హిందీ మూలం : రవీంద్ర రుక్మిణీ పండరీనాథ్
తెలుగు అనువాదం : డా. వి.ఎల్.నరసింహం శివకోటి
సమయం అర్ధరాత్రి పన్నెండున్నర కావొస్తోంది. టైపురైటరు మీద టైపు కొట్టి-కొట్టి నా చేతి వేళ్ళు నొప్పి పుడుతున్నాయి. ఆకలి కూడా వేస్తున్నట్టుంది. వేస్తున్నట్టు ఏంటి నా ముఖం …. వేస్తోంది. ఉదయాన్నే అమ్మతో గొడవపడ్డాను. ఎదురుగా పెట్టిన ఉప్మా పళ్ళాన్ని కోపంగా నెట్టేసి విసవిసలాడుతూ ఆఫీసుకి బయలుదేరిపోయాను. “చూడు బంగారం! తినే తిండి మీద ఎప్పుడూ కోపం చూపించకూడదు. ఒక్కసారి ఇంట్లో నుండి బయలుదేరితే మళ్ళీ ఏ రాత్రికో గానీ ఇల్లు చేరవు. నీ ఉద్యోగం అలాంటిది. కాస్త ఎంగిలి పడి వెళ్ళు” అమ్మ గొంతు నన్ను వెంబడిస్తోంది.
“ఆఁ ఆఁ ఇంకా నన్ను ఇలాగే సూటిపోటి మాటలతో కాల్చుకు తింటూ ఉండు. ఎప్పుడో చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ తిరిగి రాను. అప్పుడు కుదురుతుంది మీ అందరి తిక్క.”
చిన్నబుచ్చుకున్న అమ్మ మఖం చూడాటానికి ఆగే ఉద్దేశం నాకు ఎలాగూ లేదు. ఈ బాగోతం అంతా అయ్యి బయలుదేరేసరికి ఆలస్యం అయిపోయింది. ఇంక షరా మామూలే. ముందుగా ముంబై కార్పొరేషన్ ఒక రౌండు కొట్టి రావాలి. అటునుండి అటు ఆజాద్ గ్రౌండులో నిరాహార దీక్ష చేస్తున్నవారిని పలకరించి ఇంటర్వ్యూ చెయ్యాలి. తర్వాత కార్మికుల సమస్యల గురించి వాళ్ళ నాయకులతో చర్చలు, పరిశ్రమల శాఖ మంత్రి, సెక్రటరీ, మిల్లు యజమానుల, అసోసియేషన్ల అభిప్రాయాలు ఇలా… బోల్డంత పని ఉంది.
‘మొదటి విడత వార్తలు పంపుతున్నాను. నీ దగ్గర ఉన్న వార్తలు కూడా త్వరగా తీసుకుని రా” అనే డిసౌజా చేతిలో పేపర్లు పెట్టాలి. ఒక్కసారి టెలీప్రింటరుకేసి చూసి త్వరత్వరగా రెండు-మూడు ఫోన్లు చేసుకుని, రిఫరెన్స్ సెక్షనుకి వెళ్ళి అవసరమైన విషయాలు రాసుకున్నాను. ఇప్పుడు మొదలవుతుంది ఈ టైపురైటరుకి వెట్టిచాకిరీ చెయ్యడం.
మామూలుగా అయితే సాయంత్రం ఆరు-ఆరున్నరకి నా డ్యూటీ అయిపోతుంది. కానీ ఇవాళ అప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు. స్వయంగా కామత్ దగ్గరకి వెళ్ళి ‘నైట్ షిఫ్టుకి ఏమైనా నా సాయం కావాలా?’ అని అడిగాను. ‘దేవి వరం ఇస్తాను అంటే అంతకంటేనా?’ అని ఎగిరి గంతేసినంత పని చేసాడు. “ఇవాళ శర్మ, షిండే ఇద్దరూ రావట్లేదు. ఒక్కణ్ణీ పేజీలన్నీ ఎలాగ చెయ్యాలిరా భగవంతుడా అని మల్లగుల్లాలు పడుతున్నాను. సరిగ్గా సమయానికి ఆదుకున్నావు. మరి డబల్ డ్యూటీ అంటే నీకేం ఇబ్బంది లేదుగా?” నేను ఈ ‘ఓల్డ్ లేడీ ఆఫ్ బోరీబందర్’ అదే టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీసుని తిట్టుకోని రోజు లేదు. అయినా దాని ఒళ్ళోనే పగలూ రాత్రి ఉండమన్నా నాకేం ఇబ్బంది లేదనుకో!
మరి ఆకలి? రెండు వడ-పావ్, ఏడెనిమిది కప్పులు టీ, సగం సిగరెట్ ప్యాకెట్ తో రోజంతా గడిచిపోయింది. ఇంకా ఎంతసేపులే ….? కుర్చీలో నుండి లేచి నిలబడి గట్టిగా ఆవులించాను. ఆ చప్పుడుకి ఉలిక్కిపడి నావైపు చూస్తున్న వాళ్ళనందరినీ ఒకసారి ‘అయితే ఏంటంట?’ అన్నట్టు చూసి డెస్క్-4 దగ్గర కూర్చున్న గణేష్ వీపు మీద ఒక్క చరుపు చరిచి ‘పద, పద, పోయి ఏమన్నా తినేసి వద్దాం.’ అన్నాను.
తను కూడా లేచి నాతోపాటు బయటకి నడుస్తూ –
“ఆమె ఆవులిస్తే ఈ ప్రపంచమే చీకటయిపోయింది.
నీ అందచందాల ముచ్చట విని సమాధిలో నుండి కూడా ప్రాణం లేచొచ్చింది.”
“ఎవరి కవిత బాబు ఇది? బుర్ర బద్దలయ్యేలా ఉంది.”
“ఎవరిది ఏంటి? నాదే. నేనే రాసాను. ఇంతకీ ఎలా ఉందో చెప్పనేలేదు?”
‘షిట్.’
‘కోపమా?’
‘అఫ్ కోర్స్’
‘చూడు ఇవాళ నువ్వు భలే అందంగా ఉన్నావు. పైగా దానికి తోడు నీ ఆవులింత…’
‘ఫక్ యూ’
తను నవ్వి ఊరుకున్నాడు. “మీరు రోజంతా ఆవులిస్తూనే ఉంటారు. బోరు కొట్టిందంటే పగలూ రాత్రి ఇష్టం వచ్చినట్టు ఒళ్ళు గోక్కుంటూనే ఉంటారు. అదంతా బాగానే ఉంటుంది. అదే నేను అలసిపోయి ఒక్కసారి ఆవులిస్తే అందులో నీకు నా అందం కనిపిస్తోందా?’ – అంటూ గణేష్ మీద విరుచుకుపడ్డాను.
“నీకు బాగా ఆకలేస్తోందా? ఇవాళ కూడా ఇంట్లో గొడవపడి వచ్చినట్టున్నావు. అందుకే ఈ డబల్ డ్యూటీ అనుకుంటా.”
నేను మెల్లగా తల ఆడించాను. అలవాటు ప్రకారం క్యాంటీన్ వైపు తిరగబోయాను. ఇంతలో తను నా చెయ్యి పట్టుకుని-
“పద. ఇవాళ నిన్ను ఒక మంచి చోటుకి తీసుకెళ్తాను.”
రంగభవన్ నుంచి మొదటి సందు మలుపు తిరిగితే ఒక బండి ఉంది.
“తంబీ, రెండు ఎగ్ బుర్జీ, నిమ్మకాయ పిండి. నాలుగు బటర్ పావ్ కూడా” ఆర్డర్ ఇచ్చాడు. “వడా-పావ్ లాగనే ఇక్కడ కీమా-పావ్ చాలా బాగుంటుంది. కానీ నువ్వు తినవుగా.”
“నేను ఈరోడ్డులో ఎన్నిసార్లు తిరిగానో లెక్కలేదు. కానీ నాకు ఈ బండి ఎప్పుడూ కనిపించలేదే!
“వీడు రాత్రి ఆలస్యంగా తెరిచి తెల్లవారుఝామున నాలుగు-ఐదు గంటల వరకు వ్యాపారం చేస్తాడు.”
“పోలీసులు ఏమీ ఇబ్బంది పెట్టరా మరి?”
“అసలు ఇతనికి పోలీసు కస్టమర్లే ఎక్కువ. నెంబరు 2 ధంధాలో ఇచ్చిపుచ్చుకోవడం అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడికి ఎప్పుడూ ఒంటరిగా రావద్దు.”
“మరి నీకు భయం వెయ్యదా?”
“నేను వీళ్ళందరికీ బాగా తెలుసు. ఇక్కడ స్మగుల్డ్ గూడ్స్ అమ్మేవాళ్ళు అందరూ నా స్నేహితులే. పాపం పేదవాళ్ళు – తమిళం, మళయాళం మాట్లాడేవాళ్ళు. వాళ్ళ భాషలో మాట్లాడి కలిసి ఒక దమ్ముకొడితే చాలు.”
ఎగ్ బుర్జీ నిజంగా చాలా బాగుంది. తర్వాత టీ తాగేసి బయలుదేరాం.
ఆ వేళలో పెద్దగా జనాలు లేరు. దారిలో ఒకళ్ళిద్దరు మాత్రం కనిపించారు. ఎవడి గోల వాడిది అన్నట్టు ఉంది అక్కడి వాతావరణం. రోడ్డుకి అటువైపు నుండి అరుపులు-కేకలు వినిపించాయి. ముందు చిన్న కొట్లాట, తర్వాత ఒకళ్ళనొకళ్ళు తరుముకోవడం, ఎవరో ఆడమనిషి పెట్టిన కేక ఆమె గొంతులోనే ఆగిపోయినట్టు… వాళ్ళ నీడలు కూడా స్పష్టంగా కనిపించాయి. ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడమనిషిని బలవంతంగా ఆజాద్ గ్రౌండుని ఆనుకుని ఉన్న పొదల్లోకి లాక్కుపోయారు.
ఆ ఆడమనిషి కేకవిని నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగాను. కానీ గణేష్ నా చెయ్యి గట్టిగా పట్టుకుని గుంజుతూ–
“ఆగు. నో… నో….”
తను నన్ను గబగబా పక్క సందులోకి లాక్కుపోయి, అక్కడ ఆగాడు.
“పిరికి నా కొడకా! నీకు ధైర్యంలేదు, నన్నూ వెళ్ళనివ్వలేదు.”
నేను కోపంలో గణేష్ ని నోటికొచ్చినట్టు తిట్టేసాను. తన గుండెలమీద, భుజాల మీద, ముఖం మీద పిడిగుద్దుల వర్షం కురిపించాను. కానీ గణేష్ మాత్రం మౌనంగా ఉన్నాడు. కొంతసేపయ్యాక నా చెయ్యి పట్టుకుని దగ్గరకి లాక్కున్నాడు. నేను ఏడుస్తూ అతని కౌగిట్లో ఒదిగిపోయాను.
నా అవేశం కాస్త చల్లారిన తర్వాత మెల్లగా నా కళ్ళు తుడిచాడు. బుగ్గలమీద చిన్నగా తట్టి – “ఏడ్చిన తర్వాత ఇంకా అందంగా కనిపిస్తున్నావు.” అంటూ నవ్వేశాడు.
కోపంలో ఇంకా నా ముక్కుపుటాలు అదురుతూనే ఉన్నాయి.
“ఏమయింది? కొత్త చోట అదీ వేళకాని వేళల్లో రిస్క్ తీసుకోకూడదని తెలియదా? జర్నలిజం పాఠాల్లో చదువుకోలేదా? ఎన్నేళ్ళ నుండి ఈ ఉద్యోగం వెలగబెడుతున్నావు? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు?” ఇంచుమించు మందలిస్తున్నట్టే అన్నాడు.
ఇవన్నీ నాకూ తెలుసు. కానీ నిన్నటి నుండి నా మనసు ఏం బాగోలేదు. జె.జె. హాస్పటల్ కి వెళ్ళాను. నాలుగేళ్ళ పసిపిల్ల మీద ఆమె తండ్రి వయసున్న పక్కింటి పెద్దమనిషి అత్యాచారం చేసాడు. యోని భాగం అంతా చీలిపోయింది. ముఖం మీద, ఛాతీ మీద గోళ్ళతో రక్కేసి … పంటి గాట్లు. చిన్న పూరి గుడిసెలో ఉండే ఆ పిల్ల తల్లి అల్లాడిపోతోంది. ఇంట్లో తాగుబోతు మొగుడు, పదిహేనేళ్ళ పెద్ద కూతురు ఉంటారు. ఈ చిన్న పిల్ల కేసు కోర్టుకెక్కితే పెద్ద పిల్ల గతి ఏమవుతుందో అని ఆమె దిగులు. పోలీసులు, డాక్టర్లు, నర్సులు… ఎవ్వరికీ ఆ పసిదాని గురించి పట్టించుకునే తీరికలేదు. కళ్ళుమూసినా తెరిచినా నాకు ఆ పసిపిల్ల, వాళ్ళ అమ్మ ముఖాలే కనిపిస్తున్నాయి.
“డాక్టర్లు, జర్నలిస్టులు సెంటిమెంటల్ అయిపోతే తమ పని ఎప్పటికీ సరిగ్గా చెయ్యలేరు.”
ఆఫీసులో అడుగుపెట్టాం. వాతావరణం అంతా గందరగోళంగా ఉంది. ఇందిరా గాంధీ అమృతసర్ స్వర్ణ దేవాలయంలోకి సైన్యాన్ని పంపింది. బీభత్సమైన ఫైరింగ్ మొదలు …. ఇంక గంట-గంటకీ విశేషాలు కనుక్కుంటూ ఉండాలి. యుద్ధం, వరదలు, కరువుకాటకాలు, భూకంపాలు, కొట్లాటలు … ఇలా జనాలని భయభ్రాంతుల్ని చేసే సంఘటనలు…. అంటే జర్నలిస్టులకి మంచిరోజులు..!
“గణేష్! మనం అందరం రాబందులం. శవాల మీద బతికేవాళ్ళం” – అంటూనే నా పని మొదలుపెట్టాను.
![]()
వి.టి. స్టేషన్ నుండి ఫౌంటేన్ వైపు నడుస్తూ పోతే ఎడమవైపు కాస్త పాత, సాదా సీదా బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోరులో ఉండే చిన్న-చిన్న దుకాణాలు ఎప్పుడు రద్దీగా ఉంటాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్తే పైకి వెళ్ళే మెట్లు కనిపిస్తాయి. ప్రతీ అడుగూ చూసుకుని వెయ్యాల్సిందే. ఆ మెట్లన్నీ ఎక్కి మొదటి అంతస్తుకి చేరుకుంటే అక్కడ ‘బాంబే యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్’ మా భాషలో చెప్పాలంటే ‘బి.యు.జె.’ ఆఫీసు కనిపిస్తుంది. జర్నలిజం రంగంలో ‘ఏంగ్రీ యంగ్ మ్యాన్’ ల అడ్డా ఇది. మా ఫీల్డులో పేరు సంపాదించుకుని స్థిరపడిన వాళ్ళు సాయంత్రం అయితే ప్రెస్ క్లబ్ లో మందు కొడుతూ కనిపిస్తారు. మిగిలిన వాళ్ళల్లో చాలామంది ఆఫీసు పని ముగించుకుని తిన్నగా ఇంటిదారి పడతారు. మాలాంటి కొద్దిమంది మాత్రం స్టోరీల కోసం మెటీరియల్ వెతుక్కోవడానికి, కొత్తగా ఏదైన చదవడంకోసం రీగల్ వెనక సందులో ఉండే ‘సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డాక్యుమెంటేషన్’ – సి.ఈ.డి. కి వెళ్ళి కూర్చుంటాం. అక్కడ కూర్చుని కుళ్ళిపోతున్న ఈ సమాజ వ్యవస్థని మనసారా తిట్టుకుంటూ, మేం రాసినదాన్ని సగానికి సగం ఎర్ర సిరాతో కొట్టిపడేసే ఎడిటర్ ని, ఆ మహానుభావుణ్ణి ఆడించే మేనేజిమెంటుని బూతులు తిట్టుకోవడానికి ఇక్కడకి వచ్చి వాలిపోతాం. మొదటిసారి గణేష్ తో కలిసి ఇక్కడకి వచ్చినప్పుడే చెప్పాడు – “ఇది మన సేఫ్టీ వాల్వ్. దీన్ని వీలైనంత ఎక్కువ వాడుకో. లేదంటే నీ మనసులో కుతకుతలాడుతున్న ప్రెషర్ కుక్కర్ ఎప్పుడు ‘ఢాం’ అని పేలిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు.” అది మొదలు నేను ఇక్కడకి క్రమంతప్పకుండా రావడం మొదలుపెట్టాను. మొదటిసారి నేను గణేష్ తో కలిసి అక్కడకి వెళ్ళిన ఆ క్షణం నాకు ఇంకా గుర్తే. అందరూ నాకేసి చూస్తూ ఉండిపోయారు. ‘ఈ ఆఫీసుకి ఆడవాళ్ళ ఉనికి అస్సలు తెలీదు. ఇక్కడకి వచ్చిన మొదటి ఆడదానివి నువ్వే కాబోలు” అంటూ చెప్పుకొచ్చాడు.
“హాయ్ ఎవిరీబడీ…. నేను ఓల్డ్ లేడీ ఆఫ్ బోరీబందర్’ లో పనిచేస్తున్నాను. ఇకపై నేను, నాలాంటి ఇంకా కొద్దిమంది ఆడవాళ్ళు ఇక్కడకి వస్తూ ఉంటాం. మీరు మెల్లగా అలవాటు చేసుకోవాలి మరి!” నేను చెయ్యి పైకెత్తి అందరినీ పలకరిస్తూ చెప్పాను. జవాబుగా ఇద్దరు-ముగ్గులు చిరునవ్వుతో నాకు స్వాగతం పలికారు. మిగిలినవాళ్ళు ఒక్కసారి కళ్ళెత్తి చూసి మళ్ళీ తలలు దించేసుకున్నారు.
“అరే మిమ్మల్ని సరిగా చూడనే లేదు. గణేష్ తో తన స్నేహితుడు ఎవరో వచ్చాడు అనుకున్నాం. గణేష్ కూడా ఎప్పుడూ టపోరీగాళ్ళతో తిరుగుతూ ఉంటాడు.. అలా అని..” బహుశా నేను వేసుకున్న జీన్స్ ప్యాంటు-కుర్తా మీద వచ్చిన కామెంటు అనుకుంటా. అయ్యగారు ఏ ఉత్తరప్రదేశ్-బిహారు నుండో అనుకుంటా.”
“దుబే గారు, సరిగ్గా చూడండి. మీరు అబ్బాయికి-అమ్మాయికి తేడా మర్చిపోయినట్టున్నారు.” – నా గుండెలవైపు చూస్తూ మరో పెద్దమనిషి చెప్తున్నాడు.
నేను వీళ్ళిద్దర్నీ పట్టించుకోకుండా సెక్రటరీతో మాటకలిపాను. ఇంక అటుపై బి.యూ.జె. నా రోజువారీ అడ్డా అయిపోయింది. అప్పుడప్పుడు గణేష్ తో కలిసి, ఒక్కొక్కసారి ఒంటరిగా, లేదా ‘హిందూ’ లక్ష్మితోనో లేక ‘ఎక్స్ ప్రెస్’ కామాయనితోనో కలిసి ఇక్కడికి రావడం మొదలుపెట్టాను. క్రమంగా ఆ చోటు నాకు బాగా అలవాటయిపోయింది. నేను కూడా వాళ్ళలాగనే ఆవేశంతో ఊగిపోయే, సిగరెట్ తాగే, మాటిమాటికీ చర్చల్లోకి దూకే, మేనేజిమెంటు చేసే అన్యాయాలకి ఎదురొడ్డి పోరాడే, ఒక్కొక్క స్టోరీ కోసం ప్రాణాలకి తెగించే ప్రాణిని అని మెల్లమెల్లగా అక్కడ అందరికీ అర్థమయింది. అయినా నాకు, లక్ష్మికి, కామాయనికి, భారతి కి … ఎవ్వరికీ అక్కడ పూర్తి స్వాతంత్ర్యం దొరకలేదు. కాలుష్యంలేని స్వచ్ఛమైన గాలీ దక్కలేదు.
![]()
రోజులు గడుస్తున్నాయి. ఒకనాటి రాత్రి. బహుశా చాలా ఆలస్యం అయిపోయినట్టుంది. అంటే చివరి లోకల్ వెళ్ళిపోయింది. మొదటి లోకల్ రావడానికి ఇంకా సమయం ఉంది. అలాంటి సంధికాలం అన్నమాట! కళ్ళు మూతలు పడుతున్నాయి. కానీ రెప్పవాల్చే అంత సురక్షితమైన వాతావరణం లేదు. చుట్టుపక్కల డ్రగ్స్ కి అలవాటు పడ్డవాళ్ళు, హిజ్రాలు, ఇంకా అనుమానాస్పదంగా అటూ-ఇటూ తిరుగుతున్న వాళ్ళు, రకరకాల వయసున్న మగవాళ్ళు ఇలా ఉంది వాతావారణం. కన్నతల్లే వచ్చి జోలపాడినా కునుకుపట్టే అవకాశం లేదు. మామూలుగా అయితే ఈవేళలో తను బయటకి రాదు. ఆఫీసులో టేబులు మీదే తల పెట్టి చిన్న కునుకు తీసి నాలుగు-నాలుగున్నరకి లేచి ఒక స్ట్రాంగ్ టీ తాగి ఇంటికి బయలుదేరిపోతుంది. కానీ ఇవాళ ఫిబ్రవరి 28. బడ్జెట్ సమావేశాలు. అందుకే లక్ష్మి, కామాయనిలకి కూడా ఆఫీసులో చాలా ఆలస్యం అయిపోయింది. సరేలే కాసేపు స్టేషనులోనే గడిపేద్దాం అని బయలుదేరాం. ముగ్గురం వి.టి. స్టేషనులో ఒక బెంచి మీద కూర్చొన్నాం. ఇదంతా నాకు బాగా తెలిసిన చోటే. అందుకే నిర్భయంగా ఉన్నాను. కానీ మెల్లమెల్లగా ప్లాట్ ఫారమ్ మీద అనుమానాస్పదంగా తిరిగే వాళ్ళు ఎక్కువవడం, పైగా ప్లాట్ ఫారమ్ మీద మేము ముగ్గురమే ఆడవాళ్ళం ఉండటంతో ఎందుకొచ్చిన గొడవలే అని బయటకి వచ్చి స్టేషను మెట్లమీద కూర్చొన్నాం. హాయిగా చల్లటి గాలి వీస్తోంది. వస్తూపోతూ జనాలు కనిపిస్తున్నారు. పైగా నా ఆఫీసు కూడా ఎదురుగానే. “పదండి. పోయి నా ఆఫీసులో కూర్చుందాం” అన్నాను. వెంటనే లక్ష్మి – “హబ్బ అక్కడ అయితే కాస్త గట్టిగా మాట్లాడుకోవడం కూడా కుదరదు. ఇక్కడే కూర్చుందాం.” అంది.
ఇంటింటి రామాయణాలు, తమ-తమ పత్రికల్లో రాస్తున్న కవర్ స్టోరీలు, ఆఫీసులోను, బయట మగవాళ్ళ ప్రవర్తన, మేనేజిమెంటు పెట్టే ఒత్తిడి, ఇలా రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటూనే చుట్టుపక్కల వచ్చిపోయే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాం. మా కబుర్లు యూనియన్ వైపు మళ్ళాయి. యూనియన్ అండదండలు ఉండబట్టే మేం కాస్త ఊపిరి పీల్చుకుని పనిచెయ్యగలుగుతున్నాం. లేదంటే అసలు యూనియన్ బలం ముందు మేం ఎండుటాకుపాటి చెయ్యం. ఇదంతా మేం కచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ యూనియన్ నిజంగా మాకు, మా మాటకు విలువనిస్తోందా? మిమ్మల్ని లెక్కచేస్తోందా? అసలు జర్నలిజం రంగంలో ఇంతమంది ఆడవాళ్ళు అడుగుపెట్టడం చరిత్రలో ఇదే మొదటిసారి. జర్నలిజంలో కూడా ఏదో డెస్క్ వర్క్ అని కాకుండా రిపోర్టింగ్ కూడా చూసుకుంటున్నాం. ఇప్పటివరకు సమాజం కనీసం పట్టించుకోని స్త్రీల సమస్యలకు సమాధానాలు వెదకటానికి ముందడుగు వేస్తున్నాం. యుద్ధాలు చేస్తున్నాం. దూరప్రాంతాలకు వెళ్ళి పరిశోధనలు కూడా చేస్తున్నాం. అయితే యూనియన్ మా ఈ కృషిని కానీ, మా సమస్యలను కానీ కనీసం గుర్తిస్తోందా? అసలు ఆ దిశగా ఆలోచిస్తోందా?” కామాయని ఎంతో ఉద్రేకంగా మాట్లాడింది.
“అరే! ఇందులో అంత ఆవేశ పడేది ఏముంది? అన్ని రంగాల్లోనూ జరుగుతున్నదే కదా! గణేష్, సెబేస్టియన్ లాంటి వాళ్ళు మచ్చుకు ఇద్దరు-ముగ్గురు ఉంటే మిగిలిన వాళ్ళంతా దూబే, అహూజా, జోషీలాంటివాళ్ళే” అని నేను ముక్తాయించాను.
“ఆడవాళ్ళ కోసం విడిగా టాయిలెట్స్ కూడా లేనిచోట మనం ఏ ముఖం పెట్టుకుని సంతోషంగా పని చెయ్యగలం చెప్పు? జర్నలిజం ప్రశ్నల్లో స్త్రీ ప్రశ్నలు లేవనెత్తలేకపోయారు, మహిళా జర్నలిస్టుల సమస్యలు …. ఇవన్నీ అందని ద్రాక్షలే..! మనం ఎవరెవరితో ఎంతవరకని కొట్లాడగలం?” లక్ష్మి కొంచెం చిరాకుగా చెప్పింది.
“చూడండి అమ్మాయిలూ! టైము చూస్తే ఇంకా మూడే అయ్యింది. మొదటి లోకల్ రావడానికి ఇంకా సుమారు గంటంపావు టైము ఉంది. చలి చంపేస్తోంది. నేను కాస్త ఆ ఎదురుగుండా పాన్ షాప్ కి వెళ్ళి సిగరెట్లు తెచ్చుకుంటాను.” మాటలకి కాస్త విరామం ఇచ్చే ఉద్దేశంతో లేచి నిలబడ్డాను.
“మిమ్మల్ని కూడా రమ్మంటావా తోడు?”
“ఏం అవసరం లేదు. దగ్గరే కదా! పైగా కొత్త చోటు కూడా కాదు.”
![]()
“రామదీన్! ఎలా ఉన్నావు?”
“బాగానే ఉన్నాను మేడం. ఇదిగో తీసుకోండి మీ బ్రాండ్. మిమ్మల్ని దూరం నుండే చూసి తీసి పెట్టాను.”
ఒక సిగరెట్ తీసి మిగిలిన ప్యాకెట్ పర్స్ లో పడేసి లైటరుతో సిగరెట్ వెలిగించి ఒక గట్టి దమ్ములాగాను. ఇంతలో వెనక నుండి – ‘వస్తావా?’ అన్న పిలుపు వినపడింది.
వెనక్కి తిరిగి చూస్తే ఒక భారీ కాయం నిలబడి ఉంది.
“ఏమన్నావ్?” ఎదురు ప్రశ్న వేసాను.
“వస్తావా? అన్నాను. దానికి ఎందుకంత కోపం? నువ్వు అడిగినంత ఇస్తాను.”
వెనక్కి తిరిగి చూస్తే రామదీన్ పాన్ డబ్బా నుండి చాలా దూరం వచ్చేసాను. నా స్నేహితురాళ్లు ఇద్దరూ ఎదురుగానే కాస్త తక్కువ దూరంలోనే ఉన్నారు. నేను నిదానంగా నడుస్తూ –
“నువ్వు వస్తావా?” అని అడిగాను.
ఒక్క క్షణం వాడికి ఏం అర్థం కాలేదు.
“నేనెందుకు వస్తాను? నువ్వు వస్తున్నావు కదా!”
“నేను అడుగుతున్నాను, నువ్వు వస్తావా? మేం ముగ్గురం ఉన్నాం.”
అతడికి ఏం పాలుపోక, అయినా ఆశ చావక ఇంకా నా వెనకాలే నడుస్తున్నాడు. నేను నా స్నేహితురాళ్ళని దగ్గరకి రమ్మని గట్టిగా పిలిచాను. అటుగా వెళ్తున్న వాళ్ళు అందరూ ఉలిక్కిపడి ఎక్కడివాళ్ళు అక్కడ నిలబడిపోయారు.
‘అతడి’ వైపు తిరిగి గట్టిగా –
“నన్ను వస్తావా అని అడుగుతావా? ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను – నువ్వు వస్తావా? నీ రేటెంత? చెప్పు. అయినా ముందే చెప్పాను కదా, మేం ముగ్గురం ఉన్నాం. చూసుకోమరి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు ఈ కార్టూన్? ఈ రాత్రికి సరిపోతాడు కదా!” అన్నాను.
లక్ష్మి, కామాయనిల పెదవులు విచ్చుకున్నాయి. వెంటనే పెద్దపెట్టున నవ్వేసారు. వీళ్ళని చూసి రోడ్డున వెళ్తున్నవాళ్ళు కూడా నవ్వేసారు. అంత భారీ కాయం, తన గౌరవం మట్టిలో కలిసిపోవడం చూసి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంకించుకున్నాడు.
ఒక్క క్షణం తర్వాత ఆ నవ్వంతా పూర్తి మౌనంగా మారిపోయింది. మొదట కామాయని తేరుకుని “వాడు నిన్ను నిజంగానే ఏమన్నా చేసుంటే? అనవసరంగా రిస్క్ తీసుకున్నాం!” అంది.
లక్ష్మి మెల్లగా – “బేబీ! రిస్క్ తీసుకోకుండా నువ్వు ఏమీ చెయ్యలేవు. రిస్క్ ఎందులో లేదు చెప్పు? తల్లిదండ్రుల మాటవిని ముక్కు-మొఖం తెలియని వాడితో జీవితాంతం కలిసి బతకడానికి బయలుదేరడంలో రిస్క్ లేదంటావా? వాడితో పడుకోవడంలో రిస్క్ లేదంటావా? ఉదయం పది నుండి సాయంత్రం ఐదు వరకు చేసే ఉద్యోగాలు కాకుండా మగవాళ్ళ సామ్రాజ్యమైన జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకోవడంలో రిస్క్ లేదంటావా? ఈరోజు కూడా వేళకాని వేళలో మొత్తం బిల్డింగులో యాభైమంది మగవారి మధ్య నువ్వు ఒక్కర్తివే పనిచేస్తున్నావు. ఇందులో రిస్క్ లేదంటావా?”
ఆమెకు ధైర్యం చెబుతూనే నేను నా మాటలు కొనసాగించాను –
“ఇవాళ స్టేషన్లో ఇంత రాత్రివేళ మనం ముగ్గురమే ఆడవాళ్ళం ఉన్నాం. అందుకే నీకు భయమేస్తోంది. రేపు ముప్పైమంది, ఎల్లుండి మూడువందలమంది ఆడవాళ్ళు ఇక్కడే ఉంటే నీకు భయమేస్తుందా? ఈ భయం ఇలాగే ఉంటుందా? స్కూలు-కాలేజీలు-ఆఫీసు-ఫ్యాక్టరీల్లో అడుగుపెట్టినట్టే అన్ని రంగాల్లోనూ మన సత్తా చాటాలి.
తరువాత గంటసేపు జరిగిన సంభాషణలో మేము రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం –
మొదటిది – విమెన్ ఇన్ మీడియా గ్రూప్ స్థాపించటం; రెండవది – అన్ని స్త్రీ సంస్థలతో కలిసి అర్ధరాత్రి ముంబై రోడ్ల మీద ర్యాలీ తీయడం.
![]()
నిజంగా అవి చాలా గ’మ్మత్తయిన’ రోజులు. అమృత ప్రీతమ్ మాటల్లో చెప్పాలంటే మేం ఏదో మూలిక తిని ఆ మత్తులో జీవించే శక్తి పొంది మా జీవితాన్ని మాకు నచ్చినట్టు జీవిస్తున్నాం. మాలాంటి ఎందరో స్త్రీలు సంప్రదాయాలని మాటకట్టి దూరంగా విసిరేసి సంతోషంగా జీవిస్తున్నారన్న ఆలోచనే మాకు ఎంతో శక్తినిచ్చేది. అందుకే ఎన్నో సమస్యలు ఈగల్లా ముసురుకుంటున్నా లెక్కచెయ్యకుండా ముందుకు నడవగలుగుతున్నాం.
చెప్పుకోవాలంటే – ప్రతి రెండు-మూడేళ్ళకి మారే ఇల్లు, అమ్మ, నాన్న, అన్న. సంబంధాల విషయానికొస్తే – గణేష్. ఆ బంధం ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఇవన్నీ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. కానీ జీవితాన్ని వీటి మీద ఖర్చుపెట్టడం నాకస్సలు ఇష్టంలేదు. బయట సమాజంలో పితృస్వామ్యం, బూర్జువా విధానాలు, సామాజిక అసమానతలు వంటి పెద్ద పెద్ద సమస్యలు నాకోసం ఎదురుచూస్తున్నాయి. అందుకే నా చిన్న చిన్న సమస్యలకి సమాధానాలు వెతుక్కున్నాను. ఉదాహరణకి అమ్మ మీద కోప్పడటం, నా వృత్తి ఎంత గొప్పదో గొంతు చించుకుని చెప్పడం మానుకున్నాను. నాన్న పురుషాహంకారం, అన్నయ్య అవకాశవాదం అమ్మకి తెలియనివి కాదు. కానీ తను తన జీవితాన్ని వీళ్ళ ఇద్దరి చేతుల్లో పెట్టేసింది. అందుకే వాళ్ళు చెప్పే ప్రతి మాటకీ గంగిరెద్దులా తలాడిస్తుంది. స్త్రీ ఉద్యమమే నాకు ఇవన్నీ నేర్పించింది. అంతేకాదు వాళ్ళు నా గురించి ఆలోచించడం, బెంగపెట్టుకోవడం, ప్రేమ కురిపించడం ఇవన్నీ కూడా ఎంతో నిజాయితీతో కూడుకున్నవి. అందుకే నేను వాళ్ళతో గొడవపడటం మానుకుంటే దానికి బదులు వాళ్ళు కూడా నన్ను ఇంటికి త్వరగా రమ్మనడం, పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చెయ్యడం మానేసారు.
ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందని అంటారు. అయితే నాలాంటి కష్టజీవి అయిన స్త్రీ వెనక ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు – నాన్న, అన్నయ్య. నా జీవితంలో ప్రతి మలుపులో నేను ఎంత తప్పు చేస్తున్నానో గుర్తుచేస్తూ నా ఉత్సాహాన్ని నీరుగార్చడానికి వచ్చే ఏ అవకాశాన్నీ అస్సలు వదులుకోరు. చివరికి విసుగొచ్చి నేను ఎలా బతకాలో వాళ్ళేం సలహా ఇవ్వక్కర్లేదని తెగేసి చెప్పేసాను. నేను దేనికీ వాళ్ళమీద ఆధారపడట్లేదు. కాబట్టి జీవితంలో నిర్ణయాలు స్వయంగా తీసుకోగలను. ఇంక ఇంట్లో కలిసి ఉండటం అంటారా మళ్ళీ నెల ఒకటో తారీఖు నుండి అంధేరీ లో పేయింగ్ గెస్టు గా వెళ్ళిపోతున్నాను. ఎప్పటినుండో నాకొక కల ఉండేది. వీళ్ళ నుండి, వీళ్ళలాంటి వాళ్ళు అందరూ కలిసి ముంబైలో ఏర్పడిన తమ ఇలాకాలో, అందులోనూ ప్రత్యేకించి ఛాందసులైన గుంపు Tam Brahm’ నుండి దూరంగా ఉండాలన్న నా చిరకాల వాంఛ ఇన్నాళ్ళకి నెరవేరబోతోంది.
మొత్తానికి ఆ ముచ్చట అలా ముగిసింది.
ఒకరకంగా చూస్తే ఉద్యోగం నాకు పెద్ద సమస్య కాదు. ఎందుకంటే నేను ఏ ఉద్యోగం కూడా రెండు-మూడేళ్ళకి మించి చేసినది లేదు. కొంతమంది బాసులకి నాలో స్త్రీసహజమైన వినయం కనిపించకపోవడం, మరికొందరికి నేను ఒక గయ్యాళి ఆడదానిలా, ఇంకొకళ్ళకి కరడుకట్టిన స్త్రీవాదిలా కనిపించడం ఇలాంటివన్నీ కారణాలన్నమాట! నేను చేసే పనిలో ఎలాంటి లోపం దొరకక ఇలాంటి వంకలు వెదుకుతూ ఉండేవారు. అయినా కొత్త ఉద్యోగం సంపాదించడం నాకేం పెద్ద కష్టమైన పని కాదు.
ఇంగ్లీషు జర్నలిజం చాలా వేగంగా తన పరిధిని పెంచుకుంటూ పోతోంది. ఎనభయ్యవ దశకంలో రాజనీతిపరమైన అస్థిరత నెలకొని ఉన్నప్పటికీ (మళ్ళీ మాట్లాడితే దానినల్లనే కావొచ్చు) రాజకీయేతర ఉద్యమాలు ఊపందుకున్నాయి. స్త్రీవాద ఉద్యమం, నర్మదా బచావో, మూఢనమ్మకాల నిర్మూలన, జనవిజ్ఞాన వేదికలు ఇదంతా ఒక ఎత్తయితే ముంబైలాంటి నగరం రాజకీయ ఆర్థిక రంగాల్లో జరిగే కుంభకోణాలని బద్దలుకొట్టే పత్రికలకు పెద్దపీట వేస్తోంది. అందులోనూ నాలాంటి అనుభవం ఉన్న, స్త్రీ సమస్యలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ నాయకుల బాగోతాలు లాంటి రకరకాల విషయాలను గురించి చక్కని అవగాహనతో కూలంకషంగా చర్చిస్తూ రాయగలిగే జర్నలిస్టులకి అవకాశాలకి కొదవ ఉండదని నా అభిప్రాయం.
అయితే కాలం చాలా వేగంగా మారిపోతోంది. ఇక్కడ-అక్కడ చక్కర్లు కొట్టి 5-6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ బోరీబందర్ ముసలమ్మ ఒడిలోకి చేరే నాలాంటి చురుకైన జర్నలిస్టుకి జరగబోయే పరిణామాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జరుగుతున్న, జరగబోయే పరిణామాలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. నన్ను ఎంతో బాధిస్తున్నాయి. అయితే నేను వాటిని ఆపలేను, వాటికి తగ్గట్టు నన్ను నేను మార్చుకోనూలేను. ఆఫీసు రెన్నోవేషన్ పనులు జోరుగా నడుస్తున్నాయి. ‘మొత్తానికి ముసలిదానికి మేకప్ వేసి దానితో ‘క్యాట్ వాక్’ చేయించే వరకు ఆగేలా లేరు’ అన్నాను. నవ్వులయితే ఆగాయి కానీ విషయం అక్కడితో ఆగలేదు. మెల్లమెల్లగా నన్ను కలవడానికి వచ్చేవాళ్ళని రిసెప్షన్ దగ్గరే ఆపెయ్యడం మొదలుపెట్టారు. ఊరు, పేరు, చిరునామా, ఎవర్ని, ఎందుకు కలవాలి అన్న వివరాలు చెబితేగానీ రిపోర్టరును కలవడానికి వీలు లేదని నియమం పెట్టారు. తన ఊరు-పేరు-వివరాలు చెప్పడం ఇష్టంలేని ఎందరో వ్యక్తులు ఇంతకుముందు నాకు న్యూస్ అందజేసేవారు. అలాంటివారు ఇప్పుడు రావడం మానుకున్నారు. ఇంతలో కొత్తతరం యాజమాన్యం – “మనం ముఖ్యంగా ప్రకటనల మీదే వ్యాపారం చేస్తున్నాం. వార్తలు కేవలం ‘బై ప్రొడక్టు’ అంతే!” అని నిర్మొహమాటంగా ప్రకటించింది. అటుపై రకరకాల మార్పులు-చేర్పులు చోటుచేసుకున్నాయి. ఇదంతా జరగడానికి కొన్నాళ్ళ క్రితం ముచ్చట –ప్రతీ ఐదారేళ్ళకీ సంపాదకులు మారుతూ ఉండటం ఇక్కడ సంప్రదాయం. ఈ కొత్త సంపాదకులు రావడానికి ముందే వీరిగురించి చర్చలు మొదలయిపోయాయి. ఆయన ఇంగ్లీషు సాహిత్యంలో కొద్దోగొప్పో పేరున్న వ్యక్తి. ఇప్పుడు కొత్తగా సంపాదకుడి అవతారం ఎత్తాడు. దానికోసం అందరూ ఆయని గురించి డప్పుకొడుతున్నారు. ఆయన యాజమాన్యానికి దూరపు బంధువు కూడా. ఆయన మొదటి పరిచయంలోనే – “నువ్వు ఇలా వెర్రిబాగులదానిలా కాకుండా కాస్త పద్ధతిగా, ఒద్దికగా ఉంటే నలుగురూ నిన్ను తిరిగి చూస్తారు. నీ అందాలు గుచ్చుకుంటాయి. ఇది నా అభిప్రాయం” అన్నాడు. ఆరోజు నేను ఎప్పటిలాగానే జీన్స్ మీద బొత్తిగా పొసగని రంగుది, వదులుగా ఉన్న టాప్ తొడుక్కున్నాను. అందుకే నా క్లీవేజ్ స్పష్టంగా చూడగలిగాడు. ధ్యాంక్స్, బట్ నో థ్యాంక్స్. నిజంగా మీ బ్యాగీ ప్యాంటూ, టక్-టై చాలా బాగున్నాయి. కానీ విగ్గు మాత్రం మీకు అస్సలు నప్పలేదు. మరి నాదేమైనా మామూలు చూపా? నేను చూసి చూసి వాడి బలహీనత మీద దెబ్బ కొట్టాను. కొన్నాళ్ళపాటు శాంతి నెలకొంది.
కొన్ని నెలలు గడిచాయి. ఆయన ఒకరోజు పొద్దుపొద్దున్నే స్టాఫ్ మీటింగ్ పెట్టాడు. నేను రాత్రంతా డ్యూటీ చేసి అలసిపోయి ఆవలిస్తూ వచ్చి కూర్చున్నాను. ఆయన ఉదయం ఎనిమిది గంటలకు నున్నగా గడ్డం గీసుకుని, సెంటు కొట్టుకుని మీటింగుకి వచ్చాడు. అతని వెనకాలే కొత్తగా జాయినయిన అందమైన మంచిగా సింగారించుకున్న ఇద్దరు ఉప సంపాదకులు కూడా అత్తరులో స్నానం చేసి వచ్చారా అన్నట్టు సువాసనలు వెదజల్లుతూ ఆయనకి చెరొకపక్క కూర్చొన్నారు. ఆయన వాళ్ళని ఓరకంట చూసి ఒక చిరునవ్వు నవ్వి నావైపు తిరిగి – “అందం. ఈ విషయం గురించి మాట్లాడటానికి నాకు ప్రత్యేకమైన అర్హత ఉందన్నది మీరు ఒప్పుకోవలసిన నిజం. అతగాణ్ణి అడపాదడపా అందాల పోటీకి న్యాయనిర్ణేతగా ఆహ్వానిస్తూ ఉంటారు మరి. మన పూర్వీకులు తరచు ఒక మాట చెబుతూ ఉంటారు – “నిద్రలోనుంచి లేచి అలసిన కళ్ళతో, చెదరిని జుట్టుతో కూడా అందంగా కనిపించే ఆడదాని అందమే అసలైన అందం.” ఇది ఒప్పుకుని తీరవలసిన నిజం. అయితే దురదృష్టం ఏంటంటే ఏ మధుబాల లాంటి ఒకరిద్దరు మాత్రమే ఈ కోవలోకి వస్తారు. రెండవ కోవకి చెందిన స్త్రీలు, మళ్ళీ మాట్లాడితే అందంచందం లేని స్త్రీలు అలసిపోయిన ముఖాలతో ఉంటే అస్సలు చూడలేం. పైగా వీళ్ళలాంటి వాళ్ళ వల్ల తోటివాళ్ళ పని కూడా చెడిపోతుంది. అలాంటివాళ్ళు ఆఫీసు మీటింగుకి వచ్చేటప్పుడు కాస్త ముఖం కడుక్కుని, పళ్ళుతోముకుని వస్తే మంచిది.” అన్నాడు.
నేనేమన్నా నోరుమూసుకుని కూర్చొనే రకమా? “క్షమించండి సంపాదక మహాశయా! రాత్రంతా డ్యూటీ చేసి పెరిగిన గడ్డంతో, పాచిపళ్ళతో మీటింగులకి వచ్చే నా మగ కలీగ్స్ తో లేని ఇబ్బంది నాతో ఏమొచ్చినట్టో? అసలు మీరు మానుండి ఏం ఆశిస్తున్నారు? – రాత్రంతా మెలకువగా ఉండి మంచి స్టోరీ సిద్ధం చెయ్యాలా? లేక మేక్ అప్ వేసుకుని సింగారించుకోవాలా?” సిగరెట్ వాసన మీవరకు రాకుండా తగినంత దూరం ఎలాగూ పాటిస్తున్నాం. ఇక ముందు కూడా పాటిస్తాం. ఇంకా ఏం చెయ్యాలో చెప్పండి.” అన్నాను.
‘రోమియో’ ఏమీ అనలేదు. కానీ ఆ వారం పేపర్లో నాది ఒక్క ‘స్టోరీ’ కూడా అచ్చవ్వలేదు. నెలాఖరుకల్లా నా కాంట్రాక్ట్ ముగిసింది. దాన్ని రెన్యువల్ చేసేది లేదని మేనేజిమెంటు నుండి నోటీసు కూడా అందింది. నేను యూనియన్ తో మాట్లాడి మేనేజిమెంటు మీద కేసు వేసాను. “ఈ కేసుల మీద పెద్దగా ఆశలు పెట్టుకోకు. నియమ-నిబంధనలు చాలా వేగంగా మారిపోతున్నాయి. మేనేజిమెంటు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తోంది.” – అంటూ నచ్చజెప్పాడు సెబేస్టియన్.
ఇందులో సెబేస్టియన్ ప్రత్యేకించి నచ్చజెప్పేది ఏం లేదు. కాలమే చాలా ఘోరంగా, కనికరం లేకుండా తయారయింది. వేరే వార్తాపత్రికలు, అంటే – దిన, వార, మాస ఇలా అన్ని పత్రికల్లో ఇదే పరిస్థితి. సీనియర్ జర్నలిస్టులు వాళ్ళకి వాళ్ళుగా ఉద్యోగాలు మానేసే పరిస్థితులు కల్పిస్తున్నారు. మేనేజిమెంటుకి చెంచాగిరీ చేసేవాళ్ళు పెద్ద-పెద్ద పదవుల్లో కూర్చుంటే ప్రతిభావంతులు సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నర్మద బచావో ఉద్యమం, సెజ్ విస్థాపితుల కన్నీటి గాథలు, ప్రజా ఆరోగ్య ప్రణాళికలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణాలు, కె.జి. నుండి పి.జి. వరకు విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ, రాజకీయాల్లో పేరుకుపోయిన కుటుంబవాదం, అవినీతి, ఇలాంటి గంభీరమైన విషయాలు మాట్లాడటానికీ, చర్చలు జరపడానికీ మీడియా పెద్దగా శ్రద్ధ చూపించట్లేదు. ఇంకొక పక్క భర్త దీర్ఘాయుష్షు కోసం మంగళ గౌరీ వ్రతాలు చేసే ఆడవాళ్ళ ఫోటోలు వేసి పేజీలు నింపడం, ఫేస్ క్రీమ్ కి బొట్టుబిళ్ళ ప్యాకెట్ ఉచితంగా ఇచ్చే ఆలోచన గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఎంతగా ప్రభావితం చేస్తోందో నిరూపిస్తూ వ్యాసాలు రాయడం – ఇదంతా నావల్ల అయ్యే పని కాదు. నేను ఇంచుమించు అన్ని పత్రికల్లోనూ పనిచేసాను. అదీ కుదరకపోతే పార్ట్ టైమ్, ఫ్రీలాన్సింగ్, జాబ్ వర్క్, స్వయంసేవా సంఘాల పనిని డాక్యుమెంటేషన్ చెయ్యడం …. ఇలా రకరకాల పనులు చేసి చూసాను. ఈ జర్నలిజంలో నాకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. కానీ, నాకు ఇది తప్ప వేరే పని చేతకాదాయె! సంతోషించదగ్గ విషయం ఏంటంటే నేను నా దిగువ మధ్యతరగతి అలవాట్లను వదులుకోకపోవడం వల్ల నా ఖర్చులు పరిమితంగా చాలా తక్కువగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తకముందే సిగరెట్ మానేసాను. (అయినా ఇప్పుడు రాత్రంతా మేల్కొని స్టోరీ పూర్తి చెయ్యాల్సిన టెన్షన్ కూడా లేదు.) అందువల్ల తక్కువ ఖర్చుతో నా పూట గడచిపోతోంది. కామాయని, లక్ష్మి, గీతల్లాగా నేను కూడా పెళ్ళి, పిల్లలు, ఇంటి ఖర్చులు, కట్టవలసిన వాయిదాలు అని ఇరుక్కుని ఉండి ఉంటే ఏదో ఒక న్యూస్ పేపరు పంచన చేరిపోయి నిజాయితీగా దానికి ఊడిగం చేస్తూ ఉండేదాన్ని.
అమ్మ ఈలోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటితో ఉన్న చిన్నపాటి బంధం కూడా పూర్తిగా తెగిపోయింది. నాన్న ఒంటరిగా చెంబూరు ఇంట్లో ఉంటున్నాడు. కానీ, నాకు ఆయన్ని కలవాలంటే మనస్కరించదు. ఆయన కూడా ఈలోకం విడిచి వెళ్ళిపోయాక ఒక్కసారి మాత్రం అన్నయ్య నన్ను కలవడానికి వచ్చి ఏవేవో పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు ఈ లోకంలో ఉన్న ఒకే ఒక్క బంధం – గణేష్. నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, ప్రియుడు, ఆల్ ఇన్ వన్ గణేష్! గత కొన్నేళ్ళుగా మేం మధ్యమధ్యలో కలిసి ఉంటున్నాం. మనది ‘లివ్-ఇన్, లివ్-అవుట్ బంధం’ అని ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటాడు గణేష్.
నేను ఇంకా ఇల్లు-వాకిలి-పిల్లల గురించి ఆలోచించలేదు. అయితే మారుతున్న పరిస్థితుల్ని బట్టి చూస్తూంటే గణేష్ తో కలిసి జీవించడం చాలా అవసరం అనిపిస్తోంది. కానీ అలా నేను తన మీద ఆధారపడటం గణేష్ కి నచ్చదు. “చూడు, మనిషన్నవాడు జీవితాంతం ఒంటరే. సెక్యూరిటీ, ఇన్ సెక్యూరిటీ ఇవన్నీ మన మెదడు ఆడే ఆట అంతే! కాబట్టి మన సెక్యూరిటీని వేరే మనిషి చేతుల్లో పెట్టడం మానెయ్” అన్నాడు.
మా ఇద్దరివీ ‘ప్రైమరీ కలర్స్’. ఇద్దరిలో ఏమన్నా సమానత్వం ఉంది అంటే కేవలం జర్నలిజం పట్ల వ్యామోహం. అంతే. వార్తల వాసనని పసిగట్టే ముక్కు, దాన్ని వెంబడించే పదునైన చూపు మా ఇద్దరి సొంతం. నేను ఏకాంతాన్ని కోరుకుంటాను, తను జనాల మధ్య ఉండటానికి ఇష్టపడతాడు. నాకు ఇల్లు, ఆఫీసు – ఈ రెండే ప్రపంచం. కానీ తను మాత్రం ప్రపంచం అంతా తన ఇల్లే అనుకుని మురిసిపోయే రకం. నా ఇంటివాళ్ళు తిరస్కరించినా గణేష్ తో ఈ బంధం నాకెంతో అపురూపం. ఇంక తన విషయానికి వస్తే ‘ఓ బాటసారీ! ఇది జీవిత రహదారి’ తరహా! నేనేమో ఒక్కొక్క పైసా కూడబెట్టి నాలుగు రోజులు గడుపుకోవాలనుకునే రకం, మరి తనేమో ఉన్నదేదో నలుగురితో పంచుకుని తినాలనుకునే రకం. తను ఇన్నేళ్ళు ముంబైలో ఉండటానికి ఒక కారణం నేనైతే మరొక కారణం – ఈ ముంబై జర్నలిస్టులకి మక్కా-కాశీ-జెరూసలెమ్. ప్రస్తుతానికి జర్నలిజం వెలవెలబోతోంది. అతగాడి మనసులో కూడా కాస్త గుబులుగా ఉంది.
అమ్మ వెళ్ళిపోయాక మూడు నెలలపాటు తను నన్ను పువ్వులా చూసుకుంటూ వచ్చాడు. ఒకరోజు నన్ను ‘మడ్ ఐల్యాండ్’ తీసుకెళ్ళాడు. అది అతనికి చాలా ఇష్టమైన చోటు. ఎందుకంటే అక్కడకి వెళ్తే అతనికి కేరళలోని తన సొంతూరు గుర్తొస్తుంది. అక్కడ మనసు విప్పి మాట్లాడుకున్నాం, ప్రేమించుకున్నాం. ఉదయం లేస్తూనే తను నాకు వీడ్కోలు పలికాడు – “ఇంట్లో ఉంటూ నిన్ను వదిలి వెళ్ళడం నావల్ల అయ్యే పని కాదు. అందుకే ఇలా …. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. నా గురించి బెంగ పెట్టుకోవద్దు. నేను ఎక్కడికి వెళ్తానో, ఏం చేస్తానో నాకే తెలియదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఒక మళయాళీ వాడు ప్రపంచంలో ఏ మూలనైనా బతికెయ్యగలడు. రేపటి రోజున మంగళ గ్రహం మీదకి వెళ్ళే వాళ్ళ లిస్టులో నాపేరు ఉన్నా నువ్వు ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు వెళ్తున్నాను. అంటే ఎప్పటికీ తిరిగి రాను అని మాత్రం కాదు. అలాగని తిరిగొచ్చిన ‘నేను’, ఇప్పటి ‘నేను’గా ఉంటాననీ చెప్పలేను. నువ్వు సంతోషంగా ఉండు. నీ మనసుకి నచ్చిన పనే చెయ్యి. అలా కాకుండా వేరే పని నువ్వు చెయ్యలేవు కూడా. కష్టాలు వస్తాయి. ‘కెరీర్ ముగిసిపోయింది’ అన్న ఆలోచనలు కూడా వస్తాయి. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో – ఈ ప్రపంచంలో మతం, రాజకీయం, వ్యాపారం ఉన్నంత కాలం జర్నలిజానికి ఢోకా లేదు. ఒక పేరుమోసిన రాజకీయ నాయకుడికి అవినీతి కేసులో జైలు శిక్ష పడింది. నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ ‘మీ రాజకీయ జీవితం ముగిసిపోయినట్టేనా?’ అని అడిగితే, దానికి ఆయన నవ్వేసి – “నిజమైన రాజకీయ నాయకుడు ఎప్పుడూ ముగిసిపోడు. చచ్చిపోయిన తర్వాత కూడా వేరేవాళ్ళ మెడల మీద ఊరేగుతూనే ఉంటాడు. “దేర్ ఆర్ నో ఫుల్ స్టాప్స్ ఇన్ పాలిటిక్స్, ఆల్ ఆర్ ఒన్లీ కామాస్ అండ్ సెమీకోలన్స్.” మన విషయంలో కూడా ఇదే నిజం. గుర్తుపెట్టుకో. కాస్త నవ్వు. రిమెంబర్ – నో టియర్స్, నో ఫేర్ వెల్స్, ఒన్లీ గుడ్ బై.” ఇంటికెళ్ళి చూస్తే గణేష్ తన ఫ్లాట్ నా పేరుమీద రాసేసాడు.
మొన్న చాలా ఏళ్ళ తర్వాత కామాయిని కనిపించింది. ఇంటికి రమ్మంటే, కాదని చెప్పి పెద్ద హోటల్ కి తీసుకెళ్ళింది. “ఏంటి సంగతి? ఉన్నట్టుండి ఇలా? పార్టీ ఏమన్నా ఇస్తున్నావా?” అని అడిగితే “అవును. అలాగే అనుకో. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. నీకు కూడా ఒక గొప్ప శుభవార్త మోసుకొచ్చాను. సార్ నిన్ను గుర్తుచేసుకున్నారు.”
“ఎవరు? ఆ బట్టతల రోమియోనా? నన్ను కలుస్తానన్నాడా?”
ఆమె నవ్వేసి – “సార్ కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించబోతున్నారు. అందులో నీకు మంచి ఆఫర్ ఇచ్చారు. అన్నింటికీ మించి నువ్వు ఆ ఛానల్ లో పొలిటికల్ ఎడిటర్ … రాజకీయ విశ్లేషకురాలి పదవిలోకి వస్తే తను చాలా సంతోషిస్తానని చెప్పమన్నారు.”
“మంచి ప్యాకేజి కూడా!”
“ఎలాంటి స్టోరీలు రాయాలో ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యం నాకు ఉంటుందా మరి?”
“చూడు, ఆ స్వాతంత్ర్యం మనకి ఇంతకు ముందు కూడా లేదు. ప్రస్తుత పరిస్థితులయితే నీకు తెలియనివి కాదు.”
“సార్ ఇప్పుడు రాజకీయంగా ఏదో చెయ్యాలనుకుంటున్నారు. అందుకే నీలాంటి తెలివైన, చురుకైన, విషయ పరిజ్ఞానం ఉన్న మనిషి అవసరం ఎంతైనా ఉంది.”
“ఆయనకి చెప్పు – థ్యాంక్స్, బట్ నో థ్యాంక్స్. నాకు తెలుసు ఆయన రాజ్యసభ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. బేరసారాలు చెయ్యడానికి మాసాలా కావాలి. వాడి ఆటలో నేనెందుకు పావుని అవ్వాలి?
సరే. ఒప్పుకుంటాను. ఆయన సంగతి పక్కనపెట్టి నీ గురించి కాస్త ఆలోచించు. నీ కెరీర్ ఇంక ముగింపు దశకి వచ్చేసింది. దీనివల్ల నీకూ కాస్త ఊతం దొరికినట్టు అవుతుంది. నువ్వే చెబుతూ ఉంటావుగా – “దేర్ ఆర్ నో ఫుల్ స్టాప్స్ ఇన్ జర్నలిజం, ఒన్లీ కామాస్ అండ్ సెమీకోలన్స్” అని.
నాలుగు రోజుల క్రితం మన సెబేస్టియన్ అదే బి.యు.జె. సెబేస్టియన్ కలిసాడు. ఈ కొత్త తరానికి గూగుల్ కి ముందు జరిగిన చరిత్ర బొత్తిగా తెలియదు అని వాపోయాడు. ఆ చరిత్ర అంతా ఏదో తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమైనట్టు వృథా అయిపోతోంది అని బాధపడ్దాడు. అందులో నుండి కొంత ముఖ్యమైన సామాగ్రి అయినా సేకరించి డిజిటలైజ్ చెయ్యాలి. కనీసం గత మూడు దశాబ్దాల్లో జరిగిన ఉద్యమాలు, రాజకీయ నాయకుల కథలు, వాతావరణ కాలుష్యం గురించి చేసిన హెచ్చరికలు, వాటిని పెడచెవిన పెట్టడం వల్ల జరిగిన, జరుగుతున్న, జరగబోయే అనర్థాలు …. ముందుగా వీటన్నిటినీ మేమిద్దరం కలిసి డిజిటలైజ్ చేస్తాం. డబ్బు ఎక్కువ రాకపోవచ్చు. కానీ మా మనసుకు సంతోషం. అన్నిటికీ మించి బాస్ ఉండడు …. బట్టతలవాడు గానీ, ఉంగరాల జుట్టు వాడు కానీ …. నో బాస్!
నీ కొత్త ఉద్యోగానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
కలుస్తూ ఉందాం. పూర్వం మనం అలవాటుగా కలిసే దగ్గరే, పాత జ్ఞాపకాలని తలచుకుని మురిసిపోతూ కలుస్తూ ఉందా. అప్పుడప్పుడు …. ఎప్పుడైనా కలుస్తూ ఉందాం. బై బై బేబీ… టేక్ కేర్…!!!
![]()
శ్రీ రవీంద్ర రుక్మిణీ పంఢరీనాథ్
వృత్తిరీత్యా అధ్యాపకులు, ప్రవృత్తిరీత్యా రచయిత-కార్యకర్త అయిన
శ్రీ రవీంద్ర రుక్మిణీ పంఢరీనాథ్ ఐ.ఐ.టి. మద్రాసు నుండి మెడికల్ సైన్స్ లో పిహెచ్.డి. పట్టా పందారు. అధ్యాపక వృత్తి లోకి రాక పూర్వం జె.పి. ఉద్యమంలో పాల్గొన్నారు. అటుపై వాతావరణం, స్త్రీ-పురుష సమానత్వం మరియు ఆరోగ్యానికి సంబంధించిన విభిన్న ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. కన్యా భ్రూణహత్యకి సంబంధించి పరిశోధన, ఉద్యమం చేసి చివరకి రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలో చట్టం చెయ్యడంలో ప్రముఖ పాత్ర పోషించారు. యాభయ్యవ పడిలో పడ్డాక రచనా వ్యాసాంగం వైపు కేంద్రీకరించారు. ప్రముఖంగా మరాఠీ భాషలో రచనలు చేసే
శ్రీ రవీంద్ర గారు తన మొదటి నవల ‘ఖేల్ ఘర్’ కు ఎన్నో పురస్కారాలతో పాటు సాహిత్య విమర్శకుల మన్ననలు పొందారు. హిందీలో కథ సంకలనాలు, కవిత సంకలనాలతో పాటు అనువాద రచనలు కూడా ప్రచురించారు. వివిధ ఆన్ లైన్ పత్రికల్లో వ్యాసాలు రాస్తూ ఉంటారు. గాంధీ సాహిత్యం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, జెండర్, విజ్ఞానం-తత్వ జ్ఞానం విషయాలలో ప్రత్యేక అభిరుచి కలిగి ఉన్న శ్రీ రవీంద్ర మరాఠీ త్రైమాసిక పత్రిక ‘ సర్వంకష్’ స్థాపించి సంపాదక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Mobile : 9833346534 E-mail : ravindrarp@gmail.com
డా.వి.ఎల్.నరసింహం శివకోటి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఎమ్.ఏ. (ఫంక్షనల్ హిందీ & ట్రాన్సలేషన్) (గోల్డుమెడల్), ఎమ్.ఫిల్., (హిందీ) (గోల్డుమెడల్), పిహెచ్.డి., (హిందీ) పట్టాలు పొందిన డా. నరసింహం శివకోటి హిందీ-తెలుగు భాషల మధ్య పరస్పర అనువాదం, తులనాత్మస సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. వీరు ఈమధ్య కాలంలో సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా గారి రెండు పరిశోధనాత్మక గ్రంథాలను ‘ప్రభాత్ కిరణేఁ’, ‘అనావరణ్’ శీర్షికన తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రచురించారు. అలాగే, ప్రముఖ హిందీ కవి శ్రీ నరేష్ సక్సేనా గారి ఎంపిక చేసిన కవితలను తెలుగులోకి, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ హిందీ రచయిత్రి శ్రీమతి మమతా కాలియా గారి రెండు నవలికలను ‘పరుగు’, ‘అదే నీవు, అదే నీవు’ శీర్షికన తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ఎంపిక చేసిన హిందీ లఘు కథానికలను తెలుగులోకి అనువదించి ‘తోలుబొమ్మలు’ శీర్షికన ప్రచురించారు. వీటితోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలను తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో డిప్యూటీ మేనేజరు (రాజభాష) గా సేవలు అందిస్తున్నారు.
Mobile : 8247069811 ; E-mail : sivakoti.litt@gmail.com




Discussion about this post