కన్నడ మూలం: ఎఫ్.ఎం.నందగావ్
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్
“నీ బుఱ్ఱ టెంకాయ. ఎంత చెప్పినా కొంచెం కూడా నీ తలలోకి ఎక్కడం లేదు.”
ఏడో తరగతి చదువుతున్న రేవతి మూడో తరగతి చదువుతున్న తన తమ్ముడు అవినాశ్‌కు లెక్కలు చెప్పిస్తోంది, తమ్ముడికి అర్థం కావడం లేదని ముఖం చిట్లిస్తూ కోపపడుతూ ఉంది.
అప్పుడే ఆఫీసు నుండి వచ్చి ఇంటి గుమ్మంలొ అడుగుపెట్టిన నేను ఉస్సూరుమంటూ కుర్చీలో కూర్చునేలోపే రేవతి గోల వినిపించింది.
“కాళ్ళూ చేతులూ మొఖం కడుక్కోండి. చాయ్ తెచ్చిస్తాను” కూరలు తరుగుతున్న నళిని “ఏయ్ పిల్లాడిని తిట్టకే. కొంచెం మెల్లగా చెప్పు” అంటూ లోపలికి వెళ్ళింది.
“మీరైనా కొంచెం చెప్పండి. పాపం వాడికి లెక్కలు రావడం లేదు. రేపు టెస్టులో ఫెయిల్ అయితే, నెలనెలా కట్టే వందల రూపాయల ఫీజు వృథా అవుతుంది” అని లోపలి నుండే నాకు హుకుం జారీచేసింది.
ప్యాంటు, చొక్కా తీసేసి, లుంగీ చుట్టుకుని, బాత్రూంకి వెళ్లి ముఖం కడుక్కుని వచ్చాను. ఇంతలో నళిని తమ్ముడు అనిల్ వచ్చాడు.
“ఏమయింది?” అని అడిగాడు.
“రేవతి టీచరమ్మ అయ్యింది” అని నవ్వుతూ చెప్పాను.
“మిస్, మా అబ్బాయి ఎలా చదువుకుంటున్నాడు?” అని రేవతిని ఆట పట్టించాడు.
రెండు కప్పుల టీతో నళిని వచ్చి, “ఎప్పుడొచ్చావు? నీ గొంతు విని నీకూ చాయ్ తెచ్చాను” అని ట్రే ముందు పెట్టింది.
“మామా. వీడి తల టెంకాయ. ఎంత చెప్పినా లెక్కలు బుఱ్ఱలోకి ఎక్కడం లేదు” అని రేవతి తన ఫిర్యాదు మొదలుపెట్టింది.
“ఏమిటి? వీడి తల టెంకాయా?”
“కాక మరేమిటి? వంకాయా? అందులో వందల విత్తనాలు ఉంటాయి కదా” అంది రేవతి వ్యంగ్యంగా.
“మామా.. మామా.. చూడు అక్కయ్య ఎలా ఏడిపిస్తుందో. సరిగ్గా లెక్కలు చెప్పమను. నేర్చుకుంటాను. దానికి చెప్పడం రాదు” అవినాశ్ పితూరీలు చెప్పడం ప్రారంభించాడు
“టెంకాయ తల. ఎంత నేర్పించినా అంతే” అని ముఖమ చిట్లించుకుని అంది రేవతి.
అవినాశ్ తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు అనిల్.
“కొబ్బరికాయను అవమానించకూడదు. అది కల్పవృక్షం. కొబ్బరికాయ వంటకు, దాని నూనె తలకు, వంటకీ ఉపయోగపడుతుంది. కొబ్బరికాయ పూజలకు, శుభకార్యాలకు అవసరం. చెట్టు ఆకు, కొమ్మలు గుడిసెల నిర్మాణానికి పనికివస్తాయి. కొబ్బరికాయకు ఒక జానపదకథ కూడా ఉంది” అన్నాడు.
కథ అన్న మాటతో పిల్లల చెవులు నిక్కబొడిచాయి. వారు పరుగెత్తి వచ్చి అనిల్‌ని కథ చెప్పమని బతిమాలసాగారు.
నాకూ కొబ్బరికాయ కల్పవృక్షం అని తెలుసు. కానీ కథ తెలియదు. “అనిల్, ఆ కథ చెప్పు, పిల్లలు వింటారు” అని అన్నాను కుతూహలంతో.
“అయితే ఒకమాట. రేవతి తమ్ముడికి నెమ్మదిగా లెక్కలు చెప్పి నేర్పించాలి. అలా అని రేవతి ప్రామిస్ చేస్తేనే కథ చెబుతాను” అనిల్ షరతు పెట్టాడు.
“సరే” అంటూ రేవతి అనిల్ చేతిపై చెయ్యి వేసి ప్రామిస్ చేసింది.
“ఒకానొక రాజ్యాన్ని వీరసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. సముద్రతీరానికి ఆనుకుని ఉన్న ఆ రాజ్యంలో వరి, మిరియాలు, ఏలకులు, కూరగాయలు అన్నీ సమృద్ధిగా పండుతూ ఆ రాజ్యం సుభిక్షంగా ఉండేది. రాజు వీరసేనుడు ప్రజాదరణ పొందిన వ్యక్తి. తన ప్రజలను సొంత పిల్లల్లాగే చూసుకునేవాడు. ఒకరోజు రాజు రాజభవనం నుండి మెట్లు దిగుతూ జారిపడి ప్రమాదవశాత్తు మరణించాడు. రాజుకు చంద్రసేనుడు అనే కొడుకు ఉన్నాడు. అతడే సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ కొత్త రాజు ఒకరకంగా క్రూర మనస్తత్వం కలిగిన వ్యక్తి. రోజూ కనీసం ఒక వ్యక్తినైనా హింసించక పోతే చంద్రసేనునికి నిద్రపట్టేదికాదు. ఎవరైనా మంచి విషయం చెప్పితే, దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు. వారిని తూలనాడేవాడు. ఈ కొత్త రాజు వ్యవహారం తెలుసుకున్న రాజభవన సిబ్బంది, ప్రజలు రాజు చంద్రసేనుడు చెప్పిన దానికి ఎదురు చెప్పేవారు కాదు.
ఒకరోజు, దూరదేశం నుండి ఒక పండితుడు ఈ రాజ్యానికి వచ్చాడు. పూర్వం ఒకసారి వీరసేన రాజు అతన్ని గౌరవించాడు. ఇప్పుడు చంద్రసేనుడు రాజు అయ్యాడని అతనికి తెలియదు. పండితుడు రాజదర్బారులో, ‘రేపు శుభదినం. ఆ రోజు ఏమి విత్తినా అది ఈ దేశానికీ, మానవాళికీ ప్రయోజనకరంగా ఉంటుంది’ అని చెప్పాడు.
‘సరే . అలా అయితే, రేపు సముద్రతీరంలోని రాజభవనం తోటలో పరీక్ష చేద్దాం’ అన్నాడు రాజు.
మరుసటి రోజు ఉదయం, రాజకుటుంబం, నగరం నుండి ప్రత్యేక ఆహ్వానితులు రాజభవనం ముందు ఉన్న తోటలో గుమిగూడారు. రాజు కూడా వచ్చాడు.
పండితుడు ఏ విత్తనాన్ని విత్తబోతున్నాడో, రాజు మనస్సులో ఏముందో అని మంత్రులు, ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పండితుని నున్నని తలను, పిలక జుట్టును చూసి రాజుకు ఏమనిపించిందో ఏమో ‘నీ తలను విత్తాలి’ అని పండితుని ఆజ్ఞాపించాడు. పండితుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తన మాటలే తనకు శాపంగా మారింది కదా అని చింతించాడు. కానీ ‘తన వల్ల ఈ దేశానికి, లక్షలాది మందికి ప్రయోజనం చేకూరినప్పుడు నేను నన్ను ఎందుకు త్యాగం చేసుకోకూడదు?’ అని ఆలోచించి అంగీకారంగా తన తలను వంచాడు. రాజు ఆదేశం ప్రకారం, ఒక సైనికుడు పండితుడి తల నరికాడు. పండితుడి తలని ముందుగా తవ్విన గుంతలో ఉంచి మట్టితో కప్పి, మిగిలిన మొండాన్ని రాజు సమాధి దగ్గర మరొక ప్రదేశంలో ఖననం చేశారు. గుమిగూడిన ప్రజలందరూ ఉదాసీనతతో ఇంటికి తిరిగి వెళ్ళారు.
రెండు రోజులు గడిచాయి, మూడు రోజులు గడిచాయి. తల విత్తిన ప్రదేశంలో మొలకలు మొలకెత్తలేదు. పదిహేను రోజుల తర్వాత, నేల నుండి ఒక మొలక బయటపడింది. తరువాతి ఆరు లేదా ఏడు సంవత్సరాలలో పొడవుగా ఒక స్తంభంలా చెట్టు పెరిగింది. పెరిగిన చెట్టు పైభాగంలో తల పరిమాణంలో కాయలు గుత్తులు గుత్తులుగా కాసాయి.
పండితుడి తల నరికినప్పటి నుండి చంద్రసేనరాజు అంతర్ముఖుడిగా మారిపోయాడు. ఇదివరకు ఇతరులను మానసికంగా, శారీరకంగా హింసించి ఆనందిస్తున్న అతనిలో పండితుని మరణానికి తాను కారణంమయ్యాననే అపరాధ భావం కలిగింది. తన తండ్రిలాగే, అతను కూడా ప్రజలకు సేవ చేయడానికి శ్రమించసాగాడు.
రాజు ఆజ్ఞ ప్రకారం, తలల పరిమాణంలో ఉన్న కాయల గుత్తులను నెమ్మదిగా క్రిందకు దించి రాజసభకు తీసుకువచ్చారు. సభికులు, రాజకుటుంబం, పట్టణంలోని పెద్దలు దాని ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఒకడు ఒక కాయను తీసుకొని దాని ఒక చివర రంధ్రం చేశాడు. దాని నుండి వచ్చిన నీటిని రుచి చూశాడు. అది తియ్యగా అమృతం తాగినట్లుగా ఉంది. మరొకవ్యక్తి పైభాగం ఒలిచాడు. దానికి ఉన్న మూడు రంధ్రాలను చూసి, మూడు కళ్ళు కలిగిన శివుడిని గుర్తుచేసుకుని దీనిని దైవకార్యాలకు, శుభకార్యాల కోసం ఉపయోగించవచ్చని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరొకడు దానిని విరిచినప్పుడు, నీటితో పాటు కాయలోని మందపాటి తెల్లటి పదార్థాన్ని అతను చూశాడు. అందరూ ఆ గుజ్జును రుచి చూశారు. ఈ కాయ ఒక అద్భుతం. తినడానికి రుచికరంగా ఉంది అని తీర్మానించారు. చాలా ఎండిన కాయను నేలపై నలిపినప్పుడు, నూనె బయటకు వచ్చింది. అది రుచికరంగా ఉంది. రాజభవన పరిచారికలు దీనిని వంట కోసం ఉపయోగించవచ్చని చెప్పారు. దీని ఆకులు పేదల గుడిసెలకు ఉపయోగపడతాయని పురప్రముఖులు వెల్లడించారు.
పండితుడి త్యాగం మానవాళికి ఒక ఉపయోగకరమైన ఫలాన్ని ఇచ్చింది! ప్రజారంజకుడిగా మారిన చంద్రసేనుడు, ఈ కొత్త ఫలాన్ని తన రాజ్యం అంతటా పండించాలని, దానిని దేవతలకు నైవేద్యంగా సమర్పించి శుభకార్యాలలో ఉపయోగించాలని ఆదేశించాడు. ఆ కాలం నుండి ఇది ఆచారంగా మారి నేటికీ అమలులో ఉంది. దేవుళ్లను పూజించడానికి, వివాహాలు వంటి వేడుకలలో కొబ్బరికాయలను ఉపయోగిస్తాము” అని అనిల్ కొబ్బరి కథను ముగించాడు.
“అయ్యో మరిచేపోయాను” అని లోపలికి వెళ్లి వచ్చిన నళిని, “ఉదయం కొత్త కొబ్బరి తురిమి మిఠాయి చేశా, తీసుకోండి” అని అందరికీ పంచింది.
కొబ్బరి కథ రుచిగా ఉంది. కొబ్బరి మిఠాయి తియ్యగా ఉంది.
“ఇకపై ఎవరైనా టెంకాయ బుఱ్ఱ అని తిట్టినా మనసులో పెట్టుకోకూడదు. మనసుపెట్టి చదివితే సరిపోతుంది” అన్న అనిల్ మాటలకు పిల్లలతోపాటు నేనూ తలవూపాను.
![]()

రచయిత, సాహిత్యాభిమాని, అనువాదకుడు, సంపాదకుడు వికీపీడియన్. తెలుగు కన్నడ భాషలలో అనువాదాలు చేస్తున్నారు. కథాజగత్, సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం, జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు, రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులంకథ, క్రీడాకథ, రామకథాసుధ, పదచదరాలు, స్వాతంత్ర్యభారతికి అమృతోత్సవ హారతి అనే పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రముఖ హేతువాది, విద్యావేత్త డా.హెచ్.నరసింహయ్య ఆత్మకథను పోరాటపథం పేరుతో తెలుగు ప్రజలకు పరిచయం చేశారు.




Discussion about this post