : మనిషి, కొన్ని సందర్భాలు

డా. ఎ.యం. అయోధ్యారెడ్డి by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
August 2, 2025
in అనువాద కథలు
0
టర్కిష్ కథ : మనిషి, కొన్ని సందర్భాలు

టర్కీ మూలకథా రచయిత: సైట్ ఫైక్ అబసియాంక్ (‘వరల్డ్ ఫర్ సేల్’)

తెలుగు అనువాదం: ఎ.ఎం.అయోధ్యారెడ్డి 

 

జీవితంలో మొదటిసారి దొంగతనం చేయబోతున్నాడు ఎమిన్…

అతడో కార్యాలయంలో దిగువస్థాయి ఉద్యోగి. అధికారం.. హోదా.. జీతం.. గౌరవం అన్నీ తక్కువే. అయితే ఏదైనా దొంగతనం చేసేందుకు  మాత్రం కావాల్సిన అన్ని అర్హతల్నీ అవకాశాలనీ కలిగి ఉన్నాడు.

తన ఇల్లు హఠాత్తుగా ముందెన్నడూ చూడని అష్టైశ్వర్యాలతో, వైభవంగా విలసిల్లిన అద్భుత దృశ్యాలు అతనికి జీవితంలో మూడుసార్లు గోచరించినయి. అసంబద్ధమైన ఈ స్వాప్నిక దృశ్యాలు అతని మెదడుని తీవ్రంగా ప్రభావితం చేసి అతని వాస్తవిక చైతన్యానికి అస్పష్ట గోడల్లా  అడ్డుపడినయి. పెళ్ళయిన సందర్భంలో ఒకసారి, కొడుకు పుట్టినప్పుడు రెండోసారి, భార్య మరణించిన సమయంలో మూడోసారి అతనీ స్వప్నసాక్షాత్కారాలకు లోనయ్యాడు.

ఈ దృశ్యాలు భిన్నకోణాల్లో ఆవిష్కృతమై ఒకటి మనిషికి తప్పనిసరి నిత్యావసర ఆహారంలా అనిపిస్తే, మరొకటి ఏదో గ్రాంఫోన్ మాదిరి అంతగా అవసరం కాదని అనిపించింది. ఎంత మార్చిమార్చి చూసుకున్నా తను దేన్ని ఎక్కువ కోరుకుంటున్నాడో అర్థమయ్యేది కాదు.

ఈ స్వప్నాలు మూడుసార్లూ అతనికి చిన్నతనంలో రాత్రి ఆకలి కడుపుతో నిద్రపోయినప్పుడో,  లేదా పూర్తి మెళుకువగా ఉన్నప్పుడో వచ్చినయి. అయితే ఈ మూడు క్లిష్టమైన సందర్భాల్లోనూ దొంగతనం చేయాలన్న అతనిలోని కోరిక స్పష్టంగా బలీయంగా కాకుండా మసకగా ఉండేది.

వాటితో పోల్చుకుంటే బహుశా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఆనందకరమైనవో లేదా దుర్భరమైనవో క్షణాలను అనుభవించి ఉండొచ్చు.

ఎమిన్ అందుకే దొంగతనం చేయాలన్న నిర్ణయం తీసుకున్నాడు.

నిజానికి ఇప్పుడైనా దొంగతనం చేయాలన్న అతని కోరిక మసకమసగ్గానే ఉన్నది. అప్పుడెప్పుడో ఏడేళ్ల క్రితం కొడుకు పుట్టినప్పుడు కలిగిన దొంగతనం మీద కోరిక ఇప్పుడు.. అదే కొడుకు చావుబతుకుల్లో ఉన్నప్పుడు మళ్ళీ మెదిలింది. ఆ విషయంలో ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. కానీ ఈ పర్యాయం ఒక బాధామయ శక్తి అతన్ని బలంగా ముందుకు తోస్తున్నది.

ఎమిన్ అకస్మాత్తుగా లేచి వేగంగా బయటకు నడిచాడు.

ఓడరేవుకు వెళ్ళే దారి వెంబడి వరుసగా వున్న కాఫీ హోటళ్లలో ఒక దాంట్లోకి దూరిపోయాడు.

అది నారింజ రంగు సాయంత్రం…

జనంతో వీధి కిటకిటలాడుతున్నది. సంతోషంతో వెళుతున్నవాళ్ళూ, ఒంటరిగా నిరాసక్తులైనవాళ్ళూ గుంపుల్లో ఉన్నారు.

కాఫీ హోటల్ లోపలికి నడిచాడు ఎమిన్. ఒక టేబుల్ వద్ద కూర్చున్న ఇద్దరు వ్యక్తులు అతన్ని గుర్తించి గట్టిగా పిలిచారు.

“హలో ఎమిన్ ఎఫెండి…! ఎలావున్నావు? ఇక్కడికొచ్చేసెయ్. మాతో రెండు రౌండ్లు మూడుముక్కలు ఆడండి”

ఎమిన్ ఎఫెండికి మూడు ముక్కలాట పెద్ద వ్యామోహం. అది ఆడుతుంటే ప్రపంచాన్నే మర్చిపోతాడు. ఆట ఆడుతున్న సమయంలో  ఒక్కోసారి అతడు ఆవేశంతో దాదాపు పిచ్చివాడవుతాడు. కోపంలో ఒక  వీధిరౌడీలా ప్రవర్తిస్తాడు. ఆ సమయంలో ఉద్రేకంతో అతని చెవులు ఎర్రగా కందిపోతయి. అతని కళ్ళముందే అవతలివాళ్ళు ఆటలో మోసం చేస్తుంటారు. ఎమిన్‌కు ఈ సంగతి తెలిసినప్పటికీ

ఆటను వదిలేసి వెళ్ళడు.

చివరి రౌండు పూర్తయి అతడు చిత్తుగా ఒడిపోయాడు. ఉక్రోషంతోలేచి నిలబడ్డాడు. సిగరెట్ కాలికింద పడేసి నలిపేశాడు. వొంటిమీది  చిరుగుల పాత చొక్కా సరిచేసుకున్నాడు. తర్వాత అదే కోపంతో అన్నాడు:

“నేనిప్పుడు ఒడిపోయాను నిజమే, అయినప్పటికీ మీకు డబ్బులిస్తే చెప్పుతో కొట్టండి. మీరంతా మోసగాళ్ళు. కూడబలుక్కొని నన్నోడించారు. దొంగాట ఆడి నానుంచి డబ్బులు ఆశిస్తారా? ఇవ్వడానికి నేను పిచ్చివాన్ని కాదు” అలా చెప్పి అతడు బయటికి నడిచాడు.

కాఫీహోటలు యజమాని సహా అక్కడ కూర్చున్నవాళ్లు ఎమిన్ ఉక్రోశానికి పెద్దగా నవ్వారు. నిజానికి ఎమిన్ ఎప్పుడు కాఫీ తాగినా అతని బిల్లు చెల్లించడానికి పలువురు సిద్ధంగా ఉంటారు. హోటల్లో తెలిసిన కస్టమర్లు, హోటల్ యజమాని, చివరికి పేకాటలో అతన్ని ఓడించిన ఆటగాళ్లు కూడా. అక్కడ ఎవరికైనా కావాల్సింది ఎమిన్ ఎఫెండితో ఎలాగైనా మూడుముక్కలు ఆడించడం. డబ్బు గురించి పట్టించుకునేదెవరు..?

అట్లా అప్పటివరకూ పేకాటలో మునిగితేలిన ఎమిన్ ఎఫెండి ఇంటివద్ద తన ఒక్కగానొక్క కొడుకు చావుబతుకుల్లో వున్న సంగతి..

తను ఆవేళ దొంగతనం చేయాలనుకున్న సంగతి మరచిపోయి నేరుగా ఇంటికి వెళ్ళాడు.

అతని భార్య చనిపోయి నాలుగేళ్లయింది. ఇంట్లో వృద్ధురాలైన మేనత్త ఉంటుంది. ఇప్పడామెనే జ్వరంతో ఉన్న పిల్లవాన్ని చూసుకుంటుంది. పిల్లోడికి ఇప్పటిదాకా ఆమెకి తెలిసిన గృహవైద్యం అంతా చేసింది.

కొడుకు పరిస్థితి కొంత మెరుగుపడి ఉండాలని ఎమిన్ తలపోశాడు. కానీ ఇంటికి వెళ్ళేసరికి పరిస్థితి వేరుగా ఉంది. ఒక బక్కపల్చని ఆకారం, ముడతల చర్మంతో వయసెంతో తెలియని విధంగా ఉన్న వైద్యుడు పిల్లవాడి పక్కన కూర్చుని వున్నాడు. తన ఒంటి నుంచీ, శ్వాస నుంచీ వెలువడుతున్న మద్యం వాసనల నడుమ పిల్లవాన్ని పరీక్షిస్తున్నాడు. కాస్సేపటికి అతడు లేచి కాగితం తీసుకొని ఏదో మందు రాశాడు.

“ఈ మందును వెంటనే తీసుకురండి. ప్రతి అరగంటకు ఒక డోస్ చొప్పున ఇవ్వండి. కొంత నెమ్మదిస్తుంది” అని చీటీ ఇచ్చేసి వేగంగా మెట్లుదిగి బయటికిపోయాడు.

మేనత్త దగ్గర ఒక లీరా అడిగి తీసుకొని డాక్టరుకు ఫీజు ఇద్దామనుకున్నాడు ఎమిన్. కానీ డాక్టరు అతనికా అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. మందు కొనడానికి నలభై కురూలు ఖర్చయింది. ఇంకా కొంత డబ్బు మిగిలింది. దాంతో ఎమిన్ ఒక బ్రాందీ సీసా కొనుక్కున్నాడు. సీసాను జేబులో పెట్టుకుని దారి పొడవునా దాన్ని తడుముకుంటూ ఇంటికి పోయాడు.

నిజానికి అతనికి మద్యం పెద్దగా అలవాటు లేదు. కానీ ఇప్పుడు తాగిన తర్వాత తలలో మత్తు నిండింది. మనసు ఎప్పట్నుంచో కోరుకునే ప్రపంచంలోకి ప్రవేశించి విహరించాడు. కళ్లముందు కదలాడే దృశ్యాలన్నీ గొప్ప వ్యామోహాన్ని కలుగజేస్తున్నయి. ఏవేవో నీడలు, వీధిదీపాలు, గొర్రెల్లా మనుషులు, విశాలమైన సముద్రం, అందులో చిన్నగా కనిపించే ఓడలు. అన్నీ అతని ఆదేశాల కోసం ఎదురుచూస్తూ స్తబ్దంగా ఉన్నట్టున్నయి.

అతన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ మర్నాడు ఉదయానికి కూడా పిల్లవాడు ఇంకా బతికేఉన్నాడు. అయితే వాడి ముఖం మరో లోకానికి వెళ్లబోతున్న ప్రయాణికుని ముసుగు ధరించి ఉన్నది.

“మనం ఈ అందవికారమైన, తీరని ఆశలతో కూడిన, రోజువారి నిరాసక్త ముఖాలతో అక్కడికి వెళ్ళలేం” అని తనకు తాను చెప్పుకున్నాడు.

కొడుకుని తలచుకుంటే అతన్ని ఉదాసీనత కమ్మేసింది. వాడితో ముడిపడ్డ జ్ఞాపకాలు కళ్లముందు కదిలినయి. తను ఆఫీసు నుంచి ఇంటికొచ్చే చాలా సందర్భాల్లో వాడు రోడ్డు చివర నిలుచుని తనకోసం ఎదురు చూస్తున్న దృశ్యం, వాడినట్లా చూసిన వెంటనే గుండె ఉప్పొంగి ప్రేమతో రెట్టింపు వేగంతో కొట్టుకునే రోజులు ఇప్పుడెక్కడ…? తన హృదయాన్ని ప్రతిరోజూ ప్రక్షాళన చేసి, తడిసిపోయిన  ఇస్తాంబుల్ రోజుల్ని ఎత్తయిన పీఠభూమికి చేర్చి, సుదూర ఆకుపచ్చ మైదానాలకు లేదా పొడవైన దేవదారు వృక్షాలతో కప్పబడిన పర్వత శ్రేణులకు కొనిపోగల స్వచ్ఛమైన, ప్రేమపూర్వక వాతావరణం పిల్లవాడి చుట్టూ ఇప్పుడేమైంది?

అప్పటి బాబు వేరు, ప్రస్తుతం తండ్రిగా తను మృత్యు ముంగిట్లో వొదిలేసిన బాబు వేరు అనేవిధంగా కనిపించే స్థితి.

హఠాత్తుగా అతనికి దొంగతనం చేయాలన్న కోరిక మళ్లీ మనసులో మెదిలింది. కానీ ఈసారి ఆవేశం కలుగలేదు. పేలవంగా నవ్వుకున్నాడు. నిజానికి ఇప్పుడా అవసరం లేదు, పిల్లవాడు చచ్చిపోయాడు.

ఆ రోజు పనెక్కువగా వుండి దినమంతా భోజనం చేసే వ్యవధి దొరకలేదు.

విధులు ముగించుకుని ఇంటికెళుతుంటే ఏదో మురికైన, గాలి ఆడని ప్రదేశంలో ఉన్నట్టు అనుభూతి పొందాడు. మెదడులో ఒక అణచివేతకు గురౌవుతున్న భావన కలిగింది. అర్థరహిత విషయాలను అడ్డుకునే ఒక రిమోట్ ఆవశ్యకత గురించి ఆలోచించసాగాడు. ఉన్నట్టుండి అతని మెదడులో అన్ని కిటికీలు ఒక్కసారి తెరుచుకున్నట్టయింది. ఆలోచనలు కట్టుదప్పి పరుగులు తీశాయి. జీవించడం, అనుభూతి చెందడం, ఆలోచించడం వంటి స్పృహను అందించిన ప్రపంచంతో తను అనుసంధానమైనట్టు భావించాడు.

ఇదో మెరుపులా మెరిసి మాయమైంది. ప్రపంచానికి మరో వైపు, దిగంతంలో ప్రకాశవంతమైన నీలి కాంతులు వ్యాపించినయి. ఇంకొన్ని క్షణాల తర్వాత తన బిడ్డను నిర్దయగా మృత్యువుకు వొదిలిపెట్టిన సంగతి  గుర్తుచేసుకున్నాడు. అతనికి వర్ణించలేని బాధ కలిగింది. తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. కొడుకు వేసుకునే చిన్న బూట్లు, నల్లగా మట్టికొట్టుకున్న వాడి బక్కపలుచని మోకాళ్ళు, పిర్రల మీద చిరుగులు పడ్డ నిక్కరు గుర్తుచేసుకున్నాడు. పిల్లవాడి దీనస్థితిపై జాలి వల్ల బాధతో తప్ప తనెప్పుడూ వాడిని మామూలుగా చూడలేకపోయాడు.

ఇప్పుడు వాణ్ని మళ్లీ చూశాడు, సున్నితమైన మణికట్టు, ముందు పళ్ళు ఊడిన నోరు, కొన్ని కొన్నిసార్లు అకస్మాత్తుగా వాడి ముఖం అందంగా, ఎంతో పరిశుభ్రంగా కనిపించేది. వాడు తన ఒళ్ళోకి ఎక్కి కూర్చోనే విధానం గుర్తుచేసుకున్నాడు. అతని హృదయం బాధతో  తల్లడిల్లింది. చిన్నవో, పెద్దవో వెయ్యి జ్ఞాపకాలు లోనికీ.. బయటికీ ప్రవహించినయి. అతడు కొన్నిసార్లు వీటిల్లో ఏదో జ్ఞాపకంలో నివాసం ఉండాలని కోరుకున్నాడు. అందులోంచి తననో కథగా మల్చుకుందామని అనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు. కొన్ని సందర్భాల్లో ఒక సెకను ముందు తనేం ఆలోచించాడో కూడా మర్చిపోతున్నాడు. నిద్రలో జరిగినట్లు అతడు తెగిన దారం కొసను తిరిగి పట్టుకోలేకపోతున్నాడు.

చనిపోయిన కొడుకు చివరిచూపు కోసం ఇంటికి చేరుకున్నాడు.  ఇరుగుపొరుగు వాళ్లు ఆహారం పంపించారు. అతడు, అత్తగారు కూర్చుని దాదాపు ప్రశాంతంగా తిన్నారు. ఇంతలో పిల్లవాన్ని పడుకోబెట్టిన గదిలోంచి ఒక స్త్రీ ఏదో పఠిస్తున్న స్వరం గట్టిగా వినిపించింది. ఎమిన్ ఆంతరంగంలో తిరుగుబాటు భావన కలిగింది. “నేను బయటికి పోతున్నా అత్తా! కొంచెం గాలి పీల్చుకునేందుకు” అని వెళ్లిపోయాడు. కానీ ఆ సాయంత్రంవేళ ఇస్తాంబుల్ నగరంలో ఎమిన్‌ ఎఫెండి తను కోరుకున్న గాలిని పొందలేకపోయాడు. అతనికి ముప్పై ఆరేళ్లు. భారీ కాయం. ముఖం చూస్తే దాదాపు అందగాడనే భావించవచ్చు. వదులుగా, చిందరవందరై గాలికి ఎగిరే బట్టలు అతన్ని విచారంతో వున్న దృఢమైన మంచివ్యక్తి అని అందరూ ఊహించుకునేలా చేస్తున్నయి.

ఎమిన్ వంతెనపైకి ఎక్కుతూ దిగుతూ కొద్దిసేపు కాలక్షేపం చేశాడు. ఇప్పుడతనిలో దొంగతనం చేయడానికి చివరి కారణం కూడా తొలగింది. తన జీతంమీద రోజులు గడుపుతున్నాడు. అతని ఏకైక వినోద సాధనం సాయంత్రమైతే మూడుముక్కలాటలో గడపడమే.

ఎమిన్ ధూమపానం చేయడు. తోటివాళ్ళు అతనికోసం రాకి మద్యం తెప్పిస్తే తాగుతాడు. రాకి సేవించినప్పుడల్లా అతడు మత్తులో ఇష్టమొచ్చినట్టు వాగుతాడు. కానీ తనకోసం మందు తెప్పించిన ఎవరైనా చెప్పే మాటల్ని శ్రద్ధగా మనసుపెట్టి వింటాడు.

ఎమిన్ అలాంటి వ్యక్తి, అందుకే అతనికి ఇస్తాంబుల్‌లోని హోటళ్లు, మద్యం దుకాణాలన్నీ పరిచితమే.

అతడు తన పెద్దపెద్ద గోధుమరంగు కళ్ళు ఆశ్చర్యంగా విప్పార్చుకొని ఎదుటివాళ్ళు చెప్పే ఎన్నెన్ని సంగతులు విన్నాడు? వాళ్ళ అతిశయోక్తులు, సాహసకృత్యాలు, బాధలు, ప్రేమకథలు, నీచమైన అవమానకరమైన పనులు.. ఎన్నెన్నో విన్నాడు. అలాంటి మనిషికి  తనకు మద్యం ఇప్పించే దాతను కనుక్కోవడంలో ఖచ్చితంగా ఇబ్బంది ఉండదు కదూ!

ఒక సంవత్సరం తర్వాత —

ఎమిన్ అత్త కూడా మరణించింది. అప్పటివరకు వాళ్ళిద్దరు రాతితో కట్టిన ఆ రెండు గదుల చిన్న ఇంట్లోనే వుండేవారు. అది అతని మేనత్తకు చెందింది. ఎమిన్ దాన్ని తన పేరు మీద చేసుకున్నాడు. ఎమిన్ జీవితకాలం మేనత్త బాగోగులు చూసినప్పటికీ తను ఆ ఇంట్లో ఒక అనాథలా భావించుకున్నాడు. అన్నింటికి మించి, అతని భార్య అత్త చేతిలో ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించింది. భార్య మాత్రమే  కాదు, తనూ స్వయంగా ఆమెకు భయపడేవాడు. చివరికి తానే ఆమెని శ్మశానానికి తీసుకెళ్లాడు.

రెండుగదుల ఇంట్లో ఒక గదిని అద్దెకిచ్చాడు ఎమిన్. సాయంత్రాలు ఆలస్యంగా ఇంటికొచ్చి మరో గదిలో పడుకునేవాడు.

అతడు తరచుగా ఒక కల కంటున్నాడు. కలలో తను మరో వివాహం చేసుకున్నాడు. వాళ్ళకు ఒక బిడ్డ కూడా ఉంది.

అయితే వాళ్ళందరూ ఎక్కడున్నారు?

కొంతకాలం తర్వాత –

వేసవిలో ఒకరోజు ఎమిన్ బ్యాగు సర్దుకుని హడావిడిగా బయలుదేరాడు. అట్లా వెళ్ళిన కొద్దిరోజులకే పోలీసులు పట్టుకుని అతన్నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని ఫోరెన్సిక్ వైద్య విభాగానికి పంపారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు ఎమిన్ మానసిక సంతులనం దెబ్బతిన్నట్లు కనుగొన్నారు. ఈ కారణం వల్ల అతడు విడుదలయ్యాడు.

దొంగతనం ఎందుకు చేయాల్సివచ్చిందో, దొంగలించిన డబ్బుతో ఏం చెయ్యాలనుకున్నాడో ఎమిన్ ఎవరికీ చెప్పలేదు. కానీ తన పట్ల సానుభూతిగా ఉండే ఫోరెన్సిక్ విభాగంలోని ఒక వైద్యుడితో “డాక్టరుగారూ! మీకు తెలుసా.. నేనీ ప్రపంచాన్ని కొనేందుకే ఆ డబ్బు తీసుకెళ్లాను” అని ఒక్కమాట మాత్రం చెప్పాడు.

ఆవిధంగా ప్రస్తుతం కాఫీహౌస్‌లో ఒక మూలన టేబుల్ ముందు కూర్చునివున్న అమాయక దయగల ముఖం, చింపిరి జుట్టు మనిషి ఈ ప్రపంచాన్నే కొనెయ్యాలనుకున్న వ్యక్తి.

మూల రచయిత గురించి…

విఖ్యాత కవి, రచయిత సెయిట్ ఫేక్ అబసియానిక్, టర్కిష్ ఆధునిక సాహిత్య మూలస్థంభాల్లో ఒకరు. 1940 దశాబ్దాన్ని తనపేర లిఖించుకున్న మహా సృజనకారుడు. కథ, నవల, కవిత్వ ప్రక్రియల్లో కృషిచేసినప్పటికి కథానికే ఆయన ఆయువుపట్టు. టర్కిష్ కథను ఆధునిక, ప్రయోగాత్మక హంగులతో తీర్చిదిద్ది భుజాన మోశాడు. 1906 నవంబర్ 23న అడపజారి, ఒట్టోమన్ సామ్రాజ్యం (ఇప్పుడు టర్కీలో ఉంది) లో జన్మించాడు. తక్కువ కాలంలో అనంత కీర్తినార్జించి కేవలం 47 ఏళ్ల వయసులో పిన్నవయసులో మరణించాడు.

అబసియానిక్ టర్కిష్ సాహితిలో సరికొత్త శైలి సృష్టించారు. కర్షకులు, కార్మికులు, మత్స్యకారులు, చిన్నపిల్లలు, నిరుద్యోగులు, బడుగుజీవుల బతుకుల్ని పదునైన, తనదైన మానవీయ కోణంలో చిత్రించి పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. ఆయన కథలు పట్టణ జీవనశైలిని కేంద్రంగా చేసుకొని, ముఖ్యంగా ఇస్తాంబుల్‌ చీకటికోణాల్లోని బ్రతుకుల్ని కళ్ళకు కడతాయి. హింస, ప్రేమ, ద్రోహాల నడుమ మనిషి పడే తపనలు, యాతన గురించి కథల్లో అన్వేషించారు ఆవిష్కరించారు. ఆయన సృజనలో ఎక్కువగా చిన్నకథలే. ఒక కవిత సంపుటి, మూడు నవలలు, వందలకొద్దీ కథలు వెలువరించారు.

అబాసియానిక్ కథలు టర్కిష్ గద్యంలో కొత్త శైలిలో నూతన ఉరవడి సృష్టించినయి. నిరాకారతతో సాంప్రదాయక కథాంశాలు లేకపోవడం వల్ల ఆయన కథలు ఒకే సంక్షిప్త ఎపిసోడ్‌లో విస్తృత మానవ భావోద్వేగాల్ని వ్యక్తపరుస్తాయి. 1936లో తొలి కథల సంపుటి ‘ది సమోవర్’ ప్రచురించారు. తర్వాత మరో డజను సంపుటాలు వెలువడినయి. వీటిల్లో ‘ది యూజ్‌లెస్ మ్యాన్’, ‘ది కంపెనీ’, ‘దేరిజ్ ఎ స్నేక్ యట్ అలెండాగ్’, ‘ది లాస్ట్ బర్డ్స్’, ‘బాయ్ ఇన్ ది టన్నెల్’ బాగా పేరు తెచ్చినయి. 1944లో తొలి నవల ‘ది బోట్ ఆఫ్ లైవ్లీహుడ్’ వెలువడింది. 1952లో ‘ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్’ అనే ప్రయోగాత్మక నవల రాశాడు. అయితే ఇది వర్గభేదాలను బలంగా చిత్రించినందున ప్రభుత్వ నిషేధానికి గురైంది. తర్వాత ఆయన చివరి నవల ‘ది మిస్సింగ్’ వెలువడింది. 1953లో ఏకైక కవితా సంపుటి ‘నౌ ఇజ్ ది టైమ్ ఫర్ మేకింగ్ లవ్’ ప్రచురణ అయింది. ఆయన కథల ఇతివృత్తం, భాష, కథనాల్లో  వినూత్న మార్పులు 1950 దశాబ్ది తర్వాతతరం రచయితల్ని ఎక్కువ ప్రభావితం చేశాయి. ఆయన ‘ది యూజ్‌లెస్ మ్యాన్’ కథల సంపుటిలోని ప్రసిద్ధ సర్రియలిస్ట్ కథ ‘ది వరల్డ్ ఫర్ సేల్’ కు ఇది నా అనువాదం.

డా. ఎ.యం. అయోధ్యారెడ్డి

నాలుగు దశాబ్దాలుగా హైదరాబాదులో నివాసం. 1983లో జర్నలిజంలో మొదలైన ప్రయాణం, తర్వాత దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత దక్కన్ క్రానికల్ సంస్థలో న్యూస్ ఎడిటరుగా పదవీవిరమణ. సాహిత్యపఠనం, కథా నవలా రచన, అనువాదం ఇప్పటి ప్రవృత్తి. 70కి పైగా కథలు, రెండు నవలలు రాశారు. 50 విదేశీ కథలు, ఒక విదేశీ నవల తెలుగులోకి అనువదించారు. ఇప్పటివరకు రెండు కథా సంపుటాలు– ఆహారయాత్ర, అక్కన్నపేట రైల్వేస్టేషన్, అనువాదాలు– ఏడవకుబిడ్డా, కథాసంగమం, అరబ్ కథలు ప్రచురించారు.

Previous Post

పరిశోధనాత్మక విశ్లేషణం – సినారె కథా కావ్య సమాలోచనం

Next Post

హిందీ కవిత : వీరుడా ! ముందుకు సాగిపో!

Next Post
హిందీ కవిత : వీరుడా ! ముందుకు సాగిపో!

హిందీ కవిత : వీరుడా ! ముందుకు సాగిపో!

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com