రష్యన్ మూలం : మక్సీమ్ గోర్కీ
తెలుగు అనువాదం : కేశవ్ గోపాల్
శాన్ గి యొకోమొ ప్రాంతానికి అక్కడి ఫౌంటెన్ నిజంగానే గర్వకారణం. శాశ్వత కీర్తి గాంచిన కవి, రచయిత జోవనీ బొకాబొ ఆ ఫౌంటెన్ పక్కన విశ్రాంతి తీసుకోడానికీ, కబుర్లు చెప్పడానికీ ఇష్టపడేవాడు. పేద ప్రజల స్వేచ్ఛకోసం పోరాడి ప్రాణాలర్పించిన టొమాజొ అని యెల్లొ లేదా మజాని యెల్లొ కూడా ఆ ప్రాంతంలోనే జన్మించాడు.
నిజానికి, ఎందరో ప్రఖ్యాత వ్యక్తులు అక్కడ పుట్టిపెరిగారు. అలాంటి వ్యక్తులు మునుపటికన్నా ఎక్కువమంది అక్కడ జన్మించారు.
గత వేసవి వరకూ నన్చియా కూడా ఆ ప్రాంతానికి గర్వకారణంగా వుండేది. నన్చియా కూరగాయలు అమ్మేది. పట్టణంలోని ఆ ప్రాంతంలో తక్కిన ప్రదేశాల కన్నా అక్కడ బాగా ఎండకాసేది. ప్రపంచంలో అందరికంటే ఉల్లాసంగా వుండేది. ఆమె అక్కడి అందాల రాశి. ఫౌంటెన్ ఒకప్పుడు ఎలా వుండేదో ఇప్పుడూ అలాగే వుంది. కాకపోతే కాలక్రమేణా కొంచెం పసుపువన్నెకు తిరిగింది. వింతగొలిపే అందంతో విదేశీయులకు ఆనందాన్ని కలిగిస్తూనే వుంటుంది. పాలరాతితో చెక్కిన బాలుర శిల్పాలు ఎప్పటికీ పాతబడవు. వాళ్లు ఆడే ఆటల్లో ఎప్పటికీ అలసిపోరు.
కానీ, అందాల నన్చియా గత వేసవిలో నృత్యం చేస్తుండగా నడివీధిలోనే కన్నుమూసింది. సాధారణంగా ఇలాంటి మరణాలు అరుదు కాబట్టి ఆ కథ చెప్పుకోదగింది.
నన్చియా ఎప్పుడూ ఉల్లాసంగా వుండేది. స్నేహశీలి. భర్త ఎలాంటి వాడైనా ప్రశాంతంగా జీవించగల మనిషి. ఆమె భర్త చాలా కాలం వరకూ ఈ విషయం అర్థం చేసుకోలేకపోయాడు. అతడు కేకలు వేస్తూ, శాపనార్థాలు పెడుతూ, చేతులు వూపుతూ అందర్నీ కత్తితో బెదిరిస్తూ వుండేవాడు. ఒకరోజు ఎవరి డొక్కలోనో పొడిచాడు. పోలీసులకు ఇలాంటి తమాషాలు నచ్చక స్టెఫానో అనే అతణ్ణి జైల్లో పెట్టారు. జైలు శిక్ష ముగిసింతర్వాత అతడు అర్జెంటీనాకు వెళ్లిపోయాడు: కోపిష్టి మనుషులకు గాలి మార్పు చాలా మంచిది.
దాంతో, ఇరవై మూడేళ్ల నన్చియా ఏడేళ్ల కూతురితో, రెండు గాడిదలతో, ఒక కూరగాయల తోట, చిన్నతోపుడు బండితో ఒంటరిగా మిగిలిపోయింది. అన్నిట్నీ తేలిగ్గా తీసుకునే మనిషి కాబట్టి ‘అంతే చాలు’ అనుకుంది. కష్టపడి పనిచేయడం ఆమె స్వభావం. అంతేగాక, ఆమెకు సాయపడ్డానికి ఎంతోమంది ఆసక్తి చూపేవారు. పనివాళ్లు చేసిన కష్టానికి ప్రతిఫలం చెల్లించడానికి డబ్బులు చాలకపోతే, అంతకంటే విలువైన చిరునవ్వులతో, పాటలతో రుణం తీర్చుకునేది.
నిజమే! ఆమె జీవన విధానాన్ని స్త్రీలందరూ గానీ, పురుషులందరూ గానీ సమర్థించేవారు కాదు. కానీ మనసులో కల్మషం లేదు కాబట్టి వివాహిత పురుషుల జోలికి వెళ్లేది కాదు. అంతేగాక అప్పుడప్పుడూ వాళ్లకు తమ భార్యలతో రాజీ కుదిర్చేది.
‘‘ఒక స్త్రీతో ప్రేమబంధం నుంచి విడిపోతే ఆ వ్యక్తి ఆమెను నిజంగా ఎప్పుడూ ప్రేమించలేదనే అర్థం..’’ అని నన్చియా అంటూ ఉండేది.
అర్టూరొ లాన్సో అనే జాలరి యువకుడుగా వున్నప్పుడు చర్చిపూజారి హోదా కోసం ఒక సెమినరీలో శిక్షణ పొందాడు. కానీ సన్మార్గం నుంచి దారితప్పి సముద్రానికి, సారాకొట్లు లాంటి విలాస స్థలాలకు అలవాటు పడి అల్లరి చిల్లరి పాటలు పాడటంలో ఆరితేరాడు. ఒకసారి అతడు:
‘‘ప్రేమంటే వేదాంతంలాంటి జటిలమైన శాస్త్రం అని నువ్వు అనుకుంటున్నావా’’ అన్నాడు నన్చియాతో.
‘‘శాస్త్రాల గురించి నాకేం తెలీదు. నాకు తెలిసిందల్లా నీ పాటలే’’
అని బదులిచ్చింది నన్చియా. పీపాలావున్న అర్టూరోకు ఇలా పాడి వినిపించింది.:
అప్పుడది వసంతం.
ఎప్పుడూ జరిగేది అంతే.
మేరీమాత తన పుత్రునికి
జన్మనిచ్చింది వసంతంలోనే
అతడు పకపకా నవ్వేవాడు. అప్పుడతని కళ్లు ఎర్రటి బుగ్గల మడతల్లో మాయమయ్యేవి.
అలా నన్చియా తనకు తాను ఆనందిస్తూ, ఎంతోమందిని సంతోషపెడుతూ అందరికీ నచ్చేలా జీవించింది. కాలం గడిచేకొద్దీ- ఒక వ్యక్తి తన సహజ స్వాభావాన్ని మార్చుకోలేడని, సాధువులు సైతం తమ రాగద్వేషాలను జయించలేకపోయారని గ్రహించిన స్నేహితురాళ్లు ఆమెను క్షమించారు. అంతేగాక, మనిషి దేవుడు కాడనీ, దేవునికి మాత్రమే మనిషి విశ్వసనీయంగా వుండాలనీ అర్థం చేసుకున్నారు.
నన్చియా సుమారు పదేళ్లపాటు నక్షత్రంలా ప్రకాశించింది. ఆ ప్రాంతంలోని గొప్ప అందగత్తెగా, అత్యుత్తమ నాట్యగత్తెగా అందరి మెప్పు పొందింది. ఒకవేళ కన్యగా వుండివుంటే నిస్సందేహంగా మార్కెట్ రాణిగా ఎంపికయ్యేది. నిజానికి అందరూ అలాగే భావించేవాళ్లు.
ఆమెను విదేశీయులకు కూడా అలాగే పరిచయం చేసేవాళ్లు. వారిలో చాలామంది ఆమెతో ఒంటరిగా సంభాషించాలని అభిలషించేవాళ్లు. అది చ ూసి ఆమె మనసారా నవ్వుకునేది.
‘‘వడలిపోయిన ఆ మహాశయుడు నాతో ఏ భాషలో మాట్లాడతాడు?’’ అని ఆమె అడిగేది.
‘‘బంగారు నాణేల భాషలో మాట్లాడుతాడు మూర్ఖరాలా!’’ అని పెద్దమనుషులు హామీ ఇచ్చేవాళ్లు. కానీ ఆమె ఇలా జవాబిచ్చేది:
‘‘నా దగ్గర ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమోటాలు తప్ప అపరిచితులకు అమ్మేందుకు మరేమీ లేవుకదా!’’
కొన్నిసార్లు, ఆమె మేలుకోరేవాళ్లు ఆమెను ఒప్పించడానికి నిజాయితీగానే ప్రయత్నించేవాళ్లు.
‘‘నన్చియా! ఒక్క నెల చాలు- నువ్వు ధనికురాలివైపోతావు..! దీని గురించి బాగా ఆలోచించు. పైగా, నీ కొక కూతురు కూడా వుందని గుర్తుంచుకో’’
‘‘లేదు!’’ అని ఆమె గట్టిగా అభ్యంతరం చెప్పేది. ‘‘నా శరీరాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. దాన్ని అవమానించలేను. ఒక్కసారి అయిష్టంగా ఏదైనా చేస్తే, మన ఆత్మగౌరవం శాశ్వతంగా మట్టిలో కలుస్తుంది’’
‘‘కానీ నువ్వు ఇతరులను తిరస్కరించడం లేదు కదా?’’
‘‘లేదు! నా సొంతం అనుకున్నప్పుడు… అదీ నేను కోరుకున్నప్పుడు.’’
‘‘నా సొంతం అంటే ఏమిటి?’’
‘‘నేను ఎవరి మధ్య పుట్టి పెరిగతానో వాళ్లు. నన్ను అర్థం చేసుకునేవాళ్లు’’ అని ఆమె టక్కున జవాబిచ్చేది.
కానీ, ఆమెకు ఆంగ్లేయుడైన ఒక ఫారెస్టర్‌తో, మౌనంగా ఉండే ఒక వింత వ్యక్తితో సంబంధం వుండేది. ఇటాలియన్ భాష మాట్లాడేవాడు. చిన్న వయసే అయినా జుత్తు నెరిసిపోయింది. ముఖం మీద గాయం మచ్చ వుండేది. దొంగముఖం. సాధువు కళ్లు. అతడు పుస్తకాలు రాశాడని కొందరన్నారు. జూదగాడని మరికొందరన్నారు. ఆమె అతనితో కలిసి సిసిలీకి కూడా వెళ్లి బక్కచిక్కిన రూపంతో తిరిగొచ్చింది. అతడు ధనవంతుడు కూడా అయివుండడు. ఎందుకంటే నన్చియా తిరిగొచ్చినప్పుడు డబ్బుగానీ, కానుకలు గానీ తనతో తీసుకురాలేదు. మామూలుగా మళ్లీ తన వాళ్ల మధ్య మునుపటిలాగా ఆనందంగా కాలం గడపసాగింది.
కానీ, ఒక పర్వదినాన జనం చర్చిలోంచి బయటికొస్తున్నప్పుడు ఎవరో ఆశ్చర్యంతో ఇలా వ్యాఖ్యానించారు:
‘‘చూడండి! నీనా అచ్చంగా తన తల్లిని తలపించేలా మారుతున్నట్లుంది!’’
నిజమే! నన్చియా కూతురు నీనా- తన తల్లిలాగే మెరిసే నక్షత్రంలా వికసించింది. ఆ అమ్మాయికి పద్నాలుగేళ్లే… కానీ పొడుగ్గా, దట్టమైన జుత్తుతో, గర్వించదగ్గ కళ్లతో తన వయసుకు మించి పరిపూర్ణ స్త్రీలాగా కనిపిస్తోంది చూపరులకు.
స్వయంగా నన్చియా కూడా తన కూతుర్ని చూసి చకితురాలైంది.
‘‘మేరీమాత మీద ఒట్టు! నీనా? నిజంగా నువ్వు నాకంటే అందంగా వుండాలనుకుంటున్నావా?’’ అని ప్రశ్నించింది కూతుర్ని.
ఆ అమ్మాయి నవ్వుతూ, ‘‘లేదు! నీ అంత అందంగా వుండాలనుకుంటున్నా. అది చాలటు నాకు!’’ అని జవాబిచ్చింది.
సరదాగా వుండే నన్చియా ముఖంలో మొదటిసారి నీలినీడ కనిపించింది. ఆ రోజు సాయంత్రం తన స్నేహితురాళ్లతో ‘‘జీవితమంటే ఇదే! మనం గ్లాసులో పోసుకున్న మధువు సగం తాగేలోగా మరొక చెయ్యి దానికోసం ముందుకొస్తుంది…’’ అంది.
మొదటల్లో తల్లీకూతుళ్ల మధ్య శత్రుత్వ ఛాయ స్పష్టంగా కనిపించలేదు. కూతురు నిరాడంబరంగా, జాగ్రత్తగా నడుచుకుంది. అర్థనిమీలిత నేత్రాలతో కనురెప్పల గుండా ప్రపంచాన్ని పరికించింది. పురుషులముందు అరుదుగా నోరు విప్పేది. తల్లి కళ్లు మరింత అత్యాశతో మెరిసేవి. స్వరం మునుపటికన్నా ఆకర్షణీయంగా ధ్వనించేది.
సూర్యుని తొలికిరణాలు తాకినప్పుడు సూర్యోదయ వేళ్ తెరచాపలలాగా నన్చియా సమక్షంలో జనాల ముఖాలు రాగరంజితమయ్యేవి. నిజమే! ప్రేమకోసం పరితపించే దినాన చాలామందికి ఆమె తొలికిరణం లాంటిది. ఆమె తన స్వరం ఇళ్ల కప్పుల మీద ప్రతిధ్వనిస్తుండగా నిటారుగా, నాజూగ్గా వీధివెంట తన చిన్న బండి పక్కన నడుస్తుంటే జనం నిశ్శబ్ద కృతజ్ఞతతో క ళ్లార్పకుండా తిలకించేవాళ్లు. మార్కెట్‌లో కూడా తెల్లని గోడనేపథ్యంలో ఒక మహాకళాకారుడు సృజించిన వర్ణచిత్రంలా రంగురంగుల కూరగాయల రాశి ముందు నిల్చుని వుండగా చూపరులకు మనోహరంగా కనిపించేది. శాన్‌గియొకొమొ చర్చి పక్కన ఎడమవైపు మెట్ల దగ్గర వుండేది ఆమె స్థలం. ఆ మెట్లకు మూడు అడుగుల దూరంలో ఆమె కన్నుమూసింది. హాస్యోక్తులు, నవ్వులు, పాటలు వెదజల్లుతూ నిల్చుని వుండే ఆమె కాంతివంతమైన జ్వాలలా అందంగా కనిపించేది. ఆమె పాటలు జనం శిరస్సులపై వుల్లాసకరమైన నిప్పురవ్వల్లా వ్యాపించి వుండేవి.
గాజుపాత్రలో మంచి ద్రాక్షాసవం ఆకర్షణీయంగా కనిపించినట్లుగా తన అందాన్ని ఇనుమడింపజేసేటట్లు దుస్తులు ధరించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. గాజుపాత్ర ఎంత పారదర్శకంగా వుంటే మధువు ఆత్మను అంత బాగా వ్యక్తం చేస్తుంది. రంగు- రుచిని పెంచుతుంది- మధువు! దేవుడా.. మనిషికి తన నిరుపేద ఆత్మను ఆవరించిన అలుపును పోగొట్టుకుని కొంచెం వుత్తేజం పొందడానికి ఒక గ్లాసెడు ద్రాక్షాసవం సేవించే అవకాశం లేకపోయివుంటే వ్యథాభరితమైన ఈ ప్రపంచం జీవించడానికి బొత్తిగా యోగ్యమైనదిగా వుండేది కాదు.
నన్చియా తన చుట్టూ వున్న వారిని, తన అనుగ్రహాన్ని పొందాలని కాంక్షించేవారిని ఆహ్లాదకరమైన ఆలోచనలతో వుత్తేజపరుస్తూ అక్కడ నిల్చుని వుండేది. ఒక అందాల రాశి సమీపంలో వున్నప్పుడు ఏ పరుషుడూ నేపథ్యంలో వుండలేడు. తనను తాను మించిపోయేందుకు ప్రయత్నిస్తాడు. నన్చియా ఎంతో మంచి చేసింది. అనేక శక్తులను మేల్కొలిపింది. మంచి ఎప్పుడూ మరింత వుత్తమమైన కోరికలను ప్రేరేపిస్తుంది.
ఆ విధంగా, కూతురు నీనా మరింత తరచుగా తల్లిపక్కన ప్రత్యక్షమౌతూ వచ్చింది.- నిరాడంబరమైన సన్యాసినిలా, ఒరలో ఒదిగిన కత్తిలా పురుషులు స్త్రీలను ఒకరితో మరొకర్ని పోలుస్తారు. స్త్రీల మనోభావాలు ఒక్కొక్కసారి ఎలా వుంటాయో, జీవితం స్త్రీ పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించగలదో బహుశ కొందరు అర్థం చేసుకోవడం మొదలెడతారు. కాలం తన అడుగుల వేగం పెంచుతూ ముందుకు సాగుతుంది. కాలంతో పోలిస్తే మనుషులు ఒక సూర్యకిరణంలోని ధూళివంటివారు. దట్టమైన నన్చియా కనుబొమలు మరీ తరచుగా ముడిపడేవి. కొన్నిసార్ల పెదవి కొరుక్కునేది. ఒక జూదరి మరొక జూదరిని ఎలాచూస్తాడో అలా తన కూతుర్ని చూసేది. కూతురి దగ్గర ఎలాంటి పేకముక్కలున్నాయో ఊహించడానికి ప్రయత్నించేది.
ఒక ఏడాది గడిచింది; మరొక ఏడాది కూడా.. కూతురు తల్లికి దగ్గరయ్యింది; అలాగే మరింత దూరమయ్యింది. అప్పుడు వాళ్లిద్దరిలో ఎవరివైపు చూపులు సారించాలో యువకులకు అర్థం కాలేదని అందరికీ తెలిసొచ్చింది. నన్చియా స్నేహితురాళ్లు- దురద వున్న చోటే కొరకడానికి ఇష్టపడుతూ- అడిగారు.
‘‘ఏంటి నన్చియా! నీ కూతురు నిన్ను మించిపోతుందా?’’
నన్చియా నవ్వి ‘‘చంద్రకాంతిలో కూడా పెద్ద నక్షత్రాలు కనిపిస్తాయి’’ అని జవాబిచ్చింది.
ఒక తల్లిలా నన్చియా తన కూతురి అందాన్ని చూసి గర్వించింది. ఒక స్త్రీగా నీనా యవ్వనాన్ని చూసి అసూయపడకుండా వుండలేకపోయింది. నీనా ఆమెకూ సూర్యునికీ మధ్య నిలబడింది. నీడలో జీవించడం ఆమెకు అసహ్యం.
లాన్యో ఒక కొత్త పాట స్వరపరిచాడు. అందులోని తొలిపదాలు ఇలా వున్నాయి:
నేను పురుషుణ్ణయితే
అంత అందమైన అమ్మాయికి
జన్మనిమ్మని
నా ప్రియురాలితో అంటాను…
నన్చియా ఆ పాట పాడదలచుకోలేదు. ‘‘నువ్వు ఇంకొంచెం తెలివిగా ప్రవర్తించివుంటే మనం మరింత మెరుగ్గా జీవించగలిగేవాళ్లం’’ అని నీనా తన తల్లితో అన్నట్లు పుకారు పుట్టింది.
కూతురు తన తల్లితో ఇలాచెప్పే రోజు రానేవచ్చింది:
‘‘అమ్మా! నువ్వు నన్ను మరీ ఎక్కువగా నీడలో పెట్టావు. నేనిప్పుడు చిన్నపిల్లను కాదు. నేను కూడా జీవించాలనుకుంటున్నాను. నువ్వు ఆనందంగా జీవించావు. అలా జీవించడం ఇప్పుడు నా వంతు కాదా?’’
‘‘ఏమిటి విషయం?’’ అని తల్లి ప్రశ్నించింది. కానీ కూతురి వుద్దేశమేమిటో అర్థమై అపరాధభావంతో తలదించుకుంది.
దాదాపు ఆ సమయంలో ఎన్రికో బోర్టన్ ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చాడు. కోరింది అనుభవించడానికి బాగా డబ్బు సంపాదించే అవకాశమున్న అద్భుత దేశం అది. అక్కడతడు కట్టెలు కొట్టేవాడు. తన మాతృభూమిలో కొంతకాలం వెచ్చదనాన్ని పొందటానికి ఇంటికొచ్చాడు. మళ్లీ మరింత స్వేచ్ఛగల ఆ దేశానికి వెళ్లిపోవాలనుకున్నాడు. అతని వయసు ముప్ఫైఆరు. గడ్డంతో వుల్లాసకరమైన స్వభావం.. శక్తివంతుడు.. తన సాహసాల గురించి, దట్టమైన అడవుల్లో జీవితం గురించి అద్భుతమైన కథలు చెప్పేవాడు. అతడు కల్పించి చెప్తున్నాడని అందరూ భావించారు. కానీ, తల్లీకూతుళ్లు ఇద్దరూ వాటిని నమ్మారు.
‘‘ఎన్రికో నిను ఇష్టపడుతున్నాడని తెలుసు! కానీ నువ్వు అతనితో సరసాలాడుతున్నావు. దాంతో అతనికి మతిపోతోంది. నువ్వు నాకు అవకాశాలను దక్కకుండా చేస్తున్నావు’’ అంది నీనా తల్లితో.
‘‘నాకు అర్థమైంది.. సరే.. నువ్వు నీ తల్లిమీద ఫిర్యాదు చేసే అవసరం ఇక మీదట వుండదు’’ అని చెప్పింది నన్చియా.
ఎన్రికోకు తనంటే ఇష్టమని అందరికీ తెలుసు. కానీ, నన్చియా నిజాయితీగా అతనికి దూరమైంది.
అయితే, సులభంగా దక్కే విజయంతో విజేతలకు గర్వం తలకెక్కుతుంది. ముఖ్యంగా వాళ్లింకా చిన్నవాళ్లయితే, ఫలితం దారుణంగా వుంటుంది.
నీనా తన తల్లితో అనుచితంగా మాట్లాడ్డం మొదలెట్టింది. ఆపై- ఒకరోజు శానిగియొకోమొ దినోత్సవం నాడు ప్రజలంతా సరదాగా గడుపుతున్న సమయం.. నన్చియా అప్పటికే టరాన్టెల్లా నృత్యం అద్భుతంగా చేసింది. అప్పుడు అందరూ వినేటట్లు ఆమె కూతురు నీనా వ్యాఖ్యానించింది.
‘‘నువ్వు మరీ ఎక్కువగా నృత్యం చేస్తున్నావు. ఈ వయసులో ఇది నీ గుండెకు ప్రమాదకరం కావచ్చు.’’
మృదుస్వరంతో అన్నప్పటికీ అవమానకరమైన ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ క్షణం పాటు మౌనంగా వుండిపోయారు. కానీ నన్చియా కోపోద్రేకంతో గట్టిగా అరిచింది:
‘‘నా గుండె.. నా గుండె గురించి నువ్వు కంగారుపడుతున్నావా? సరే అమ్మాయ్.. ధన్యవాదాలు! కానీ ఎవరి గుండె గట్టిదో తేల్చుకుందాం’’ ఒక్క క్షణం ఆలోచించి నన్చియా సవాలు చేసింది.
‘‘నేను ఇక్కణ్ణించీ ఫౌంటెన్ దాకా, మళ్లీ వెనక్కు మూడుసార్లు ఆగకుండా నీతోపాటు పరుగెడతాను..’’
ఈ మొత్తం తతంగమంతా చాలా మందికి అసంబద్ధ ఆలోచనగా తోచింది. దీన్ని కొందరు అపకీర్తిగా భావించారు. కానీ ఎక్కువమంది నన్చియా పట్ల గౌరవం కారణంగా ఆమె ప్రతిపాదనను సమర్థించారు. నీనా తన తల్లి సవాలును అంగీకరించాలని పట్టుబట్టారు. న్యాయనిర్ణేతల ఎంపిక జరిగింది. పందెం కాలపరిమితిని నిర్ణయించారు. కచ్చితమైన నియమాలను ప్రకటించారు. తల్లి గెలవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నన్చియాకు మేరీమాత సాయం చేయాలని, శక్తినివ్వాలని అనేకమంది స్త్రీ పురుషులు ప్రార్థించారు.
తల్లీకూతుళ్లు ఒకరి ముఖాలొకరు చూసుకోకుండా పక్కపక్కనే నిలబడ్డారు. గంటమోగింది. వీధివెంట చౌకు వరకూ పరుగుపందెం మొదలైంది. రెండు పెద్ద పక్షుల్లాగా తల్లి తలకు ఎర్ర రుమాలుతో, లేత నీలం రంగు రుమాలుతో కూతురు.
పందెం మొదలైన కొన్ని నిముషాల్లోనే కూతురుకంటే తల్లి శక్తివంతంగా, తేలికగా అడుగులేస్తోందనీ, ఆమే గెలుస్తుందనీ స్పష్టంగా తేలిపోయింది. నన్చియా స్వేచ్ఛగా, అందంగా పరుగెత్తింది. ఆ పరుగు తీరు బిడ్డను భూమి తల్లి తన చేతుల మీద మోస్తున్నట్టు అనిపించింది. ప్రజలు కిటికీలలోంచి, కాలిబాటల నుంచి నన్చియా పాదాల మీదికి పూలవర్షం కురిపించారు. చప్పట్లు కొడుతూ హర్షధ్వనాలతో ప్రోరత్సహించారు. రెండోసారి ఆమె తన కూతురికన్నా నాలుగు నిముషాలకు మించి ముందుంది. కానీ, నీనార మనస్తాపంతో వైఫల్యం చెంది కన్నీటి పర్యంతమై వూపిరి సలపక చర్చిమెట్లపై కూలిపోయింది. మూడోసారి పరుగెత్తలేకపోయింది.
నన్చియా తేలిగ్గా కూతురి మీదికి వంగి, అందరితో పాటు నవ్వుతూ, జారిపోయిన నీనాజుత్తు బలమైన చేత్తో నిమురుతూ ‘‘బిడ్డా! ఆటలో, పనిలో, ప్రేమలో అన్నిటికన్నా శక్తివంతమైనది స్త్రీ హృదయం. ఇది జీవిత పరీక్షలో నిగ్గుదేలిన నిజం అని నువ్వు తెలుసుకోవాలి.. ఈ విషయం ముప్ఫై యేళ్లు పైబడిన తర్వాత నీకు తెలిసొస్తుంది. బాధపడొద్దు’’ అంటూ సముదాయించింది.
పరుగుపందెం తర్వాత విశ్రాంతి తీసుకోకుండా టరాన్టెల్లా సంగీతం కావాలని కోరింది నన్చియా.
‘‘నాతో ఎవరు నృత్యం చేస్తారు?’’
ఎన్రికో ముందుకొచ్చాడు. టోపీ తీసేసి ఆ మహిమాన్విత మహిళకు గౌరవంగా తలవంచి అభివాదం చేశాడు.
తర్వాత హుషారు గొలిపే నృత్యం మొదలైంది. లయకు అనుగుణంగా గలగలమంటూ డిక్కీ వాద్యం తోడైంది. చాలాకాలంపాటు మాగబెట్టిన ముదురు ద్రాక్షాసవంలా కైపెక్కిస్తూ, నన్చియా గుండ్రంగా గిరగిరా తిరిగింది. సర్పంలా మెలికలు తిరిగింది. గొప్ప భావావేశంతో కూడిన నృత్యాన్ని బాగా ఆకళింపు చేసుకుని నర్తించింది. ఆమె అందమైన, అజేయమైన సూక్ష్మకదలికలు పరిపూర్ణ ఆనందాన్ని కలిగించాయి చూపరులకు.
అలా చాలాసేపు ఎంతోమందితో జంటగా నృత్యం చేసింది. పురుషులంతా అలిసిపోయారు. కానీ ఆమెకు తనివి తీరలేదు.
‘‘రా ఎన్రికో.. ఇంకొక్కసారి.. చివరిసారి!’’ అని ఆమె అరిచే సమయానికి అర్ధరాత్రి దాటింది. మళ్లీ అతనితో కలిసి నృత్యం మొదలెట్టింది నెమ్మదిగా. ఆమె నయనాలు విప్పారాయి. మృదువుగా ప్రకాశిస్తూ తర్వాత హఠాత్తుగా చిన్న కేక ఆమె నోటినుండి వెలువడి, చేతులు పైకెత్తి విరిగిన తరువులా నేలకూలింది.
ఆమె గుండెపోటుతో మరణించిందని డాక్టర్ చెప్పాడు. బహుశ..
![]()
1906- 1913 మధ్య కాలంలో రాసిన ఇటలీ కథల్లో ఒకటి. 1910లో ప్రచురితం.
కొన్ని వివరణలు :
=) శాన్‌గియొకోమొ- ఇటలీలోని ఆల్ఫ్ పర్వత పాదభాగాన టెన్‌ట్రియానొ ప్రావిన్స్‌లో ఒక పట్టణం. వాస్తు కళకు, ఇదే పేరుతో ప్రసిద్ధ చర్చికి (14వ శతాబ్దం, ప్రకృతి దృశ్యాలకు పేరుగాంచింది.
=) జోవనీ బొకాబొ: (1313- 1375) ప్రసిద్ధ ఇటాలియన్ కవి, రచయిత, పాత్రికేయుడు.
=) టొమాజో అనియెల్లొ (మజానియెల్లొ 1620- 1647). 1647లో నేపుల్స్‌లో హాస్ బుర్స్ స్పెయిన్ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన జాలరి. హత్యకు గురయ్యాడు.

ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో సీనియర్ రష్యన్ డిప్లొమా చేశారు. 6 ఏళ్లు మాస్కోలో అనువాదంలో శిక్షణ పొంది, ఉద్యోగం చేశారు. జర్మన్ భాషతో కూడా పరిచయం ఉంది.
అభిరుచులు: చిత్రలేఖనం,ఫోటోగ్రఫీ, భాషల అధ్యయనం




Discussion about this post