హిందీ మూలం : రాకేశ్ శర్మ
అనువాదం : డా. వెన్నా వల్లభరావు
అందరూ అనే మాటే–
‘ఇలా మునుపెన్నడూ జరగలేదు’
పర్వతాలు మైనంలా కరగలేదు మునుపెన్నడూ
మాతృ స్వరూపులైన నదులు
ఇలా భయానకంగా మారలేదెన్నడూ
వృక్షాలు నేలను వీడలేదేన్నడూ
కొండరాళ్ళు తుపాకీగుళ్ళలా
ప్రజల ప్రాణాలు హరించలేదెన్నడూ
వాగులు వంకలు ప్రళయ గర్జనతో
భయోత్పాతం కల్పించలేదు ముందెన్నడూ.
ఇవన్నీ వాటంతట అవి జరిగినవి కావు
నీ దుష్ప్రవర్తనే వాటినలా మారేలా చేశాయి
భరింపరాని భీషణమైన దుఃఖాన్ని వ్యక్తపరచటానికి
మనవద్దైతే భాష ఉంది – ఎన్నో మాటలున్నాయి
కానీ ప్రకృతికి తెలిసింది అదొక్కటే భాష
తన భావాల్ని, దుఃఖాన్ని ఆ భాషలోనే
వ్యక్తపరుస్తుంది ప్రకృతి
కానీ మనం ఆ చర్యల్ని
విధ్వంసమని, ప్రళయమని అంటున్నాము.
నిజానికది ప్రకృతి బాధాజనితమైన మూలుగు
నీ అడుగులు సవరించుకో లేదా వింటూనే ఉండు
ప్రకృతి మాత సహింపరాని భాదాతప్త రోదన ధ్వని.
![]()




Discussion about this post