మూలం: సాహిర్ లుధియాన్వి, హిందీ ఉర్దూ కవి
తెలుగు అనువాదం: మల్లేశ్వర రావు ఆకుల
మర్యాదస్తులారా! మానవులారా!
యుద్దం తప్పిపోతేనే మేలు కదా!
లేదా మీరు మనము అందరము
యుద్ధాగ్ని కీలల్లో మాడి మసైపోతాము.
మన పొలాలు ఇళ్ళు శిధిలాలుగా మారుతాయి
అందుకే యుద్దం తప్పిపోతేనే మేలు కద!?
యుద్ధమే ఒక పెద్ద సమస్య అయినప్పుడు
ఇక అది ఏ సమస్యకైనా పరిష్కారం
ఎలా కాగలదు?
నిప్పుల్ని, రక్తధారలను
ప్రపంచమంతా పరిచిపెట్టడమే దాని పని.
రక్తం నీదైనా నాదైనా మరెవరిదైనా చివరికి
అది మనుషుల రక్తమే కదా!
యుద్ధం తూర్పుదిక్కునైనా పడమరగానైనా జరిగితే..
రక్తసిక్తం అయ్యేది ప్రపంచ శాంతే కదా!
ట్యాంకులు ముందుకు దూసుకుపోయినా, వెనక్కు మరలినా,
భూమాత గర్భమే కదా బీటలు వారేది.
చివరికి అది విజయోత్సవమైనా
పరాజిత దుఃఖమైనా
జీవితం శవాల మధ్య విలపించాల్సిందే కదా!
అందుకే యుద్ధం తప్పిపోతేనే మేలు కదా!
బాంబులు ఇళ్ళ మీద పడ్డా,
సరిహద్దుల మీద విరుచుకు పడ్డా,
జీవన భవన నిర్మాణాలే కదా..
దెబ్బతినేది, కూలిపోయేది!
కాలిపోయేది.. మన లేదా పరుల పొలాలైనా,
ఆకలి మంటలతో విలవిలలాడేది, మనిషి జీవితమే కదా!
అందుకే మర్యాదస్తులారా
మనుష పుంగవులారా!
యుద్దం తప్పిపోతేనే మేలు కదా!
యుద్ధాగ్నిలో
మానవాళి మాడి మసై బూడిదగా మారడం కంటే
యుద్దం తప్పిపోతేనే మేలు కదా
![]()

ఆకాశవాణి విశ్రాంత సంచాలకులుగా 2016 డిసెంబర్ లో రిటైర్ అయ్యారు. 1.1.1977 గుడివాడలో జననం. ఉద్యోగ విరమణ తర్వాత తిరుపతిలో నివాసం. B.com., MCJ, MA. (HINDI), రంగస్థల యోగా విజ్ఞాన్ లో సుశిక్షితులు. 28సం.ఆకాశవాణిలో ఉద్యోగం. అక్షరాలు నా ఆనవాళ్లు, ప్రకృతి నేపథ్యంలో, దృశ్యం విత్తై మొలకెత్తితే- కవితా సంపుటులు, వెన్నెలలో మల్లియలు- నాజీవన యానం. ఇప్పుడు ముద్రణలో చాంద్ ఫిర్ నికలా- 100 హిందీ పాటలకు వ్యాఖ్యానం, ఆయన రచనలు. రంగస్థల విమర్శ- సమీక్షకులు. వాట్సాప్ గ్రూపులో హిందీ అనువాదాలు. కథాయాత్ర పేరుతో కథల ఆడియో, చిత్ర కవితలు, పుస్తక సమీక్షలు, పరిచయాలు వగైరా.



