ఉర్దూ : సాదత్ హసన్ మంటో
ఇంగ్లిషు : మ్యాట్ రీక్, అఫ్తాబ్ అహ్మద్
తెలుగు అనువాదం : పి.శ్రీనివాస్ గౌడ్
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఈరోజు అపోలో బందర్‌లో మేము కలిశాము. ఆ సాయంత్రం సూర్యుని చివరి కిరణాలు సముద్రపు సుదూర అలల వెనుక అదృశ్యమయ్యాయి. చూస్తుంటే అవి బీచ్ వెంబడి ఉన్న బెంచీల నుండి మందపాటి వస్త్రం మడతలలా కనిపించాయి. గేట్‌వే ఆఫ్ ఇండియాకు ఇటువైపు, ఒక వ్యక్తి తలకు మసాజ్ చేయించుకుంటున్న మొదటి బెంచ్ దాటి నడిచి, రెండవ బెంచ్ మీద కూర్చున్నాను. విశాలంగా పరుచుకున్న నీళ్ళ వైపు నాకు కనిపించినంత మేరకు చూశాను. సముద్రం, ఆకాశం ఒకదానికొకటి కలిసి కరిగిపోయిన చోట; పెద్ద పెద్ద అలలు నెమ్మదిగా పైకి లేస్తున్నాయి. అవి ఒడ్డుకు దొర్లుతు వస్తున్న భారీ బురద తివాచీల లాగా కనిపించాయి.
బీచ్ వెంబడి ఉన్న వీధి దీపాల నుండి వెలుగు పడుతోంది. దాని మెరిసే ప్రతిబింబం నీటిపై మందపాటి గీతలుగా ఏర్పడింది. నా ముందు ఉన్న రాతి గోడ కింద, పడవల స్తంభాలకు కట్టేసిన పడవలు తేలికగా ఊగుతున్నాయి. వాటిపై తెరచాపలు కట్టారు. అలల శబ్దాలు, బీచ్ జనాల సందడి స్వరాలు సాయంత్రం గాలిలో కలగలిసి అదృశ్యమవుతున్నాయి. అప్పుడప్పుడు అటుగా పోతున్న కారు హారన్ బిగ్గరగా మోగుతుంది, ఎవరో చాలా ఆసక్తికరమైన కథ వింటున్నప్పుడు “హ్మ్మ్” అని అన్నట్లుగా.
ఇలాంటి సమయాల్లో నాకు పొగ తాగడం చాలా ఇష్టం. నా చేతిని జేబులో పెట్టుకుని నా సిగరెట్ ప్యాకెట్ బయటకు తీశాను, కానీ నాకు వెలిగించుకునేందుకు ఏ అగ్గిపుల్లా దొరకలేదు – ఎక్కడ పోగొట్టుకున్నానో ఎవరికి తెలుసు.
ఆ ప్యాకెట్ ని తిరిగి నా జేబులో పెట్టుకోబోతుంటే, దగ్గర్లో ఉన్న ఎవరో ’’ ఇదిగోండి.. అగ్గిపుల్ల’ అని అన్నారు. నేను వెనక్కి తిరిగి చూశాను. ఒక యువకుడు బెంచ్ వెనుక నిలబడి ఉన్నాడు. బొంబాయిలో ప్రజలు సాధారణంగా తెల్లటి రంగులో ఉంటారు, కానీ అతని ముఖం భయంకరంగా పాలిపోయి వుంది. ‘’మీరు చాలా దయగలవారు’’ నేను అతనికి కృతజ్ఞతలు చెప్పాను.
అతను నాకు అగ్గిపుల్లలు ఇచ్చాడు. నేను అతనికి మళ్ళీ కృతజ్ఞతలు చెప్పి, కూర్చోమని ఆహ్వానించాను. ‘’దయచేసి మీ సిగరెట్ వెలిగించండి. నేను వెళ్ళాలి’’ అతను అన్నాడు.
అకస్మాత్తుగా అతను ఎందుకో అబద్ధం చెబుతున్నాడని నాకు అనిపించింది. అతని స్వరాన్ని బట్టి అతను తొందరపడటం లేదని, ఎక్కడికీ వెళ్ళేవాడులా లేడని నాకు అర్థమైంది. అతని స్వరం నుంచి నేను దీన్ని ఎలా గుర్తించగలనని మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ నాకు సరిగ్గా అలాగే అనిపించింది. నేను మళ్ళీ అన్నాను ‘’ఏమిటి అంత తొందర? దయచేసి కూర్చోండి’’ నేను నా సిగరెట్ పెట్టెను అతని వైపుకు తోసాను ‘’తీసుకోండి’’అని
అతను సిగరెట్ బ్రాండ్ వైపు చూశాడు. ‘’ధన్యవాదాలు, కానీ నేను నా బ్రాండ్ మాత్రమే తాగుతాను.’’
నన్ను నమ్మండి..నమ్మకపోండి.. కానీ మళ్ళీ అతను అబద్ధం చెబుతున్నాడని నేను ప్రమాణం చేయగలను. కాబట్టి నాకు అతనిపై ఆసక్తి కలిగింది. అతన్ని కూర్చోబెట్టి సిగరెట్ వెలిగించాలని నిర్ణయించుకున్నాను. అది అస్సలు కష్టం కాదని నేను అనుకున్నాను. ఎందుకంటే అతను అన్న రెండు మాటలలోనే తనను తాను మోసం చేసుకుంటున్నాడని నాకు అర్థమైంది. అతను కూర్చుని పొగ తాగాలనుకున్నాడు, కానీ అదే సమయంలో ఏదో అతన్ని మొకమాటపడేలా చేసింది. అతని గొంతులో ఈ సంఘర్షణ నాకు స్పష్టంగా అర్థమైంది. జీవితంపై అతనికి నియంత్రణ కూడా సరిగా లేదని నేను చెపుతున్నది నమ్మండి.
అతని ముఖం చాలా సన్నగా ఉంది. అతని ముక్కు, కళ్ళు, నోరు చాలా చక్కగా ఉన్నాయి. ఎవరో వాటిని లోపలికి లాగి నీటితో కడిగినట్లు అనిపించింది. అతని కళ్ళు పెద్ద బురద నీటి బిందువులలా ఉన్నాయి, వాటిపై అతని సన్నని కనురెప్పలు వాలిపోయాయి. అతని జుట్టు కాలిన కాగితంలా నల్లగా ఉంది. మీరు గనక దగ్గరలో ఉంటే అతని ముక్కు యొక్క ఆకారాన్ని మీరు చూడవచ్చు, కానీ దూరం నుండి అది చదునుగా ఉంది. అతను కొద్దిగా వంగి ఉన్నప్పుడు అతను సగటు ఎత్తు ఉన్నట్లు అనిపించింది. కానీ అతను అకస్మాత్తుగా సరిగా నిలబడినప్పుడు, అతను చాలా పొడవుగా ఉన్నాడు. అతని బట్టలు చిరిగాయి కానీ మురికిగా లేవు. అతని కోటు మణికట్టులు అరిగిపోయాయి. కొన్ని చోట్ల దారాలు బయటపడి ఉన్నాయి. అతని కాలర్ దగ్గర కుట్లు విడిపోయాయి. అతని చొక్కా ఇంకోసారి ఉతకడానికి పనికిరాదని అనిపించింది. కానీ ఈ బట్టలలో కూడా, అతను తనను తాను గౌరవంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను ‘ప్రయత్నిస్తున్నాడు’ అని అంటున్నాను. ఎందుకంటే నేను అతనిని మళ్ళీ చూసినప్పుడు, ఒక దౌర్భాగ్యపు అల అతనిని ఊడ్చేసినట్టు..అతను దృష్టి అక్కడ నుండి తాను అదృశ్యం కావాలని కోరుకున్నట్లు అనిపించింది.
నేను లేచి నిలబడి, సిగరెట్ వెలిగించి, మళ్ళీ నా ప్యాకెట్ ని అతని వైపు చాపాను.
అతను తిరస్కరించలేనంతగా నేను దానిని అతని వైపు నెట్టాను. అతను సిగరెట్ తీసి, నోట్లో పెట్టుకుని వెలిగించుకున్నాడు. అతను పొగ త్రాగడం మొదలుపెట్టాడు కానీ, అకస్మాత్తుగా తన తప్పును గ్రహించాడు. అతను నోటి నుండి సిగరెట్ తీసి, దగ్గుతున్నట్లు నటిస్తూ ‘’కావెండర్లు నాకు సరిపోవు, వాటి పొగాకు చాలా ఘాటుగా ఉంటుంది. అవి నా గొంతుకు సరిపడవు’’ అని అన్నాడు.
‘’నీకు ఏ సిగరెట్లు ఇష్టం?’’ అతనిని అడిగాను.
“నేను…నేను…’ అతను తడబడ్డాడు. “నిజానికి నేను అంతగా పొగ తాగను. డాక్టర్ అరోల్కర్ దానిని వద్దన్నారు. కానీ నేను తాగితే, 555 తాగుతాను. ఎందుకంటే దాని పొగాకు అంత ఘాటుగా వుండదు.”
డాక్టర్ అరోల్కర్ బొంబాయి అంతటా ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే అతను రోగ సంప్రదింపుల కోసం పది రూపాయలు వసూలు చేస్తాడు. అతను పేర్కొన్న సిగరెట్ బ్రాండ్ కూడా చాలా ఖరీదైనది. అతను ఒకే దెబ్బలో రెండు అబద్ధాలు చెప్పాడు. వాటిలో ఏదీ నేను నమ్మలేదు, కానీ నేను ఏమీ అనలేదు. నేను మీకు నిజం చెబుతున్నప్పుడు అతని మోసాన్ని బయటపెట్టి, అతనిని సిగ్గుపడేలా చేసి, అతను నన్ను క్షమించమని వేడుకుంటాడని నేను అనుకున్నాను. కానీ నేను అతని వైపు చూసినప్పుడు, అబద్ధం అతని వ్యక్తిత్వంలో భాగమైందని నాకు అర్థమైంది. చాలా మంది అబద్ధం చెప్పిన తర్వాత సిగ్గుపడతారు, కానీ అతను అలా చేయలేదు. అతను తను చెప్పిన ప్రతిదాన్ని నమ్మాడు. చాలా నిజాయితీగా అబద్ధం చెప్పాడు. అతని మనస్సాక్షికి సూది గుచ్చుకున్న చిన్న నొప్పి కూడా కలగలేదు.
కొంచెం మర్యాదగా మాట్లాడిన తర్వాత, సంభాషణను నేను మాట్లాడాలనుకున్న విషయానికి తీసుకువెళ్ళాను. అతనికి మరో సిగరెట్ అందించి, అందమైన సముద్ర దృశ్యాన్ని ప్రశంసించడం ప్రారంభించాను. నేను ఒక చిన్న కథా రచయితని కాబట్టి, సముద్రం, అపోలో బందర్, జనసమూహాన్ని చాలా ఆసక్తికరంగా వర్ణించగలిగాను. ఆరు సిగరెట్లు కాల్చిన తర్వాత కూడా అతను తన గొంతు గురించి ఫిర్యాదు చేయలేదు. అకస్మాత్తుగా, అతను నా పేరు ఏమిటి అని అడిగాడు. నేను అతనికి నా పేరు చెప్పినప్పుడు, అతను బెంచ్ నుండి గబుక్కున లేచి, ‘’ఏంటీ..నువ్వు మంటోవా? నేను నీ కథలలో కొన్ని చదివాను. నువ్వు మంటో అని నాకు తెలియదు. నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడా..చాలా సంతోషంగా ఉంది, నిజంగా!’’
నేను అతనికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను, కానీ అతను మళ్ళీ ఇలా అన్నాడు, ‘అవును, నాకు బాగా గుర్తుంది. ఇటీవల, నేను మీ కథ చదివాను – దాని పేరేంటి? ఏమైనా, అది ఒక అమ్మాయిని ప్రేమించే వ్యక్తి గురించి, కానీ ఆ వ్యక్తి ఆమెను వాడుకుని మాయమవుతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ప్రేమించే మరొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఆ వ్యక్తే కథ చెబుతున్నాడు. ఆ అమ్మాయి పరిస్థితి గురించి తెలుసుకున్నప్పుడు, అతను ఆమెను చూడటానికి వెళ్తాడు. అతను, “గతంలో జరిగిన దాని గురించి ఆలోచించవద్దు. ప్రేమ ఇచ్చిన జ్ఞాపకాలను దాచుకుని ముందుకు సాగండి. మీరు దొరికిన ఆనందాన్ని ఉపయోగించుకోండి” అని అంటాడు. కానీ నిజానికి నాకు కథ గురించి అంతగా గుర్తులేదు. చెప్పు, అది సాధ్యమేనా-కాదు, ఇది సాధ్యమయ్యే దాని గురించి కాదు-చెప్పు, అది నువ్వే కదా? క్షమించండి, నాకు నిన్ను అడిగే హక్కు లేదు. కానీ నీ కథలో, ఆ అమ్మాయిని వ్యభిచార గృహంలో కలిసి, ఆమె మసక వెలుతురులో అలసిపోయి నిద్రలోకి జారుకున్నప్పుడు వెళ్లిపోయిన వ్యక్తివి నువ్వు కాదా?” అతను అకస్మాత్తుగా ఆగిపోయాడు. ‘’నేను నిన్ను అలా అడగకూడదు. ఎవరూ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదు.’’
‘’నేను మీకు చెప్తాను’’ అని జవాబిచ్చాను. ‘’కానీ మనం కలిసింది ఇప్పుడే..ఇప్పుడే అన్నీ మీకు చెప్పడం నాకు ఇబ్బందిగా ఉంది. మీరు ఏమనుకుంటున్నారు?’’
నా కథ గురించి నాతో మాట్లాడుతున్న కొద్దీ అతనిలో పెరిగిన ఉత్సాహం అకస్మాత్తుగా చచ్చిపోయింది.
‘’నువ్వు చెప్పింది నిజమే’’ అని అతను గుసగుసలాడాడు. ‘’అయితే ఇది మన చివరి సమావేశం కాదని నీకెలా తెలుసు?’’
‘’బాంబే ఒక పెద్ద నగరం అనేది నిజమే, కానీ మనం చాలాసార్లు కలిసామని అనిపిస్తుంది. ఏమైనా, నేను నిరుద్యోగిని – అంటే నేను కథా రచయితని కాబట్టి మీరు ప్రతి రాత్రి ఈ సమయంలో నన్ను ఇక్కడే కలవవచ్చు, నేను అనారోగ్యంతో ఉంటే తప్ప. చాలా మంది అమ్మాయిలు ఇక్కడికి వస్తారు, అందుకే నేను ప్రేమలో పడటానికి ఇక్కడికి వస్తాను. ప్రేమ చెడ్డ విషయం కాదు కదా..!’’
‘ప్రేమ.. ప్రేమ..’ అతను ఏదో చెప్పాలనుకున్నాడు కానీ తనను తాను కూడదీసుకోలేకపోయాడు. చివరి కొసన మండుతున్న తాడులా అతను నిశ్శబ్దంగా వుండిపోయాడు.
ప్రేమను నేను సరదాగా మాత్రమే ప్రస్తావించాను. కానీ నిజానికి, వాతావరణం చాలా మనోహరంగా ఉంది. ప్రేమలో పడటం అంత చెడ్డ విషయం కాదు. సంధ్యా సమయంలో, వీధిలైట్లు వెలిగి, చల్లని గాలి వీచినప్పుడు, గాలిలో ఒక శృంగార భావన పొడ చూపుతుంది. మీకు బాగా దగ్గరైన స్త్రీని మీరు కోరుకుంటారు.
ఏమైనా, అతను ఏ కథ గురించి మాట్లాడుతున్నాడో దేవుడికే తెలుసు. నా కథలన్నీ నాకు గుర్తుండవు, ముఖ్యంగా ప్రేమకథలు. నిజ జీవితంలో నేను అంత మంది మహిళలతో సన్నిహితంగా లేను. నేను వాళ్ళ గురించి వ్రాస్తే, అది త్వరగా డబ్బు సంపాదించడానికి లేదా ఏదైనా కాల్పనిక ప్రపంచంలో మునిగిపోవడానికి. నేను ఈ కథల గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించను. కానీ నాకు గుర్తుంది. ప్రేమకథలు కాకుండా నేను కొన్ని ఇతరత్రా రాసిన కథల్లోలా ఒక ప్రత్యేక రకమైన స్త్రీని కలిశాను. ఏదేమైనా, అతను చెప్పిన కథ నేను ఏదో కోరిక తీర్చుకోవడానికి రాసిన చౌకబారు ప్రేమకథ అయి ఉండాలి. కానీ ఇప్పుడు నేను నా కథల గురించి మాట్లాడటం మొదలుపెట్టాను!
అతను ‘ప్రేమ’ అనే పదాన్ని మళ్ళీ మళ్ళీ అన్నప్పుడు, నేను అకస్మాత్తుగా ఆ విషయం గురించి ఇంకా కొంత చెప్పాలనుకున్నాను. ‘’అవును, మన పూర్వీకులు ప్రేమను అనేక రకాలుగా విభజించారు. కానీ ప్రేమ, ముల్తాన్‌లో అయినా సైబీరియాలోని మంచులో అయినా, శీతాకాలంలో అయినా వేసవిలో అయినా, ధనవంతుల మధ్య అయినా పేదల మధ్య అయినా, అందమైన వారి మధ్య అయినా వికారమైన వారి మధ్య అయినా, ప్రేమ ఎప్పుడూ ప్రేమే. ఎటువంటి తేడా లేదు. పిల్లలు ఎల్లప్పుడూ ఒకే విధంగా పుడతారు, ప్రేమ కూడా ఒకే విధంగా వస్తుంది. శ్రీమతి సయ్యిదా తన బిడ్డను కనడానికి ఆసుపత్రికి వెళ్లిందని లేదా రాజకుమారి అడవిలోకి వెళ్లిందని మీరు చెప్పినా, గులాం ముహమ్మద్‌లో ఒక భంగన్ ప్రేమను రేకెత్తించిందని లేదా నట్వర్ లాల్‌లో ఒక రాణి ప్రేమను ప్రేరేపిస్తుందని మీరు చెప్పినా తేడా లేదు. చాలా మంది పిల్లలు అకాలంగా పుడతారు. బలహీనంగా ఉంటారు. ప్రేమ కూడా తొందరపడితే బలహీనంగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రసవం చాలా బాధాకరం, కొన్నిసార్లు ప్రేమలో పడటం చాలా బాధను కలిగిస్తుంది. స్త్రీలకి గర్భస్రావం అయినట్లే, ప్రేమ పెరగడానికి అవకాశం రాకముందే చనిపోతుంది. కొన్నిసార్లు స్త్రీలకి పిల్లలు పుట్టరు. అలాగే సమయానుకూలంగా ప్రేమించలేని పురుషులను కూడా మీరు చూస్తారు. అంటే వారు ప్రేమించకూడదని కాదు. అస్సలు కాదు. వారు ప్రేమించాలని కోరుకుంటారు కానీ, ఎలా ప్రేమించాలో వారికి తెలియదు. కొంతమంది స్త్రీలు పిల్లలను కనలేరు, కొంతమంది పురుషులు భావోద్వేగంతో ప్రేమించలేరు. మీకు ప్రేమలో కూడా గర్భవిచ్చిత్తి కావచ్చు.’’
నేను చెప్పేది నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది, అతను దాన్ని శ్రద్దగా వింటున్నాడో లేదో గమనించలేదు. అతను తన మానాన, దూరంగా సముద్రం మీద శూన్యం వైపు చూస్తూ..
ఆలోచనలో మునిగిపోయినట్లు కనిపించాడు. నేను ఆగిపోయాను.
కారు హారన్ బిగ్గరగా మోగినప్పుడు, అతను తన పరధ్యానం నుండి మేల్కొని, ‘అవును, నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే!’ అన్నాడు.
“నేను చెప్పింది పూర్తిగా నిజమేనా? నేను ఇప్పుడేం చెప్పానో చెప్పు.’’ అని నేను అతన్ని సవాలు చేయాలనుకున్నాను. కానీ నేను ఏమీ అనలేదు. బదులుగా అతని బరువైన ఆలోచనల నుండి బయటపడటానికి సమయం ఇచ్చాను.
అతను కాసేపు ఆలోచనలో మునిగిపోయాడు. తర్వాత మళ్ళీ అన్నాడు ‘’నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే, కానీ..సరే, వేరే విషయం గురించి మాట్లాడుకుందాం.’’
నేను అనుకోకుండా ఆలోచించిన విధానం నాకు నిజంగా నచ్చింది. సంభాషణ ఆపడానికి బదులుగా ఉత్సాహంగా మళ్ళీ ఇలా మొదలుపెట్టాను ‘’సరే, కొంతమంది పురుషులకు ఎలా ప్రేమించాలో తెలియదని అంటున్నాను. అంటే, వారు ప్రేమించాలని కోరుకుంటారు కానీ, వారా కోరికను తీర్చుకోలేరు. ఇది ఏదో మానసిక సమస్య వల్ల అని నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారు?’
అతను ఇప్పుడే ఒక దెయ్యాన్ని చూసినట్లుగా అతని ముఖం పాలిపోయింది. హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకి నేను ఆందోళన చెంది ‘’బాగున్నావా? నువ్వు నలతగా కనిపిస్తున్నావు’’ అని అడిగాను.
‘కాదు, అస్సలు కాదు’ అని అతను అన్నాడు. కానీ అతని బాధ ఇంకా పెరిగింది. “నాకేం కాలేదు. మీరెందుకు అలా అనుకున్నారు?’
‘’ఎవరైనా ఇప్పుడు నిన్ను చూస్తే ఇలాగే అంటారు. నువ్వు చాలా పీక్కుపోయి ఉన్నావు. నువ్వు ఇంటికి వెళితే మంచిదని అనుకుంటున్నాను. రా, నేను నీతో వస్తాను.’’
‘’లేదు, నేను ఒక్కడినే వెళ్తాను, నాకేం కాలేదు. కొన్నిసార్లు నాకు మనసు బావుండదు – బహుశా అదే కావచ్చు. నేను ఒక్క నిమిషంలో మామూలు అవుతాను, మీరు దయచేసి మాట్లాడుతూ ఉండండి.’’
నేను కాసేపు మౌనంగా కూర్చున్నాను. నా మాటలను గ్రహించేంత మానసిక స్థితిలో అతను లేడని అనిపించింది. కానీ అతను పట్టుబట్టాడు. నేను మళ్ళీ మొదలుపెట్టాను “ప్రేమించడం రాని పురుషుల గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావని అడుగుతున్నాను. వారితో ఉండటం ఎలా ఉంటుందో నేను ఊహించలేను. ఫలానా స్త్రీల గురించి ఆలోచించినప్పుడు, ఒక బిడ్డను కనాలనే వ్యామోహంతో, ఒక్క బిడ్డ కోసం కన్నీటితో దేవుడిని వేడుకున్నప్పుడు, ఆమె విన్నపాలు ఏవీ ఫలించనప్పుడు, మంత్రతంత్రాలతో తన సంతానలేమిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించే స్త్రీ, శ్మశానవాటిక నుండి బూడిదను తీసుకొని, సాధువులు ఇచ్చిన మంత్రాలను పఠిస్తూ లెక్కలేనన్ని రాత్రులు మేల్కొని, దేవునికి మొరపెడుతూ, నైవేద్యాలు సమర్పించడం కొనసాగిస్తుంది. అప్పుడు ప్రేమించడం రాని పురుషులు కూడా అలాగే భావిస్తారని నేను ఊహించుకుంటాను. వారు నిజంగా మన సానుభూతికి అర్హులు. వాస్తవానికి, నేను గుడ్డివారి పట్ల కంటే వారి పట్లే ఎక్కువ జాలి పడుతున్నాను”
అతని కళ్ళలో నీళ్ళు వచ్చాయి. గొంతు సవరించుకుని లేచి నిలబడ్డాడు. అతను నన్ను దాటి చూస్తూ ‘’ఓహ్, ఆలస్యం అవుతోంది..నాకొక ముఖ్యమైన పని ఉంది. మనం ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా సమయం నిజంగా గడిచిపోయింది’’ అన్నాడు.
నేను కూడా లేచాను. అతను వెనక్కి తిరిగి నా చేయి పట్టుకున్నాడు. ఆపై నా వైపు చూడకుండానే, ‘’ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నాను’’ అని అన్నాడు. తరువాత అతను వెళ్ళిపోయాడు.
మేము మళ్ళీ అపోలో బందర్‌లో కలిశాము. నేను సాధారణంగా నడకలకు వెళ్లను, కానీ అపోలో బందర్ పట్ల నాకున్న ఆసక్తి చనిపోవడానికి ఇంకా ఒక నెల సమయం ఉంది – అంటే, అపోలో బందర్ గురించి, అక్కడి అందమైన అమ్మాయిల గురించి అసభ్యకరంగా రాసిన ఒక ఆగ్రా కవి నుండి నాకు ఓ దీర్ఘ, వికారమైన ఉత్తరం అందింది. బొంబాయిలో నివసించడం నా అదృష్టమని ఆయన అన్నారు. ఇప్పుడు ఎవరైనా నన్ను అక్కడికి వెళ్ళమని అడిగినప్పుడల్లా, నాకు ఆ ఉత్తరం గుర్తుకు వచ్చి వికారం కలుగుతుంది. కానీ మా రెండవ సమావేశం సాయంత్రం నేను బెంచ్ మీద కూర్చోవడానికి వెళ్ళినప్పుడు జరిగింది. అక్కడ తలపట్టేవాళ్ళు వారి ఖాతాదారుల తలలు పడుతూ బిజీగా ఉన్నారు.
సంధ్యా సమయం రాత్రిగా మారిపోయింది. అక్టోబర్ వేడి వున్నప్పటికీ తేలికపాటి గాలి వీచింది. అలసిపోయిన ప్రయాణికులలా తమను తాము మోసుకుంటూ ప్రజలు బయటకు నడుస్తున్నారు. నా వెనుక ఆవరణ ఆగి ఉన్న కార్లతో నిండి ఉంది. దాదాపు అన్ని బెంచీలు నిండి ఉన్నాయి. నేను ఇద్దరు వదరుబోతు వ్యక్తుల పక్కన కూర్చున్నాను. ఒక గుజరాతీ, ఒక పార్సీ, వారు ఎంతసేపు అక్కడే కూర్చున్నారో దేవుడికే తెలుసు. వారు గుజరాతీ మాట్లాడుతున్నారు. కానీ వారి ఉచ్చారణలు భిన్నంగా ఉన్నాయి. తద్వారా వారు వేగంగా మాట్లాడటం ప్రారంభించినప్పుడు, చిలుక, మైనా పోట్లాడుకుంటున్నట్లు ధ్వనించింది.
వాళ్ళ అంతులేని గొడవలతో నేను విసిగిపోయి లేచాను. నేను తాజ్ మహల్ హోటల్ వైపు నడవడానికి తిరిగాను. అకస్మాత్తుగా అతను నా వైపు నడుస్తున్నట్లు చూశాను. నాకు అతని పేరు తెలియదు. నేను అతనిని పిలవలేకపోయాను. కానీ అతను నన్ను చూడగానే, అతను వెతుకుతున్నది దొరికినట్లుగా నా వైపు చూశాడు.
అక్కడ ఖాళీ బెంచీలు లేవు, కాబట్టి నేను ‘’మనం కలుసుకుని చాలా రోజులైంది. ఇక్కడ ఖాళీ బెంచీలు లేవు, కాబట్టి అక్కడ ఉన్న రెస్టారెంట్‌లో కూర్చుందాం’’ అని అన్నాను.
అతను కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక మేము బయలుదేరాము. కొంత దూరం నడిచిన తర్వాత, మేము రెస్టారెంట్‌కు చేరుకుని, దాని పెద్ద చువ్వల కుర్చీలపై కూర్చున్నాము. మేము కొంచెం టీ ఆర్డర్ చేసాము. నేను అతనికి సిగరెట్ ఇచ్చాను. యాదృచ్చికంగా, ఆ రోజే నేను డాక్టర్ అరోల్కర్ దగ్గరికి వెళ్ళాను. అతను నాకు ధూమపానం మానేయమని, మానేయలేకపోతే, 555 లాగా మంచి సిగరెట్లు తాగమని చెప్పాడు. డాక్టర్ సూచనల ప్రకారం, నేను ఆ సాయంత్రం ఒక 555 ప్యాకెట్ కొన్నాను. నా స్నేహితుడు దానిని శ్రద్ధగా చూశాడు, తరువాత ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా నా వైపు చూశాడు, కానీ ఏమీ మాట్లాడలేదు.
నేను నవ్వాను. ‘’నువ్వు చెప్పిన దాని వల్లే నేను ఈ సిగరెట్లు కొన్నానని అనుకోకు. ఈ రోజు నేను ఛాతీ నొప్పితో డాక్టర్ అరోల్కర్ దగ్గరికి వెళ్ళడం యాదృచ్చికం.’’అన్నాను.
“నేను ఈ సిగరెట్లు తాగగలను, కానీ కొన్నే తాగుతాను” అని అతను నాకు చెప్పాడు.
నేను మాట్లాడుతున్నప్పుడు అతని వైపు చూశాను. నా మాటలు అతన్ని బాధపెడుతున్నట్లు అనిపించింది. నేను వేగంగా నా జేబులోకి చేయి చాపి, డాక్టర్ అరోల్కర్ రాసిన మందుల చీటీ బయటకు తీశాను. నేను దానిని టేబుల్ మీద ఉంచి ‘’నేను దీన్ని చదవలేను, కానీ డాక్టర్ అరోల్కర్ వున్న ప్రతి విటమిన్ మాత్రలను రాసినట్టు కనిపిస్తోంది’’ అని అన్నాను.
డాక్టర్ అరోల్కర్ పేరు, చిరునామా తేదీ పక్కన వ్రాసిన మందుల చీటీ వైపు అతను దొంగ చూపులు చూశాడు. అతని ముఖంలో ఇంతకు ముందు కనిపించిన అశాంతి వెంటనే మాయమైంది. అతను నవ్వి ‘’రచయితలు తరచుగా పోషకాహార లోపంతో ఎందుకు బాధపడుతున్నారు?’’ అని అడిగాడు.
‘’ఎందుకంటే వాళ్ళకి తినడానికి సరిపడా దొరకదు. వాళ్ళు చాలా పని చేస్తారు. కానీ జీతం పెద్దగా రాదు.’’
టీ వచ్చింది. మేము వివిధ విషయాల గురించి మాట్లాడుకోవడం ప్రారంభించాము.
మా మొదటి సమావేశం జరిగి బహుశా రెండున్నర నెలలు గడిచిపోయి ఉండవచ్చు. అతని ముఖం మరింత పాలిపోయింది. అతని కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. అతను ఏదో దీర్ఘకాలిక భావోద్వేగ సమస్యతో బాధపడుతున్నట్లు అనిపించింది. ఎందుకంటే అతను మాట్లాడేటప్పుడు, ఆగి అనుకోకుండా నిట్టూర్చాడు. అతను నవ్వడానికి ప్రయత్నిస్తే, ఏ శబ్దం బయటకు రాలేదు.
అకస్మాత్తుగా నేను, ‘’మీరు ఎందుకు విచారంగా ఉన్నారు?’’ అని అడిగాను.
‘విచారమా…’ అని అతను అన్నాడు. అతని పెదవులపై ఒక చిరునవ్వు వ్యాపించింది. మరణిస్తున్నవారు తాము మరణానికి భయపడటం లేదని నిరూపించుకోవాలనుకున్నప్పుడు ఎంతగానో శ్రమించి చూపించే చిరునవ్వు అది. ‘’నేను విచారంగా లేను. మీరే విచారంగా ఉండాలి.’’
తర్వాత అతను ఒక్క గుక్కలో టీ తాగి లేచి నిలబడ్డాడు. ‘’సరే, అయితే. నేను వెళ్ళాలి. నేను చేయాల్సిన ముఖ్యమైన పని ఉంది.’’
అతనికి ఏ పని లేదని నాకు ఖచ్చితంగా తెలుసు, కానీ నేను అతన్ని వెళ్ళకుండా ఆపలేదు. అతని పేరు తెలుసుకునే అవకాశం నాకు లేదు. కానీ కనీసం అతనికి తీవ్రమైన భావోద్వేగ సమస్యలు ఉన్నాయని నేను తెలుసుకున్నాను. అతను నిరాశతో బాధపడుతున్నట్లు అనిపించింది. అతను చాలా విచారంగా ఉన్నాడు – అయినప్పటికీ అతను తన విచారం గురించి ఇతరులకు తెలియకూడదని కోరుకున్నాడు. అతను రెండు జీవితాలను గడపాలని కోరుకున్నాడు: ఒకటి బాహ్య వాస్తవికత, మరొకటి అతని అంతర్గతం. ఈ రెండవది అతని మేల్కొని వుండే ప్రతి క్షణాన్ని ఆక్రమించింది. అయితే, అతను ఈ రెండు జీవితాల్లోనూ విఫలమయ్యాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు.
నేను అపోలో బందర్ వద్ద అతనిని మూడవసారి కలిశాను. ఈసారి నేను అతన్ని ఇంటికి ఆహ్వానించాను. అక్కడికి వెళ్ళేటప్పుడు మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. కానీ మేము అక్కడికి చేరుకున్న తర్వాత అది మారిపోయింది. మొదట అతని ముఖం విచారంతో మసకబారింది. కానీ తరువాత అతను దానిని తరిమికొట్టి, తన స్వభావానికి విరుద్ధంగా నన్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇది నాకు అతనిపై మరింత జాలి కలిగించింది: అతను వాస్తవికతను నివారించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. కొన్నిసార్లు, ఈ స్వీయవంచన అతనికి నచ్చినట్లు అనిపించింది.
మేము మాట్లాడుకుంటుండగా, అతను నా టేబుల్ వైపు చూశాడు. అక్కడ ఒక యువతి ఫోటో ఉన్న చెక్క చిత్ర చట్రాన్ని చూశాడు. అతను లేచి దాని దగ్గరకు వెళ్ళాడు. ‘’నేను ఈ చిత్రాన్ని చూస్తే మీకు అభ్యంతరమా?’’ అని అడిగాడు.
‘పరవాలేదు.’
అతను ఆ ఫోటో వైపు పరాకుగా చూసి, తిరిగి వెళ్లి తన కుర్చీలో కూర్చున్నాడు. ‘ఆమె చాలా అందమైన అమ్మాయి. నేను అనుకోవడం ఆమె మీ..’’
‘’కాదు, అది చాలా కాలం క్రితంది. నేను ఆమెను ఇష్టపడ్డాను, ప్రేమించాను కూడా. కానీ, చెప్పాలంటే, ఆమెకు తెలియదు. నేను..నేను..కాదు, సరే, ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేసేసారు. ఆ చిత్రం నా మొదటి ప్రేమకు ఒక జ్ఞాపకం. అది నిజంగా మొదలు కాకముందే చనిపోయింది.’’
“నీ ప్రేమకు గుర్తుగా..” అని పదే పదే అంటూ అతను తన పొడి పెదాలపై నాలుక రాసుకున్నాడు.
“కానీ నీకు వేరే వ్యవహారాలు ఉండి ఉండాలి. అంటే నువ్వు నిజమైన ప్రేమను కూడా అనుభవించి ఉండాలి.”
నేను అతనిలాంటి ప్రేమించలేని వ్యక్తులలో ఒకడిని అని చెప్పబోయాను. కానీ నేను ఆగి, ఎటువంటి కారణం లేకుండా అబద్ధం చెప్పాను ‘’అవును, నా వంతు నాకు ఉంది. నీకు కూడా చాలా మంది ప్రేమికులు ఉండి ఉంటారు.’’
అతను సముద్రపు లోతులా నిశ్శబ్దంగా..పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అతను ఆలోచనలో పడిపోయాడు. అతని నిశ్శబ్దం నన్ను నిరాశపరచడం మొదలైనప్పుడు, నేను ‘’హలో! మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు?’’ అని అన్నాను.
“నేను..నేను..ఏమీ లేదు. నేను ఏదో ఆలోచిస్తున్నాను.’’
‘’నువ్వు ఏమైనా గుర్తు చేసుకుంటున్నావా? కలలోంచి ఏమైనా..? పాత గాయమా..?’’
‘’ఒక గాయం… ఒక పాత గాయం… ఏం కాదు. నాకు ఒకే ఒక్కటి ఉంది. అది చాలా గాఢమైనది.. భయంకరమైనది. అలాంటిది ఒకటి చాలు’’ అని అతను లేచి గదిలో తిరగడానికి నిలబడ్డాడు. కానీ గది చిన్నగా ఉండి కుర్చీలు, టేబుల్స్, మంచంతో నిండి ఉండటంతో, స్థలం లేకపోవడంతో అతను టేబుల్ దగ్గర ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు అతను చిత్రాన్ని చాలా జాగ్రత్తగా చూసి, ‘నీది, నాది.. చాలా పోలికలు ఉన్నాయి -. కానీ ఆమె ముఖం అంత కొంటెగా లేదు. ఆమె కళ్ళు పెద్దవిగా, తెలిసిన వాటిలా వుంటాయి”. అతను నిరాశతో నిట్టూర్చి కుర్చీపై కూర్చున్నాడు. ‘’మరణాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం, ముఖ్యంగా ఇంత చిన్న వయసు వ్యక్తికి అది జరిగినప్పుడు. దేవుడిని వ్యతిరేకించే శక్తి ఏదో ఉండాలి. అసూయపడుతూ.. ఎవరూ సంతోషంగా ఉండకూడదని కోరుకునే శక్తి.’’
‘’పరిస్థతులు నువ్వు చెబుతున్నట్లుగా లేవు..” నేను అతన్ని ప్రోత్సహించాను. “కానీ, నిజం చెప్పాలంటే, నువ్వు ఎప్పుడూ ప్రేమలో పడలేదని అనుకున్నాను.’’
‘’ఎందుకు? ఇప్పుడే నాకు చాలా మంది ప్రేమికులు ఉండేవారని నువ్వు అన్నావు’’ అని అతను నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ‘’నేను ఎప్పుడూ ప్రేమించకపోతే, నేను ఎప్పుడూ ఎందుకు విచారంగా ఉంటాను? నేను ఎప్పుడూ ప్రేమించకపోతే, నేను ఎందుకు ఇలాగే ఉంటాను? నన్ను నేను ఎందుకు జాగ్రత్తగా చూసుకోను? నేను కొవ్వొత్తిలా కరిగిపోతున్నట్లు నాకు ఎందుకు అనిపిస్తుంది?’’
ఇవి శాస్త్రీయమైన ప్రశ్నలు.
నేను ‘’నీకు చాలా మంది ప్రేమికులు ఉన్నారని నేను అబద్ధం చెప్పాను, కానీ నువ్వు కూడా విచారంగా లేవని, నీకు అనారోగ్యం లేదని అబద్ధం చెప్పావు. ఇతరులు ఏమి భావిస్తున్నారో తెలుసుకోవడం అంత సులభం కాదు. నీ విచారానికి ఇంకా చాలా కారణాలు ఉండవచ్చు, కానీ నువ్వు నాకు చెప్పనంత వరకు, నాకు ఎలా తెలుస్తుంది? నిస్సందేహంగా నువ్వు రోజురోజుకూ బలహీనంగా మారుతున్నావు, స్పష్టంగా నువ్వు ఏదో భయంకరమైన అనుభవాన్ని అనుభవించావు, నేను నీ పట్ల జాలిపడుతున్నాను’’ అని అన్నాను.
‘’నా మీద నీకు జాలిగా ఉందా?’ అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తర్వాత అతను ఇలా అన్నాడు, ‘’నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. సానుభూతి నేను ప్రేమించిన స్త్రీని సమాధి నుండి తిరిగి తీసుకురాలేదు – నువ్వు ఎవరినీ ప్రేమించలేదు. నీకు ఎలాంటి గాయపుమచ్చలు లేనందున నువ్వు ఎప్పుడూ ప్రేమించలేదని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇక్కడ చూడు’’ అని తనను తాను చూపిస్తూ అన్నాడు.
‘’నా శరీరంలోని ప్రతి అంగుళం ప్రేమతో దెబ్బతింది. నేనొక శిథిలమైన ఓడను. నేను నీకు ఎలా చెప్పగలను? నీకు అర్థం కానప్పుడు నీకు ఎందుకు చెప్పాలి? ఎవరైనా తన తల్లి చనిపోయిందని చెబితే, అతను ఏమి అనుభూతి చెందాలో నీకు తెలీదు. నేను ఎవరి మీదైనా ప్రేమ చూపిస్తే – అది మీకు పూర్తిగా మామూలుదిగా అనిపిస్తుంది. నా మీద దాని ప్రభావం ఎవరికీ అర్థం కాలేదు. ప్రేమించేది నేనే.. అన్నీ జరిగేది నాకే…’’
అతను మౌనంగా పడిపోయాడు. అతని గొంతులో ఏదో అడ్డం పడి ఉండాలి. ఎందుకంటే అతను పదే పదే దానిని మింగడానికి ప్రయత్నించాడు.
‘’ఆమె మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసిందా? లేక మరేదైనా జరిగిందా?’’
‘’నా వల్ల లాభం పొందిందా..? ఆమె ఎవరి వల్ల లాభం పొందలేకపోయింది. దేవుడి దయవల్ల, దయచేసి అలా అనకండి. ఆమె స్త్రీ కాదు, దేవత. మనం సంతోషంగా ఉండటం చూసి తట్టుకోలేని మరణాన్ని నేను శపిస్తున్నాను! అది ఆమెను శాశ్వతంగా తన రెక్కల కిందకి లాక్కుపోయింది. ఆహ్! ఇది చాలా ఘోరం! మీరు ఎందుకు ఇలా చేశారు…ఇవన్నీ నాకు గుర్తు చేయడానికేనా? వినండి, నేను మీకు ఆ కథ గురించి కొంచెం చెబుతాను. ఆమె ఒక పరపతి గల ధనవంతుడి కూతురు. నేను ఆమెను కలిసే సమయానికి నా ఆస్తులన్నీ వృధా చేసుకున్నాను. నా దగ్గర చిల్లిగవ్వ లేదు. నా స్వస్థలం వదిలి లక్నో వెళ్ళాను. నాకు కారు ఉంది, కాబట్టి నాకు డ్రైవింగ్ ఎలా చేయాలో తెలుసు. అందుకే నేను డ్రైవర్ కావాలని నిర్ణయించుకున్నాను. నా మొదటి ఉద్యోగం డిప్యూటీ సాహిబ్‌తో.. అతని ఏకైక సంతానం ఈ అమ్మాయి- ‘’ చెపుతూ అకస్మాత్తుగా అతను ఆగిపోయాడు. కొంతసేపటికి, అతను తన పరధ్యానం నుండి బయటపడి ‘’నేనేం చెబుతున్నాను?’’ అని అడిగాడు.
‘’నీకు డిప్యూటీ సాహిబ్ ఇంట్లో ఉద్యోగం వచ్చింది.’’
‘’అవును, జహ్రా డిప్యూటీ సాహిబ్ కి ఏకైక సంతానం. నేను ఆమెను ప్రతి ఉదయం తొమ్మిది గంటలకు స్కూల్ కి తీసుకెళ్లేవాడిని. ఆమె పర్దా వేసుకునేది. అయినప్పటికీ మీరు మీ డ్రైవర్ నుండి దానిని ఎక్కువసేపు దాచలేరు. నేను ఆమెను రెండవ రోజే చూశాను. ఆమె అందంగా ఉండటమే కాదు..నా ఉద్దేశ్యంలో ఆమె అందంలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆమె చాలా గంభీరమైన అమ్మాయి. ఆమె జుట్టు మధ్యలో విడిపోవడం ఆమె ముఖానికి ఒక ప్రత్యేకమైన హుందాని ఇచ్చింది. ఆమె..ఆమె..ఆమె ఎలా ఉందో నేను ఎలా చెప్పాలి? ఆమెను వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు.’’
జహ్రా సద్గుణాలను వివరించడానికి చాలా సేపు ప్రయత్నించాడు. ఆమెను సజీవంగా వర్ణించాలనుకున్నాడు, కానీ అతను విఫలమయ్యాడు. అతని మనస్సు ఆలోచనలతో నిండిపోయినట్లు అనిపించింది. అప్పుడప్పుడు అతని ముఖం ఉల్లాసంగా మారుతుంది, కానీ తరువాత అతను విచారంతో మునిగిపోయి మళ్ళీ నిట్టూర్పు విడిచేవాడు. అతను తన కథను చాలా నెమ్మదిగా చెప్పాడు. కానీ దాని బాధాకరమైన పారాయణంలో అతను ఆనందాన్ని పొందుతున్నట్లు వున్నాడు.
అతను జహ్రాతో పూర్తిగా ప్రేమలో పడ్డాడు. ఆమెను చూడటానికి చాలా రోజులు అతను వివిధ వ్యూహాలను రూపొందించడంలో బిజీగా ఉన్నాడు. కానీ అతను తన ప్రేమ గురించి ఏదైనా దీక్షగా ఆలోచించినప్పుడు, అది ఎంత అసాధ్యమో అతను గ్రహించాడు. ఒక డ్రైవర్ తన యజమాని కూతురిని ఎలా ప్రేమించగలడు? ఈ చేదు వాస్తవికత గురించి ఆలోచించినప్పుడు, అతను చాలా బాధపడ్డాడు. కానీ అతను ధైర్యాన్ని కూడగట్టుకుని జహ్రాకు ఒక చీటి రాశాడు.
అతను ఇప్పటికీ దాని పంక్తులను గుర్తుంచుకున్నాడు:
‘జహ్రా,
నేను మీ సేవకుడినని. మీ నాన్న నాకు నెలకు ముప్పై రూపాయలు జీతం ఇస్తారని నాకు బాగా తెలుసు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ఏమి చేయాలి? నేను ఏమి చేయకూడదు? నాకు నీ సలహా కావాలి.’
అతను ఈ చీటీని ఆమె పుస్తకాలలో ఒకదానిలో పెట్టాడు. మరుసటి రోజు ఆమెను పాఠశాలకు తీసుకెళ్తున్నప్పుడు, కారు నడుపుతున్న అతని చేయి వణుకుతోంది. స్టీరింగ్ అతని పట్టు నుండి జారిపోతూనే ఉంది. దేవుడి దయవల్ల అతనికి ఏ ప్రమాదం జరగలేదు! అతనికి ఆ రోజంతా వింతగా అనిపించింది. సాయంత్రం ఆమెను పాఠశాల నుండి తిరిగి తీసుకువెళుతున్నప్పుడు, జహ్రా కారు ఆపమని ఆదేశించింది. అతను కారు ఆపాడు. జహ్రా చాలా తీవ్రంగా మాట్లాడుతూ..”చూడు, నయీం.. మళ్ళీ ఇలా చేయకు. అంటే నువ్వు నా పుస్తకంలో పెట్టిన ఉత్తరం గురించి నా తండ్రికి చెప్పలేదు – కానీ నువ్వు మళ్ళీ ఇలా చేస్తే, నేను చెప్పవలసి వస్తుంది. సరేనా? వెళ్దాం. కారు స్టార్ట్ చేయి.’’
తన ఉద్యోగాన్ని వదిలేసి తన ప్రేమను శాశ్వతంగా మర్చిపోవాలని అతను తనలో తాను అనుకున్నాడు. కానీ అదంతా వ్యర్థమైంది. ఒక నెల గడిచినా తన సందిగ్ధత పరిష్కారం కాలేదు. ఆపై అతను ధైర్యం కూడగట్టుకుని మరొక చీటీ రాసాడు. దానిని అతను మునుపటిలాగే జహ్రా పుస్తకాలలో ఒకదానిలో పెట్టాడు. ఏమి జరుగుతుందో చూద్దామనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తనను ఉద్యోగం నుండి తొలగిస్తారని అతనికి ఖచ్చితంగా తెలుసు. కానీ అతని ఉద్యోగం పోలేదు. అతను జహ్రాను పాఠశాల నుండి ఇంటికి తీసుకెళ్తుండగా, ఆమె మరోసారి అలాంటి ప్రవర్తనకు దూరంగా ఉండమని కోరింది ‘’నీ గౌరవం గురించి నీకు పట్టింపు లేకపోతే, కనీసం నా గురించి ఆలోచించు.” ఆమె ఇలా కఠినంగా మాట్లాడినప్పుడు, నయీం ఆశలన్నీ వదిలేసుకున్నాడు. మళ్ళీ తన ఉద్యోగాన్ని వదిలి శాశ్వతంగా లక్నో విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. నెలాఖరున, అతను తన చిట్టచివరి లేఖ రాయడానికి తన గదిలో కూర్చున్నాడు. తన లాంతరు పేలవమైన వెలుగులో, అతను ఇలా వ్రాశాడు:
‘జహ్రా,
నువ్వు కోరుకున్నట్లు చేయడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ నా భావాలను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. ఇది నా చివరి లేఖ. నేను రేపు సాయంత్రం లక్నో నుండి బయలుదేరుతున్నాను, కాబట్టి నువ్వు నీ తండ్రికి ఏమీ చెప్పనవసరం లేదు. నీ మౌనం నా ఖర్మని నిర్ణయిస్తుంది. కానీ నేను దూరంగా వున్నందున నేను నిన్ను ప్రేమించనని అనుకోకు. నేను ఎక్కడ ఉన్నా, ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తాను. నిన్ను స్కూల్‌కి తీసుకెళ్లి తిరిగి తీసుకురావడం, ప్రయాణం సాఫీగా సాగడానికి నెమ్మదిగా నడిపించడం నాకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. లేకపోతే నా ప్రేమను ఎలా వ్యక్తపరచగలను?’
అతను ఈ ఉత్తరాన్ని జహ్రా పుస్తకాలలో ఒకదానిలో పెట్టాడు. పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఆమె ఏమీ మాట్లాడలేదు, సాయంత్రం కూడా ఆమె ఏమీ మాట్లాడలేదు. అతను ఆశ కోల్పోయి నేరుగా తన గదికి వెళ్ళాడు. అక్కడ అతను తన కొన్ని వస్తువులను సర్దుకుని పక్కన పెట్టాడు. తన దీపం యొక్క బలహీనమైన కాంతిలో అతను మంచం మీద కూర్చుని, జహ్రా పట్ల తనకున్న నిష్ఫలమైన ప్రేమ గురించి ఆలోచిస్తున్నాడు.
అతను దయనీయంగా ఉన్నాడు. తన స్థితిని అర్థం చేసుకున్నాడు. తాను సేవకుడినని, తన యజమాని కూతురిని ప్రేమించే హక్కు తనకు లేదని అతనికి తెలుసు. అయినప్పటికీ ఆమెను ఎందుకు ప్రేమించకూడదో అతనికి అర్థం కాలేదు. అర్ధరాత్రి సమయంలో, అతను ఇంకా దీని గురించి ఆలోచిస్తుండగా, ఎవరో అతని తలుపు తట్టారు. అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అప్పుడు అది తోటమాలి అయి ఉంటాడని అనుకున్నాడు. ఇంట్లో ఎవరో అనారోగ్యానికి గురై ఉండవచ్చు, అతను సహాయం అడగడానికి వస్తున్నాడు. కానీ అతను తలుపు తెరిచినప్పుడు, అది జహ్రా. అవును, జహ్రా- డిసెంబర్ చల్లని రాత్రిలో ఆమె శాలువా లేకుండా అక్కడే నిలబడి ఉంది! అతనికి చెప్పడానికి మాటలు దొరకలేదు. చాలా నిమిషాలు వారు శ్మశాన నిశ్శబ్దంలో అక్కడే నిలబడ్డారు. చివరికి జహ్రా తన పెదవులు తెరిచి, వణుకుతున్న స్వరంతో ‘’నయీం..నేను వచ్చాను. ఇప్పుడు, నీకు ఏమి కావాలో చెప్పు. కానీ నేను నీ గదిలోకి వచ్చే ముందు, కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను’’ అని అంది.
నయీం మౌనంగా ఉండిపోయాడు.
‘’నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?’’ అని అడిగింది.
నయీమ్ తనను ఎవరో కొట్టినట్లు ఉలిక్కిపడ్డాడు. అతను సిగ్గుపడుతూ అన్నాడు. ‘’జహ్రా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం నా ప్రేమను తక్కువ చేస్తుంది కదా..నువ్వు నన్ను ఎలా అడగగలవు? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పలేవా?’’
జహ్రా ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఆమె తన రెండవ ప్రశ్న అడిగింది. ‘’నాన్న ధనవంతుడు. కానీ నేను కాదు. వాళ్ళు నాది అని చెప్పేది నిజంగా నాది కాదు, నాన్నది. నేను ధనవంతురాలిని కాకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తావా?’’
నయీమ్ చాలా భావోద్వేగానికి గురయ్యే వ్యక్తి. ఈ ప్రశ్న కూడా అతన్ని తీవ్రంగా బాధించింది. ‘’జహ్రా, దేవుడి దయవల్ల, దయచేసి చెత్త ప్రేమ నవలల్లో సమాధానాలు దొరికే ప్రశ్నలు నన్ను అడగకండి.’’
జహ్రా తన గదిలోకి ప్రవేశించి, తన మంచం మీద కూర్చుని ‘’నేను నీదానిని. ఎప్పుడూ నీదానిగానే ఉంటాను’’ అని అంది.
జహ్రా తన మాట నిలబెట్టుకుంది. వారు లక్నో నుండి ఢిల్లీకి బయలుదేరి, వివాహం చేసుకుని, ఒక చిన్న ఇల్లు ఏర్పరుచుకున్నారు.
డిప్యూటీ సాహిబ్ వారిని వెతుక్కుంటూ వచ్చిన రోజు, నయీమ్ పనిలో ఉన్నాడు. డిప్యూటీ సాహిబ్ జహ్రాను తీవ్రంగా తిట్టి, ఆమె తన గౌరవాన్ని నాశనం చేసిందని అన్నాడు. ఆమె నయీమ్‌ను విడిచిపెట్టి, జరిగినదంతా మరచిపోవాలని అతను కోరుకున్నాడు. ఇంకా నయీమ్‌కు 2,000 నుండి 3,000 రూపాయలు ఇవ్వడానికి కూడా అతను సిద్ధపడి ఉన్నాడు. కానీ అతని వ్యూహం పని చేయలేదు. జహ్రా తాను నయీమ్‌ను ఎప్పటికీ వదిలి రానని చెప్పింది. ఆమె తన తండ్రితో ‘’నాన్నా, నేను నయీంతో చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు నాకు ఇంతకంటే మంచి భర్తను ఇవ్వలేవు. మేము నీ నుండి ఏమీ కోరుకోవడం లేదు. నువ్వు మాకు ఆశీస్సులు ఇస్తే, మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము.” అంది.
జహ్రా తండ్రికి కోపం వచ్చింది. నయీమ్‌ను జైలులో పెడతానని బెదిరించాడు, కానీ జహ్రా, ‘’నాన్నా, నయీమ్ ఏం నేరం చేశాడు? నిజం తెలుసుకోవాలంటే, మేమిద్దరం నిర్దోషులం. ఏమైనా, మేము ఒకరినొకరు ప్రేమిస్తున్నాము. అతను నా భర్త. ఇది నేరం కాదు, నేను చిన్న పిల్లని కాదు’’ అని అంది.
డిప్యూటీ సాహిబ్ తెలివైనవాడు. తన కుమార్తె నయీమ్‌ను వివాహం చేసుకోవడానికి అంగీకరించినట్లయితే, ఆమె భర్తపై ఎటువంటి ఆరోపణలు చేయలేడని త్వరగా అర్థం చేసుకున్నాడు. దాంతో అతను జహ్రాను వదిలేసుకున్నాడు. కొంతకాలం తర్వాత, డిప్యూటీ సాహిబ్ తనకు తెలిసిన కొంతమంది ద్వారా నయీమ్‌ను బెదిరించడానికి ప్రయత్నించాడు. వాళ్ళకి లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నించాడు. కానీ అవేమీ పని చేయలేదు.
నయీం పెద్దగా డబ్బు సంపాదించకపోయినా, తనకోసం ఎప్పుడూ ఏమీ చేసుకోని జహ్రా ముతక బట్టలు ధరించి ఇంటి పని చేయాల్సి వచ్చినప్పటికీ, ఆ వివాహిత జంట సంతోషంగా ఉన్నారు. నయీం ప్రేమ ప్రతిరోజూ కొత్తగా కనపడే నవీన ప్రపంచంలోకి ప్రవేశించినందుకు జహ్రా సంతోషంగా ఉంది. ఆమె నిజంగా చాలా సంతోషంగా ఉంది, నయీం కూడా సంతోషంగా ఉన్నాడు. కానీ ఒక రోజు, దేవుని చిత్తం ప్రకారం, జహ్రాకు తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. నయీం ఏదైనా చేయక ముందే ఆమె చనిపోయింది. అలా నయీం ప్రపంచం శాశ్వతంగా చీకటిలో మునిగిపోయింది.
కథను చెప్పడానికి అతనికి దాదాపు నాలుగు గంటలు పట్టింది. ఎందుకంటే అతను దానిని నెమ్మదిగా, చాలా ఆస్వాదిస్తూ చెప్పాడు. అతను పూర్తి చేసేసరికి, అతని ముఖంలో ఒక పాలిపోయిన ఛాయ పైకి లేచింది. అతని ముఖం ఎవరో రక్తం ఎక్కించినట్లుగా ప్రకాశించింది. అయినప్పటికీ అతని కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. అతని గొంతు ఎండిపోయింది.
అతను తన కథ చెప్పడం ముగించిన తర్వాత, ఎక్కడికో వెళ్ళాలన్నట్లుగా, హడావిడిగా లేచాడు. “ఈ కథ నీకు చెప్పడం నిజంగా నేను చేసిన తప్పు.. అది నిజంగా నా తప్పు. జహ్రా జ్ఞాపకాలు నావి తప్ప మరెవరికీ కావు..కానీ..కానీ ..’’ అతను కన్నీళ్లను తిప్పికొడుతూ అతని గొంతు వణికిపోయింది ‘’నేను బతికే ఉన్నాను..కానీ ఆమె… ఆమె…’’ అతను కొనసాగించలేకపోయాడు. తొందరగా నా చేతిని విదిలించి వెళ్ళిపోయాడు.
నేను నయీమ్ ని మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. అతన్ని వెతకడానికి నేను చాలాసార్లు అపోలో బందర్ కి వెళ్ళాను. కానీ ఎప్పుడూ కలవలేక పోయాను. ఆరు లేదా ఏడు నెలల తర్వాత, నాకు అతని నుండి ఒక ఉత్తరం వచ్చింది, దానిని క్రింద నకలు చేసాను.
‘సాహిబ్!
నేను మీ ఇంట్లో చెప్పిన ప్రేమకథ మీకు గుర్తుండి వుంటుంది. అది పూర్తిగా అబద్ధం. అవన్నీ అబద్ధాలు. జహ్రా లేడు, నయీమ్ లేడు. నేను నిజమే, కానీ నేను జహ్రాను ప్రేమించిన నయీమ్‌ను కాదు. మీరు ఒకసారి అన్నారు ‘ప్రేమించలేని వ్యక్తులు ఉన్నారని’. ప్రేమించడానికి ప్రయత్నిస్తూ తన యవ్వనమంతా వృధా చేసుకున్న వారిలో నేనూ ఒకడిని. జహ్రా మరణం లాగే, జహ్రా పట్ల నయీమ్ ప్రేమను నన్ను నేను రంజింపజేయడానికి కల్పించుకున్నాను. నా కథలో నేను ఆమెను ఎందుకు చంపానో నాకు ఇంకా అర్థం కాలేదు. అయినా నేను తాకిన ప్రతిదీ ఎలా శాపగ్రస్తంగా మారుతుందో, అలాగే ఇది కూడా అందుకే కావొచ్చు.
నా కథను మీరు నమ్మారో లేదో నాకు తెలియదు. కానీ నేను మీకు ఒక వింత విషయం చెబుతాను. నేను కథను చెప్పినప్పుడు – అది పూర్తిగా నిజమే అనుకున్నాను! నూటికి నూరు శాతం నిజం! నేను జహ్రాను ప్రేమించానని, ఆమె నిజంగా చనిపోయిందని నాకు అనిపించింది. రోజులు గడిచేకొద్దీ, ఆ కథ మరింత నిజమైనదిగా నాకు అనిపించింది. జహ్రా నవ్వు నా చెవుల్లో ప్రతిధ్వనించడం ప్రారంభించిందని వింటే మీరు మరింత ఆశ్చర్యపోతారు. ఆమె వెచ్చని శ్వాసను నేను అనుభవించడం ప్రారంభించాను. కథలోని ప్రతి భాగం ప్రాణం పోసుకుంది, అందువలన నేను.. నేను నా సమాధిని నేనే తవ్వుకున్నాను.
జహ్రా ఊహాత్మకమైనదే అయినప్పటికీ, ఆమె నాకంటే నిజమైనది. ఆమె చనిపోయింది, కాబట్టి నేను కూడా చనిపోతాను. మీకు నా మరణం తర్వాత ఈ ఉత్తరం అందుతుంది. వీడ్కోలు. నేను జహ్రాను ఎక్కడో కలుస్తానని ఖచ్చితంగా అనుకుంటున్నాను, కానీ ఎక్కడ?
మీరు రచయిత కాబట్టి ఈ ఉత్తరం మీకు రాసాను. దీని నుండి మీరు కథ రాయగలిగితే, మీకు ఏడు లేదా ఎనిమిది రూపాయలు వస్తాయి. (ఒక కథకు ఏడు నుండి పది రూపాయలు వస్తాయని మీరు ఒకసారి నాకు చెప్పారు.) ఇది మీకు నా బహుమతి.
వీడ్కోలు…
మీ
‘నయీం’
నయీమ్ జహ్రాను సృష్టించి చనిపోయాడు. నేను ఈ కథను రాసాను. బతుకుతున్నాను. ఇది నా జీవితానికి వరం.
![]()
రచయిత పరిచయం :
సాదత్ హసన్ మంటో (1912–1955) ఒక ప్రముఖ ఉర్దూ రచయిత, కథకుడు, నాటక రచయిత. భారత ఉపఖండంలోని సామాజిక వాస్తవాలను, మానవ స్వభావాన్ని, ద్వంద్వ ప్రవృత్తులను తన కథల్లో నిర్భయంగా చిత్రించినందుకు ఆయన ప్రసిద్ధి చెందాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన మంటో, భారత దేశ విభజన సమయంలోని అనుభవాలను, సమాజంలోని వివక్షలను, మతపరమైన ఘర్షణలను తన రచనల్లో విశ్లేషించాడు.
ఆయన రచనలు, ముఖ్యంగా “టోబా టెక్ సింగ్”, “ఖోల్ దో”, “ఠండా గోష్ట్” వంటి కథలు, విభజన సమయంలో భయానక పరిణామాలను, మానవత్వం యొక్క లోతైన అంశాలను వెల్లడి చేస్తాయి. మంటో రచనలు తరచూ వివాదాస్పదమైనప్పటికీ, అవి సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. సమాజంలోని నీచమైన వాస్తవాలను బహిర్గతం చేసే ఆయన శైలి, ఆయనను ఒక గొప్ప వాస్తవిక రచయితగా నిలిపింది.
మంటో బొంబాయిలో సినిమా రంగంలో కూడా కొంతకాలం పనిచేశాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయి. 1955లో, 42 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశాడు. కానీ ఆయన సాహిత్యం ఇప్పటికీ ఉర్దూ సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి.
రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.




Discussion about this post