• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ: బేలా

admin by admin
February 14, 2026
in అనువాద కథలు
0
కన్నడ కథ: బేలా

కన్నడ మూలం: డా. బెసగరహళ్ళి రామణ్ణ
అనువాదం : రంగనాథ రామచంద్రరావు

1️⃣

ఇటీవలి భారత రాజకీయ చరిత్రలో 1974- అత్యంత గొప్ప సంవత్సరం. రాజకీయ లంచగొండితనం గురించి (జనతా) ప్రజా ఉద్యమం గుజరాత్‌లో విజయం సాధించిన నేపథ్యం; బిహారులో విధాన సభను రద్దు చేసి ఎన్నికలు జరగాలని, ఎన్నికల ఖర్చు మీద ఒక పరిమితి ఉండాలని, పేదలు బలిస్తే, పట్టణాల`గ్రామాల అంతరాలు తగ్గాలని ఉద్యమం ప్రారంభమై తన తీవ్రమైన స్థాయిని చేరుకుంది.

ఈ జనతా ఉద్యమ నాయకుడు, సంపూర్ణ విప్లవ కలలుకనే జయప్రకాశ్ నారాయణ్‌ గారు పార్టీలకతీతమైన ప్రభుత్వ నిర్మాణానికి ఇచ్చిన పిలుపు, బీహార్ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో జనతా ప్రభుత్వం పని చేస్తుందని పత్రిక వార్తలు ఒకవైపు; ఇవన్నీ ఉత్ప్రేక్షతో కూడిన కట్టు కథలు. జనతా ఉద్యమం పాట్నా, గయా, మోంఘేర్, బాగలపులాంటి నగర ప్రదేశాలకు మాత్రమే పరిమితమైందనే ప్రభుత్వ నిరాకరణ మరొక వైపు. వీటన్నిటిని ప్రతిరోజూ పత్రికలలో చదివి, రేడియోల ద్వారా విని, ‘బీహార్ ఉద్యమం’ నా బుర్రను వేడెక్కించింది.

బీహార్లో జనతా ఉద్యమంతోపాటు మశూచి జబ్బు కూడా తన దాడిని బలంగానే చేసింది. ఈ జబ్బును మొత్తం ప్రపంచం నుంచి నిర్మూలించాలని పట్టుబట్టిన విశ్వ ఆరోగ్య సంస్థ భారత దేశంలో, అందులోనూ బీహార్లో తీవ్రంగా తన కార్యాచరణను ప్రారంభించింది. అనేక వేలమంది జనులను బలి తీసుకొని, ప్రజలను వికృతపరిచి, అంధులను చేసిన మశూచికమనే మహమ్మారిని నిర్మూలించడానికి జరుగుతున్న పోరాటంతోపాటు జనతా ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

విశ్వ ఆరోగ్య సంస్థ మశూచికం నామరూపాలు లేకుండా చేయడానికి ప్రపంచం మూలమూలల నుంచి వైద్యుల బృందాన్ని నియమించుకుంది. ఈ కార్యాచరణలో పాల్గొనటానికి బీహార్ రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రం నుంచి వైద్యుల బృందాన్ని పంపించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సర్కులర్ వచ్చినప్పుడు ముందూ వెనుకా చూడకుండా నా అంగీకార పత్రాన్ని పంపాను. ఈ విషయం తెలిసిన నా వైద్యమిత్రులు చాలా మంది, ‘బీహార్ రగిలిపోతోంది. జనతా ఉద్యమం హింసాత్మకమైంది. బీహార్ రాష్ట్రంలోని వైద్యులే ఉద్యోగం చేయడానికి సాధ్యం లేదని నిరాకరించటం వల్ల భారత్‌లోని ఇతర ప్రాంతాల నుంచి అధిక వేతనాల ఆశ చూపించి వైద్యులను పిలిపించుకుంటున్నారు. చాలామంది వైద్యులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారట! అయితే ప్రభుత్వం ఆ వార్తలను కావాలనే దాచి పెట్టింది` ఇలాంటి అనేక సమాచారాల సంతలో నన్ను తోసి దిగులు పుట్టించారు.

ఆ విషయాలన్నీ విన్న నా తండ్రి, నా భార్య, “బీహార్‌కు వెళ్లకపోతే ఏమవుతుంది? వెళ్ళటం వల్ల దొరికే కిరీటమైనా ఏమిటి?” అని గొణిగారు. “అంత భయం ఏమీ లేదు” అని నేను అన్నప్పుడు నా తండ్రి, “నువ్వు రాజకీయాలు మాట్లాడడం ఎక్కువ. ఆ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో చేరుకొని జరగకూడనిది జరిగితే మా గతి ఏమయ్యా? నా ముగ్గురు మనవళ్ల గతి ఏమిటి? నువ్వు ఇంకా కుర్రవాడిలా ప్రవర్తిస్తున్నావు” అని తన అసమ్మతిని స్పష్టంగా వ్యక్తం చేశాడు.

నేను లొంగలేదు. “మశూచికాన్ని నిర్మూలించడానికి ప్రపంచం నలుమూలల నుంచి ఆడ-మగ అనకుండా, వయసు-ముసలితనం అని చూడకుండా వచ్చి వైద్యులు సేవలు చేస్తున్నప్పుడు, ఈ దేశంలో పుట్టిన మనం పనిచేయకపోతే మనల్ని ‘ఆడంగులు’, ‘చేతకాని వాళ్లు’ అని జనం అపహాస్యం చేయరా? దాంతోపాటు బయటిదేశం వారిని కాల్చకుండా బీహార్ జనతా ఉద్యమకారులు మమ్మల్ని పట్టుకొని కాల్చడానికి వస్తారా?” అని వాదించుకుంటున్న మా వాద వివాదాలను మౌనంగా వింటూ కూర్చున్న నా తల్లిని- “నువ్వేమంటావమ్మా?” అని అడిగాను

నా తల్లి మాట్లాడలేదు. ఆమె ముఖంలో ఎలాంటి భయపు చిహ్నాలు కనిపించలేదు. చాలా గంభీరంగా కూర్చుని ఉంది. ఇది చూసి నా తండ్రి, వాదాన్ని కొనసాగించి, “నాకేమయ్యా, నువ్వు ఉన్నావూ, నిన్ను తొమ్మిది నెలలు మోసి కన్నతల్లీ ఉంది. ఈమె సరే అంటే బీహార్ కైనా వెళ్ళు, కాషాయం బట్టలు కట్టుకొని కాశీకైనా పో” అని మౌనం వహించాడు. నేను అమ్మ వైపు చూశాను. ఆమె ముఖం మరింత గంభీరమైంది.

“వెళ్ళనామ్మా?” అన్నాను.

“వెళ్లు. దేవుడి కార్యం చేసే నీ కోరికకు నేనెందుకు అడ్డు రావాలి. పుట్టిన తర్వాత మనిషి చావాల్సిందే కదా. దేవుడి పని చేస్తూ చస్తే అదే స్వర్గం కదా?”-అంది.

ఇవి నా తల్లి నోటి నుంచి వచ్చిన మాటలు, వాటిలో ఉన్న దృఢత్వపు సాంద్రత, ఆ మాటలన్నప్పుడు నా తల్లి ముఖంలో మెరిసి మాయమైన దేశప్రేమ, నా గుండెల్లో ఇంకా అక్కడ తన పంజాను ఊపుతున్న పిరికితనాన్ని తన్ని తరిమింది.

నా తండ్రి నా తల్లి ముఖాన్ని ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాడు.

2️⃣

ఆగస్టు 25వ తారీఖు. సాయంత్రం కొందరు శ్రేయోభిలాషులతో కారులో బయలుదేరడానికి ముందు నా తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాను. భార్య పిల్లలను ఓదార్చి బయలుదేరాలి అంటే ఒక యుద్ధం గెలవడానికి కావలసినంత సాహసాన్ని వినియోగించవలసి వచ్చింది.

ఆగస్టు 26న బెంగళూరు నుంచి మద్రాసు, మద్రాసు నుంచి కలకత్తా, కలకత్తాలో ఒక రాత్రి విశ్రాంతి.
ఆగస్టు 27న కలకత్తా నుంచి రాంచి గుండా పాట్నా విమానాశ్రయంలో అడుగు పెట్టినప్పుడు నా ఒళ్ళు జుమ్మంది.

పాట్నా నగరపు గత చరిత్ర చప్పున కళ్ళ ముందు కదిలి మాయమైంది. వర్తమాన కాలంలో పాట్నా నిర్వహిసిస్తున్న పాత్రను గుర్తు తెచ్చుకొని గర్వపడ్డాను. విశ్వంలోని అత్యంత ప్రాచీనమైన, ప్రాణాంతకమైన మశూచి జబ్బును నిర్మూలించడానికి విశ్వ ఆరోగ్య సంస్థ ( వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) పోరాట కేంద్ర బిందువు. దాంతోపాటు భారత రాజకీయ జీవితానికి అంటుకొనివున్న రోగం, లంచగొండితనాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేయడానికి లోక నాయకుడు జయప్రకాష్‌ గారి నేతృత్వంలో జరుగుతున్న జనతా ఉద్యమానికి పుట్టుక స్థానం. చరిత్రలో ఇంకా అది ఎన్నెన్ని దాఖలాలను నమోదు చేయాల్సిన సంఘటనలు ఈ పాట్నా నగరంలో జరుగుతాయో అని మెప్పుదలతో తల ఊపుతూ, నాకోసం ఎదురు చూస్తున్న విశ్వ ఆరోగ్య సంస్థ వాహనంలో నేను బస చేయడం కోసం నిర్ణయించిన ‘దాయ్‌చి’ హోటల్‌కు వచ్చి చేరినప్పుడు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ఒకరోజు ముందే వచ్చిన నా స్నేహితులు అక్కడ ఒక చిన్న కర్ణాటకనే నిర్మించారు!

నవంబర్ నెల ఒకటవ తారీఖు.

మశూచి నిర్మూలన కార్యక్రమాలను సూక్ష్మంగా పరిచయం చేసే మూడు రోజుల ట్రైనింగ్ తర్వాత మమ్మల్ని ఒక్కొక్క వాహనంలో వేరు వేరు స్థలాలకు వెళ్ళవలసిందిగా సూచించారు.

నా పాలికి బాగలపుర జిల్లా వచ్చింది. నాకు నిర్ణయింపబడిన వాహనం దగ్గరికి వెళుతుండగా ఒక బక్కపల్చటి వ్యక్తి, “సలాం సాబ్, గుడ్ మార్నింగ్, మై నేమ్ గోపాల్ ప్రసాద్, ఆప్‌కా డ్రైవర్” అన్నాడు.

ఇంగ్లీష్ కలిసిన హిందీలో మాట్లాడిన వ్యక్తిని చూసి నవ్వాను. అతని ముఖంలో కళ్ళు ముక్కు కన్నా మీసాలే తన సామ్రాజ్యాన్ని ప్రబలంగా స్థాపించింది.

జీపులో కూర్చొని, “చలో! గోపాల్ ప్రసాద్” అన్నాను.

బాగలపురకు చెందిన సర్క్యూట్ హౌస్‌ను చేరేసరికి రాత్రి ఎనిమిది గంటలైంది.

3️⃣

బాగలపుర జిల్లా విశ్వ ఆరోగ్య సంస్థకు చెందిన ఇతర అధికారులతో మశూచి రోగం ప్రబలిన గ్రామాలను గుర్తించటం. తర్వాత రోగాన్ని ఆపటానికి అమ్మవారిని పూజించే కార్యక్రమం. తర్వాత కళ్ళల్లో కళ్ళు పెట్టి కొత్తగా రోగం తగిలిన వారి కోసం వెతకడం. ఈ పోరాటం ఇలాగే ఒకటిన్నర నెలల కాలం నడిచింది.

ఈ వ్యవధిలోనే జయప్రకాశ్ నారాయణ్ గారు ఐదు రోజుల కాలం పూర్తిగా ‘బీహార్ బంద్’కు ఇచ్చిన పిలుపును అత్యంత శాంతితో పాటించిన ప్రజల క్రమశిక్షణ, సంయమనం, నాయకుని పట్ల చూపించిన నిజాయితీ, అలాగే ‘పాట్నా చలో’ కోసం పిలుపు ఇచ్చినప్పుడు, తమ తమ సద్దిమూటలు కట్టుకొని బయలుదేరిన యువతీ`యువకులను, ముసలివాళ్లు-ముసలమ్మలను బస్సుల నుంచి, రైళ్ల నుంచి పోలీసులు బలవంతంగా కిందకు దింపినప్పటికీ “లోక్ నాయక్ జె.పి. జిందాబాద్”, “జనతా శక్తి జిందాబాద్” అని నినాదాలు చేస్తూ ‘పాట్నా చలో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దృఢంగా సంకల్పించుకొని బయలుదేరిన ప్రజల ధైర్యస్థైర్యాలు చూసి అభిమాన పడ్డాను. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ జనం, అదేవిధంగా వీళ్ళ పూర్వీకులు ఇంకెంత తీవ్రంగా పోరాడి ఉండొచ్చు? ఈ జనం మనోస్థైర్యాన్ని, క్రమశిక్షణను గుర్తించిన మహాత్మా గాంధీ గారు ‘సత్యాగ్రహ ఉద్యమాన్ని’ బీహార్ నేల అయిన చంపారణ్యంలో మొదట ప్రయోగాత్మకంగా ఆచరించి విజయం సాధించారని గుర్తు తెచ్చుకొని ఆశ్చర్యపోయాను.

4️⃣

బీహార్ రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల కన్నా ముందుగానే బాగలపుర జిల్లాలో మశూచి రోగాన్ని నిర్మూలించినట్టు పేరును సంపాదించాలని, దీనికోసం జిల్లా అంతటా ప్రజల దృష్టిని రోగాన్ని కనుక్కునే వైపు లాగాలని, మశూచి రోగం తగిలిన ప్రథమ సమాచారాన్ని అందించిన వారికి వంద రూపాయలు నగదు బహుమానం ఇస్తామని కరపత్రాలను అచ్చు వేసి జిల్లా అంతటా పంచిపెట్టాం. వందరూపాయల బహుమానం ఆశ ప్రజలను ఉత్తేజపరిచింది. ఎవరైనా తమ గ్రామాలలో ఒంటి మీద చిన్న లేదా పెద్ద గుల్లలు కనిపించడం చూసిన వెంటనే, వినగానే జనం మశూచి రోగాన్ని కనుక్కున్నామనే వార్తతో వచ్చేవారు. మేము వాళ్లు ఇచ్చిన చిరునామాలకు వెళ్లి చూస్తే నిరాశ పడవలసి వచ్చేది. కాగితాలు మామూలైపోయాయి. అయితే ఉన్నట్టుండి ఒకరోజు, పిర్‌పాంతి బ్లాకుకు చెందిన ‘బిసాల’ అనే గ్రామంలో 30 కన్నా ఎక్కువ మంది పెద్దవారికి, పిల్లలకు మశూచికం తగిలిందని టెలిగ్రామ్ వచ్చింది. మేమంతా ఆందోళన పడుతూ ఒక అత్యవసర సభను నిర్వహించాం. అందరికీ చేతినిండా పని ఉంది. ‘బిసాల’ గ్రామానికి అవసరమైనంతమంది ఆరోగ్య కార్యకర్తలను తీసుకొని వెంటనే వెళ్లాలని, అలాగే దాని చుట్టుపక్కల ఒకటిన్నర మైళ్ళ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలోనూ పరీక్షలు జరపాలని, అనుమానం వచ్చిన చోట విషయం తెలిసిన వెంటనే నేను వెళ్లి రోగిని పరీక్షించాలని నిర్ణయం తీసుకున్నాం.

విశ్వ ఆరోగ్య సంస్థ క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ. నిర్ణయం తీసుకున్న వెంటనే దాన్ని అమలుపరచడానికి ప్రారంభించాలి. ఎనిమిది మంది మూల కార్యకర్తలను పిలుచుకొని జీపులో కూర్చోమని చెప్పాను. నా డ్రైవర్ గోపాల్ ప్రసాద్ “సార్ మన క్యాంపు ఎటువైపు?” అని పళ్ళికిలించాడు. నేను హడావుడిగా తిరుగుతున్న తీరును చూసి ఏదో చాలా దూరంలో మూలనున్న అడవి గ్రామానికి వెళ్లి క్యాంపు చేస్తామేమోనని ఆలోచించే కాస్త విసుగు చెందినట్లు కనిపించాడు. నేను ‘పిర్‌పాంతి బ్లాక్‌లోని బిసాల్‌కు వెళ్లాలి’ అని అనగానే అతను ‘బహుత్ అచ్ఛాసాబ్ అచ్ఛా సాబ్” అని తేనె తుట్టెనే తీసి నోటిలో పిండితే చప్పరిస్తున్నట్టు నోరు చప్పరించాడు. అతని సంతోషం గుర్తించే-

“ఏయ్ గోపాల్, బిసాల్ ఏమైనా నీ భార్య గ్రామమా?” అన్నాను.

“లేదు సార్, మా అత్తగారిల్లు” అన్నాడు.

నాకు అతని మాటల గూఢార్ధం తెలియక నవ్వి మౌనం వహించాను.

5️⃣

పిర్‌పాంతిని చేరేసరికి ఉదయం పది గంటలైంది. ప్రయాణికుల విడిది గృహాల్లో మా కోసం గదులను రిజర్వ్ చేసుకుని, బిసాల్‌కు బయలుదేరాం. పిర్ పాంతి నుంచి బిసాల్‌కు సుమారు నలభై ఐదు నిమిషాల ప్రయాణం. రోడ్డు అక్కడక్కడ పాడైపోయింది. గోపాల్ ప్రసాద్ బీహార్లో పాడైపోయిన రోడ్లన్నీ ఉద్యమం చేస్తున్నవారి చేత మరమ్మత్తు చేయించాలని గొణిగాడు. ఒక ఇరుకైన దారిలో జీపు మమ్మల్ని కుదిపినప్పుడు, లోకానికి ఉపయోగపడే శాఖ ప్రమాదకరమైన శాఖ అయిందని అరిచాడు. బిరిమషియా అనే గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ సంత జరుగుతోంది. మూల ఆరోగ్య కార్యకర్తలను గురించి “సంతలో మశూచి రోగం గురించి పుకార్లు ఏమైనా ప్రజలు తెలిపితే సేకరించుకొని రండి” అని చెబుతుండగానే, ఆకు, వక్కలను నములుతూ, కోర్టు, ప్యాంటు, కళ్లద్దాలు ధరించిన, పొట్టిగా లావుగా ఉన్న వ్యక్తి మా జీపు దగ్గరికి దొర్లుతున్నట్టు వచ్చి, “నా పేరు రామచంద్ర మిశ్రా, పిర్‌పాంతి బ్లాక్ సానిటరీ ఇన్స్పెక్టర్” అని పిచక్కని ఉమ్మాడు. నేను, “నా పేరు డాక్టర్ రామకృష్ణ” అని చెప్పి నా దగ్గర ఉన్న టెలిగ్రామ్‌ను అతని చేతికి ఇచ్చాను. కళ్లద్దాలను సరిచేసుకొని చదివిన రామచంద్ర మిశ్రా, “అరే! బాప్‌రే!” అంటూ టెలిగ్రామ్ ఇచ్చిన వాడి పేరును తనకు మాత్రమే వినిపించేలా

“చతుర్భుజ్ రజక్! ఎవరితను?” అని, బిగ్గరగా “బిసాల్ గ్రామస్థులు దయచేసి కొంచెం జీపు దగ్గరికి రండి” అని అరిచాడు. చాలామంది అప్పటికే మత్తులో ఉండటం వల్ల, కొద్దిమంది మాత్రమే వచ్చారు.

“మీ ఊర్లో చతుర్భుజ్ రజక్ ఎవరు?” అని అడిగాడు.

ఒకడు అక్కడే కొంచెం దూరంలో చెట్టు కింద ఉన్న సారా అంగడి వైపు చేయి చూపాడు. నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా-

“పదా, అతనెవరో చూపించు” అని అనామధేయ్యక్తితో సారా అంగడి వైపు వెళ్ళిపోయాడు.

నాలుగైదు నిమిషాల్లోనే తాగి బాగా మత్తెక్కి సంతనే తన తలలో కట్టుకున్న వాడిలా మాట్లాడుతున్న ఒక పొడవైన వ్యక్తిని లాక్కొచ్చి నా ముందు నిలిపాడు.

నన్నూ, జీపు ముందరి గాజుకు అద్దానికి మశూచికం నుంచి వికారంగా మారిన ఒక బిడ్డ చిత్రం అతికించి ఉండటం చూసి, అలాగే దాని కింద రాసిన “మశూచికం ప్రథమ వార్తను తెలిపిన వారికి వంద రూపాయలు నగదు బహుమానం” అని ఉండటం కనిపించగానే అతని మత్తు మరింత పెరిగి, “ఆఁ ! నేనే టెలిగ్రామ్ ఇచ్చాను రజకును. ఇవ్వండి, ఇవ్వండి స్వామి నగదు బహుమానం! ఒక మశూచికం రోగిని కనిపెడితే వంద రూపాయలు. నేను 30 మంది రోగులను కనిపెట్టాను కదయ్యా. అందువల్ల మూడువేల రూపాయలు. ఒక వెయ్యితో మీరే సారాయి తాగి, అమ్మాయిలు చేత డాన్స్ చేయించి, మజా చేయండి. అమ్మాయిలందరూ డాన్స్ చేస్తారు. ఛ, వదిలేయండి. అయితే ఆ బేల ఉంది కదా. ఆమె డాన్స్ అంటేనే డాన్స్. ఆమె నాట్యానికి కాలి గజ్జెలు నవ్వుతాయి. తబలా మాట్లాడుతుంది. సారంగి కోకిలలా పాడుతుంది. గిరాకీ ముఖం చూసి, బేలా అక్కడే కొత్త కొత్త పాటలను కట్టి పాడటం మొదలు పెడితే… ఆహా! ఆమె లేత ఎరుపు ఆ ముఖం, ఆ ముక్కు, ఆ జింక కనులు, ఆ చిలక ముక్కు మామిడికాయల్లాంటి చూపైన వక్షోజాలు, కులికే నడుము పైకి కిందికి ఆమె చెప్పినట్టు నృత్యం చేసే/ కదిలే పిరుదులు!” అంటూ నృత్యం చేసేవాడిలా నటించడం ప్రారంభించాడు. జనులు గుంపు తమాషా చూస్తూ నిలుచున్నారు. గోపాల్ ప్రసాద్, “దేఖో సాబ్! చినాల్కెకో” అన్నాడు.
రామచంద్రమిశ్రా, “వెధవ నా కొడకా, మొదట మశూచికం రోగులను చూపించు. ఆ తర్వాత మాట్లాడు” అంటూ చతుర్భుజ్ రజకును కొట్టడానికి చేయిఎత్తాడు. రజక్ వినాలి కదా, “ఒక 500 అడ్వాన్స్ ఇప్పించండి. అందరం బాగా తాగి వెళ్దాం. అక్కడ బేలా డాన్స్ పెట్టిస్తాను, గురువా!” అని మిశ్రా కళ్ళద్దాలు తీసుకొని తన కళ్ళకు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. మిశ్రా కళ్ళద్దాలను లాక్కొని అతన్ని దూరంగా తోశాడు. జనం మరింతగా పడి పడి నవ్వారు.
నేను రామచంద్రా మిశ్రాను పిలిచి, “రండి తాగుబోతుతో ఎందుకు గొడవ పడతారు. గ్రామానికి వెళ్దాం” అని నా పక్కనే కూర్చోబెట్టుకొని బిసాల్‌కు బయలు దేరాం.

పదినిమిషాల ప్రయాణం. బిసాల్ చుట్టుపక్కల ఫలవంతమైన పొలాల బయలు. కొందరు పంటను కోసి కళ్ళం చేస్తున్నారు. కొందరు గింజలను తూర్పారబడుతున్నారు. ఇంకా కొన్ని పొలాలలో బంగారు రంగులోని పండిన వడ్లు భూమితో ఏదో గుట్టును మాట్లాడి నవ్వుతూ ఉయ్యాల ఊగుతోంది. వరి పంట సిరిని చూసిన నా మనసు కర్ణాటకకే ‘వరిధాన్యపు గారం’ అని ప్రసిద్ధి చెందిన నా పుట్టిన జిల్లా మండ్యను గుర్తుకు తెచ్చి అపురూపమైన ఆనందాన్ని కలిగించింది.

జీపు ఆగింది. నేను ఉలిక్కిపడి చూశాను. గోపాల్ ప్రసాద్ ఒక ఇంటి ముందు జీపును ఆపాడు. చెవులకు అలలు అలలుగా నాలుగు దిక్కుల నుంచీ హార్మోనియం, తబల, గజ్జెలు, సారంగి నాదాలు వినిపిస్తున్నాయి. ఆ శ్రుతిలోనే పాడుతున్న స్త్రీల స్వరాలు! నేను ఆశ్చర్యపోయాను. ఇదేమిటి? నేనెక్కడున్నాను? పొరబాటున గంధర్వలోకానికి వచ్చేశానా? ఏమిటి కథ?

“రామచంద్ర మిశ్రాజీ, ఇదేమిటి? ఈరోజు ఏదైనా ప్రత్యేకమైన వేడుకనా? లేదా ఏదైనా పండుగ జరుగుతోందా?” అన్నాను.

“లేదు, ఈ ఊర్లో ఎప్పుడూ ఇలాగే ఉంటుంది! డబ్బులు ఇచ్చే ధారాళమైన రసక శిఖామణుల మనసులను తృప్తిపరచడానికి నృత్య కచేరీలు జరుగుతూ ఉంటాయి”

నేను చాలా ఆశ్చర్యపోయాను. నమ్మలేక “మీరు నిజమే చెబుతున్నారు కదా?” అని అడిగాను.

“అవును నిజంగానే, రాముడి మీద ప్రమాణం. ఇక్కడున్న జనం తాము గంధర్వ జాతి వాళ్ళమని చెప్పుకుంటారు. తరతరాల నుంచి కళా జీవితాన్ని ఈ జనం సాగించుకుంటూ వస్తున్నారు. గతంలో జమీందారీ పద్ధతి బీహార్లో విపరీతంగా అలవాటులో ఉన్నప్పుడు, ఈ పద్ధతికి చాలా మద్దతు దొరికినట్టు కనిపిస్తోంది. కొందరి నర్తకిమణులు తమ మొత్తం జీవితాన్నంతా ఒక్కని కోసమే కేటాయించి, అతని ముందు మాత్రమే నర్తించి, అతని హృదయాన్ని తృప్తిపరిచి, అతనితో మాత్రమే కామ జీవితాన్ని నడిపి పిల్లలను పొందేవారట”

“ఈ గ్రామ ప్రజలది చాలా విచిత్రమైన సంప్రదాయం, సామాజిక శాస్త్రవేత్తలకు ఇది విశ్లేషణకు ఒక సంపద్భరితమైన వస్తువు…”

“ఇక్కడ అందరూ సుఖంగా ఉన్నారు. సారవంతమైన భూములు ఉన్నాయి, మీరే చూడండి, ఎలాంటి ఇళ్లను కట్టుకున్నారు? నృత్యం చేసి జీవనాన్ని గడుపుతున్నారంటే అందరూ సులభంగా తమ దేహాలను అమ్ముకోరు. ఒక్కొక్కసారి ఇక్కడి అందమైన నర్తకిలు వివాహం, ప్రత్యేకమైన పండుగలకు వెళ్లి నర్తించేటప్పుడు కొందరు పనికిరాని మనుషులు ఈలలు వేయటం, అల్లరి మాటలు మాట్లాడటం తమ మృగాల భావనలను వ్యక్తపరిచినప్పుడు, నృత్యాన్ని అక్కడితో ఆపి, వ్యతిరేకించి తమకు అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బును తిరిగిచ్చి, తమ గుర్రపు బగ్గీలనెక్కి వెనుతిరిగిన అనేక నిదర్శనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు…”

“అయితే ఇప్పుడు కాలం మారింది. అలాగే జీవితపు విలువలు కూడా. అన్నట్టు మిశ్రాజి బాగలపురకు టెలిగ్రామ్ ఇచ్చిన చతుర్భుజ్ రజక్ సంతలో చెప్పిన బేలా అనే నర్తకి కూడా ఇదే ఊరి మనిషా?”

“అవును, ఇదే ఊరికి చెందింది. సుమారు పాతికేళ్ల వయసు. అక్కడ చూడండి. కనిపిస్తుంది కదా ఆ డాబా ఇల్లు, ఆమెదే” అని నాకు చూపిస్తుండగానే నా డ్రైవర్ గోపాల్ ప్రసాద్ చెవులు చురుకయ్యాయి. “దొరగారికి బేలా నృత్యం చూడటానికి…” అని రాగం తీస్తూ కిసుక్కున నవ్వాడు. టెలిగ్రామ్ పట్టుకొని మశూచికం రోగం గురించి పరిశోధన జరపడానికి వచ్చిన నేను సామాజిక శాస్త్రవేత్తలా బిసాల్ ప్రజల సంప్రదాయం పట్ల మాట్లాడుతూ; వచ్చిన పనిని మర్చిపోవడం గుర్తు తెచ్చుకొని, “మిశ్రాజీ, మూల ఆరోగ్య కార్యకర్తలనంతా ఏ ఏ గ్రామాలకు వెళ్లాలో నియమించండి. ఆ ఊరిలో ఉన్న రోగుల గురించి సమాచారాన్ని మనమే కూలంకషంగా వెతికి చూద్దాం” అన్నాను.

నేను చెప్పినట్లే మిశ్రాజిగారు చేశారు. మేమిద్దరం బిసాల్‌లో మా పనులను మొదలుపెట్టాం. మశూచికం రోగం గుర్తుకార్డును పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ చమ్మారు కాలనీలో వెతికాం. పద్దెనిమిది మంది పిల్లలకు మశూచికం తగిలింది. తర్వాత మిగతా ప్రాంతాలను వెతికినప్పుడు ఇంకా పదిమందికి రోగం తగిలివుండటం కనిపించింది. ఇంత పని ముగించేసరికి అప్పటికే నాలుగు గంటలు అయింది.

మాకు ఆకలి మొదలై చాలా సేపు అయింది.

“హోటల్లో ఏదైనా తినడానికి దొరుకుతుందేమో అడుగుదాం” అని నేను చెబుతుండగానే, మిశ్రాజి దగ్గరికి వచ్చిన ఒక మధ్య వయస్కుడు, “మీరందరూ దయచేసి చాయ్ స్వీకరించడానికి రావాలంట” అని మెల్లగా చెప్పాడు.

“ఎవరింటికి?” అని మిశ్రాజి అడిగారు.

“బేలా బహెన్ ఇంటికి”

మిశ్రా నా ప్రతిస్పందన కోసం నా వైపు చూశారు.

గోపాల్ ప్రసాద్, “రండి సార్ వెళదాం. ఇలాంటి ఆహ్వానాన్ని తిరస్కరించ కూడదు. అక్కడ చూడండి. ఇంటి గుమ్మంలో మనల్ని ఆహ్వానించటానికో, లేదా వస్తారో లేదో గమనించటానికో బేలా నిలుచున్నట్టు ఉంది” అన్నాడు.
చూశాను. గులాబీ రంగు చీర, రవిక తొడుక్కుని, నుదుటి మధ్యన వెడల్పుగా కుంకుమ పెట్టుకున్న ఒక అందమైన, గంభీరమైన స్త్రీ నిలుచొనివుంది. ఆమె నిలుచున్న తీరును చూసి, ఆమె దష్టిలో కపటత్వం లేదనిపించి, నేను మిశ్రాతో- “మిశ్రాజీ, మీరు నాకన్నా పెద్దలు, స్థానిక అధికారులు. వారి ఇంటికి వెళ్లడం వల్ల ఏ తప్పు లేదని మీరు అనుకుంటే, వెళదాం” అన్నాను.

“డాక్టర్ రామకృష్ణాజీ! సంతలో ఆ తాగుబోతు బేలా నృత్యం గురించి చెప్పిన మాటలవల్ల, ఆమె వ్యక్తిత్వాన్ని దయచేసి అంచనా వేయకండి. గతకాలంలో బిసాల్‌లో పుట్టి గౌరవంతో తమ వృత్తిని నడుపుతున్న గౌరవనీయమైన నర్తకీల వరుసలో నిలువగల అర్హతలను ఒకింత ఎక్కువగానే బేలా పొందివుంది. ఈమె నృత్యాన్ని చూడాలని నోళ్లు తెరుచుకుని కూర్చున్న షావుకార్లు, జమీందార్లు ఈ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. బేలా ఈ ఆహ్వానాన్ని స్వీకరించటంలో నాకు ఎలాంటి తప్పు కనిపించటం లేదు” అన్నారు.

“మీరు ఇంత మంచి అభిప్రాయాన్ని బేలా పట్ల వెలిబుచ్చినప్పుడు వెళదాం పదండి” అంటూ నేను, మిశ్రాజీ, గోపాల్ ప్రసాద్‌లతోపాటు మమ్మల్ని ఆహ్వానించటానికి వచ్చిన వ్యక్తితో బేలా ఇంటి వైపు నడిచాం.

6️⃣

ఇంట్లోకి అడుగు పెట్టినపుడు గంధపు పొగ ఘుమఘుమల వాసన మమ్మల్ని ఆహ్వానించింది.

“మధుసూదన్, అందరిని గౌరవంగా కూర్చో బెట్టు” అని పిలుస్తూ సుమారు యాభై ఏళ్ల స్త్రీ వసారాలోకి వచ్చింది. ఆమె వెనుకే అందగత్తెలైన ఇద్దరు యువతులు వచ్చారు. ఆ కుర్రవాడు వచ్చాడు, అందరూ చేతులు జోడించారు. మిశ్రాజీ నా పేరు చెప్పి అందరికీ పరిచయం చేశారు. అప్పుడే దూరం నుంచి చూసిన నాకు బేలా ఎవరై ఉండొచ్చు అని గుర్తుపట్టి చేతులు జోడించి “రాం! రాం!” అన్నాను. దానికి ప్రతిస్పందనగా నమస్కారం చేసి, తనతో పాటు ఉన్న తన అక్క ‘శకీలా’ను, తల్లిని పరిచయం చేసింది. “వీడు నా తమ్ముడు మధుసూదన్. తుంటరివాడు” అంది. మధుసూదన్ మేము కూర్చోవడానికి ముందే ఫలహారాలను తెచ్చి పెట్టడంలో నిమగ్నమయ్యాడు. మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చిన వ్యక్తి మా అందరిని స్నానాల గదికి తీసుకెళ్లి కాళ్లు చేతులు ముఖం కడిగించుకొని వచ్చాడు. నాకు అతని పట్ల కుతూహలం కలిగి, మెల్లగా, “ఈ మనిషి ఎవరు? ఇతని పేరేమి? ఈ ఇంటికి ఇతనికి ఏమిటి సంబంధం?” అని అడిగాను. మిశ్రాజి నా ప్రశ్నకు “ఇతను బాగలపురలో రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండేవాడు. పేరు మనోరంజన్ రాయ్. ఇప్పుడు బేలా అక్క శకీలా ప్రేమికుడు” అని జవాబు ఇచ్చాడు.

చాయ్‌తోపాటు చాలా రకాల తీపి పదార్థాలు తిని ముగించిన మాకు భోజనం చేసినంత తృప్తి కలిగింది. నేను రామచంద్ర మిశ్రా వైపు తిరిగి “వెళదామా?” అన్నారు. ఆయన “అలాగే” అని పైకి లేచారు. అయితే బేలా లోపలి నుంచి వెంటనే వచ్చి మిశ్రాగారిని ఉద్దేశించి, “ఇదేమిటి? ఇంత తొందర మీకు మిశ్రాజీ! మీరు మాకేమైనా అపరిచితులా? డాక్టర్ గారేమైనా పరదేశీయులా? కర్ణాటకవారట, పైగా వారి భాషలో కథకులట. కొద్దిసేపు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్లకూడదా?” అంది. నేను తలెత్తి బేలాను చూశాను. ఆమె కూడా చూసింది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, “నేను కథకుడిని అని మీకు ఎవరు చెప్పారు?” అని అడిగాను. ఆమె చిరునవ్వుతో “మీ డ్రైవర్ సాబ్ ప్రసాద్‌జీ మా బావకు చెప్పారు. ఇలాగే ఈ వార్త నా చెవిని చేరింది. మిమ్మల్ని చూడాలని, సత్కరించాలని కోరిక కలిగింది. అందుకోసమే చెప్పి పంపాను. మా మాట మన్నించి వచ్చారు కదా” అంది.

“నేను అంత మంచి కథకుడిని కాను. పల్లెటూరి జనుల జీవితం గురించి కొన్ని కథలను రాశాను. ఇవి పట్టణం వాళ్లకు అవసరం లేదు. ఇక స్వాతంత్రం వచ్చి మూడు దశాబ్దాలు గడిచినప్పటికీ నూటికి డెబ్బయి శాతం నిరక్షరాస్యులు
ఉన్న మా పల్లెటూరి జనులకు; వారి గురించి రాయబడిన సాహిత్యం గురించి ఎలా తెలుస్తుంది? ఏమిటో ఇలాగే నా ఆత్మతృప్తి కోసం రాస్తుంటాను…”

“ఇదేమిటి మిశ్రాజి, డాక్టర్ గారు ఇంత నిరాశతో మాట్లాడుతున్నారే. పల్లెటూరి జీవితాన్ని గురించి రాయటం అల్పమైన విషయమా! సుమిత్రానందన్ పంత్‌ గారు తమ కవిత ‘భారత మాత’లో భారతమాతను ‘గ్రామవాసిని’ అని పిలిచారు. ఆ కవితలో ఆయన, ‘భారతమాత గ్రామవాసినీ ఖేతోమే ఫైలా హై శ్యామల, ధూల్ భరామైలాసా ఆంచల’ అని అంటారు. ఈ కవితతోనే కదా ప్రేరణ పొంది మన ప్రసిద్ధ నవలాకారుడు ఫణీశ్వరనాథ రేణు… ‘మైలా ఆంచల’ అనే ప్రసిద్ధ నవలను రాశారు” అంది.

“మైలా ఆంచల” హిందీలో రెండు దశాబ్దాల క్రితం రాసిన ప్రసిద్ధ నవల అని, దాని కథ సారాంశం గురించి కూడా నేను కొన్ని సంవత్సరాల క్రితం ఆంగ్ల పత్రికలలో చదివాను. ఫణీశ్వరనాథ రేణు, ఆ మధ్య కొన్ని రోజుల క్రితం, జయప్రకాశ్‌గారి సమ్ముఖంలో, పాట్నా గాంధీ మైదానంలోని వేదిక మీద ప్రభుత్వం తమకు ఇచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కార పత్రాన్ని కాల్చి వేయడమే కాకుండా, ప్రజల ఆశలు, ఆకాంక్షలను అర్థం చేసుకోకుండా, ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్లకు గౌరవం ఇవ్వని ఈ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ నాకు వద్దని తిరస్కరించారు. జయప్రకాశ్ గారి సంపూర్ణ విప్లవం లక్ష్యంగా పెట్టుకున్న జనతా ఉద్యమం ముందు వరుసలో ఉన్నారు.

రామచంద్ర మిశ్రా నవ్వుతూ, “చూడండి, బేలా గ్రామానికి చెందిన నర్తకి కావటం వల్ల, భారత గ్రామాంతర ప్రదేశాల గురించి రాసిన కవిత, నవలల పట్ల, కవుల పట్ల నవలాకారుల పట్ల ఎంతో అభిమానం” అన్నారు.

దానికి బేలా, “మిశ్రాజి, కేవలం గుడ్డి అభిమానం వల్ల మాట్లాడటం లేదు. ‘మైలా ఆంచల’ నవల, ‘మేరీ గంజ’ అనే గ్రామీణ కథ నా కన్నా మీరు చక్కగా చదివి ఉండాలి కదా. అక్కడ ఒక డాక్టర్ ప్రశాంత్ అనే ఆయన వస్తారు, ఆయన గ్రామీణుల విషజ్వరాలు, మలేరియా జబ్బుకు వ్యతిరేకంగా పోరాడుతారు, చివరికి జైలుకూ వెళతారు! అవునా? మీ డాక్టర్‌గారు కర్ణాటక నుంచి వచ్చి, మీతో కలిసి ఇక్కడి మశూచికాన్ని నిర్మూలించడానికి పోరాడుతున్నందుకూ, డాక్టర్ ప్రశాంత్‌కూ పోలిక ఉంది. మీరేమంటారు?” అంది.

“అవును, అయితే డాక్టర్ ప్రశాంత్‌కు అక్కడి మేరీ గంజ్ తహసిల్దార్ కూతురు కమలాతో స్నేహం ఉండింది బేలా! అయితే మన డాక్టర్‌తోపాటు మశూచికం వల్ల వికారం పొందిన ముఖాలు ఉన్న, మశూచికం రోగం గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఒక అందమైన యువతి అండ ఆయనకు లేదు” అని హాస్యంగా అన్నారు.

“కర్ణాటకలో అందమైన ఆడపిల్లలు ఉండాలి కదా. సౌందర్యపు గని బీహారానికి మాత్రమే కేటాయించారా మిశ్రాజీ!” అని బేలా నా వైపు తిరిగి “మీ భాషా సాహిత్యం గురించి కొంచెం చెప్పండి”.

తరతరాల నుంచిఒక మూర్ఖమైన సంప్రదాయపు నేపథ్యం కలిగిన జనాంగంలో పుట్టిన బేలాలోని సాహిత్యం, సాంస్కృతిక దాహాన్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. కర్ణాటక సాహిత్యం, సాహిత్య కారుల గురించి స్థూలంగా వివరించాను.

“ఓహ్! మీ సాహిత్యం సమృద్ధిగా ఉంది” అని మిశ్రాజీ అన్నారు.

“మీ సాహిత్యం అని ఎందుకు అంటున్నారు! భారతీయ సాహిత్యం అనండి” అని అన్నాను.

“అవును! భారతమాత సాహిత్యం విపులమైనది” అని చెబుతూ బేలా మరొకసారి మాకు చాయ్ తెచ్చిపెట్టింది. మేము “వద్దు వద్దు” అని అంటూనే తాగాం. నేను గడియారం చూశాను. అప్పటికే ఐదున్నర అయింది. మేము గ్రామాలకు పంపిన మా ముఖ్యమైన కార్యకర్తలు కూడా వెనుతిరిగి రాలేదని నా మనసులోని తపనను మిశ్రాగారు వెంటనే అర్థం చేసుకుని, “డాక్టర్‌గారు ఇప్పుడు జీపును గ్రామాలకు పంపుదాం. మన కార్యకర్తలను పిలుచుకొని వస్తారు” అన్నారు. నేను “అలాగే” అని గోపాల్ ప్రసాద్‌ను అలా చేయమని ఆజ్ఞాపించి పంపాను.

7️⃣

బేలా మాట్లాడిన విషయాలను నెమరువేస్తూ ఆలోచిస్తుండగా నా మనసు ఆమె సంగీతాన్ని వినాలని తపన చెందసాగింది.

అంతలో బేలా, మిశ్రాగారితో, “మీరూ, డాక్టర్ సాహెబ్‌గారూ నా గదిలో విశ్రాంతి తీసుకోండి. మీ జీపు రావటానికి ఇంకా రెండు మూడు గంటలైనా కావాలి. మీరు పిర్‌పాంతికి వెళ్లాలంటే రాత్రి తొమ్మిది గంటలవుతుంది. భోజనం చేసుకుని వెళ్ళండి. మీరు బ్రాహ్మణులు. మా ఇంట్లో భోజనం చేయకపోతే, స్వయం పాకానికి కావలసిన సరుకులను సమకూరుస్తాను” అంది.

“నాకేమీ అభ్యంతరం లేదు. మాతోపాటు ఇంకా ఎనిమిది మంది ఉన్నారు. ఇంత మందికి భోజనం ఏర్పాట్లు చేయటం కష్టం. మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి?”

“ఇదేం ఇబ్బంది? మాకూ ముప్ఫయి బీగాల ఫలవంతమైన మాగాణి ఉంది. ఇంట్లో కావలసినంత బియ్యం ఉంది. దేశ, విదేశాల నుంచి, భారత నలుమూలల నుంచి వచ్చి బీహార్‌లోని మశూచికాన్ని నిర్మూలించడానికి మీరు శ్రమిస్తున్నప్పుడు, దీనికి మా ఇంటి ‘ఉడతా భక్తి’ సేవ కూడా చేరాలి” అని నా వైపు తిరిగి ‘మీ అభిప్రాయం ఏమిటి’ అన్నట్టు బేలా చూసింది. నేను “అలాగే మిశ్రాజీ. సేవ చేయాలనుకునే వారి మనస్సును ఎందుకు నొప్పించాలి? అయితే నాదొక షరతు. నేను సంగీతాన్ని వినాలి” అన్నాను. మిశ్రాజీ బేలావైపు ప్రశ్నార్థకంగా చూశారు.

ఆమె ‘తప్పకుండా’ అని మమ్మల్ని తన గదిలోకి తీసుకొని వెళ్ళింది.

గది చాలా విశాలంగా ఉంది. మధ్యలో ఒక పెద్ద మంచం. దానిమీద శుభ్రమైన దుప్పటి ఉన్న మృదువైన పక్క. ఒరిగి కూర్చోవటానికి తలదిండు. మంచం నాలుగు మూలలకు ఉమ్మి పాత్రలు. మంచం ముందు భాగంలోని విశాలమైన స్థలానికి రక్తకంబళి, ఒకవైపు తబలా , హార్మోనియం , సారంగీలను చక్కగా అమర్చి పెట్టారు. మంచం ఎదుటి గోడ మీద మహాత్మా గాంధీ గారి ఫోటో, దానికి ఎడమ వైపున భగత్ సింగ్ , కుడి వైపున చంద్రశేఖర్ ఆజాద్ ఫోటోలు ఉన్నాయి!

“ఇదేమిటి, అహింస మూర్తికి కుడి ఎడమల వైపు విప్లవకారుల చిత్రాలు! విచిత్రంగా ఉన్నాయి” అన్నాను.

దానికి బేల, “విచిత్రమేమో నిజమే. అయితే ముగ్గురి లక్ష్యం కూడా భారతమాతను బానిసత్వం నుంచి విముక్తి కలిగించడమే కదా” అంది.

“అవును, ఇప్పటికీ మనం దీన్ని చూడవచ్చు. శాంతితో కూడిన అసహకార ఉద్యమం వల్ల లంచగొండితనాన్ని నిర్మూలించి, ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆశలను, తీర్చడానికి విప్లవాత్మకమైన మార్పులను చేయాలని శాంతమూర్తి జయప్రకాశ్ నారాయణ్ గారు ఉద్యమాన్ని ప్రారంభిస్తే, మరొకవైపున కోపగించుకున్న యువజనులు బెంగాల్, ఆంధ్ర, కేరళ, బీహార్ మొదలైన కొన్ని ప్రదేశాలలో ‘అధికారం తుపాకి గొట్టం ద్వారానే వస్తుంది’ అని నక్సలైట్ కార్యక్రమాల్లో నిమగ్నం కాలేదా? ఇక్కడ కూడా అంతే. ఆరోగ్యకరమైన రాజకీయం, అలాగే సామాజిక వ్యవస్థ సృష్టి ఏకైక ఆందోళన దాగి ఉంది. అయితే మన దేశంలోని పరంపరలో అగోచరమైన అగాధమైన అంతఃసత్వం ఉంది. ఇది మన ప్రజల హృదయాల్లో, ధర్మాన్ని కులాలను అధిగమించి దాగి ఉంది. మన దేశ ప్రజలు ఏది కావాలో దాన్ని ఎన్నుకుంటారు”

“మీరు బీహార్‌కు జె.పి. గారి ఉద్యమాన్ని చూడటానికి వచ్చినట్టుంది!” అని నా దీర్ఘమైన మాటలను విని నవ్విన బేల,

“తీసుకోండి, మీ ప్రియమైన విప్లవాత్మక రచయిత ఫణీశ్వరనాథ రేణు గారి నవల ‘మైలా ఆంచల’ అని పుస్తకాన్ని నాకు ఇచ్చింది. గౌరవంతో పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాను. నా ఎదుట ఉన్న కబోర్డ్‌లో వందలాది పుస్తకాలను బేలా సేకరించింది.

మిశ్రాగారు కూడా నాలాగే ఆశ్చర్యపోయి బేలా పుస్తక భాండారాన్ని చూస్తూ కుర్చీ మీద కూర్చున్నారు. నేను ‘వద్దు వద్దు’ అన్నప్పటికీ మంచం మీద కూర్చోనేలా బేలా బలవంతంగా కూర్చోబెట్టింది. నేను నవలలోని పుటలను తిరగవేయడం మొదలుపెట్టాను.

సుమిత్రానందన్ పంత్ గారి:
“భారత మాతా గ్రామవాసినీ
ఖేతోం మేం ఫైలా హై శ్యామల్
ధూల్ భరామైలా మహిళ-సా ఆంచల”
– ఈ పంక్తులు కంటపడ్డాయి. చూపించి పారటానికి పాడమని అడిగాను.

కుర్చీ మీద కూర్చుని అత్యంత మధురంగా బేలా పాడింది. నేను ఆలోచనలో పడ్డాను; కవి మాటలు ఎంత చక్కగా ఉన్నాయి. ‘భారతమాత గ్రామాలలో నివసిస్తోంది. మాగాణులలో ఈమె నీలిరంగు దుమ్ము నిండిన మాసిన కొంగు పరుచుకునివుంది’ భారతంలోని గ్రామాల పరిస్థితిని కవి మాటలు ఎంత చక్కగా ధ్వనించాయి!

హార్మోనియం, తబలా, సారంగి సంగీత నేపథ్య సహాయం లేకుండానే బేలా స్వర మాధుర్యానికి నేను, మిశ్రాగారు పూర్తిగా తన్మయం చెందాం. నాకు ఇంకా బేలా కంఠం నుంచి వచ్చే పాటలను వినాలనే కోరిక. అయితే సంకోచం. నేను చూపించిన ప్రతిస్పందనను అర్థం చేసుకున్న దానిలా బేలా ఈ కింద ఉన్న పంక్తులను పాడింది.

“చాంద్ బయిరి బేలా బాదల్
మఛలీ బయరి మహాజాల్
తిరియా బయరి దుహలోచన్…”

తన రెండు కళ్ళను మూసుకొని మైమరచి మా మనసులను తృప్తి పరుస్తున్న బేలాకు ఉన్న సాహిత్యం పట్ల, కళపట్ల ఉన్న ప్రేమను చూసి నా మనసు ఆమె వైపు వాలసాగింది. దీనికి ఆమె శారీరక సౌందర్యమూ ప్రోత్సహించింది. నా హృదయంలోకి దూరి అర్థం చేసుకున్న దానిలా పాడిన పైపంక్తులు: ‘చంద్రుడికి మేఘమే వైరి, చేపల స్వాతంత్రానికి వలనే వైరి, స్త్రీకి ఆమె కళ్ళే వైరి” అనే అర్థాన్ని తలుచుకుంటూ చూశాను. కళ్ళు మూస్తూ తెరుస్తూ బేలా మళ్లీ ఆ పంక్తులను పాడింది. ఆమె సుందరమైన ముఖంలో తేలియాడుతున్న కమలాల్లాంటి ఆమె కళ్ళు కనిపించాయి.
బేలా పాటను ముగించింది.

“స్త్రీకి సౌందర్యమే శత్రువని మీ అర్థమా?” అని ఆమె ముఖాన్ని తదేకంగా చూశాను.

నా చూపులను ఎదురించలేక సిగ్గుతో బేలా నేలవైపు చూడసాగింది.

నా మాటలు కొనసాగిస్తూ- “బేలా, మీ సౌందర్యమే మీకు శత్రువని మీకు అనుభవమైందా?”

బేలా తలెత్తి “మగవాళ్ళు ఆడదాని సౌందర్యాన్ని చూసే కదా ఆమెను కోరుకుంటారు. ఉదాహరణకు, నా ముఖం అంతా మశూచికం మచ్చలతో వికారంగా మారి, నా కళ్ళు ఇంకిపోయుంటే, నేనెంత మధురంగా పాడినప్పటికీ జనం ఆసక్తితో వినేవారా? ఇప్పుడు నా పేరుకున్న విలువ, నా కంఠానికి కాదు! నా నృత్యంలో దాగివున్న కళకు కాదు! నేను పాడేటప్పుడు అందంగా కనిపించే ముఖానికి. అందులో కదిలే నా కళ్ళకు. నేను నృత్యం చేసేటప్పుడు స్పందించే నా శరీరపు సౌందర్యానికని అనిపిస్తుంది. ఆడదాని ఆంతరంగిక కోరికలు అర్థం చేసుకున్నవారే అరుదు. ఇక మాలాంటి వారి జీవితపు, కుటుంబం నేపథ్యాన్ని తెలిసిన జనం మాలో దాగివున్న కళకు విలువ ఇవ్వడం మరీ అరుదైన విషయం” అంది.

బేలా మాటలు మగ జాతికి సవాలుగా కనిపించాయి. బేలా చెప్పినట్టు ఆమె ముఖమంతా మశూచికం మచ్చలతో వికారమై, అంధురాలై పాడుతూ ఉంటే? అని ఊహించుకున్నప్పుడు నా మనసు భయపడింది.

“ప్రస్తుతం, మశూచికం వచ్చి మీ సౌందర్యం పాడవకూడదు” అన్నాను.

“ఓ! అలాగైతే మశూచికం అందమైన ఆడవాళ్ళ ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుందని మీరు దాన్ని నాశనం చేయడానికి పోరాడుతున్నట్లు ఉంది”

“నాశనం చేయడానికి మగవాళ్లు మాత్రం పోరాడటం లేదు. ఈ పోరాటంలో ఆడవాళ్లు కూడా పాల్గొన్నారు అంటే, ఆడవాళ్లు మశూచికం వచ్చిన మగవాళ్ళ ముఖ సౌందర్యాన్ని పాడు చేయకూడదని తమ స్వార్థాన్నీ లక్ష్యంగా పెట్టుకున్నారని అర్థమవుతుంది కదా”

“మనిషి తన స్వార్ధపు నేపథ్యం లేకుండా ఏ పనినైనా చేయటం చాలా అరుదు” అని వంటపని ఎంతవరకు వచ్చిందో చూసుకొని వస్తానని పైకి లేస్తూ,

“ఇదేమిటి మిశ్రాజీ, మీరు సద్దు లేకుండా కూర్చున్నారు కదా” అంది. మిశ్రా నవ్వుతూ “మీ ఇద్దరి మాటల పోట్లాటను వినటమే నాకు చాలా సంతోషం కనిపిస్తుంది, పైగా నేను ముసలివాడిని” అని నవ్వసాగారు.
బేలా వంటింటి వైపు వెళ్ళింది.

నేను ‘మైలా ఆంచల’ నవలను తిరగేయటం మొదలుపెట్టాను. అయితే నా మనసు నేపథ్యంలో సంగీతం సహాయంతో అందమైన బేలా మైమరిచి నర్తించడం మొదలుపెడితే ఎంత సొగసుగా ఉంటుందో అని చిత్రించుకొని ఆనంద పడసాగింది.

బేలా నాకు, మిశ్రాజీకి రెండు లోటాల చాయ్ తీసుకొని వచ్చింది. చాయ్ తాగుతూ, “మీరు చాలా చక్కగా పాడుతారు. మీరు మైమరిచి నడిపించేటప్పుడు మీ కాలి మువ్వలు మీరు చెప్పినట్టు వినొచ్చు” అని నా ఆశను వ్యక్తపరిచాను.

“నేను ఇంకా మూడు రోజులపాటు, కాళ్లకు గజ్జలు కట్టుకోవడానికి లేదు”

“ఎందుకు?” అని అడిగాను ఆశ్చర్యంగా.

మిశ్రాగారు నవ్యసాగారు. నాకు మరింత ఆశ్చర్యం వేసింది.

బేలా నవ్వుతూ, “స్త్రీకి నెల నెలా ఒకసారి శాపం ఉంటుంది కదా, డాక్టర్ అయిన మీరు ఈ విషయాన్ని గుర్తించరా?”

“ఓ విషయం అర్థమైంది” అని నవ్వుతూ ఉండగా బయట జీపు వచ్చిన శబ్దమైంది.

మేము, మా ఆరోగ్య కార్తకర్తలు బేలా ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆమెకు నమస్కరించి, బయలుదేరాం. బేలా, గుమ్మం వరకు వచ్చి మాకు వీడ్కోలు చెప్పి, మమ్మల్ని మరోసారి వీలు చేసుకుని రావాలని ఆహ్వానించింది.

8️⃣

బిసాల్ నుంచి వెనుతిరిగిన ఐదు రోజులు వేరువేరు గ్రామాలలో మాకు ప్రజలు అందించిన మశూచి రోగం గురించి వదంతులను పరిశీలించే పనిలో కాలం దొర్లిపోవటం తెలియలేదు. కాస్త విరామం దొరికినప్పుడు నా మనసు బేలా తీయటి కంఠాన్ని గుర్తు తెచ్చుకొని ఆనందిస్తోంది. ఆమె నృత్యాన్ని చూడటానికి, ఆమె సుందరమైన ముఖం చూడటానికి నా మనస్సు తపిస్తోంది.

ఆరవ రోజు సాయంకాలం బిసాల్‌కు బయలుదేరి, రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయానికి చేరాను.

గోపాల్ ప్రసాద్ జీపును బేలా ఇంటికి కొద్ది దూరంలో నిలిపి వచ్చి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన మనోరంజన్ రాయ్ మమ్మల్ని ఆహ్వానించాడు. మధుసూదన్ పరుగున వెళ్లి తన అక్కలకు వార్త అందించాడు. షకీలా, బేలా ఇద్దరు వచ్చి చేతులు జోడించి, “రండి” అని స్వాగతం పలికారు.

చాయ్ సేవించాను. నేను బేలాను చూసి నవ్వుతూ “ఇప్పుడు కాళ్లకు మువ్వల సరాలను కట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదనిపిస్తుంది” అన్నాను.

“నా కాలిగజ్జెల సవ్వడి మీకు అంత ఇష్టమా?”

“ఆఁ” అని తల ఊపాను. మా ఈ సంభాషణ పూర్తయ్యేలోపు వాయిద్యకారులు వచ్చారు.
బేలా నృత్యానికి తగిన దుస్తులను ధరించి, కాలి మువ్వలను ఘల్లుఘల్లు మనిపిస్తూ గదిలోకి రావటమే ఆలస్యం నృత్య కచేరి ఆరంభమైంది. మంచం మీది దిండుకు ఒరిగిన నేను నవాబుగిరి దర్పంతో కూర్చున్నాను.
బేలా:  “ఓ! పరదేశి! మేరా గుంగట్‌కా క్యామోల్ హై?” (ఓ కళారాధకా, నా ముసుగుకు ఏమి విలువ కట్టగలవు?” అనే పంక్తిని నాలుగైదు సార్లు పాడి నర్తిస్తూ తన కుడి కాలిని మంచం మీద పెట్టింది. నేను ఉద్వేగంతో ఆమె ముద్దు పాదాలను అలంకరించిన గజ్జెలను నా కుడి చేత్తో తాకి పెదవులకు ఒత్తుకొని “మేరా దిల్ హై” (నా హృదయమే నీదైంది) అన్నాను.

నేను చూపిన ప్రేమ వల్ల అత్యంత ఉత్తేజితురాలైన బేలా ఒక చిన్న కొలనులో కమలాలు ఎర్రగా వికసించి నిలుచున్నాయి. వాటిని చూసి నీవు మరులు పోయావు, నా రూపాన్ని చూసి నీవు మోహితుడివయ్యావు, అయితే ఈ నీ మోహం సగం రోజు మాత్రమే” అని భావం నిండిన-

“ఛోటీ`మోటిపుఖరీ
చరకులియా ఫూటెలాలె`లాల్
పాస చె తేరీ ఫూల్‌దేఖీ
పూలయ లాబేలబ్
పాస చె తేరీ ఆధాదిన లగిత”`
-అనే, ఒక స్త్రీ తన ప్రియుడిని, అల్లరిపెట్టే గీతాన్ని పాడి నర్తించింది.

అలాగే ఇంకా రెండు పాటలను పాడుతూ మైమరచి నర్తించింది.

నాట్యం ఆగిపోయినప్పుడు సమయం పదిన్నర అయింది.

భోజనం ముగిసింది. బేలా, తాంబూలం పళ్లెం పట్టుకుని వచ్చింది. తాంబూలం సేవన అయిన తర్వాత, “బేలా, నా డ్రైవర్ గోపాల్ ప్రసాద్ జీపులోనే పడుకుంటాడు. నేనెక్కడ పడుకోవాలి?” అన్నాను.

బేలా మృదువుగా నా బుగ్గలు పిండి, “ఏమీ తెలియని లేత పిల్లవాడిలా మాట్లాడుతున్నారే” అని దీపాన్ని ఆర్పింది.
చీకటిని కోరుకుంటూ సిద్ధమైన నా బాహువులు బేలా దేహాన్ని బంధించాయి.

బేలా మెల్లగా అడిగింది, “మీకు పెళ్లయిందా?”

“లేదు”

“అందుకే ఇంత తొందర” అని నా పెదవులను మృదువుగా కొరికింది.

నాకు మెలుకువ వచ్చినప్పుడు తెలతెల్లగా తెల్లవారుతుంది. బేలా అప్పటికే లేచి స్నానం ముగించి నాకు చాయ్ తయారు చేసింది. చాయ్ తాగి, స్నానం చేసి వచ్చి మంచం మీద కూర్చుని, బేలా నన్ను ఎంత అమాయకంగా ప్రేమించి సేవ చేస్తోంది. అయితే నేను ఈమెతో, “పెళ్లి కాలేదు” అని అబద్ధం చెప్పకుండా
ఉండాల్సింది. పెళ్లి అయిందని నిజం చెప్పినప్పటికీ ఈమె నన్ను తిరస్కరించేది కాదు అని ఆలోచించి ఖిన్నుడయ్యాను. బేలా ఒక ప్లేటు నిండా తీపి పదార్థాలు తెచ్చి నా ముందు పెట్టింది. “తినండి” అంది. నేను ఆమె కుడిచేతిని తీసుకొని నా రెండు చేతులతో అదిమి పట్టుకొని,

“బేలా, నేను ఏ తప్పు చేసినా క్షమిస్తావా?” అని అడిగాను.

“క్షమించలేనంత నేరం ఏమి చేశారు?”

“నాకు పెళ్లయింది”

“అవునా! సంతోషం, ఎంతోమంది అబద్ధాలు చెప్పారు. అయితే మీరు…”

“అయితే మీరు? ఆ తర్వాత ఏమిటో చెప్పు” అని ఒత్తిడి పెట్టాను.

“మీరు, మీరు చెప్పిన అబద్ధం కోసం పశ్చాత్తాపం చెంది నిజం ఒప్పుకున్నారు. దీనివల్ల నాకు మీ మీద గౌరవం పెరిగింది” అంది. బేలా మాటలు విని నేను సిగ్గుతో తలవంచుకున్నాను. నా చుబుకాన్ని మృదువుగా పట్టుకొని, పైకెత్తి,

“మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకోలేదు. ఇక్కడ చూడండి, ఇప్పటికే ఒకరిద్దరు నన్ను మోహించి, తాళి కట్టి అనుభవించి, వాళ్ల దారి వాళ్లు చూసుకున్నారు. ఈ ప్రవర్తన మాకు కొత్తదేమీ కాదు. ఇవి మా జీవితంలో అనివార్యమైన ఘటనలు” ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి.

నా భార్య, పిల్లల పేర్లు అడిగింది. చెప్పాను. కన్నీళ్లను కొంగు చివరతో తుడుచుకొని మళ్ళీ ముఖం మీద మందహాసాన్ని తెచ్చుకొని, బలవంతం చేసి ఫలహారం తినిపించింది. అంతలో గంట రెండున్నర అయింది.

“ఆలస్యమైంది” అని నేను బయలుదేరడానికి సిద్ధమయ్యాను.

“మళ్లీ ఎప్పుడు వస్తారు?” ఆమె అర్థించే స్వరంతో అడిగింది.

నేను అబద్ధం చెప్పి, వంచించి, ఆమె శరీరాన్ని అనుభవించినప్పటికీ కోపగించుకోకుండా నన్ను గౌరవంగా చూస్తుండటం గమనించి నా మనసు ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించడానికి ఇష్టపడలేదు.

“మరునాడు తప్పకుండా వస్తాను బేలా, ఎంత కష్టమైనా వస్తాను. దయచేసి నాకోసం మెలకువతో ఎదురుచూస్తుండు” అని వెళ్లడానికి పైకి లేచాను.

“రాత్రి ఎంతసేపైనా మీ రాకకోసం ఎదురుచూస్తుంటాను” అని వీడ్కోలు పలికింది.

9️⃣

మూల కథారచయిత : బేసరహళ్లి రామన్న

బాంకా బ్లాకుకు చెందిన కర్మ అనే పల్లెలో మశూచికం నుంచి చాలామంది పిల్లలు నాలుగైదు నెలల క్రితం చనిపోవడం వల్ల మళ్లీ అక్కడ, ఆ రోగాన్ని అదుపు చేసే కార్యక్రమం అమలులో కొన్ని లోప దోషాలు ఉండటం నా దృష్టికి వచ్చింది. నేనే స్వయంగా పరిశీలించి వద్దామని ఉదయమే బయలుదేరాను. బాంకా చేరేసరికి నా కోసం నిరాశ ఎదురు చూస్తుంది. బాంకా నుంచి కర్మకు వెళ్లాల్సిన సాధారణమైన దారిలో రెండు వంతెనలు కొన్ని నెలల క్రితం చాందన్ నదివరదకు చిక్కి ఉపయోగించలేనంతగా శిథిలమైపోయింది. అందువల్ల ఆ దారిలో వాహనాల సంచారాన్ని నిషేధించడం జరిగింది. గోపాల్ ప్రసాద్, “మరొక రోడ్డు ఉంది. అయితే మనం చాందన్ నది దాటిపోవాలి” అన్నాడు. బయలుదేరాం. తోడుగా ఇద్దరు ఆరోగ్య సిబ్బందివాళ్లనూ పిలుచుకొని పోయాం.

చాందన్ నది ఒడ్డు చేరాం. నది మధ్యలో మాత్రం ముప్పయి-నలభై బారల వెడల్పున, మోకాళ్లు ఎత్తుకు నీరు ప్రవహిస్తోంది. గోపాల్ ప్రసాద్ జీపులోనే నదిని దాటవచ్చని ముందుకు పోయాడు. ఇక జీపు నీళ్లలోకి వెళ్తుంది అనేటంతలో, గబుక్కున జీపు ఎడమవైపు వాలసాగింది. గోపాల్ ప్రసాద్ ఎంతో ప్రయత్నం మీద జీపును ఆపాడు. అయినా జీపు నెమ్మదిగా ఎడమవైపుకు వాలిపోయింది. నా నుదుటి ఎడమ భాగంలో ఒక చిన్న గాయమైంది. రక్తం కారసాగింది. మిగిలినవారికీ చిన్న చిన్న గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసి చుట్టుపక్కల పొలాలలో పని చేస్తున్న జనం పరుగున వచ్చారు. మమ్మల్ని సురక్షితంగా జీపు నుంచి కిందికి దించారు. గోపాల్ ప్రసాద్ చాందన్ నది ఇసుక దారిని తిట్టుకుంటూ, ప్రథమ చికిత్స పెట్టెలో ఉన్న ప్లాస్టర్ను కత్తిరించి, నా నుదుటి గాయానికి అతికించాడు. ప్రజలంతా జీపును ఎత్తుకొని రావడంలో గోపాల్ ప్రసాద్కు సహాయం చేయటానికీ, నేను, ఆరోగ్య సిబ్బందివాళ్లు కర్మహళ్లి, అక్కడికి కేవలం ఒకటిన్నర మైలు ఉండటం వల్ల; నడుచుకుంటూ వెళ్లి మశూచికం జబ్బు పరిశీలన చేసుకొని రావచ్చని హామీ ఇచ్చారు.

నేను ఆరోగ్య సిబ్బందితోపాటు కర్మహళ్లి అనే గ్రామంలో మశూచికం చరిత్రను పరిశీలించి, మరణం సంభవించిన కుటుంబాలను కలిసి, పలకరించి, అందరూ అమ్మవారి టీకాలు వేయించుకోవడం చూసి “పని సంతృప్తిగా నడిచింది. అయితే నమోదులను సరిగ్గా చేయలేదు” అని బ్లాక్ ఆరోగ్య సిబ్బందికి చెప్పి, తరువాతి నమోదులను చక్కగా పెట్టాలని సూచించి, జీపు ఉన్న స్థలానికి వచ్చేసరికి సాయంకాలం ఆరుగంటలు అయ్యింది. జీపు ఎలాంటి దెబ్బ తినకుండా ప్రయాణానికి సిద్ధంగానే ఉంది.

‘ఈ రాత్రి నిన్ను చూడడానికి ఎంత కష్టమైనా వస్తాను, ఎదురుచూస్తుండు’ అని బేలాకు ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చి, గబగబా జీపు ఎక్కి, గోపాల్ ప్రసాద్తో, ‘వీలైనంత వేగంగా వెళ్ళు’ అని ఆజ్ఞాపించాను. అయితే అతను ‘సార్ దయచేసి క్షమించండి. ఈరోజు ఎందుకో అదృష్టం బాగాలేదు. నెమ్మదిగానే వెళదాం’ అని జీపును ముందుకు నడిపాడు. ఆరోగ్య సిబ్బందివారిని బాంకాలో దించి, వారితో చాయ్ తాగి, వారిచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపి బాగలుపుర చేరేసరికి రాత్రి ఎనిమిదిన్నర అయ్యింది.

బేలాకు నా జ్ఞాపకార్థం ఒక పట్టుచీరను బహుమానంగా ఇవ్వాలని నిర్ణయించుకొని, ఒక పెద్ద పట్టుచీరల అంగడికి గోపాల్ ప్రసాద్‌ను తీసుకొని వెళ్ళాను. ఒక మంచి చీరను ఎంపిక చేయమని చెప్పాను. అతను నా మనసును గ్రహించి నర్తకీమణులు నాట్యం చేసే సమయంలో ధరించే ఒక సొగసైన పూల జరీ అంచు కలిగిన, మూడువందల యాభై రూపాయల ఖరీదు చేసే చీరను ఎంపిక చేశాడు. ఒక హోటల్లో ఏదో విధంగా భోజనం ముగించి బయలుదేరాం. జీపును పరిగెత్తించి, బిసాల్ చేరేసరికి పదకొండు గంటలైంది.

బిసాల్‌లోని వీధి వీధిలో, నాలుగైదు వైపుల నుంచి సంగీతం, నృత్యచేస్తున్న ఝంకారం వినిపించసాగాయి. జీపు బేలా ఇంటిముందు నిలబడగానే, తలుపు తెరుచుకుంది.

“మీరు రారేమో అనుకున్నాను” అంది బేలా.

“నేను ఎంతసేపైనా వస్తానని మాట ఇచ్చాను కదా! ఆడవాళ్ళకి ఎప్పుడూ మగవాళ్ళ మాట మీద అనుమానం” అన్నాను.

“మగవాళ్ళు అలా ప్రవర్తించడం వల్ల, ఆడవాళ్లకు అనుమానం” అని నవ్వింది.

గోపాల్ ప్రసాద్, తాను జీపులోనే పడుకుంటానని చెప్పి “గుడ్ నైట్ సాబ్, స్వీట్ డ్రీమ్స” అని నవ్వుతూ తన ఆంగ్ల పాండిత్యాన్ని ప్రదర్శించి, నా సూట్ కేసును తెచ్చిపెట్టాడు.

నేను ఇంటి లోపలికి ప్రవేశించాను. తలుపులు మూసి, బేలా నా వెనకే వచ్చింది . ఆమె గదిలోకి వెళ్లి మంచం మీద కూర్చున్నాను. బేలా నా నుదుటి మీది ప్లాస్టర్‌ను చూసి గాబరా పడుతూ “అయ్యో! ఇదేమిటి? ఎలా అయింది?” అని అడిగింది. నేను కంగారు పడవలసింది ఏమి జరగలేదని, చాందన్‌లో జీపు దొర్లిన విషయాన్ని చెప్పాను. బేలా ‘హరే! రాం! రాం!’ అని కళ్ళు మూసుకొని తన మాంగల్యాన్ని కళ్ళకు ఒత్తుకుంది. ప్లాస్టర్ వేసిన చోట మృదువుగా తన వేళ్ళతో తాకి చూసింది.

“ఒక్క నిమిషం, వస్తాను” అని లేచి అగరొత్తులను వెలిగించి, దేవుడి పటానికి చేతులు జోడించి వచ్చి పక్కన కూర్చుంది. ఈ ప్రవర్తనను చూసి నేను ఆశ్చర్యంతో, “బేలా, దేవుణ్ణి ఏమని ప్రార్థించావు?” అని అడిగాను.

“మీ ఒక్క వెంట్రుక కూడా నలగకుండా కాపాడుస్వామి” అని నా వైపు చూసింది. ఈ మాటను విన్న నేను చప్పున ఆమె చేతులను బలంగా పట్టుకొని, “బేలా, నా తరఫున దేవుని ప్రార్థించడానికి నువ్వు నాకేం అవుతావు?” అని అడిగాను.

నా మాట ముగుస్తుండగానే బేలా నా మెడను కౌగిలించుకొని కన్నీరు పెడుతూ నా ప్రశ్నకు అదే జవాబు అన్నట్టు వెక్కి వెక్కి ఏడ్చింది.

నేను ఆమె ముఖాన్ని నా దోసిట్లోకి తీసుకొని మృదువుగా తడిమాను. కన్నీళ్లను తుడిచాను. సరసంగా కాలం గడపవలసిన సమయంలో ఏడవకు అన్నాను. “నేను ఊఁ! కళ్లు తెరువు” అనే వరకు కళ్ళు మూసుకొనివుండాలని చెప్పి నా సూట్‌కేస్‌లో ఉన్న జరీ అంచు పట్టుచీరను తీసి ఆమె ముందు పట్టుకొని కళ్లు తెరవమని చెప్పాను. చీరను చూసి ఆమె ఆనంద పడలేదు. నాకు నిరాశ కలిగింది.

“బేలా చీర బాగాలేదా?” అన్నాను.

“బాగుంది, అయితే,…”

“అయితే ఏమిటి? చెప్పు…” అని ఒత్తిడి పెట్టాను.

“చీర కోసం నేను తపించడం లేదు, ఇంకే వస్తువుకు కూడా ఆశపడటం లేదు. నేను కోరుకుంటున్నది మీ ప్రేమను”

“భారతీయ స్త్రీలే ఇంత! అత్యంత భావోద్వేగానికి పేరు పొందినవారు!” అని చీరను ఆమెకిచ్చి కట్టుకొని రమ్మని చెప్పాను.

“సరే, మీ మనసును ఎందుకు నొప్పించాలి?” అని మరో గదిలోకి వెళ్లి చీర కట్టుకొని, అలంకరించుకొని, పళ్లెంలో తీపి పదార్థాలను, పాలను తీసుకొచ్చి నా పక్కనే కూర్చుంది.

“నాకు కావలసిన తీపిపదార్థం పక్కనే ఉన్నప్పుడు ఈ తీపి పదార్థాలు ఎందుకు తెచ్చావు?” అని నా తుంటరి మాటలకు చిరుకోపాన్ని చూపించి, ‘తినండి’ అని బలవంతం చేసింది. వాటిని తింటూ నేను, “బేలా, కేవలం ఒక నెల మాత్రమే నేను ఇక్కడ ఉంటాను. తర్వాత కర్ణాటకకు వెళ్లిపోతాను” అన్నాను.

“ఎందుకు? బీహార్లో మశూచికం ఇంత తొందరగా నిర్మూలమైపోయిందా?”

“లేదు నా అవధి కాలం వచ్చేనెల ముగుస్తుంది. మశూచికం కూడా మరో ఆరు నెలల్లో మొత్తం భారతదేశం నుంచి తొలగిపోతుంది. తర్వాత సంపూర్ణ క్రాంతి జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని అనుకుంటున్నాను”

“సంపూర్ణ క్రాంతి! అంటే జె.పి.బాబు గారి జనతా ఉద్యమమేకదా? ‘క్రాంతి’ అంటే ఏమిటి?”

“ఇప్పుడున్న లంచగొండితనాన్ని/ భ్రష్టాచార వ్యవస్థను పూర్తిగా మార్చటం. భారత్‌లో అందరూ సమానంగా జీవించేలా చేయడం. దౌర్జన్యం నుంచి, పీడన నుంచి విముక్తులు చేయడం”

“మీ క్రాంతి కల్పన చెవులకు ఇంపుగా ఉంది. పీడన నుంచి, దౌర్జన్యం నుంచి మొత్తం భారత ప్రజలను మీరు విడుదల చేయడం అటుండనీ, తరతరాల నుంచి, ఈ మౌఢ్య సంప్రదాయం వలలో చిక్కుకొని సతమతమవుతున్న, తినడానికి కట్టడానికి చాలినంత ఉన్నా, గౌరవం నుంచి వంచితులై బ్రతుకుతున్న మా జనాంగపు స్త్రీలను, గౌరవంగా సమాజంలో తలెత్తి బ్రతికేలా చేయండి…. అదే పెద్ద క్రాంతి!”

“బేలా, ఇది అసాధ్యమైన విషయం కాదు”

“డాక్టర్‌గారు! వేశ్య వృత్తిని నిర్మూలించడం, మశూచికాన్ని నిర్మూలించినంత సులభం కాదు. మశూచికానికి ఒక విషక్రిమి కారణం. అయితే మా వృత్తికి మూల కారణం- ‘మగవాడు!’ అంటే మగవాడి దౌర్జన్యం, ఆడదాని నిస్సహాయత!”

బేలా ఈ మాటలు నా హృదయాన్ని క్రూరంగా చీల్చాయి. తన జనాంగం అనుసరించుతూ వచ్చిన మౌఢ్య సంప్రదాయాన్ని నిస్సహాయురాలైన ఒక స్త్రీ అర్థమయ్యేలా చేసిన తీరును విని నేను ఆశ్చర్య పోయాను. గంభీరంగా, మౌనంగా బేలా ముఖాన్ని అభిమానంగా చూస్తూ కూర్చున్నాను.

బేలా నా హృదయం నా గుండెల మీద తలపెట్టి, నా హృదయాన్ని పలకరించేలా పాడనా అంది. ‘అలాగే’ అన్నాను. పాడటం ప్రారంభించింది:

“కాంచయి బాంస్ కె పింజడా,
జామెదియరో న బాతీ హో,
అరె హంసా ఉడల్ ఆకాశ్
కోయీ సంగో న సాథీ హో”
నేను నివసిస్తున్నది గాజు పంజరంలో, అందులో వెలుతురు, వత్తి రెండూ లేవు. హంస ఆకాశంలోకి ఒంటరిగా, అనాధగా- ఎగిరింది- అనే అర్థాన్ని సూచించే, బేలా మొత్తం జనాంగంలో పుట్టిన ఆడపిల్లల జీవితాన్ని, క్రూరహృదయాల మనసును తాకేలా ఆమె గొంతు నుంచి వచ్చింది.

ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటివరకూ జరిగిన ఘటనలలో, ఏదో ఒక విధమైన బాధా ఛాయ దాగివుందని అనుకుంటూ, “వద్దు, ఏదైనా ప్రేమ గీతంలోని కొన్ని పంక్తులను పాడు” అన్నాను. “ప్రతి రోజు పగటిపూట కూస్తున్న పాపిష్ఠి కోకిల, నట్టనడిరాత్రి కూస్తోంది, హే! భగవాన్, రామా, నిద్రలో ఉన్న నా ప్రియుడిని హెచ్చరించు’ అనే భావం కలిగిన –
“సుదిన బోలే కోయలా భోరభినసర వా…వా… వా…
బైరిన్ కోయలియా ఆజు బోలియా, అథీ
రతియా హో రామా…ఓ…ఓ
సూతల పియాకో జగాదే హో రామా, ఓ…ఓ…”
-అనే పంక్తులను కోకిలలాగే పాడింది.

“ఓ నా కోకిల, నేను ఈరోజు రాత్రంతా కంటి రెప్పలను మూయను” అని దీపాన్ని ఆర్పి, బేలా ఒళ్ళు, నా ఒంటిని హత్తుకునేలా లాగి కౌగిలించుకున్నాను.

“హరె! రాం! హో హో!” అని బేలా సుఖంతో మూలిగి, మరింత భద్రంగా నా ఒంటిని చుట్టుకుంది.
తెల్లవారింది.

నేను బయలుదేరాడానికి సిద్ధమయ్యాను.బేలా ముఖం వాడిపోయి వుండటం చూసి “ఏమిటి కారణం?” అన్నాను.

“మళ్లీ ఎప్పుడు వస్తారు? మీరేమో నాకు బహుమానం ఇచ్చేశారు. నేను మీకు ఇవ్వకూడదా?”

“ఖచ్చితంగా, మరో వారంలో వస్తాను” అని మాట ఇచ్చి బయలుదేరాను.

admin
admin
sahityam.adarsini.com
Previous Post

కన్నడ కథ: ఐదు రూపాయల రుణం

Next Post

అనువాద కవిత : ఓ  లక్ష్మణా!

Next Post
అనువాద కవిత : ఓ  లక్ష్మణా!

అనువాద కవిత : ఓ  లక్ష్మణా!

Discussion about this post

ఈ సంచికలో…

  • Ace Utilities Portable only Clean [Lifetime] Bypass
  • SketchUp Cracked [Stable] [Lifetime] 2026
  • KMSpico office 2024 Portable + Serial Key All Versions [x86-x64] Final
  • Lumion 2023 Crack tool Latest [x86x64] [Windows] FileHippo
  • Adobe Acrobat 2025 Portable + Keygen [Clean] Windows 11 2026
  • Adobe After Effects 2022 Portable only Patch x86x64 [100% Worked] FileHippo
  • Microsoft Excel Crack exe [Lifetime] (x32x64) Final GitHub
  • WebCam Companion Portable + Activator no Virus [x86x64] [100% Worked]
  • Gunbot Portable + Serial Key [Lifetime] [Windows] 2026
  • ActiveSMART Portable + License Key [Full] [x64] no Virus Ultimate
  • DameWare Mini Remote Crack + Portable Stable [x64] [Stable] FileHippo
  • EaseUS Data Recovery 2025 Portable for PC Lifetime no Virus Tested
  • PerformanceTest Crack + Keygen Patch x64 Windows 10 FileHippo
  • Microsoft Word 2019 Portable + Keygen Latest Patch
  • PC MACLAN Portable + Product Key [Lifetime] (x32x64) [100% Worked] 2025
  • Vegas Pro Full-Activated [Clean] [x32x64] Latest
  • PicaLoader Portable + Keygen 100% Worked (x32-x64) [Final] MediaFire
  • Microsoft Excel Portable tool Patch [Clean] 2026

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • Uncategorized
    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com