హిందీ మూలం: మాఖన్ లాల్ చతుర్వేది
తెలుగు అనువాదం : మల్లేశ్వర రావు ఆకుల.
ఈ ఓటమి ఒక విశ్రాంతి విరామం.
జీవితమే ఒక మహాసంగ్రామం.
కృశించి కృశించి మరణిస్తానే గాని
దయాభిక్ష మాత్రం స్వీకరించను.
ఎవరినీ ఏదైనా మరో వరమేమీ అడగను.
సుఖానుభూతినిచ్చే స్మృతి క్షణాల కోసం
నా శిథిలాస్తిత్వం కోసం విశ్వసంపదను
కోరను గాక కోరనని తెలుసుకో!
గెలుపులో ఓటమిలో.. ఏదైతేనేం?
ఇసుమంత భయం లేకుండా
సంఘర్షణామయమైన దారిలో
అది ఇది.. దొరికినవన్నీ మంచివే!
అందుకే ఇంకో వరమేది అడగను.
అల్పబుద్ధీ!.. నన్ను తాకకు
నీవే గొప్పగా నిలబడు.
నా హృదయావేదనను ఊరికే వదులుకోను.
ఇంకో వరమేమీ కోరుకోను.
నా హృదయాన్ని మంటబెట్టినా,
నాకెంత భీకరమైన అభిశాపమిచ్చినా
నీవు ఏం చేసినా.. నా కర్తవ్య పథం నుంచి
వెన్ను చూపను. పిరికివాడినై పరుగెత్తను.
ఘనమైన వరమేది మరొకటి కోరను.
![]()

ఆకాశవాణి విశ్రాంత సంచాలకులుగా 2016 డిసెంబర్ లో రిటైర్ అయ్యారు. 1.1.1977 గుడివాడలో జననం. ఉద్యోగ విరమణ తర్వాత తిరుపతిలో నివాసం. B.com., MCJ, MA. (HINDI), రంగస్థల యోగా విజ్ఞాన్ లో సుశిక్షితులు. 28సం.ఆకాశవాణిలో ఉద్యోగం. అక్షరాలు నా ఆనవాళ్లు, ప్రకృతి నేపథ్యంలో, దృశ్యం విత్తై మొలకెత్తితే- కవితా సంపుటులు, వెన్నెలలో మల్లియలు- నాజీవన యానం. ఇప్పుడు ముద్రణలో చాంద్ ఫిర్ నికలా- 100 హిందీ పాటలకు వ్యాఖ్యానం, ఆయన రచనలు. రంగస్థల విమర్శ- సమీక్షకులు. వాట్సాప్ గ్రూపులో హిందీ అనువాదాలు. కథాయాత్ర పేరుతో కథల ఆడియో, చిత్ర కవితలు, పుస్తక సమీక్షలు, పరిచయాలు వగైరా.



