మూలం : హెల్మట్ ష్వాబ్ (The Wall)
తెలుగు అనువాదం : మణి వడ్లమాని
“ఆకాశానికి చిల్లుపడినట్లు… ఆగకుండా వర్షం…! ఎక్కడా తెరిపిలేదు, ఒక్కలా వర్షం కురుస్తూనే ఉంది! ఉన్నట్టుండి కరెంటుపోయింది. అంతా చీకటి, దారి కనిపించటం లేదు. కింద అంతా బురద, కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఇంతలో ఒక్కసారి మెరుపు మెరిచింది. ఆ మెరుపు వెలుగులో ఎదురుగుండా ఒక ఇనుపచువ్వలదడి కనిపించింది. అమ్మయ్య అనుకుంటూ, వాటి మధ్యలోనించి లోపలకి వెళుతున్నాను. జాగ్రత్తగా అడుగు తీసి, అడుగు వేసానో లేదో ఆ దడి తాలుకు ఒక సన్నటి ఇనుపచువ్వ, చీకట్లో కనిపించలేదు, అచ్చు కత్తి మొన లాగా కోసుగా ఉండి కడుపులోకి గుచ్చుకొని… నేను చచ్చిపోయాను.”
![]()
“ఏవండి! లేవండి, అప్పుడే టైం ఏడు గంటలయింది, తొందరగా ఆఫీసుకి వెళ్లాలన్నారు కదా! అంటూ రవిని లేపడానికి వచ్చిన సంధ్య మంచం మధ్య కూర్చుని శూన్యంలోకి చూస్తున్న భర్తను చూసి, “అదేంటి చెమటలు అలా దిగకారుతున్నాయి, ఏంటి పిచ్చి చూపులు చూస్తున్నారు” అంటూ కంగారుగా కుదిపేసింది. కాని రవి ఏమి మాట్లాడకుండా లేచి బాత్‌రూంలోకి వెళ్ళిపోయాడు. సంధ్యకి అతని చర్య అర్థం కాక అలా చిత్తరవులా నిలబడిపోయింది. బయటకు వచ్చిన రవి భార్యను చూసి అతిమాములుగా “కాఫీ ఇవ్వు” అనడిగాడు.
“ఆ అలాగే” అని వంటింట్లోకి వెళ్లి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. ఆమె మొహం వైపు చూడకుండానే కాఫీ తాగేసి మళ్ళి స్నానాల గది లోకి వెళ్లిపోయాడు. కొంచెం సేపు అయ్యాక బట్టలు వేసుకొని “నేను ఆఫీసుకి వెళుతున్నాను” అని గోడకి చెప్పినట్లు చెప్పి వెళ్ళిపోయాడు. సంధ్య అతని వింత ప్రవర్తనకు విస్తుపోయింది. పెళ్ళయిన ఇన్నేళ్ళలో ఇలా ఎప్పుడూ జరగలేదు అనుకొంది.
ఆఫీసుకు బయల్దేరిన రవి తన కలను పునశ్చరణ చేసుకుంటూ ఎప్పుడూ వెళ్ళే దారిలోనే నడుచుకుంటూ బస్సుస్టాప్ వైపు వెళుతుండగా, హటాత్తుగా అతని కళ్ళకి రోడ్డుకి ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ‘దడి’ కనిపించింది. తనని కలలో చంపిన దడి అదే!
ఇంక ఆపక్కకు చూసే ధైర్యం లేక వడివడిగా అడుగులేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు
తెలియని భయం వెంటాడుతోంది, తలచుకుంటే అదే నిజమేమో, తను చనిపోయాడేమో అనిపిస్తోంది. ఏదో అదృశ్యశక్తి నువ్వు త్వరలో మరణిస్తావు అని అన్యాపదేశంగా చెపుతున్నట్లు అనిపిస్తోంది. ఏవిటో ఈ ప్రపంచం తో సంబంధం తెగిపోయినట్లు, ఎక్కడో గమ్యం తెలియనంత దూరంలో, పెద్దగాజు గోళంలో ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు, ఎప్పుడు వస్తుందో తెలియని మృత్యువు కోసం ఎదురు చూస్తున్నట్లు, అందరూ ఉంటారు ఈ లోకంలో ఒక్క నేను తప్ప, అనే దిగులు, నైరాశ్యం మనసును కమ్మేసాయి.
ఆరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక ఇంత భోజనం తిన్నాననిపించి గదిలోకి వెళ్లి ముసుగుతన్ని పడుకున్నాడు. ఏదో ఆందోళన, భార్యకు చెప్పితే చిన్నబుచ్చుతుందేమో అనే అనుమానం. అలా ఆలోచిస్తూ పడుకున్న రవికి మగత నిద్రలో మళ్ళీ అదే కల. ఆ దడి మధ్యలో నుంచి వెళుతూ ఉంటే ఇనపచువ్వ మొన గుచ్చుకొని తను చచ్చిపోయాడు. అర్ధరాత్రి దిగ్గున లేచి కూర్చొన్నాడు మంచం మీద వణికిపోతూ. రోజు ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఏదైనా శవం వెళుతూవుంటే అయ్యో పాపం అనుకుంటాము. కానీ అదే మన దగ్గరకు వచ్చేసరికి ఆ చావు మాట తలచుకోవడమే భయంకరంగా అనిపిస్తుంది. సంధ్య తనని దగ్గరకు తీసుకుంటే బాగుండును ఆ వెచ్చటి కౌగిలిలో అన్ని భయాలు పోతాయి అనిపించింది. కానీ ఇవేమీ తెలియని ఆమె హాయిగా నిదురపోతోంది.
మళ్ళి తెల్లవారింది. రోజు వారి దినచర్య మొదలు. మనసులో ముల్లులా ఆ దడి గురుకొస్తోంది. అది తలచుకుంటే చాలు చావు గురించిన బెంగ మొదలయింది. ఎప్పుడూ వెళ్ళే దారిలోనే నడుచుకుంటూ బస్సు స్టాప్ కి వెళ్తూ ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలం దగ్గరకి వచ్చినపుడు దడి వైపు చూశాడు. ఇంకా ఆశ్చర్యం, అచ్చు కలలో తనకి గుచ్చుకొన్నలాంటి సన్నగా మొనతేలిన చువ్వ, కొంచెము ముందుకు వాలి ఉంది. ఇంక ఆ పక్కకు చూసే ధైర్యం లేక వడివడిగా అడుగులేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆఫీస్ లో పని చేసుకుంటూ మనసులోపల అనుకుంటున్నాడు, “అవును, నేను ఎందుకు భయపడుతున్నాను. ఇవాళ కాకపోతే రేపైనా అందరం ఇక్కడనుంచి వెళ్ళాలిసిన వాళ్ళమే. ఎప్పుడో పోయే దానికి ఇప్పటి నుంచే ఆదుర్దా అనవసరం. ఈ జీవితం ఉన్నంత వరకు నేను సంతోషంగా ఉండి నా వాళ్ళను కూడా సంతోషపెట్టాలి, అంతే కానీ పిరికి వాడిలాగా నిజం నుంచి పారిపోకూడదు అని దృఢంగా అనుకున్నాడు. సాయంత్రం ఇంటికి వస్తూ సంధ్యకి కొత్త చీర, బాబుకి కొత్త డ్రెస్, స్వీట్స్, పళ్ళు తీసుకొని బయలుదేరాడు. వాన మొదలైంది. అంత వరకు మర్చిపోయిన దడి గురించిన ఆలోచనలు మళ్ళీ వచ్చాయి. ఇలా జరగడం కాకతాళీయమా లేక నిజంగా నాకు భవిష్యత్తు తెలుస్తోందా” అంటూ ఆలోచించడం మొదలెట్టాడు రవి.
ఎంత చూడకూడదు అనుకొన్నా చూపు మాత్రం ఆ ఖాళీ స్థలం వైపు మళ్ళింది. అనూహ్యం! ఆ ఇనుప చువ్వల దడి పడిపోయివుంది. అక్కడ నుంచొని చూస్తూ ఉండగా ఆ పక్క నుంచి ఒక వ్యక్తి వెళుతున్నాడు, వెంటనే కుతూహలంగా అతనిని ఆపి అడిగాడు “ఈ దడి ఎలా పడిపోయింది బాబు” అని, దానికి ఆ వ్యక్తి ఇదేమి పిచ్చిప్రశ్న అన్నట్లు రవిని కిందనుంచి పైవరకు ఓ చూపు చూసి “ఇక్కడ ఏదో పెద్ద హోటల్ కడతారుట, అందుకే ఈ స్థలమంతా చదును చెయ్యడానికి దడిని పడగొట్టారు. ఇనుపదడి దానంతట అదే పడి పోతుందా?” అని ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
అప్పటి వరకు రవి మనసులో ఇనుములా బరువుగా దడికట్టిన భయం ఒక్కసారిగా పటాపంచలయింది. మనసు దూదిపింజెలాగా తేలిగ్గా మారింది. లోపలగూడు కట్టుకొన్న దిగులంతా మాయమైపోయింది. ఆనందంగా ఇంటి వైపుకి అడుగులు వేసాడు. తెల్లారకట్ట వచ్చిన కలలు నిజమవుతాయి అనే మూఢనమ్మకంలో ఉన్న రవి, అది కలే కాని నిజం కాదనే నమ్మకం కుదిరింది. రెట్టించిన ఉత్సాహంతో సంతోషంగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళాడు. హుషారుగా ఇంటికి వచ్చిన రవిని చూసి సంధ్య ఎంతో ఆనంద పడింది. కొడుకు “నాన్నా” అంటూ దగ్గరగా వచ్చాడు. చేతులు చాపి వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకొని మనసారా హత్తుకున్నాడు.
![]()




Discussion about this post