కన్నడ మూలం: కావ్య కడమె
అనువాదం: రంగనాథ రామచంద్రరావు
మాకో మెట్ల మీద దొంగ అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు ఆ చప్పుడును నిర్లక్ష్యం చేయడానికి నాకు సాధ్యంకాదు. చప్పుడు కాకూడదని వాడు తీసుకునే ముందు జాగ్రత్తకీనే ఒక విధమైన నియమిత చప్పుడు ఉంది. మొదట మెట్ల మీదనే. షూ విప్పి వాటిని తన ఎడమ చేతిలో పట్టుకున్నాడు. వాడి కుడి చేయి మెట్ల రైలింగ్‌ను ఆసరా కోసం పట్టుకుంటూ మెల్లగా పైకి వస్తోంది. ఎండకో, వర్షానికో, మంచుకో, చలికో అరిగిపోయి అక్కడక్కడ పగుళ్లు వచ్చిన మొరటు మెట్ల మీద నడిచే మాకో సాక్స్ ద్స్ ద్స్ … అనే తీక్షణమైన చప్పుడు ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంలో సుస్పష్టంగా వినిపిస్తుంది. వేగంగా ముందుకు దూసుకొచ్చే రైలు దగ్గర్లోని పట్టాలకంతా కంపనాన్ని దయపాలిస్తున్నట్టు మాకో అడుగులు ఆ పధ్నాలుగు మెట్ల నిర్మాణానికి తాత్కాలికంగా ప్రాణం పోస్తున్నాయి.
తన దగ్గరున్న తాళం చెవితో నెమ్మదిగా తాళం తీసేటప్పుడు నీటిలో నాణెం పడ్డట్టు చిన్నగా శబ్దం అవుతుంది. లోపలికి వచ్చి తలుపు పక్కనే ఉన్న నా గది బయట అరక్షణం నిలబడతాడు. నేను బయటికొచ్చి అడగగలిగే ప్రశ్నలకు తగిన జవాబులను అప్పుడు వాడి మనసు రూపొందిస్తుండొచ్చు. నేను లేవకుండా ఉండడం చూసి వాడికి సంతృప్తి కలిగింది. ఆ తర్వాతి ఐదారు అడుగులలో ఏర్పడిన ఒక రకమైన తేలికతనం వల్ల నేను దాన్ని చెప్పగలను. మళ్లీ మేల్కొన్నట్టు సావకాశంగా తన గది వైపు కదిలిపోయాడు. ఎందుకో తన గది గుమ్మంలో నిలబడ్డాడు కదా. బహుశా షూను తలుపు పక్కన ఉన్న షూ ర్యాక్‌లో వదలకుండా హడావుడిగా చేతిలోనే పట్టుకొని వెళ్లివుండొచ్చు. మళ్లీ తిరిగి తలుపుల వరకు వచ్చి రిస్క్ ఎందుకు తీసుకోవాలని షూను తన గదిలోకి తీసుకొని వెళ్లివుండొచ్చు. ఉదయమే లేచి చూసినప్పుడు ర్యాక్ లో వాడి షూ లేకపోవడం చూసి నాకు కలిగిన ఆ అనుమానాన్ని పరిష్కరించుకున్నాను.
అలా నేనే మాకో అర్థరాత్రి తిరుగుళ్లకు ప్రాధాన్యం ఇవ్వకపోయినప్పటికీ కింది ఇంటి మిసెస్ అండర్‌సన్ తప్పకుండా ఫిర్యాదు చేస్తారు. ‘‘నిన్న మాకో ఆలస్యంగా ఇంటికి వచ్చాడా? అలా అపరాత్రి వేళ చప్పుడైతే మా బాసికి నిద్ర సరిగ్గా పట్టదు. ఇప్పటికీ చూడండి, బ్రేక్ ఫాస్ట్ కూడా చేయకుండా ఎలా కళ్ళు ఎర్రబరుచుకొని కూర్చున్నాడో?’’
‘‘ఎందుకండీ బాస్?’’ అని నేను బాసి మెడలో చేయి కదిలించి, నుదుటికి నుదురు తాకించాను. వాడు ఎప్పటిలాగే సంతోషాన్ని ప్రకటించక తన పేరుకు తగినట్టు గంభీరంగా కూర్చొని పొట్టనుంచే గ్రా… అని శబ్దం చేసినప్పుడు సంకోచించాను. ‘‘నిన్న మాకోకు అదేదో అసైన్‌మెంట్ డెడ్‌లైన్ ఉండిందట. స్నేహితుడి ఇంట్లో ఇద్దరు డిస్కస్ చేసి పరిష్కరిస్తామని చెప్పాడు. అందుకే కాస్త ఆలస్యం అయ్యిందేమో?’’
ఎదురుగా ఉన్నవారి కళ్ళల్లో కళ్ళు పెట్టి అబద్ధం చెప్పడానికి తనకు సాధ్యం కాదు. అందుకే మాట్లాడేటప్పుడు బాసి ముఖం చూశాను. వాడికీ, మిసెస్ అండర్‌సన్‌గారికీ – ఇద్దరికీ నా గుట్టు తెలిసిందేమో అని కలవరం కలిగింది.
‘‘కాస్త మీరు పట్టించుకోండి. టీనేజ్ పిల్లలు ఇలాగే ఉంటారు. వారికి మధ్య రాత్రే హోమ్ వర్క్ ఉంటుంది. నేనూ ఇద్దరు పిల్లలను పెంచాను కదా. పేరెంట్స్ ఇంట్లో ఉన్నంత వరకు ఇదంతా జరగదని మీరు స్ట్రిక్ట్గా చెప్పాలి. ఆ తర్వాత ఆ ఊ అనే లోపల…’’ మిసెస్ అండర్‌సన్ వాక్యం ముగిసే లోపల ఆమె ఫోన్ మోగింది. ఆ కాల్ చేసిన వారికి మనసులోనే థాంక్స్ చెప్పుకుని, మెట్లు ఎక్కసాగాను. తన కుక్క కోసమే యూట్యూబ్‌లో రకరకాల రెసిపిలను చూసి తయారుచేసేటంత విరామం ఉన్న మిసెస్ అండర్‌సన్, మాటలను మొదలుపెడితే ఒక గంట కన్నా తక్కువ సమయంలో వదలదు.
శరదృతువు నెలల్లోని ఈ చల్లటి గాలి అంటే నాకు ఇష్టం. ఇప్పుడిప్పుడే వేసవి ముగిసి, ఇంక చలికాలం మొదలయ్యే వ్యవధిలో ఇలా వచ్చి అలా ముగిసిపోయే రుతువు ఇది. ఒక్కింత కూడా గాలి వీచకుండా ఉన్నప్పటికీ రిఫ్రిజిరేటర్లలో ఉన్నట్టుగా తేమ గాలిలో కలిసిపోయి ఉంటుంది. మా మెట్లు గత సంవత్సరం కన్నా క్షీణించి ఉండటాన్ని గమనించి ఈసారైనా అసోసియేషన్‌వారు వార్నిష్ కొట్టిస్తే బాగుండేదని అనుకున్నాను. నేనున్న టౌన్ హౌస్ సొంత ఇల్లే అయినప్పటికీ బయటి ప్రాంగణపు నిర్వహణకు నెలకు నాలుగు వందల డాలర్లు ఇస్తే చాలు. ఈ సంఘం వారే చూసుకుంటారు. దానికంతా వారి కోసం ఎందుకు ఎదురుచూడటం, మనమే వార్నిష్ తెచ్చి పాలిష్ చేయొచ్చు కదా అని మాకో ఇప్పటికే నాలుగు సార్లు చెప్పాడు. అలా చేస్తే వారికి ఇచ్చే డబ్బులు వృధా అవుతుందని నా బాధ. వచ్చినన్ని రోజులు రానీ, వింటర్ ముగిసి స్ప్రింగ్ మొదలైనప్పటికీ వారు రాకపోతే సంఘం ఆఫీసుకు వెళ్లి ఒకసారి దబాయించి వస్తానని చెప్పాను. మాకో కనుగుడ్లను కనుబొమ్మల వరకు ఎగరేసి, దానికి తగినట్టు భుజాలు ఎగరేసి, పక్కా అమెరికన్ భాషశైలిలో ‘వాటెవర్’ అని చెప్పి బయటికి నడిచాడు.
చాయ్ పెట్టేటప్పుడు మాకో ఇంకా లేవకపోవడం గమనించాను. నాకు ఉదయం లేచిన వెంటనే ఖాళీ పొట్టలో కడక్ చాయ్ కావాలి. నేను పుట్టి పెరిగిన హుబ్లీ నుంచి వచ్చి అలవాటు ఇది. చాయ్ ఉడికి పొంగేటప్పుడు కిచెన్ అంతటా కమ్మటి పరిమళం వ్యాపిస్తుంది. అప్పుడు గ్యాస్‌ను చిన్నగా తగ్గించి, ఆ ఘుమఘుమలను ఒకటి రెండు నిమిషాలు ఆఘ్రాణించవచ్చు. అంటే పొట్ట కట్టులన్నీ సడిలమై నేను బాత్రూమ్‌కు వెళ్లొచ్చు. నా భర్త సుహాస్‌తో అతని కాఫీ ప్రియుల బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు ఈ విషయానికే నాకు సంకోచం కలిగింది, ఉండనీలే.
టాయ్‌లెట్‌కు వెళ్లొచ్చి టీ వాసన పీలుస్తూ నిలుచున్నప్పుడు మాకో లేచొచ్చాడు. దోసె వేయడానికి పెనం పెడుతూ, ‘‘స్కూలు బస్సు వచ్చే సమయమైంది కదా మాకో’’ అన్నాను. ‘‘ఐ నో, మామ్’’ అన్నవాడు ఆ తర్వాతి ఎనిమిది నిమిషాల్లో సుడిగాలిలా బాత్రూమ్‌కి నడిచి, షవర్ ముగించి, రెండు బ్రెడ్ ముక్కలను రోస్ట్ చేసుకుని ఒక పక్కన జామ్ మరోపక్కన పీనట్ బటర్ పూసుకొని ప్లాస్టిక్ జిప్పర్‌లో పెడుతూ, బ్యాగు తగిలించుకుని షూ వేసుకోసాగాడు. ‘‘బ్రేక్‌ఫాస్ట్ను స్కిప్ చేయొద్దు చిన్నా’’ అన్నాను. మొదటి దోసె తీయటానికి ముందే దఢాలున తలుపేసి వాడు వెళ్లిపోయాడు.
‘‘టీనేజ్లో ఇవన్నీ మామూలే కదా? ఐ యామ్ ష్యూర్ యూ హావ్ డన్ ఇట్’’ అని మనోహరంగా తుంటరి నవ్వు నవ్వుతూ అంటాడు టోరి. నా స్నేహితుడు. స్నేహితుడు అంటే అంతకన్నా కాస్త ఎక్కువే. నేను పనిచేసే షాపు పక్కనున్న హ•టల్ మేనేజర్ అతను. మేము సేల్స్ సిబ్బందులమంతా కొత్త సంవత్సరపు సెలబ్రేషన్ కోసం ఆ హ•టల్‌కు వెళ్ళినప్పుడు అతని పరిచయమైంది. ఆ పరిచయం మొదట కంటి చూపుతో తాగడం, ఇంకెక్కడో దొరికినప్పుడు చిరునవ్వులో పలకరించటం, మొత్తానికి కాఫీ తాగేటప్పుడు అదుపుతప్పి చేజారి, అది ముందుముందుకు వచ్చి ఇప్పుడు నలభైయవ అంచులో ఉన్న మేమిద్దరమూ అప్పుడప్పుడు అతని అపార్ట్‌మెంట్‌లోని కిటికీలకు వేసిన కర్టెన్ల అర వెలుతురులో పిచ్చిపట్టినట్టు ముద్దాడే వరకు వచ్చింది ఆగింది.
నేను టోరీని ఎన్నడూ ఇంటికి పిలవలేదు. అలా చేసే దశకు వెళ్ళినప్పుడల్లా నా లోపలి నుంచి, చాలా లోపలి నుంచి వచ్చిన ఏదో ఒక భయం నన్ను ఆపింది. కాపలా కాయడానికి చుట్టూ ఎవరూ లేకపోయినప్పటికీ వేధించే భయమది. అయితే మనసుకు విధించుకున్న కట్టుబాట్లను దేహానికి ఎలా విధించడం? తెలిసినవారే చెప్పాలి
టోరీ ఇలాంటి ఏ భారాలనూ మోయకపోవటం వల్ల మరింత ఆకర్షణీయంగా ఉన్నాడు. అతని ఎత్తయిన విగ్రహం, ఇంగ్లీషులోని విశిష్టమైన ఉచ్చారణకు, నాకై నేనే చెప్పకుండానే నా ఏ వ్యక్తిగత విషయాలలోనూ తలదూర్చని గుణానికి ఓడిపోయాను. అతనికీ నా గురించి అలాంటి అభిప్రాయమే ఉండొచ్చు. నా దగ్గర కన్నడలో మాట్లాడి ‘‘మీ భాష సంగీతంలా ఉంది’’ అంటాడు.
అతని మంచం పక్కన నైట్‌స్టాండ్ మీద ఒక స్త్రీ, ఒకబిడ్డను ఎత్తుకొని నిలుచున్న ఫ్రేమ్ వేసిన ఫోటో ఉంది.
మాకో కూడా చిన్నప్పుడు అలాంటి రంగు చొక్కాను తొడుక్కునేవాడుకదా అని గమనించి కాస్త బెదిరాను.
![]()
మాకో పూర్తి పేరు మల్లికార్జున అన్నది నేను మరిచిపోయేటంత పాత విషయం. పాస్‌పోర్ట్, మార్కస్కార్డ్ లాంటి రికార్డ్లలో ఆ దీర్ఘమైన పేరును చూసినప్పుడు ఆ అగంతకుడి నామధేయానికీ మాకో వ్యక్తిత్వానికీ సంబంధమే లేదనిపించింది. మా మామ చనిపోయిన సంవత్సరం లోపల వాడు పుట్టడం వల్ల అత్తగారి మొండితనంతో తాత పేరునే మనుమడికి పెట్టాలని పట్టుబట్టింది. నాకు ఆ పేరు ఏమాత్రం ఇష్టం లేదు. నాకు వాడిని ‘రోహన్’ అని పిలవాలని కోరిక ఉండేది. ఆ తర్వాత అత్తగారు అదొక పేరు కారణంగా వెనుకటి ఏవేవో రుణాలను గుర్తుచేసుకున్నప్పుడు సుహాస్, ‘‘ఉండనీలే, తండ్రి పేరే పెడదాం. మేమిప్పుడు ఏమని పెట్టినా, వాడు పద్దెనిమిది దాటిన తర్వాత రిక్ డిక్‌హెడ్ అని పేరు మార్చుకోడని ఏమిటి గ్యారెంటీ?’’ అని విషయాన్ని తేలికపరచడానికి చూశాడు.
ఇక సంవత్సరం లోపలే మాకోకు పద్దెనిమిది నిండుతాయి. ఆ జోకు వేసి నన్ను దగ్గరికి లాక్కొని ముద్దుపెట్టిన సుహాస్ ఇప్పుడు ఎక్కడున్నాడు. టెక్సాస్‌లోనో, ఓక్లహామాలోనో ఉండొచ్చు. అలా మేము కౌగిలించుకొని, ముద్దుపెట్టి, స్నేహం చూపి సంవత్సరాలే గడిచిపోయాయి. గత వారం ఫోన్ చేసినప్పుడు ఈ వారం చివరి ఐదు రోజులు ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. చివరి రోజు ఫోన్ చేసి అక్కడి నుంచే ఇంకెక్కడో డెలివరీ ఉందని వచ్చే నెల వస్తానని చెప్పినా చెబుతాడు. అతను రాకపోయినా ఏమి తేడా లేదన్నది నిజం. అయితే ఈ సారి సుహాస్ వస్తే మాకో రాత్రి తిరగడం గురించి, అతనికి ఇచ్చిన స్వాతంత్రాల గురించి మేమిద్దరం మాట్లాడుకుని ఒక సమ్మతితో కూడిన నిర్ణయానికి రావచ్చేమో అనిపించింది.
సుహాస్ లాంగ్ హౌల్ ట్రక్కులకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్లకు ఒకసారి కంపెనీలను మారుస్తూనే ఉండటం వల్ల అతను ఇప్పుడు ఏ కంపెనీ ట్రక్కులను నడుపుతున్నాడో వెంటనే చెప్పడానికి నాకు సాధ్యం కాదు. అతను రోడ్డు నియమాలను
ఒక్కసారి కూడా ఉల్లంఘించకుండా, శుభ్రంగా పెట్టుకున్న ట్రాక్ రికార్డు పట్ల, ఆ పరిణామంగా దొరికే మంచి జీతం పట్ల అతనికి అభిమానం ఉంది. ఈ పనిలో ఒకే సమస్య ఏమిటంటే అతను నెలలో ఇరవై ఐదు రోజులు ట్రక్‌లోనే ఊరూరు తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. భారీ ఆకారంలో ఉన్న ఈ ట్రక్కులోనే, బెడ్, టాయిలెట్, షవర్, కిచెను అన్ని ఉన్నప్పటికీ, ఇక్కడ నాకు దోసె చట్నీనో, అతనికి ఇష్టమైన అన్నం-బూడిద గుమ్మడి కాయల పులుసునో, చేపల చారో తినేటప్పుడు గొంతుకు ఏదో అడ్డుపడుతున్నట్టుగా అవుతుంది.
అయితే అతను ఈ పని చేయకపోతే న్యూ జెర్సీ లాంటి చోట మాకు సంసారం నడపడం అసాధ్యం. నేను దగ్గర్లోని ఓ మాల్లో మేసిస్ అనే బట్టల షాపులో సేల్స్లో పనిచేస్తున్నప్పటికీ నాకు సుహాస్ జీవితంలో పావు వంతు జీతం కూడా రాదు. భారత్ నుంచి అమెరికాకు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లా మా ఇద్దరికీ డిగ్రీల బలం లేదు. ఇక్కడికి రావడానికి ముందు, ఇరవై ఏళ్ల కిందట సుహాస్ అమెరికా జీవన విధానం గురించి భ్రమలను నా నుంచి వీలైనంత దూరంలోనే పెట్టడానికి శ్రమించాడు.
హుబ్లీ కాడసిద్దేశ్వర కాలేజీలో నేను బి.ఎ. ఫైనల్ చదువుతుండగా కలిసొచ్చిన సంబంధం సుహాస్ వాళ్లది. అమెరికాలో అదేమో లాటరీ గెలిచాడట. అందుకోసమే అతన్ని అక్కడికే పిలిపించుకుంటారని మా బంధువులందరిలో వార్త వ్యాపించింది. ఈ విషయం వ్యాపించగానే బి.కాం. ఫెయిల్ అయి ఐదు సంవత్సరాల నుంచి సొంత టాక్స్ బిజినెస్ మొదలుపెట్టిన సుహాస్ ముందర అమ్మాయిల జాతకాలు పటపటమని రాలటం మొదలయ్యాయి. ఇప్పటికే అనేక వివాహాలలో సుహాస్‌ను చూసినందువల్ల ఈ విషయం నాకు అతన్ని ప్రత్యేకంగా గమనించేలా చేసింది. స్నేహితురాలి ఇంటికి వెళ్లే నెపంతో ఒకటి రెండుసార్లు అతని ఇంటి ముందు చక్కటి డ్రెస్ వేసుకొని నేను తిరిగివుండొచ్చు. అతను రోజూ తిరిగే దారిలో వెతికి అతనితో చూపులు కలిపి, ముంగురులను సవరిస్తూ ముసి ముసి నవ్వులు తేల్చివుండవచ్చు. అంతే. అంతే. హుబ్లీ లాంటి చిన్న పట్టణంలో ఇలాంటి రహస్య వ్యవహారాలను అందరి కళ్ళు కప్పికూడా నడపవచ్చు.
మా స్నేహం మొదలైన కొత్తలో సుహాస్‌కు అమెరికాకు రావడం పట్ల అంత ఉత్సాహం ఉన్నట్టులేదు. ‘‘కాలిఫోర్నియాలో ఉండే మా శంకర్ మామ అదేదో డైవర్సిటీ గ్రీన్ కార్డ్ కోటాలో నా పేరు నమోదు చేశారట. అన్ని వైపుల నుంచీ వలసదారులు రావచ్చని అమెరికా ప్రభుత్వం నడిపే లాటరీ అది. ఇండియాలో పుట్టినవాళ్లు ఈ లాటరీకి ఎలిజిబుల్ కారు. ఎందుకంటే ఇప్పటికే సాఫ్ట్ వేర్, మెడికల్ అని అమెరికాకు ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరమూ జనం వెళుతుంటారు కదా. నేను దుబాయ్‌లో పుట్టడం వల్ల నా పేరు సెలెక్ట్ అయింది. నా స్నేహితులంతా ఇలాంటి లక్ ఎవరికీ దొరకదు అని చెబుతారు. అయితే ఇక్కడ ఉండే అన్నిటినీ వదిలి అక్కడికి వెళ్లి ఏమి చేయాలి అనే ఆలోచన పట్టుకుంది’’ అనే చెప్పాడు.
సుహాస్ తండ్రి తల్లి దుబాయ్‌లో చాలా సంవత్సరాలు ఉండి రావడం వల్ల మా సముదాయంలోని వాళ్ళందరికీ తెలుసు. వారి తండ్రి పేరును చెప్పగానే, ‘‘అదే ఆ దుబాయ్ మల్లికార్జున్’’ అనే అందరూ మాట్లాడుకునేవారు. సుహాస్ అకస్మాత్తుగా దుబాయ్‌లో పుట్టడం వల్ల మా ఇద్దరి జీవితాలు వేరే మలుపుదారి పట్టేలా ఉంది. అతని మాటలు తీరులో ఈ జంప్ చేపట్టడానికి ఒక చిన్న ప్రేరణ అవసరమని అర్థం చేసుకున్నాను.
బావి తవ్వటానికి పూనుకున్నవారికి నేల తవ్వటానికి ముందే జలమూలం ఎక్కడుందో అంచనా ఉంటుంది. ప్రేలుడు మందును సన్నటి సూదితోనే ఇచ్చినప్పటికీ అది మొత్తం దేహం దాపించేలా ఎక్కడ తాకాలో, ఎక్కడ మీటాలో అనడం పట్ల నాకు ఒక స్థూలమైన ఊహ ఉంది. మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు మాట్లాడటానికి పిలిచాను. అతని ఇంటికీ ఒకటి రెండు సార్లు వెళ్లిండొచ్చు. ఈ మొత్తం పక్రియ ముగిసినప్పుడు సుహాస్‌కు నేను మాట్లాడిన మాటలన్నీ మసకగా అమెరికాకు వెళ్లాలని నిర్ణయం తనలోనుంచే ఏర్పడిందనే నమ్మకం జాగృతమై ఉండటం మా ఇద్దరికీ వేరు వేరు కారణాలకు ముఖ్యమైంది.
ఇక్కడికి వచ్చిన రెండు సంవత్సరాల్లో మాకో పుట్టాడు. ఆ రోజు సుహాస్ ఈ దేశానికి రావడానికి అస్సలు ఇష్టం లేదని స్పష్టంగా చెప్పివుంటే నేను అతనితో సంబంధం కొనసాగించేదాన్నా అనే ప్రశ్నను వేసుకునే ధైర్యం నేనింకా చేయలేదు.
![]()
మాకో అర్ధరాత్రి బయటకు వెళ్లటం గురించి నన్ను దిగులుపరిచిన ఇంకొక సంగతి ఏమిటంటే ఈ మధ్యన అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంలో ఒక దొంగ అడుగులకు బదులుగా ఇద్దరి దొంగ అడుగులను నేను గమనించడం. మెట్లు ఎక్కేటప్పుడు, ఇంట్లో తిరిగేటప్పుడు, బాత్రూమ్‌కు వెళ్లి వచ్చేటప్పుడు మాకో పల్చటి చెప్పులను నేను గమనించగలను. తల్లి లేచిందనే హెచ్చరిక ఉన్నా లేవలేదనే ఆత్మవిశ్వాసంతో వాడు నడుస్తాడు. అయితే ఆ ఇంకొక జత పాదాలు ఎవరివి? వారికి ఇంటి ఈ గుట్టు పట్ల పరిచయం లేదు. అతి జాగ్రత్తతో పెట్టిన అడుగులకు ఒక విధమైన మృదుత్వం ఉంటుంది. తమ గుర్తులను ఇక్కడెక్కడ వదిలి వెళ్లకూడదనే జాగ్రత్త ఉంటుంది.
మా షూ ర్యాక్ ఎడమవైపు మూలలో కాలుపెడితే క్రా… అనే కర్కశ శబ్దం వెలువడుతుంది. మొత్తం ఇల్లు చెక్కపలకలతోనే నిర్మించడం వల్ల ఇలాంటి ఐదారు స్థలాలు మా ఇంట్లో ఉన్నాయి. రాత్రిళ్లు మాకో పొరపాటున కూడా ఎప్పుడూ ఈ స్థలాలలో కాలు పెట్టలేదు. అయితే ఆ పిల్లెవరో మొదటి రోజే అలాంటి రెండు మూడు చోట్ల తిరగడమూ, మాకో పరుగున వచ్చి ఆమెను ఆపటం జరుగుతూనే ఉంది.
ఆమె అమ్మాయే అనడం గురించీ నాకు ఒక అంచనా ఉంది. తన ఇంట్లో కాలు పెట్టిన వారిని కొండచిలువ వెంటనే గుర్తించేలా ఈ ఇంట్లో ఇంకొక స్త్రీ తిరిగితే అది ఎలాగో నా అంతరంగానికి తెలిసిపోతుంది. అలా నడవడమంతా అరుదుగా ఉండటానికి ఇది సాధ్యమై ఉండొచ్చు.
‘‘మాకో, నిన్న రాత్రి ఇంటికి ఎవరైనా వచ్చారా?’’
అతను కంగారు పడటం స్పష్టంగా కనిపించింది.
‘‘వాడే నా స్నేహితుడు ఆండ్రూ. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఒక అసైన్‌మెంట్ డెడ్‌లైన్ ఉంది. దానికోసం డిస్కస్ చేయడానికి వచ్చాడు’’
‘‘నీ ఫ్రెండ్ ఆండ్రూ ఈ క్లిప్ వేసుకుంటాడా? ఉదయం బాత్రూంలో దొరికింది’’
అది నాదే పాత క్లిప్పు. మాకో నుంచి నిజం రాబట్టడానికి దాని బీరువానించి తీసుకొని వచ్చాను.
‘‘నా స్నేహితుడితోపాటు అతని చెల్లెలు వచ్చింది. ఆమెది కావచ్చు’’
‘‘ఆండ్రు అర్ధరాత్రి తన చెల్లెలితో తిరుగుతుంటాడా?’’
మాకో ముఖంలో అసహనం ఏర్పడసాగింది.
‘‘వాట్ డు యూ వాంట్ టు నో మామ్?’’
అప్పటి వరకు తెచ్చిపెట్టుకున్న నా ముఖం మీది సహనపు ముసుగు తొలగిపోయింది. నాది కానీ స్వరంతో గట్టిగా అరవసాగాను.
‘‘నువ్వు ఇలా చేయకూడదు మాకో. అమ్మాయిలను ఇలా ఇంటికి తీసుకొని రాకూడదు. రేపు ఒకటి పోయి మరొకటి జరిగితే నేరుగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. నువ్వే కాదు, నేను, డ్యాడి కూడా. వచ్చే సంవత్సరం నువ్వు కాలేజీకి వెళ్లిన తర్వాత ఏమి కావాలన్నా చేసుకో. అయితే ఇక్కడ, నా ఇంటిలో ఉన్నంతవరకు నువ్వు ఈ ఇంటి నియమాలను ఫాలో కావాల్సిందే. అర్థమైందా?’’
మాకో కూడా వాదానికి సిద్ధంగానే కూర్చున్నాడు.
‘‘నువ్వు ఓవర్ రియాక్ట్ చేస్తున్నావు మామ్. పెమా అనే అమ్మాయి నిన్న రాత్రి రావడం నిజం. అయితే మేము హోమ్‌వర్క్ చేస్తున్నాం. అంతే.’’
నాకు మాటలను కొనసాగించే కోరిక వుండలేదు.
‘‘సరే హ•మ్‌వర్క్ చేయడానికి సాయంత్రం నేను ఉన్నప్పుడే ఆమెను రమ్మను. అర్ధరాత్రి రావడం వద్దు’’
‘జైలు’, ‘ఏమి కావాలన్నా చేసుకో’, ‘నా ఇల్లు’, ‘నియమాలు’ మొదలైన శబ్దాలను వాడకపోయివుంటే బాగుండేదని ఆ సంభాషణ జరిగిన చాలా రోజుల వరకు అనిపించేది. తల్లిదండ్రుల నుంచి విన్నటువంటి ఇలాంటి కటువైన మాటలన్నీ పిల్లలకు స్వయంగా తమ వృద్ధ్యాపంలోనూ జ్ఞాపకం ఉంటాయి.
మాకోతో అలా అనకుండా ఉండాల్సిందని అనిపించింది. సహనం కోల్పోయి మాట్లాడాను. మూడు సార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోని టోరి మొబైల్‌కు మెసేజ్ పెట్టాను. అతను మెసేజ్ చూసినప్పటికీ జవాబు ఇవ్వలేదు. మాకో విషయంగా నా గందరగోళాలను కొంచెం ఎక్కువే అనిపించేటంతగా టోరీ దగ్గర పంచుకుంటున్నాను కదా అని బాధవేసింది. నా భావనాత్మక లగేజ్‌ను అతనెందుకు మోసుకోవాలి? అలాగైతే మరీ లోపలికి పిలవకుండానే గాఢమైన సంబంధాలు స•ష్టించుకోవడం సాధ్యమే లేదా?
అయితే నన్ను గాయపరిచింది మాకో దగ్గర గొడవపడి రెండు రోజులు గడిచేలోపు మళ్లీ దొంగ అడుగులు వినిపించడం మొదలైంది. అది నన్ను మరింతగా కుంగదీసింది. రాత్రులు మారుతున్నంత వేగంగా అమ్మాయిలు కూడా మారసాగారు. ఆమె నడక గతి ఈమె కన్నా వేరు. పొరపాటున దగ్గినప్పుడు, ఆ శబ్దం నుంచే వ్యక్తి ధ్వని గుర్తించేలా, అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఊపిరిలోని హెచ్చుతగ్గులు గుట్టు విప్పుతాయి. పెడుతున్న అడుగుల ఒత్తిడిలో, గుసగుసల మాటల అలలలో, ఒంటికి పూసుకున్న సుగంధాలలో రోజురోజుకూ ముఖాలు మారుతున్నవనడానికి రుజువులున్నాయి.
వీళ్ళందరూ ఎవరు? మాకోతోపాటు చదువుకుంటున్నా అమ్మాయిలా? మా వీధి దగ్గరలో యూనివర్సిటీ విద్యార్థులు అక్కడక్కడ రూములు తీసుకొని నివాసం ఉన్నారు. వాళ్లేనా? గ•హిణులా? వీళ్లంతా ఎవరు? అమెరికా హైస్కూల్ వెళ్లడానికి మొదలుకాగానే గర్ల్ ఫ్రెండ్-బాయ్ ఫ్రెండ్‌లను పెట్టుకోవడం వారి సర్కిల్లో గొప్ప విషయం కావడం చదివి, విని తెలుసుకున్నాను. వీళ్లంతా వాడి గర్ల్ ఫ్రెండ్సా? ఇంతమందా? మాకో ఇంకెవరికో దేహాన్ని అమ్ముకోవడం లేదు కదా? డ్రగ్స్ అమ్మడం లేదు కదా? ఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు జరపటం లేదు కదా? ఛ, రాబోయే సంవత్సరం దూరపు ఊరిలో సీటు దొరికి వీడు నా ఇంటి నుంచి వెళ్లిపోతే చాలు. నా ప్రాణాలు తీయడానికే పుట్టాడు ఈ దరిద్రపు కుక్క అని వణుకుతూ, కంపిస్తూ తిట్టుకున్నాను.
సుహాస్‌కు ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తలేదు. ఇంకొకసారి ఫోన్ చేస్తే, ‘‘టూర్‌లో ఉన్నాను, రోడ్డు మీద ఉన్నప్పుడు కాల్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పలేదు నీకు? ఎవరూ చచ్చిపోలేదు కదా?’’ అని అరిచి నన్ను నివ్వెరపోయేలా చేశాడు. ఇలాంటి సూక్ష్మాలన్నీ చెబితే అర్థం చేసుకోలేనంత దూరంలో ఉన్న అతని గురించి అసూయ కలిగింది. టోరి ఎందుకో ఫోన్ ఎత్తటం లేదు. అలాగైతే రాత్రంతా మెలకువగా ఉండి, రోజంతా ముఖం తప్పించి తిరిగే ఈ మాకో ఎవరు? వీడిని నేను ఎలా పెంచాలి?
![]()
ఆరోజు ఒక్కసారిగా ఐదారు మంది మెట్లు ఎక్కి వస్తున్నట్టు చప్పుడు కాగానే నాకు మెలకువ వచ్చింది. తెల్లవారుఝాము మూడో నాలుగో ఉండొచ్చు. మాకో కాకుండా ఇద్దరు అమ్మాయిలైనా ఉండాలి. ముగ్గురు అమ్మాయిలు ఉండొచ్చు. ఇక నాకు ఊరక ఉండడానికి సాధ్యం కాదనిపించింది. లేచి జుట్టుకు బౌ వేసుకొని వేసుకొని, నైట్ డ్రెస్ మీదనే ఒక స్వెటర్ తొడుక్కొని బయటికి నడిచాను. చేతులు అదురుతున్నాయి. దబ దబమని అడుగులు వేస్తూ మాకో గదికి వెళ్ళాను. తలుపులు మూసి ఉన్నాయి. ఒక్కసారిగా తలుపులు తోసే ధైర్యం కలగలేదు. మాకో అని ఒకసారి పిలిచి అరక్షణం తర్వాత తలుపు తోశాను.
నా ఊహ సరిగ్గానే ఉంది. మాకోతోపాటు ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు అక్కడున్నారు. అందరూ మాకో వయసువారే. గదిలో ఆరుమూలల్లోనూ ఒక్కొక్క పుస్తకం తెరిచి కూర్చున్నారు. నేను వచ్చే చప్పుడు విని దూరంగా జరిగే కూర్చుని ఉండాలి ఈ దిక్కుమాలినవాళ్లు అనుకున్నాను.
‘‘వాట్ ఆర్ యు డూయింగ్ మామ్? నువ్వు ఇలా చేయకూడదు. నా ప్రైవసీని అతిక్రమించకూడదు’’ అని మాకో కీచుకంఠంతో అరిచాడు. గదిలో ఉన్న ఆరు జతల కళ్ళు నన్నే చూస్తున్నాయి. వెంటనే సారీ చెప్పి బయటికొచ్చేశాను.
బయటి గదిలోకి వచ్చి సోఫాలో కూర్చున్న తర్వాత, అలా బయటికి రాకుండా ఉండాల్సిందని అనిపించింది. ప్రైవసీ అంట ప్రైవసీ. మొన్న మొన్నటి వరకు ‘అమ్మా అమ్మా’ అంటూ వెళ్లిన చోటికంతా వచ్చి నా కాళ్లు కరుచుకుంటూ, నేను పక్కన లేకపోతే నిద్ర పోను అని పట్టుపడుతున్న పిల్లవాడికి ఇప్పుడు హఠాత్తుగా ప్రైవసీ అవసరమైందా? నా ఇంట్లోనే, నా కళ్ళుగప్పి తన రాజ్యం నడుపుతున్నాడు కదా వీడు. మనసును స్థిమితానికి తెచ్చుకొని మళ్లీ మాకో గదికి వెళ్లాను. ఈసారి తలుపులు కొట్టలేదు. తలుపు తీస్తుండగానే లోపల జరుగుతున్న గుసగుస మాటలన్నీ ఒక్కసారిగా స్తబ్దమయ్యాయి.
‘‘మీరందరూ దయచేసి మీ ఇళ్లకు వెళ్లిపోండి. ఇలా అర్ధరాత్రిలో ఇతరుల ఇంట్లో కలవకూడదు. ఇది రిపీట్ అయితే నీ పేరెంట్స్కు ఫోన్ చేయాల్సి వస్తుంది’’
వీలైనంత శాంతంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఆ పిల్లలు హడావుడిగా తమ బ్యాగులను భుజాలకు తగిలించుకొని వెళ్ళిపోయారు.
నేను తిరిగొచ్చి సోఫాలోకి వెళ్లి కూర్చున్నాను. మాకో ఆ గది నుంచి బయటికి రావలసింది. నన్ను ఎదుర్కో వలసిందే. అక్కడి వరకు ఇక్కడి నుంచి కదలకూడదని నిశ్చయించుకున్నాను.
నేను చాలాసేపు ఎదురుచూడాల్సిన అవసరం రాలేదు. పది నిమిషాల్లో మాకో బయటికి వచ్చాడు. ఒక కుర్చీని లాక్కొని నా ఎదురుగా కూర్చున్నాడు.
‘‘అమ్మ, నీ దగ్గర ఒక విషయం చెప్పాలి’’ అతని కంఠం మృదువుగా ఉంది
ఎన్నో సంవత్సరాల తర్వాత వాడు ‘అమ్మ’ అని పిలిచినందుకు నా మనసు ఆర్ద్రమైంది. వాడితో యుద్ధానికి సిద్ధంగా కూర్చున్నాను. తద్విరుద్ధమైన ఈ సన్నివేశానికి తయారు చేసుకోలేదు.
‘‘ఏమైంది మాకో?’’
‘‘ఈరోజు వచ్చిన వాళ్ళు, ఇంతకుముందు వచ్చినవారు ఎవరూ నా స్నేహితులు కాదు. నా క్లయింట్లు’’
క్లయింట్ అనే శబ్దం విన్న వెంటనే నా గుండె గుభేల్‌మంది.
‘‘నాకు ఒక మ్యాజికల్ శక్తి ఉంది. ఎదురుగా ఉన్నవారి మనసు వారికి ఏమేమి చెప్పడానికి తపిస్తుందో అన్నది నేను అర్థం చేసుకోగలను. వారి మనసు భాషలోనే వారికి దాన్ని చెప్పగలను’’
‘‘ఒకసారి ఆండ్రూతోపాటు చదువుకుంటుండగా, అకస్మాత్తుగా ఈ శక్తి గురించి నాకు తెలిసింది. అతని గర్ల్ ఫ్రెండ్‌తో ఏదో గొడవ జరిగింది. దాని గురించి అతనికి ఏమి చేయాలో అని తెలియదు. ఒక్క క్షణం ఆలోచించి స్పానిష్‌లో ఏదో వాగాను. ఆండ్రూ ఇంటి భాష అది. నాకు స్పానిష్ భాష గాలి, గంధం కూడా లేదు. ఆ రోజు నేను చెప్పిన ఉపాయం అతనికి బాగా ఉపయోగపడిందట’’
‘‘ఈ విషయాన్ని అతను ఇంకొక స్నేహితునికి చెప్పాడు. అతను ఇంకెవరికో చెప్పి ఈ విషయం అన్నిచోట్ల వ్యాపించింది. వేరు వేరు హైస్కూల్ నుంచి అబ్బాయిలు అమ్మాయిలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు’’
‘‘ఇలా వారి మనసును చదివే సామర్థ్యం నేను ఏకాంతంలో ధ్యానించేటప్పుడు నాకు వస్తోంది. విచిత్రం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రమే ఈ శక్తి పని చేస్తుంది’’
‘‘ఏ విషయం గురించి వాళ్లు ప్రశ్నిస్తారు?’’
‘‘వాళ్లు ఏమీ అడగరు. నేనే వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా మనసుకు తెలిసింది చెప్తాను. వాళ్లు షాక్ య్యేటంతగా అది కచ్చితంగా నిజమై ఉంటుంది’’
నేను నివ్వెరపోతూ మాకో మాటలను వింటూ కూర్చున్నాను. తన మొండితనం సాధించుకోవడానికి ఏ స్థాయికి వెళుతున్నాడు ఈ పిల్లవాడు, కళ్ళముందే అబద్ధాల మాలను అల్లి తానే అందులో చిక్కుకుంటున్నాడు కదా అని అసహ్యం వేసింది. వీడి వాదాన్ని మూలం నుంచే పెకిలించివేయాలని నిర్ణయించుకున్నాను.
‘‘ఇలా మాట్లాడకూడదు మాకో. ఇలా ముఖానికి కొట్టినట్లు అబద్ధాలు చెప్పకూడదు. నీ వయసులో ఏవేవో కుతూహలాలు ఉంటాయి. అవన్నీ తప్పు అని నేను చెప్పడం లేదు. నిజం ఒప్పుకోకుండా ఇలా మ్యాజిక్ అని ఏవేవో మాట్లాడకూడదు. చూసినవారు ఆ తర్వాత పిచ్చి అనుకుంటారు’’
‘‘లేదు మామ్ నేను చెబుతున్నదే సత్యం’’
గబుక్కున సోఫానుంచి లేస్తూ, ‘‘అలాగైతే, నా మనసునూ చదువు చూద్దాం’’ అన్నాను.
‘‘రాత్రి మాత్రమే ఆశక్తి ఉంటుంది మామ్’’
‘‘ఇంకా తెల్లవారలేదు కదా. నా కళ్ళల్లోకి చూడు. ఇప్పుడే చెప్పు’’
‘‘నా గది ఏకాంతంలో మాత్రమే అది సాధ్యమవుతుంది’’
‘‘సరే నీ గదికి వెళ్దాం పదా’
‘‘మామ్ దీన్ని ఇక్కడితో వదిలివేయగలవా?’’ మాకో కంఠంలో దైన్యం తొంగిచూసింది.
నేను అప్పటికే వాడి గది లోపలికి వెళ్ళిపోయాను.
మాకో ముఖం ముడుచుకునే వచ్చాడు. అవమానంతో అతని పెదవులు కంపిస్తున్నాయి. వచ్చినవాడు తన చేతుల్లో చెంపలను పట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. తన పక్క మీద కళ్లు మూసుకొని కూర్చున్నాడు.
కళ్ళు తెరవగానే వాడి కళ్ళు నిప్పులా ఎర్రబడ్డాయి. నా ఈ కన్నబిడ్డను ఎందుకిలా హింసిస్తున్నానని బాధ కలిగింది. ఇంకేమీ నేనే ఓడిపోవాలి అనేటంతలో మాకో మాట్లాడాడు.
‘‘టోరీ ఇక రాడు. అతని కోసం ఎదురుచూడకు. అతను వెళ్ళిపోయాడు’’
‘‘ఏమన్నావ్?’’
‘‘ఈ విషయం సుహాస్‌కు తెలుసు. అందుకే వాడు ఇలా దూరంగా జరిగాడు’’
నా దవడలు నాకు తెలియకుండానే వణకసాగాయి. మాకో చెంప వాయించాలనిపించింది. చేయి లేవలేదు. వాడి ఎర్రటి కళ్ళు నన్ను పొడిచేసేలా చూస్తున్నాయి.
వాడి గది నుంచి ఎలా బయటికి వచ్చానో తెలియలేదు. ఊపిరి కట్టివేసినట్టు అవుతోంది. చెప్పులు వేసుకుని తలుపులు తెరిచి మెట్లు దిగసాగాను. అలా దిగుతుండగా లోపల కూర్చున్న మాకోకు ఈ చప్పుడు ఎలా వినిపిస్తుండొచ్చు అనే ఆలోచన ఒక్క క్షణం నా మనసులో కదిలిపోయింది.
![]()
కావ్య కడమె
కావ్య కడమె కన్నడసాహిత్యంలో యువ కథకుకురాలు, నవలాకారిణి, కవయిత్రి, నాటకకర్త. ఉత్తర కన్నడ జిల్లాలోని కడమెకు చెందినవారు. డిగ్రీ తర్వాత కర్నాటక విశ్వ విద్యాలయం నుంచి జర్నలిజంలో ఆరుబంగారు పతకాలతో ఎంఎ. పట్టా అందుకున్నారు. 2013 అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్నారు.
వీరి సాహిత్య కృషికి గుర్తుగా- ‘ధ్యానకె తారీఖిన హంగిల్ల’, ‘జీన్స్ తొట్ట దేవరు’ ప్రచురితమైన కవితా సంకలనాలు. ‘పునరపి’ నవల, ‘ఆటదొళగ ఆట’, ‘డోర్ నెంబెర్ ఎంటు’ నాటకాల సంకలనం. ‘దూరదేశవెంబ పక్కద మనె’ అనే వ్యాసాల సంకలనం ప్రచురితమయ్యాయి.
కావ్యకడమె ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం లభించింది. యువరచయితలకు ఇచ్చే టోటో పురస్కారం, గుల్బర్గా జిల్లా సేడం ‘అమ్మ పురస్కారం, బేంద్రె గ్రంథ బహుమానం, రత్నమ్మ హెగ్గడె గ్రంథ బహుమానం, కడంగొడ్లు కావ్య పురస్కారం, దినకర కావ్య పురస్కారం, సాహిత్య పరిషత్ కాకోళ సరోజమ్మ దత్తి , నీలగంగా దత్తి , నాటక అకాడెమి పురస్కారాలు లభించాయి .

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 29 అనువాద నవలలు, 22 అనువాద కథా సంకలనాలు, 5 సంచార జీవుల ఆత్మకథలు, మరాఠి దళిత రచయిత శరణ్‌కుమార్ లింబాలే ఆత్మకథ, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. ఇతర భాషల నుంచి కన్నడంలోకి అనువదించిన రచనలు 5 పుస్తకాలుగా వచ్చాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.




Discussion about this post