తమిళ మూలం: అప్పాదురై ముత్తులింగం
ఆంగ్ల అనువాదం: తిలా వర్గీస్
తెలుగు అనువాదం: కొల్లూరి సోమ శంకర్
[తమిళంలో శ్రీ అప్పాదురై ముత్తులింగం ‘எங்கேயோ இப்ப மூன்று மணி’ (ఎన్‍కేయో ఇప్ప మూన్డ్రు మణి) పేరుతో రచించిన కథని శ్రీమతి తిలా వర్గీస్ ‘It Started with a Phone Call’ పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. ఆంగ్ల ఆనువాదం నవంబర్ 2023లో ప్రముఖ సాహిత్య వెబ్ మాగజైన్ Words Without Borders లో ప్రచురితమైంది. ఆంగ్ల అనువాదాన్ని, మూల కథని ఈ లింక్ లో చదవవచ్చు. ఈ కథ ‘Armory Square Prize for South Asian Literature in Translation’ పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచింది. శ్రీలంకలో అంతర్యుద్ధం నుండి పారిపోవడానికి ఒక యువకుడు చేసిన ప్రయత్నానికి తగిలిన ఎదురుదెబ్బ గురించి ఈ కథ చెబుతుంది. ఆంగ్ల అనువాదం ఆధారంగా కొల్లూరి సోమ శంకర్ ఈ కథని తెలుగులో అందిస్తున్నారు.]
నేను లైన్‌లో మూడోవాడిని. సరిగ్గా నాలుగు నిమిషాల్లో, నా జీవితం మారబోతోంది. చంద్రశేఖరన్ అప్పటికే విజయవంతం అయినందున, మా ప్లాన్ పనిచేస్తున్నట్టే అనిపించింది. శ్రీలంకలోని కటునాయకే అంతర్జాతీయ విమానాశ్రయం సందడిగా ఉంది. లైన్‌లో నా ముందు పద్మనాభన్, వెనుక సుధాకరన్ ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ ముఖం స్నేహపూర్వకంగా అనిపించింది. నా కంగారుని, బెరుకుని నియంత్రించుకోడానికి, నిశ్చింతగా కనిపించడానికి ప్రయత్నించాను. మా నలుగురిలో, భయంతో మా గుట్టు రట్టు చేసేవాడెవరైనా ఉన్నారంటే, అది సుధాకరన్ అని అనిపిస్తోంది. వెనక్కి తిరగకుండానే, కంటి మూల నుంచి చూస్తే, అతని వేళ్లు వణుకుతున్నట్లు తెలుస్తోంది.
2007 అక్టోబర్‌లో అనురాధపురం ఎయిర్ ఫోర్స్ బేస్‌పై ‘ఆపరేషన్ ఎల్లాలన్’ పేరిట జరిగిన దాడి తర్వాత, విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 2005లో నేను మొదటిసారి విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు అలాంటి సమస్యలేవీ లేవు. రెండేళ్ళ తరువాత, ఇప్పుడు నేను విమానాశ్రయంలో మరో ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఏజెంట్ శిక్షణ ఇచ్చినట్లే, నేను ఓడలోని సిబ్బందితో చేరడానికి బ్రెజిల్ వెళ్తున్నానని అధికారికి చెప్పాను. ఆ అధికారి నన్ను నమ్మాడు. అతను తన చేతిలో ఉన్న స్టాంప్‌ను గాలిలోకి పైకి లేపి నా పాస్‌పోర్ట్‌లోని ఎనిమిదవ పేజీపై ముద్ర వేసి, పాస్‌పోర్ట్‌ని నా వైపుకు నెట్టాడు. నా పాస్‌పోర్ట్ తీసుకొని, మెల్లగా, “ధన్యవాదాలు” అని చెప్పి ముందుకు సాగాను. ఇప్పుడు, మేం ముగ్గురం లోపల ఉన్నాము. సుధాకరన్ ఒక్కడే అటువైపు ఉన్నాడు. అతను కూడా ఇక్కడికి చేరుకుంటే, మా కెనడా ప్రయాణం ఉద్దేశం నెరవేరుతుంది.
ఆ అధికారి ముందు నిలబడినప్పుడు, సుధాకరన్ ఓ మనిషిలానే లేడు. శరీర భాగాల సముదాయంగా కనిపిస్తున్నాడు, మొత్తం శరీరం వణికిపోతోంది. అతని నుదుటిపై చెమటలు. పాస్‌పోర్ట్‌ను అధికారికి అందిస్తుండగా, అది అతని చేతుల నుండి జారి నేలపై పడింది. అతను వంగి దాన్ని తీసుకుని, తన శరీరాన్ని నిటారుగా చేయకుండానే, పాస్‌పోర్ట్ అందించడానికి తన చేతిని చాచాడు. తన ముందు నిలబడి ఉన్న వ్యక్తిని చూడకుండా, పాస్‌పోర్ట్ పేజీలను తిప్పుతూ, ఆ అధికారి ఏవో కొన్ని అనాసక్త ప్రశ్నలు అడిగాడు. అధికారి అడగని ప్రశ్నలకు సుధాకరన్ సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు. “ఓడలో సిబ్బందితో చేరడానికి మీరు మీతో ఏం తీసుకువెళుతున్నారు?” అని అధికారి అడిగాడు. సుధాకరన్ అతనికి నావికుల శిక్షణ సర్టిఫికేట్ చూపించి ఉండాలి. బదులుగా, అతను, “6,000 కెనడియన్ డాలర్లు” అన్నాడు. ఆ అధికారి, “మీతో ఇంకా ఎవరు ఉన్నారు?” అని అడిగినప్పుడు, అతను మా పేర్లను బిగ్గరగా, స్పష్టంగా చెప్పేసాడు. వారు మమ్మల్ని వెనక్కి పిలిచి, మమ్మల్ని శోధించి, మొత్తం 24,000 డాలర్లను స్వాధీనం చేసుకున్నారు.
మొదట, మమ్మల్ని ఒక ప్రైవేట్ గదికి తీసుకెళ్లి, బట్టలు విప్పించి తనిఖీ చేశారు. తర్వాత వారు మా సూట్‌కేసులను తనిఖీ చేశారు, ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలించారు, విభాగాల వారీగా. చివరికి, మేము ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం’కి చెందిన వాళ్ళమనీ, మేము 24,000 డాలర్లతో విదేశాలకు వెళ్లి ఓ ఓడ కొనాలని నిర్ణయించుకున్నామనీ ప్రకటించారు. ఏ దేశంలో 24,000 డాలర్లకు మొత్తం ఓడను కొనగలమో వారు మాకు చెప్పలేదు. మా చేతులు కట్టేసి మమ్మల్ని బలవంతంగా జీపులోకి ఎక్కించారు. ఈ లోపు, మేము ఎక్కాల్సిన విమానం, మా జీపు పైనుంచి, ఆకాశంలో కెనడాకు ఎగిరిపోయింది.
నేను బ్యాంకులో పనిచేసినందున, నాకు సింహళ భాష కొంచెం వచ్చు. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారని గార్డును అడిగాను. అతను, “మూడవ అంతస్తు” అన్నాడు. మా గుండెలదిరాయి. మూడవ అంతస్తు అంటే ఒక టార్చర్ ఛాంబర్.
“తర్వాత ఏం జరుగుతుంది?” అడిగాను.
“మిమ్మల్ని విచారించిన తర్వాత, వాళ్ళు మిమ్మల్ని బూసా జైలుకు పంపుతారు” అతను బదులిచ్చాడు.
బూసాలో తమిళ ఉగ్రవాదులను బంధించారు. అక్కడికి వెళ్ళినవారెవరూ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు.
“ఆ తర్వాత ఏం జరుగుతుంది?” అడిగాను.
గార్డు నల్లటి పై పెదవి ఒక వైపుకు వంగి ఉంది. అతను నవ్వి. “శరీరాన్ని పూడ్చాలా లేక కాల్చాలా అని వాళ్ళు నిర్ణయిస్తారు.” అని చెప్పాడు.
ఆ తర్వాత ఇక నేనేమీ అడగలేదు.
![]()
ఇదంతా ఒక ఫోన్ కాల్‌తో మొదలైంది.
~
ఎ-లెవల్ హైస్కూల్ పరీక్షలు రాసాకా, నాకు ఒక బ్యాంకులో ఉద్యోగం దొరికింది. నా క్లాస్‌మేట్స్ కొందరు తమిళ వేర్పాటువాద ఉద్యమంలో చేరారు లేదా విదేశాలకు వెళ్ళిపోయారు. మేకలు, ఇతర పశువులు, నగలు – ఇలా ఏది వీలైతే దాన్ని అమ్మేసి విమాన ఛార్జీలు చెల్లించి మరీ వెళ్ళిపోయారు. నేను దాని గురించి ఆలోచించలేదు. నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, అమ్మ కంటి చూపు మందగిస్తోంది. నేను వారి ఏకైక కొడుకుని. వారిని ఎలా వదిలి వెళ్ళగలను? సాయంత్రం బ్యాంకు నుంచి ఇంటికొచ్చాకా, పనిమనిషి వండి వెళ్ళిన ఆహారాన్ని వారికి వడ్డించేవాడిని. మేం ముగ్గురం కలిసి కూర్చుని తినేవాళ్ళం. ఆ విధంగా మా జీవితంలో రోజులు గడుస్తున్నాయి, ప్రతి రోజు దాని ముందు రోజులానే సాగేది, దాని తరువాతి రోజు అలాగే ఉండేది.
బ్యాంకులో నాకు మంచి పేరుంది. నేను మర్యాదగా మాట్లాడటం వల్ల కస్టమర్లు నన్ను సులభంగా నమ్మేవారు. ఒక వీడియో స్టోర్ యజమాని బ్యాంకుకు తరచుగా వచ్చేవాడు. అతనికి నా ప్రవర్తన నచ్చింది. మా కుటుంబం గురించి తెలుసుకున్న తర్వాత, అతనో పెళ్ళి సంబంధం తెచ్చాడు. థంపాలకమంలో అతని బంధువుల అమ్మాయి పెళ్ళీడుకి వచ్చింది. నేనుంటున్న ట్రింకోమలీ నుంచి ఆ ఊరికి బస్సులో ఒక గంట ప్రయాణం. చూసిన వెంటనే, నాకు ఆమె నచ్చేసింది. ఆమె ఛాయ రక్తంతో కలిపిన నీటిని గుర్తు చేసింది. శరీరం కొంచెం ఉబ్బినట్లుగా అనిపించినప్పటికీ, ఆమె కళ్ళు ప్రత్యేకంగా దేనిపైనా దృష్టి పెట్టకుండా, చిలిపిగా తోచాయి. ఆమె అటు ఇటూ నడుస్తుంటే, ఆమె అందం మరింత పెరిగింది. ఈ సంబంధం మా అమ్మానాన్నలకు కూడా నచ్చింది, దాంతో వెంటనే మా పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళయి కాపురానికి వచ్చాక, నా భార్య మాలతికి ఓ సమస్య ఎదురైంది. థంపాలకమంలోని ఆఫీసుకు వెళ్ళేందుకు ప్రతిరోజూ ఉదయం ఏడు గంటలకల్లా తయారైపోయి, బస్సు ఎక్కాలి. ఆఫీసు పనంతా అయ్యాకా, సాయంత్రం బాగా అలసిపోయి ఇల్లు చేరేది. ఆమెను చూస్తే నాకు జాలేసేది.
ఒకరోజు రాత్రి ఏడు గంటలకు, ఫోన్ మోగింది. అమ్మ ఫోన్ తీసింది.
ఫోన్ చేసిన వ్యక్తి, “నేను కనకరాజన్‌తో మాట్లాడాలి” అని దురుసుగా అన్నాడు.
“బాబు ఇంకా ఆఫీసు నుండి ఇంటికి రాలేదు. వచ్చాకా నేను వాడికి చెబుతాను. మీరు ఎవరు? ఏమిటి విషయం?” అమ్మ అడిగింది.
ఫోన్ చేసిన వ్యక్తి బూతులు తిట్టాడు. తర్వాత ఒక నంబర్ ఇచ్చి, “ఇంటికి రాగానే మీ కొడుకుని నాతో మాట్లాడమని చెప్పు” అని ఫోన్ పెట్టేశాడు.
ఇదేదో పెద్ద సమస్య అని అమ్మకి వెంటనే అర్థమైంది. నేను బ్యాంకు నుండి ఇంటికి రాగానే, అమ్మ, మాలతి జరిగిన విషయం చెప్పారు. నేను ఆ నంబర్‌కు ఫోన్ చేసాను.
“కనకరాజన్, నేను తమిళ వేర్పాటువాద ఉద్యమానికి చెందినవాడిని. మాకు పది లక్షల రూపాయలు కావాలి. ఆ డబ్బు తీసుకుని రేపు ఉదయం నేను నీకు పంపించే లొకేషన్‌కి రావాలి.”
అమ్మా, మాలతి నా పక్కన నిలబడి ఉండకపోతే, నేను అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయేవాడిని.
“పది లక్షలా? నేనో సాధారణ బ్యాంకు గుమస్తాని. వృద్ధులైన అమ్మానాన్నలను నేను చూసుకుంటున్నాను. నాకు ఈ మధ్యే పెళ్లయింది. ఎవరో అనుకుని నాకు ఫోన్ చేసినట్టున్నారు.”
“నాకన్నీ తెలుసు. గత రెండేళ్ళుగా, నువ్వు ప్రమోషన్ కోసం మీ మేనేజర్‌ను బ్రతిమాలుతున్నావు. అయినా నీకు రావడంలేదు. మీ బ్యాంకు నుండి పది లక్షలు తీసుకొచ్చి ఇవ్వు,” ఆ గొంతు ఆదేశించిది.
“డబ్బు దొంగిలించాలా? నా ఉద్యోగం పోతుంది.”
“ఉద్యోగమా? నీ జీవితం కంటే నీ ఉద్యోగం ముఖ్యమా? డబ్బు సంపాదించడానికి నీకు ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నాను. పోలీసుల దగ్గరికి వెళితే నువ్వు ఇంటికి తిరిగి వస్తావు, కానీ నీ భార్య థంపలకమం నుండి తిరిగి రాదు. నీకు వివరాలు రేపు చెబుతాను.” నేను బ్రతిమాలడం మొదలుపెట్టేలోపే, అతను ఫోన్ కట్ చేశాడు.
నా చేతులు వణుకుతున్నాయి. కానీ మాలతి ధైర్యవంతురాలు. ఆమె థంపలకమంలో ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంది. ఆమెకు తమిళ వేర్పాటువాద ఉద్యమకారులతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఆమె స్నేహితులు చాలా మంది అమరులయ్యారు.
“మీరెందుకు భయపడుతున్నారు? నేను ఉన్నాను కదా?” అంది మాలతి. స్వయంగా వేర్పాటువాద ఉద్యమ కార్యాలయానికి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పింది; వాళ్ళు ఆశ్చర్యపోయారు. “మేమెప్పుడూ సాధారణ ప్రజలను ఈ విధంగా డబ్బు అడగం. డబ్బు దోచుకోవాలని చూసే కొన్ని గ్యాంగుల పని ఇది. మనం వారిని ఎలాగైనా ఓడించాలి,” అంటూ తమ ప్లాన్‌ని మాలతికి వివరించారు. మాలతి, “అలాగే, అలాగే” అని చెబుతూ తల ఊపింది.
![]()
మరుసటి రాత్రి మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. “పది లక్షల రూపాయలు అక్రమంగా రవాణా చేయడం నాకు సాధ్యం కాదు. నేను ఐదు లక్షలు తెస్తాను. ఆ తర్వాత, మీరు నన్ను వదిలేయాలి,” అని నేను నమ్మకంగా వేడుకున్నాను. వారు అంగీకరించారు. మరుసటి రోజు ఉదయం కాగితాలతో నింపిన సంచితో బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు, తాను కూడా నాతో వస్తానని పట్టుబట్టింది మాలతి. ఆలస్యం అవుతోంది. నేను పది గంటలకు డాక్‌యార్డ్ టెలిఫోన్ సెంటర్ దగ్గర ఉండాలి. వారించడానికి అవకాశం ఇవ్వకుండా, మాలతి నాతో పాటు ఆటోలో ఎక్కి కూర్చుంది. మేము అక్కడికి చేరుకున్నప్పుడు, అక్కడ ఎవరూ లేరు. నేను ఆ నెంబర్‌కి ఫోన్ చేసి డబ్బు తెచ్చానని చెప్పాను. “సరే, అక్కడే వేచి ఉండండి. మా వాడు ఆటోలో వస్తాడు. అతనికి డబ్బు ఇవ్వండి” అని చెప్పాడతను. నేను డబ్బు ఇస్తునప్పుడు, ఉద్యమానికి చెందిన వ్యక్తులు తాము దాక్కున్న ప్రదేశం నుండి బయటకు వచ్చి ఆ నేరస్థుడిని పట్టుకోవాలనేది ప్రణాళిక. కానీ ఆటో ఇంకా రాలేదు, ఉద్యమకారుల జాడ కూడా లేదు.
కొద్దిసేపటి తర్వాత, ఒక యువకుడు ఆటోలో వచ్చాడు. వంగిపోయిన చెరకు కొమ్మలా కనిపించే సన్నని శరీరంతో పద్దెనిమిదేళ్ల వ్యక్తి అతను. ఆటోలోంచి దిగుతూ, సెల్ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అతను పాలిపోయి, రక్తహీనతతో కనిపించాడు. ఒక్కసారి నెట్టేస్తే పడిపోయేటట్టున్నాడు. అతని కనుబొమలో బోడి మచ్చ ఉంది. అతను ఇప్పుడే నిద్ర లేచినట్టు, చాలా రోజులుగా ఆహారం తిననట్టు కనిపించాడు. మా దగ్గరకి వచ్చాడు. ఫోన్ చెవి దగ్గరే పెట్టుకుని, బ్యాగ్ అడిగాడు. ఉద్యమకారులు ఎక్కడా కనిపించలేదు. నేను అతనికి బ్యాగ్ ఇస్తే, అతను వెళ్ళిపోతాడు. అందుకని, కాస్త సమయం తీసుకునేందుకు, “నాకు ఫోన్ ఇవ్వు. నేను మీ బాస్‌తో మాట్లాడాలి” అని అన్నాను. అతను అయిష్టంగానే నాకు ఫోన్ ఇచ్చాడు. లైన్‌లో అవతలి వైపు ఉన్న వ్యక్తి నన్ను తొందర పెట్టాడు. “మా వాడే. అతనికి బ్యాగ్ ఇచ్చేయ్. బ్యాగ్ ఇచ్చెయ్.” అన్నాడు. అదృష్టవశాత్తూ, అప్పుడే, వేర్పాటువాద ఉద్యమానికి చెందిన సాయుధ వ్యక్తులు ఇద్దరు ఆటోలో వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు క్రిందకి దూకారు. సగం కనుబొమ ఉన్న ఆ కుర్రాడిని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. అతడిని తమ వాహనం లోపలికి తోసి, వాళ్ళని అనుసరించమని మాకు చెప్పారు. ఇదంతా స్వల్ప సమయంలో ముగిసిపోయింది.
నా పని పూర్తయింది. ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఈ సాహసకృత్యం మాలతికి ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆమె కళ్ళు విప్పారాయి. ఆమె ముఖంలో ఉత్కంఠ తెలుస్తోంది. మరో వంద మైళ్ళు అయినా వాళ్ళని అనుసరించడానికి సిద్ధమైంది. కస్టమ్స్ రోడ్‍లో ఓ మలుపు తిరిగాకా, ఓ భవనం ముందు సాయుధుడైన వ్యక్తి కాపలా నిలబడి ఉండడం కనిపించింది. పెద్ద బోర్డు మీద ఎరుపు పసుపు రంగులలో ఏదో రాసి ఉంది. ఆ కుర్రాడిని భవనం వెనుకగా ఉన్న ఓ రహస్య స్థలంలోకి తీసుకువెళ్ళారు. గోనె సంచీ దుమ్ము దులుపుతున్నట్టుగా, చావబాదారు. ఆ కుర్రాడు గట్టిగట్టిగా అరవసాగాడు. చచ్చిపోతాడేమో అనిపించింది. చివరికి ఓ తాడుతో అతన్ని కట్టేసారు. కాసేపటికి ఆ గ్రూప్‌కి నాయకుడిలా అనిపించే ఓ వ్యక్తి వచ్చాడు. ఆ కుర్రాడిని ప్రశ్నించసాగాడు.
“నీ పేరేంటి?”
“చెందన్ అముధన్.”
“నీకు పేరు పెట్టడానికి మీ నాన్నకి వేరే పేర్లే దొరకలేదా? వందియదేవన్, అరుళ్మోళి వర్మన్, సుందర చోళన్ అనే పేర్లు అప్పటికే పెట్టేసుకున్నారని చెప్పి ఆయన నీకు ‘చెందన్ అముధన్’ అని పేరు పెట్టాడా?”
“అయ్యా, దయచేసి నన్ను కొట్టకండి. కడుపు నింపుకోడానికి ఈ పని చేసాను.” చెప్పాడా కుర్రాడు
“పూలు అమ్మడానికి బదులు, నువ్వు మనుషులను అమ్ముతున్నావా?” అంటూ మళ్ళీ ఒకటి తగిలించాడు
“అయ్యా, దయచేసి నన్ను నమ్మండి. నాకేమీ తెలియదు,” అంటూ అరిచాడా కుర్రాడు.
అన్నం తిని రెండు రోజులయ్యిందని చెప్పాడు. ఇంట్లో అతనికి ముగ్గురు చెల్లెళ్ళు, అమ్మా ఉన్నారట. వారి ఆకలి భరించలేక, అతను ఈ పనికి అంగీకరించాడట. ఎవరో అతనికి ఒక బ్యాగ్ ఇస్తారని, దానిని తీసుకెళ్ళి వాళ్ళకిస్తే, 5,000 రూపాయలు ఇస్తారని చెప్పారట. ఆ మనిషి పేరు లేదా చిరునామా ఈ కుర్రాడికి తెలియదు. అతని సెల్ ఫోన్ నంబర్ మాత్రమే ఉంది. “నన్ను చంపకండి. నేను నిజం చెబుతున్నాను,” అంటూ ఆ కుర్రాడు విలపించాడు. అతను నిజమే చెబుతున్నాడని గ్రహించాము.
~
ఆ తర్వాతే నాకు సమస్యలు మొదలయ్యాయి.
![]()
మూల రచయిత గురించి:
అప్పదురై ముత్తులింగం శ్రీలంకకు చెందినవారు. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితికి తరఫున అనేక దేశాలలో పనిచేశారు. ప్రస్తుతం కెనడా పౌరుడైన ఆయన రెండు నవలలు, కథా సంకలనాలు, వ్యాసాలు మరియు ఇంటర్వ్యూలతో సహా తమిళంలో ముప్పై పుస్తకాలను ప్రచురించారు. ఆయన మూడు కథాసంకలనాలు ఆంగ్లంలోకి అనువదించబడి ప్రచురించబడ్డాయి. భారతదేశంలోని తమిళనాడు అత్యున్నత సాహిత్య పురస్కారం (1996), శ్రీలంక ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు (1998)తో సహా అనేక అవార్డులను ఆయన గెలుచుకున్నారు. 2014లో, ఆయన మార్ఖం సిటీ కౌన్సిల్ (కెనడా) సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన వికటన్ సాహిత్య పురస్కారం (2012), ప్రతిష్ఠాత్మక ఎస్.ఆర్.ఎమ్. విశ్వవిద్యాలయం (భారతదేశం) సాహిత్య పురస్కారం (2013), కి.రా అవార్డు (2022) గ్రహీత. సాహిత్య శ్రేష్ఠతను ప్రోత్సహించే ఉద్దేశంతో కెనడాలో స్థాపించబడిన స్వచ్ఛంద సంస్థ తమిళ లిటరరీ గార్డెన్‌కు ఆయన ఛైర్మన్. హార్వర్డ్ విశ్వవిద్యాలయం, టొరంటో విశ్వవిద్యాలయంలో తమిళ అధ్యయన కేంద్రాల స్థాపన కోసం USAలో నమోదు చేయబడిన స్వచ్ఛంద సంస్థ తమిళ్ చైర్ ఇన్‌కార్పోరేషన్ వ్యవస్థాపకుడు/డైరెక్టర్. ఆయన కథలు ఆంగ్లంలోకి అనువాదమై – వర్డ్స్ వితౌట్ బోర్డర్స్, స్పిల్‌వర్డ్స్.కామ్, ఇన్‌స్పైర్డ్, అసింప్టోట్, నేరేటివ్ వంటి వెబ్ పత్రికలో ప్రచురితమయ్యాయి. మెనీ రోడ్స్ త్రూ ప్యారడైజ్ (పెంగ్విన్ బుక్స్, 2014), అప్రూటింగ్ ది పంప్‌కిన్ (ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 2016) అనే సంకలనాలలోనూ ప్రచురితమయ్యాయి.
~
ఆంగ్ల అనువాదకురాలి గురించి:
థిలా వర్గీస్ కెనడాలో నివసిస్తున్నారు. వెస్ట్రన్ యూనివర్సిటీలో సీనియర్ రైటింగ్ అడ్వైజర్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. తమిళ రచనలకు ఆమె చేసిన ఆంగ్ల అనువాదాలు వివిధ అంతర్జాతీయ పత్రికలలో, మ్యాగజైన్‌లలో ప్రచురితమయ్యాయి. ఖలీద్ హొస్సేనీ రాసిన Sea Prayer ను ఆమె తమిళంలోకి అనువదించారు. ఇది 2023లో భారతదేశంలో ప్రచురించబడింది.
ఆమె రాసిన మూడు కథలు కెనడియన్ జాతీయ కథా పోటీలలో లాంగ్‍లిస్ట్ అయ్యాయి, ఒకటి గౌరవప్రదమైన ప్రస్తావనను పొంది. 2023లో ఒక సంకలనంలో ప్రచురించబడింది. ఆమె కెనడాలోని ఆల్బెర్టా, ఒంటారియోలోని ప్రచురణలకు వార్తలను, ఫీచర్ కథనాలను కూడా అందిస్తున్నారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ. డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్‍పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.




Discussion about this post