తమిళ మూలం : ఎస్.కె.పి.కరుణా
అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ
భార్యా, కొడుకూ ఊరికెళ్లిన కొద్ది రోజుల్లోనే జీవంతో తొణికిసలాడే మన ఇండ్లు ఎందుకు బోసిపోతాయి?
వేసవి శెలవులకు వెళ్లిన కొడుకును చూసి ఐదు రోజులయ్యుంటుంది. ఇంట్లోని అన్నిచోట్లా, తన ఎన్నో సాహస చర్యల ద్వారా నింపేసినవాడు లేకుండా, ఇల్లూ, మనసూ బోసిపోయింది.
కచ్చితంగా రోజుకు ఒకసారే ఫోన్ చెయ్యాలి అన్న ఒక కఠినమైన ఉత్తర్వు, భార్య నుండి ఊరికి వెళ్లేముందు ఇవ్వబడింది. రాత్రి కావటానికి ఇంకా ఒక పగలంతా మిగిలి ఉంది. వాళ్లు ఊళ్లోలేని ఈ కొద్ది రోజులలో, చిందర వందరగా ఉన్న నా లైబ్రరీనైనా చక్కబెట్టమని బుజ్జగింపు లాంటి ఒక ఆజ్ఞనిచ్చి వెళ్లింది. ఆ పనైనా చేద్దామని నేనూ నా డ్రైవరూ పుస్తకాల అల్మైరాలో నుండి పుస్తకాలను కిందికి దించాం. తమిళం ఆంగ్లం నిఘంటువులు మాత్రమే పదికి పైగానే ఉన్నాయి.
ఒకదానిని మాత్రమే ఉంచుకుని, మిగతా వాటిని బడి పిల్లలకు బహుమతిగా ఇచ్చేద్దామనుకుని ఒకదాన్ని ఎన్నిక చేద్దామనుకుంటున్నప్పుడే, ఒక పాత నిఘంటువు నుండి ఆ ఉత్తరం బయటపడింది. పాత ఉత్తరాలను చదివే ఆసక్తి నాలో ఇంకా ఉండటంతో, అన్ని పనులనూ పక్కన పెట్టి, ఆ ఉత్తరం చదివాను. ఎవరి ఉత్తరం అది? ఎవరికి రాయబడి౦ది? మొదట నాకేమీ అర్థం కాలేదు. ఆ ఉత్తరం ఉన్న నిఘంటువు పేజీలను తిప్పి చూశాను. డాక్టరు అంటూ చేత్తో రాయబడిన పేరు కింద ప్రభుత్వ ఆసుపత్రి, తిరువణ్ణామలై(అరుణాచలం) అన్న ఒక రబ్బరు స్టాంపు ముద్ర వెయ్యబడి ఉంది.
నా పన్నెండేండ్ల వయసులో నా దగ్గరికి చేరిన నిఘంటువు అది. ముప్పై ఏళ్లుగా నా పాత పుస్తకాలతో జత కలిసి ఉంది. ఇవ్వాళ తెల్లవారి సమయంలో నా జ్ఞాపకాల దొంతరలను తెరవటానికి ప్రయత్నించింది. ఎండిపోయిన బావిలో, ఏదో ఒక రాయిని కదిల్చినప్పుడు ఊట నీరు పొంగుకొస్తుందే? అలా ఒక రాయిగా ఆ ఉత్తరం నా చేతుల్లో ఉంది. పొంగుకొచ్చే జ్ఞాపకాల దాడి తట్టుకోలేక, నా మనసు కరగటం మొదలైంది.
ఏడవ తరగతి చదువుతున్న అర నిక్కరు విద్యార్థి యొక్క సాహస జ్ఞాపకాలవి. ఆ వయసులో మేము ఎప్పుడూ గుసగుసలాడుకుంటున్న రహస్యాలు, ఎండా, చెమటా తెలియని రోజులు, అబద్దపు నమ్మకాలు, అర్థంపర్థం లేని భయాలు అంటూ అన్నీ ఒక కలగూరగంపలా కలిసిన బాల్య కాలపు జ్ఞాపకాల ప్రవాహమది.
పాత పద్ధతే అయినా ఇలా ప్రారంభిస్తాను.
ఇప్పటి నుండి ముప్పై ఏళ్లకు మునుపు ఒక రోజున…
‘‘నేనూ శీనూ చీకటిగా ఉన్న ఒక గదిలో, ఆ డాక్టరు ముందు చేతులు కట్టుకుని నిలబడున్నప్పుడు, మా బడిలో ప్రేయరు మొదలుకావటానికి ఇంకా పది నిమిషాలే సమయముంది
ఇంకో ఐదు నిమిషాలలో మమ్మల్ని చూసి, ‘‘సరే, ఇప్పుడు వెళ్లి రేపు వచ్చెయ్యాలి.’’ అని చెబుతాడు. ఆ తర్వాత, ఆశ్చర్యంగా బయటికొచ్చే మేము, తిరువూడల్ వీధిలో ఉన్న ఆ ఇంట్లో నుండి, మా డేనిష్ మిషన్ బడికి తర్వాతి ఐదు నిమిషాల్లో చేరుకోవాలి.
ఇలా జరగటం ఇది ఏడవ రోజు.
నేను ఇందులోకి ఎలా వచ్చి చిక్కుకున్నాను? అన్నది ఇప్పుడు నాకు స్పష్టంగా గుర్తుకొస్తోంది. ఆరవ తరగతి నుండే మా ఇంట్లో నాకంటూ వేరుగా సైకిలు కొనిచ్చారు. శీనూ, వాళ్లింట్లో ఏడ్చి ఏడవ తరగతిలో ఉన్నప్పుడు సైకిలు కొనుక్కున్నాడు. ఉదయం బడికి మేమిద్దరమూ సైకిళ్లలో ఒకరినొకరు అధిగమిస్తూ వెళ్లి చేరుకునేవాళ్లం. అది కూడా తిరువూడల్ వీధి మిట్టపై నుండి, ఆ వీధికి దిగవనున్న అంగడి వరకూ, హాండిల్‌బారు మీద నుండి చేతులు పైకెత్తి తొక్కటం మాకు ముఖ్యమైన కాలక్షేపం.
దానికి తగ్గట్టుగా, తిరువూడల్ వీధీ, ఇప్పటిలాగా ముఖ్యమైన వాణిజ్య వీధిగా కాకుండా, పూర్తిగా నివాస గృహాలతో కూడిన ప్రాంతంగా ఉండేది. వ్యాపారం అని చూసుకుంటే, వీధి చివరన ఎడమ వైపు రామ్ సిల్క్ ప్యాలెస్సూ, దానికి ఎదురుగా ఉన్న అణ్ణై మెడికల్స్ మరియు దాని పక్కన ఉన్న టైపురైటింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే. తర్వాత వరుసగా మరమరాలు, వేరుశెనక్కాయలమ్మే అంగళ్లు. కాబట్టి, ఆ ప్రాంతం వేరుశెనక్కాయల కార్నర్ అని మారింది. దానికెదురుగా వరుసగా గుర్రపుబండ్లు ఆపి ఉంచేవారు. పక్కనే వాటి మేతకోసం గడ్డిమోపులు పరిచి ఉంటాయి. ప్రత్యేకమైన గుర్రాల పేడవాసనతో, మా ఊరికి ఒకే ఒక కూరగాయల మార్కెట్టు ఉండేది.
మేము తిరువూడల్ వీధి మిట్టపైన చేతులెత్తేస్తే వేరుశెనక్కాయల కార్నర్ వరకూ సైకిలు హ్యాండిల్‌బార్ మీద చెయ్యి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా గుర్రాలకు నీళ్లు తాగిపించటానికి, ఎదురుగా ఉన్న టైపురైటింగు ఇన్సిటిట్యూటుకు బయట ఏర్పాటు చేసున్న నీళ్ల తొట్టె దగ్గరికి తీసుకెళ్లేవాళ్లు. అప్పుడు మాత్రమే కొంచెం నిదానించవలసి ఉంటుంది. గుర్రాన్ని సైకిలుతో గుద్దేయ కూడదని హెచ్చరికగా ఉండేవాళ్లం.
అయినప్పటికీ, నేను శీను వెంట ఉండని ఒకరోజు ఉదయం పూట ఆ సంఘటన జరిగిపోయింది. గుర్రం మీదే కాకుండా ఒక ల్యాంబ్రడార్ స్కూటరు మీదా కలిపి శీను, సైకిలుతో గుద్దేశాడు. ఆ స్కూటరు, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఒక డాక్టరుకు చెందింది. మరింత ఇబ్బందికరమైన విషయమేమిటంటే, డాక్టరు ఆ స్కూటరు మీద పడిపోయి ఉండటమే. శీను, సైకిలు, గుర్రం, గడ్డిమోపులు, స్కూటరు, మరియు డాక్టరు అంటూ ఒక గంపగుత్తుగా ఒకరిమీద ఒకరు పడిపోవటంతో, ఎవరివల్ల ఈ ప్రమాదం జరిగిందని ఎవరూ స్పష్టంగా చెప్పటానికి వీలుకాకపోయింది.
అరనిక్కరు వేసుకున్న ఏడవ తరగతి విద్యార్థి ఆ ప్రమాదంతో సంబంధం కలిగి ఉండటంతో ప్రమాదానికి అతనే కారణమయ్యాడు. వాడి బడి సంచిని తీసుకుని, వాడినీ వెంటబెట్టుకుని, ఆ డాక్టరు అదే వీధిలోని ఆయన ఇంటికి వెళ్లిపోయాడు. స్కూటరును బండ్లో వేసుకుని, ఆ గుర్రమూ, బండివాడూ, బండిని తీసుకుని మెకానిక్ షాపుకు వెళ్లిపోయాడు.
శీనును ఇంటికి తీసుకెళ్లిన డాక్టరు, ఏడుస్తూ నిలబడున్న వాడితో, వాడి తండ్రి పేరు, చిరునామా అన్నింటినీ తెలుసుకుని, స్కూటరు రిపేరు ఖర్చుకు డబ్బు తీసుకొచ్చి ఇచ్చి, స్కూలు బ్యాగునూ, వాడి సైకిలునూ విడిపించుకు వెళ్లమని చెప్పేశాడు. ఇంతటి గందరగోళంలోనూ, వాడూ, వాడి సైకిలుకూ ఒక చిన్న గీత కూడా పడలేదు. డాక్టరుకే చాలా రక్త గాయాలయ్యాయి.
శీనుకేమో, వాడి నాన్నకు ఈ విషయం తెలిస్తే, దెబ్బలు, తన్నులు తినటంతోపాటు, బడికి సైకిల్లో వెళ్లే అవకాశం ఉండదన్న భయం పట్టుకుంది. ఊరు నుండి తిరిగొచ్చిన నన్ను కలుసుకుని జరిగిన విషయాన్ని చెప్పాడు.
‘‘నీ సైకిలు రిపేరు అయిన కారణంగా, నా సైకిలును నీకు ఇచ్చానని మా ఇంట్లో అబద్ధం చెప్పాను. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియటం లేదు.’’ అని ఏడుపు ముఖం పెట్టాడు.
‘‘ఆ డాక్టరు దగ్గరకెళ్లి, నువ్వే అడిగి చూడచ్చు కదరా.’’ అన్నాను. అలా నాలుగు రోజులు వెళ్లాడట.
‘‘ఏం చెప్పాడు?’’
‘‘ఏమీ మాట్లాడడు. నేను చేతులు కట్టుకుని నిలబడతాను. నన్నే చూస్తూ ఉండేవాడు. చాలాసేపటి తర్వాత, ‘వెళ్లి రేపు రా’ అని చెప్పి, ఇంటికి తాళం పెట్టుకుని వెళ్లిపోయేవాడు.’’ అన్నాడు.
శీనుకు సహాయం చెయ్యటమన్నది నాకు నిర్బంధమైంది.
‘‘రేపు తెల్లవారి బడికి వెళ్తున్నప్పుడు, దారిలో ఆ డాక్టరు ఇంటికెళ్లి నీ విషయంగా మాట్లాడుతాను.’’ అని ఓదార్చి, వాడిని పంపించేశాను. మరునాడు, తెల్లవారి ఆరు గంటలకే నన్ను వెంటబెట్టకుని వెళ్లటానికి మా ఇంటికొచ్చేశాడు.
ప్రేయరు తొమ్మిది గంటలకు. ఎనిమిది గంటలకు ఇంట్లో నుండి బయలుదేరాం. అలవాటు ప్రకారం, తిరువూడల్ వీధి మిట్టపైన, హ్యాండిల్ బారు మీద నుండి నేను చేతులెత్తగానే, ‘‘ఒరేయ్, ఒరేయ్ వొద్దురా.’’ అని శీను గట్టిగా నన్ను అరిచాడు.
సరే అని అందరిలాగా నేనూ పద్ధతిగా సైకిలును నడుపుకుంటూ డాక్టరు ఇంటికి వెళ్లాము. ఆ పొడవాటి వీధికి సరిగ్గా మధ్యలో ఆయన నివాసముండే ఇల్లు ఉంది. ఇంటి గుమ్మంలో నిలబడి చూస్తే, ఆ ఇంటి వెనకభాగం కంటికి కనిపించదు. అంత పొడవు. మా ఊరు(తిరువణ్ణామలై) పెద్ద గుడికి చుట్టూ ఉన్న మాడ వీధులలో ఉండే చాలా ఇండ్లు ఇలాగే ఉంటాయి. వీధికి ఒక చివరన గుమ్మం ఉంటే, మరో కొస వెనక వైపున్న వీధిలోకి ఉంటుంది. అయితే, ఈ ఇంటి వెడల్పు తక్కువ. తక్కువంటే అంత తక్కువ. అధిక పక్షం పదిహేను అడుగులు ఉండొచ్చు. కాబట్టి, వెలుతురు ఏ రకంగానూ లోపలికి రావటానికి మార్గం లేక ఎప్పుడూ చీకట్లోనే ఉండేది.
ఇంటి తాళువారంలో, శీను సైకిలు ఒక గొలుసుతో గ్రిల్ గేటుతో కలిపి కట్టబడి ఉంది. దాన్ని దీనంగా కన్నీళ్లతో చూస్తూ, శీను కాలింగ్ బెల్లు నొక్కాడు. ఎవరూ రాలేదు. మమ్మల్ని లోపలికి రమ్మని ఎవరూ పిలవనూ లేదు. వీడే, కొంతసేపు గడిచాక తలుపు తీసుకుని, ముందు గదిలో ఉండే డాక్టరు చిన్న టేబుల్ ముందుకెళ్లి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. రోజూ ఇలాగే జరిగేలా ఉందని భావించాను.
డాక్టరు వంగొని ఏదో రాసుకుంటున్నాడు. చాలాసేపయ్యాక తల పైకెత్తి మమ్మల్ని చూశాడు. నువ్వెవరు? అని చూపులతోనే నన్ను అడిగాడు. దేనికో తెలియలేదు. చటుక్కున నేనూ నా చేతులను కట్టుకున్నాను. నోట్లో నుండి మాటలేవీ రాక, వాడి స్నేహితుడని కట్టుకున్న చేతులతోనే చెప్పాను.
ఆ తర్వాత ఆయనేమీ మాట్లాడలేదు. ప్రేయరుకు సరిగ్గా ఐదునిమిషాలున్నప్పుడు, మమ్మల్ని చూసి ‘ఇప్పుడు వెళ్లి రేపు రండి’ అని చెప్పి మళ్లీ రాసుకోవటం మొదలుపెట్టాడు. మేము బయటికొచ్చిన కొంతసేపటికి, ఆయనా బయటికొచ్చాడు. వెనకనే, పనమ్మాయి బయటికొచ్చి, గేటును లాగి తాళం వేసింది. డాక్టరు తాళాన్ని లాగి చూసి, తన సంచిలో నుండి ఐదురూపాయలు తీసి ఆ అమ్మాయి చేతికిచ్చాడు. తర్వాత, బయట ఆపి ఉన్న తన స్కూటర్లో (మెకానిక్ షాపు నుండి వచ్చేసినట్టుంది) హాస్పిటల్‌కు బయలుదేరాడు.
నేను, శీను వైపు చూశాను. ‘‘రోజూ ఇలాగే రా జరుగుతుంది.’’ అన్నాడు వాడు దీనంగా.
నాకు శీను సమస్యను తీర్చవలసిన నిర్బంధం ఏర్పడి౦ది. రోజూ, వాడితో కలిసి నేనూ వెళ్లి డాక్టరు ముందు నిలబడటం నాకు విసుగొచ్చింది. మనమెందుకు వాడితో పాటూ రోజూ వెళ్లి డాక్టరు ముందు అలా నిలబడాలని నేను ఆలోచించటం శీనుకు తెలిసిపోయినట్టుంది. మెల్లగా ఆ భయంకరమైన విషయాన్ని చెప్పాడు.
‘‘డాక్టరు దగ్గరికి పోకపోతే, ఏదో ఒకరోజు మనకు జ్వరం వచ్చినప్పుడు విషం సూది వేసేస్తాడట.’’
అది విన్న వెంటనే నాకు చెమటలు పట్టేశాయి. నాకు లైట్‌గా జలుబు చేస్తే కూడా, మా అమ్మ మా డాక్టరుతో ఎప్పుడూ చెప్పేది, ‘‘డాక్టరు గారూ, ఒక సూది వేసెయ్యండి.” అని. ‘నాకేమో అప్పుడప్పుడూ జలుబు చేస్తుంటుంది. ఎలాగూ సంవత్సరానికి ఎన్నో సూదులు కచ్చితంగా ఉంటాయి. అందులో ఏది విషం సూది అన్నది ఎలా కనిపెట్టటం?’
మరునాడు, శీను కోసం ఎదురుచూడకుండా, మొదటి వ్యక్తిగా నేను వెళ్లి నిలబడటం మొదలుపెట్టాను. (విషం సూది) మెల్లగా ఆ ఇంటికి సంబంధించిన ఎన్నో సూక్ష్మాలు మాకు తెలియటం మొదలైంది. డాక్టరు అక్కడ ఒంటరిగా ఉంటున్నాడు. ఆ ఇల్లు కూడా ఏదో ఒక ప్రభుత్వ డాక్టరు అద్దెకు తీసుకుని, తర్వాత అది అలాగే అక్కడికి ట్రాన్స్‌ఫరై వచ్చేవాళ్లకు కొనసాగుతోంది. వీటన్నింటికన్నా మించి, నాకు ఇంకా గుర్తున్నది, ఆ ఇంటి నిర్మాణమూ, డాక్టరు గారి సమయపాలన.
సరిగ్గా తెల్లవారి ఆరు గంటలకు ఆ ఇంటి తలుపు తెరుచుకుంటుంది. పనమ్మాయి లోపలికి వెళ్లాక మూసుకున్న తలుపును, ఎనిమిది గంటల సమయంలో మా ఇద్దరిలో ఒకరే వెళ్లి తెరుస్తాం. అప్పుడు, స్నానం పూర్తిచేసి తన కుర్చీలో కూర్చుని రాయటం మొదలుపెడతారు. పనమ్మాయి వంట పూర్తిచేసి శబ్దం చేశాక, క్యారియర్లో పెట్టిన భోజనాన్ని తీసుకుని బయలుదేరుతున్నప్పుడు సరిగ్గా సమయం ఉదయం 8.55 నిమిషాలు.
ఆ ఇంట్లో ఎక్కడా ఒక్క వస్తువు కూడా స్థానభ్రంశం చెందదు. ఎక్కడా దుమ్ము, ధూళి కనబడదు. చెప్పులు మొదలుకుని పెరట్లోని స్నానాలగది లోని మగ్గు వరకూ పెట్టిన చోట పెట్టినట్టే ఉంటుంది. సెలవు దినాలలో ఇల్లు పీకి పందిరేసే నైపుణ్యం కలిగిన మాకు ఆ ఇంటి శుభ్రత చాలా కొత్తగా అనిపించింది.
శీనుకు క్రమంగా ఓపిక నశించసాగింది. ఒకరోజు, బయటికొస్తున్నప్పుడు, డాక్టరు గారి చెప్పులను తనతోపాటు తీసుకొచ్చేశాడు. మరునాడు, తెల్లవారి అదే చోటులో అలాంటివే ఒక కొత్త చెప్పుల జత కనిపించింది. ఆయన టేబులు మీదున్న ఒక చిన్న తలూపే బొమ్మను తీసుకొచ్చేశాడు. మరునాడు, అదే చోటులో మరొక తలూపే బొమ్మ కనిపించింది. దువ్వెన, పేనా అంటూ ఏది తీసుకొచ్చేసినా అవి మళ్లీ అదే చోటులో ఉంచబడుతోంది. ఇంతటికీ మమ్మల్ని అనుమానిస్తూ ఒక్క ప్రశ్నా మాకు ఎదురుకాలేదు.
మా బస్సు షెడ్డుకు నేరుగానే ప్రభుత్వ ఆసుపత్రి యొక్క వెనకవైపు తలుపు ఉంది. అక్కడే మార్చ్యురీ గది ఉంది. నేనప్పుడు ‘శవానికి పరిశోధన ఎందుకని’ చాలామందిని అడిగాను. శవాలను కోసి, తర్వాత కుట్టేసి కొత్త గాఢా గుడ్డలో చుట్టి ఇచ్చే కాశీ అన్న నాకు బాగా పరిచయం.
సోము టీ కొట్టు నుండి మా నాన్కకు టీ తీసుకురావటం నా ముఖ్యమైన పని. అక్కడ కాశీ అన్న నేలమీద కూర్చుని ఉండేవాడు. సంచిలో ఎప్పుడూ కొన్ని బాటిళ్ల సారాయి ఉండేవి. శవాలను కోసినందుకు కూలీ భత్యంగా ఆయనకు ఎప్పుడూ సారాయే ఇచ్చేవాళ్లు. తాను తాగగా మిగిలినదాన్ని అక్కడికొచ్చే బయటి ఊరివాళ్లకు అమ్మేవాడు. అలా అమ్మితేనే టీ తాగటానికి ఆయనకు డబ్బులొచ్చేవి. కాబట్టి, అప్పుడప్పుడు నేను టీ తీసిచ్చేవాణ్ణి.
ఆయన్ను అడిగాను: ‘‘ఏమన్నా, రోజూ స్కూటర్లో వస్తారే, ఆ డాక్టరు నీకు తెలుశా?’’
‘‘ఓ, తెలుసే.’’
‘‘ఆయన దగ్గర విషం సూది ఉంటుందా?’’
‘‘కచ్చితంగా ఉంటాది. ఎందుకు నాయనా అడగతా ఉండావు?’’ అన్నాడు.
నేను అదిరిపడి నిలబడ్డాను.
‘‘అయితే, ఆ డాకట్రు చానా మంచి మనిషి. నా సర్వీసులో డబ్బులు తీసుకోని పద్ధతైన డాకట్రు ఆయనే.’’ అన్నాడు.
అవన్నీ నా చెవికెక్కలేదు.
ఆ రాత్రి, మా ఇంటి బాల్కనీలో శీనుతో జరిగిన ముఖ్యమైన సమావేశంలో, ‘‘ఇంకా ఎన్ని రోజులని ఆ మనిషి ఇంటకెళ్లి నిలబడటం?’’ అన్నాను.
‘‘నువ్వు ఈ విషయాన్ని మీ నాయనకు చెప్పేయిరా. తర్వాత చూడు, ఆ డాక్టరు రోజూ మీ షెడ్డుకొచ్చి మీ నాయన ముందు నిలబడతాడు.’’ అని చెప్పి నవ్వాడు.
వాడు, దీన్ని ఎప్పుడో నా సమస్యగా మార్చేశాడు. వాడి అమ్మ ఒకరోజు నన్ను వీధిలో చూసినప్పుడు, ‘‘నీ సైకిలు రిపేరై వచ్చిందా బాబూ?’’ అని అడిగినప్పుడు, ‘‘ఇంకా రాలేదక్కా.’’ అని చెప్పాను.
వాళ్లూ, ‘‘సరే, సరే. వచ్చినప్పుడు రానీ. అంతవరకూ, వీడి సైకిలును నువ్వే ఉంచుకో.’’ అని చెప్పేశారు.
ఆపైన శీను తన సైకిలు దిగులునంతా నా మీద వదిలేసి, నా సైకిల్లో, నాతోనే బడికి రావటం మొదలుపెట్టేశాడు.
అప్పుడప్పుడు, ఈ విషం సూది మ్యాటర్‌ను మాత్రం గుర్తుకు తెస్తూ ఉండేవాడు.
‘‘సాధారణంగా మా ఫ్యామిలీ డాక్టరు నాకు సూది వెయ్యాలంటే తక్కువంటే ముగ్గురు నన్ను పట్టుకోవాల్సి వస్తుంది. ఈయన ఒంటి మనిషి ఎలారా నాకు విషం సూది వెయ్యగలడు?’’ అని శీనును అడిగాను. అందుకు వాడు చెప్పిన సమాధానం ఉందే, ఆహా! ప్రపంచస్థాయి ఊహ అది!!
‘‘రేయ్, డాక్టర్లందరూ చదువు పూర్తిచేసి కాలేజీల నుండి బయటికొచ్చే రోజున అందరూ కలిసి ఎన్నో ప్రమాణాలు చేసుకుంటార్రా. అందులోనూ ముఖ్యంగా, ఒకరినొకరు ఎప్పుడూ వదులుకోకుండా వెనకేసుకొస్తాం అని వాళ్లవాళ్ల అమ్మలమీద సత్యం చేసుకున్నాకే కాలేజీల నుండి బయటికొస్తారు. ఇప్పుడు! నీకు విషం సూది వెయ్యాలంటే, ఆయనొచ్చి నీకు డైరెక్టుగా వెయ్యాల్సిన పన్లేదు. మీ డాక్టరుకు ఒక ఉత్తరం రాస్తే చాలు. కొడకా నీకు విషం సూదే!’’
ఆ దినం నుండి నేను ఆస్తికుడినయ్యాను. మరునాడు తెల్లవారే స్నానం చేసి, పెద్దపెద్ద విబూధి నామాలు పెట్టుకుని, మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకుని చాలాసేపటిదాకా పూజ గదిలో దేవుణ్ణి మొక్కుతూ నిలబడున్న నాతో, ‘‘ఏంట్రా, కొత్తగా దేవుళ్లనంతా మొక్కుతున్నావు?’’ అంది అమ్మ.
‘‘నాకు ఇంకెప్పుడూ జ్వరం, జలుబు రాకూడదని మొక్కుకుంటున్నానమ్మా.’’ అని చెప్పి అలవాటు ప్రకారం డాక్టరు ఇంటికి బయలుదేరాను.
ఏదో ఒక మంచిరోజున, శీనుకు వాడి సైకిలును డాక్టరు తిరిగిచ్చేశాడు. అప్పటి నుండి వాడు డాక్టరు ఇంటి ఛాయలకే రావటం లేదు. అయితే, నేను కంటిన్యూగా వెళ్లసాగాను.
‘‘రేయ్, నన్ను చూసే కదరా ‘ఇకమీదట రావాల్సిన పని లేదని’ చెప్పాడు. నిన్ను కాదు. నువ్వు మర్యాదగా వెళ్లురా. ఆ విషం సూది! గుర్తు పెట్టుకో.’’ అని కూడా చెప్పి వెళ్లాడు.
నేనూ పద్ధతిగా వెళ్లి నిలబడటం మొదలుపెట్టాను. ఈమధ్య, టేబుల్ మీద నాకోసం రకరకాల స్వీట్లు, మిక్చరూ, సేవరీ రకాలు తయారుగా ఉంచబడేవి. నిలబడటం బదులు, ఒక స్టూలుమీద కూర్చోవటమూ మొదలుపట్టాను. అప్పుడప్పుడు లేచి ఇంట్లోకి అలా వెళ్లి రావటానికి ధైర్యం తెచ్చుకున్నాను. అయితే, డాక్టరుకు సంబంధించినంత వరకూ ఏ మార్పూ లేదు. రోజూ, సరైన సమయానికి నన్ను వెళ్లమని చెప్పటం తప్ప మరో మాట అన్నది లేదు.
ఉదయం పూట తప్ప, మరెప్పుడూ తిరువూడల్ వీధిలో నేను సైకిల్ మీద వెళ్లటం మానేశాను. ఆ సంఘటన తర్వాత, శీను మరెప్పుడూ తిరువూడల్ వీధికే రాలేదు. తిరువూడల్ వీధిలోకి తిరిగే బదులు నేరుగా గోపురం వీధిలోకెళ్లి, పెద్ద వీధి గుండా బడికి వెళ్లొస్తున్నాడు.
అలాగే, ఒక శనివారం సాయంత్రం, మేమిద్దరమూ ట్యూషన్‌కు వెళ్తున్నప్పుడు, పెద్ద వీధి మిట్ట మలుపులో ఆ పెద్ద కాలువ పక్కన డాక్టరు స్కూటరు పడిపోయి ఉండటాన్ని చూశాము. క్రమంగా చీకటి పడుతున్న సమయం కావటంతో, ఎవరూ దాన్ని గమనించలేదు. ఆ రోజుల్లో, పెద్ద వీధి కాలువలో కారు పడిపోయినా, బయటికి కనిపించదు. అంత వెడల్పైన కాలువ అది.
ఇద్దరూ సైకిళ్లను పక్కన పడేసి పరుగెత్తికెళ్ళి చూస్తే, డాక్టరు కాలువలో పడిపోయి కనిపించారు. శీను గట్టిగా శబ్దం చేసిన తర్వాత, అక్కడున్నవాళ్లు పరుగెత్తుకొచ్చి, కాలువలోకి దూకి డాక్టరును బయటికి ఎత్తుకొచ్చారు. అలవాటుగా ఆయన తొడుక్కునే తెల్ల ప్యాంటు, నల్ల బెల్టు, తెల్ల చొక్కా మొత్తం వాంతి చేసుకున్నట్టుంది. అక్కడక్కడా రక్తం కారుతోంది. పూర్తిగా స్పృహలో లేకపోవటంతో, ఆయన ఎవరన్నది మేమే గుర్తులు చెప్పాం. కొందరు, ఆయనను అక్కడున్న గుర్రపు బండ్లోకి ఎక్కించుకుని ఆయన ఇంటికి తీసుకెళ్లారు.
ఆదివారం కాక, సోమవారం డాక్టరు ఇంటికి వెళ్లినప్పుడు బయట తాళం వెయ్యబడి ఉంది. మంగళ, బుధ అంటూ రెండు రోజులూ వెళ్లి చూశాను. కానీ ఆ తర్వాతా ఎప్పుడూ ఆ ఇంటి తలుపు తెరుచుకోలేదు. తర్వాత్తర్వాత రోజుల్లో, పక్కింటాయన ఒకరు, ఈ ఇంటిని కొని, కూల్చివేసి తన ఇంటితో కలుపుకునేశారు. ఎప్పుడు ఆ వీధిలో వెళుతున్నా, యాదృచ్ఛికంగా ఆ ఇల్లు ఉన్న చోటును చూడటం మాత్రం నేను మానలేదు.
ఆ తర్వాత ఇంకెక్కడా, ఆ డాక్టరును మేము చూడలేదు. అలవాటైన మా ఇంటి బాల్కనీలో మేమిద్దరమూ ఎప్పుడూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. డబ్బులు తీసుకోకుండా, సైకిలును ఎందుకు తిరిగిచ్చేశాడు?
ఒక్కరోజు కూడా, శీను ఇంటికొచ్చి పెద్దవాళ్లకు జరిగిన విషయాన్ని ఎందుకు చెప్పలేదు?
ఒక్కసారి కూడా, మాతో ఇంకేమీ ఎందుకు మాట్లాడలేదు?
ఏడవ తరగతి చదివే ఇద్దరు విద్యార్థులను ఇలా రోజూ బలవంతంగా ఎందుకు రమ్మని చెప్పాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు మాలో ఉన్నాయి.
నిజంగానే ఆయన విషం సూదిని వేసుంటారా? అన్న అనుమానాన్ని మాత్రం మేం ఒకరికొకరు మాట్లాడుకోలేదు.
శీను, డాక్టరు ఇంట్లో నుండి తాను దొంగతనంగా తీసుకొచ్చిన వస్తువులన్నింటినీ, ఒక సంచీలో వేసుకుని తీసుకొచ్చాడు. అందులో, ఈ ఆంగ్ల నిఘంటువు కూడా ఉంది. అందులో ఉన్న ఒక ఇన్‌ల్యాండ్ లెటరును తీసి నాచేతికిచ్చాడు. అప్పటికే తెరిచి చదివిన ఉత్తరం అది.
‘‘ఇది చదువు.’’ అన్నాడు.
ఆ తక్కువ వెలుతురులో ఆ ఉత్తరాన్ని చదవటం మొదలుపెట్టాను.
‘‘మహారాజశ్రీ గౌరవనీయులైన అల్లుడి గారికి,
మీ మామయ్య అనేక ఆశీర్వాదాలతో రాస్తున్నది, ఏంటంటే… ఇక్కడ కూతురు జానకీ, మనవడు శివకుమార్‌తో సహా అందరూ క్షేమం. అదే విధంగా తమరి క్షేమాన్ని కోరుకుంటున్నాను. ఈ సమయానికి, కొత్త చోటులో ఉద్యోగం బాగా అలవాటై ఉంటుందని నమ్ముతున్నాను. తమరు వైద్యం చేస్తున్న రోగుల క్షేమం కోరటమే సదా నా ప్రార్థనగా ఉంటోంది.
మనవడిని కూడా ఇక్కడే పక్కనున్న బడిలో, ఏడవ తరగతిలో చేర్చాము. ఆ బడి హెడ్మాస్టరు, నా స్నేహితుడే కావటంతో, ఏ సర్టిఫికెట్టూ లేకుండానే చేర్చుకున్నారు.
జానకీ ఇంకా అప్పటిలాగే ఉంది. గత నెల మీరు రాసిన ఉత్తరాన్ని చదవటానికి కూడా మొండిగా తిరస్కరించింది. మీ అత్తే గుడికి వెళ్లినప్పుడు, ఉత్తరంలోని సంగతులను ఆమెకు చెప్పినట్టుంది. దాన్ని కూడా మనసు పెట్టి వినలేదట… క్షమించండి.
కాగుతున్న పాలు తన ముఖంపై పడటం ఆమె ఇంకా మరిచిపోలేదు. రాత్రులలో, నిద్రలో చిన్నగా ఏడుస్తూ సణుక్కుంటోంది. సమయానికి పాలు కాగకపోవటం నా తప్పా? అందుకనీ ఎవరైనా ఇలా కోప్పడతారా? అని గొణుక్కుంటోంది. చిన్న పిల్లే కదా. మగవాళ్లకు కోపం ఎందుకొస్తుంది? ఎప్పుడొస్తుంది? అన్నది ఆమెకు ఇంకా అర్థం కాలేదు.
మనవడు శివకుమార్ అంతకు మించి మొండిపట్టు పడుతున్నాడు. ఆడుకున్నాక ఆట బొమ్మలను, వాటి స్థానాలలో వాటిని పెట్టకపోవటం పెద్ద తప్పే. కొన్నాళ్లు పోయాక ఒకవేళ అలాంటి మంచి అలవాట్లను నేర్చుకుని ఉండేవాడో, ఏమో?
తమరు వాడిని మార్చాలనుకుని, వాడిని కొట్టటాన్ని ఇంకా మరిచిపోలేకుండా ఉన్నాడు.
మీ ఫోటోను చూడగానే, ఫిట్సు వచ్చినట్టు ఒళ్లంతా చెమటలు పట్టటంతో, ఇంటి హాల్లో తగిలించి ఉన్న మీ పెండ్లి పోటోను కూడా తీసి లోపల పెట్టాం… క్షమించండి.
పరిస్థితులు చక్కబడతాయన్న నమ్మకం నాలో రోజురోజుకూ తగ్గిపోతోంది. మంచి పద్ధతైన స్వభావమూ, క్రమశిక్షణా, నిజాయితీ కలిగి ఉండటమే మిమ్మల్ని నాకు అల్లుడుగా చేసింది. నా ప్రార్థనకు భగవంతుడు ప్రసాదించిన వరమని భావించి సంతోషించాను.
కానీ, నా కన్న కూతురేమో, అలాంటి మంచి గుణాలను మెచ్చుకోవటం తెలియని ఆడదైపోయిందే? నేనేం చెయ్యగలను?
నాకు వివాహమై చాలా ఏండ్ల తర్వాత పుట్టిన ఒకే ఒక ఆడపిల్ల కావటంతో, చాలా గారాబంగా పెంచేశాను.
ఇప్పటికీ కూడా అల్లుడి దగ్గరికెళ్లమని ఆమెతో కఠినంగా చెప్పటానికి నాకు నోరు రావటం లేదు. ఆ తల్లే దయతలచి ఆమెకు మంచి బుద్ధిని ప్రసాదించే౦త వరకూ తమరినీ ఓపికతో ఉండమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
అనేక కోట్ల ఆశీర్వాదాలతో,
కు. వైద్యనాథన్.
‘‘నాకిప్పటికీ అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా?’’ అని అడిగాడు శీను.
వాడలా అడిగినప్పుడు నాక్కూడా ఏమీ అర్థంకాలేదు.
అయితే, ఇప్పుడు, ఆ డాక్టరు వయస్సు నాకు. ఈ రోజు నాకు ఆ ఉత్తరాన్ని అర్థం చేసుకోవటానికి కొన్ని విషయాలున్నాయి. ఉత్తరం రాయబడిన తేదీని చూశాను. మేము డాక్టరును వెళ్లి కలిసే కాలానికి, ఐదేళ్ల క్రితం రాయబడి౦ది ఆ ఉత్తరం.
రోజూ మమ్మల్ని ఆయన ఇంటికి రప్పించుకుని కళ్లార్పకుండా చూడటానికి గల కారణం, కేవలం ఐదు రోజులుగా కొడుకును చూడకుండా, దిగులుపడ్డ నాకు ఇప్పుడు అర్థమవుతోంది.
ఇప్పుడు ఆ డాక్టరు లేరు, శీను కూడా లేడు.
మనిషి జీవితంలో మహా శోకమైన పుత్రశోకానికి మౌన సాక్ష్యంగా ఆ ఉత్తరమూ, నా బాల్య కాలపు జ్ఞాపకాలూ మాత్రమే నాలో మిగిలి ఉన్నాయి.
ఇప్పుడు అదనంగా, ఈ కథ కూడా!
![]()





Discussion about this post