తమిళ మూలం : ఎస్.కె.పి.కరుణా
అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ
‘‘ఈసారి మన కళాశాల స్నాతకోత్సవానికి గవర్నరు గారిని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది కరుణా?’’ మిత్రుడు బవా చెల్లదురై కే(రచయిత) ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. నిజంగానే ‘గొప్పలోగొప్ప’ టైపు.
‘‘ఇదంతా ఓవర్‌గా అనిపించటం లేదా బవా?’’ అన్నాను.
‘‘ఇందులో తప్పేముందీ? ప్రయత్నమేగా చెయ్యబోతున్నాం. జరగదని ఇప్పుడే ఎందుకొక నిర్ణయానికి రావాలి?’’
నిజమే కదా? ‘‘ఓకే’’ అని చెప్పేశాను.
అనుకున్నట్టే, మా కాలేజీ స్నాతకోత్సవానికి తమిళనాడు గవర్నరును ఆహ్వానించాలని నిర్ణయంచటం జరిగింది. ఆ క్షణంలో విధి ఆ గదిలోని ఒక మూల నుండి నన్ను చూసి నవ్వటం నాకు తెలియకుండా పోయింది.
గవర్నరును ఆహ్వానించటం అని మేము నిర్ణయించేశాం. ఇక మా ఉత్సవానికి రావటానికి గవర్నరు నిర్ణయం తీసుకోవాలి.
గవర్నరును ఉత్సవానికి ఆహ్వానిస్తూ, ఒక ఆహ్వాన లేఖను రాయటమన్నది ఉత్సవం ఏర్పాట్ల లోని మొదటి అంకం. ఆ ప్రకారం, మా కార్యాలయ మేనేజర్ ఒక నమూనా లేఖను రాసి తీసుకొచ్చారు. మా కాలేజీ గురించిన ఒక పరిచయ ఉత్తరం అది. చదువుతున్నకొద్దీ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ఒక సందర్భంలో ఇదంతా నిజంగానే మన కాలేజీలో జరిగిందా అన్న అనుమానం నాకే కూడా కలిగింది. అనవసరమైన మేకులన్నీ అందులోనుండి తీసేశాక కూడా, ఆ ఉత్తరం ఏ తడబాటూ లేకుండా నిటారుగా నిలబడుంది.
సరే! మనమే రాద్దామని అనుకుని, నేరుగా నా ల్యాప్‌టాప్‌లో తేలికైన మాటలతో ఇంగ్లీషులో ఒక పేజీ ఉత్తరం రాసిచ్చి, దాన్నే పంపమని చెప్పాను. వెంటనే నేను ఆ విషయాన్ని మరిచిపోయాను.
ఒకరోజు ఉదయం మా కార్యాలయానికి రాగానే, బల్లమీదున్న అవ్వాల్టి రిజిష్టర్‌లో, ఫోన్ చేసినవాళ్ల కాలమ్‌లో, ఇలా రాసి ఉంది: గవర్నరు పిలిచారు, సమయం ఉదయం 10.30
నవరసాల్లో ఏ రసం అప్పుడు నా ముఖంలో కనిపించిందన్నది నాకు గుర్తులేదు. చాలాసేపటి దాకా కాలింగ్ బెల్‌ను వెతికి, అది కనిపించకపోయేసరికి, ఆదుర్దాలో ఇంటర్‌కమ్‌లో అన్నీ రాంగ్ నెంబర్లనే నొక్కి, అదీ సరికాక, నేనే లేచి గది బయటికెళ్లి నాలోని ఆదుర్దాను కనిపించనివ్వకుండా…‘‘ఇదేంటీ, గవర్నరు పిలిచారు. అని రాసి ఉంది?’’ అన్నాను.
‘‘ఔను సార్! గవర్నరు ఆఫీసు నుండి ఫోనొచ్చింది!’’
‘‘అప్పుడు, గవర్నరు ఆఫీసు నుండి ఫోన్… అని రాయాలి కదా? అదేంటీ గవర్నరు నుండి ఫోన్.’’ అమాయకపు నవ్వుతో బదులివ్వకుండా ప్రశాంతంగా నిలబడ్డారు.
‘మన ఆఫీసులో ఉన్నవాళ్లూ మనలాగే కదా ఉంటారు.’ అనుకుని సమాధానపడ్డాను.
‘‘సరే, సరే! గవర్నరుకు ఫోన్ చెయ్యండి.’’ అన్నాను.
వాళ్లు మిడిగుడ్లేసుకుని నిలబడటం చూసి, ‘‘అదేనయ్యా! గవర్నరు ఆఫీసుకు ఫోన్ చెయ్యండి.’’ అని చెప్పి మళ్లీ నా గదికొచ్చి కూర్చున్నాను.
చాలా సమయం అయినప్పటికీ, ఏమీ జరగకపోవటంతో, మళ్లీ వాళ్లను పిలిచి అడిగాను.
అప్పుడు చెబుతున్నారు. ‘‘వాళ్లెవరికీ గవర్నరు బంగళా టెలిఫోన్ నెంబరు తెలియదు.’’ అని! మనకు తగ్గ పనివాళ్లు… అని భావించి, ‘‘ఆ నెంబరును గవర్నరు బంగళా వెబ్‌సైట్‌లో చూసి చావచ్చు కదా’’ అని అరిచాను.
అలా అనుకున్నంత మాత్రాన ఎవరూ ఫోన్‌చేసి సంబంధిత వ్యక్తులతో మాట్లాడటం వీలుకాదనీ, తాము మాట్లాడాలనుకున్నవాళ్లతో, వాళ్లు మాత్రమే ఫోన్‌చేసి మాట్లాడే వింతైన ఏర్పాటు అది అన్న విషయం నేను అర్థం చేసుకునేసరికి సాయంత్రం అయిపోయింది. దాంతో, గవర్నరు కార్యాలయంలోనూ, మా కార్యాలయంలోనూ ఉన్న వాళ్లందరూ పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరారు.
నేను మాత్రం, చాలాసేపు ‘గవర్నరు పిలిచారు’ అన్న సూచనను కోపంగా చూస్తూ, రాత్రి కొంతసేపయ్యాక ఇంటికి బయలుదేరాను. ఆ రాత్రి నా కలలో, గవర్నరు మొబైల్ ఫోన్లో నుండి పిలిచి నాతో మాట్లాడారు అన్న విషయాన్ని ఊహించలేనివాళ్లు, ఈ కథ నుండి ఈ క్షణమే బయటికెళ్లిపోవచ్చు.
మరునాడు ఉదయం, టెన్నిస్ ఆడుతున్నప్పుడు, బవా ఫోన్లో పిలిచారు.
‘‘ఏంటి బవా?’’ అన్నాను.
‘‘గవర్నరు కార్యాలయం నుండి మీకేమైనా ఫోనొచ్చిందా కరుణా?’’ అన్నారు.
‘ఈయనకెలా తెలుసు?’ అనుకుని, నిన్న జరిగిన విషయమంతా చెప్పాను. ఆయన నవ్వుతూ…‘‘ఫోన్ చేసింది మన మిత్రుడే కరుణా! ఆయన గవర్నరు కార్యాలయంలో ఎంతో ముఖ్యమైన హోదాలో పనిచేస్తున్నారు. ఆయనతో, ఊరకనే మన విషయాన్ని చెప్పి ఉంచుదామని చెప్పాను. ఆయనే మిమ్మల్ని పిలిచారట. మనవైపు నుండి రెస్పాన్స్ ఏదీ లేదని చాలా బాధపడ్డారు.’’ అన్నారు.
వెంటనే, బవా వాట్సప్‌లో పంపించిన ఆ మొబైల్ నెంబరును నొక్కి మాట్లాడాను. ఎంతో స్నేహ పూర్వకంగా మాట్లాడిన ఆ వ్యక్తి, నన్ను ప్రత్యక్షంగా వచ్చి గవర్నరు గారి ప్రత్యేక అధికారి (ఓఎస్‌డి) ని కలవమని చెప్పి, ఆ కలుసుకునే తేదీ, సమయమూ చెప్పారు. ఆ విధంగా, ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన గవర్నరు గారి బంగళాలోకి నేను ప్రవేశించాను.
జూలై నెల. బయట కఠినమైన ఎండలో చెన్నై మహా నగరంలో అడవిలా చెట్లు దట్టంగా పెరిగి వాటి విశాలమైన నీడలో గవర్నరు గారి బంగళా ఉంది.
ప్రవేశద్వారం దగ్గర ఆ రోజుటి అతిథుల జాబితాలో నా పేరు ఉన్నదా అని పరిశీలిస్తున్న సమయం లోనే, ఒక పోలీసు అధికారి నా దగ్గరికొచ్చి నన్ను గుర్తుపట్టారు. కొంతసేపటికి మా ముందు ఒక ఎస్కార్ట్ జీపు దారి చూపుతుంటే గవర్నరు బంగళా ప్రత్యేక కార్యదర్శి కార్యాలయం కేసి కార్లో వెళుతున్నాను. బవా మిత్రుడు నిజంగానే ముఖ్యమైన హోదాలోనే ఉన్నారని మొట్టమొదటిసారిగా నమ్మకం కలిగింది.
ప్రవేశద్వారం నుండి గవర్నరు బంగళాకు దట్టమైన వనంలోకి వెళ్లటం లాంటి ఒక సుదీర్ఘ ప్రయాణం. చుట్టూ ఎటు చూసినా జింకల గుంపులు స్వేచ్ఛగా మేస్తున్నాయి. అక్కడున్న రెండు బ్రహ్మాండమైన తెల్లని బంగళాల్లో ఒకదానిలోకి నన్ను వెంటబెట్టుకెళ్లారు. స్నేహితుడి ప్రత్యేమైన కార్యాలయం అందులోనే ఉంది.
ఆ బంగళా యొక్క ద్వారాలు, తళతళలాడే గచ్చులు, కార్పెట్లు, దూలాలు, గదులలోని బ్రహ్మాండమైన ద్వారబంధాలు, గోడలపై ఎంతో అద్భుతమైన చిత్రాలు అంటూ ఒక్కొక్కటిగా గుర్తుపెట్టుకుని చెప్పటానికి ఎన్నో వందల విషయాలున్నాయి. నేను వాషింగ్టన్‌లో వైట్‌హౌస్‌కు వెళ్లి చేశాను. పోల్చి చూడగా మన తమిళనాడు గవర్నరు బంగళా సూపర్‌స్టార్ రజనీకాంత్ అయితే, అమెరికా ప్రెసిడెంట్ నివశించే ఆ వైట్‌హౌజ్ ఒఠి ధనుష్! (రజనీకాంత్‌కు అల్లుడైన నటుడు)
ఈ కథకు ‘గవర్నరు బంగళా టీ’ అన్న పేరే పెట్టాల్సింది. అంత అద్భుతమైన మసాలా టీ ని మిత్రుడు నాకు ఆఫర్ చేశారు. ఇంకొక కప్పు అడుగుదామా అని ఆలోచించాను. తర్వాత రోజుల్లో, అప్పుడప్పుడు అక్కడికెళ్లి టీ తాగుతాను అన్నది నాకప్పుడు తెలియకుండా పోయింది.
మిత్రుడు నన్ను, దగ్గరున్న మరొక బంగళాకు వెంటబెట్టుకెళ్లారు. అదే గవర్నరు నివశించే బంగళా. సందర్శకులు ఎదురుచూసే గది, గవర్నరు గారి ప్రత్యేక కార్యదర్శి గది, గవర్నరు తన సందర్శకులను కలుసుకునే గది అంటూ అన్నీ అక్కడే ఉన్నాయి. దాని ప్రవేశమార్గంలో నా దగ్గరున్న మొబైల్ ఫోన్ తీసుకుని నేను శోధించబడ్డాను.
తర్వాత, మేడమీదున్న గవర్నరు గారి ప్రత్యేక కార్యదర్శి గదికి వెళ్లాము. మరొక మంచి మనిషి ఆయన. మా పరిచయాలయ్యాక, ఆయన నన్ను గవర్నరు గారి రక్షణాధికారి (ఎడిసి)కి పరిచయం చేశారు. అక్కడ కొన్ని వివరాలు అడిగారు. అందులో మొదటి ప్రశ్న: ‘‘ఎక్కడుంది ఆ తిరువణ్ణామలై?’’
నా జీవితంలో నేను పదేపదే ఎదుర్కొన్న ఎంతో ముఖ్యమైన ప్రశ్న ఇదే.
అబిత కుజాంబాళ్ సమేత అరుణాచలేశ్వరుడు, ఆయన దేవాలయం, అగ్నిస్థలంగా ఎత్తున నిలబడే కొండ, పౌర్ణమి, గిరివలం (గిరి ప్రదక్షిణం), రజినీకాంత్, ఇళయరాజా, రమణుని ఆశ్రమంతో సహా ఎన్నో ఆశ్రమాలు అంటూ ఇంకా ఎన్నెన్నో గుర్తులున్నప్పటికీ, అప్పుడప్పుడు నేనూ నా దృష్టిలో ఒక పరిచయాన్ని నా ఊరికి ఇవ్వాల్సి ఉంటుంది. బాగా తర్ఫీదు ఉండటంతో, కొన్ని నిమిషాలలో దాన్ని చెప్పి ముగించాను.
తర్వాతి ప్రశ్న: ‘‘ఇక్కడ నుండి ఎంత దూరం?’’
‘‘ఒక మూడు గంటల సమయంలో వెళ్లిపోవచ్చు సార్.’’
గమనించటానికి దూరాన్ని చెప్పనే చెప్పను. సమయాన్నే చెబుతాను.
దాదాపు అది వర్కవుట్ అయిపోతుంది. (అనుభవం మరి)
‘‘సరే! మీకు సౌకర్యమైన ఒక మూడు తేదీలను ఇవ్వండి. గవర్నరు గారిని అడిగి చెబుతాం.’’ అన్నారు. ‘నాకు సౌకర్యంగానా! సార్? యూ మస్ట్ బి కిడ్డింగ్.’
‘‘మీరు ఒక తేదీని చెప్పండి. ఆ తేదీలో నేను మా కార్యక్రమాన్ని పెట్టుకుంటాను.’’ అన్నాను.
ఆయన తన డైరీని తీసి నాచేతికిచ్చారు. పదిహేనురోజుల తర్వాత కొన్ని తేదీలు కార్యక్రమాలేవీ లేకుండా ఉన్నాయి.
‘‘ఏదైనా ఒక శనివారం పెట్టుకుందామా?’’ అన్నారు.
‘‘నో ప్రాబ్లం సార్!’’ అని చెబుతున్నప్పుడే లోపల నుండి కాలింగ్ బెల్ మ్రోగింది.
‘‘పిలుస్తున్నారు. లోపలికెళ్లండి సార్.’’ అన్నారు.
నాకు కొంతసేపు ఏమీ అర్థం కాలేదు. నన్నెవరు పిలుస్తున్నారు అని నీళ్లు నమిలాను.
మళ్లీ, ‘‘తొందరగా లోపలికెళ్లండి సార్.’’ అనటంతో, లేచి ఆ పెద్ద గదిలోకి ప్రవేశించాను.
ఆ పెద్ద గదిలో ఒక అందమైన కుర్చీలో ఒంటరిగా కూర్చోనున్న తమిళనాడు గవర్నరు, హిజ్ ఎక్సలెన్సీ, డాక్టర్ కె.రోశయ్య గారు లేచి నిలబడి, నాకు కరచాలనం చేసి ఆహ్వానించి తనను పరిచయం చేసుకున్నారు.
‘‘అయాం రోశయ్యా, గవర్నర్ ఆఫ్ తమిళనాడు.’’ () »» I »» ()
‘‘మీ ఊళ్లో హెలిప్యాడ్ ఉందా?’’ రెండవసారి గవర్నరు గారి ఏ.డి.సి. (Aides-de-Camp) ను కలిసినప్పుడు, ఈ ప్రశ్న నన్ను అడిగారు. ఎందుకీ ప్రశ్న అడుగుతున్నారో నాకర్థం కాలేదు. చెన్నైకు దగ్గరగా ఉండటంతో గవర్నరు కచ్చితంగా కార్లోనే వస్తారనుకున్నాను.
‘‘ఎందుకు సార్? గవర్నరు హెలికాప్టరులోనా వస్తారు?’’ అన్నాను.
‘‘ఔను. హిజ్ ఎక్స్‌లెన్సీ ఆయన శ్రీమతితో వస్తుండటంతో, రోడ్డు ప్రయాణం సరికాదు. కచ్చితంగా హెలికాప్టరే. హెలిప్యాడ్ ఉందా? లేదా?’’
మా ఊరికి హెలికాప్టరు వస్తే మా ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలోనే దిగుతుంది. ఇందిరాగాంధి వచ్చినప్పుడు, పరుగెత్తుకుని దాని దగ్గరికెళ్లి చూశాను. తర్వాత, ముఖ్యమంత్రి జయలలిత కొన్నిసార్లు అక్కడికొచ్చారు. అయితే, అక్కడ శాశ్వతంగా హెలిప్యాడ్ ఏర్పాటు చెయ్యబడిందా అన్నది నాకు తెలియదు. అలాగే ఉన్నప్పటికీ, ఆ చోటూ, మా కాలేజీ ` ఊరికి ఎదురెదురు దృవాలు.
ఇవన్నీ, ఈయనతో ఈ సమయంలో చెప్పి వివరించలేను.
కనుక, నేనిచ్చిన సమాధానం: ‘‘ఉంది సార్!’’
‘‘వెరీగుడ్! ఎక్కడుంది?’’
‘‘ మా కాలేజీ కాంపస్‌లోనే ఉంది.’’
‘‘What! You have a Helipad in your college?”
‘‘ఎస్. ఇంతవరకూ లేదు. అయితే, మీరొచ్చేసరికి ఉంటుంది.’’ అన్నాను.
ఆశ్చర్యపోయిన ఆయన, You are an amazing man! అన్నారు.
నాలుగు రోజుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక హెలిప్యాడ్‌ను మా కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసి, దానికి పోలీసుశాఖ మరియు పి.డబ్ల్యు.డి శాఖ అనుమతి పత్రాన్నీ తీసుకున్నాం. (ఇలాంటి వాటి కంతా గిన్నీస్ రికార్డు ఉందా అని కనుక్కోవాలి.)
ఈలోపు, నా చేతికొక పెద్ద జాబితా ఇవ్వబడింది. అది గవర్నరు వస్తున్నప్పుడు చెయ్యవలసినవి మరియు చెయ్యకూడనివి Do’s & Don’t’s ఎంత క్షుణ్ణంగా చదివినప్పటికీ, చెయ్యవలసినవి అంటూ అందులో ఏదీ లేదు. అన్నీ చెయ్యకూడనివే. రాజ్‌భవన్ యొక్క చేదు అనుభవాలన్నింటినీ ఎవరో పూర్తిగా ఏరి కూర్చి నవలికలాగా రాసినట్టుగా ఉందది.
దాన్ని చాలా కాపీలు తీసి, మైక్‌సెట్ ఏర్పాటుచేసే వ్యక్తి మొదలుకొని, కాలేజీ తోటమాలి, కాపలాదారుల వరకూ మనిషికొక కాపీ ఇచ్చి చదవమన్నాను, ‘అందులో నుండి ప్రశ్నలు అడుగుతాను’ అన్న ఒక హెచ్చరికతో! నేనైతే ఆ జాబితాను కంఠస్థమే చేసేశాను.
ఆ జాబితాలోని మొదటి విషయమే, ఉత్సవ ఆహ్వానపత్రికను ప్రచురించే ముందు, రాజ్‌భవన్ యొక్క అంగీకారాన్ని తీసుకోవాలి అన్నదే! దాని ప్రకారం నేను అప్పటికే వాళ్ల దగ్గర నుండి తీసుకొచ్చిన నమూనా ఆహ్వానపత్రికను దగ్గర పెట్టుకుని మేము తయారుచేసిన నమూనా ఆహ్వానపత్రికను, అంగీకారం కోసం పంపించాను.
దాన్ని చూసి, ఆ అధికారి, ‘‘ఎలా మా అనుమతి తీసుకోకుండా మీరు ఆహ్వానపత్రికను ప్రచురిస్తారు?’’ అని కోపంగా రుసరుసలాడారట. అంగీకారం కోసమే ఇచ్చామని ఎంతగా వివరించినప్పటికీ ఆయన సమాధానపడలేదట. నేనే చెన్నైకు నేరుగా వెళ్లి ఆయనను కలిసినప్పుడే నాకసలు విషయం తెలిసింది. మా డిజైనర్, నమూనా ఆహ్వానపత్రికనే ఎంతో శ్రద్ధతో, నేర్పుగా అసలు ఆహ్వానపత్రికలా తయారుచేసి ఇచ్చి పంపించారు.
ఆ అధికారేమో, ఈ కాలపు ఫోటోషాప్ లాంటి ఆధునిక విషయాలన్నీ తెలియని కార్బన్ పేపరు కాలపు మనిషి. నకలునే, అసలు అని నమ్మేశారు. విషయం తెలిశాక సర్దుకున్న ఆయన నాతో ఈ ప్రశ్న వేశారు: ‘‘ఎందుకు సార్, ఇలాంటి అధిక ప్రసంగీకులందర్నీ పనికి పెట్టుకున్నారు?’’
అదే కదా!
మధ్యలో, చాలాసార్లు, గవర్నరు బంగళాకు వెళ్లొస్తున్నప్పుడు (మసాలా టీ) ఎన్నోవ్యవహారాలను తెలుసుకున్నాను. బంగళాకు బయటున్న అమ్మవారి ఆలయ ఉత్సవం కోసం లౌడ్‌స్పీకర్లలో నుండి గట్టిగా వినిపిస్తున్న ఎల్.ఆర్.ఈశ్వరి గారి అమ్మవారి పాటల నుండి, తమిళనాడు గవర్నరుకు కూడా మినహాయింపు లేదని తెలుసుకుని మనసుకు హాయిగా అనిపించింది.
హెలిప్యాడ్ ఏర్పాటుచేసిన విషయాన్ని గవర్నరు గారి ఏ.డి.సి. కి చెప్పగానే, ‘‘నిజంగా సాధించేశారే!’’ అని ప్రశంసించి, ఆ హెలిప్యాడ్ యొక్క కో ఆర్డినేట్స్ (భూమధ్య రేఖ, అక్షాంశ రేఖల యొక్క పొడవు, వెడల్పు… క్షమించాలి. నేను ఇంగీషు మీడియం! భూమి యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్ సమాచారం అది!) తీసుకురమ్మని చెప్పారు.
నా జి.పి.ఎస్. పరికరం నుండి ఆ వివరాలను తీసుకుపోవటం వల్ల (ఇవ్వాల్టి నుండి నువ్వు ‘ముందుచూపు ముత్తన్న’ అని అందరిచేతా అభిమానంతో పిలవబడుదువు గాక!) ఉత్సాహభరితుడైన ఆ ఏ.డి.సి., హెలికాప్టరు పైలట్‌ను ఫోన్‌లో పిలిచి, వివరాలను అందించారు. మీరూ ఓసారి పైలట్‌తో మాట్లాడండి అని చెప్పి, ఒకరినొకరికి పరిచయం చేశారు. పైలట్ వినీత్ వర్మ, ఇంకో రెండు రోజుల్లో ట్రయల్ కోసం తాను అక్కడికొస్తున్నట్టు తెలిపారు. అక్కడున్నప్పుడే, నా అసిస్టెంటును ఫోన్లో పిలిచి, ట్రయల్ కోసం ఏ సమయంలోనైనా హెలికాప్టరు అక్కడికి రావచ్చు అన్న విషయాన్ని చెప్పాను.
ఆహ్వానపత్రికను ఇవ్వటానికి, మళ్లీ ఒకసారి గవర్నరును కలిశాను. ఈసారీ, నన్ను దగ్గరగా కూర్చోబెట్టుకుని, (మళ్లీ మసాలా టీ) చాలాసేపు మాట్లాడారు. తమిళనాడు గురించి ఎన్నో విషయాలను ఆయన క్షుణ్ణంగా తెలుసుకుని ఉండటం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన నుండి వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు కచ్చితంగా ఉత్సవానికి వస్తానని మళ్లీ స్పష్టం చేసి పంపించారు. ఆ రోజంతా ఎంతో ఉత్సాహంతో గడిపాను.
ఆరోజు గురువారం. ఉత్సవ ఏర్పాట్లను గమనించేందుకు చెన్నై నుండి వెనుదిరిగాను. ఆదివారం ఉదయం స్నాతకోత్సవం. శనివారం సాయంత్రమే గవర్నరు హెలికాప్టరులో వచ్చి దిగి, ఆ రాత్రి మా కాలేజీ అతిథి గృహంలో బస చేసేలా ఏర్పాటు చేశాము. కలెక్టరు, ఎస్పీ, వంటి ప్రభుత్వాధికారులు రావటమూ, ఉత్సవ ఏర్పాట్లను చూసి వెళ్తూ… ఒక సందడి ఏర్పడిన సమయంలో నా అసిస్టెంటు కోసం వెతికాను.
రెండు రోజులుగా, ట్రయల్ కోసమంటూ హెలికాప్టరు వస్తుందని ఆకాశంలోకే చూస్తూ ఉండటం వల్ల, మెడనొప్పి ఎక్కువైన్నట్టుగానూ, అందుకని ఆయన డాక్టరు దగ్గరికి వెళ్లినట్టుగానూ నాతో చెప్పి ఉండటాన్ని, తమాషాగా తీసుకోవటానికి వీలుకాలేదు. దాన్ని ‘సిక్ జోక్’ అన్న రకంగానే జాబితాలో చేర్చాను.
ట్రయల్ కోసం హెలికాప్టరు ఇంకా రాలేదని గవర్నరు గారి ఏ.డి.సి. కి చెప్పాలని భావించి, నా మొబైల్ ఫోన్‌ను తీసిన అదే క్షణంలో, గవర్నరు గారి ఏ.డి.సి.నే లైన్లోకి వచ్చారు. ఐ ఫోన్లో ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయా ఏంటీ? అని అనుకుంటూ, ‘‘హలో సార్!’’ అన్నాను.
ఆయన మొదలుపెడుతూనే, ‘‘ఒక బ్యాడ్ న్యూస్ సార్! హెలికాప్టరు రిపేర్! కాబట్టి మీ ఉత్సవం దాదాపు రద్దు కావచ్చు. ఇంకాసేపట్లో కన్‌ఫర్మ్ చేస్తాను.’’ అన్నారు. ఆ సమయంలో, ఉత్సవం జరగనున్న వేదిక ప్రాంతంలో నేను నిలబడున్నాను. నా చుట్టూ, వందమందికి పైగా ఉత్సవ ఏర్పాట్లను చేస్తున్నారు.
నేనెప్పుడూ, నా ముఖాన్ని నిర్ఘాంతపోతున్నట్టుగా పెట్టుకోవటం అలవాటు. దాంతో, నిజంగానే నేను నిర్ఘాంతపోయానని ఎవరూ కనిపెట్టలేకపొయ్యారు.
స్టేజ్ ఇన్‌చార్జీ ఆ సమయంలో, నా దగ్గరకొచ్చి, ‘‘వేదిక అలంకరణ కోసం పువ్వులు కొనటానికి బెంగుళూరు వెళ్లినవాళ్లు, బడ్జెట్‌లో ఇరవైవేల రూపాయలు ఎక్కువవుతోందని, ఏం చేద్దామని అడుగుతున్నారు?’’ అన్నాడు.
‘‘పర్వాలేదు! తీసుకు రమ్మని చెప్పండి.’’ అన్నాను.
ఉత్సవానికి గవర్నరు రావటంలేదని దాదాపు స్పష్టమైపొయ్యింది. ఇప్పుడు ఉత్సవం ఏర్పాట్లను కొనసాగించాలా, వద్దా అన్నదే నా ముందున్న ప్రశ్న. నిర్వహణా బాధ్యతలలో ఉన్నవాళ్లు ఎదుర్కొనే పెద్ద సవాలే, ఇక్కట్లైన సమయంలో నిర్ణయం తీసుకునే బాధ్యతను స్వీకరించటమే. ఆ నైపుణ్యం ఎన్నో సమయాలలో అనుభవాల వల్లనూ, కొన్ని సమయాలలో ఆంతరంగిక స్పందనల వల్లనూ బయటపడతాయి.
రాత్రి, పగలూ వంద మంది చేస్తున్న ఈ ఉత్సవ ఏర్పాట్లను ఇప్పుడు ఆపేస్తే, మళ్లీ ప్రారంభించటానికి వీలుకాదు. అందరూ వాళ్ల వాళ్ల ఊళ్లకు వెళ్లిపోతారు. ఒకవేళ, చివరి నిమిషంలో, గవర్నరు రాక మళ్లీ ఖాయమైతే, ఈ ఏర్పాట్లను పూర్తి చెయ్యటానికి వీలు కానే కాదు. కనుకనే, ఎవరితోనూ విషయాన్ని చెప్పకుండా, ఉత్సవ ఏర్పాట్లను కొనసాగించాను.
ఆ రాత్రి ఇంటికి రాగానే, నా కొడుకు నా దగ్గరికొచ్చి, ‘‘నా ప్రాజెక్ట్‌కు(హోం వర్క్) సాయం చేస్తారా డాడీ?’’ అని అడిగాడు.
‘‘వీలుకాదు.’’ అన్నాను.
‘‘హమ్మయ్యా! ఇవ్వాల్టికైనా తప్పుల్లేకుండా నేను ప్రాజెక్ట్‌ను సరిగ్గా చెయ్యొచ్చు.’’ అంటూ, ఆనందంగా వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు.
‘‘మన కాలేజీకి గవర్నరు వస్తున్నారు కదా! అందుకని డాడీ, టెన్షన్‌గా ఉన్నార్రా.’’ అంది నా భార్య. టెన్షన్, గవర్నరు వస్తున్నందువల్ల కాదు, రావటం లేదన్న కారణంగా అన్న విషయాన్ని నా భార్యకైనా చెప్పాలనిపించింది. మరునాడు శుక్రవారం ఉదయం, ఎన్నోసార్లు ప్రయత్నించిన తర్వాత గవర్నరు గారి ఏ.డి.సి. లైన్లోకి వచ్చారు. ‘‘సార్! మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను.’’ అన్నాను. తమిళనాడు ప్రభుత్వం నుండి వేరే హెలికాప్టర్ అడిగినట్టుగానూ, దొరికితే ఆ సాయంత్రం ఉత్సవానికి కన్‌ఫర్మ్ చేస్తానన్నట్టుగా చెప్పారు. అరె! పథకానికి ఇంకా ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నంత వరకూ నమ్మకమూ ఉంటుంది. సాయంత్రం మళ్లీ ఆయనకు ఫోన్ చేశాను. తమిళనాడు ప్రభుత్వానికి తక్కువ సమయంలో మార్పు ఏర్పాట్లు చెయ్యటానికి వీలు కాలేదనీ, అయినప్పటికీ తామందరూ తయారుగా ఉన్నామనీ, హెలికాప్టర్ దొరికితే వచ్చేస్తామనీ తెలిపారు. అంటే, గవర్నరు రావటానికీ రాకపోవటానికీ మధ్యన హెలికాప్టరే ఉంది. కాబట్టి, ఆయనతో, ‘‘అయితే నేనొక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసిస్తే చాలా?’’ అన్నాను. (చెప్పాను కదా! నేనొక అధిక ప్రసంగీకుడినని!) అటువైపున నిశబ్దం ఆవరించింది. కొంతసేపు మౌనం తర్వాత, ‘‘మీరే మీ సొంత బాధ్యతలో హెలికాప్టర్ ఏర్పాట్లు చేస్తామనా అంటున్నారు?’’ అన్నారు. ‘‘ఔను! అలా చేస్తే నేను మా ఉత్సవాన్ని జరుపుకోవచ్చుకదా?’’ అన్నాను. ‘‘కచ్చితంగా! అయితే, హెలికాప్టరు ఖర్చంతా ప్రభుత్వం భరించదు.’’ అన్నారు. ‘‘అది తెలుసు!’’ అన్నాను. ‘‘అయితే సరే. రేపు మధ్యాహ్నం ఇక్కడ నుండి మేము బయలుదేరటానికి సిద్దం. కాబట్టి, రేపు ఉదయం 9 గంటలలోపు హెలికాప్టరును తయారుగా ఉండేలా చూడండి.’’ అని చెప్పి తన మాటల్ని ముగించారు. అప్పుడు శుక్రవారం సరిగ్గా సాయంత్రం 6.30 గంటలు. ఆ విధంగా, నేను ఆ రాత్రిలోపు అద్దెకు ఒక హెలికాప్టరును వెతికి తీసుకు రావలసిన నిర్భందంలోకి నెట్టబడ్డాను. చివరి నిమిషంలో (కొట్టు వాయిల్ ` అన్న ఒక మాటను రచయిత ‘సుజాత’ ఉపయోగించేవారు) దేన్నైనా వెతికి తీసుకురావలసిన నిర్బంధం ఇంతకుముందు కూడా నాకు చాలాసార్లు ఏర్పడిరది. పట్టుచీర బాగాలేదని పెళ్లికి ముందు రోజు పారిపోయిన స్నేహితుడి చెల్లెలు. టోక్యోలో, దట్టంగా కురుస్తున్న మంచులో, అర్థరాత్రి పూట, ఒక బాటిల్ మంచినీళ్లు కొనటానికి అవసరమైన కొన్ని ‘యెన్’ నాణ్యాల కోసం, ఏదో ఒక అర్థరాత్రి సమయంలో (దాన్ని తెల్లవారి జాము అని కొందరంటారు)స్నేహితుడి ఇంటి గృహప్రవేశం కోసం వెతికి వేసారిన పంచితం(ఆవు మూత్రం), అంటూ… ఇలా రాత్రుల్లో వెతికి సాధించిన ఒక పొడవైన జాబితా నా దగ్గరున్నప్పటికీ, హెలికాప్టరు? కాస్త ఎక్కువే! తన ప్రయత్నంలో ఏమాత్రం మనసు చలించని విక్రమాదిత్యుడు(నేనే) తన యువ దళపతులను గోదాలోకి దింపి, ఆధునిక వృత్తి నైపుణ్యాల యొక్క సమస్త అవకాశాలను ఉపయోగించాక లభించిన సమాచారాలు ఇవీ. హెలికాప్టరు అద్దెకు ఇచ్చే సంస్థలు నిజానికి చాలా ఉన్నాయి. అవి దాదాపు ఢల్లీలోనూ, బెంగుళూరులోనూ ఉన్నాయి. ఎక్కడ నుండి అద్దెకు తీసుకున్నా బయలుదేరిన చోటు నుండి మళ్లీ తిరిగి వెళ్లి చేరేంతవరకూ అయ్యే దూరానికి అద్దె చెల్లించాలి. గవర్నరు ప్రయాణించేలాంటి రక్షణ సౌకర్యాలు కలిగిన హెలికాప్టర్లు చాలా తక్కువగానే ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా, ఇవన్నీ వివరించటానికి ఏ కార్యాలయంలోనూ, ఎవరూ లేరు. దాదాపు అన్ని కార్యాలయాల్లోని టెలిఫోన్లూ రింగవుతూనే ఉన్నాయి. దాదాపు రాత్రి కావటంతో, అన్ని కార్యాలయాలూ మూసివేయబడ్డాయి. ఏదో ఒక ఫోన్‌కాల్ ట్రాన్స్‌ఫర్లో దొరికిన ఒక ఆసామి ఈ వివరాలన్నింటినీ చెప్పారు. మొత్తానికి, మన దేశంలో కూడా, ఒక హెలికాప్టరును అద్దెకు తీసుకునే అన్ని అవకాశాలూ ఉన్నాయి. అయితే టూ లేట్! మరునాడు శనివారం కావటంతో, మనకు అవసరమైన ఏ కార్యాలయమూ తెరవలేదు. గవర్నరు బయలుదేరవలసిన సమయం గడిచిపోయింది. ఇకపైన, ఆయన బయలుదేరి వచ్చే అవకాశాలూ దాదాపు లేవని అర్థమైంది. రెండువైపులా, అన్ని బంధాలూ తెగిపోయిన స్థితిలో, ఆ సాయంత్రం నేను చెప్పకనే మిగిలినవాళ్లందరూ ఒక నిర్ణయానికొచ్చేశారు. గవర్నరు రావటం లేదు. మరునాడు ఉదయం జరగనున్న స్నాతకోత్సవాన్ని వాయిదా వెయ్యటానికి వీలు లేదు. పట్టాలు తీసుకోనున్న యువ ఇంజనీర్లు తమ తల్లిదండ్రులతో కలిసి రావటం మొదలుపెట్టేశారు. ఎవరితోనూ ఏమీ చెప్పకుండా రాత్రి ఇంటికొచ్చి చేరాను. మూడు రోజులుగా నిద్ర లేకపోవటంతో, కళ్లు నిప్పుల్లా మండుతున్నాయి. దాదాపు నిద్రలోకి జారుకున్నాను. నా మొబైల్ మోగింది. కలెక్టరు గారు చేశారు. తియ్యగానే ‘’Mr.Karuna. Get Ready. His Excellency is coming by Road tomorrow morning’’ అన్నారు. మరునాడు ఉదయం సరిగ్గా పదిగంటల సమయంలో, మంగళ వాయిద్యాలు మ్రోగుతుంటే, తమిళనాడు గవర్నరు, మేడమ్ గవర్నరుతో కలిసి మా కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించారు. కాలేజీ అతిథి గృహంలో జిల్లా పోలీసు శాఖ ఇచ్చిన ‘గార్డ్ ఆఫ్ ఆనర్‌ను’ స్వీకరించి, తర్వాత కలెక్టరు మొదలైన జిల్లా అధికారుల ఆహ్వానాన్ని అందుకున్నారు. తర్వాత, నేనెక్కడున్నానని తన కళ్లతో వెతికి, దగ్గరికి పిలిచి, See, I have come అన్నారు. ‘‘విశ్రాంతి అవసరం లేదు. ఒక కాఫీ తాగి నేరుగా వేదిక దగ్గరికి వెళ్లిపోదాం.’’ అని గవర్నరు చెప్పేశారు. ఆ కాస్త విరామ సమయంలో, గవర్నరు గారి ఏ.డి.సి., మెల్లగా నా దగ్గరికొచ్చి, ‘‘ఎంతగానో చెప్పి చూశాం. క్యాన్సిల్ చేసేద్దామని! కానీ గవర్నరు వినిపించుకోలేదు. నేను వెళ్లే తీరాలి I have given my word to that young man అని చెప్పేశారు.’’ అన్నారు. తలపైకెత్తి గవర్నరుకేసి చూశాను. అప్పటికే ఎత్తైన ఆ పెద్దమనిషి, నా కళ్లకు కర్ణన్ సినిమాలో, శివాజీ గణేశన్‌కు ప్రత్యక్షమయ్యే ఎన్టీయార్ లాగా, మహావిష్ణు రూపంలో భూమ్యాకాశాలను తాకే విశ్వరూపంతో నిలబడ్డారు. ఉత్సవం ఎంతో గొప్పగా ముగిసింది, మళ్లీ అతిథి గృహానికి తిరిగొచ్చాం. ఉత్సవంలో గవర్నరును ఆహ్వానిస్తూ నేను బాగానే మాట్లాడాను. నిజానికి ఆయన గురించి మాట్లాడటానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రానికి) ఆర్థిక మంత్రిగా 16 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొట్ట మొదటిసారిగా ఉపాధ్యాయులకు పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చిన గొప్పతనం ఆయనకుంది. ఆర్థిక వ్యవహారాలలో చాలా కఠినంగా ఉండే ఆయన మీద, ఇప్పటిదాకా ఒక చిన్న నేరారోపణ కూడా ఎవరూ చెయ్యలేని విధంగా నడుచుకున్న నిజాయితీ అయిన వ్యక్తి. అన్ని గొప్పతనాలతో పాటుగా, తాను ఇచ్చిన మాటను నిలుపుకునే అద్బుతమైన మనిషి అన్నదీ నా అనుభవం నుండి నేను ఆ రోజు తెలుసుకున్నాను.
మధ్యాహ్న భోజన సమయంలో నా ఫోన్(సైలెంట్ మోడ్‌లో) మోగుతూనే ఉంది. గవర్నరుతో ఉండటం వల్ల ఎవరు చేస్తున్నారో చూడ్డానికి వీలుకాలేదు. ఫోన్ మోగటం ఆగలేదు. బయటికొచ్చి ఎవరాని చూశాను. ఢల్లీిలో నుండి హెలికాప్టరు కంపెనీ నుండి ఒక ఇంపైన అమ్మాయి కంఠం. వాళ్ల హెలికాప్టరొకటి ప్రస్తుతం అనుకోకుండా చెన్నైకు వచ్చినట్టుగానూ, మీరు కోరితే, మీ అతిథిని మేము మీ ఊరికి తీసుకురావటానికి తయారుగా ఉన్నామని చెప్పింది.
అంతలోపే గవర్నరు భోజనం పూర్తిచేశారు.
గవర్నరూ, మేడమ్ గవర్నరూ ఆ సాయంత్రం చెన్నైకు తిరిగి వెళ్లిపోయాక మనసులో ఒక ప్రశాంతత అలుముకుంది. గత కొన్ని రోజులుగా, నాతోపాటు రాత్రీ పగలూ కష్టపడ్డ నా టీమ్‌లోని సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపి, వాళ్లను ఇండ్లకు పంపించి, రాత్రి ఇంటికి బయలుదేరాను. శారీరకంగా చాలా నీరసంగా ఉన్నప్పటికీ కూడా, మానసికంగా ఉత్సాహంగానే ఉన్నాను. మొబైల్ ఫోన్‌ను చార్జింగులో పెట్టటానికి ముందు దాన్లోకి చూశాను. ఏడు కొత్త మెసేజ్‌లు ఉన్నాయి. తెరిచి చూస్తే, ఏడూ ఒక్కరి నుండే!
Boss! Chopper is Ready Now!
Waiting for the orders to fly His Excellency!
Captain Vineeth Varma.
ఆయనే నండీ! గవర్నరు హెలికాప్టరు యొక్క పైలట్.
(సూచన: ఆ హెలిప్యాడ్ ఇంకా మా కాలేజీ మైదానంలోనే ఉంది. పాఠకులలో ఎవరైనా మా ఊరికి హెలికాప్టరులో వస్తే దాన్ని ఉపయోగించుకోవచ్చు.)
![]()

1961 మే 1 న తిరుత్తణిలో జన్మించారు. ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎంఏ చేశారు. 1983 రచనలు చేస్తున్న ఆయన 161కి పైగా కథలూ, 123 పైగా కవితలూ రాశారు. ఏడు కథాసంపుటాలు, ఒక కవిత్వ సంపుటి, ఒక నవల వెలువరించారు. వీరి సాహిత్య కృషికి పలు పురస్కారాలు లభించాయి. తమిళం నుంచి తెలుగులోకి అనువాదాలు చేస్తుంటారు. తమిళం నుండి 130 కి పైగా కథలు, 11 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం అనువదించారు. అనువాదంలో చేసిన కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు మరిన్ని అవార్డులు లభించాయి.




Discussion about this post