• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
No Result
View All Result

వ్యాసం : కథల కొలనులో విహారం

ఎ.వి. రమణమూర్తి by ఎ.వి. రమణమూర్తి
March 22, 2023
in సాహిత్య వ్యాసం
0
వ్యాసం : కథల కొలనులో విహారం

“A Swim in a Pond in the Rain” by George Saunders
ఎ.వి. రమణమూర్తి

చెహోవ్ రాసిన ‘ఇన్ ద కార్ట్’ అనే కథని మీరు ఇప్పటికే చదివివుండకపోతే మీ అంత అదృష్టవంతులు మరొకరుండరు. ఎందుకంటే, ఆ కథని ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ – జార్జ్ సాండర్స్ – మీకు బోధించే విందుకు మీరు అర్హులు. ఇప్పటికే చదివేసి ఉన్నారా? మరేం పర్లేదు- మీరు చదివిందంతా మర్చిపోయేలా చేసి, కొత్తకథని చదువుతున్న అనుభూతిని కలిగించేలా ఆయన పాఠం ఉంటుంది. ఈ కథా, ఇంకో ఆరు కథల మీద పాఠాలవంటి విశ్లేషణలతో జార్జ్ సాండర్స్ రాసిన పుస్తకం – తాజా పుస్తకం: A Swim in a Pond in the Rain ఈ సంవత్సరం జనవరిలో విడుదలైంది.

కథలు రాయడం ఎలా? అన్న పుస్తకాలుండవచ్చు. పుస్తకాలు చదవడం ఎలా? అన్న పుస్తకాలూ ఉండవచ్చు. కానీ, చదివించేలా ఎలా రాయాలీ, రాసినవి ఎలా చదవాలీ అన్న రెండు విషయాలనూ ఏకకాలంలో ఒంటిచేత్తో నిర్వహించడం ఈ పుస్తకం ప్రత్యేకత. అసలు కథని వదిలేసి, జార్జ్ సాండర్స్ ఏం చెప్పబోతున్నాడో అన్న ఆతృతని కలిగించడం ఈ పుస్తకంలోని అసలు ఆకర్షణ. నేల విడిచి సాము చేయకుండా, సిద్ధాంతాల ఆధారంగా విశ్లేషణలు చేయకుండా, ఉన్న టెక్స్ట్ ఆధారంగా ఉన్నదున్నట్టు తార్కికంగా విశ్లేషించడం వల్ల, సంక్లిష్టతలు ఏమాత్రం లేకపోగా, వాదనల్లోని సాదాసీదాతనపు ధోరణివల్ల అవి మరింత నమ్మశక్యంగా అనిపిస్తాయి. 

చెహోవ్ కథ “గూస్‌బెర్రీస్” చదివినవారికి ఒక సన్నివేశం గుర్తుండి తీరాలి.  ఇవాన్ ఇవానిచ్, బుర్కిన్ ఇద్దరూ వర్షంలో చిక్కుకొని, కాసేపు తలదాచుకోవడానికి దగ్గర్లో ఉన్న ఆల్యోహిన్ ఇంటికి వెళతారు. వీళ్లని ఆదరంగా స్వాగతించిన ఆల్యోహిన్, తను స్నానం చేయడానికి వెళ్తూ స్నానాల గదుల దగ్గరకి వీళ్లని కూడా ఆహ్వానిస్తాడు. కురుస్తున్న వర్షంలో ఇవాన్ ఇవానిచ్ పక్కనున్న నదిలోని నీళ్లల్లోకి దూకి, మునుగుతూ తేలుతూ ఈతకొడుతూ విపరీతంగా ఆనందపడిపోతూ ఉంటాడు. కొద్దిసేపయ్యాక నీళ్లమీద వెల్లికిలా పడుకొని ఈతకొడుతూ, మొహం మీద వర్షపు చినుకులు పడుతూండగా, “ప్రభూ, నీ కరుణ చూపించు,”(“Lord, have mercy on me”) అంటాడు. ఈ సన్నివేశమే ఈ పుస్తకపు శీర్షిక వెనక ఉన్న స్ఫూర్తి. ఎంత అందమైన సన్నివేశం! (ఇవానిచ్ పైమాట అన్నాక, బుర్కిన్ అతన్ని కసురుకున్న పద్ధతి బాగుంటుంది: “You’ve had enough.”)

జార్జ్ సాండర్స్ ప్రముఖ అమెరికన్ రచయిత, బుకర్ ప్రైజ్ విన్నర్. 1997 నుంచీ సిరక్యూస్ యూనివర్సిటీలో బోధిస్తున్న ఈ అధ్యాపకుడు తీసుకునే క్లాసుల్లో ‘19వ శతాబ్దపు రష్యన్ కథల అనువాదాలు’ ఒకటి. తను బోధించే ముప్పై కథలనుంచి ఏడింటిని మాత్రం ఎన్నుకుని, వాటిని విపులంగా శల్యపరీక్ష చేసిన పుస్తకం: “ఎ స్విమ్ ఇన్ ఎ పాండ్ ఇన్ ద రైన్.” ఆ ఏడుకథల రచయితలు ఎవరు? చెహోవ్ (మూడు కథలు), టాల్‌స్టాయ్ (రెండు కథలు); టుర్గెనియెవ్, గోగోల్‌లది చెరో కథా. ఈ రచయితల ప్రసిద్ధమైన కథలు ఇవీ అని చెప్పడం సాండర్స్ ఉద్దేశం కాదు. ఇవి ఆయనకి ఇష్టమైన కథలు, బోధించడానికి ఇష్టపడే కథలు, విశ్లేషించడానికి తగినంత విషయం ఉన్న కథలు. “ఈ కథలు మనల్ని రెచ్చగొడతాయి; వ్యతిరిక్తత కలిగించేలా చేస్తాయి; విపరీతమైన కోపం కూడా తెప్పిస్తాయి. కానీ, గమ్మత్తుగా, ఒక సంక్లిష్టమైన అమరిక వల్ల అవి మనకి ఓదార్పునిస్తాయి.”. ఆ కాలంలో రాసిన రష్యన్ కథలకి ఒక ప్రత్యేకత ఉంది. ఇదంతా రెసిస్టెన్స్ లిటరేచర్. గొంతువిప్పితే రాజ్యాగ్రహానికి గురికావలసిన పరిస్థితుల మధ్యలో, రచనాశిల్పాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని, రాజ్యం పట్ల నిరసనని మాటల అడుగున కనీకనిపించనట్టుగా దాచిపెట్టి, ప్రతి మనిషీ గుర్తించదగినవాడేననీ, ప్రతి బాధా సానుభూతికి అర్హమేననీ ప్రగతిశీల రచయితలు చేసిన ప్రకటనలివి. ఇవి సార్వకాలికమైన మానవీయ అంశాలు కాబట్టే, ఈ కథలకి వయసుడిగిపోలేదు. ఇంకా చాలా యేళ్లపాటు మనం వీటిగురించి మాట్లాడుకోగలిగినంత శక్తి వీటిలో నిక్షిప్తమై ఉంది. 

ఈ కథలని ఇప్పుడెందుకు చదవాలి అన్న విషయం గురించి చెబుతూ, ముందుమాటలో సాండర్స్ అంటారు: “…our time maybe doesn’t fully endorse but that these writers accepted implicitly as the aim of art—namely, to ask the big questions: How are we supposed to be living down here? What were we put here to accomplish? What should we value? What is truth, anyway, and how might we recognize it? How can we feel any peace when some people have everything and others have nothing? How are we supposed to live with joy in a world that seems to want us to love other people but then roughly separates us from them in the end, no matter what?” అన్ని ప్రశ్నలకీ అన్నివేళలా సమాధానాలు దొరకకపోవచ్చు. పరస్పరాధారితాలయన అనేక సమస్యల చిక్కుముళ్ల మధ్య నిర్దిష్టమైన, నిర్దుష్టమైన పరిష్కారమార్గాలు దొరకకపోవచ్చు. ఇలాంటి కథలు అందించే సమస్యలూ, పరిష్కార సూచనలనుంచి మన ఆలోచనాధోరణుల్లో కొంత స్పష్టత రాగల అవకాశం ఉంది. ఈ కథల అవసరం ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. కొంత కరుణతో కూడుకున్న ఆలోచన చేయవలసిన అగత్యం మరింతగా ఉంది. ఎందుకంటే, “[…] we live, as you may have noticed, in a degraded era, bombarded by facile, shallow, agenda-laced, too rapidly disseminated information bursts.” 

ఏదైనా ఒక కథ బాగుందనిపించినప్పుడు, ఆ కథ కథాసూత్రాలకి అనుగుణంగా ఉందా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టి, అది విజయవంతం కావడానికి వెనకాల ఉన్న కారణాలని విశ్లేషించడం సబబుగా ఉంటుంది. నిజానికి సూత్రాలని ఉల్లంఘించిన కథలు కోకొల్లలుగా ఉంటాయి. ఫ్రేటాగ్ చెప్పిన ట్రయాంగిల్‌ని అనుసరించని కథలు కూడా విజయవంతమై ఉండవచ్చు (Jane Alison రాసిన “Meander, Spiral, Explode: Design and Pattern in Narrative” అనే పుస్తకాన్ని చదివితే, త్రికోణపు ఆకారంలోనే కాకుండా కథలు ఇంకా ఎన్నెన్ని రూపాలతో రాయబడ్డాయో సోదాహరణమైన అద్భుత వివరణ ఉంటుంది). They all worked somehow. ఈ ‘సమ్‌హౌ’ అంతస్వరూపాన్ని కనిపెట్టడం, రూపవిశేషాలని విశ్లేషించడం, శిల్పం అంటే ఏమిటీ అని కాదు- శిల్పం ఎలా పనిచేస్తుంది అని ‘physics of the form’ని పట్టుకోవడం జార్జ్ సాండర్స్ లక్ష్యం. ఆయన తన స్టూడెంట్స్‌తో సీరియస్‌గానే జోక్ చేస్తారట: “మనం ఈ కథలని చదువుతున్నది- వీటినుంచి మనం ఏ సంగ్రహించగలమో తెలుసుకోవడానికి!” (ఆయన సూటిగా ‘స్టీల్’ అనే మాటనే వాడారు కానీ, మన తెలుగు ‘సంగ్రహించడం’ అన్నమాటకి రెండంచులూ ఉన్నాయి!). స్థూలంగా పరిశీలించాల్సిన అంశం ఒకటే: ఏదైనా కథ మనని చదివించగలిగితే, ఆ రచయిత ఆ పనిని విజయవంతంగా ఎలా చేయగలిగారన్నది. 

ప్రతిదాన్నీ దేనితోనో పోల్చిచెప్పడం సాండర్స్‌కి బాగా అలవాటు. టీచింగ్ గురించి చెబుతూ, అది చంద్రుణ్ణి చూపించే వేలు మాత్రమే అంటారు. ఇక్కడ చంద్రుడు ముఖ్యం కానీ, చూపించే వేలు కాదు. వర్క్‌షాపులూ, కథాసిద్ధాంతాలూ, గంభీరమైన సందేశాలూ, రాసిపెట్టుకుని దాచిపెట్టుకోవాల్సిన ఉదాత్తమైన వాక్యాలూ- ఇవన్నీ కూడా చూపుడువేళ్లే. చంద్రుణ్ణి మనమే చూడాలి, మనమే అర్థం చేసుకోవాలి. ఈ అవగాహన వల్లనే ఏమో- తన టీచింగ్‌లో పాండిత్యానికంటే వినోదాత్మకతే (vaudevillian) ఎక్కువగా ఉంటుందని తనగురించి తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పుకున్నారు. 

చెహోవ్ రాసిన ‘ఇన్ ద కార్ట్’ (ఇంగ్లీష్ అనువాదాల్లో రకరకాల శీర్షికలున్నాయి: ‘In the Cart’-Yarmolinsky/Pevear/Hingley/Bartlett, ‘In the Horsecart’ – Robert Payne, ‘The Schoolmistress’ – Constance Garnett) కథలో, కుటుంబాన్నంతా పోగొట్టుకున్న మార్యా, జీవిక కోసం ఓ చిన్నవూళ్లో, చిన్న స్కూల్‌లో పదమూడేళ్లుగా పనిచేస్తుంటుంది. రావిశాస్త్రిగారి భాషలో ముప్పై ‘వర్షాల’ మార్యా ఆమె. నెల జీతం తీసుకోవాలంటే పక్కనున్న పట్టణానికి వెళ్లిరావలసిందే. అలా ఓసారి జీతం తీసుకుని, ఇంటికి కావలసిన సామాన్లు కూడా తీసుకుని తిరిగి గుర్రబ్బండిలో ఊరికి తిరిగివస్తున్న సందర్భం అది. జీవితంలోని మొనాటనీ, కనుచూపుమేరలో ఎక్కడా కనిపించని సుఖసంతోషాలూ, స్కూలూ రాజకీయాలూ, మర్యాద తెలియని మనుషులు, ఆత్మగౌరవాన్ని సైతం పణంగా పెట్టాల్సిన సందర్భాలూ – ఇవన్నీ ఆ ప్రయాణంలో తారసపడే అనుభవాలూ లేదా ఆలోచనలూ. కుదిరీ కుదరని, సరిగా పండని రొమాంటికి ఇంటరెస్ట్ ఒకటి ఉంది కానీ, దాని భవిష్యత్తు ఇదమిత్థంగా తెలీదు. ఈ కథ ప్రారంభపు పేరాలోనే ‘but’ అనే పదాన్ని చెహోవ్ రెండుసార్లు ఉపయోగించడాన్ని ప్రత్యేకించి చెబుతూ రెండు వాక్యాలు రాస్తారు సాండర్స్. మొదటిది హాస్యం; రెండోది కథా వాస్తవపు గుర్తింపు (“The conditions of happiness are present, but happiness is not.)

కథని క్లాస్‌రూమ్‌లో చర్చించడానికి సాండర్స్‌కి ఓ పద్ధతుందట. కథని ఒక్కొక్క పేజీ చొప్పున మాత్రమే విద్యార్థుల చేత చదివించి- ఇప్పటివరకూ మనకు తెలిసిన సంగతులేవిటి? మనకి ఆసక్తి కలిగించిన విషయాలేమిటి? కథ ఎలా ముందుకెళ్లచ్చని మనం అనుకుంటున్నాం? అన్నవి చర్చించడం. ఈ చర్చించడంలో కథారచనకీ, పఠనానికీ సంబంధించిన విషయాలు చెబుతూనే ఉంటాడు సాండర్స్. పాత్రల చిన్నచిన్న కదలికలూ, సంభాషణలూ, మోటివేషన్స్, వాళ్లు అలా ప్రవర్తించడానికి ఉండగల కారణాలూ- వీటన్నిటి మధ్యన చర్చలోకి రాని పదం కానీ, విషయం కానీ దాదాపుగా ఉండవు. 

సరే, మార్యా ప్రయాణిస్తున్న గుర్రబ్బండి దాదాపు ఊరిదాకా వచ్చేసింది కానీ, రైల్వే గేట్ పడివుండటం వల్ల ఆగవలసి వచ్చింది. రైలు వెళ్లాక గేటు దాటితే, ఊరు చేరుకున్నట్టే. ఇంతలో రైలు గేటుని దాటుకుంటూ వెళుతూంటుంది. ఆ రైలు తాలూకు ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంట్ మార్యాని దాటుకుని వెళుతున్నప్పుడు, ఆ కంపార్ట్‌మెంట్ తలుపు దగ్గర నిలుచుని ఉన్న ఓ మహిళని చూస్తుంది మార్యా. చిన్నప్పటి తల్లి రూపం గుర్తుకొచ్చి, ఆ జ్ఞాపకాలకీ రైల్లో ప్రయాణిస్తున్న మహిళకీ మధ్య ఏదో పోలిక స్ఫురించి, మార్యా ఉద్వేగానికి లోనవుతుంది. సంతోషం, దుఃఖం, కన్నీళ్లూ- అలా అన్నిరకాల భావావేశాలూ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రపంచం ఒక కొత్తవెలుగులో ఆనందకరంగా కనిపిస్తుంది. తన తల్లిదండ్రులు అసలు చనిపోనట్టూ, తనసలు స్కూల్లోనే పనిచేయడం లేదన్నట్టూ, అదంతా ఓ భ్రమ అన్నట్టూ అనిపిస్తుంది. 

నిజానికి ఇక్కడ కథని ముగించవచ్చా? మనం చూసే చూపుని బట్టే ప్రపంచం ఉంటుందన్న ఎపిఫనీ మార్యాకి కలిగింది కాబట్టి, అది చాలనుకుంటే కథని ముగించవచ్చు. మామూలు కథలు అలానే ముగుస్తాయి కూడా. కానీ, పాత్రకి కలిగే ఎపిఫనీ ప్రభావం ఎంతకాలం ఉంటుంది? ఆ ఎరుక ఎప్పటికీ మిగిలిపోతుందా? అది శాశ్వతమైన అనుభవమా? 

నిజానికి కాదు. మంచికథలు ఈ విషయంలోనే లోకం తీరుకి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తాయి. వాడ్రేవు చినవీరభద్రుడి గారి ‘సుజాత’ కథ ముగింపు గుర్తుందా? ఆ కథలోని చివరి సన్నివేశం కూడా ఇలానే రైల్వే గేట్ దగ్గర జరుగుతుంది. తనమీద జరిగిన అత్యాచారం వల్ల చెదిరి ఛిద్రమైపోయిన పాత్ర, అక్కడి చిన్నపిల్లల్ని చూసి ఒక కొత్త స్ఫూర్తికి లోనవుతుంది. ఇక ఆ అమ్మాయి మారిపోయినట్టేనా? తన గతజీవితంలో జరిగిన అన్యాయం మరిచిపోయి ఆనందంగా బతికేయగలదా? మామూలు కథ అయితే అలాంటి పరిష్కారాన్నే ఇస్తుంది. కానీ, జరగడానికి తక్కువ సంభావ్యత ఉన్న విషయాలని చేయి తిరిగిన రచయిత అలా అవాస్తవికంగా ముగించలేడు. అందుకే ‘సుజాత’ కథారచయిత ముగింపువాక్యంలో ఒక గొప్ప పదాన్ని ప్రయోగిస్తారు. “ఆ దృశ్యంలో నన్ను ఏది ఆకర్షించిందో నాకు తెలియదు. కానీ, కనీసం ఈ క్షణాన ‘నా అనంతర జీవితం ఎలా?’ అన్న నా ప్రశ్న హాస్యాస్పదంగా అనిపించింది” అని ముగుస్తుంది కథ. “కనీసం” అన్న అతిమామూలు మాట, ఇక్కడ అత్యంత సందర్భోచితమైన మాట. ఇవాళ్టి ఎరుకవల్ల అనంతర జీవితం మొత్తం ఈ గాయపు మరక లేకుండా ఉంటుందా? ఉండవచ్చు, లేదా ఉండకపోనూ వచ్చు. ప్రతి అనుభవం తాత్కాలికమైన సందేశాన్ని మాత్రమే ఇస్తుందని కానీ, లేదా శాశ్వతమైన మార్పుని అందిస్తుందని కానీ కచ్చితంగా చెప్పలేం. అందుకే ఆ అమ్మాయికి “కనీసం” ఇప్పుడు, ఈ క్షణాన, ఇవాళ- ఆ మార్పు కనిపించింది. రేపేంటో ఎవరు మాత్రం చెప్పగలరు?

చెహోవ్ కథలోని మార్యా కూడా, ప్రపంచాన్ని కొత్తచూపుతో చూడగలిగింది. ఇప్పుడంతా మారిపోయినట్టుగా అనిపిస్తోంది. మార్యా కొత్తజీవితాన్ని ఆరంభించబోతోందా? ఈ ప్రశ్నకి మంచిరచయిత సమాధానం చెప్పకుండా కథని ముగించలేడు. చెహోవ్ కథలో, రైలు వెళ్లిపోగానే-

“బండి ఎక్కండి,” అంటాడు బండివాడు. 

ఆ ఒక్కమాటతో, మార్యాకి ఒక ఉలికిపాటు కలుగుతుంది. కొత్తప్రపంచం, కొత్తవూహలు అన్నీ చెదిరి అదృశ్యమైపోతాయి. బండివాడు అన్నమాట “చాల్లే పద, పాతజీవితంలోకి…” అన్నట్టుగా తాకుతుంది మార్యాకి. ఊరికి చేరకుండా ఇప్పటివరకూ అడ్డుగా ఉన్న రైల్వే గేట్ పైకి లేస్తోంది. చలికి వణుకుతూ మార్యా బండెక్కుతుంది. రైల్వే గేట్ దగ్గర ఉన్న గార్డ్ మర్యాదపూర్వకంగా టోపీ తీస్తాడు. “రండమ్మా, మీ పాతజీవితంలోకి…” అని ఆహ్వానం పలుకుతున్నట్టు. 

“వచ్చేసింది మన ఊరు!” అంటాడు బండివాడు. కథలో ఇదే ఆఖరివాక్యం.

కథానిర్మాణ సిద్ధాంతాల జోలికి పోకుండా, ప్రతి వాక్యాన్నీ, ప్రతి పదాన్నీ, ప్రత్యక్షరాన్నీ పట్టుకుని విశ్లేషిస్తూ, విస్తరణభీతిని పక్కన పెట్టేసి (ఈ కథమీద చర్చ దాదాపు అరవై పేజీలుంటుంది!), చాలా మామూలు మాటల్లో కథని సాండర్స్ వివరించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కథని మనం ఇంతకుమునుపే చదివివున్నా, కథ మనకి కొత్తగానే కాకుండా, సంపూర్ణంగా అర్థమైన అనుభూతి కలుగుతుంది. మనకి ఒకరకంగా ఈ విశ్లేషణే ఒక ఎపిఫనీ. 

మరి మన ఈ ఎపిఫనీ శాశ్వతమేనా? కొంతవరకూ, అని సమాధానం ధైర్యంగా చెప్పుకోవచ్చు. మనం చదవబోయే వందల కొద్దీ కథలమీద ఈ విశ్లేషణ ప్రభావం ఉన్నంతవరకూ!

చెహోవ్‌దే మరో కథ: “ద డార్లింగ్.” ఈ కథమీద చాలా విమర్శలు చదివాను. అనేక సామాజిక సిద్ధాంతాల నేపథ్యంలో చేసిన పలువిశ్లేషణలని క్రోడీకరిస్తూ, సారంగ పత్రికలో ఒక వ్యాసం కూడా రాసాను. కానీ, అవన్నీ ఒక ఎత్తు; సాండర్స్ అందించే ఈ కథ విశ్లేషణ మరో ఎత్తు.  సిద్ధాంతాల జోలికి పోకుండా, మామూలు పాఠకుడు స్వీకరించగలిగిన స్థాయిలోనే కథని అందుకుని, లోతుల్లోకి వెళ్లి ఆ కథని సాండర్స్ విశ్లేషించిన పద్ధతి ప్రత్యేకమైనది.  

మగవాడి ప్రేమాలంబన లేకుండా ఉండలేని ఈ కథలోని నాయిక, మొదటి వివాహం జరిగాక అతనే తనుగా మారిపోయినంత తలకిందులవుతుంది. అతను మరణించాక, కొద్ది నెలలకే మరో వివాహం చేసుకుంటుంది. ఇక్కడా మళ్లీ అలానే ప్రవర్తిస్తుంది. అతని వ్యవహారాలే తన జీవనరీతి అన్నట్టు. అతనూ మరణిస్తాడు. 

తరువాత ఏమిటి? ఇంకో డాక్టర్‌తో ప్రేమలో పడుతుంది. 

చూడగానే ఇది ఒక పాటర్న్ ప్రకారం కథాంశాన్ని పునరావృతం చేస్తూ రాసిన కథ అని అర్థమవుతూ ఉంటుంది. ఈ అమ్మాయి అక్కడ ఫలానా, ఇక్కడా ఫలానా. రాబోయే రోజుల్లో, రాబోయే పరిస్థితుల్లో కూడా అదే ఫలానా. సాండర్స్ చెప్పే విశేషం ఏమిటంటే- మనం బయటికి కనిపించే ఈ పాటర్న్‌ని మాత్రమే గమనిస్తూ ఉన్నప్పుడు,  చెహోవ్ వాటి వెనకాల రకరకాల వేరియేషన్స్‌ని సృష్టిస్తూ ఉంటాడు. పాఠకుడికి పాటర్న్ పట్ల కుతూహలం రేకెత్తించాక, అందులో చూపించే వేరియేషన్స్‌ని పాఠకుడు (ప్రత్యేకించి గుర్తించలేకపోయినా) ఆస్వాదించగలుగుతాడు.  తరచి తరచి చూస్తే తప్ప వాటిలో ఉన్న సూక్ష్మమైన భేదాలు మనకి కనిపించవు. అలాంటి వేరియేషన్స్ ఎన్ని ఉన్నాయో చూపించడానికి సాండర్స్ ఒక టేబుల్ తయారుచేస్తాడు.  ప్రతి సంబంధంలోనూ- మగవాడి వృత్తి, వారి సంబంధం ప్రత్యేకతా, అతను ఆమెని ఏమని పిలిచేవాడు, ఆమె అతన్ని ఏమని పిలిచేది, ఎంతకాలం వాళ్ల సంబంధం కొనసాగింది, ఎన్ని పేజీలు వాళ్ల సంబంధం గురించి కథ నడిచిందీ, అతను ఎలా చనిపోయాడు, చనిపోయాక ఎన్నాళ్లపాటు ఆమె విషాదంలో మునిగిపోయి ఉందీ లాంటి వివరాలని పరిశీలిస్తే, చెహోవ్‌ని గొప్ప రచయిత అనడానికి కారణాలు కనిపిస్తాయి! పునరావృతం అయ్యే అంశాలని వివిధ ఘట్టాలలో వివిధ పద్ధతుల్లో ఉపయోగించడానికి రచయితకి ముందే రచించి పెట్టుకున్న నిర్దిష్టమైన ప్రణాళిక అయినా ఉండాలి, లేక గొప్ప మేధస్సయినా ఉండాలి. 

ఇన్ని విషయాలని ఇంత సీరియస్‌గా చెబుతూపోతుంటే, మనం అంత ఉధృతిని తట్టుకోగలమా? బహుశా సాండర్స్‌కి కూడా ఈ విషయం తెలుసనుకుంటాను. “డార్లింగ్” కథ ఫ్రేటాగ్ త్రికోణం (Exposition ->Rising Action -> Climax ->Falling Action -> Resolution) ప్రకారం ఎలా ఉందో వివరిస్తూ, కథానాయిక మొదటి వివాహం తరువాత భర్త (అతని పేరు Kukin) మరణించడం వరకూ కథలోని రైజింగ్ యాక్షన్ అని చెబుతాడు సాండర్స్. ఇంతవరకే చెప్పి ఊరుకుంటే అది మరీ ఎకడమిక్‌గానూ, మరీ సీరియస్‌గానూ ఉంటుంది. అక్కడ సాండర్స్ అదనంగా ఒక వాక్యం చేరుస్తాడు: “Goodbye, Kukin, you gave your life for rising action.” పుస్తకాన్ని సునాయాసంగా చదివేయడానికి సాండర్స్ ఉపయోగించిన పద్ధతుల్లో హాస్యం ఒక పాయ మాత్రమే! మిగతావేంటో పుస్తకం చదువుతుంటే తెలిసిపోతుంటాయి. 

కథని రచయిత ఎంత ఆసక్తికరంగా చెప్పాలో, విశ్లేషణ కూడా అదే స్థాయిలోనో లేదంటే అంతకంటే ఎక్కువ స్థాయిలోనో ఆసక్తికరంగా ఉండాలనే నియమమేదో విశ్లేషకుడు పెట్టుకుంటే తప్ప, అలాంటి సుదీర్ఘ వివరణలు ఎక్కడా విసుగు కలిగించకుండా ఇవ్వడం సాధ్యం కాదు. ఇది సాండర్స్ సాధించిన ప్రత్యేకమైన విజయం. 

ఇవాన్ టుర్గెనియెవ్ రాసిన “The Singers” కథని ఈ పుస్తకంలోనే మొదటిసారిగా చదవడం. కథ చదవడం మొదలుపెట్టాక, అసలు ఈ కథని ఈ పుస్తకంలో ఎందుకు చేర్చారో అర్థం కాలేదు. పేజీల కొద్దీ వర్ణనలూ, అనవసరంగా కనిపిస్తున్న విశేషాలతో సాగిపోయే ఈ కథ- ఓ సంగీతపు పోటీ గురించి. ఆ ఊళ్లో ఫలానా చోట, ఇద్దరు గాయకుల మధ్య పోటీ పెడుతున్నారు, ఎవరు గొప్ప గాయకుడో తేల్చబోతున్నారు. 

కథ ఎలా నడుస్తుందయ్యా అంటే-

ముందుగా ఆ ఊరిని రెండు భాగాలుగా విడగొడ్తున్న లోయగురించి వర్ణన. ఆ ఊళ్లో ఉన్న ఒక సత్రం/బార్ వర్ణన. సత్రం యజమాని వర్ణన. సదరు యజమాని భార్య వర్ణన. మధ్యలో కొన్ని పక్షుల వర్ణన. ఆ ఊరి వర్ణన. ఇద్దరు గ్రామస్థుల వర్ణన. వాళ్లిద్దరి సంభాషణలోంచి, అక్కడ ఆరోజు సంగీతపు పోటీ జరగబోతున్నదన్న సమాచారం సరఫరా. మళ్లీ ఆ సత్రం వర్ణన. మొత్తానికి కథకుడి ప్రవేశం. ఇక, ఆ పోటీలో పాల్గొంటున్న ఒక గాయకుడి వర్ణన. అక్కడే ఉన్న ఇంకొకడి వర్ణన. ఇంకో గాయకుడి వర్ణన. ఓ చిన్న రైతు వర్ణన. ఎట్టకేలకు, చిట్టచివరకు ఇక పోటీ ప్రారంభం కాబోతున్నదన్న సమాచారంతో చెవులకి కాస్త మంచి సంగీతం సోకినట్టవుతుంది. ఎనిమిది పేజీలు గడిస్తే గడిచాయి కానీ, అమ్మయ్య! 

కానీ, విధివిన్యాసాలని ఎవరు మాత్రం ఊహించగలరు? ‘అమ్మయ్య!’ అని మనం అనుకునేటంత లోపలే- “ఇప్పుడు ఇక్కడ హాజరైన వారిని పరిచయం చేస్తాను,” అని చెప్పి రచయిత కథని వదిలేసి అక్కడున్నవాళ్ల గురించి వాళ్ల చరిత్రతో సహా మళ్లీ వర్ణన మొదలెట్టేసరికి హతాశులమైపోతాం. ఈ కథ ఏనాటికైనా ముగిసేనా అని అప్పటికే తచ్చాడుతున్న అనుమానం పీఠం వేసుకుని కూర్చోవడానికి సిద్ధపడిపోతూ ఉంటుంది.  

చివరికి పదకొండు పేజీల సుదీర్ఘ సమయం తర్వాత, కథలోని పోటీ ప్రారంభమవుతుంది. అద్భుతంగా సంగీతపరమైన హొయళ్లు పోతూ పాడే మొదటి గాయకుడు పాడటం పూర్తయాక, ఇక రెండోవాడు పాడటం అబ్బే, అనవసరం అని అందరూ అనుకుంటారు. రెండోవాడు ఏం చేస్తాడా అని మనమూ కొంచెం కుతూహలపడతాం.  గొంతు పెట్లిపోతున్నట్టున్నా, తడబాటుతో పాటని మొదలుపెట్టినా, పాటలోని విషయంతో విషాదంతో హృదయంగమమైన పాటని పాడతాడు రెండోవాడు. ఎవరు గెలిచారన్నది తరువాతి కథలోని కీలకాంశం. ఈ పోటీ వరకూ రచయిత బాగా నిర్వహించాడనీ, ఇక కథ ముగిసినట్టేననీ మనం అనుకుంటున్న సమయానికి, కథకి బాహ్యంగా ఉండే ఒక సంఘటనతో కథ ముగుస్తుంది. 

ప్రతి సంవత్సరమూ, క్లాస్‌లో ఈ కథని సాండర్స్ విద్యార్థుల చేత చదివించాక, క్లాస్ మొత్తం నిశ్శబ్దం పరుచుకుంటుందట. ఎలా ఉందని సాండర్స్ అడిగే ప్రశ్నకి సమాధానం రాదు సరికదా, అదే ఇబ్బందికరమైన నిశ్శబ్దం కొనసాగుతుందట చాలాసేపు. తర్వాత ఎవరో తెగించి అంటారట: “నేననుకోవడం… నాకేమనిపించిందంటే… కథ చాలా పక్కదార్లు తొక్కిందని…” ఈ సమాధానం నుంచి పుంజుకున్న ధైర్యంతో కథ చాలా స్లోగా ఉందనీ, కథ జరుగుతున్న ప్రదేశానికి రెండు కిలోమీటర్ల పరిధిలో కనిపించిన ప్రతివాడి గురించీ రాసుకుపోయే లక్షణం టుర్గెనియెవ్‌కి ఉందనీ- ఇలా రకరకాల అభిప్రాయాలు వెల్లడవుతాయట. అణచిపెట్టడం వల్ల మనసుల లోపల గింజుకుంటూ ఉండిపోయిన విషయాలని అందరూ దాదాపుగా బయటపెట్టాక, రిలీఫ్‌తో కూడుకున్న నవ్వులతో క్లాసంతా నిండిపోతుందట!

సరీగ్గా మన అభిప్రాయంతో క్లాస్‌లో ఉన్న అరడజను మంది విద్యార్థులు కూడా ఏకీభవించారు కనక, కథని ఎలా రాయకూడదో చెప్పటానికే ఈ కథని ఉదాహరణగా సాండర్స్ తీసుకుని ఉంటాడని మనకి బలంగా అనిపిస్తుంది. కానీ, ఈ కథ గురించి చర్చని ప్రారంభిస్తూ ఇది ఒక మాస్టర్‌పీస్ అని సాండర్స్ వెలిబుచ్చిన అభిప్రాయం మొదటి ఆశ్చర్యమైతే, కథని ఆయన ఓపిగ్గా వివరించిన పద్ధతీ, ఆ వివరణని మనం అంగీకరించకుండా ఉండలేని పరిస్థితీ తదనంతర ఆశ్చర్యాలు. ఈ కథ గురించి చెప్పాక కథ మీదా, సాండర్స్ విశ్లేషణ మీదా మీకు ఆసక్తి కలగవచ్చు. మీ ఆసక్తిని చెడగొట్టకుండా ఉండటం కోసం ఇంతకుమించి కథగురించి వివరణ ఇవ్వడం లేదు.

కథాహృదయాన్ని విప్పిచెప్పటంలో సాండర్స్‌కి ప్రత్యేకమైన పద్ధతి ఉంది. కథని మనం చదువుతూ పోతున్నప్పుడు, కథలో మనం పరిశీలించే విషయాలు (“Things I Can’t Help Noticing” అని వీటికి సాండర్స్ పేరు పెట్టారు. సంక్షిప్తంగా, TICHN) – అవి కథాసంబంధమైనవి కావచ్చు, శిల్పసంబంధమైనవీ కావచ్చు, ఇమేజరీ కావచ్చు, ఫోకస్ ఎక్కువైన కొన్ని విషయాలూ కావచ్చు – పేరుకుపోతుంటాయంటారు. అన్నిటికీ తక్షణమే సమాధానాలు దొరకవు కాబట్టి వీటన్నిటినీ మనం TICHN కార్ట్‌లో వేసుకుంటూ కథ ముగింపు వరకూ వస్తాం. కథనుంచి మనం బయటకి వచ్చే సమయానికి, ఆ కార్ట్‌ని ఖాళీ చేసి చూపించే కథ మంచికథ కాగల అవకాశాలు చాలా తక్కువ. మంచికథ, కథ ముగింపు సమయానికి ఆ TICHN కార్ట్‌లోని విషయాలని తన బలాలుగానూ, కథ తాలూకు విలువలుగానూ మార్చుకుంటుంది. 

ఇంతకుముందే చెప్పినట్టుగా – ఎక్కడికక్కడ పోలికలు సృష్టించి చెప్పటం సాండర్స్‌కి అలవాటు. బోధన వల్ల అలవడింది బహుశా రచయిత కావడం వల్ల స్థిరపడిపోయి ఉంటుంది. అలా పోలికలతో సహా చెప్పటం, వీలైనంతవరకూ వాటికి హాస్యాన్ని జతచేసి చెప్పటం పుస్తకాన్ని సులభంగా చదవడానికి దోహదం చేస్తుంది. కథ ఒక కాండీ ఫాక్టరీ లాంటిదిట. అందులో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, పాకింగ్, డిస్ట్రిబ్యూషన్ లాంటి విభాగాలు ఉంటే సహజంగానే ఉంటుంది కానీ, అక్కడో వెడ్డింగ్ కన్సల్టెంట్ ఆఫీస్ ఉంటే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఊహించండి అని పోలుస్తారు. కథకి సంబంధించకుండా విడిగా మనకి అక్కడక్కడా కొన్ని కథల్లో కనిపించే భాగాలూ ఇలాంటి కన్సల్టేషన్ ఆఫీసులే! ఇలాంటి ఉదాహరణలు పుస్తకంలో ఇంకా చాలా చాలా ఉన్నాయి. 

మంచికథని, ఇది మంచికథే అని చెప్పటానికి చాలా తక్కువ సాధనాలు సరిపోతాయి. అలాంటి కథల్లో ప్రస్ఫుటంగా కనిపించే వస్తువో, సార్వజనీతతో, శిల్పమో మరోటో ఉంటుంది. ఇవేవీ అంతలా కొట్టవచ్చినట్టు కనిపించని కథలని మనం కథలు కాదని కొట్టిపారేయగలమా? మనకి అప్పటివరకు ఉన్న అవగాహన మేరకు నిరభ్యంతరంగా ఆ పని చేయవచ్చు- సాండర్స్ లాంటి విమర్శకుడు మన అభిప్రాయాన్ని తప్పని నిరూపిస్తే తప్ప. నిజానికి సరైన విమర్శ చేయవలసిన పని అదే- మరింత సాహిత్యాన్ని మరింతమంది పాఠకులకి ఒప్పించగలిగిన పద్ధతిలో చేర్చగలగడం. 

కథలని వివరిస్తానని మొదలుపెట్టిన సాండర్స్, రచయితల హృదయాలలోకి కూడా సమాంతరంగా తొంగిచూస్తూ అన్యాపదేశంగా రచయితల దగ్గర కథ ఎలా రూపుదిద్దుకుంటుందో చూపిస్తారు. ఇలా పాఠకుడి పక్షాన కొంతా, రచయిత పక్షాన కొంతా నిలబడే సాండర్స్ చేస్తున్న మూడోపని కూడా ఒకటుంది. అది సమర్థవంతమైన విమర్శకుడి పాత్ర.

సాండర్స్ పోషిస్తున్న ఈ పాత్రలన్నీ అంతిమంగా ఒకటే. ఈ పాత్రలన్నిటికీ ప్రేరణ కూడా ఒకటే. అది- కథాసాహిత్యం పట్ల ఉన్న మక్కువ. అది సాండర్స్ విషయంలో పుష్కలంగా ఉంది.  ఆ విషయం సంపూర్ణంగా తెలుసుకోవడానికి, పుస్తకంలోని మిగతా నాలుగు కథలు- Master and Man (Leo Tolstoy), The Nose (Nikolai Gogol), Gooseberries (Anton Chekhov), Alyosha the Pot (Leo Tolstoy), వాటి విశ్లేషణలు సహాయపడతాయి.

ఇంతా చేసి, ఇంత మంచిపాఠాలు చెప్పిన క్రెడిట్ తనే తీసేసుకుందామన్న ఉద్దేశం సాండర్స్‌కి బొత్తిగా ఉన్నట్టు లేదు. పుస్తకానికున్న సబ్‌టైటిల్‌ని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది: “In Which Four Russians Give a Master Class on Writing, Reading and Life.” 

పాఠాలు నేర్పి విజ్ఞత నేర్పిన ఆ మాస్టర్స్ పట్ల అది సాండర్స్ తరహా కృతజ్ఞత!


ఎ.వి. రమణమూర్తి
ఎ.వి. రమణమూర్తి

కథాసాహిత్యం, విమర్శ అభిమాన విషయాలు. ముప్ఫై యేళ్ల బాంక్ ఉద్యోగం నుంచి పదవీ విరమణ తర్వాత, సాహిత్యాన్ని మరింత దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. శ్రీకాకుళం ‘కథానిలయం’ కోసం సాంకేతిక సహకారం అందిస్తున్నారు. అడపాదడపా పత్రికల్లో వ్యాసాలూ, సమీక్షలూ. హైదరాబాద్‌లో నివాసం.

Previous Post

ప్రముఖుల అనువాద  కథ : స్వాయంభువ మూర్తి

Next Post

‘కథాభారతి’కి అనువాద హారతి

Next Post
‘కథాభారతి’కి అనువాద హారతి

‘కథాభారతి’కి అనువాద హారతి

Discussion about this post

ఈ సంచికలో…

  • Bitcoin Online Casinos: An Overview to Online Gambling with Cryptocurrency
  • Dime Slots totally free: A Comprehensive Guide
  • Kann Plinko Ihr neues Lieblingsspiel im Casino werden
  • Whatever You Need to Know About Free Rotates in Online Betting
  • Беттинг на спортивные события в виртуальном казино
  • Даровая игровая сессия в интернет-казино без регистрации: опции и лимиты.
  • Better 8 casino Prospect Hall casino Local casino Greeting Incentives 2025 $6000 Match & No deposit
  • Online Gambling Establishments that Accept Neteller: A Guide for Gamblers
  • How to Find the most effective Bitcoin Casino Promotions
  • Greatest 2025 Joycasino no deposit bonus 2025 Baccarat Casinos on the internet
  • Beste angeschlossen bruce bet Bewertungen Deutschland Casinos qua schneller Ausschüttung: 2025 fix
  • Заголовок статьи
  • Заголовок статьи
  • Заголовок статьи
  • Enjoy Poker On the internet for real Club Player casino bonuses Currency Finest Poker Internet sites in the 2025
  • Multihand Black-jack by the Practical Play casino 777 casino instant play Demo Enjoy Totally free Gambling establishment Online game
  • Better On the web Black-jack Web sites All of us Play Blackjack casino paddypower sign up Online
  • On line Black-jack: Free Play, Regulations & deposit bonus new member 200 Real money Web sites to possess 2025

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • Uncategorized
    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • తెలుగువెలుగు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి

    Developed by : www.10gminds.com