కన్నడ మూలం: సరితా నవలి
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్
తలెత్తి చూస్తే తెల్లని మబ్బులతో నిండిన ఆకాశం, తలదించుకుని చూస్తే ఎండిపోయి బీటలు వారిన నేల! కనుచూపు మేర నాగజెముడు, తుమ్మచెట్ల పొదలు. ఎండ తీవ్రతకు ఎండిపోయిన చెరువులు ఒకవైపు, తొంగి చూస్తే చీకటి గుహల్లా కనిపిస్తున్న ఎండిపోయిన బావులు మరొకవైపు. భూమి గర్భాన్ని వేల అడుగులు తవ్వినా దోసెడు నీళ్లు దక్కక, అక్కడక్కడా నోరు తెరుచుకొని ఎంతోమంది పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకున్న బోరుబావి గుంతలు, పైపులు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోయి నీటి కోసం దీనంగా అలమటిస్తున్న పశువులు. నల్లని మబ్బుల కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్న రైతుల కళ్లు.. వీటన్నిటినీ చూస్తుంటే మనసులో కలిగే ఒకే ఒక భావన – ఈ ‘కరువు’ చాలా భయంకరం!
బస్టాండ్ దగ్గరనే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అరుగు మీద తన స్నేహితులతో మాట్లాడుతూ కూర్చున్న శివ, పదకొండు గంటలకు రావలసిన బస్సు మధ్యాహ్నం ఒంటిగంట అయినా రానందుకు విసుగు చెందాడు. ఎండకు ముఖాలు వాడిపోయి బస్సు కోసం వేచి చూస్తున్న వారికి, దూరంగా వినిపించిన బస్సు హారన్ శబ్దం ఉపశమనాన్ని ఇచ్చినా, బస్సులో సీటు దక్కించుకోవాలనే ఆత్రుత వారిలో కనిపించింది. అంతలో బస్సు వచ్చి, అది ఆగకముందే కిటికీల గుండా టవళ్లు, కర్చీఫ్‌లు విసిరి సీటు రిజర్వ్ చేసుకునే ప్రయత్నం మొదలైంది. సీటు దొరకకపోతే బస్సు టాపు మీద కూర్చుని ప్రయాణించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆ పల్లెటూరి జనం కూడా, ఈ ఎండ వేడికి భయపడి ఎలాగైనా బస్సు లోపలే సీటు సంపాదించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న గందరగోళం విన్న శివ తన మాటలు ఆపి అటువైపు చూశాడు. అక్కడ ఎక్కువగా తెలిసిన ముఖాలే కనిపించాయి. అక్కడున్న వారందరినీ ఎక్కించుకుని బయల్దేరడానికి సిద్ధమైన బస్సును ఆపమని ఎవరో కేకలు వేయడం వినిపించింది. శివ అటు చూసినప్పుడు చేతిలో ట్రంకు పెట్టె, తల మీద ఒక మూట పట్టుకున్న మల్లన్న, “ఏయ్.. ఆపండి.. బస్సు ఆపండి!” అంటూ రావడం కనిపించింది. అతని భార్య పార్వతి ఇద్దరు చిన్న పిల్లల చేతులు పట్టుకుని వెనుక పరిగెత్తుకుంటూ వస్తోంది. బస్సును ఆపమని కేక వేసిన శివ, మల్లన్నకు సాయం చేయడానికి పరుగెత్తాడు.
“ఇంత ఎండలో పెళ్లాం పిల్లలను తీసుకుని, ఇన్నేసి సామాన్లు మోసుకుంటూ ఎక్కడికి బయల్దేరావు మల్లన్నా?” అని శివ ఆందోళనగా అడిగాడు. శివ చూపించిన ఆదరణను చూసి మల్లన్న కళ్లు చెమ్మగిల్లాయి.
“వలస వెళ్తున్నాం శివా. ఇక్కడ వర్షం కోసం నమ్ముకుని కూర్చుంటే లాభం లేదు. మేమంటే ఏదో ఒకటి తిని ఉంటాం, కానీ ఈ పసిపిల్లల కడుపు నిండా తిండి పెట్టాలి కదా? అందుకే పట్నానికి వెళ్లి కూలీ పనైనా చేద్దామని బయల్దేరాం. నా భార్య పుట్టింటి వాళ్లు అప్పుడే బెంగళూరు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈమె కూడా అక్కడికే వెళ్దామని పట్టుబట్టింది.”
భుజం మీద ఉన్న టవలుతో కళ్లు తుడుచుకుంటూ బస్సు ఎక్కి చేతులు ఊపిన మల్లన్న మాటలు శివకు ఎంతో దుఃఖాన్ని కలిగించాయి. అతని నిస్సహాయతలోని నిజాన్ని గ్రహించిన శివ, బస్సు వెళ్ళిపోయిన తర్వాత కూడా కాసేపు అక్కడే నిలబడి, ఆపై తన ఇంటి వైపు బయల్దేరాడు.
![]()
“అమ్మా, నేను పని కోసం పట్నానికి వెళ్తాను. ఇక్కడ పల్లెటూర్లో ఉండి వ్యవసాయం చేసుకుంటూ కూర్చుంటే కడుపు నిండదు, అటు అప్పులూ తీరవు.”
“అంత తొందర పడకు నాయనా, ఇంకొక్క వర్షాకాలం వరకు చూద్దాం. అప్పటికీ ఇలాగే వర్షం పడక పంటలు పండకపోతే, అప్పుడు పట్నానికి వెళ్ళే విషయం ఆలోచిద్దాం.”
“ఎన్ని ఏళ్ల నుంచి ఇదే మాట చెబుతున్నావమ్మా? ఇప్పుడు తొందరపడటానికి ఏముంది?” అని తల్లి మాటలకు విసుగు చెందిన శివ, చేతిలో ఉన్న తువాలును తలకు చుట్టుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళాడు.
అతని మాటల్లోని బాధను చూసి నొచ్చుకున్న రేణుక, చుట్టూ కన్నెత్తి తన ఇంటిని ఒకసారి చూసుకుంది. విశాలమైన ముంగిట ఒకవైపు ఎండిపోయిన గోరింట, కనకాంబరం, మల్లె మొక్కలు.. నేలంతా ఎండిపోయి, మట్టి గడ్డలతో కూడిన పెరడు కనిపిస్తే; మరోవైపు పశువుల దాహం తీర్చడానికి ఎప్పుడూ నీటితో నిండి కళకళలాడుతూ ఉండే తొట్టి ఇప్పుడు వెలవెలబోతూ ఉంది. స్తంభాల అరుగులను దాటి, పెద్ద గడపను దాటి లోపలికి వెళ్ళినప్పుడు కనిపించే పశువుల కొట్టం ఎప్పుడూ పశువులతో నిండి ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ఇంటి అవసరాలకు సరిపడా పాలు ఇచ్చే రెండు ఆవులు, పొలం దున్నడానికి ఒకే ఒక జత ఎద్దులు మాత్రమే మిగిలాయి. గత రెండేళ్లుగా వర్షాలు లేక, పంటలు పండక పెరిగిన అప్పులను తీర్చడానికి ఒక జత ఎద్దులను అమ్మాల్సి వచ్చినప్పుడు కలిగిన బాధను తలచుకుని రేణుక కళ్లు చెమ్మగిల్లాయి.
చెమ్మగిల్లిన కళ్లతోనే ఇంటి చుట్టూ చూసింది ఆమె. ఎప్పుడూ ధాన్యపు మూటలతో నిండి ఉండే పడసాల మూలలో ఇప్పుడు ఖాళీ గోనె సంచులు పడి ఉన్నాయి. ఇక వంటింట్లో డబ్బాలన్నీ దాదాపు ఖాళీ! ఎన్నో రోజులుగా రొట్టెలోకి నంజుకోవడానికి పప్పులు, కూరలు లేక కారంపొడి-నూనె, ఉప్పు-పచ్చిమిరపకాయలతోనే భోజనం చేస్తున్న తమ బతుకును తలచుకుని రేణుక గుండె తరుక్కుపోయింది. అయినా సరే, పట్నానికి వెళ్లి పని చేయాలన్న శివ నిర్ణయాన్ని అంగీకరించడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు.
![]()
కొప్పళ జిల్లాలోని సోమపురం అనే చిన్న గ్రామంలో నివసిస్తున్న రేణుక కుటుంబం జీవనం కోసం వ్యవసాయంపైనే ఆధారపడింది. గత కొన్ని ఏళ్లుగా వర్షపాతం బాగా తగ్గిపోవడంతో, పొలాన్ని దున్ని విత్తిన విత్తనాలన్నీ మొలకెత్తిన దశలోనే ఎండిపోయి, ఎలాంటి ఆదాయం లేక వారిని అప్పుల ఊబిలోకి నెట్టాయి. ఆ గ్రామంలోని మెజారిటీ కుటుంబాల పరిస్థితి కూడా ఇలాగే ఉండటంతో, చాలా మంది గ్రామాన్ని వదిలి సమీపంలోని లేదా దూరపు పట్టణాలకు పని వెతుక్కుంటూ వలస వెళ్ళిపోయారు. రేణుక కొడుకు శివ కూడా పట్టణానికి వెళ్లి పని చేస్తానని అన్నప్పుడల్లా, రేణుక అతనికి నచ్చజెప్పి శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ ఉండేది.
రైతు కుటుంబంలోనే పుట్టి పెరిగిన రేణుక, సోమపురం దగ్గరలోని కనకగిరిలో హైస్కూలు వరకు చదువుకుంది. అయితే అక్కడ ఆమె నేర్చుకున్న పుస్తకాల చదువు చాలా తక్కువ. ఇంటి పనుల్లో తల్లికి సాయం చేస్తూనే బడికి వెళ్లే ఆమెకు కుట్టుపని, ఎంబ్రాయిడరీ, అల్లికలు అంటే చాలా ఇష్టం. అందమైన ముగ్గులు వేయడం, చిత్రాలు గీసి రంగులు నింపడంలో రేణుక దిట్ట. తన స్నేహితురాళ్లందరికీ ఆమె వాటిని నేర్పించేది.
హైస్కూలు చదువు పూర్తయిన ఏడాదికే పెళ్లి చేసుకుని, భర్త ఊరైన సోమపురానికి వచ్చి స్థిరపడింది. ఇక్కడ ఆమె దినచర్య ఇంటి ముంగిట ఊడ్వడంతో మొదలై, సాయంత్రం పశువుల కొట్టంలో గడ్డి వేయడంతో ముగిసేది. తమకున్న ఆరు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే భర్త, ముగ్గురు పిల్లలు, రెండు జతల ఎద్దులు, పాడి పశువులతో రేణుక ఒక ‘సంతృప్త గ్రామీణ మహిళ’గా జీవించేది.
కానీ ఇటీవలి సంవత్సరాలలో వానలు లేక, బోరుబావులు ఎండిపోయి, నీరు లేక విత్తిన పంటలన్నీ వాడిపోయాయి. అనేక పల్లెల్లో మాదిరిగానే, సోమపురం రైతుల ఆశలు కూడా అడియాశలై, వారిని తీర్చలేని అప్పుల ఊబిలోకి నెట్టాయి. రేణుక కుటుంబ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది.
![]()
“ఎందుకురా విక్కీ, టిఫిన్ సగమే తిన్నావు? రోజూ స్కూలుకని చేసి పంపించే టిఫిన్‌ను తినకుండా అలాగే వదిలేస్తున్నావు కదా?” స్కూలు నుండి ఇంటికి వచ్చిన కొడుకు లంచ్ బాక్స్‌ను చూసి ప్రశ్నించింది స్వాతి.
“ఓ అదా, ఆ టిఫిన్ నాకు ఇష్టం లేదు మమ్మీ” అన్నాడు విక్కీ.
“కడుపు మాడ్చుకుని ఎందుకు ఉంటావు నాన్నా?” అన్న అమ్మ శ్రద్ధను గమనిస్తూనే, “ఐస్‌క్రీమ్ లేదా చాక్లెట్ తింటాను మమ్మీ” అని నవ్వుతూ చెప్పాడు విక్కీ.
“భోజనం, తిండి ఏదీ తినకుండా పాడు చేసి పారేయకూడదు కన్నా” అని స్వాతి చెప్పినప్పుడు, ఆమె మాటలు వినిపించుకోనట్లు తన గదిలోకి వెళ్ళిపోయిన విక్కీ, వీడియో గేమ్ ఆడుకుంటూ ఒక పెద్ద చాక్లెట్ బార్‌ను మెక్కుతున్నాడు!
రాత్రి భోజన సమయంలో కూడా పిల్లలకు తిండి మీద ఆసక్తి లేకపోవడం, వడ్డించిన దానిలో సగానికి పైగా కంచంలోనే పారేయడం చూసి స్వాతికి కోపం వచ్చింది.
“ఎందుకు మమ్మీ, ఎప్పుడూ ఫుడ్ వేస్ట్ చేస్తున్నామని తిడుతూనే ఉంటావు? వెన్ వి కెన్ అఫోర్డ్ ఇట్, వాట్ ఈస్ రాంగ్ ఇఫ్ వి వేస్ట్ సమ్ ఫుడ్?” అని కూతురు సుజీ ప్రశ్నించింది.
“అఫోర్డ్ అంట అఫోర్డ్… రైతులు పంట పండించడానికి ఎంత కష్టపడతారో తెలుసా?” అని స్వాతి ఆవేదనతో అంది.
“ దానికీ, ఈ చిత్రాన్నం పారేయడానికి సంబంధం ఏంటి మమ్మీ?” అని విక్కీ ఎదురు ప్రశ్న వేశాడు.
“హే కిడ్స్, టేక్ ఇట్ ఈజీ. మీ మమ్మీ ఈ చిత్రన్నాన్ని మీ తాతయ్య పంపించిన బియ్యంతో వండింది. ఆ బియ్యం ఆయన తన పొలంలో పండించిన వరి నుండి వచ్చినవి. ఇప్పుడు మీరు దాన్ని తినకుండా పారేయడం చూసి మమ్మీకి కోపం వచ్చింది,” అంటూ రఘు పిల్లలను సమాధానపరిచాడు.
“అవును, మా ఊర్లో రైతులు ఎంత కష్టపడతారో ఈ సిటీలో ఉన్న మీకు ఏం తెలుసు?” అని కోపంగా అన్న స్వాతి తన గదిలోకి వెళ్ళిపోయింది.
కంప్యూటర్ ముందు కూర్చున్న స్వాతి ఆలోచనల్లో ఆమె ఊరైన కనకగిరి, అక్కడి కనకాచలపతి దేవాలయం, ఏడాదికోసారి జరిగే జాతర, పొలాలు-గట్లు, అక్కడ కష్టపడే శ్రమజీవులు, వారి సరళమైన జీవనం అన్నీ మెదిలాయి. అప్పుడప్పుడు స్వాతి కనకగిరికి వెళ్లి వస్తున్నప్పటికీ, ఆఫీసు పని, పిల్లల స్కూలు వంటి కారణాల వల్ల చాలా ఏళ్లుగా ఊరి జాతరకు వెళ్లడం కుదరలేదు. అంతకుముందు రోజే ఆమె అమ్మానాన్నలు ఫోన్ చేసినప్పుడు, వచ్చే నెలలో జరగబోయే కనకాచలపతి జాతరకు వెళ్తున్నట్లు చెప్పారు. ఆ రోజంతా ఆమెకు ఊరి జ్ఞాపకాలే వెంటాడాయి. ఈసారి ఎలాగైనా తను కూడా జాతరకు వెళ్లి రావాలని నిర్ణయించుకున్న స్వాతి, మరుసటి రోజే ఆఫీసులో సెలవు కోసం దరఖాస్తు చేయాలని అనుకుంది.
![]()
ఎన్నో ఏళ్ళ తరువాత తన ఊరి జాతరకు వచ్చిన స్వాతిలో ఏదో తెలియని ఉత్సాహం కనిపించింది. బెంగళూరు యాంత్రిక జీవనం నుండి విముక్తి దొరికినట్లు అనిపించింది. ఉదయం బస్సు దిగగానే కనిపించిన దేవాలయం, ఆ ఐదు కలశాలు, ఉత్సవం కోసం అలంకరిస్తున్న తేరు, రథంవీధిలోని పసుపు-కుంకుమల దుకాణాలు, గాజుల షాపులను చూసి స్వాతి తన బాల్య జ్ఞాపకాల్లో మునిగిపోయింది.
అమ్మానాన్నలతో కలిసి కనకాచలపతి దర్శనం చేసుకుని, సాయంత్రం జరిగే రథోత్సవం కోసం రథంవీధికి వచ్చినప్పుడు.. నాన్నకు తెలిసినవారు, అమ్మకు దూరపు చుట్టాలు తమను గుర్తుపట్టి పలకరిస్తుండటం చూసి, స్వాతి కళ్లు తనకు తెలిసిన ముఖాల కోసం, తన స్కూలు రోజుల స్నేహితుల కోసం వెతకసాగాయి. వారిని చూసి ఎన్ని ఏళ్లయింది, నేను వారిని గుర్తుపట్టగలనా? వారు నన్ను గుర్తుపడతారా? అని ఆలోచించసాగింది. ఆమె ఆలోచనలు సాగుతుండగానే, అక్కడ ఒక స్నేహితురాలు కనిపించింది.
“హే, నువ్వు రేణు కదా? నన్ను గుర్తుపట్టావా? నేను స్వాతిని. మనం కలిసి హైస్కూల్లో చదువుకున్నాం. నువ్వు చూడటానికి అస్సలు మారలేదు. ఎక్కడుంటున్నావు? ఎలా ఉన్నావు?” అంటూ స్వాతి లొడలొడా మాట్లాడింది.
స్వాతి మాటలన్నీ విన్న రేణుక సమాధానం చెప్పడానికి తడబడింది. ఒకటి రెండు క్షణాలు స్వాతిని అలాగే చూసినా రేణుక ఆమెను గుర్తుపట్టలేకపోయింది. రేణుక ముఖంలోని ఆ ప్రశ్నార్థకతను గమనించిన స్వాతి తన మాటలను కొనసాగించింది.
“నేను, నువ్వు, దీప, జయశ్రీ అందరం ఒకే క్లాసులో చదువుకున్నాం. నువ్వు చాలా అందంగా డ్రాయింగ్ వేసేదానివి. మా ఇల్లు ఇక్కడే హనుమప్ప గుడి దగ్గర ఉండేది. మా నాన్నగారు లాయర్. ఇప్పుడు మేమందరం బెంగళూరులో ఉంటున్నాం. జాతర కోసమని వచ్చాను. గుర్తొచ్చిందా?”
“హుం.. ఇప్పుడు గుర్తొచ్చింది. ఎన్ని ఏళ్లయిందో కదా! చూడగానే గుర్తుపట్టలేకపోయాను. నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది,” అంటూ కళ్లు విప్పార్చి మాట్లాడింది రేణుక.
“మనం హైస్కూలు ముగించిన ఏడాదే నా పెళ్లి అయిపోయింది. నిన్ను పిలవడానికి మీ ఇంటికి కూడా వచ్చాను. నువ్వు అప్పుడు చదువుకోవడానికి ధార్వాడ్ హాస్టల్‌లో ఉన్నావు, కదా?”
“అవును రేణుక, నేను పీయుసీ పూర్తి చేసి ఇంజనీరింగ్ చదివి బెంగళూరులో ఉద్యోగంలో చేరాను. అక్కడే పెళ్లి జరిగింది. మా వారు కూడా ఇంజనీరే. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా అమ్మానాన్న, అన్నయ్య అందరం ఇప్పుడు అక్కడే ఉంటున్నాము. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాను కానీ, ఎన్నో ఏళ్ల తర్వాత ఈసారి ఇలా కనకాచలపతి జాతరకు వచ్చాను. నిన్ను చూసి చాలా ఆనందంగా ఉంది.”
“మేము బాగున్నాము స్వాతి. నన్ను ఇక్కడే పక్కనే ఉన్న సోమపురానికి ఇచ్చి పెళ్లి చేశారు. రైతు కుటుంబం. ఇక ఇప్పుడు రైతుల జీవితం అంటే అందరికీ తెలిసిందే కదా, ప్రత్యేకంగా చెప్పేదేముంది.”
రేణుక మాటల్లో దిగులును స్వాతి గ్రహించినప్పటికీ, ఎన్నేళ్లకో కలిసిన ఆ ఇద్దరు స్నేహితురాళ్లలో ఒక రకమైన సంతోషం కనిపించింది. ఇద్దరూ కలిసి రథంవీధిలోని దుకాణాలకు వెళ్లి, గాజులు, కుంకుమ కొనుక్కున్నారు; బొరుగులు, బెండు, బత్తాసులు తిన్నారు. తన కూతురి కోసం ముగ్గుల పుస్తకం కొనాలని ఆలోచిస్తున్న స్వాతికి, తమ స్కూలు రోజుల నాటి జాతర సంబరాలన్నీ గుర్తొచ్చాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు జాతరలో దుకాణాల సంఖ్య తగ్గిందని ఆమెకు అనిపించింది. దీని గురించి అడిగిన స్నేహితురాలి ప్రశ్నకు రేణుక బాధగా సమాధానమిచ్చింది.
“ఈ మధ్య ఎవరూ అంతగా దుకాణాలు పెట్టడం లేదు స్వాతి. వర్షాలు లేవు, పంటలు లేవు. కరువు, అప్పులు అని ఊరు వదిలి పట్నానికి పని కోసం వెళ్ళిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక ఇక్కడే ఉన్నవాళ్లు, దేవుడి కార్యం కదా అని దేన్నీ వదిలిపెట్టకుండా తోచినంతలో జరుపుకుంటున్నారు.”
మనసు నిండా బాధ ఉన్నా, ఊరి దేవుడి జాతరలో నవ్వుతూ పాల్గొంటున్న రేణుకను చూసి, తన ఊరి రైతుల బతుకుల గురించి ఆమెతో మాట్లాడాలని స్వాతికి అనిపించింది. అంతలో జాతర సందడిలో తల్లి కోసం వెతుకుతున్న శివ అక్కడికి వచ్చాడు.
“స్వాతి, ఇతను నా కొడుకు శివ, పొలం పనులు చూసుకుంటాడు. నాకు ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వారికి పెళ్లిళ్లయ్యాయి, సుఖంగా ఉన్నారు,” అని నవ్వుతూ రేణుక స్వాతికి శివని పరిచయం చేసింది.
తన తల్లి స్నేహితురాలు బెంగళూరు నుండి వచ్చిందని తెలుసుకున్న శివ, తాను కూడా పట్టణానికి వచ్చి పని చేయాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు రేణుక కళ్లు చెమ్మగిల్లడం స్వాతి గమనించింది. ఒకటి రెండు నిమిషాలు మాట్లాడిన శివ, తన స్నేహితులతో కలిసి ఉంటానని చెప్పి వెళ్ళిపోయాడు. శివ వెళ్ళిన తర్వాత, అతని కోరిక గురించి రేణుకను స్వాతి అడిగింది. చాలా ఏళ్ల తర్వాత ఈ జాతర మహోత్సవంలో కలిసిన స్నేహితురాలి దగ్గర తమ కష్టాలను చెప్పుకోవడానికి రేణుక మొదట సంకోచించినా, స్వాతి కళ్లలో ఉన్న ఆదరణను చూసి తన జీవితంలోని బాధను పంచుకుంది. రైతుల కష్టాల గురించి వింటూనే ఉండే స్వాతికి, రేణుక, ఇంకా ఆమె ఊరి వారి పరిస్థితుల గురించి నేరుగా ఆమె నోటి నుండే విన్నప్పుడు ఎంతో దుఃఖం కలిగింది.
రేణుక తన మాటలను కొనసాగించింది. “ఏం చేయాలో తోచడం లేదు స్వాతి. శివ చూస్తేనేమో పట్నానికి వెళ్లి పని చేస్తాను అంటున్నాడు. ఇన్నేళ్లుగా ‘రైతు అంటే అన్నదాత’ అనే గౌరవంతో బతికిన మేము, ఈ రోజు ఊరు వదిలి వెళ్లి రెక్కలు ముక్కలు చేసుకుని ఇంకొకరి ముందు చేయి చాచాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. కానీ మరో పక్క చూస్తే వేరే ఆదాయం లేదు. వర్షాలు పడకపోతే అప్పులే గతి.”
స్నేహితురాలి మాటలు విన్న స్వాతి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి.
![]()
బెంగళూరుకు తిరిగి వెళ్ళడానికి బస్సు ఎక్కి కూర్చున్న స్వాతి ఆలోచనల నిండా ఇప్పుడు రేణుక, శివ, వారి గ్రామ రైతులు నిండిపోయారు. వారికి ఏ విధంగా సహాయం చేయవచ్చు?
సోషల్ మీడియాలో రైతుల గురించి, వారి కష్టాల గురించి భావోద్వేగ సందేశాలను పంపడమే మన పని అని అనుకోవాలా? రైతు అప్పుల మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదే అని ఊరుకోవాలా? లేక, స్నేహితులందరం కలిసి కొంత డబ్బు జమ చేసి ఇవ్వాలా?
ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్న స్వాతి మనస్సు, జగత్తుకే అన్నం పెట్టే రైతు ఇంకొకరి ముందు చేయి చాచే పరిస్థితిని అంగీకరించలేకపోయింది. రైతును ‘కర్మయోగి’, ‘అన్నదాత’ అని పిలిచే మనమందరం, ఆ యోగిని కాపాడుకుంటేనే కదా మనందరికీ తినడానికి అన్నం దొరికేది. “మరో ఆదాయం లేదు, వర్షం పడకపోతే అప్పులే గతి” అన్న రేణుక వేదనతో కూడిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ బాధకు ఎలా స్పందించాలి? బాధలో ఉన్నవారి కన్నీళ్లను పూర్తిగా తుడిచే శక్తి మనకు లేకపోయినా, వారి కష్టానికి స్పందించి, ఆ కన్నీటి చుక్కలు వారి చెంపలను తడపక ముందే అండగా నిలబడాలి కదా?
హైస్కూల్లో చదివేటప్పుడు రేణుక కుట్టుపని, ఎంబ్రాయిడరీ, డ్రాయింగ్ లో అందరికంటే తెలివైనది అని స్వాతి గుర్తు చేసుకుంది. రాత్రి ప్రయాణం ముగిసి ఉదయానికి బెంగళూరు చేరుకునేలోపు, తను రేణుకకు ఏ విధంగా సహాయం చేయవచ్చో ఆలోచించి కొన్ని పనుల జాబితా తయారు చేసుకుంది. ఇంటికి చేరగానే రేణుకకు ఫోన్ చేసింది.
స్వాతితో మాట్లాడిన తర్వాత రేణుక తన గ్రామంలోని ఇతర రైతు మహిళలందరినీ పిలిచి మాట్లాడింది. అందరూ తమ కష్టాలతో కూడిన జీవితాల గురించి చర్చించుకున్నారు. హైస్కూలు రోజుల్లో ఉపయోగించి, ఇప్పుడు అవసరం లేదని అట్టెక్కించిన తన పాత కుట్టు మిషన్‌ను రేణుక బయటకు తీసింది. ఇటు బెంగళూరులో స్వాతి తన స్నేహితులతో, సహోద్యోగులతో రైతులకు సహాయం చేయాలనే తన ప్రయత్నం గురించి మాట్లాడింది. తన ఊరు, పొలాలు, అక్కడి ప్రజల జీవితాల పట్ల ఎప్పుడూ సానుకూలంగా స్పందించే స్వాతి ప్రయత్నాన్ని ఆమె భర్త, పిల్లలు కూడా ప్రోత్సహించారు.
మొదట కొంత డబ్బు సేకరించి కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ, అల్లికలకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసింది. వాటిని బెంగళూరు నుండి కనకగిరికి వెళ్లే ప్రైవేట్ బస్సులో పంపి, శివ ఇంకా అతని స్నేహితుల ద్వారా వాటిని సోమపురానికి చేర్చేలా ఏర్పాటు చేసింది. రేణుక ద్వారా సులభమైన, సరళమైన దుస్తులను తయారు చేయించి, వాటిని తన స్నేహితులు, భర్త స్నేహితులు మరియు పిల్లల స్నేహితుల బృందాల్లోనే కొనేలా వారిని ఒప్పించింది. ఇంట్లో వేసుకోవడానికైనా సరే విదేశీ బ్రాండెడ్ బట్టలకు బదులుగా, రేణుక బృందం తయారు చేసిన దుస్తులను కొనుగోలు చేసి రైతు మహిళలకు అండగా నిలవాలని కోరింది.
అటు సోమపురంలో రేణుక తన ఇంట్లోనే ఆసక్తి ఉన్న మహిళలకు కుట్టుపనిలో శిక్షణ ఇచ్చింది. రకరకాల ఎంబ్రాయిడరీ, అందమైన చిత్రాలు వేసి రంగులు నింపడం నేర్పించింది. ఇలా మొదలైన ఈ ప్రయత్నాన్ని స్వాతి మరింత ముందుకు తీసుకెళ్లి తన ఆఫీసులో, పిల్లల కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో రేణుక బృందం తయారు చేసిన హస్తకళా వస్తువులు, రంగురంగుల మట్టి కుండల స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయించేలా ప్లాన్ చేసింది. దీనికోసం తన కూతురిని, ఆమె స్నేహితులను కూడా ఉత్సాహపరిచింది.
దీనివల్ల వచ్చే ఆదాయం చాలా ఎక్కువ కాకపోయినా, రైతు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వారిలో బతకగలమన్న భరోసాను నింపింది. అంతేకాకుండా, శివతో పాటు అతని స్నేహితుల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపింది. వారందరూ తమ పరిస్థితులపై చర్చించుకుని, పట్నానికి వెళ్ళే ఆలోచనను విరమించుకుని ప్రత్యామ్నాయ ఆదాయం పొందే మార్గాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
![]()
రేణుక నాయకత్వంలో ఆమె గ్రామం ఎంతో పురోగతి సాధించింది. ఇలా వరుసగా నాలుగు సంవత్సరాల కృషి ఆ చిన్న పల్లెను ఒక ‘ఆదర్శ గ్రామం’గా తీర్చిదిద్దింది. దీనివల్ల రేణుకను అందరూ ‘ఆదర్శ గ్రామీణ మహిళ’గా గుర్తించసాగారు. ఆమె కష్టపడి సాధించిన ఈ విజయాన్ని అందరికీ పరిచయం చేయాలని స్వాతి ఆలోచించింది. ఈ విషయం గురించి రేణుకతో మాట్లాడాలని తను చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి ఫోన్ తీసింది. తమ ప్రయత్నంలోని ప్రతి అడుగును గుర్తు చేసుకున్న రేణుక, ఇదంతా స్వాతి వల్లే సాధ్యమైందని చెబుతూ తన కృతజ్ఞతలు తెలిపింది.
“మేమందరం, మా బతుకులు మళ్ళీ ఇలా నిలబడ్డాయంటే అది నీ ప్రయత్నం వల్లే కదా స్వాతి?” అని రేణుక అంది.
“అలా అనకు రేణుక, నేనేదో నా చేతనైన ప్రయత్నం చేశాను. అది నా కర్తవ్యంగా భావించాను. ఒక చెట్టు కొమ్మలు ఎంత దూరం విస్తరించినా, తన వేర్లను మరిచి బతకగలదా?” అని స్వాతి బదులిచ్చింది.
స్వాతి చదువుతున్న పుస్తకంలోని కవితా పంక్తులు కూడా అదే చెబుతున్నాయి: “నా ఒక్కడికే బతకాలన్న ఆశ లేదు, రేపు కొత్త మట్టిలో నాలోని మంచి ఏదైనా సరే వేళ్లూనుకుంటుంది, కొమ్మ కొమ్మకూ కొత్త పూవుగా, చిగురుగా వికసిస్తుంది…”
స్వాతి మాటలను రేణుక ఎంతవరకు అర్థం చేసుకుందో తెలియదు కానీ, తన మనసు అనే ఆకాశంలో భావ మేఘాలను నింపుకున్న స్వాతి.. వర్షం, పంటలు లేక ఎండిపోయి అల్లాడిపోయిన తనలాంటి వారి హృదయద్వారాల ముందు భరోసా అనే వర్షాన్ని కురిపించి, ఆత్మవిశ్వాసం అనే పచ్చని చిగురును మొలిపించింది అని మాత్రం రేణుక అనుకుంది.
![]()

రచయిత, సాహిత్యాభిమాని, అనువాదకుడు, సంపాదకుడు వికీపీడియన్. తెలుగు కన్నడ భాషలలో అనువాదాలు చేస్తున్నారు. కథాజగత్, సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం, జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు, రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులంకథ, క్రీడాకథ, రామకథాసుధ, పదచదరాలు, స్వాతంత్ర్యభారతికి అమృతోత్సవ హారతి అనే పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రముఖ హేతువాది, విద్యావేత్త డా.హెచ్.నరసింహయ్య ఆత్మకథను పోరాటపథం పేరుతో తెలుగు ప్రజలకు పరిచయం చేశారు.




Discussion about this post