ఉర్దూ : సాదత్ హసన్ మంటో
ఇంగ్లిషు : మ్యాట్ రీక్, అఫ్తాబ్ అహ్మద్
తెలుగు అనువాదం : పి.శ్రీనివాస్ గౌడ్
సరిత సందు మూలలో అమ్మాయిలతో ఆడుకుంటోంది. ఆమె తల్లి చాల్‌లో ఆమె కోసం వెతుకుతోంది. (చాల్ అనేది ఒక పెద్ద భవనం. దానిలో చాలా అంతస్తులు, చాలా చిన్న గదులు ఉంటాయి). సరిత తల్లి కిషోర్‌ని కూర్చోమని అంది. బయట ఉన్న టీ బాయ్ నుండి కాఫీ కలిపిన టీ ఆర్డర్ చేసింది. చాల్ మూడు అంతస్తులలో తన కుమార్తె కోసం అప్పటికే వెతికింది. కానీ సరిత ఎక్కడికి పారిపోయిందో ఎవరికీ తెలియదు.
‘’ఏయ్, సరితా! సరితా!’’ అని బహిరంగ బహిర్భూమికి కూడా వెళ్లి ఆమెను పిలిచింది, కానీ ఆమె భవనంలో ఎక్కడా లేదు. ఆమె తల్లి అనుమానించినట్లే జరిగింది – సరిత లోకమంటే లెక్కా జమా లేకుండా, చెత్తకుప్ప దగ్గర సందు మూలలో ఉన్న అమ్మాయిలతో ఆడుకుంటోంది.
సరిత తల్లి చాలా ఆందోళన చెందింది. కిషోర్ లోపల కూర్చుని ఉన్నాడు. అతను దగ్గరలోని మార్కెట్లో ముగ్గురు ధనవంతులు తమ కారులో వేచి ఉన్నారని అన్నాడు. కానీ సమయానికి సరిత మాయమైంది. కార్లు ఉన్న ధనవంతులు ప్రతిరోజూ తమ దగ్గరకి రారని సరిత తల్లికి తెలుసు. వాస్తవానికి, కిషోర్ వల్లనే నెలకు ఒకటి లేదా రెండుసార్లు ఆమెకు మంచి కస్టమర్లు దొరుకుతారు. లేకపోతే ధనవంతులు ఎప్పటికీ ఆ కుళ్ళిపోయిన కిళ్ళీ, కాలిపోయిన బీడీల దుర్వాసనతో వున్న ఆ పరిసరాల్లోకి రారు. ఆ కంపుకి కిషోర్ ముక్కుపుటాలు మూసుకుపోతాయి.
నిజంగా, ధనవంతులు అలాంటి ప్రదేశాన్ని ఎలా భరించగలరు? కానీ కిషోర్ తెలివైనవాడు, కాబట్టి అతను ఎప్పుడూ ఆ పురుషుల్ని చాల్ వరకు తీసుకురాలేదు. కానీ సరితను బయటకు తీసుకెళ్లే ముందు, ఆమెను మంచి దుస్తులు ధరించమని బలవంతం చేసేవాడు. అతను ఆ వ్యక్తులతో, ‘’సార్, ఈ రోజుల్లో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. పోలీసులు ఎప్పుడూ ఎవరినైనా పట్టుకోవడానికి వెతుకుతూనే ఉంటారు. వారు ఇప్పటికే 200 మంది అమ్మాయిలను పట్టుకున్నారు. నన్ను కూడా కోర్టులో విచారిస్తున్నారు. మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని అంటాడు.
సరిత తల్లికి చాలా కోపంగా ఉంది. ఆమె మెట్ల కిందికి చేరుకునేసరికి, రామ్ దాయి బీడీ ఆకులు కోస్తూ కూర్చుని ఉంది. ‘’నువ్వు సరితను ఎక్కడైనా చూశావా?” సరిత తల్లి ఆమెను అడిగింది. ‘’అది ఎక్కడికెళ్లిందో నాకు తెలియదు. నేను గనక దానిని చూసానా, దాని అంతు చూస్తాను. అదింకా చిన్న పిల్లేం కాదు, అయినా అది రోజంతా ఆ పనికిమాలిన అబ్బాయిలతో తిరుగుతుంది.’’
రామ్ దాయి బీడీ ఆకులు కోయడం కొనసాగిస్తూ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే సరిత తల్లి సాధారణంగా ఇలా గొణుగుతూనే ఉంటుంది. ప్రతి మూడు, నాలుగు రోజులకు ఆమె సరితను వెతుక్కుంటూ వెళ్ళవలసి వస్తుండం వల్ల రామ్ దాయికి ఈ మాటలనే మళ్ళీ చెప్పేది. అక్కడ ఆమె రోజంతా మెట్ల దగ్గర, సిగరెట్ల చుట్టూ ఎరుపు, తెలుపు దారాలను చుట్టుకుంటూ, ముందు బుట్టను పెట్టుకుని కూర్చుని వుంటుంది.
దీనితో పాటు, ‘సరితను ఒక గౌరవనీయమైన వ్యక్తికి ఇచ్చి ఎలా వివాహం చేయబోతున్నదో, తద్వారా ఆమె కొంచెం చదవడం, రాయడం నేర్చుకోవచ్చనీ.. నగరంలోని ప్రభుత్వం దగ్గరలో ఒక పాఠశాలను తెరిచినందువల్ల సరిత తండ్రి ఆమెకు చదవడం, రాయడం నేర్చుకోవాలని కోరుకున్నాడనే’ సొదను ఆ భవనంలోని మహిళలు సరిత తల్లి నుండి ఎప్పుడూ వింటూనే ఉండేవారు. అప్పుడు ఆమె గాఢంగా నిట్టూర్చి తన మరణించిన భర్త కథను చెప్పడం ప్రారంభిస్తుంది. ఇది భవనంలోని అన్ని మహిళలందరికీ కూలంకషంగా తెలుసు. సరిత తండ్రి (రైల్వేలో పనిచేసిన) తన బాస్ తనని తిట్టినప్పుడు ఎలా స్పందించాడోనని కనక మీరు రామ్ దాయిని అడిగితే అప్పుడు రామ్ దాయి వెంటనే.. అతను కోపంగా తన యజమానిని, ‘నేను మీ సేవకుడిని కాదు, ప్రభుత్వ సేవకుడిని. మీరు నన్ను బెదిరించారు. ఇదిగో చూడండి.. మీరు నన్ను మళ్ళీ అవమానిస్తే, నేను మీ దవడ పగలగొడతాను.’ కానీ అతని యజమాని సరిత తండ్రిని అవమానించాడు. కాబట్టి సరిత తండ్రి అతని మెడపై బలంగా కొట్టాడు. యజమాని టోపీ నేలపై పడిపోయింది. అతను దాదాపు కుప్పకూలిపోయాడు. కానీ పూర్తిగా పడిపోలేదు. అతని యజమాని భారీ మనిషి – అతను ముందుకు ఒక అడుగేసి, తన ఆర్మీ బూటుతో సరిత తండ్రి కడుపులో ఎంత బలంగా తన్నాడంటే సరిత తండ్రి ప్లీహము పగిలిపోయింది. అతను అక్కడే రైల్వే పట్టాల దగ్గర పడిపోయి చనిపోయాడు. ప్రభుత్వం ఆ యజమానిని విచారించి సరిత తల్లికి 500 రూపాయలు చెల్లించమని ఆదేశించింది, కానీ కాలం కలిసి రాకపోవడం వల్ల సరిత తల్లి పేకాట ఆడి, ఐదు నెలల్లోపు మొత్తం డబ్బు పోగొట్టుకుంది.
సరిత తల్లి ఎప్పుడూ ఇదే కథనే చెబుతూ ఉండేది. కానీ అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. ఆ భవనంలో ఎవరికీ ఆమె పట్ల సానుభూతి లేదు. బహుశా ఎవరి జీవితాలు వారికి చాలా కష్టంగా ఉండటం వల్ల, ఇతరుల గురించి ఆలోచించడానికి వారికి సమయం లేకపోవడం వల్ల కావచ్చు. అక్కడ ఎవరికీ స్నేహితులు లేరు. చాలా మంది పురుషులు పగటిపూట నిద్రపోతారు. రాత్రులు దగ్గరలోని ఫ్యాక్టరీలో పనిచేస్తారు. అందరూ ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తారు గానీ ఎవరూ ఎవరిపైనా ఆసక్తి చూపరు.
సరిత తల్లి తన చిన్న కూతురిని వేశ్యగా మార్చాలని బలవంతం చేస్తుందని భవనంలో ఉన్న దాదాపు అందరికీ తెలుసు. కానీ వారు ఇతరులను పట్టించుకునే అలవాటు లేకపోవడంతో, తన కూతురు ఎంత అమాయకురాలో అని సరిత తల్లి అబద్ధం చెప్పినప్పుడు ఎవరూ ఆమెతో విభేదించలేదు. ఒకసారి ఒక రోజు తెల్లవారుజామున తుకారాం సరితను నీటి పంపు దగ్గర వేధించినప్పుడు, సరిత తల్లి తుకారాం భార్యను గట్టిగా అరిచింది, ‘’నువ్వు ఎందుకు పట్టించుకోలేకపోతున్నావు..ఆ మురికి చచ్చినోడు గురించి? నా చిన్నమ్మాయిని అలా చూసినందుకు వాడి కళ్ళు పోవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. నిజంగా, ఏదో ఒక రోజు నేను వాడ్ని పైనా కిందా తెలియకుండా గట్టిగా వాయిస్తాను. కానీ అతనిక్కడ వుండాలనుకుంటే, మర్యాదగా వుండమను, అర్థమైందా?”
ఇది విన్న తుకారాం భార్య చీర బొడ్లో దోపుకుని తన గదిలోంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. ‘’ముసలి ముండా.. ఇంకేదైనా అన్నావో.. జాగ్రత్త!’’ అంది. “నీ చిన్నారి దేవత హోటల్ అబ్బాయిలతో కూడా సరసాలాడుతుంది. మేమందరం గుడ్డివాళ్లమని నువ్వు అనుకుంటున్నావు – నీ ఇంటికి వచ్చే ఆ మగాళ్ళ గురించి, నీ సరిత వాళ్ళతో ఎందుకు బయటకు వెళ్తుందో మాకు తెలియదని నువ్వనుకుంటున్నావు? నువ్వు.. మర్యాద గురించి మాట్లాడుతున్నావు – ఏం తమాషా చేస్తున్నావు..వెళ్ళు! ఇక్కడి నుండి..!’’
తుకారాం భార్య చాలా విషయాలకు పేరుగాంచింది. ఆ భవనంలోని కిరోసిన్ అమ్మే వ్యక్తితో ఆమెకు ఉన్న సంబంధం గురించి, ఆమె ఎలా అతన్ని లోపలికి పిలిచి తలుపులు మూసేస్తుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సరిత తల్లి ఆ పాత విషయాన్ని ప్రస్తావించడం మానేసింది. ఆమె ద్వేషపూరిత స్వరంతో, ‘’మరి నీ కిరోసిన్ అమ్మేవాడో..? నువ్వు అతని కిరోసిన్ వాసన పీల్చడానికి రెండు గంటలు నీ గదిలోకి తీసుకువెళతావా?’’ అంటుంది.
ఇలా తగువులాడుకున్నప్పటికీ సరిత తల్లి, తుకారాం భార్య ఎక్కువసేపు కోపంగా ఉండలేరు. ఒకరోజు సరిత తల్లి తుకారాం భార్య రాత్రి చీకటిలో ఎవరితోనో తియ్యగా గుసగుసలాడుతుండటం చూసింది. మరుసటి రోజు తుకారాం భార్య పైధోని నుండి తిరిగి వస్తుండగా, సరిత ఒక కారులో ‘పెద్ద స్నేహితుడి’తో కూర్చుని ఉండటం చూసింది. కాబట్టి ఇద్దరూ ఎవరికి వారు తీసిపోరు అని గ్రహించి, మళ్ళీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించారు.
“నువ్వు సరితను ఎక్కడా చూడలేదు కదా?” సరిత తల్లి తుకారాం భార్యను అడిగింది.
‘ఆమె చెత్త కుప్ప దగ్గర తన స్నేహితురాలితో ఆడుకుంటోంది’ అని ఆమె గుసగుసలాడింది. తర్వాత ఆమె గుసగుసగా, ‘ఒక నిమిషం క్రితం కిషోర్ పైకి వెళ్ళాడు. నువ్వు అతన్ని చూశావా?” అంది.
సరిత తల్లి కుడివైపు, ఎడమవైపు చూసింది. తర్వాత ఆమె కూడా గుసగుసలాడుతూ, ‘’నేను అతన్ని కూర్చోమని అన్నాను, కానీ సరిత ఎప్పుడూ అవసరమైనప్పుడు మాయమవుతుంది. అది ఎప్పుడూ ఆలోచించదు, దానికి ఏమీ అర్థం కాదు. దానికి కావాల్సిందల్లా రోజంతా ఆడుకోవడమే’’ అని అంది. తర్వాత సరిత తల్లి చెత్త కుప్ప దగ్గరకు వెళ్ళింది. ఆమెను చూసి సరిత వెంటనే లేచి నిలబడింది. సరిత ముఖం తల్లి రావడం ఇష్టం లేనట్టు పెట్టింది. సరిత తల్లి కోపంగా ఆమె చేయి పట్టుకుని, ‘’ఇంటికి పద..! నువ్వు చేసేదల్లా పనికిమాలిన పనులే..కిషోర్ ఎదురుచూస్తా వున్నాడు. అతను కారుతో ఒక ధనవంతుడిని తీసుకువచ్చాడు. త్వరగా పైకి పరిగెత్తు.. ఆ నీలిరంగు జార్జెట్ చీర కట్టుకో..చూడు, నీ జుట్టు అంతా చెడిపోయింది. త్వరగా రడీ అవు, నేను నీకు జడ వేస్తాను.’’
కారు తీసుకొని ఒక ధనవంతుడు వచ్చాడని విని సరిత సంతోషించింది. ఆమె ఆ వ్యక్తి గురించి పట్టించుకోలేదు కానీ ఆమెకు కారు ప్రయాణాలు నిజంగా చాలా ఇష్టం. ఖాళీ వీధుల గుండా వేగంగా కారులో వెళుతుండగా, గాలి ఆమె ముఖం మీద వీచినప్పుడు, సరితకు తనకు తాను ఒక తుపానులాగా మారినట్లు అనిపిస్తుంది.
సరితకు పదిహేను కంటే ఎక్కువ వయస్సు ఉండకపోవచ్చు, కానీ ఆమె పదమూడు సంవత్సరాల అమ్మాయిలా వుంటుంది. ఆమెకు అడవాళ్ళతో సమయం గడపడం, వారితో మాట్లాడటం ఇష్టం వుండదు. రోజంతా ఆమె చిన్న చిన్న అమ్మాయిలతో పిచ్చిపిచ్చి ఆటలు ఆడటంలో బిజీగా ఉండేది. ఉదాహరణకు, ఆమె బొగ్గుతో పిచ్చి పిచ్చి గీతలు గీస్తుంది. ఈ గీతలు గీయకపోతే ఈ ప్రపంచం ఆగిపోతుందని సరిత అనుకుంటుంది. ఆమె తన గదిలోంచి ఒక పాత గోనెసంచిని తీసుకుని, తన స్నేహితులతో ఫుట్‌పాత్ మీద గంటల తరబడి ఆటలలో మునిగిపోయేది. దానిని అటూ ఇటూ తిప్పుతూ, పేవ్‌మెంట్‌పై వేస్తూ, దానిపై కూర్చుంటూ, ఇలాంటి చిన్నపిల్లల పనులు చేసేది.
సరిత అందంగా, తెల్లగా ఉండదు. బొంబాయి తేమతో కూడిన వాతావరణం కారణంగా ఆమె ముఖం ఎప్పుడూ నిగనిగలాడేది. ఆమె సన్నని పెదవులు చింతపండు యొక్క గోధుమ రంగు చర్మంలా కనిపిస్తాయి. ఎల్లప్పుడూ లేతగా వణుకుతుంటాయి. ఆమె పై పెదవి పైన మీరు ఎల్లప్పుడూ మూడు లేదా నాలుగు మెరిసే చెమట పూసలను చూడవచ్చు. అయినప్పటికీ ఆమె ఆరోగ్యంగా ఉంటుంది. ఆమె మురికివాడలో నివసించినప్పటికీ, ఆమె శరీరం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది – వాస్తవానికి ఆమె యవ్వనాన్ని ప్రతిబింబిస్తుందని మీరు చెప్పవచ్చు. ఆమె పొట్టిగా, కొంచెం బొద్దుగా ఉంటుంది. కానీ ఈ బొద్దుగా ఉండటం ఆమెను మరింత ఆరోగ్యంగా అనిపించేలా చేసింది. ఆమె వీధుల్లో పరుగెత్తినప్పుడు, ఆమె మురికి దుస్తులు పైకి ఎగిరిపోతే, దారిన వెళ్ళే పురుషులు మృదువైన టేకు లాగా మెరిసే ఆమె పిక్కలను చూస్తారు. ఆమె చర్మరంధ్రాలు నారింజ రంగులో రసం నిండి వున్నట్టు ఉంటాయి. మీరు కొంచెం నొక్కితే, అది మీ కళ్ళలోకి చిమ్ముతుందా అన్నట్టు వుంటుంది. ఆమె అంత తాజాగా ఉంటుంది.
సరితకు కూడా అందమైన చేతులు ఉన్నాయి. ఆమె సరిగ్గా సరిపోని బ్లౌజ్ వేసుకున్నప్పటికీ, ఆమె భుజాల అందం ఇంకా కనిపిస్తుంది. ఆమె జుట్టు పొడవుగా, మందంగా ఉండి, ఎప్పుడూ కొబ్బరి నూనె వాసన వేస్తుంది. ఆమె జడ ఆమె వీపుపై కొరడాలా వుంటుంది. సరితకు ఆమె జుట్టు పొడవుగా వుండడం నచ్చలేదు. ఎందుకంటే ఆమె ఆటలు ఆడేటప్పుడు ఆమెకు ఆ జడ సమస్యలు తెచ్చిపెడుతుంది. దానిని మడిచి పెట్టి ఉంచడానికి ఆమె ఎన్నో మార్గాలను ప్రయత్నించింది.
సరిత ఆనందంగా ఆందోళన నుండి విముక్తి పొందింది. ఆమెకు రోజుకు రెండు పూటలా భోజనం దొరుకుతుంది. ఆమె తల్లే ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. సరిత ఇంట్లో రెండు పనులు మాత్రమే చేస్తుంది: ప్రతి ఉదయం ఆమె బకెట్లలో నీళ్లు నింపి లోపలికి తీసుకెళుతుంది, సాయంత్రం వేళల్లో ఆమె దీపాలలో ఒకటి, రెండు చుక్కల నూనె నింపుతుంది. ఇది చాలా సంవత్సరాలుగా ఆమె దినచర్య. కాబట్టి ప్రతి సాయంత్రం, ఆలోచించకుండా, నాణేలను ఉంచే టీ సాసర్ కోసం ఆమె చేయి చాపి, దీపంలోకి నూనె కొనడానికి ఒకదాన్ని తీసుకునేది.
అప్పుడప్పుడు, నెలకు నాలుగు, ఐదు సార్లు, కిషోర్ కస్టమర్లను తీసుకువస్తాడు. ఆ పురుషులు సరితను హోటల్‌కు లేదా ఏదైనా మరుగు ప్రదేశానికి తీసుకెళ్తారు. ఆమె దీన్ని మంచి వినోదంగా భావిస్తుంది. కిషోర్ లాంటి వ్యక్తి ఇతర అమ్మాయిల ఇళ్లకు కూడా వెళ్లాలని ఆమె భావించినందున ఆమె ఈ రాత్రుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. బహుశా అందరు అమ్మాయిలు ధనవంతులతో కలిసి వర్లీకి వెళ్ళి, చల్లని బెంచీలపై కూర్చోవాలని.. జుహు బీచ్‌లోని తడి ఇసుకపై కూర్చోవాలని ఆమె ఊహించి ఉండవచ్చు. ఆమెకు ఏమి జరిగినా అది అందరికీ జరగాలి. ఒక రోజు కిషోర్ ఎప్పుడూ సాధారణ వచ్చే జాన్‌ను తీసుకువచ్చినప్పుడు, సరిత తన తల్లితో, ‘’అమ్మా, శాంత ఇప్పుడు పెద్దది అయింది కదా.. దాన్ని నాతో బయటకు పంపు, సరేనా? ఇతను ఎప్పుడూ నాకు గుడ్లు ఆర్డర్ చేస్తాడు. శాంతకు గుడ్లంటే నిజంగా ఇష్టం.’’ అని అంటుంది. ఆమె తల్లి తప్పించుకుంటూ, ‘’సరే, సరే, ఆమె తల్లి పూణే నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమెను బయటకు పంపుతాను’’ అని సమాధానం ఇచ్చింది. మరుసటి రోజు శాంత బహిర్భూమి నుండి తిరిగి రావడాన్ని సరిత చూసి, ఆమెకు శుభవార్త చెప్పింది ‘’మీ అమ్మ పూణే నుండి తిరిగి వచ్చినప్పుడు, అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వు కూడా నాతో వర్లికి రావడం మొదలుపెడతావు.”అనింది. అప్పుడు సరిత ఇటీవల ఒక రాత్రి జరిగిన కథను చెప్పింది, శాంతకు అది ఒక అద్భుతమైన కలలా అనిపించింది. శాంత సరిత కంటే రెండేళ్లు చిన్నది. సరిత చెప్పిన కథ విన్న తర్వాత, ఆమె శరీరం ఉత్సాహంతో జలదరించింది. ఆమె ఇంకా ఎక్కువగా దీని గురించి వినాలనుకుంది. కాబట్టి ఆమె సరిత చేయి పట్టుకుని, ‘’రా..బయటికి వెళ్దాం.” అని దుకాణదారుడు గిర్దార్ బయట గోనెసంచీలపై ఎండబెట్టిన మురికి కొబ్బరి ముక్కల దగ్గర కూర్చొని, గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నారు.
తాత్కాలికంగా కట్టిన పరదా వెనుక, సరిత తన నీలిరంగు జార్జెట్ చీర కట్టుకుంది. ఆ చీర ఆమెకు ఒళ్ళు జలదరింపు కలిగించింది. రాబోయే కారు ప్రయాణం గురించి తల్చుకోగానే ఆమె ఉత్సాహంగా అనిపించింది. ఆ వ్యక్తి ఎలా ఉంటాడో, వారు ఎక్కడికి వెళతారో అని ఆమె ఆలోచించలేదు. తనకు తెలియకుండానే, ఆమె ఏదైనా హోటల్ గది ముందు నిలబడి ఉంటుందని ఆమె ఆశిస్తుంది. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత జాన్ తాగడం ప్రారంభిస్తాడు. ఆమెకు ఇరుకు గదుల పట్ల భయం కలగడం ప్రారంభిస్తుంది. రెండు ఇనుప పడకలతో ఊపిరాడకుండా చేసే ఆ గదులంటే ఆమెకు ద్వేషం. వాటిపై ఆమె ఎప్పుడూ మంచి నిద్ర పోలేకపోయింది.
తన చీర ముడతలను సరిచేసుకుంటూ, కిషోర్‌ని ఒక్క క్షణం తన వైపు చూడనిచ్చి, “కిషోర్, నేను ఎలా ఉన్నాను? వెనుక నుండి చీర బాగానే ఉందా?” అని అడిగింది. సమాధానం కోసం వేచి ఉండకుండా, ఆమె తన జపనీస్ పౌడర్ ను ఉంచిన విరిగిన చెక్క గూడు వద్దకు వెళ్ళింది. ఆమె తన తుప్పు పట్టిన అద్దంను కిటికీ ఇనుప కడ్డీలకు తగిలించి, అక్కడ తన ప్రతిబింబాన్ని చూడటానికి కొద్దిగా వంగి, ఆమె బుగ్గలపై సింధూరం రంగు పౌడర్ ను పూసుకుంది. ఆమె సిద్ధమయ్యి కిషోర్ ఆమోదం కోసం అతని వైపు నవ్వుతూ చూసింది. తర్వాత ఆమె తన పెదవులను లిప్‌స్టిక్‌తో అద్దుకుంది. దీపావళికి బొమ్మల అమ్మకందారుల దుకాణాల్లో కనిపించే మట్టి బొమ్మలలో ఆమె ఒకటిగా కనిపించింది.
సరిత తల్లి లోపలికి వచ్చి, సరిత జుట్టును త్వరగా సరిచేసి, తన కూతురితో, ‘’చూడమ్మాయ్, గుర్తుంచుకో..పెద్దదానిలా మాట్లాడు..వాళ్ళు ఏమి చెప్పినా చెయ్యి. ఆవ్యక్తి చాలా ధనవంతుడు, సరేనా? అతనికి సొంత కారు కూడా ఉంది.’’ తర్వాత ఆమె కిషోర్ వైపు తిరిగి, ‘’ఇప్పుడు, త్వరగా, సరితను బయటకు తీసుకెళ్లండి. అబ్బా! పాపం.. ఎంతసేపటినుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారో.!”
బజార్ బయట, ఒక ఫ్యాక్టరీ గోడ దూరంగా పొడవుగా ఉంది. దానిపై ‘మూత్ర విసర్జన చేయరాదు’ అని ఒక చిన్న బోర్డు ఉంది. ఈ బోర్డు పక్కన పార్క్ చేసిన పసుపు రంగు కారు ఉంది. అందులో హైదరాబాద్ నుండి వచ్చిన ముగ్గురు యువకులు ముక్కును రుమాలుతో కప్పుకుని కూర్చున్నారు. మూత్రం దుర్వాసన అక్కడంతా వ్యాపించింది. డ్రైవర్ కిషోర్ని చూడగానే, తన స్నేహితులతో “ఏయ్, అతను వస్తున్నాడు. కిషోర్.. హే.. ఈ అమ్మాయి నిజంగానే చిన్నది! అబ్బాయిలు, చూడండి-నీలిరంగు చీరలో ఉంది” అని అన్నాడు.
కిషోర్, సరిత కారు దగ్గరకు వచ్చినప్పుడు, వెనుక సీట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ టోపీలను తీసుకొని సరిత కోసం తమ మధ్య ఖాళీ చేశారు. కిషోర్ ముందుకు అడుగేసి, వెనుక తలుపు తెరిచి, సరితను లోపలికి నెట్టాడు. తర్వాత అతను తలుపు మూసివేసి, వెనుక ఉన్న వ్యక్తితో, ‘క్షమించండి, చాలా సమయం పట్టింది. ఆమె ఒక స్నేహితుడిని చూడటానికి వెళ్ళింది. సరేనా..?’
ఆ యువకుడు సరితను చూసి వెనక్కి తిరిగి కిషోర్ తో, ‘సరేలే అయితే. కానీ, చూడు..”
అతను కిటికీలోంచి తల బయటకి పెట్టి కిషోర్ తో గుసగుసలాడాడు..’’ఆమె గొడవ చేయదు కదా?’’
కిషోర్ తన గుండె మీద చేయి వేసుకుని, ‘’సర్, దయచేసి నన్ను నమ్మండి.’’ అన్నాడు
ఆ యువకుడు తన జేబులోంచి రెండు రూపాయలు తీసి కిషోర్ కి ఇచ్చాడు. ‘’మీరు ఆనందంగా వెళ్లిరండి’ అని కిషోర్ వీడ్కోలు పలికాడు. తర్వాత డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు.
సాయంత్రం ఐదు గంటలైంది. బొంబాయి వీధులు ట్రాఫిక్ తో నిండిపోయాయి – కార్లు, ట్రామ్‌లు, బస్సులు, జనం ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. సరిత ఇద్దరు వ్యక్తుల మధ్య కుంచించుకుపోయి కూర్చుని ఏమీ మాట్లాడలేదు. ఆమె తన తొడలను దగ్గరకు కలిపి తన ఒడిలో చేతులు ఆనించింది. చాలాసార్లు ఏదో చెప్పాలనే ధైర్యం తెచ్చుకుని, అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆమె డ్రైవర్‌తో, ‘సార్, దయచేసి త్వరగా డ్రైవ్ చేయండి. నేను ఇక్కడే ఊపిరాడకుండా వున్నాను’ అని చెప్పాలనుకుంది.
చాలా సేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు; డ్రైవర్ రోడ్డు వైపు చూస్తున్నాడు. వెనుక సీట్లో ఉన్న వ్యక్తులు నిశ్శబ్దంగా ఉండి, మొదటిసారిగా, ఎలాంటి ఇబ్బందుల్లో పడకుండా, గొడవ పడకుండా, ఒక యువతికి ఇంత దగ్గరగా ఎలా కూర్చున్నామా అని ఆదుర్దాగా ఆలోచిస్తున్నారు.
ఆ డ్రైవర్ రెండేళ్లుగా బొంబాయిలో నివసిస్తున్నాడు. పగలు రాత్రి సరిత వంటి అమ్మాయిలను తీసుకెళ్లేవాడు. అతను తన పసుపు కారులో చాలా మంది వేశ్యలను భయపడకుండా తీసుకెళ్ళడం అతనికి అలవాటే. అతని ఇద్దరు స్నేహితులు హైదరాబాద్ నుండి వచ్చారు: షాహాబ్ ఈ పెద్ద నగరం అందించేవన్నీ అనుభవించాలనుకున్నాడు, కాబట్టి కారు యజమాని కిఫాయత్, కిషోర్ ద్వారా సరితను తీసుకువచ్చాడు. కిఫాయత్ తన రెండవ స్నేహితుడు అన్వర్‌తో, ‘’నీకు తెలుసా, నువ్వు ఒకసారి చేస్తే తప్పేం ఉండదు”. అన్నాడు. కానీ అన్వర్ దానిని తప్పుగా భావించాడు. తనను తాను అంగీకరించలేకపోయాడు. కిఫాయత్ ఇంతకు ముందు సరితను ఎప్పుడూ చూడలేదు. ఆమె కొత్తదనంగా ఉన్నప్పటికీ, అతను ఆమెపై ఆసక్తి చూపలేదు, ఎందుకంటే అతను ఆమెను చూస్తూ, అదే సమయంలో బాగా డ్రైవ్ చేయలేడు.
వారు నగరం విడిచి శివారు ప్రాంతాలకు ప్రవేశించగానే సరిత ఉప్పొంగిపోయింది. వేగంగా దూసుకుపోతున్న కారు మీదుగా వీస్తున్న చల్లని గాలి ఆమెను ఓదార్చింది. ఆమె మళ్ళీ తాజాశక్తితో పుంజుకున్నట్లు అనిపించింది. నిజానికి, ఆమె తనను తాను నిగ్రహించుకోలేకపోయింది: ఆమె తన పాదాలను తట్టడం, వేళ్లను దరువు వేయడం ప్రారంభించింది. రోడ్డు దాటి జారిపోయే చెట్ల వైపు తిరిగి చేతులు ఊపుతుంది.
అన్వర్, షాహబ్ మరింత రిలాక్స్ అవుతున్నారు. షాహబ్ సరితతో తాను ఏమి చేయాలనుకున్నా చేయగలనని భావించాడు. అతను ఆమె నడుము చుట్టూ చేయి వేసాడు. అకస్మాత్తుగా సరితకు చక్కిలిగింతలు పెడుతున్నట్టు అనిపించింది. ఆమె పక్కకు దూకి, అన్వర్ దగ్గరికి వంగి, కారు కిటికీల నుండి బయటకు తల పెట్టి నవ్వింది. మళ్ళీ షాహబ్ సరిత వైపు చేయి చాచాడు. ఆమె ఇంకా నవ్వింది, ఆమె ఊపిరి పీల్చుకోలేనంత గట్టిగా నవ్వింది. అన్వర్ కారు తలుపుకు ఆనుకుని తన ఉద్వేగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు.
షాహాబ్ ఆనంద పారవశ్యంలో పడ్డాడు. అతను కిఫాయత్‌తో ఇలా అన్నాడు, ‘దేవుని దయ చేత, ఆమె నిజంగా ధైర్యం గలది!” అన్నాడు. తర్వాత అతను ఆమె తొడను చాలా గట్టిగా నొక్కాడు. సరిత ఉద్వేగంగా స్పందించి, దగ్గరగా ఉన్న అన్వర్ చెవిని ఏ కారణం లేకుండా మెలితిప్పింది. అందరూ పగలబడి నవ్వారు. కిఫాయత్ రియర్ వ్యూ అద్దంలో ప్రతిదీ చూడగలిగినప్పటికీ తన భుజం మీదుగా వెనుకకు చూస్తూనే ఉన్నాడు. అతను వెనుక సీటులో నవ్వులతో పాటు కారు వేగం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ వేగంగా నడిపాడు.
సరిత దిగి కారు ముందు భాగం మీద ఎగిరే పక్షి ఆకారంలో ఉన్న ఇనుప బొమ్మ పక్కన కూర్చోవాలనుకుంది. ఆమె ముందుకు వంగి, షాహాబ్ ను పొడుచుకున్నట్టు తగిలింది. సరిత తన బ్యాలెన్స్‌ను కాపాడుకోవడానికి కిఫాయత్ మెడ చుట్టూ చేతులు వేసింది. ఆలోచించకుండా, కిఫాయత్ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. సరిత మొత్తం శరీరం జలదరించింది. ఆమె ముందు సీటుపైకి దూకి కిఫాయత్ పక్కన కూర్చుంది, అక్కడ ఆమె అతని నెక్‌టైతో ఆడుకోవడం ప్రారంభించింది. ‘నీ పేరు ఏమిటి?’ అని ఆమె అడిగింది.
‘’నేనా? నేను కిఫాయత్ ని.’’ తర్వాత అతను తన జేబులోంచి పది రూపాయలు తీసి ఆమెకు ఇచ్చాడు. ఆ డబ్బు సరిత దృష్టి మరల్చింది. ఆమె ఆ నోటును తీసుకొని తన బ్రాలో పెట్టుకుంటూ కిఫాయత్ చెప్పింది వెంటనే మర్చిపోయింది. సంతోషంగా”నువ్వు చాలా బాగున్నావు,” అని ఆమె కిఫాయత్ తో చెప్పింది. “మీ నెక్ టై కూడా బాగుంది.”
సరిత చాలా మంచి మూడ్‌లో ఉంది, ఆమె చూసిన ప్రతిదానినీ ఆమె ఇష్టపడింది. చెడు విషయాలను కూడా క్షమించవచ్చని ఆమె నమ్మాలనుకుంది, కారు వేగంగా వెళ్లాలని, ప్రతిదీ సుడిగాలిలో వెనక పడాలని ఆమె కోరుకుంది. అకస్మాత్తుగా ఆమెకు పాడాలనిపించింది. ఆమె కిఫాయత్ టైతో ఆడటం మానేసి, ‘నాకు ప్రేమించడం నేర్పింది/ నిద్రపోతున్న నా హృదయాన్ని మేల్కొలిపింది నువ్వే’ అని పాడింది.
ఈ సినిమా పాటను కొద్దిసేపు పాడిన తర్వాత, సరిత అకస్మాత్తుగా వెనక్కి తిరిగి అన్వర్‌తో, ‘నువ్వు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు? ఎందుకు ఏమీ అనవు? ఎందుకు ఏమీ పాడవు?” అని అడిగింది. తర్వాత ఆమె వెనుక సీటులోకి దూకి, షహాబ్ జుట్టులో వేళ్లను పోనిచ్చి అతనితో, ‘’మనం కలిసి పాడదాం. దేవిక రాణి పాడిన “నేను అడవుల గుండా పాడే పక్షిలా ఉంటే బాగుండు” అనే పాట నీకు గుర్తుందా? నాకు దేవిక రాణి నిజంగా ఇష్టం.” అప్పుడు సరిత తన చేతులను జోడించి, వాటిని తన గడ్డం కింద ఉంచి, తన కనురెప్పలను కొట్టుకుంటూ కథ చెప్పడం ప్రారంభించింది.. ‘’అశోక్ కుమార్, దేవిక రాణి ఒకరి పక్కన ఒకరు నిలబడి ఉన్నారు. దేవిక రాణి, “నేను అడవుల గుండా పాడే పక్షిలా ఉంటే బాగుండు” అని చెప్పింది. దానికి అశోక్ కుమార్ ఇలా అన్నాడు…’’ అకస్మాత్తుగా సరిత షహాబ్ వైపు తిరిగి, ‘పాడండి, సరేనా?’
సరిత పాడటం మొదలుపెట్టింది, “నేను అడవుల్లో పాడే పక్షిలా మారగలిగితే బాగుండును” అని. షాహబ్ బొంగురు కంఠంతో అదే పునరావృతం చేశాడు.
తర్వాత వారందరూ కలిసి పాడటం ప్రారంభించారు. కిఫాయత్ పాట లయకు అనుగుణంగా హార్న్ మోగించడం ప్రారంభించాడు.. సరిత ఆ బీట్‌ను అనుసరించి చప్పట్లు కొట్టింది. సరిత స్త్రీ స్వరం షాహాబ్ యొక్క కరకరలాడే స్వరంతో కలిసిపోయింది. అలాగే హార్న్ మోగడం, అతని కారు ఇంజిన్ గర్జించే శబ్దం అన్నీ ఒక చిన్న ఆర్కెస్ట్రా సంగీతంలాగా వినిపించాయి.
సరిత సంతోషంగా ఉంది-షహాబ్ సంతోషంగా ఉన్నాడు-కిఫాయత్ సంతోషంగా ఉన్నాడు. వారందరూ సంతోషంగా ఉండటం చూసి అన్వర్ కూడా సంతోషించాడు. అయినా తను అంతగా ముడుచుకుపోయి కూర్చున్నందుకు అతను సిగ్గుపడ్డాడు. అతను తన చేతుల్లో ఒక రకమైన జలదరింపుని అనుభూతి చెందాడు. అతనిలో అణచివేయబడిన భావోద్వేగాలు మేల్కొన్నాయి: అతను బిగ్గరగా ఒళ్ళు విరిచాడు..ఆవలించాడు..ఆపై ఆ ఆనంద కోలాహలంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు భావించాడు.
పాట పాడుతుండగా, సరిత అన్వర్ తలపై ఉన్న టోపీని తీసి, దానిని ధరించి, వెనుక సీటులోకి దూకి, వెనుక వ్యూ అద్దంలో తనను తాను చూసుకుంది. సరిత తన టోపీని ధరించడం చూసి, అన్వర్ కారు ప్రయాణం ప్రారంభం నుండి దానిని ధరించాడో లేదో గుర్తుచేసుకోలేకపోయాడు. అతను దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.
సరిత కిఫాయత్ తొడ మీద కొట్టి, ‘’నేను నీ ప్యాంటు వేసుకుని, నీ చొక్కా, టై వేసుకుంటే, నేను మంచి వ్యాపారవేత్తలా కనిపిస్తానా?’’ అని అడిగింది.
కానీ ఈ డ్రస్సు గురించిన చర్చ షాహాబ్‌ను బాధపెట్టింది. అతను అన్వర్ చేయి పట్టుకు ఊపాడు, ‘దేవుని దయ చేత, ఆమెకు టోపీ ఇచ్చినందుకు నువ్వు చాలా మూర్ఖుడివి!’ అన్నాడు. అన్వర్ ఈ మాటలను మనసులోకి తీసుకున్నాడు. తాను నిజంగా మూర్ఖుడినని అతను ఒక్క క్షణం అనుకున్నాడు.
‘’నీ పేరేమిటి?’’ కిఫాయత్ సరితను అడిగాడు.
‘’నా పేరు?’’ సరిత టోపీ యొక్క సాగే త్రాడును తీసుకొని తన గడ్డం కింద కట్టుకుంది. ‘’సరిత.’’
‘’సరితా..నువ్వు స్త్రీవి కాదు, పటాకువి’’ అన్నాడు షాహాబ్.
అన్వర్ ఏదో చెప్పాలనుకున్నాడు కానీ సరిత బిగ్గరగా పాడటం ప్రారంభించింది.. ‘నేను ప్రేమ నగరంలో నా ఇంటిని నిర్మించబోతున్నాను..మిగతా ప్రపంచాన్ని మరచిపోతాను!’
కిఫాయత్, షాహబ్ లు కదిలిపోయినట్లు అనిపించారు కానీ, అన్వర్ ఇంకా తన సంశయాలను పోగొట్టుకోలేకపోయాడు. సరిత పాడుతూనే ఉంది, ‘నేను ప్రేమ నగరంలో నా ఇంటిని నిర్మించుకుని మిగతా ప్రపంచాన్ని మరచిపోతాను…’ ఆమె తన శ్వాస బిగబట్టి ఉన్నంత వరకు చివరి వరకు పాటను కొనసాగించింది. ఆమె పొడవాటి జుట్టు ముందుకు వెనుకకు గాలికి కదిలిపోతోంది. అది గాలిలో వ్యాపించే దట్టమైన పొగ స్తంభంలా కనిపించింది.
సరిత సంతోషంగా ఉంది-షహాబ్ సంతోషంగా ఉన్నాడు-కిఫాయత్ సంతోషంగా ఉన్నాడు- అన్వర్ మరోసారి వారితో చేరడానికి ప్రయత్నించాడు. కానీ హఠాత్తుగా పాట ముగియగానే, అందరికీ వర్షం అకస్మాత్తుగా ఆగిపోయినట్లు అనిపించింది.
కిఫాయత్ సరితను మరో పాట పాడమని అడిగాడు.
“అవును, ఇంకొకటి” షాహాబ్ ఆమెను ప్రోత్సహించాడు. సరిత పాడటం ప్రారంభించింది..’అలీ నా ప్రాంగణానికి వచ్చాడు. నేను ఆనందంతో తడబడుతున్నాను!’ ఈ సాహిత్యాన్ని విన్న కిఫాయత్ కారును ఒక వైపు నుండి మరొక వైపుకు తిప్పడం ప్రారంభించాడు. అప్పుడు అకస్మాత్తుగా మలుపులు తిరుగుతున్న రోడ్డు ముగిసి, వారు సముద్రం దగ్గరకు వచ్చారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సముద్రం మీద నుండి వచ్చే గాలి నిమిష నిమిషానికి చల్లగా మారుతోంది.
కిఫాయత్ కారు ఆపాడు. సరిత దిగి సముద్రతీరం వైపు పరుగెత్తుకుంటూ వెళ్ళింది. కిఫాయత్, షాహబ్ ఆమెతో కలిసి వచ్చారు. సముద్రం వెంబడి పెరిగిన ఎత్తైన తాటి చెట్ల దగ్గర తడి ఇసుక మీద ఆమె పరిగెత్తింది. అనంత ఆకాశంలోకి కలిసిపోవాలని, ఆ నీటిలో కరిగిపోవాలని, తాటి చెట్లు ఆమె కింద నిలిచేంత ఎత్తుకు ఆకాశంలోకి ఎగరాలని ఆమె కోరుకుంది; ఆమె తన పాదాల ద్వారా ఇసుక తేమను గ్రహించాలనుకుంది. కారు, వేగం, వేగంగా వీచే గాలి దెబ్బ..ఆమె ఇక్కడికి ప్రయాణించి వచ్చినట్లు భావించింది.
హైదరాబాద్ నుండి వచ్చిన ముగ్గురు యువకులు తడి ఇసుకపై కూర్చుని బీరు తాగడం ప్రారంభించారు, కానీ సరిత కిఫాయత్ నుండి ఒక బాటిల్ తీసుకొని, ‘’ఆగు, నేను మీకు కొంచెం పోస్తాను’’ అని చెప్పింది.
సరిత తన వేలును బీరులో ముంచి నురుగును నాకింది, కానీ అది చాలా చేదుగా ఉంది. ఆమె వెంటనే పెదవులు చీదరగా తుడుచుకుంది. కిఫాయత్, షాహాబ్ పగలబడి నవ్వారు. కిఫాయత్ తనను తాను నవ్వు ఆపుకోవడానికి వేరేవైపు చూడవలసి వచ్చింది. అన్వర్ కూడా నవ్వుతున్నట్లు అతను చూశాడు.
వాళ్ళ దగ్గర ఆరు బీరు సీసాలు ఉన్నాయి – వాళ్ళు త్వరగా బీరు గ్లాసుల్లో పోశారు. దాని నురుగు ఇసుకలో మాయమైంది. కొన్నింటిని వారు నిజంగా తాగగలిగారు. సరిత పాడుతూనే ఉంది. ఒకసారి అన్వర్ ఆమెను చూసినప్పుడు, ఆమె బీరుతో తయారు చేయబడిందని అతను ఊహించాడు. తడి సముద్రపు గాలి ఆమె నల్లటి బుగ్గలపై మెరుస్తోంది. ఆమె చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు అన్వర్ కూడా సంతోషంగా ఉన్నాడు. సముద్రంలోని నీరు బీరుగా మారాలని, ఆపై అతను సరితతో కలిసి మునిగిపోవాలని అతను కోరుకున్నాడు. సరిత రెండు ఖాళీ సీసాలను తీసుకొని ఒకదానికొకటి చిన్నగా కొట్టింది. వారు కూడా గ్లాసులు చిన్నగా తాటించుకున్నారు. ఆమె పగలబడి నవ్వింది. అందరు కూడా పగలబడి నవ్వారు.
‘’మనం డ్రైవ్ కి వెళ్దాం’’ అని ఆమె కిఫాయత్ కి సూచించింది. వాళ్ళు బాటిళ్లను అక్కడే తడి ఇసుక మీద వదిలేసి, కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వారి సీట్లకు చేరుకున్నారు. కిఫాయత్ ఇంజిన్ స్టార్ట్ చేసాడు. వెంటనే గాలి వారి మీదగా దూసుకుపోయింది. సరిత పొడవాటి జుట్టు ఆమె తలపైకి నాట్యం ఆడింది.
వాళ్ళు పాడటం మొదలుపెట్టారు. కారు రోడ్డు మీద వేగంగా దూసుకుపోయింది. సరిత వెనుక సీట్లో కూర్చున్న అన్వర్, నిద్రపోతున్న అన్వర్, షాహబ్ మధ్య పాట పాడుతూనే ఉంది. అల్లరిగా, ఆమె షాహబ్ జుట్టులో తన వేళ్ళతో దువ్వడం ప్రారంభించింది, కానీ దీని ప్రభావం అతనికి నిద్ర పట్టేలా చేసింది. సరిత అన్వర్ వైపు తిరిగి చూసింది. అతను ఇంకా నిద్రపోతున్నాడని చూసి, ఆమె ముందు సీటులోకి దూకి కిఫాయత్ తో గుసగుసలాడింది” నేను మీ స్నేహితులను నిద్రపుచ్చాను. ఇప్పుడు మీ వంతు..”
కిఫాయత్ నవ్వి. ‘’అప్పుడు..కారు ఎవరు డ్రైవ్ చేస్తారు?’’
“దానంతట అదే నడుస్తుందిలే” అని సరిత నవ్వుతూ సమాధానం చెప్పింది.
ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, వారికి సమయం కూడా గుర్తుకు రాలేదు. వారు అది గ్రహించే లోపే, కిషోర్ సరితను కారులోకి ఎక్కించిన బజార్‌లోకి తిరిగి వచ్చారు. వారు ‘మూత్ర విసర్జన చేయకూడదు’ అనే బోర్డుతో ఫ్యాక్టరీ గోడ వద్దకు చేరుకున్నప్పుడు, సరిత, “సరే, ఇక్కడ ఆపు” అని చెప్పింది.
కిఫాయత్ కారు ఆపి, ఏదైనా చెప్పేలోపు సరిత బయటకు వచ్చి, వీడ్కోలు పలికి ఆమె ఇంటికి వెళ్ళింది. తన చేతులు ఇంకా చక్రం మీదనే ఉండగా, జరిగినదంతా కిఫాయత్ తన మనసులో మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నాడు. సరిత కారు దగ్గరకు తిరిగి వచ్చి, తన బ్రా నుండి పది రూపాయల నోటును తీసి అతని పక్కన ఉన్న సీటుపై పడేసింది. ఆశ్చర్యంగా, అతను ఆ నోటు వైపు చూశాడు.
“ఇదేమిటి, సరితా?”
వెనక్కి తిరిగి పరిగెత్తే ముందు ‘’ఈ డబ్బు-నేను దీన్ని ఎందుకు తీసుకోవాలి?’’ అని సరిత అంది. కిఫాయత్ ఆ నోటు వైపు నమ్మలేనట్లు చూస్తూ ఉండిపోయాడు.
అతను వెనుక సీటు వైపు తిరిగి చూస్తే, అతని స్నేహితులు గాఢ నిద్రలో ఉన్నారు.
రచయిత పరిచయం :
సాదత్ హసన్ మంటో (1912–1955) ఒక ప్రముఖ ఉర్దూ రచయిత, కథకుడు, నాటక రచయిత. భారత ఉపఖండంలోని సామాజిక వాస్తవాలను, మానవ స్వభావాన్ని, ద్వంద్వ ప్రవృత్తులను తన కథల్లో నిర్భయంగా చిత్రించినందుకు ఆయన ప్రసిద్ధి చెందాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన మంటో, భారత దేశ విభజన సమయంలోని అనుభవాలను, సమాజంలోని వివక్షలను, మతపరమైన ఘర్షణలను తన రచనల్లో విశ్లేషించాడు.
ఆయన రచనలు, ముఖ్యంగా “టోబా టెక్ సింగ్”, “ఖోల్ దో”, “ఠండా గోష్ట్” వంటి కథలు, విభజన యొక్క భయానక పరిణామాలను, మానవత్వం యొక్క లోతైన అంశాలను వెల్లడి చేస్తాయి. మంటో రచనలు తరచూ వివాదాస్పదమైనప్పటికీ, అవి సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. సమాజంలోని నీచమైన వాస్తవాలను బహిర్గతం చేసే ఆయన శైలి, ఆయనను ఒక గొప్ప వాస్తవిక రచయితగా నిలిపింది.
మంటో బొంబాయిలో సినిమా రంగంలో కూడా కొంతకాలం పనిచేశాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయి. 1955లో, 42 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశాడు. కానీ ఆయన సాహిత్యం ఇప్పటికీ ఉర్దూ సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి.
రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.




Discussion about this post