• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కువైట్ కథ : బొమ్మల దుకాణం

డా. ఎ.యం. అయోధ్యారెడ్డి by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
July 1, 2025
in అనువాద కథలు
0
కువైట్ కథ : బొమ్మల దుకాణం

మూలకథ: ఇస్మాయిల్ ఫహద్ ఇస్మాయిల్ (కువైట్), ‘ది స్ట్రేంజ్ వరల్డ్ ఆఫ్ ఎ టాయ్ స్టోర్’

అనువాదం: డా.ఎ.యం.అయోధ్యారెడ్డి   బొమ్మల కొలువు

ఊర్లోనే పెద్ద బొమ్మల దుకాణం.

ఆ సమయంలో జనంతో కిటకిటలాడుతుంది. అమ్మకాల కౌంటర్లో ఉన్న నాలో కంగారూ భయమూ పోటీపడుతున్నయి. ఆ బొమ్మల షాపులో సేల్సుగర్ల్ నౌకరీలో చేరి వారం రోజులు కూడా కాలేదు. ఈ రద్దీతో, రకరకాల మనుషులతో ఎట్లా వ్యవహరించాలి? గత అనుభవం ఏమీలేదు. అందుకే హడావిడి పడుతున్నాను.

అందరూ ఒకేసారి పెద్దగొంతులతో కేకలేసినట్టు అడుగుతున్నారు. ఏదీ స్పష్టంగా విన్పించడం లేదు. గొడవ గొడవగా ఉన్నది.

“ఈ బొమ్మ ధర ఎంత? అదిగో ఆ రైలు బ్యాటరీతో నడుస్తుందా? ఈ కోతి బొమ్మ కీ ఇస్తే గెంతుతుందా?”

ఆక్కడ ఉద్యోగంలో చేరిన మొదటిరోజు మా యజమాని నాకు కొన్ని సూచనలు, హితబోధలు చేశాడు. బొమ్మలు అమ్మేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, కస్టమర్లతో ఓపిగ్గా ఎట్లా మసులుకోవాలో చెప్పాడు.

“చూడమ్మా! ఇది పిల్లలకే కాదు, పెద్దలకూ పనికొచ్చే బొమ్మల దుకాణం. ఇక్కడ అమ్మకాలు జరిపే సిబ్బందికి తప్పనిసరిగా రెండు ప్రాథమిక లక్షణాలు తెలిసుండాలి. ఒకటి.. ఎక్కడాలేని సహనం. రెండు.. నిరంతర నిఘా” అన్నాడు. ఆయన ఇంకా వివరిస్తూ  “పనిలో ఏమాత్రం ఏమరుపాటు పనికిరాదు. ప్రతిక్షణం కళ్ళు విప్పార్చుకుని చూపులతో దుకాణాన్ని జల్లెడపడుతూ ఉండాలి. ఎందుకంటే పిల్లలతో పాటు వొచ్చే కొందరు పెద్దలు చేతివాటం చూపుతారు. అట్లాగే పెద్దలతో వొచ్చే కొందరు పిల్లలు గడుగ్గాయిలు ఉంటారు. ఆ చిన్న దయ్యాలు ఉన్నచోట కుదురుగా ఉండవు. దేనిమీదైనా చెయ్యి వేసేస్తారు. చేతికందిన బొమ్మనో ఆటవస్తువునో చటుక్కున తీసేసుకుంటరు. నువు వాళ్ళని పట్టుకునే లోపే పరిగెత్తిపోగలరు” అని హెచ్చరించాడు.

ఆయన చెప్పినట్టుగానే క్రితంరోజు సాయంత్రమే అలాంటి అనుభవం ఎదురైంది.

షాపులో గిరాకీ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఇద్దరు పిల్లలతో ఒకావిడ వొచ్చింది. పిల్లల ఆటబొమ్మలు చూపించమంది. ఆమెకు బొమ్మలు చూపి బేరంచేస్తూ హడావిడి పడుతున్నాను. అంత హడావిడిలోనూ కౌంటరుకు కొద్దిదూరంలో నిల్చుని షోకేసులో బొమ్మలవైపు తేరిపార చూస్తున్న ఓ పిల్లవాడి మీద నాచూపు పడింది. వాడికి ఏడేళ్లకు మించి ఉండకపోవచ్చు. ఒంటరిగానే వొచ్చినట్టున్నాడు. పక్కన పెద్దవాళ్ళెవరూ లేరు.

దుకాణంలో సందడిని ఏమాత్రం పట్టించుకోకుండా షోకేసు వంకే తీక్షణంగా చూస్తున్నాడు. వాడి ఏకాగ్రత ఆశ్చర్యం కలిగించింది. ఆవెనుకే అనుమానమూ కలిగింది. వాడేదో ముందే నిర్ణయించుకుని వచ్చినట్టు కూడా అర్థమైంది.

పిల్లవాడు బొమ్మల్నే తదేకంగా చూస్తుంటే నేనుమాత్రం వాడిపైనే నిఘా ఉంచాను.

“పిల్లల విషయంలో జాగ్రత్త” యజమాని హెచ్చరిక గుర్తొచ్చి అప్రమత్తమయ్యాను.

నా ముందున్న కస్టమరు వెళ్లిపోగానే పిల్లోడు దగ్గరకొచ్చాడు. నన్నే సూటిగా చూస్తూ “అదిగో షోకేసులో ఉందే.. ఆ కారు బొమ్మ ధర ఎంత?” అని అడిగాడు. బ్యాటరీతో నడిచే పెద్ద కారువైపు చూపుతున్న వాడి చూపుడువేలును చూసి నవ్వాను.

“అబ్బో దాని ఖరీదు చాలా ఎక్కువ. నీకు పనికిరాదు” అన్నాను.

“ముందు ధర చెప్పు ఎంత?” వాడు మళ్ళీ అడిగాడు.

నాకు చిరాకేసింది. బలవంతంగా అణుచుకొని “దాని ధర రెండు దీనార్లు. ఏం.. కొంటావా?” అన్నాను.

వాడు ఆశ్చర్యపోయినట్టు చూసి “అంతనా? మరీ ఎక్కువ” అన్నాడు.

నేను నవ్వకుండా ఉండలేకపోయాను.“నీ పేరేమిటి?” అడిగాను మృదువుగా.

జవాబు చెప్పకుండా మౌనం వహించాడు. నేను వాడి తలమీద చెయ్యేసి జుట్టు నిమురుతూ అన్నాను

“నీ వెంట మీ అమ్మా నాన్నా ఎవరూ రాలేదా?”

“లేదు, వాళ్ళు పనిలో వున్నారు”

“నీకోసం ఒక బొమ్మని కొనివ్వమని మీ అమ్మానాన్నలతో చెప్పు”

నా మాటకి వాడు కొంత అసహనానికి గురైనట్టు చూసాడు.

“మా అమ్మ నాన్న కొనివ్వరు” అన్నాడు.

“ఎందుకని కొనివ్వరు?”

“ఏమో తెలియదు”

ఆ కుర్రవాణ్ణి సంతోషపర్చేది ఏదైనా చెయ్యాలనిపించింది. కానీ ఏం చెయ్యాలో తోచలేదు. దుకాణంలోంచి వెళ్లబోతూ వాడో క్షణం తటపటాయించి తర్వాత బయటికి పోయాడు. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. ఏదో సమస్య తొలగినట్టు అనిపించి ప్రశాంతంగా ఉంది. కానీ అది కొద్దిసేపే. అకస్మాత్తుగా పిల్లవాడు తిరిగి లోపలికొచ్చాడు. నాకు దగ్గరగా నిలుచుని తలెత్తి ముఖంలోకి చూశాడు.

“వీడి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి” అనుకున్నాను.

“నేనా బొమ్మను చూడొచ్చా?” అభ్యర్థనగా అడిగాడు.

వాడి స్వరంలో ప్రేమపూర్వక మార్థవం పలికింది. చూపులో సామరస్య ధోరణి కనిపించింది. పోనీలే, పిల్లోడు ముచ్చట పడుతున్నాడు. కారు బొమ్మ చూపించి కాస్త సంతోషపరిస్తే పోలే అని అనుకున్నా.

“సరే, నీకా బొమ్మ చూపిస్తాను. కానీ చూసి తొందరగా ఇచ్చేయాలి” చెప్పి బొమ్మ తెచ్చి వాడికి ఇచ్చాను.

వాడది తీసుకొని ఆసక్తిగా, ఇష్టంగా పరిశీలించాడు.“బొమ్మ చాలా అందంగా ఉంది!” అని దాన్ని చేతిలో బిగించి పట్టుకున్నాడు.

‘కొంతమంది అల్లరి పిల్లలు తమకు నచ్చిన ఏ వస్తువైనా సులువుగా లాగేసుకుంటరు. వాళ్ళ చేతులు చురుగ్గా పనిచేస్తయి’

నాకు యజమాని చెప్పిన మాటలు గుర్తొచ్చినయి. పిల్లవాడు హఠాత్తుగా వెనుదిరిగాడు.

‘అసలు వాడేం ఆలోచిస్తున్నాడు? కొంపదీసి పారిపోదామన్న యోచనా?’ అప్రమత్తమయ్యాను. కానీ ఈలోగా వాడు బొమ్మ నాకు తిరిగిచ్చేశాడు. ఇస్తూ “ఇది ఎలా పనిచేస్తుంది?” అని అడిగాడు.

వాడి ధోరణి నచ్చింది. ‘మంచి పిల్లాడిలా ఉన్నాడు. కొంతసేపైనా సంతోషపెడదాం అనిపించింది.

“అదెలా పనిచేస్తుందో నీకు చూపిస్తాను” అనిచెప్పి పక్కన కూర్చున్నాను. రిమోట్ బయటికి తీసి కారు నడిపించాను.

“అదిగో చూడు కారు కదులుతోంది!” అన్నాను. బొమ్మకారు దుకాణంలోని ఖాళీ ప్రదేశాల్లో వేగంగా అటూఇటూ తిరుగుతుంటే వాడి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. చప్పట్లు కొడుతూ ఆనందించాడు. “వావ్… ఈ కారు చాలా బాగుంది!” అన్నాడు.

ఇంతలో ఓ కస్టమర్ దుకాణంలో కొచ్చాడు. “ఇక చాలు” అని నేను కారు తీసి తిరిగి షోకేసులో పెట్టేశాను. వాడు తలూపి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. నేను కస్టమర్ వైపు దృష్టి మళ్లించి సాదరంగా “చెప్పండి సర్.. మీకేం కావాలి” అన్నాను.

కాస్సేపట్లో మరొకాయన వొచ్చాడు. తర్వాత ఇంకొకరు. చూస్తుండగనే మరికొన్ని నిముషాల్లో దుకాణం కస్టమర్లతో నిండింది.

నేను పరిసరాలు మర్చిపోయి పనిలో పడ్డాను. గిరాకి వస్తూనే వుంది. మధ్యలో ఓసారి తలెత్తి ఎందుకో షోకేసులో వుంచిన రిమోట్ కారువైపు చూశాను. చిత్రంగా అదక్కడ లేదు. అరే.. కారేమైంది? అక్కడేకదా పెట్టాను ఎట్లా అదృశ్యమైంది? చాలా ఖరీదైన బొమ్మ. ఏమైపోయిందని కంగారు పడ్డాను. ఆ బొమ్మని ముచ్చటపడి చాలామంది కస్టమర్లు అడిగారు. కానీ ఇంతవరకు అమ్ముడుపోలేదని ఖచ్చితంగా గుర్తుంది. మరి షోకేసులో ఉండాల్సిన బొమ్మ కారు మాయమైంది.

ఈ రోజు పనివొత్తిడి ఎక్కువగా ఉంది. కనిపించకుండా పోయిన రిమోట్ కారు మనసులో మెదులుతూనే ఉంది. పరిసరాలు గమనిస్తూనే పనిచేసుకుంటున్నా. ఇంతలో నిన్నటి పిల్లోడు మెల్లగా దుకాణంలోకి రావడం గమనించాను. నిశ్శబ్దంగా వొచ్చి గ్లాసు అద్దాల వెనుక నిలబడ్డాడు. కొత్తగా దేన్నో చూస్తున్నట్టు వాడి ముఖంలో ఆశ్చర్యం వ్యక్తమైంది. అతని చేతిలో నిన్న దొంగలించబడ్డ కారుబొమ్మ కనిపించి దిగ్భ్రాంతి చెందాను. నా ముందే బొమ్మను దొంగిలించి మళ్ళీ దాంతోనే తిరిగి దుకాణంలోకి రావడానికి వీడికి ఎంత ధైర్యం అనుకున్నా. వాడా బొమ్మను గుండెకు హత్తుకొని పట్టుకున్నాడు.

ఈలోగా నేను ముగ్గురు పిల్లలతో వొచ్చిన ఓ మహిళా కస్టమరుకు బొమ్మలు చూపిస్తూ పనిలోపడ్డాను. ఆ మహిళా ఆమె ముగ్గురు పిల్లలూ నన్ను బాగా విసిగించారు. ఇది చూపెట్టు.. అది చూపెట్టు అంటూ ఎంతోసేపు యాతనపెట్టి చివరికి ఏదీ నచ్చనట్టు ఆమె మొహం తిప్పుకుంది. అయితే ఆవిడతో వచ్చిన పిల్లలు దుకాణంలో బొమ్మల్ని బయటికి తీయడం, వాటితో ఆడుకుంటూ రచ్చ చేశారు. బాగా అలిసిపోయాను. నీరసమొచ్చేసింది. దానికితోడు అద్దాలకు అవతల కదలక మెదలక నిలబడి తదేకంగా దేన్నో చూస్తున్న నిన్నటి పిల్లవాడు కనిపించాడు.  నాకు ఓపిక నశించి కస్టమర్ మీద గట్టిగా విసుక్కున్నా. దాదాపు ఆమెని నెట్టినంత పనిచేస్తూ ద్వారం వరకూ పంపించివేశాను. ఈ క్రమంలో లోపలికొస్తున్న బాలున్ని దాదాపు ఢీకొట్టాను.

అయినాసరే, వాడు నాకంటే ముందే దుకాణం లోపలికి పోయాడు. నేను వాడిని వేగంగా అనుసరించాను.

“మా దుకాణంలో కారు దొంగిలించడానికి ఎంత ధర్యంరా నీకు? పైగా ఎత్తుకెళ్లిన బొమ్మతో తిరిగి నావద్దకే వొస్తావా? ఇచ్చేయ్ దాన్ని” గద్దించాను. వాడు ఏమీ అనకుండా అమాయకంగా నవ్వాడు.

“దొంగ పిల్లోడా! ఎలారా దీన్ని ఎత్తుకపోయావ్?” వాడి చేతుల్లోంచి బలవంతంగా బొమ్మ లాక్కున్నాను.

కొంచెం కూడా ప్రతిఘటించకుండా బొమ్మ ఇచ్చేశాడు. ఇప్పుడు వాడి చూపులు షోకేసులో ప్రత్యేకంగా ప్రదర్శనకు పెట్టిన  ఆకర్షణీయమైన రైలుబొమ్మ మీద నిలిచినయి. కళ్లు విప్పార్చుకొని చూస్తున్నాడు. వాడి దగ్గర్నుంచి లాక్కున్న కారు పనిచేస్తుందా లేదాని నిర్ధారించుకోవాల్సి వచ్చింది. బాగానే ఉంది. రిమోట్ ద్వారా దుకాణంలో దాన్ని అటూ ఇటూ తిప్పి పరీక్షించాను.

“నేను దాన్నేమీ పాడుచేయలేదు. అది బాగానే వుంది” అన్నాడు నమ్మకంగా.

వాడ నన్ను విస్మయానికి గురిచేశాడు. పసివాడిలా కాకుండా పెద్దమనిషిలా మాట్లాడుతున్నాడు.

“ఎందుకురా దీన్ని ఎత్తుకెళ్ళావు?” వాడి భుజాలు పట్టి కుదుపుతూ కోపంగా అడిగాను.

“నేను దాన్ని దొంగిలించలేదు. ఆడుకునేందుకు తీసుకున్నా”

వాడి నిబ్బరానికి విస్తుపోయాను. ఎంత ధీమాగా చెపుతున్నాడు? పైగా నావైపు చూడకుండా మరెటో తలతిప్పి. వాడి ధోరణి నా కోపాన్ని రెట్టింపు చేసింది.“అయితే మరెందుకు దాన్ని తిరిగి తీసుకొచ్చావ్?”

“దాంతో చాలాసేపు ఆడుకున్నాను. విసుగొచ్చేసింది”

చిరాకుతో నుదుటిమీద అరచేత్తో కొట్టుకున్నాను. మా యజమాని చెప్పినట్టు పిల్ల దయ్యం అంటే వీడే. ఏదైనా ఎత్తుకెళ్లగలిగే  చిట్టిచేతులు ఈ దయ్యానివే అనుకున్నాను. పిల్లవాడు ఇంకా రైలునే తదేకంగా చూస్తూ వున్నాడు.

“అయితే నువు మా దుకాణంలో ఇంకా ఏం కావాలనుకుంటున్నావ్” అన్నాను.

నా ప్రశ్న నాకే చిరాకు తెప్పించింది. తెలివితక్కువగా అడిగినట్టు అనిపించింది. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో “వెంటనే ఇక్కణ్నుంచి పోతావా? లేక పోలీసుల్ని పిలవనా?” బెదిరించాను.

నా హెచ్చరికను వాడు ఏమాత్రం లక్ష్యపెట్టకుండా తాపీగా అన్నాడు.“వెళతాను, కానీ నాకా రైలు కావాలి!”

కోపంతో పిచ్చెక్కినట్టయింది. వాడి చెయ్యి పట్టుకుని బరబరా ద్వారం వైపు లాక్కుపోయాను.

“ఇప్పటికి నువు చేసింది చాలు దొంగరాస్కెల్. వెళ్లిపో బయటికి”

వాడు కొంచెం కూడా బెదరకుండా “ఆగండి మేడమ్, మీరు నన్ను బాధపెడుతున్నారు. చిన్నపిల్లల పట్ల ఇట్లా నడుచుకోవడం తప్పని తెలియదా?” అన్నాడు. వాడి మాటల్లో తెగువకు విస్తుపోయి వాణ్ని పట్టుకున్న నా చేతిని సడలించాను. అయినా ఇంకా కదలకుండా అక్కడే నిలబడ్డాడు.

“నన్ను విసిగించక మీ ఇంటికి పోరా బాబూ”

“నాకా రైలుబొమ్మ కావాలి. అదిస్తే వెళ్లిపోతా”

“రేయ్! నీకేమైనా పిచ్చిపట్టిందా? అది ఇవ్వడం కుదరదు”

“ఎందుకు కుదరదు? నేను కారుబొమ్మ తిరిగిచ్చేశాను కదా”

నాకు తల తిరిగిపోయింది. వాడి మాటలు నమ్మలేక పోతున్నా. మా దుకాణంలో కారునే దొంగలించి, మళ్ళీ తిరిగి ఇచ్చేసి ఇప్పుడు కారు బదులు రైలుబొమ్మ అడుగుతున్నాడు. “తక్షణం బయటకు వెళ్లు, లేదా నిన్ను పోలీసులకు అప్పగిస్తాను” అరిచాను.

నా అరుపులకి వాడిలో కదలిక వొచ్చింది. ముఖంలో బాధ కనిపించింది. అదిచూసి కొంచెం శాంతిస్తూ

“మంచి బాలురు దొంగతనం చేయరు తెలుసా” అన్నాను.

ఇంతలో ఒక కస్టమర్ మమ్మల్ని దాటుకుంటూ దుకాణంలోకి పోయాడు. తీవ్ర నిరాశతో పిల్లవాడు బయటికి వెళ్ళిపోవడం  కనిపించింది. వాడు ఇష్టం లేనట్టు నడుస్తూ షాపింగ్ సెంటర్ గేటు దాటి అదృశ్యమయ్యేవరకు అటే చూశాను.

“హమ్మయ్య.. దరిద్రం వొదిలింది” గొణుక్కున్నాను. తల మీంచి భారం తొలగినట్టు అనిపించి హాయిగా నిట్టూర్చాను.

తర్వాత నా పనిలో పడిపోయాను. వరుసగా కస్టమర్లు వస్తున్నారు. దుకాణం కిక్కిరిసిపోయింది. గంటసేపటివరకూ ఊపిరిసలపని

హడావిడి. ఆ తర్వాత కొంచెం వెసులుబాటు దొరికినప్పుడు గమనించాను. ఆశ్చర్యమూ కంగారు కలగలిసి అప్రయత్నంగా నోరు

తెరిచాను- “ఎలా జరిగిందిది? ఎట్లా సాధ్యమైంది? అసలా రైలుబొమ్మ ఎప్పుడు అదృశ్యమైంది..?”

డా. ఎ.యం. అయోధ్యారెడ్డి

నాలుగు దశాబ్దాలుగా హైదరాబాదులో నివాసం. 1983లో జర్నలిజంలో మొదలైన ప్రయాణం, తర్వాత దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత దక్కన్ క్రానికల్ సంస్థలో న్యూస్ ఎడిటరుగా పదవీవిరమణ. సాహిత్యపఠనం, కథా నవలా రచన, అనువాదం ఇప్పటి ప్రవృత్తి. 70కి పైగా కథలు, రెండు నవలలు రాశారు. 50 విదేశీ కథలు, ఒక విదేశీ నవల తెలుగులోకి అనువదించారు. ఇప్పటివరకు రెండు కథా సంపుటాలు– ఆహారయాత్ర, అక్కన్నపేట రైల్వేస్టేషన్, అనువాదాలు– ఏడవకుబిడ్డా, కథాసంగమం, అరబ్ కథలు ప్రచురించారు.

Previous Post

తమిళ నవల : తెల్ల ఏనుగు (అధ్యాయం 1)

Next Post

హృదయ వేదనావీచికలు – అర్విందర్ కౌర్

Next Post
హృదయ వేదనావీచికలు – అర్విందర్ కౌర్

హృదయ వేదనావీచికలు - అర్విందర్ కౌర్

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com