• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ : తక్కువేమి మనకూ..

కోడిహళ్లి మురళీ మోహన్ by కోడిహళ్లి మురళీ మోహన్
September 2, 2025
in అనువాద కథలు
0
కన్నడ కథ : తక్కువేమి మనకూ..

కన్నడ మూలం: సరితా నవలి

తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్

కల్లహళ్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక ఉన్న కొండ మీద నుంచి సూర్యుడు నెమ్మదిగా పైకి వస్తున్నాడు. గ్రామంలోని ప్రజలు కూడా నిద్రలేచి తమ తమ పనులు మొదలుపెట్టారు. ఆడవాళ్ళు పెరటిని శుభ్రం చేసి, ముగ్గులు వేస్తున్నారు, మగవారు తమ పశువుల పాకలను శుభ్రం చేసి, బుట్ట నిండా చెత్తను నింపుకొని చెత్త గుట్ట దగ్గరకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

పాలగిన్నె పట్టుకుని పశువుల పాక దగ్గరకు వస్తున్న నాగమ్మను చూసిన ఆమె భర్త లింగప్ప తన చేతిలో ఉన్న చుట్టను తొందరగా పీల్చి, దానిని నేలకు అదిమి ఆర్పేసి, చీపురు పట్టుకుని కూర్చున్నాడు. తన రెండు ఆవులు, మూడు గేదెల నుంచి పాలు పిండి, అప్పటికప్పుడు వాడుక యిండ్లకు పాలు పోసి రావాలని తొందరగా ఉన్న నాగమ్మ, ఆవు వీపు నిమిరి, పాలగిన్నెను పట్టుకుని కింద కూర్చుంది. పాలు పితికి, ఆ పాత్రలో వేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి రామాచార్యుల ఇంటికి వెళ్ళింది.

“అమ్మయ్యా, పాలు… పాలు తెచ్చాను, లోపల వంటగదిలో ఉన్నారా? పాలు పోయించుకోండి,” నాగమ్మ  గొంతు వినగానే సీతాబాయమ్మగారు ఒక్కసారిగా కళ్ళు తెరిచారు.

“అయ్యో రామా… అప్పుడే నాగమ్మ వచ్చే సమయం అయ్యిందా, ఎంతసేపు పడుకున్నాను. రోజూ ఆ మూలింటి దుర్గమ్మ కోడి పుంజు కొ..క్కొ..కో అనే శబ్దం వినగానే లేచేదాన్ని, ఇవాళ ఎందుకిలా అయ్యింది?” అనుకుంటూ తొందరగా మంచం మీద నుంచి లేచి కూర్చున్నారు.

తన అరచేతిని చూసుకుంటూ, గుణుగుణుగుణుమంటూ మంత్రం జపిస్తూ, కుడివైపు గోడ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి ఫొటోకు నమస్కరించి లేచి, “వస్తున్నా! ఉండు నాగమ్మా!” అని కేకేసి, పరుపును చుట్ట చుట్టి, మూలకు చేర్చి, ముఖం మీద పడిన జుట్టును వెనక్కి నెట్టుకుని, తల వెంట్రుకలను సరిచేసుకుంటూ, సగం విడిపోయిన జడను రెండు చుట్లు చుట్టి, కొప్పు కట్టి, చీర మడతలను సరిచేసుకుని, చీర కొంగుతో ముఖాన్ని తుడుచుకుంటూ వచ్చి తలుపు తీశారు.

సీతాబాయమ్మగారు తలుపు తీయడానికి జాగు చేసేకొద్దీ, వాడుక యిండ్లకు పాలు పోయడానికి ఆలస్యం అవుతుందని కంగారు పడుతూ అటూ ఇటూ తచ్చాడుతున్న నాగమ్మ, గడియ శబ్దం వినగానే తలుపు వైపు తిరిగి, “ఎందుకమ్మయ్యా ఇంత ఆలస్యం చేశారు, ఒంట్లో బాగోలేదా?” అని ఆత్రంగా అడిగింది.

ఆమె ఒంట్లో బాగోలేదా అని అడిగిందో లేదో, సీతాబాయమ్మ గారికి  తమ భర్త రామాచార్యులు రాత్రంతా ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డారని, వారి కుడి చెయ్యి, కుడి కాలు విపరీతంగా లాగడం మొదలయ్యాయని, రాత్రంతా సరిగా నిద్రపోలేదని, తానే వేప నూనె వేడిచేసి, వారి చేతులు, కాళ్ళకు రాసి మర్దన చేసిందని, అయినా ఆచార్యులకు ఎందుకో కాలు నొప్పి తగ్గకపోవడంతో, తనకు కూడా రాత్రంతా ఆయన సేవలోనే గడిచి, తెల్లవారుజామున కొంచెం నిద్ర పట్టిందన్న సంగతి గుర్తుకు వచ్చింది.

“నేను బాగానే ఉన్నాను నాగమ్మా, మా ఇంట్లో ఆయనకు కొంచెం బాగోలేదు” అన్నారు సీతాబాయమ్మ.

“ఎందుకమ్మా, ఏమైంది పూజారిగారికి?” నాగమ్మ కంగారుగా అడిగింది.

“ఏ… కంగారు పడవలసింది ఏమీ లేదు. చెయ్యి నొప్పి, కాలు నొప్పి అని రాత్రంతా ఇబ్బంది పడ్డారు. వయసు అయ్యింది చూడు. ఆలయంలో పూజ చేయడానికి కూడా చేతకావడం లేదు. ఇలా జరిగింది చూడు” అని అంటూ పాలు వేయించుకోవడానికి పాత్ర తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్లారు.

“ఇకనైనా కొడుకు, కోడలిని పిలిపించుకోండి అమ్మయ్యా, మీకు కూడా వయసు అయ్యింది.” నాగమ్మ బిగ్గరగా చెప్పింది.

పాలపాత్రను వంటగదిలో పెట్టి, స్నానాల గదికి వెళ్లి చేతులు, కాళ్ళు కడుక్కుని వచ్చిన సీతాబాయమ్మగారు, మంచం మీద ఇంకా పడుకునే ఉన్న రామాచార్యులను లేపారు.

“ఏమండీ, అప్పుడే సమయం అయ్యింది, లేవాలి కదా… ఇంతకీ కాలు నొప్పి ఎలా ఉంది? స్నానం, సంధ్యావందనం ముగించి, గుడికి వెళ్లి తలుపు తీయాలి కదా. ఇవాళ శనివారం, ఇంకొక గంట, అరగంటలో అందరూ గుడికి రావడం మొదలుపెడతారు.”

సీతాబాయమ్మ మాటలకు హఠాత్తుగా లేచి కూర్చున్న రామాచార్యులు, “ఏమిటి… అప్పుడే లేపకూడదా? సమయం ఎంత అయ్యింది? ఎండ రాకముందే గుడికి వెళ్ళాలి” అన్నారు.

“అది కాదు… మీ కాలు నొప్పి ఎలా ఉంది? మళ్ళీ… గుడి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి కదా?” సీతాబాయమ్మ గారు కించిత్ ఆందోళనతో అడిగారు.

“కొంచెం నయం అయినట్లు అనిపిస్తుంది. వయసు అయ్యింది కదా. ఒక రోజు ఉన్నట్లు ఇంకో రోజు ఉండదు చూడు.” అని అనుకుంటూ తమ చేతులు, కాళ్ళను మడచి-సాగదీసి చూసుకుని, నెమ్మదిగా లేచి నిలబడ్డారు. గోడ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి ఫొటోకు నమస్కరించి, తమ జంధ్యాన్ని చెవికి చుట్టుకుని పెరటి వైపు నడిచారు.

ఆచార్యులు స్నానం-సంధ్యావందనం ముగించి, పూజా పెట్టెను పట్టుకుని, నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఊరి బయట దూరంగా ఉన్న గుడి వైపు వెళ్ళడం చూసిన సీతాబాయమ్మగారికి పాలనాగమ్మ చెప్పిన “ఇకనైనా కొడుకు, కోడలిని పిలిపించుకోండి అమ్మయ్యా, మీకు కూడా వయసు అయ్యింది.” అనే మాట గుర్తుకు వచ్చింది.

కొడుకుకి ఫోన్ చేసి అతనితో మాట్లాడాలని అనుకున్నారు.

“ఇక స్నానం-పూజ అయ్యి, వంట గదిలో వంట కావాలి. వయసు వచ్చాక అనారోగ్యాలు అన్నీ మామూలే.” అంటూ  తమకు తాము తొందర పెట్టుకుంటూ, వంటగదిలో పైన కర్రకు వేలాడదీసిన చీరను లాక్కుని, మడతలు పెట్టుకుని తర్వాతి పనిలో నిమగ్నమయ్యారు.

ఎన్నో సంవత్సరాల నుంచి తమ వంశస్థులే పూజ చేసుకుంటూ వచ్చిన కల్లహళ్లి వెంకటరమణుడి గుడి యొక్క అన్ని బాధ్యతలను ఇప్పుడు రామాచార్యులే నిర్వహిస్తున్నారు. గుడి పూజ వల్ల వచ్చే ఆదాయం, పెద్దల నుంచి వచ్చిన ఆరు ఎకరాల పొలం వారి జీవితానికి ఆధారం అయ్యాయి. తమ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకైన ఆయన చిన్నప్పటి నుంచి సంస్కృత పాఠాలు అన్నీ నేర్చుకుని మంచి పండితుడయ్యారు. చుట్టాలు అంటూ చెప్పుకోవడానికి చుట్టుపక్క గ్రామాలలో కొందరు బంధువులు ఉన్నారు. గ్రామం నుంచి ఒక మైలు దూరంలో ఉన్న తమ ఇలవేల్పు వెంకటరమణుడి గుడికి రోజూ వెళ్లి పూజ చేయడం వారి దినసరి చర్య. ఆ రోజు ఆలస్యంగా లేచి, నెమ్మదిగా నడుచుకుంటూ ఆచార్యులు గుడి దగ్గరకు వచ్చేసరికి చాలామంది భక్తులు వచ్చి ఆచార్యుల రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. మూడు వందల సంవత్సరాల పాత గుడి, ప్రదక్షిణ చేయడానికి పెద్ద ప్రాంగణం, గుడి చుట్టూ పచ్చని కొండలు, చెట్లు, పొదలు, చిన్నదైన వెంకటరమణుడి విగ్రహం, అక్కడి స్థల మహత్యం చుట్టుపక్కల ప్రజలను అక్కడికి వచ్చేలా చేసేవి. తమ రాక కోసమే ఎదురుచూస్తున్న భక్తులను  చూసిన రామాచార్యులు ఒళ్ళు నొప్పులు మరిచి గుడి తలుపు తెరిచి లోపలికి వెళ్ళారు. అందరూ ప్రదక్షిణ-నమస్కారం చేసేలోపు దేవుడి పూజకు సన్నాహాలు చేసుకోవాలి అని తొందరగా తర్వాతి పనులకు పూనుకున్నారు.

మధ్యాహ్నం వరకు గుడికి వచ్చే భక్తుల కోసం ఎదురుచూస్తూ కూర్చున్న ఆచార్యులు ఆ రోజు ఆలస్యంగానే ఇంటికి వచ్చి భోజనం చేసి, అరుగు మీద చాప వేసుకుని, మోకాళ్ళకు అమృతాంజనం రాసుకుని, “ఉస్…ఉస్” అని అనుకుంటూ, విసనకర్రతో విసురుకుంటూ పడుకున్నది చూసిన సీతాబాయమ్మగారు, వారి ఫోన్‌ను వంటగదిలోకి తీసుకుని వెళ్లి కొడుకుకి ఫోన్ చేశారు. రెండు సంవత్సరాల క్రితం సెలవులకని వచ్చిన మనవడు, మొబైల్ ఫోన్‌ను ఎలా ఉపయోగించాలో నాన్నమ్మకు నేర్పించాడు, 

సరిగ్గా నిద్రపట్టిన  సమయానికి ఫోన్ రింగ్ అయినది విని మెలుకువ వచ్చిన పవమాన భార్య మేఘ అతన్ని లేపింది.

“ఫోన్ రింగ్ అవుతోంది. ఇంత రాత్రికి ఎవరు చేస్తారు, ఇండియా నుంచి అయి ఉంటుంది చూడండి.”

నిద్రలో నుంచి లేచి చూసిన పవమానకు ఫోన్‌లో కనిపించిన నంబర్‌లో మొదట ఇండియా కోడ్ నంబర్ కనిపించి కంగారుపడ్డాడు.

నిద్ర కళ్ళతో “హలో.. ఎవరు?” అన్నప్పుడు అవతలి నుంచి తల్లి గొంతు వినిపించింది.

“పవమాన… నేనే… అమ్మ మాట్లాడుతున్నాను. బాగున్నావా? నీ భార్య, పిల్లలు బాగున్నారా?”

“మేమంతా బాగున్నామా అని అడగడానికి ఇంత రాత్రి ఫోన్ చేశారేమిటి?” సీతాబాయమ్మ గారి గొంతు వినగానే మేఘ చిరాకుపడింది.

“ఇంత రాత్రికి ఎందుకు ఫోన్ చేశావమ్మా, ఏమైంది? మాకు ఇక్కడ ఇప్పుడు అర్ధరాత్రి అయ్యింది” ఆవలిస్తూ పవమాన.

“అయ్యో… మర్చిపోయాను చూడు. ఎప్పుడూ నువ్వే ఫోన్ చేస్తుంటావు కదా… ఒక వారం నుంచి నీ ఫోన్ కూడా రాలేదు… అందుకే చేశాను. పవమాన…. ఈ మధ్య మీ నాన్నకు గుడి పూజ, పని చేతకావడం లేదు. గుడి పూజ ఆగిపోకూడదు, మళ్ళీ గుడి కూడా మన చేతి నుంచి వెళ్ళిపోకూడదు…” బాధపడ్డారు.

“అయ్యో.. రేపు ఫోన్ చేస్తాను అని చెప్పండి. వారికి తెల్లవారుజామున ఫోన్ చేస్తే వంటగదిలో దేవుడి గదిలో కూర్చుంటారు, ఇక రాత్రి చేస్తే టీ.వి. సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారు. మనం చూస్తే క్యారియోకి పార్టీ ముగించుకుని అలిసిపోయి వచ్చి ఇప్పుడు పడుకున్నాము. రేపు చేయమనండి, ఇప్పుడు ఫోన్ పెట్టేయండి.” గట్టిగా చెప్పింది మేఘ.

“నేను రేపు తెల్లవారుజామున ఫోన్ చేస్తానమ్మా… మీకు రాత్రి అయ్యి ఉంటుంది” మాట ముగించాడు పవమాన.

“రేపు తెల్లవారుజామున ఫోన్ చేస్తాను అన్నారు… శనివారం తెల్లవారుజామున ప్రద్యుమ్న బాస్కెట్ బాల్ క్లాస్ ఉంటుంది అని మర్చిపోయారేమిటి?” మేఘ నిద్రలోనే గొణిగింది.

పవమాన చెప్పిన ‘రేపు’ నాలుగు రోజుల తర్వాత వచ్చింది. పది-పదిహేను నిమిషాలు ఫోన్ చేసి మాట్లాడిన కొడుకు, తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకోవడం కంటే పరదేశంలో తనకున్న ఇబ్బందులనే చెప్పుకున్నాడు. అతని మాటలు విన్న తల్లి సీతాబాయమ్మగారు, “పరదేశంలో కొడుకు ఎంత కష్టపడుతున్నాడు, అతడిని ఇంకెందుకు ఎక్కువ ఇబ్బంది పెట్టాలి, ఎలాగూ ఆచార్యులు తమపని తామే చేసుకుంటూ తిరుగుతున్నారు కదా…” అని ఊరుకున్నా రామాచార్యుల ఆరోగ్యంలో ఏమైనా తేడా వస్తే వందల సంవత్సరాల నుంచి వారి కుటుంబమే చేసుకుంటూ వచ్చిన వెంకటేశ్వర స్వామి గుడి పూజకు ఏమి ఏర్పాట్లు చేయడం అని ఆలోచిస్తూ గోడ మీద ఉన్న దేవుడి ఫొటోకు నమస్కరించారు.

తండ్రి రామాచార్యులలాగే రామాచార్య-సీతాబాయమ్మ గార్ల  ఒక్కగానొక్క కొడుకైన పవమాన చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేవాడు. చదువుతో పాటు, మంత్రాలు-దేవుడి నామాలు అన్నీ నేర్చుకున్నాడు. ఏడో తరగతి వరకు వారి ఊరిలోని బడిలోనే చదివి, ఆ తర్వాత ధార్వాడలో సీతాబాయమ్మ గారి అన్నయ్య ఇంట్లో ఉండి చదువు కొనసాగించాడు. అతనికి మెరిట్‌లో ఇంజనీరింగ్ సీటు దొరికినప్పుడు రామాచార్యులు సంతోషపడ్డారు కానీ సీతాబాయమ్మ గారికి మనసులో ఏదో ఒక భయం కలిగింది. కొడుకు ఇలాగే ఎక్కువ చదువుకుంటూ వెళ్లి, పెద్ద ఉద్యోగం అని ఊరూర తిరుగుతూ ఉంటే ముందు తమ గ్రామానికి వచ్చి ఉండి గుడి పూజ కొనసాగించడానికి అతని మనసు ఒప్పుకుంటుందా అని భర్తను ప్రశ్నించారు. కొడుకు విజయం చూసి సంతోషంతో పొంగిపోయిన ఆచార్యులు, “ఏమిటి… ఇలాంటి ప్రశ్నలు అడుగుతావు. మన కొడుకు అంటే ఏమి అనుకున్నావు, అతను ఎంత చదువుకున్నా, ఎలాంటి పెద్ద ఉద్యోగం చేసినా, మనం ఇచ్చిన సంస్కారాన్ని మర్చిపోడు…” మాట కొనసాగించకుండా సీతాబాయమ్మగారు ఊరుకున్నారు.  

ఇంజనీరింగ్ డిగ్రీ చేతిలోకి రాకముందే పవమాన కళ్ళు అమెరికా కలలు కనడం మొదలుపెట్టాయి. తనతోటి విద్యార్థుల్లాగే తాను అక్కడి చదువుల అన్ని సమాచారాలను తెలుసుకుని తల్లిదండ్రుల ముందు ఆ విషయం గురించి మాట్లాడాడు. సంప్రదాయబద్ధమైన తల్లిదండ్రులు విదేశాలకు వెళ్ళడానికి ఏమంటారో అనే ప్రశ్న కూడా రాకుండా తనను తాను సిద్ధం చేసుకునే గ్రామానికి వచ్చాడు.

“అమెరికాకు వెళ్ళిన తర్వాత కూడా రోజూ సంధ్యావందనం చేస్తాను. శనివారం ఒక పూట, ఏకాదశి అన్నీ చేస్తాను. మీరు చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. కొద్ది సంవత్సరాలు అక్కడ ఉండి, మళ్ళీ ఇక్కడికే తిరిగి వస్తాను. నాకు దొరికిన ఈ అవకాశానికి మీరు అడ్డు చెప్పకూడదు” అని భావోద్వేగంగా ఉపన్యాసం చెప్పి, నాలుగు నెలల్లో “అరిజోనా స్టేట్ యూనివర్సిటీ”లో సీటు సంపాదించి అమెరికాలోని ఫీనిక్స్‌కు ఎగిరి వెళ్ళాడు.

కొడుకు మొదటిసారి ఒకటి రెండు సార్లు గ్రామానికి వచ్చి వెళ్ళినప్పుడు అతనిలో అంత మార్పు ఏమీ కనిపించని సీతాబాయమ్మ గారికి, కొడుకు నుంచి తెలుసుకున్న ఫీనిక్స్ ఎండిపోయిన ఎడారి కంటే పచ్చగా ఉన్న కల్లహళ్లి గురించి అతనికి అభిమానం ఉంది అని అనిపించింది. తర్వాతి రెండు సంవత్సరాల్లో చదువు ముగించిన కొడుకుకి న్యూయార్క్‌లో ఉద్యోగం దొరికింది. న్యూజెర్సీలో ఇల్లు కట్టి, పెళ్లి చేసుకునే ఆలోచన చేశాడు పవమాన. తమ వదినల వైపు బంధువుల అమ్మాయి మేఘను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న పవమాన పెళ్లి కోసం వచ్చినప్పుడు మాత్రమే మొదటిలా లేడు అని సీతాబాయమ్మగారు అనుకున్నారు. కొడుకును చూడగానే న్యూజెర్సీ గాలి-నీరు అలవాటు అతనికి బాగానే అయ్యింది అనేది తల్లికి తెలిసిపోయింది. అతను ఆడే మాట, ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగడం, ఒంటి మీద ఉన్న జంధ్యం కనిపించకపోవడం చూసి సీతాబాయమ్మగారు కంగారుపడ్డారు. అయినా మేఘ సంప్రదాయబద్ధమైన ఇంట్లో పెరిగిన అమ్మాయి, అతన్ని దారిలోకి తీసుకువస్తుంది అని సమాధానపడ్డారు. వీరు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది వేరే. పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలకు బిడ్డను తీసుకుని వచ్చిన కోడలిని అత్తామామ ఇద్దరూ గుర్తించలేకపోయారు! ఏదో అక్కడి ప్రజల్లో వేరే రకంగా కనిపించకూడదు మళ్ళీ న్యూజెర్సీ చలి వాతావరణానికి తగినట్లు బట్టలు వేసుకుంటూ ఉండవచ్చు అని అనుకున్న సీతాబాయమ్మ గారికి తర్వాతి కొద్ది రోజుల్లో కొడుకుతో పాటు కోడలికి కూడా పరదేశమే బాగా అనిపించింది అని తెలిసిపోయింది. మూడు సంవత్సరాల్లో మొత్తం ప్రపంచాన్నే చూసేశాను అన్నట్లు ఆమె ఆడే మాటలు విసుగు తెప్పించినా, ఏదో చిన్న అమ్మాయి, బిడ్డ తల్లి అని వారే సర్దుకున్నారు. 

తర్వాతిసారి గ్రామానికి వచ్చేసరికి న్యూజెర్సీలోనే సొంత అపార్ట్‌మెంట్, చేతిలో గ్రీన్ కార్డ్ పట్టుకుని దిగారు కొడుకు-కోడలు, ఇద్దరు మనవళ్ళు. గ్రీన్ కార్డ్ దొరికిన తర్వాత న్యూయార్క్ ఉద్యోగం వదిలి న్యూజెర్సీలోనే ఉద్యోగంలో చేరాను అని చెప్పాడు పవమాన. ఈసారి వారు ఇక్కడ గ్రామంలో ఉన్నది తక్కువ. అయినా కొడుకు-కోడలిని తమ ఎదురుగా కూర్చోబెట్టుకుని రామాచార్యులు తర్వాతి జీవితం గురించి మాట్లాడారు.

“పరదేశానికి వెళ్లి ఇన్ని సంవత్సరాలు అయ్యింది. మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలనుకుంటున్నావు పవమాన?”

“ఇంకొక రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఆలోచిస్తాను నాన్న, ఇప్పుడు ఉద్యోగం మార్చి, ఇల్లు కొనుక్కున్నాను.”

“సరే నాయనా… ఈ విషయం గురించి ఆలోచించు.” రామాచార్యులు మాట ముగించారు. పవమాన కూడా మాట కొనసాగించలేదు. కానీ వంటగదిలోకి వచ్చిన మేఘ కోపంగా మాట్లాడింది.

“మీకు మీ మైల, శుభ్రత, గుడి-పూజలే ఎక్కువ  అయ్యాయి. పురుడుకి రాలేదు, గృహప్రవేశానికి రాలేదు. మేమిద్దరమే అక్కడ ఎంత కష్టపడతామో మీకు ఎలా అర్థం అవుతుంది? నేను కూడా ఇక ఉద్యోగంలో చేరాలి అని ఉన్నాను. మీరు అక్కడకు రారు, పిల్లలను డే కేర్‌లో వదలాల్సి వస్తుంది. కానీ మీకు డబ్బు కావాలన్నప్పుడు మాత్రం మేము పంపాల్సి వస్తుంది” గట్టిగా మాట్లాడింది.

తల్లిదండ్రులు అలవాటు చేసుకున్న జీవితానికి  కొడుకు-కోడలు కోరుకున్న జీవితానికి మధ్య ఘర్షణ జరిగింది. వీరు అలవాటు చేసుకున్నది వారు కోరుకోలేదు, వారు కోరుకున్నది వీరు అలవాటు చేసుకోరు! వీరు వారి నుంచి కొడుకు కర్తవ్యాన్ని ఎదురుచూస్తున్నారు, వారు వీరి పెద్దల బాధ్యతను ఆశిస్తున్నారు!

కోడలి మాట విన్న సీతాబాయమ్మగారికి తండ్రి దగ్గర పవమాన చెప్పిన ఆ రెండు సంవత్సరాలు ఎప్పటికీ రావు అని ఖచ్చితంగా తెలిసిపోయింది. పాపం, రామాచార్యులు మాత్రం పంచాంగం తిరగేసిన ప్రతిసారీ నెలల లెక్క పెట్టడం మానలేదు. నెలలు గడిచి సంవత్సరాలు తిరిగినా కొడుకు మాత్రం గ్రామం వైపు తిరిగి చూడలేదు.

ఇప్పుడు పవమాన తల్లిదండ్రులకు వారానికి ఒకసారి, పదిహేను రోజులకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతాడు. మేఘ కూడా ఉద్యోగం చేయడం మొదలుపెట్టిందని, పిల్లలు పెద్దవారు అయినట్లు పెద్ద ఇల్లు ఉండాలని ఐదు బెడ్ రూమ్‌ల ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నానని కొడుకు అన్నది రామాచార్యులకు చెప్పనేలేదు సీతాబాయమ్మగారు. కొడుకు ఇప్పుడు తమకు మాత్రమే కొడుకు కాకుండా, అతని ఇద్దరు పిల్లలకు నాన్న అయ్యాడు అనే విషయం వారికి అర్థం అయ్యింది. “ఎవరి దారి వారిది!” అని మనసుకు సర్ది చెప్పుకున్నారు.

పని చేతకాక అలిసిపోయి కూర్చుంటున్న రామాచార్యుల ఆరోగ్యం గురించి సీతాబాయమ్మగారికి ఆందోళన  మొదలయ్యింది. ఆచార్యులకు ఏమైనా ఎక్కువ-తక్కువ అయితే తర్వాత ఏమిటి? అనే చింతలో వత్తులు చేసుకుంటూ కూర్చున్నప్పుడు, ‘మధుకరి దాసులు’ తాళం వేసుకుంటూ, పాట పాడుకుంటూ వచ్చారు. “తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు..”. దాసుల సంచిలో బియ్యం-పప్పు వేసి, దక్షిణ ఇచ్చి నమస్కారం చేసిన సీతాబాయికి పెరట్లో కిట్టన్న గొంతు వినిపించింది.

ఇంట్లోకి వచ్చిన కిట్టన్న, “బాగున్నారా అత్తా? నమస్కారం చేస్తాను”. అంటూ సీతాబాయమ్మగారి పాదాలకు నమస్కరించాడు. అక్కడే నిలబడిన దాసులకు సాష్టాంగ నమస్కారం చేసిన కిట్టన్నకు, “మంచి జరుగుతుంది” అని చెప్పిన దాసులు తాళం వేసుకుంటూ తమ పాటను కొనసాగించి, వీధిలో నడుచుకుంటూ వెళ్ళారు.

“నేను బాగున్నాను నాయనా, నువ్వు ఎక్కడ ఉన్నావు ఇన్ని రోజులు? మంత్రాలయానికి పాదయాత్ర వెళ్లి వస్తాను అని వెళ్ళినవాడివి, ఆరు నెలలు అయిన తర్వాత వచ్చావు కదా?” కిట్టన్నను అడిగారు సీతాబాయమ్మగారు.

“నాకేం అత్తా, ఇల్లు లేదు, ఇంట్లోవారు అంటూ ఎవరూ లేరు… ఒంటికాయ శొంఠి కొమ్మును.  రాయర* సేవ చేసుకుంటూ మంత్రాలయంలోనే ఉండిపోయాను.” బిగ్గరగా నవ్వుతూ చెప్పాడు.

“రాయరు ఏమైనా మంచి బుద్ధి అనుగ్రహించారా, లేదా నువ్వు కేవలం నీరు మోయడానికి మాత్రమే పనికొస్తావు అన్నారా?” పూజా పెట్టె మూటను భుజానికి వేసుకుని రామాచార్యులు ఇంట్లోకి వచ్చారు.

“బాగున్నారా మామా? నమస్కారం చేస్తాను” అంటూ ఆచార్యులకు సాష్టాంగ నమస్కారం చేశాడు కిట్టన్న.

కిట్టన్న  సీతాబాయమ్మ గారికి పుట్టింటి వైపు బంధువు. అతని నాన్న ఎక్కడో దేశాంతరానికి వెళ్ళిన తర్వాత తల్లి రమాబాయమ్మ ఒక్కతే ఈ కొడుకును పెంచింది. తాను నలుగురి ఇళ్లలో వంట పని చేసుకుని కొడుకును బడికి పంపినా, కిట్టన్నకు చదువు అబ్బలేదు. తన కొడుకుకు శరీరం పెరిగిందే కానీ బుద్ధి పెరగలేదని ఆ తల్లికి తెలిసిన తర్వాత అటూ ఇటూ వారి చేతులు, కాళ్ళు పట్టుకుని, ‘సామూహిక ఉపనయనం’ కార్యక్రమంలో ఉపనయనం చేయించి మఠంలో చేర్చింది. అక్కడ కిట్టన్నకు బావి నుంచి నీరు తోడి పోసే పని. దానిని దెప్పి పొడుస్తూ రామాచార్యులు అప్పుడప్పుడు హాస్యం చేసేవారు. తన తల్లి కూడా వెళ్ళిపోయిన తర్వాత కిట్టన్నకు ఎవరూ లేకుండా పోయి తనకు మనసుకు తోచినట్లు ఊరూర తిరుగుతూ, ఆ గుడి – ఈ మఠం అని సేవ చేసుకుంటూ ఉండిపోయాడు. అప్పుడప్పుడు కల్లహళ్లికి వచ్చి ఆచార్యుల ఇంట్లో మకాం వేసి, సీతాబాయమ్మ గారికి బావి నుంచి మడి నీరు తెచ్చి ఇచ్చేవాడు.

కిట్టన్న వచ్చిన తర్వాత రామాచార్యులకు చాలా సహాయం అయ్యింది. అయినా ఒక మంత్రం కూడా రాదు, సంధ్యావందనం కూడా సరిగ్గా చేయడు అని ఆచార్యులు తరచూ  కోపపడేవారు. మన పవమాన ఎనిమిది సంవత్సరాలకే ఎంత మంత్రం నేర్చుకున్నాడు అని కొడుకును గుర్తు చేసుకుంటూ ఉండేవారు.

“మన పవమాన ఎంత  తెలివైనవాడు… నువ్వూ  ఉన్నావు చూడు మొద్దు దద్దమ్మ…” కిట్టన్నను తిట్టుకుంటూ దేవుడి పూజ చేసేవారు. కిట్టన్న ఇదంతా పట్టించుకునేవాడు కాదు.

రోజులు గడిచే కొద్దీ మనిషి క్షీణించి చిన్నగా అవుతాడే తప్ప వయసు ఏమి చిన్నగా అవ్వదు కదా? ఒకరోజు తెల్లవారుజామున రామాచార్యులకు మంచం మీద నుంచి లేవడానికే చేతకాకుండా పోయింది. డాక్టర్ వచ్చి చూసి, ఆచార్యులకు ఎడమ వైపు పక్షవాతం వచ్చింది అని చెప్పినప్పుడు ఏమి తోచకుండా కూర్చుండిపోయారు సీతాబాయమ్మగారు. కిట్టన్న దేవుడి సేవ వదిలి ఆచార్యుల సేవకు అంకితమయ్యాడు. పక్క ఊరిలోని రాముడి గుడి రంగాచార్యులు తమ గుడిలోని పూజ ముగించుకుని వచ్చి వెంకటేశ్వర స్వామి పూజను కూడా చేయడం మొదలుపెట్టారు. వారికి వేరే పని ఉన్న రోజు కిట్టన్నే తనకు తెలిసినట్లు దేవుడి పూజ ముగించి, హారతి ఇచ్చి వచ్చేవాడు.

పవమాన ఈ నెల వస్తాను, వచ్చే నెల వస్తాను అని చెప్పుకుంటూ ఆరు నెలలు అయినా మంచం పట్టిన తండ్రిని చూడడానికి రాలేదు. అతను అక్కడ అమెరికాలో సిటిజెన్‌షిప్ తీసుకోవడం కోసం తిరుగుతున్నాడు. నాలుగో తరగతి వరకూ  చదువుకున్న సీతాబాయమ్మ గారు  ఆలోచించారు. “పరదేశపు పౌరుడు అయినంత మాత్రాన పుట్టిన మూలం మారిపోతుందా? లేదా ఒంటి రంగు మారిపోతుందా?” పవమానకు తన జీవిత అస్తిత్వానికి కారణమైన వారిని వదిలి అమెరికా పౌరుడు అనే అస్తిత్వాన్ని పొందడమే ముఖ్యం అయినట్లు ఉంది. రామాచార్యుల ఆరోగ్యం మెరుగుపడేట్లు కనిపించలేదు. తర్వాత ఏమిటి?”  వారి ఆలోచనల కంటే గ్రామంలోని ప్రజల మాటలే బాధించసాగాయి. నలుగురు ఒకే చోట కలిసారంటే ఆచార్యుల, పవమానల సంగతులే మాట్లాడుకుంటూ సమయం గడిపేవారు. వెంకటేశ్వర స్వామి గుడికి వంశపారంపర్యంగా పూజ చేసుకుంటూ వచ్చిన పూజారులు లేకుండా పోతే, దేవాదాయ శాఖ వారు వచ్చి గుడిని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎంతో కొంతో జీతం ఇచ్చి, వేరే ఎవరినైనా దేవుడి పూజ చేయడానికి నియమిస్తారు అనే వార్త సీతాబాయమ్మగారి చెవికి కూడా చేరింది. ఇక బంధువులు రామాచార్యులను పరామర్శించడానికి వచ్చినట్లు వచ్చి తమ ఉచిత సలహాలు ఇచ్చి సీతాబాయమ్మగారికి తలనొప్పి తెప్పించారు. ఇలాంటి పరిస్థితిలో ఒక రోజు ఆచార్యుల ఆరోగ్యం ఎక్కువ-తక్కువ అయ్యింది.

ఆ రోజు శనివారం సాయంత్రం నుంచి దేవుడికి దీపం వెలిగించి, దూదితో వత్తులు చేసుకుంటూ కూర్చున్న సీతాబాయమ్మగారి మనసులో కూడా ఆలోచనలు వచ్చాయి. అప్పుడో-ఇప్పుడో అన్నట్లు ఉన్న రామాచార్యుల ప్రాణం ఏమైనా పోతే, గుడిలో దేవుడి పూజ ఆగిపోకూడదు అని ఎక్కువ సమయం వేచి ఉండకుండా తర్వాతి పని చేయాలి వస్తుంది. బతికి ఉన్నప్పుడు కూడా వచ్చి చూడలేని కొడుకు ఇక అమెరికా నుంచి వచ్చి కల్లహళ్ళిలో స్థిరపడి గుడి పూజ కొనసాగించడం వట్టిమాట. దేవుడి పూజ ఎప్పుడైనా ఆగిపోయిందా? మైల అదీ వస్తే వేరేవారు ఎవరైనా వచ్చి పూజ చేసి హారతి ఇస్తారు కదా? వందల సంవత్సరాల నుంచి ఉన్న గుడికి ఎంతమంది ఆచార్యులు పూజ చేయలేదు? అంటే మనిషి కంటే మనం నమ్మి బతికే దేవుడికే ప్రాధాన్యత కదా? “మన వల్ల అన్ని పనులు అవుతాయి… మన వల్లే అన్ని పనులు జరగాలి” అనేది అంతా మనం మనుషులు కోరుకునే మాటలు. ఒకటి రెండు ప్రయత్నాలు మనం చేయవచ్చు. కానీ అది జరగాలి అనేది మన చేతిలో లేదు. ఈరోజు ఉండి రేపు లేకుండా పోయే మనిషి మాట కంటే, నిత్యమైన భగవంతుడినే వేడుకుంటే సరిపోతుంది అని అనుకుని, “వెంకన్నా… నువ్వే దారి చూపాలి” అని వేడుకున్నారు. చాలాసేపు కళ్ళు మూసుకుని కూర్చున్న వారికి “అత్తా, సాయంత్రం హారతి ఇచ్చి గుడికి తాళం వేసుకుని వచ్చాను” అన్న కిట్టన్న మాట మెలుకువ తెప్పించింది. వెంటనే దేవుడికి మరో నెయ్యి దీపం వెలిగించి నమస్కరించి లేచి వచ్చి రామాచార్య పడుకున్న లోపలి గదికి వచ్చిన సీతాబాయమ్మగారు, “కిట్టన్నా, ఇలా రా నాయనా” అని పిలిచారు.

“ఏం అత్తా, పిలిచారు?” అంటూ లోపలికి వచ్చిన కిట్టన్న చేతిలో ఉన్న తాళం తీసుకుని రామాచార్య చేతిలో పెట్టి, “వెంకటేశ్వర స్వామి గుడి పూజ ఇక ముందు నువ్వే చేయి కిట్టన్నా, నేను నీకు మంత్రం అంతా నేర్పిస్తాను, దేవుడి పూజ నేర్పిస్తాను, నీకు ఎంత బుర్రకి ఎక్కుతుందో అంత నేర్చుకో.” అని చెప్పి తామే ఆచార్య చేతిని పైకి ఎత్తి తాళం చెవిని కిట్టన్న చేతిలో వేసి ఆశీర్వదించారు. కళ్ళలో నీరు తెచ్చుకున్న కిట్టన్న, “అలాగే కానివ్వండి అత్తా” అన్నాడు.

రామాచార్యులు విష్ణు సాయుజ్యం పొందాక తర్వాత పనులను కిట్టన్న చేసినా, రెండు రోజుల తర్వాత వచ్చిన పవమాన తర్వాతి పనులన్నీ చేసి ముగించాడు. పిల్లలిద్దరిని తీసుకుని మేఘ తర్వాత వచ్చింది. ఇక న్యూజెర్సీకి బయలుదేరే రోజు దగ్గరకు రాగానే పవమాన తన తల్లితో మాట్లాడాడు.

“అమ్మా… నువ్వు ఇక్కడ ఒక్క దానివే అయిపోతావు. ఈ శుభ్రత-మైల అనే దాన్ని అంతా వదిలేసి నువ్వు కూడా న్యూజెర్సీకి వచ్చేసెయ్. మా ఇల్లు కూడా చాలా పెద్దది, హాయిగా  ఉండవచ్చు. నువ్వు అక్కడికి రావడానికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఏర్పాటు నేను చేస్తాను.”

గది తలుపు దగ్గర వచ్చి నిలబడి తల్లీకొడుకుల మాటలను వింటున్న కోడలిని ఒకసారి చూసి సీతాబాయమ్మగారు మాట్లాడారు.

“నేను మా ఇలవేల్పు వెంకన్న సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను పవమాన. మనుషుల సంరక్షణలో  ఉండడం కంటే దేవుడి సంరక్షణలో ఉండడం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే, నా సంరక్షణలో ఉన్నావు అని ఆ దేవుడు ఎప్పుడూ సంరక్షణ గురించి మాట్లాడడు చూడు.” అత్త ఆడిన మాటలు విని మేఘకు ముఖం మీద కొట్టినట్లు అనిపించి గదిలోకి వెళ్ళిపోయింది. పవమాన అమ్మను ఎదురించలేక మౌనంగా తల కిందకి దించాడు. సీతాబాయమ్మగారే మాట కొనసాగించారు.

“బాధపడకు నాయనా పవమాన. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ దేవుడు నన్ను వదలలేదు. ఇప్పుడు నేను ఆ వెంకన్నను ఎలా వదిలి వస్తాను?”

కాలచక్రం తిరగకుండా ఆగదు కదా? మఠంలో నీరు తోడి పోసే కిట్టన్న పది సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి గుడి పూజారి అయిన తర్వాత, అందరూ అతన్ని కృష్ణమాచార్య  అని పిలుస్తున్నారు. రామాచార్యులు వెళ్ళిపోయిన తర్వాత ‘మైల’ అయిన సీతాబాయమ్మగారు  ఇప్పుడు గుడి బాధ్యతను అంతా చూసుకుంటున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో పవమాన పిల్లలు ఇప్పుడు కాలేజీలో చదువుకుంటున్నారు. పిల్లలిద్దరూ తమ పాటికి తాము వేరే ఉండి, అప్పుడప్పుడు ఇంటి వైపు తొంగిచూస్తారు. తాము కోరుకున్నట్లు జీవితం గడుపుతున్నారు. ఐదు బెడ్ రూమ్‌ల పెద్ద ఇల్లు ఇప్పుడు ఖాళీ-ఖాళీగా, రాత్రిపూట అయితే బోసిగా అనిపించడం మొదలవగానే, పవమాన, మేఘ దానిని అమ్మి అక్కడే బ్రిడ్జ్‌వాటర్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరనే రెండు బెడ్ రూమ్‌ల అపార్ట్‌మెంట్ కొనుక్కున్నారు.

“మా నాన్న-మా తాత అందరూ పెద్ద పండితులు, మా ఇంటిదే ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది” అని అందరికీ చెప్పుకుంటూ, పట్టు బట్టలు వేసుకుని, పెద్ద జరీ శాలువా కప్పుకుని, గుడిలో దేవుడి ముందు మొదటి వరుసలో కూర్చునే పవమాన, అక్కడి సంప్రదాయబద్ధమైన వారి గుంపుకు నాయకుడయ్యాడు.

“పిల్లలు ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అయ్యింది, ఫోన్ అయినా చేయవచ్చు కదా” అని అనుకుని మేఘ ఫోన్ చేసినప్పుడల్లా, “ఎందుకు అమ్మా ఈ సమయానికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు?” అని పిల్లల చేత తిట్టించుకుని బాధపడుతుంది.

ఇక్కడ కల్లహళ్లిలో ఇంటి ముందు అరుగు మీద దూది-వత్తుల బుట్ట పెట్టుకుని కూర్చుని, దారిలో వెళ్ళే-వచ్చేవారిని అంతా పలకరించే సీతాబాయమ్మగారు, దూది వత్తులు చేసుకుంటూ రామదాసు కీర్తనను పాడుతుంటారు. “… రక్షించెదనని ప్రేమతొ పలికిన ప్రభువిట నుండగ తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు”

*  రాయరు = శ్రీ రాఘవేంద్రస్వామి

కోడిహళ్లి మురళీ మోహన్

రచయిత, సాహిత్యాభిమాని, అనువాదకుడు, సంపాదకుడు వికీపీడియన్. తెలుగు కన్నడ భాషలలో అనువాదాలు చేస్తున్నారు. కథాజగత్, సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం, జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు, రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులంకథ, క్రీడాకథ, రామకథాసుధ, పదచదరాలు, స్వాతంత్ర్యభారతికి అమృతోత్సవ హారతి అనే పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రముఖ హేతువాది, విద్యావేత్త డా.హెచ్.నరసింహయ్య ఆత్మకథను పోరాటపథం పేరుతో తెలుగు ప్రజలకు పరిచయం చేశారు.

Previous Post

ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు

Next Post

ఇనుపచువ్వల దడి

Next Post
ఇనుపచువ్వల దడి

ఇనుపచువ్వల దడి

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com