• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఇంగ్లాండ్ కథ : విషవలయం

శొంఠి జయప్రకాష్ by శొంఠి జయప్రకాష్
May 25, 2026
in అనువాద కథలు
0
ఇంగ్లాండ్ కథ : విషవలయం

ఇంగ్లాండ్ కథ మూల రచయిత : సెక్స్టన్  బ్లేక్(Sexton Blake)
తెలుగు అనువాదం : శొంఠి జయప్రకాష్

రింగవుతున్న ఫోనెత్తాడు బ్లేక్.

అవతల అతని స్నేహితుడు ఇన్స్ పెక్టర్ పర్విస్ మాట్లాడుతున్నాడు .

“మిస్టర్ బ్లేక్! లార్డ్ వేన్ వారసుడైన కానన్ వింబర్లీ అనుమానాస్పద పరిస్థితుల్లో చచ్చిపడున్నాడు అతని లైబ్రరీగదిలో. అతని దగ్గర పనిచేసేవాళ్ళు ఈ ఉదయం ఆ విషయం కనుగొన్నారు. నువ్వు వెంటనే అక్కడికెళ్ళు. నేను ఈ ఉదయమే అక్కడికెళ్ళొచ్చాను..రమారమి తెల్లవారుఝాము రెండుగంటలకు క్యానన్ పాముకాటువల్ల మరణించాడని శవాన్ని పరీక్షించిన డాక్టర్  ధృవీకరించాడు. క్యానన్ ఒక సమర్ధుడైన జంతుశాస్త్రజ్ఞుడు.బ్రిటిష్ పక్షుల గురించి సంపూర్ణ అవగాహన కలవాడు. అతని సేవకులు – క్యానన్ నివాస భవనం వెనుకనున్న తోటలో, రకరకాలైన పక్షులు,  జంతువులుపెంచబడుతున్నాయి కాని వాటిలో పాముల్లాంటివి లేవు–అని ఖచ్చితముగా చెబుతున్నారు.

మొత్తం వ్యవహారమంతా గందరగోళంగా ఉంది.నేను కూడా నీతో పాటు వచ్చేవాడినే. మధ్యదారిలో కొంచెం పని తగిలింది.కాబట్టి నువ్వు తప్పక వెళ్ళాలి. మా స్టాఫ్ కన్నా నువ్వే ఈ కేసును బాగా పరిశోధించగలవు.” అని చెప్పి ముగించాడు ఇన్స్ పెక్టర్ పర్విస్. 

ఆ సమయానికి బ్లేక్ పనిఒత్తిడిలో ఉన్నాడు.  ఆ తోట అక్కడికి   దగ్గర్లోనే ఉంది కాబట్టి బ్లేక్ వెంటనే ఒప్పుకున్నాడు. 

ఆ ఇల్లు  ఎర్రని ఇటుకలతో పురాతనమైన పద్ధతిలో  కట్టబడింది. క్వీన్ అన్నే కాలానికి చెందినది. చెల్సా అనే ఇరుకు  వీధిలో ఉంది. ఇంటి వెనుక  విశాలమైన తోట. తోట చుట్టు ఎత్తైన గోడలతో ఏర్పరిచిన కైవారం. అక్కడి ప్రశాంత వాతావరణం– చదువు కొనడానికి ఏకాగ్రత ఆశించేవారికి అనువుగా ఉంది. 

గుర్తింపు కార్డు చూపి తాను వచ్చిన కారణం చెప్పగానే వయసు మీరిన ఒక సేవకుడు బ్లేక్ ను లైబ్రరీ లోనికి తీసుకెళ్లాడు. 

ఆ గది  చాలా విశాలంగా ఉంది. క్యానన్ వింబర్లీ విభిన్నమైన అభిరుచులు కలిగిన వాడే గాక తగిన ఆదాయ వనరులున్న వ్యక్తి కూడా.  

అపురూపమైన, ఖరీదైన మొట్టమొదటి పుస్తకాల ఎడిషన్స్  అరనిండా ఉన్నాయి. అమూల్యమైన లెదర్ తో తయారుచేయబడిన వస్తువులున్నాయి. అవి  బంగారుపూత పూయబడి, నాణ్యమైన కంచులోహంతో తాపడం చేయబడ్డాయి.  కొన్ని విశేషమైన, వినూత్న రీతిలో తయారుచేయబడిన పాలరాతి వస్తువులున్నాయి. 

ఒక కిటికి దగ్గర సమతలమైన పెద్ద టేబులు వేయబడి వుంది. దాన్ని చూడగానే,  వింత ప్రయోగాలు చేయడాని కుపయోగించబడుతున్నదని అర్థమౌతుంది. చచ్చిన జంతువుల చర్మం లోనికి గడ్డీ గాదమూ కూరి, అచ్చం ప్రాణమున్న వాటిగా తయారుచేయడానికి ఆ టేబుల్ని ఉపయోగిస్తున్న విషయం చెప్పకనే చెబుతూ వుంది.

బ్లేక్ వాటినన్నిటినీ పరిశీలిస్తూ అక్కడ వేచివున్న బట్లర్ వైపు చూస్తూ అడిగాడు.           

“శవాన్ని మొదట చూసిందెవరు?” 

“పనిమనిషి సార్! నేను డైనింగ్ రూములో ఉన్నప్పుడామె కేక వినబడింది. ఏదో ఘోరం జరిగిందని భయంతో వెంటనే పరుగెత్తుకొచ్చాను”

“అప్పుడు టైమెంతయింది?”

“దాదాపు ఏడుగంటలైవుంటుంది సార్” 

“అప్పుడు నువ్వేం చూశావో చెప్పు?”

“అప్పుడు లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఆ వర్కింగ్  టేబుల్ మీదున్న ఆకుపచ్చని లైటు కూడా వెలుగుతూ   వుంది.అక్కడ మా యజమాని పక్షులనూ, ఇతర సామాగ్రిని పెడుతుంటాడు.  నేను ఎందుకో కిందకు చూశాను. ఆ దృశ్యాన్ని చూడగానే నా గుండె ఆగిపోయినంత పనైంది. మా యజమాని నేలమీద పడిపోయివున్నాడు. ఇక్కడే సార్! ఆయన ఎంతో బాధను అనుభవించినవాడిలాగా  లుంగలు చుట్టుకొని పడివున్నాడు. నేను దగ్గరకెళ్ళి తాకీ తాకగానే ఆయన చనిపోయినట్లు తెలుసుకున్నాను. వెంటనే మా యజమాని స్నేహితుడైన డాక్టర్ హార్బరో గారికి ఫోన్ చేశాను. ఎప్పుడూ ఆయనే మా యజమానికి చికిత్స చేస్తుంటాడు. ఆయన సలహా మేరకే నేను పోలీసులకు కబురు చేశాను.”

“నువ్వు శవాన్ని తప్ప వేరే ఏమీ ముట్టుకోలేదు కదా?”

“లేదు సర్! లేదు.  గదిని శుభ్రం చేయడానికని వచ్చిన  పనిమనిషి, భయంతో  పెద్ద కేక పెట్టింది. వర్క్ టేబుల్ మీదున్న వస్తువులను ముట్టుకోకూడదని మాకు ముందుస్తు ఆదేశాలున్నాయి. కాబట్టి వేటినీ ముట్టుకోలేదు.”

“నాకు తెలుసు. చనిపోయేముందు  మీ యజమాని ఆ టేబుల్ మీద పనిచేశాడని. దానిమీద పడిఉన్న పక్షి ఎముకలు,అస్థిపంజరాన్ని చూసి అర్థం చేసుకొన్నాను. మేడమీదకెళ్ళాలి. దారి చూపించు.”

“అలాగే సర్! ఇటువైపురండి” అంటూ ఆ ముసలి నౌకరు దారి చూపించాడు. 

బ్లేక్ ఇదివరలో పాముకాటుచేత మరణించిన కేసులెన్నిటినో చూశాడు. చూడగానే అర్థమైంది, చావుకు కారణం పాముకాటేనని. సందేహంలేదు. డాక్టర్ చెప్పింది నిజం. సన్నని సూదితో గుచ్చినట్లు రెండు సూక్ష్మరంధ్రాలు కనబడ్డాయి- ఒకటి బొటనవేలి మూలం మీద, మరొకటి అరచేతిపైన. 

వాటిని నిశితంగా పరీక్షించాడు. రెండుకాట్ల మధ్య కనీసం మూడంగుళాలుంటుంది. వాటిమధ్య ఉన్న సంబంధాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరముంది. 

ఒకవేళ క్యానన్ పనివాళ్లకు తెలియకుండా ఒక విషసర్పాన్ని కలిగి ఉండాలి. లేక  పెంచుతూ ఉండాలి.  అజాగ్రత్త కారణంగా అది అతన్ని కాటువేసి ఉండవచ్చునని ఊహించవచ్చు. కానీ, పడిన ఆ రెండు కాట్లు– ఇప్పుడు కనబడుతున్న రీతిగా ఉండడానికి వీల్లేదు. సహజంగానైతే, రెండు కాట్ల మధ్యదూరం ఒక్క అంగుళం లోపలే ఉంటుంది. కానీ ఇక్కడ  మూడంగుళాలుంది. 

అతడు మళ్ళీ లైబ్రరీ కొచ్చాడు. పరిశోధన ముందుకు  సాగించడానికి ఏమైనా ఆధారాలు దొరుకుతాయోమోనని, ఆ గదిని క్షుణ్ణంగా వెతకసాగాడు. అయినా ఉపయోగం లేకపోయింది.         

అయితే ఒక్క అంశం అతను గమనించగలిగాడు. 

అంతకు ముందు క్యానన్ వింబర్లీ ఒక చిన్న  పార్సెల్ డెలివరీ తీసుకొన్నాడు–పోస్ట్ ద్వారా. చెత్త బుట్టను  వెతకగా అందులో ఒక బ్రౌన్ పేపర్ దొరికింది. అది బాగా నలపబడి మడతలు పడిఉంది. ఆ మడతలు ఏర్పడిన తీరును గమనిస్తే , చిన్న దీర్ఘచతురస్రాకారపు పెట్టె  ఇంతకుముందు అందులో ఉంచబడిందని నిర్ధారణ అయింది. ఆ పెట్టె ఎనిమిది అంగుళాల పొడవు, నాలుగంగుళాల వెడెల్పు కలిగి ఉందని ఊహించవచ్చు. ఆ కవరు మీద రెండేరెండు  స్టాంపులు అతికించబడి ఉన్నాయి. చాలా బరువు గల ఏ వస్తువైనా అందులో ఉంచి పంపించడానికి వీల్లేదని, ఆ కవరు పరిమాణాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక కాటువేయగల శక్తి వంతమైన పామును అందులో ఉంచి రవాణా చేయడం సాధ్యం కాని పని. 

గంట కొట్టి సేవకుణ్ణి పిలిచాడు. నలిగి మడతలుపడ్డ ఆ కాగితాన్ని చూపించాడతనికి. 

“ఈ  పెట్టె చుట్టూ కట్టిన కాగితమిది. ఇటువంటి పెట్టెలో ఏం ఉండి ఉండచ్చునో చెప్పగలవా?” అని అడిగాడు. 

ఆ ముసలతను దానివైపు అనుమానంగా చూశాడు. 

“మా యజమానికి  విచిత్రమైన వస్తువులు ఇటువంటి పార్సిళ్లలో వస్తుంటాయి. పలుప్రాంతాలనుండి పెట్టెల్లో రకరకాల పక్షులు, కీటకాల్ని ఎవరెవరో పంపిస్తుంటారు. మా యజమానికి  ఇటువంటి వాటిమీద ఆసక్తి ఉందని తెలిసే పంపిస్తుంటారు.”

” నాకర్థమైంది. కానీ, ఈ పెట్టె గురించి ఆలోచించు.”

“సర్! నిన్న ఒక పార్సిల్ వచ్చింది. నేనే దీన్ని తీసుకొన్నాను. ఎందుకంటే,ఇది ఉత్తరాల పెట్టెలో పట్టనటువంటి పెద్దది కాబట్టి. ఆ! ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంది. యజమాని ఆ సమయంలో ఏదో ఇతర పనిమీద నిమగ్నమై ఉన్నాడు. ఆయన దాన్ని తెరిచి, అందులో ఉన్నవాటి వైపు చూశాడు. వాటిలో చిన్నచిన్న ఎముకలు ఉన్నాయి. ఇప్పుడవి వర్క్ టేబుల్ మీదనే ఉన్నాయి చూడండి. ఆయన అందులోవి ఖాళీ చేసి,ఉత్త పెట్టె నాకిచ్చి పారేయమన్నాడు.”  

“ప్రస్తుతానికీ వివరాలు చాలు. థ్యాంక్స్.” చెప్పాడు బ్లేక్.

ఆ వ్యక్తి  వెళ్ళిపోయాడు.   

అక్కడున్న పరిస్థితులను బట్టి, క్యానన్ కింబర్లీ చనిపోయేముందు ఆ ఎముకలనే పరిశీలిస్తూ ఉన్నాడనే విషయం అతని బుర్రకుతట్టడంతో, ఏదైనా  క్లూ దొరుకుతుందని ఏ మాత్రం నమ్మకంలేకున్నా– బ్లేక్,  పక్షుల  ఎముకలను ఒకసారి పరీక్షించదలచాడు.

ఆ ఎముకల నిర్మాణంలో ఏదో ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మృదువుగా, తేలిగ్గా  ఉన్నా, చాలాగట్టిగా ఉన్నాయి.  దాని కపాలానికున్న ముక్కు చాలా పొడవుగా ఉంది. దాని చివర కొంచెం కిందకు వంగి ఉంది. రెక్కల ఎముకల్ని  ఉద్దేశ్యపూర్వకంగానే పగులగొట్టబడినట్లు అనిపిస్తోంది.  కానీ యాదృచ్చికంగా పగిలినట్లు చూపించడానికి ప్రయత్నించినట్టుగా, అవి  విచిత్రంగా కనబడుతున్నాయి. 

ఉన్నట్లుండి అతని నోటివెంట చిన్న ఈల వెలువడింది. చేత్తో పట్టుకొన్న ఎముక బోలు లోపల ఏదో ఒక  రకమైన అన్యపదార్థం ఉన్నట్టు కనుగొన్నాడు. 

పనిముట్ల పెట్టెలోనుండి చిన్న పట్టకారు తీసుకొన్నాడు. పదునుగా మొనదేలివున్న పట్టకారు రెండు కొసలతో లోపలున్న పదార్థాన్ని  బిగించి  పట్టుకొని శక్తికొద్దీ లాగాడు. బయటికొచ్చిన ఆ పదార్థమేమిటో పోల్చుకున్నాడు. క్యానన్ వింబర్లీ  ఏ విధంగా చనిపోయాడో అర్థమైంది.  

బ్లేక్–  ఎముక బోలు భాగం లోపలి నుండి తీసిన వస్తువు…ఏమంటే? . . .

అది  పాము యొక్క  విషపుకోర–  విషపు తిత్తితో సహా.

అది రాటిల్ స్నేక్ కోర.  

రాటిల్ స్నేక్ అంటే,  పాకుతున్నప్పుడు  గలగల శబ్దం చేసే  భయంకర విషసర్పం.  అది అమెరికాలో ఎక్కువగా కనబడుతుంది.

ఆ కోర–పాము నోటినుండి పెకలించినదని గుర్తించాడు. అందులో అనుమానమే లేదు. 

అత్యంత పకడ్బందీగా, ముందస్తు ప్రణాళికతో, పథకం ప్రకారం చేయబడిన క్రూర ఘోరమైన హత్య. 

హత్యకు కారణమేమైనా, హత్య చేసిన విధానం  సుస్పష్టం.

క్యానన్ వింబర్లీకి పక్షులమీదున్న వెర్రి అభిమానాన్ని ఆసరాగా చేసుకొని, పక్షి ఎముకలు పోస్టులో పంపబడ్డాయి. వాటిని అతడు  ఆసక్తిగా పరిశీలిస్తాడని కూడా  ముందుగానే ఉహించి  ఖచ్చితంగా  అంచనా వేయబడింది. 

క్రౌర్యం, నయవంచనలే  ధ్యేయంగా, పకడ్బందీగా పన్నిన ఉచ్చు. రాటిల్ స్నేక్ కోరల నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాన్నే ఈ పథకానికి వాడుకోవడం జరిగింది. 

చిన్న బఠాణీ గింజ పరిమాణంలో, గట్టిబాహ్య పొర కలిగిన విషపు సంచి, ఒర లాంటి గొట్టం, కోర వెనుక భాగంలో అమరి  ఉంటుంది. పాము కాటు వేసినప్పుడు, ఈ తిత్తిపై ఒత్తిడి పడుతుంది. కోర లోపలున్న చిన్న గాడి (మార్గం) గుండా విషం  ప్రవహించి, కోరమొన చర్మం లోనికి దిగడం వల్ల  ఏర్పడ్డ గాయం ద్వారా లోపలి చిమ్మబడుతుంది. 

విషపు తిత్తి మీద సూక్ష్మమైన  ఒత్తిడి పడినా చాలు. విషరవాణా ప్రక్రియ  జరిగిపోతుంది. ఈ కోర కలిగించే కాటు వల్ల ఏర్పడే రంధ్రం- సూదిగుచ్చుకున్నప్పుడు కలిగే రంధ్రం  పరిమాణం కంటే చిన్నదిగా  ఉంటుంది. పైగా కాటుపడినప్పుడు కలిగే నొప్పికూడా గుర్తించ లేనంత స్థాయిలో  ఉంటుంది. అంటే దాదాపు చురుక్కుమని కూడా అనిపించకపోవచ్చు. 

హంతకుడు, బతికున్న పాముకు మత్తుమందు ఎక్కించి, విషపుకోర,విషపు తిత్తిని ఊడబెరికి, పక్షి ఎముక డొల్ల లోపల అమర్చి ఉంటాడు. కోర యొక్క మొనదేలిన భాగం– ఎముక చివర కంటికి కనబడని విధంగా అమరి  ఉండేలా జాగ్రత్తలు తీసుకొని ఉంటాడు.

ఇంకా కొన్ని అంశాలు బ్లేక్ దృష్టికొచ్చాయి.

ఎముకను చేత్తో పట్టుకొన్నప్పుడు-దాని బహిర్భాగం ఒత్తిడికి తట్టుకునేందుకుగ్గాను  పల్చని బెండులాంటి కవరింగ్ వాడాడు హంతకుడు. ఎముకను పరిశీలిస్తున్న వ్యక్తిచేతికి  ఏదో ఒక క్షణంలో కోరపు మొన తగిలి తీరుతుంది. అతి స్వల్పమైన తాకిడి చాలు–  చర్మం లోపలికి దిగబడి పోతుంది. దాని పర్యవసానం? భయంకర విషం రక్తంలోకి వెళ్లి  రక్తాన్ని గడ్డకట్టిస్తుంది. క్యానన్ లాంటి వయో వృద్ధులకు మరణం ప్రాప్తిస్తుంది.  

క్యానన్ చేతిమీద  పడిన రెండు కాట్ల మధ్య దూరమే తెలియజేస్తుంది– దాని వెనుక పన్నిన పన్నాగం. చిట్లిన ఎముకను పరీక్షిస్తున్నప్పుడు, ముందుకు పొడుచుకువచ్చి కంటికి  కనీ కనబడని కోరపు మొన,  అతని బొటనవేలి దిగువ భాగం చర్మంలోపలికి  దిగబడి వుంటుంది. దాన్నిపట్టించుకోకుండా,తాను చేస్తున్న పని కొనసాగించివుంటాడు. అప్పుడు రెండవసారి అరచేతికి గుచ్చుకొనివుంటుంది. 

ఏ మాత్రం పరిగణనలోనికిరాని ఆ రెండు చిన్న గాయాలు చాలా ప్రమాదకరమైనవనే విషయం, అతనికి గంటా రెండు గంటల తరువాత గానీ బుర్రకెక్కివుండదు.              

విషం శరీరంలోకెక్కి తీవ్రమైన నొప్పి కలిగిన తరువాత గానీ ప్రమాదాన్ని పసికట్ట లేకపోయాడు. సహాయం కొరకు ఎవరికైనా ఫోను చేయడానికి కూడా చేతకానంతగా బిగుసుకు పోయింది అతని శరీరం.   

బ్లేక్ విషపు కోరను పట్టకారుతో బిగించిపట్టుకొని ఎముక డొల్ల లోపల యధాస్థానంలో ఉంచాడు. 

ఆ తరువాత పలువురు ప్రఖ్యాత  జూ యజమానులకు, డీలర్లకు పనిమనిషి ద్వారా రిప్లై టెలిగ్రాములిప్పించాడు. 

రాటిల్ స్నేక్ ఇంగ్లాండులో ఎక్కడా కనబడదు. ఐదు వేలమందిలో కనీసం  ఒక్కరు కూడా  అటువంటి రకపు  పామును  చూసివుండరు. జూ లో కూడా కనబడదు. 

హంతకుడు – అడవి జంతువుల  పెంపకం దార్లనుండి పాముని సంపాదించివుంటాడు. తానిప్పించిన టెలిగ్రాముల్లో కనీసం ఒక్కదానికైనా స్పందన వస్తుందని నమ్మకంతో ఉన్నాడు బ్లేక్. తరువాత మేడమీద కెళ్ళాడు. ఏదైనా క్లూ దొరుకుతుందనే ఆశతో. 

క్యానన్ వింబర్లీ – అతని మేనమామైన లార్డ్ వేన్ కు వారసుడు. కానీ లార్డ్ వేన్, క్యానన్ కన్నా వయసులో చాలా సంవత్సరాల చిన్న వాడైనందున, ఆస్థికి వారసుడు కావడానికి అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. కాబట్టి ఆ సమస్యకూడా  పరిష్కరింపబడాల్సివుంది. 

మరేవైనా కొత్త సంగతులు తెలుస్తాయేమోనని, బ్లేక్ హతుని దుస్తులు వెతికాడు. ఒక కాగితం గానీ, సందేశం గానీ, అడ్రస్ గానీ దొరుకుతుందని.

ఫలితం లేకపోయింది. 

క్రమంగా అతనిలో నిరాశ ఆవరించింది. మళ్ళీ శవం దగ్గరకొచ్చి వెతకసాగాడు.

ఎలాగైతేనేం?   అతని ప్రయత్నం ఫలించింది. శవం మెడలో నల్లని దారాన్ని కనుగొన్నాడు. ఆ దారానికి చిన్న శిలువా, ఒక వెండి రంగు చిన్న తాళం చెవి వేలాడుతున్నాయి. తాళం చెవి మరీ చిన్నగా ఉంది.

తాళం చెవిని జాగ్రత్తగా విడిపించి, అరచేతిలో పెట్టుకొన్నాడు అటుఇటు కదులుతున్న దాన్నిపడిపోకుండా  బ్యాలెన్స్ చేస్తూ.  ఆ హత్యకు, తాళం చెవికీ ఏదో సంబంధం తప్పక ఉంటుందనుకొంటూ, ఆ గదినంతా కలయజూశాడు. తాళం చెవి పట్టదగ్గ సరైన  వస్తువేదీ కనబడలేదు. లైబ్రరీకి తిరిగి చేరుకొన్నాడు. 

చివరకు చాలాసేపు వెతికిన తరువాత అతని ప్రయత్నం ఫలించింది. ఒక పెద్ద బీరువా అడుగు భాగం,  అతని దృష్టినాకర్షించింది. బీరువాకు అనుసంధానమై ఉన్న ఒక  అర ఉందక్కడ. ఆ అర తెరువగా, దాని లోపల  ఆసక్తి కలిగించే అనేకమైన వస్తువులు కనబడ్డాయి.అవి మెక్సికన్ కళానైపుణ్యంతో తయారైనవి. వాటి  వెనుక  భరిణె లాంటి చిన్న పెట్టె కనుగొన్నాడు.ఆ పెట్టె డిజైన్ చూడగానే తెలిసి పోతూ   ఉంది, అవి మెక్సికన్ ఇండియన్ తయారీవని. అతని చేతిలో ఉన్న తాళం చెవి కూడా మెక్సికన్   తయారీయే.

కాబట్టి, తన చేతిలోవున్న తాళం చెవి ఆ పెట్టెకు సంబంధించినదే అని అంచనా వేశాడు. 

బీరువా సులభంగా తెరవగలిగాడు కానీ చిన్నపెట్టె  తెరవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఎందుకంటే అపారమైన తెలివితేటలనుపయోగించి ఆ తాళం చెవిని తయారుచేసి వుండడమే. ఒక్క చెవి నుపయోగించి అనేక తాళాల్ని తీయగలిగినట్టి మాస్టర్   కీ ని రూపొందించిన అనుభవమున్న నిపుణుడు కూడా విస్మయపడేలాగా ఉంది దాని తయారీ విధానం. అసలు కీ హోల్  ఎక్కడుందో అంతుబట్ట లేదు.  ఎట్టకేలకు తెరవగలిగాడు. 

ఆ పెట్టె లోపల కొన్ని కాగితాలున్నాయి. వాటిమీద మాసిన పసుపురంగు అట్టముక్క వుంది- విజిటింగ్ కార్డు సైజులో.  దానిమీద ఏమీ రాయబడలేదు. కానీ కార్డు మధ్యభాగాన మాత్రం , నల్లని రంగుతో చిన్నపాటి డైమండ్ ఆకారం ముద్రించివుంది. అది మామూలు పేకముక్కల్లోని డైమండ్ గుర్తును  పోలి వుండి అంతే సైజుంటుంది. దాన్నుండి  చూపులు మరల్చి  పెట్టెలోవున్న కాగితాల వంక చూశాడు.అవి జాగ్రత్తగా రేపర్ లో చుట్టి సీలు చేయబడ్డాయి. దానిపైన ఇలా రాసుంది 

“నేను మరణించాక మాత్రమే  దీన్ని తెరవాలి”   

అది  చదివి బ్లేక్  కొంచెం సంశయించాడు. ఎందుకంటే, మరణ శాసనాన్ని అమలు జరిపే ఎక్జిక్యూటివ్ కు ఆ ప్యాకెట్ నందజేయాలి. కానీ ఆ కేసు ప్రాముఖ్యత , అత్యవసరస్థితి దృష్ట్యా, ఉచితానుచితాలను పక్కనబెట్టి ఆ ప్యాకెట్ ను తెరవడానికి నిశ్చయించుకున్నాడు. హత్యాకారణం తెలుసుకోవడం ముఖ్యం. 

ప్యాకెట్ కున్న రేపర్ ను తొలగించాడు. అందులోని కాగితాల్ని బయటికి లాగాడు. 

మొదటి పేజీ మీద తేదీ 1870 అని ఉంది.

అతని కళ్ళు మిగతా అక్షరాల వెంట పరుగులు తీశాయి.

” ఇంగ్లాండు  లోని నా స్నేహితులకు గానీ, బంధువులకు గానీ, ఇతరులెవరికి గానీ తెలియని నా జీవితంలోని ఒక రహస్య అధ్యాయం   ఇది. ఈ  విషయం తెలుసుకొని ఎవ్వరూ బాధపడకూడదనే నా ఆకాంక్ష. అందుకే వారూ, నేనూ, ఈ ఐహిక ప్రపంచం నుండి  నిష్క్రమించేదాకా, ఇందులోని వివరాలు బహిర్గతం కాకూడదని నా కోరిక. 

“1870 సంవత్సరంలో, రెండేండ్ల క్రితం – నేను ఆక్స్ ఫర్డ్ నుంచి తిరిగొచ్చాక, చర్చిలో నా వృత్తి జీవితాన్ని ప్రారంభించే ముందు, కొన్నాళ్లపాటు ఇతర దేశాలు తిరిగి రావాలనుకున్నాను. యూరపు దేశాల రాజధానులను చాలామటుకు సందర్శించాక అమెరికా వెళ్లి, అక్కడినుండి మెక్సికో వెళ్లాను.”

“అక్కడున్న సమయంలో కొంతకాలం పాటు రాజకీయాలలో చేరి ప్రజాసేవ చేద్దామనుకున్నాను. అక్కడ పేదవారి బతుకులు అధ్వాన్నంగా, అతి దయనీయంగా, భయానకంగా ఉన్నాయి. వారి మీద ఉన్నతాధికారులు జరిపే అఘాయిత్యాలు, అత్యాచారాలు పెచ్చుమీరి పోయాయి. అవి నేను కళ్లారా చూసి చలించిపోయాను. పాలకుల  నిరంకుశ వైఖరి నా మనసును కలచివేసింది.

ఆ దేశాధినేత దుశ్చర్యలు – సదా న్యాయాన్ని అభిలషించే ‘నా లోపలి మనిషిని’  అమితంగా బాధించాయి. అలాంటి  భావోద్రేక స్థితిలో ఒక దృఢనిశ్చయానికొచ్చాను.  స్పానిష్ , మెక్సికోకు చెందిన అనేకమంది  యువకుల ముఠాతో కలిసి ఆ రాత్రి భోజనానికి హాజరయ్యాను. ఆ దేశ పాలకుణ్ణి పదవీచ్యుతుడిని  చేయాలనే నా సంకల్పానికి వారు వత్తాసు పలికారు. ఆ ముఠా తీయని మాటలకు నేను లొంగిపోయాను. అత్యుత్సాహం నన్ను పురికొల్పగా , ‘ఏ ఒక్క సంఘం గానీ, ఏ ఒక్క రాజకీయ ముఠాగానీ ప్రస్తుత పరిపాలకుణ్ణి పదవి నుంచి కూలదోస్తుందో, అట్టి  ముఠాలోనికి చేరిపోతాను’  అని ఆవేశంలో, గట్టిగా ప్రకటించేశాను.”

“అప్పుడే ‘బ్లాక్ డైమండ్’ అనే సంఘం గురించి తెలిసింది. ఎన్నో ఏళ్ళక్రితం స్థాపించబడిన తీవ్రవాద రాజకీయ తిరుగు బాటు దారుల ముఠా అది. ఆ ముఠా వెనుక అంతుబట్టని నిగూఢ  విషయాలున్నాయని, జనం దాదాపు చెడుగానే చెప్పుకొంటారు. కానీ ఎవరికీ పూర్తి వివరాలు తెలియవు. నేను కూడా ముందు వెనుకా ఆలోచించకుండా అత్యుత్సాహం కనబరచాను. 

“నేను ఆ రాత్రి భోజనం  చేసిన రోజు ఆ సొసైటీ సభ్యులు ముగ్గురు మాత్రమే ఉన్నారు.నా ఆవేశం గమనించి, ఆ ముగ్గురూ నా వద్దకొచ్చారు. 

‘నువ్వు నిజంగానే సొసైటీలో చేరాలనుకుంటున్నావా?’  అని అడిగారు. 

‘ఔను. తప్పకుండా  చేరాలనుకుంటున్నాను.’ అని బదులిచ్చాను–  చల్లారని ఆవేశంలో. ఆ ముగ్గురూ కరుడుగట్టిన కసాయివాళ్ళని తెలుసు.అయినా, నేను  వెనక్కి తగ్గలేదు.

‘నీవు  ఒక్కసారి సొసైటీలో చేరాక,   నిబంధనలు పాటించాలి.  ఉల్లంఘిస్తే  నీ ప్రాణాలే పోగొట్టుకోవలసివస్తుంది. నీవు ఇంగ్లీషు వాడివి. కాబట్టి రిస్క్ తీసుకోవడానికి భయపడతావు’ అని దెప్పిపొడిచారు. దాంతో నా నిర్ణయం మరింత బలపడింది. 

‘నేను దేనికీ భయపడేవాణ్ణికాను.’ అని మాటకు మాట బదులిచ్చాను. మెక్సికో దేశంలో, అప్పట్లో  ఇంగ్లీష్ వాళ్లకు అంతగా ప్రాబల్యం లేదు. 

‘అలాగైతే సరే! రేపు రాత్రికి మీటింగుంది. రేపు మేమిక్కడికొస్తాము. అప్పటికీ నీవు ఇష్టపడితే అప్పుడు నిన్ను చేర్చు కొంటాము.’ అని వెళ్లిపోయారు.

‘‘తరువాత ఏం జరిగిందో క్లుప్తంగా చెబుతాను..                           

పరిచయ కార్యక్రమం గురించి నేనిక్కడ రాయలేను. నాతో ప్రతిజ్ఞ చేయించారు. ఎలాంటి దుష్కార్యము చేయబోతున్నానో అప్పటికీ నేను గ్రహించలేదు. వివేకం నశించింది నాలో. అంతా అయిపోయిన తరువాత, నేను ఒక  ఉన్మాద నేర ప్రవృత్తిగల  ముఠాలో చేరినట్లు తెలుసుకున్నాక నేనెంత మానసిక హింస అనుభవించి ఉంటానో ఊహించుకోండి. నిజం చెప్పాలంటే అది హత్యలు చేయించే క్లబ్. 

“వారి కార్యసరళి ఇలా ఉంటుంది. నలభై మంది సభ్యులందరూ ఒక పెద్ద టేబుల్ చుట్టూ కూర్చొంటారు. నంబర్ల వారీగా కార్డులను ఒక సంచిలో వేసి కలియబెడతారు. ఆ కార్డులన్నీ ఖాళీగా ఉంటాయి. ఒకే ఒక్క కార్డుమీద మాత్రం బ్లాక్ డైమండ్ ఆకారం ముద్రించబడి ఉంటుంది. అందరూ అందులోంచి  ఒక్కొక్క కార్డు తీసినప్పుడు, ఎవరి చేతికైతే నల్లని డైమండ్ గుర్తు గల కార్డు వస్తుందో, వారు -సొసైటీని ద్వేషిస్తున్న లేక ఆక్షేపిస్తున్న వ్యక్తులను హత్య చేయాలి. ఏ కారణం చేతనైనా అలా చంపక పొతే, ఆ కార్డు తీసిన వాడు చావడానికి సిద్ధపడాలి. వెర్రితనం, ఉన్మాదం, కరుడుగట్టిన కసాయి చర్య గాక మరేమిటి?

“నా దురదృష్టం. ముందుగానే అందరూ కలసి కుట్రపన్ని, ఎంతో నేర్పుతో, నయవంచనతో   ఆ బ్లాక్ డైమండ్ గుర్తు గల  కార్డు ఆ రాత్రి నేను తీసేలా చేశారు. ఆ కార్డు నా  చేతికి రాగానే , కోపంతో విసురుగా టేబుల్ మీద గిరవాటేశాను. పిచ్చిపట్టిన సింహంలా గర్జిస్తూ,  చిందులు తొక్కాను. అల్లకల్లోలం సృష్టించాను. ‘ఈ భూప్రపంచంలో ఈ హత్య చేయమని నన్ను ఎవ్వరూ బలవంతం చేయలేరు. మీరు నన్ను చంపినా సరే. ఈ హత్య నేను చేయను’ అని తీవ్రంగా ప్రతిఘటించాను.                                

తరువాత నేనక్కడ్నుంచి వొచ్చేశాను.మరునాటి ఉదయం ఆ బ్లాక్  కార్డు– సీల్డ్ కవర్లో ఒక వ్యక్తి ద్వారా నాకు అందజేయబడింది. అదే రోజు సాయంత్రం ఆ సిటీ నుంచి బయటపడ్డాను . సాధ్యమైనంత తొందరగా అమెరికా నుంచి వెళ్ళిపోవాలి. ఇంగ్లాండ్ చేరుకున్న తరువాత రెండుసార్లు నాకు బెదిరింపు లేఖలొచ్చాయి. కానీ పోయిన ఒక  సంవత్సరం నుండి వారి గురించి నేనేమీ వినలేదు. ఆ హంతక ముఠా విచ్చిన్నమై ఉంటుందని  ఊహించాను. ఈ వాంగ్మూలాన్నెందుకు రాస్తున్నానంటే, ముందువెనకలాలోచించకుండా, దుందుడుకుతనంతో నేరసామ్రాజ్య విషవలయంలో  ఇరుక్కుంటే, నాలాంటి యువకులు ఎంత ప్రమాదకర పరిస్థితుల నెదుర్కోవాల్సి వస్తుందో, లోకానికి  చాటి చెప్పడానికీ, మరియు, నా అంతస్సాక్షిని చల్లబరచుకోవడానిక్కూడా. పవిత్రమైన పరలోకం నుండి చివరి పిలుపును అందుకోబోయే ముందు, నేను చేసిన తప్పును సరిదిద్దమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.”

(సైన్డ్ 🙂 చార్లెస్ వింబర్లీ  

చదివిన కాగితాన్ని బ్లేక్ కింద పెట్టాడు. కిటికీలోంచి తదేకంగా బయటికి చూస్తుండిపోయాడు. 

‘నలభై సంవత్సరాల క్రితమా!?’  

‘అసాధ్యం!. . . అయినా ఏదీ అసాధ్యం కాదు. దీని వెనుక ఇది తప్ప వేరేకారణం ఉండడానికి ఆస్కారం లేదు. మామూలుగా  ఒక మెక్సికన్- కుతూహలం  కలిగించే  ఆలోచనపట్ల జిజ్ఞాస కలిగివుంటాడు. అతని లక్ష్యం  సాధించుకోవడానికి దాదాపు ఒక సగం తరం కాలం పాటు వేచివున్నాడంటే, అది అత్యంత ఆశ్చర్యకరమైన విషయమే. నమ్మలేని నిజం                                                

అలా ఆలోచనల్లో మునిగివున్న బ్లేక్, బట్లర్ రాకతో తెప్పరిల్లాడు. బట్లర్ ఇచ్చిన మూడు ఉత్తరాలను అందుకొన్నాడు.  ఆత్రంగా వాటిని చించి చదివాడు. మొదటి రెండింటిలోనూ ఉపయోగపడే సమాచారమేమీ లేదు. మూడోది ప్రపంచ ప్రఖ్యాత డీలర్ నుండి వచ్చింది. అతనికి కావాల్సిన వివరాలు లభించాయి.

“పోయిన వారం మీరు అడిగిన రకాలకు సంబంధించి రెండు యూనిట్లు, ఆండర్సన్ అనే వ్యక్తికి అమ్మడం జరిగింది. వాటిని అమ్మిన మా సేల్స్ మ్యాన్ మీ కోసం ఈ రాత్రి వేచివుండగలడు.” అని ఆ టెలిగ్రామ్ లో తెలుపబడివుంది. 

బ్లేక్ కు, టెలిగ్రామ్ పంపించిన వ్యాపారితో ఇంతకుముందు లావాదేవీలున్నాయి. అతడు టెలిగ్రామ్ కాగితాన్ని చేత్తో నలిపి జేబులో పెట్టుకొన్నాడు. ఆ కాగితాల్ని భరిణెలో యధాతధంగా ఉంచాడు. తాళం బిగించి పెట్టెల్నీ, రేపింగ్ పేపర్లను తీసుకొని గదికి తిరిగొచ్చాడు. 

టెలిగ్రాంలో పేర్కొనబడిన  మిచెల్ అనే సేల్స్ మ్యాన్ సిద్ధంగా ఉన్నాడు.  

“మా యజమాని , మిమ్మల్ని నేను కలిసి మాట్లాడితేనే ఉపయోగకరంగా ఉంటుందని భావించారు సర్- ఇందులో ఏదో గందరగోళం ఉంటుందని ముందుగానే  ఉహించి. ఏవైనా ప్రశ్నలడగదలచుకొంటే నన్ను అడగండి.” అన్నాడు మిచెల్. 

“మిస్టర్ మిచెల్! మీరు చెప్పింది అక్షరాలా నిజం. చాలా సంతోషం. పాములమ్మేది మీరే అనుకొంటాను.” అడిగాడు బ్లేక్.

“అవును సర్! మా బాస్ ఊర్లో లేరు. నేనే బాధ్యుడుగా వ్యవహరిస్తున్నాను.”

“మీ దగ్గరకొచ్చిన వ్యక్తిని గురించి చెప్పండి.?”

“సర్! అతని పేరు ఆండర్సన్ అని చెప్పి తనకు తానే పరిచయం చేసుకొన్నాడు.

అతడు పొట్టిగా, చక్కని కనుముక్కు తీరు కలిగి శుభ్రమైన దుస్తులు వేసుకొన్నాడు. నీటుగా కత్తిరించుకున్న గోధుమరంగు గడ్డంతో, మైనం రంగు మీసాలతో, చిక్కటి నలుపు రంగు కళ్ళు, కనుబొమలతో ఆకర్షణీయంగా ఉన్నాడు. విదేశీ యాసలో మాట్లాడాడు. మా వ్యాపార పరిధిలోకి, రకరకాల వ్యక్తులు, వివిధ మనస్తత్వాల మనుషులు  ప్రవేశిస్తుంటారు. వాళ్ళెలాంటి వాళ్ళో సరిగ్గా అంచనా వేయగల నేర్పూ, అనుభవం ఉంది మాకు. అందులో దాదాపు  ఎలాంటి పొరబాటు ఉండదు. ఆండర్సన్  స్పెయిన్ నుంచి గానీ, మెక్సికో నుంచి గానీ లేకపొతే బ్రెజిల్ నుంచి గానీ వచ్చుంటాడు. పైగా అతను తనకుతాను ఆండర్సన్ అని చెప్పుకొన్నాడు.”

అది విన్న బ్లేక్ కళ్ళు మెరిసాయి. 

“వయసు ఎంత ఉంటుంది?”

“చెప్పడం కొంచెం కష్టమే. అతన్ని చూస్తే యాభై ఐదుకు మించవనిపిస్తుంది. అతని నడకను   చూస్తే మాత్రం అరవై ఏళ్లకు పైబడి ఉంటాడు. ఇంకా ఎక్కువగానే ఉండొచ్చునేమో. ఒళ్లును బాగా అదుపులో ఉంచుకొన్నాడు.”

“అతనికేం కావాలని అడిగాడు.?”

“ఆహారాన్ని వెతుక్కుంటూ దొంగ దాపరికంగా, ఆకలి గొన్న జంతువులా ఆవురావురంటూ వచ్చాడు. వచ్చీరాగానే, ‘మీకు అభ్యంతరం లేకపొతే, మీ  ప్రాంగణాన్నొకమారు  చూడొచ్చా?’  అని అడిగాడు. నేను ‘సరే’ అని జంతుశాలనంతా తిప్పాను. కొత్తగా వచ్చిన జీవాల్ని చూపించాను. అప్పుడతను ‘మీ దగ్గర పాములు దొరుకుతాయా? నా స్నేహితుడొకడు పాముల్ని సేకరించి పెంచుకొంటున్నాడు. అతని కోసం కావాలి’  అని అడిగాడు. అప్పుడు నేను మా దగ్గర గజ్జెల తోక పాములు (రాటిల్  స్నేక్స్)  సవన్నా రకానికి చెందినవి  ఉన్నాయని వాటిని చూపించేసరికి, అతని ఆనందానికంతులేదు.ఎగిరి గంతులేసినంత పని చేశాడు. రెండు పాముల్ని కొంటానన్నాడు. వాటిని అతని అడ్రస్ కు పంపిస్తానంటే వద్దన్నాడు.ఒక పెట్టెలో భద్రంగా పెట్టిస్తే చాలన్నాడు. అతను చెప్పినట్లుగానే చేశాను. కొన్ని పాలు ప్యాక్ చేసిచ్చి, వాటికెలా పాలు తాగించాలో, ఎలా వెచ్చదనం కలిగించాలో కొన్ని సూచనలిచ్చాను. వాటి ఖరీదు చెల్లించాడు. మరికొంత డబ్బిచ్చి తనకొక గుర్రబ్బండీని చూసిపెట్టమన్నాడు.”

“వాటికి కోరలు తొలగించలేదనుకుంటాను.” 

“లేదు సర్! అతడెళ్ళిపోయాక ఈ సిగరెట్ కేసు దొరికింది నాకు. అతడు మరచి ఇక్కడనే వొదిలి పోయాడు. మా యజమానికి తెలిపాను. ఆయన దాన్ని లాకర్ లో ఉంచి, తాళం చెవి నాదగ్గర్నే ఉంచుకొమ్మన్నాడు. ఎక్కడికి పంపించాలో తెలియలేదు.” అంటూ టిష్యు పేపర్ లో చుట్టివుంచబడిన  చిన్న ప్యాకెట్ ను ఇచ్చాడు. 

బ్లేక్ ఆ ప్యాకెట్ ను జాగ్రత్తగా విప్పి , అందులోనుంచి ఒక సిగరెట్ కేసును బయటికి తీశాడు.

దాని మీద ‘వై.ఎం.’ అనే ఇంగ్లీష్  అక్షరాలూ చెక్కబడివున్నాయి. దాని అంచులు పట్టుకొని భూతద్దంలోంచి పరీక్షించాడు. 

“మిస్టర్ మిచెల్! నీవు అయిదు పౌండ్ల బహుమానం స్వీకరించడానికి అర్హుడివి. ప్రస్తుతానికి దీన్ని నా వద్దనే ఉంచుకుంటాను. ఇక చెప్పడానికేమీ లేదు. నీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  గుడ్ నైట్.”

                                                                  ******

మూడు రోజుల తరువాత ఇన్స్‌పెక్టర్ పర్విస్, బ్లేక్ ను గదిలో కలుసుకున్నాడు.  కొంచెం నిరుత్సాహం అతని మోహంలో కనిపిస్తూ ఉంది. 

“మిస్టర్  బ్లేక్! క్యానన్ వింబర్లీ కేస్ ఎంతవరకూ వచ్చింది?”

“మిస్టర్ పర్విస్! నీ కెప్పుడిష్టమైతే అప్పుడు హంతకుణ్ణి అరెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో నేను మీకు సహాయం చేస్తాను.” అని బ్లేక్ బదులిచ్చినప్పుడు, ఇన్స్‌పెక్టర్ ఆశ్చర్యంతో చిన్న ఈల వేసి,

“ఏమిటీ హంతకుడా? ఇది హత్య కేసా? నిజమా?  ఇందులో చాలా తికమక ఉందనుకొన్నానే కానీ, హత్య అనుకోలేదు. ఇందుకు సంబంధించిన సమాచారమేదీ సంపాదించ లేక పోయాను.”

“నేను సంపాదించాను మిస్టర్ పర్విస్. నిన్న రాత్రి హంతకునితో, ఒకే టేబుల్ ను పంచుకొని కలసి భోంచేశాను. మాట్లాడాను కూడా.”

ఇన్స్‌పెక్టర్ పర్విస్ మళ్ళీ చిన్న ఈల వేశాడు.              

“ఎవరతను? అరగంటలో అరెస్ట్ వారంట్ తెప్పిస్తాను.”

“అతని పేరు సెనార్ మాన్యువల్ వైటర్బ్. పేరుపొందిన మెక్సికో కుటుంబానికి చెందిన వాడు. నిన్నక్కడికి తీసుకెళ్తాను.”

                                           *****

ఒక గంట గడిచాక, బ్లేక్ తో పాటు ఇన్స్‌పెక్టర్ పర్విస్ ఆ ప్రాంతంలో, ప్రసిద్ధ   లొకాలిటీలో ఉన్న అపార్టుమెంటులోని   రెండవ ఫ్లోర్ చేరుకున్నారు. 

విదేశీయుడుగా కనిపిస్తున్న  సేవకుడు ఇద్దరినీ లోపలకు మాత్రమే  రమ్మని మాత్రమే అనుమతించాడు. అయినా అతన్ని తోసుకొని సిట్టింగ్  రూములోకి ప్రవేశించారు. 

లోపల, ఒక పెద్దమనిషి, ఖరీదైన దుస్తులు ధరించి మంచి నాణ్యమైన సిగార్ పీల్చుతూ, కట్టెల పొయ్యి మంట ముందు కూర్చున్నాడు. 

“అతడే” బ్లేక్ చూపించాడు, ఇన్స్ పెక్టరుకు.

“మిస్టర్ వైటర్బ్! ఈయన స్కాట్లాండ్ ఇన్స్ పెక్టర్  పర్విస్. క్యానన్ వింబర్లీని  హత్య చేసిన నేరానికి నిన్ను అరెస్ట్ చేయడానికొచ్చాడు.”

వైటర్బ్, వాళ్ళు లోపలి రావడం చూసి లేవబోయి మళ్ళీ కూర్చొన్నాడు. ప్రశాంతంగా సిగార్ కాల్చ సాగాడు. 

“నేనే హత్య చేశాననడానికేమైనా సాక్ష్యం ఉందా?” అని అడిగాడు అతని యాసలో. 

బ్లేక్ కొన్ని ఫోటోలు, సిగరెట్ కేసు, పక్షిఎముకలు టేబుల్ మీద పెట్టాడు. 

“ఇవిగో సాక్ష్యాలు. క్యానన్ వింబర్లీ  చనిపోయిన ఉదయం, ఒక పార్సల్ ని డెలివరీ తీసుకొన్నాడు. అందులో ఇవిగో ఈ ఎముకలున్నాయి. చూడండీ మిస్టర్ పర్విస్! రాటిల్ స్నేక్  కోర- చాలా తెలివిగా ఈ ఎముకలోనికి  ప్రవేశపెట్టబడింది.  ఎలాగంటే కోర యొక్క సూది లాంటి మొన కంటికి కనీ కనిపించకుండా , కొద్దిగా ముందుకువచ్చేట్టు అమర్చబడింది.  ఎవరైనా ఎముకల్ని చేతుల్లోకి తీసుకొంటే, ఈ సూదిలాంటి సూక్ష్మ మైన కోరపు మొన తగిలి తీరుతుంది. అప్పుడు కోరలోనుంచి విషం శరీరం లోనికి చేరుతుంది. ఈ విష ప్రసార ప్రక్రియ జరగడానికి, మొన మీద  స్వల్పాతి స్వల్పమైన ఒత్తిడిపడితే  చాలు. ఈ విధంగా క్యానన్ వింబర్లీ చేతిమీద రెండుకాట్లు పడ్డాయి. అతను  చనిపోయాడు.                                                                          

“నేను వెంటనే జంతువుల వ్యాపారులందరికీ టెలిగ్రాములిచ్చాను. వెంటనే నాకు ఒక డీలర్ నుంచి ఉపయోగకరమైన సమాచారం లభిoచింది. ఒక  విదేశీయుడు, ఆండర్సన్ అను పేరుగలవ్యక్తి ఇటీవలనే రెండు పాములు కొనుక్కుపోయాడు.  అతను అక్కడినుండి నిష్క్రమించేముందు , ‘ఎం.వై.’ అను అక్షరాలు చెక్కబడిన సిగరెట్ కేసును మరచిపోయాడు.”

“సిగరెట్ కేసు మీద పౌడర్ చల్లి జాగ్రత్తగా వేలిముద్రల్ని ఫోటో తీసి ఫలితాలు రాబట్టాను. ఈ ఫోటోలలో ప్రస్ఫుటముగా కనిపించే మూడు జతల వేలిముద్రలున్నాయి. A అని గుర్తించిన వేలిముద్రలు మిచెల్ అనే వ్యక్తివి. B గుర్తుగలవి అతని యజమానివి. మిగతా తొమ్మిది, సిగరెట్ కేసు స్వంత దారుడివి.” 

“క్యాన్ వింబర్లీ తానూ చేసిన తప్పును అంగీకరిస్తూ నలభై ఏళ్ళ క్రితం రాసిన ఉత్తరం ద్వారా తెలిసిందేమంటే, . . మెక్సికోలో ‘బ్లాక్  డైమండ్’ అనే  హత్యలు చేయించే క్లబ్బు  ఉంది. అందులో చేరాడు క్యానన్. క్లబ్బు సభ్యుల అతిదారుణ క్రూర ఉద్దేశాలతో కూడిన అసలు రంగు తెలుసుకొని, హత్యచేయమని ఇచ్చిన ఆదేశాల్ని పాటించక ఎదురు తిరిగాడు. చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించాడు.”

“క్లబ్ సభ్యులందరూ సమాజంలో మంచి హోదా, స్థాయీ  ఉన్నవారే. కాబట్టి నేను ఒక మెక్సికన్ లేదా స్పానియార్డ్ కోసం వెతికాను అతని పేరులోని పొట్టిఅక్షరాలు నాకు ముందేతెలుసు. అందునా అందరికీ పరిచయమున్న పేరు. మెక్సికన్ దౌత్యప్రతినిధిని సంప్రదించాను. ఒకానొక కార్యదర్శి, ఇటీవలనే నగరానికొచ్చిన సెనర్ మాన్యువల్ వైటర్బ్ పేరును సూచించాడు. అతడు పేరుపొందిన రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటాడు. అంతేగాక  ఆయన కొన్ని అదనపు వివరాలందించాడు, రహస్యంగా.”

“ఈ వైటర్బ్ యువకుడిగా ఉన్నప్పుడు ఆటవిక  ప్రవృత్తి గల  పరమ దుర్మార్గుడు. తీవ్రవాద భావజాలం కలిగిన వాడు. ప్రసిద్ధ ద్వంద యుద్ధ ప్రవీణుడు. ఇప్పుడు, అరవై దాటాక కూడా జూదగృహం నిర్వహిస్తూ ఉంటాడు. ఎప్పుడో మూతపడిన బ్లాక్ డైమండ్ క్లబ్ కార్యనిర్వాహకుడు..

అతను పేరుపొందిన రెస్టారెంట్లలో భోంచేస్తావుంటాడు కాబట్టి నేను అన్ని  రెస్టారెంట్లను సందర్శించాను. అతి తక్కువ సమయంలోనే నేననుకొన్న వక్తిని గుర్తించాను. మరుసటి రాత్రి ఇద్దరం కలసి ఒకే టేబుల్ మీద భోంచేయడం జరిగింది. అతను తాగిన గ్లాసును భద్రపరచమని,  అంతకుముందే వెయిటర్  కు చెప్పి ఉంచాను. ఆ విధంగా సేకరించిన గ్లాసు మీద పౌడర్ చల్లి, వేలిముద్రల ఫోటోలు తీశాను. అతని వేలిముద్రలు, సిగరెట్ కేసుపైనున్న వేలిముద్రలు సరిపోలాయి. 

“అతను అతి క్రూరమైన పథకం వేశాడు. అత్యంత దుర్మార్గంగా హత్య చేశాడు.”

వైటర్బ్ మెల్లగా పైకి లేచాడు. 

“ది గ్రేట్  డిటెక్టివ్ గారూ! మీరు చాలా తెలివైన వారు.” అని వ్యంగ్యంగా అన్నాడు. 

“నేనొకసారి బ్లాక్ డైమండ్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నాను. వింబర్లీ తాను చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించాడు. చాలా సంవత్సరాల పాటు అతని కోసం వెతికాను. అతను చర్చిలో చేరేవరకూ అతని విషయం నాకు తెలియదు. అతడెక్కడున్నాడో తెలిసిన తరువాత, అతడు శిక్షింపబడకుండా ఉండడానికి వీల్లేదు. అందుకని నేను చేయవలసింది  చేశాను. నన్ను అరెస్ట్ చేయడానికి మీకు అవకాశమిస్తాననుకొన్నారా? మీరు నన్ను ఎప్పటికీ అరెస్ట్ చేయలేరు.” అంటూ ఆ ఇద్దరూ చూస్తుండగానే, పదునైన పొడవైన కత్తి పిడిని,టేబుల్ కు చేయబడిన  రంధ్రానికి నిట్టనిలువుగా  అమర్చాడు. వారు అతన్ని అడ్డుకొనే లోపల్నే- కత్తిమొన మీద బరువుగా, బలంగా వాలిపోయాడు. 

అతను ఒక్కసారి మాత్రమే కదలగలిగాడు. అంతే.

శొంఠి జయప్రకాష్

M. Com. చదివారు. సిండికేట్ బ్యాంక్ లో క్లర్క్ గా చేరి 2012లో మేనేజర్ గా పదవీవిరమణ పొందారు. ప్రస్తుత నివాసం హిందూపురం. సాహిత్యం, సంగీత మంటే ఇష్టం. ప్రచురణ పొందిన మొదటి తెలుగు కథ కాగితపు పులి (ఆంధ్రప్రభ వీక్లీ). మొదటి అనువాద కథ పంజరం (విపుల). మూడు అనువాద కథా సంపుటాలు, ఒక్క తెలుగు కథా సంపుటం, రెండు నవలలు ప్రచురణ జరిగింది. ఒక నాటకం DTP లో ఉంది.

Previous Post

ఆంగ్ల కవిత : బందీ 

Next Post

ఇంగ్లిషు కథ : వెన్నుపోటు

Next Post
ఇంగ్లిషు కథ : వెన్నుపోటు

ఇంగ్లిషు కథ : వెన్నుపోటు

Discussion about this post

ఈ సంచికలో…

  • బెంగాలీ కవిత: కాగితపు పడవలు
  • కెనడా కవిత : My heart soars
  • ఉర్దూ కథ : లీహాఫ్ (బొంత )
  • హిందీ కథ : బోరీబందర్ ముసలమ్మ
  • తుళు కథ : నాకూరు
  • కన్నడ కథ: నడిచేవాడికి నూరు దార్లు
  • రష్యన్ కథ : దైవ సంకల్పం
  • జర్మన్ కథ : రొట్టె
  • ఇంగ్లిషు కథ : వెన్నుపోటు
  • ఇంగ్లాండ్ కథ : విషవలయం
  • ఆంగ్ల కవిత : బందీ 
  • వయసు మీద పడిన …. తరువాత… !
  • ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!
  • ఆంగ్ల కవిత: నేను  అనుక్షణం ఎగసిపడతాను!
  • ఆంగ్ల రచన : వేకువ పాఠం 
  • ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’
  • రష్యన్ కథ : శిక్ష
  • జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com